భౌతికవాదులను ఓడించడం ద్వారా శంకరుడు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ఎనలేని హానిని కలిగించాడని ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త ప్రపుల్లచంద్ర రే విమర్శించారు. ఈ విమర్శ సరైనది. ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, రసాయనశాస్త్రం వంటి రంగాలలో ప్రాచీన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. జగత్తు మిథ్య అని, ఇదంతా నాశనమయ్యేదే అని, వాస్తవిక జ్ఞానం అసలైన జ్ఞానం కాదని, విశ్వాసమే జ్ఞానానికి ప్రాతిపదిక అని చెప్పిన అద్వైతం విజ్ఞాన పురోగతికి పెద్ద తాత్విక ఆటంకంగా వ్యవహరించింది. శంకరుడు మనువాదాన్ని పూర్తిగా సమర్థించాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఓ పక్క చెప్తూనే ఇంకోపక్క వ్యవహారిక ప్రపంచంలో వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం అవసరమని నొక్కి చెప్పాడు. మనకు ఇప్పుడు కూడా ఇటువంటి మహానుభావులు తారసిల్లుతూనే ఉంటారు.
”అంతా మట్టేనని తెలుసు; అదీ ఒక మాయేనని తెలుసు; తెలిసీ వలచీ విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు” అన్నారు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు. శంకరుని అద్వైత సిద్థాంతంలోని వైరుధ్యాన్ని ప్రేమకు అన్వయించి తన పాటలోనే ఒక చరణంలో చొప్పించా రాయన. భావవాదులు భౌతిక ప్రపంచపు వాస్తవాన్ని గుర్తించడానికి ఒప్పుకోరు. ”ఈ ప్రపంచం అంతా మాయ. పరబ్రహ్మే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ముక్తి, మోక్షం” అని ఉపనిషత్తులన్నీ చెప్పాయి. ఈ వాదన సమాజంలోని భావవాదపు మేథావులను ఎందుకూ కొరగాని వాళ్లని చేసింది. ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలకు వాళ్లను దూరం చేసింది. పర్యవసానంగా ప్రజలను భావవాద ప్రభావానికి లోబర్చి ఉంచడం పాలకవర్గాలకు ఇబ్బందికరంగా మారింది. అంతేగాక ఆనాటి సమాజాభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడింది. ఈ ప్రపంచమే మాయ అనుకున్నాక ఇక ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి పెట్టడం కుదురుతుందా? పోనీ, ఈ ప్రపంచం మాయ కాదనీ, వాస్తవమేననీ అంగీకరిస్తేనో? అప్పుడు భావవాదపు పునాదే తలకిందు లౌతుంది. దీనికి పరిష్కారంగా ముందు కొచ్చిందే అద్వైతం.
శంకరుడు పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం అని రెండు రకాల సత్యాన్ని ప్రతి పాదించాడు. ”పరబ్రహ్మ ఒక్కటే అసలైన సత్యం. ఈ జగత్తు అంతా మిథ్య” అన్నది పారమార్థిక సత్యం. ఆ పరబ్రహ్మ అంతటా ఉన్నాడు. అన్నింటా ఉన్నాడు. అంటే నీలోనూ, నాలోనూ, అందరిలోనూ ఉన్నాడు. ఈ పరమార్థాన్ని గ్రహించగలిగిన వాడికి జీవన్ముక్తి లభించినట్టే.
జగత్తు మిథ్య అయితే మనం రోజూ చూస్తున్నది, చేస్తున్నది, తెలుసుకుంటున్నది, మన చుట్టూ జరుగుతున్నది ఇదంతా ఏమిటి? ఇదంతా నిజం కాదా? అన్న సందేహం వస్తుంది. ఇదంతా వ్యవహారిక సత్యం అన్నాడు శంకరుడు. వ్యవహారిక సత్యాన్ని కలగనడంతో సరి పోల్చాడు. మనం నిద్రలో కలగన్నప్పుడు ఆ కలలో ఉన్నంతసేపూ అదంతా నిజమేన నుకుంటాం. మెలకువ వచ్చాక అదంతా వొట్టిదేనని తెలుసుకుంటాం. అదేవిధంగా ప్రపంచంలో మనం అనుభవిస్తున్నది, చూస్తు న్నది, చేస్తున్నది అంతా నిజమేనని అను కుంటున్నాం. పరమార్థం బోధపడినప్పుడు ఇదంతా మిథ్య అని తెలుస్తుంది అన్నాడు శంకరుడు.
