ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు వి శ్రీనివాసరావు కుమార్తె శాంతి వివాహ కార్యక్రమంలో నేను ఉండగా ఫిబ్రవరి ఆరో తేదీన విదేశీ నంబరుతో ఫోను. నాకు ఇప్పటివరకూ విదేశం నుంచి ఫోను అంటే చైనాలో మార్క్సిజం ఆచార్యుడిగా పనిచేస్తోన్న నా మిత్రుడు కొండూరి రవీంద్ర నుంచి మాత్రమే వచ్చేది. ఆ నంబరు మూడుతో ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఫోను నంబరు నాలుగుతో ప్రారంభమయింది. దాంతో ఆసక్తిగా ఫోను తీయగా ”వెంకటసుబ్బారావేనా? అంటూ వాకబు. విదేశం నుంచి నా గురించి వాకబు చేసేది ఎవరబ్బా అనుకుంటూ ”అవును, నేనే. మీరెవరు?. ఎదురు వాకబు చేశాను. ”నేను వీరభద్రరావుని, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను” ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నాము. మా నాన్న కోటేశ్వరరావు, వీరభద్రరావు తండ్రి వెంకటరత్నం మంచి మిత్రులు. ఇద్దరూ ఉపాధ్యాయులే. ఎక్కువ కాలం మా ఊరికి కిలోమీటరు దూరంలోని దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలలో ఇద్దరూ కలిసే పనిచేశారు. మా గ్రామం ఈదుమూడి నుంచి ఇద్దరూ కలిసి సైకిళ్ల మీద పాఠశాలకు వెళ్లేవాళ్లు. మా తండ్రుల బదిలీల కారణంగా వీరభద్రరావూ, నేనూ నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ మాత్రమే కలిసి చదువుకున్నాము. అయితే స్నేహం మాత్రం ఊహ తెలుస్తోన్న దశలోనే ప్రారంభమయింది. వాడు అమెరికా వెళ్లటంతో ఎవరిదారి వారిదయింది. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాదు వచ్చినా, అనారోగ్యంగా ఉన్న తండ్రికి ఆసుపత్రిలో సేవలతోనే సరిపోవటంతో నన్ను కలవలేకపోవటాన్ని పదే పదే ప్రస్తావించి బాధపడ్డాడు భద్రం. ఇద్దరం కలిసే అవకాశాన్ని కోల్పోయినందుకు నేనూ బాధపడ్డాను. కేవలం మిత్రులను కలిసేందుకే తాను త్వరలో హైదరాబాదు వస్తానని భద్రం చెప్పటం కొంత ఊరట. తెలుగు భాష పట్ల చిన్పప్పటి నుంచీ మా ఇద్దరికీ ఆసక్తి మెండుగానే ఉండేది. దాన్ని మా వాడు గుర్తుచేశాడు. తెలుగులో 95 నుంచి 98 దాకా మాకు మార్కులు వస్తుండేవి. ”నేను ఇంజినీరును కాకపోతే, నీ మాదిరిగానే పాత్రికేయుడిగా జీవితాన్ని ఆనందంగా గడిపేవాడినిగదా! అంటూ తెలుగుపట్ల తన ఆసక్తిని వ్యక్తంచేశాడు. ఈదుమూడి పేరుతో వెదుకుతూ అనుకోకుండా నా బ్లాగు తెలుగిల్లు చూశానని తబ్బిబ్బవుతూ గుర్తుచేసుకున్నాడు. బాగుందని కితాబిచ్చాడు. ఇవండీ, ప్రస్తుతం అమెరికాలో ఐటి ఇంజినీరుగా పనిచేస్తోన్న నా చిన్ననాటి స్నేహితుడు గడ్డిపాటి వీరభద్రరావుతో ఎన్నాళ్లో తర్వాత జరిగిన ఫోను ముచ్చట్లు. ఈ ఏడాది ఏదో ఒకరోజు ఇద్దరమూ కచ్చితంగా కలుద్దామన్న వాగ్దానాలతో మా ఫోన్లకు ఆదివారం మధ్యాహ్నం వేళ తాత్కాలికంగా సెలవు ఇచ్చాము. అన్నట్లు ఇక నుంచీ వీలయినంత తరచుగా నాతో మాట్లాడాలని వీరభద్రాన్ని కోరగా వాడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అదే నాకు కొండంత సంతోషాన్నిచ్చింది.
7 ఫిబ్ర