కాంగ్రెసుపార్టీలో ప్రజారాజ్యంపార్టీ విలీనం స్క్రిప్టు రచన పూర్తయింది. వచ్చే ఆదివారంనాడు విలీనం తంతును నిర్వర్తించేందుకు ఈ రెండు పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు. అంటే చిరంజీవి తన రాజకీయ పరివారంతో కలిసి ఆదివారంనాడు హస్తినాపురికి చేరుకుంటారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మదిలో ప్రారంభమయిన విలీనక్రతువు ఆలోచన ఎట్టకేలకు కాంగ్రెసు నుంచి వైఎస్ జగన్మోహనరెడ్డి తొలగటంతో సాకారమయ్యేందుకు వీలుచిక్కింది. చిరంజీవిని సోనియా ప్రతినిధి ఆంటోనీ జనవరి 31న హైదరాబాదులో కలిసి ప్రాథమిక చర్చల్ని పూర్తిచేసిన అనంతరం ఈ విలీన వ్యవహారానికి ఊపు వచ్చింది. తదుపరి చిరంజీవి నిర్వహించిన శాసనసభ్యుల సమావేశానికి హాజరయిన 17 మంది ప్రరాపా భవితవ్యానికి ఏది మంచిదని భావిస్తే ఆ నిర్ణయాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అభయం ఇవ్వటంతో చిరంజీవి పనికి సానుకూలత ఏర్పడింది. కాంగ్రెసులో ప్రరాపాను విలీనం చేసేందుకు సిద్ధమేనని సోనియాకు చిరంజీవి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కూడా పంపారు. ఆదివారంనాడు హస్తినకు వెళ్లే చిరంజీవి పరివారమంతా కలిసి సోనియాతో ఫొటో దిగటంతో విలీన వ్యవహారం పూర్తయినట్లు ప్రపంచానికి వెల్లడవనుంది. రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు, శాసనమండలి అభ్యర్థిత్వాలు, పార్టీలో నాయకత్వ స్ధానాలు ఇలా ఒక్కొక్క పనినీ వీలువెంబడి పూర్తి చేయాలని కూడా నిర్ణయమయింది.
2 ఫిబ్ర