నిద్రలో కలగన్నది వాస్తవం కాదని మెలకువ వచ్చాక తెలుస్తున్నది. ఇది అందరికీ అనుభవమే. మరి మేలుకున్నాక అనుభవి స్తున్నదంతా, జరిగినదంతా వాస్తవం కాదని ఎప్పుడు తెలుస్తుంది? దీనికి రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరణగా చెప్పాడు శంకరుడు. (రజ్ఞు – తాడు, సర్పం – పాము). మెలకువ ఉన్నప్పుడే దూరంగా ఉన్న తాడుని చూసి పాము అనుకుని పొరబడతాం. అలాగే పామును కూడా ఒక్కోసారి తాడని పొరపడవచ్చు. దాని దగ్గరకు పోయి చూస్తే అసలు అది తాడో, పామో తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని వాస్తవమని భ్రమపడుతున్నాం. సాధన ద్వారా అది వాస్తవం కాదని తెలుస్తుందని అన్నాడు శంకరుడు.
తాడుకి బదులు పాము అని పొరపడే పరిస్థితి ఎప్పుడొస్తుంది? ముందుగా ఆ మనిషికి తాడు గురించీ, పాము గురించీ తెలిసి ఉండాలి. ఆ రెండింటి మధ్య (తాడుకి, పాముకి మధ్య) కొంత పోలిక ఉండాలి. అంటే తాడు, పాము వాస్తవంగా ఉనికిలో ఉండే వాటి విషయంలోనే పొరపడే అవకాశం ఉంటుంది. అంతేతప్ప ఉనికిలో లేని వాటి విషయంలో పొరపడే అవకాశం లేదుగదా!
దీనికి జవాబుగా శంకరుడు ఎండమావిని ఉదాహరణగా చెప్పాడు. ఎండమావిలో నీళ్ళున్నట్టు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. దగ్గరకుపోతే ఉండవుగదా. ఈ ప్రపంచమూ అంతేనన్నాడు.
భౌతికవాదులు దీనినీ ప్రశ్నించారు. ఎండ మావి దగ్గరకుపోతే నీరు లేదని తెలిసిపోతుంది. అదే సముద్రంలో నీరున్నట్టు దూరంనుంచి చూస్తే అనిపిస్తుంది. దగ్గరకు పోయి చూసినా నీరుం దిగదా! దీని సంగతేమిటని నిలదీశారు.
బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తు అంతా మిథ్య అన్నది ప్రశ్నించడానికి వీల్లేదన్నాడు శంకరుడు. ఎందుకంటే మనకు కనపడేదల్లా నాశనమై పోతున్నది. నాశనమయ్యేదేదీ సత్యం కాదన్నాడు. పరమాత్మ ఒక్కటే సత్యం అయినప్పటికీ మనకి అది తెలియకపోవడానికి కారణం మనను ఆవరించుకున్న మాయ/మిథ్య అన్నాడు. దీనిని అంగీకరించడం ఎలా? అంటే ఉపనిషత్తులలో అలా చెప్పారు గనక ఒప్పుకుని తీరాలన్నాడు. వేదాలు, ఉపనిషత్తులలో చెప్పిన దానిని విశ్వసించాల్సిందే తప్ప ప్రశ్నించడానికి, సందే హించడానికి వీలులేదన్నాడు.
ఒక అడవిలో ఆశ్రమం బైట చెట్టుకింద శిష్యులకు గురువు అద్వైత సిద్థాంతంలోని మిథ్య గురించి వివరిస్తున్నాడు. ”ఈ అడవి మనచుట్టూ ఉన్నట్టు కనపడుతుంది. కాని అది నశించిపోతుంది. అంచేత అది మిథ్య. ఈ శరీరం కూడా నశిస్తుంది కనక అదీ మిథ్యే…ఈ చెట్టు.. ఆ చెట్టుకున్న కాయలు, పువ్వులు, అంతా మిథ్యే” ఇలా చెప్తూ ఉంటే అక్కడికో అడవి ఏనుగు ఘీంకరిస్తూ వచ్చింది. శిష్యులంతా తలో చెట్టుచాటుకీ పరుగెత్తారు. ఒక శిష్యుడు చెట్టుచాటు నుంచి చూసేసరికి గురువుగారు కూడా పరుగెత్తి ఓ చెట్టు వెనక్కి చేరడం కనపడింది. ”దొరికారు గురువుగారు” అనుకున్నాడు ఆ శిష్యుడు. ఏనుగు వెళ్లిపోయాక మళ్ళీ అంతా చెట్టు కింద చేరారు. మళ్ళీ గురువుగారు అద్వైతసారం చెప్పడం మొదలుబెట్టారు. అప్పుడీ శిష్యుడు ”గురువు గారూ, అంతా మిథ్యే అయినప్పుడు ఇందాక వచ్చిన ఏనుగు కూడా మిథ్యే కదా!” అనడిడాడు. గురువుగారు ”అవును నాయనా! బాగా అర్థ మైందినీకు” అన్నాడు. ”మరి అలాంటప్పుడు మీరు ఎందుకు చెట్టుచాటుకి పరిగెత్తారు?” అని శిష్యుడు అడిగాడు. ”నేను పరిగెత్తడం కూడా మిథ్యే నాయనా” అని గురువుగారు బదులిచ్చాడు. గజం మిథ్య – పలాయనం మిథ్య అనే సామెత అద్వైతం నుంచే వచ్చింది.
ఈ మిథ్యనే వ్యవహారిక సత్యం అని శంకరుడు అన్నాడు. పరబ్రహ్మే సత్యం అన్న పారమార్థిక సత్యం బోధపడే వరకూ వ్యవహారిక సత్యానికి లోబడే వ్యవహరించాలన్నాడు. తాను బోధించింది భావవాదం అయినా, ఆచరణలో ప్రపంచం వాస్తవమని భావించి నడుచుకోవాలని శంకరుడు వాదించాడు. ఆ విధంగా పాలక వర్గాలకు ఆనాడున్న తాత్విక సమస్యకు పరిష్కారం చూపించాడు.
శంకరునికి గల అపారమైన వాదనా పటిమ, తర్కం ఆనాటి ఇతర సమకాలీన తాత్విక సిద్థాంతాలను వెనక్కునెట్టడానికి ఉపయోగ పడ్డాయి. ఇటు యజ్ఞయాగాల కర్మకాండలకు అతిగా ప్రాధాన్యతనిచ్చి పరమాత్మ భావనను పట్టించుకోని పూర్వమీమాంసకులనూ, అటు ఉపనిషత్తులలోని పరమాత్మ భావాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాత్రమే చర్చిస్తూ వాస్తవ ప్రపంచాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టిన వేదాంతులనూ శంకరుడు తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఆనాటి ప్రజాసా మాన్యం కాపాలిక మతం, శాక్తేయ మతం వంటి జంతుబలులు, నరబలులు, శవపూజలు వంటి క్రూర మతాచారాలను పాటిస్తూ ఉండేవి. ఇంకోవైపు శైవ, వైష్ణవ మతాల మధ్య విద్వేషాలు పెరిగి రాజ్యాల మధ్య యుద్ధాలకు కూడా దారితీశాయి. శంకరుడు ఈ క్రూర మతాచా రాలను ఖండించడమేగాక వాటిని నిర్మూ లించడానికి కొందరు రాజుల సైనిక బలాన్ని సైతం వినియోగించుకున్నాడు. సంకుచిత విభేదాలను అధిగమించడానికి శంకరుని జ్ఞానమార్గం తోడ్పడింది.
”అత్యున్నతమైన కవితా దృష్టికి, మత దృష్టికి శంకరుని అద్వైతం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ దశలో మానవుడు హేతువాదాన్ని కొంచెం పక్కకునెట్టి ఆత్మజ్ఞానం వైపు మొగ్గుచూపుదామా అని అనుకుంటాడు” అని రాధాకృష్ణన్ అన్నారు.
నాశనమయేదేదీ వాస్తవం కాదు అని శంకరుడు చెప్పినది తప్పు. ”అద్వైత భావవాదం: ఒక విమర్శ” అన్న వ్యాసంలో (చూడండి.. సందేశం- మార్కిస్టు సిద్థాంత రాజకీయ మానసపత్రిక, మార్చి 1958) శ్రీ ఏటుకూరి బలరామ్మూర్తి ఇలా పేర్కొన్నారు: ”మార్పు, కదలిక, నాశం కలిగిన వస్తువు అవాస్తవికం అనే శంకరుని ప్రాథమిక ప్రతిపాదనే పొరపాటు. ఏమంటే ఇంద్రియగోచరమైన ప్రతి వస్తువు కదులుతున్నది, మార్పు చెందుతున్నది, నశిస్తు న్నది, రూపాంతరం చెందుతున్నది. ప్రగతి శీలమైన, ప్రవాహ సదృశమైన ఈ బాహ్య ప్రపంచాన్నంతా వాస్తవమని, శంకరునికి పూర్వమున్న బౌద్ధ, జైన, సాంఖ్య, వైశేషికాది ధోరణులన్నీ అంగీకరించాయి. శంకరుడు తనకంటే ప్రాచీనమైన ధోరణులలోని వాస్తవి కతను విసర్జించాడు.”
ఏదిఏమైనా శంకరుని అద్వైతం ఆనాటి భారతీయ సమాజంలో తాత్విక పురోగతికీ, సామాజిక సంస్కరణలకూ తోడ్పడిందనడంలో సందేహం లేదు.
అద్వైతం భారతీయ భావవాదాన్ని చాలా ఉచ్ఛస్థితికి తీసుకుపోయింది. శంకరుడు క్రీ.శ. 788 సంవంత్సరాల్లో కేరళలోని కాలడి గ్రామం లో జన్మించాడు. అతను జీవించినది కేవలం 32 సంవత్సరాలే. కాని అతని కృషి అనన్య సామాన్యం. తన గురువైన గోవిందునికి గురువు గౌడపాదుడు అద్వైతసిద్థాంతాన్ని ప్రతిపా దించాడు. దానిని అధ్యయనం చేసిన శంకరుడు మరింతగా అద్వైతాన్ని పరిపుష్టం చేశాడు. వేదాంత సూత్రాలను బ్రహ్మసూత్రాలని కూడా పిలుస్తారు. ఆ సూత్రాలను రచించింది బాదరాయణుడు. ఇవి మామూలుగా అర్థం కావు. మనం ఎవరి చుట్టరికాల గురించైనా చెప్పినపుడు (నా పెత్తల్లి వేలు విడిచిన మేన మామ రెండో అల్లుడి చెల్లెలి మరిది కూతురు…. లాంటివి) అర్థం కాకపోతే బాదరాయణ సంబంధం అనడం పరిపాటి. అంటే ఏదో చుట్టరికం ఉందిగాని అదేమిటో అర్థం కాలేదన్నమాట. అలాంటి బ్రహ్మసూత్రాలకూ శంకరుడు భాష్యం రాశాడు. అంతేగాక భగవద్గీతకూ, ముఖ్యమైన పదకొండు ఉపనిషత్తులకూ భాష్యాలు రాశాడు. ఉపదేశ సహస్రి, వివేక చూడామణి, దక్షిణామూర్తి స్తోత్రం, హరిమిదె స్తోత్రం, ఆనందలహరి, సౌందర్య లహరి వంటి రచనలతో తన సిద్థాంతాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకుపోయే ప్రయత్నం చేశాడు.
”శంకరుని జీవితం పరిశీలిస్తే చాలా బలమైన పరస్పర విరుద్ధాంశాలతో ఉన్నట్టు కనపడుతుంది. అతడొక తత్వవేత్త, కవి, వైజ్ఞానికుడు, సన్యాసి, మార్మికుడు, సంస్కరణ కర్త. అతడెంత వైవిధ్యమైన ప్రజ్ఞావంతుడో అతని బహుముఖ స్వభావమే తెలియచేస్తుంది. మేథో సంపన్నుడై లక్ష్యసాధకుడిగా యువకుడిగా ఉన్నప్పుడే వాదనాపటిమను ప్రదర్శించి ఒకేసారి అనేక రకాల చర్చలను నిర్వహించగలిగిన ప్రతిభాశాలి. వివిధ రకాలుగా చీలిపోయిన ప్రజలను ఐక్యం చేయగలిగిన అతడి రాజకీయ పరిణతిని కొందరు ప్రధానాంశంగా భావిస్తారు. పదునైన వాదనలతో జీవితంలోని వైరుధ్యాలనూ, ఆలోచనలలోని వైరుధ్యాలనూ వివరించే శాంతమూర్తి అయిన తత్వవేత్తగా వర్ణిస్తారు. మనకే తెలియని మన గొప్పదనం గురించి వివరించే మార్మికుడుగా మరికొందరంటారు. అతనికన్నా విశ్వాన్ని దర్శించగలిగిన మేథోవం తులు బహుకొద్దిమందే ఉన్నారన్నది సత్యం” – డా. రాధాకృష్ణన్.
భౌతికవాదులను ఓడించడం ద్వారా శంకరుడు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి ఎనలేని హానిని కలిగించాడని ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త ప్రపుల్లచంద్ర రే విమర్శించారు. ఈ విమర్శ సరైనది. ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, రసాయనశాస్త్రం వంటి రంగాలలో ప్రాచీన భారతదేశం ప్రపంచంలోనే అగ్ర గామిగా ఉండేది. జగత్తు మిథ్య అని, ఇదంతా నాశనమయ్యేదే అని, వాస్తవిక జ్ఞానం అసలైన జ్ఞానం కాదని, విశ్వాసమే జ్ఞానానికి ప్రాతిపదిక అని చెప్పిన అద్వైతం విజ్ఞాన పురోగతికి పెద్ద తాత్విక ఆటంకంగా వ్యవహరించింది. శంక రుడు మనువాదాన్ని పూర్తిగా సమర్థించాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఓ పక్క చెప్తూనే ఇంకోపక్క వ్యవహారిక ప్రపంచంలో వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం అవసరమని నొక్కి చెప్పాడు. మనకు ఇప్పుడు కూడా ఇటువంటి మహానుభావులు తారసిల్లుతూనే ఉంటారు. ”నా వరకు అయితే ఏ కులమూ లేదు, గిలమూ లేదు, మనుషులంతా ఒక్కటేగాని ఆచారాలనూ, పద్ధతులనూ గౌరవించాలి గదా” అనేవాళ్ళు కోకొల్లలు.
శంకరుడు తాత్వికవేత్తగానే గాక నిర్మాణ దక్షుడిగా కూడా ప్రసిద్ధుడు. చిన్న వయస్సులోనే దేశమంతటా పర్యటించి ఉద్దండులందర్ని వాదనా పటిమతో ఓడించి అద్వైతాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఉత్తరాన బదరీనాథ్, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరీ, దక్షిణాన శృంగేరి పీఠాలను స్థాపించాడు. నేటికీ ఈ పీఠాల అధిపతులను శంకరాచార్యులనే పిలుస్తారు. వీరు ఇచ్చే ఆదేశాలను వర్తమాన ప్రపంచంలోని ప్రభుత్వాలు సైతం అమితంగా గౌరవిస్తాయి. పాలకవర్గాలకు అద్వైతం ఎంత ప్రీతిపాత్రమైనదో దీనినిబట్టే అర్థం అవుతుంది.
ఇంత విశేషమైన కృషిని శంకరుడు కేవలం తన 32 సంవత్సరాల జీవితంలోనే చేయగలి గాడన్నది గమనార్హం.
అద్వైతం యొక్క అభ్యుదయకరమైన పాత్రను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవ లసిందే. కానీ, మొత్తంగా అద్వైతం గురించి ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం నేడున్నది.
శంకరుని గురించి మార్క్సిస్టు మేధావి ఇఎంఎస్ నంబూద్రిపాద్ ఇలా చెప్పారు:
”శంకరుని విజయం, అతని తాత్విక సిద్థాం తపు విజయం అంటే బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాలు ఆనాడు తక్కిన భారతీయ సమా జంపై సాధించిన విజయంగా అర్థం చేసు కోవాలి.
కనుక శంకరుని తాత్విక సిద్థాంతం ప్రస్తుత భారతదేశానికిగానీ, ప్రపంచానికిగానీ వర్తించే సిద్థాంతంగా… సవ్యంగా ఆలోచించగలిగే ఏ వ్యక్తీ అంగీకరించలేడు. పెనుమార్పులతో శరవే గంగా ప్రపంచం ముందుకుపోతున్న నేటి కాలంలో మానవజాతి ముఖ్యంగా మనదేశం ఆ వేగాన్ని అందుకోవాలంటే భావవాదపు సిద్థాంతాలను, అద్వైతంతోసహా తీవ్రంగా ఎదిరించి, ఓడించాలి. హిందూ పునరుద్ధరణ వాదాన్ని వేద, పురాణాల తాత్విక భావజాలాన్ని ఎదిరించి ఒక ప్రజాతంత్ర లౌకిక, నవీన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు సాగిస్తున్న పోరాటంలో ఇదొక విడదీయలేని భాగం”
ఎం.వి.ఎస్. శర్మ