నవ్వి పోదురుగాక, నాకేటి సిగ్గు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరి మోసపోయిన తెలుగు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించేందుకు వేగంగా స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కాక, తగుదునమ్మా అంటూ రాష్ట్రంలో ఉచితంగా స్థలాలు ఇస్తాం, నీళ్తిస్తాం, విద్యుత్తు ఇస్తాం, పన్నులు లేకుండా చేసేస్తాం ఇలా ఒకటేమిటి అవసరమయిన, అవసరం లేని వసతులన్నీ కల్పిస్తాం రమ్మంటూ అమెరికా విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత సత్కారాలు పలుకుతోంది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో మొత్తం 1,555 మంది విద్యార్థులుండగా, అందులో 95 శాతం మంది భారతీయులు కాగా, అందులో 60 శాతం మంది తెలుగువాళ్లేనట. ట్రైవ్యాలీ సంగతి అటుంచి రాష్ట్రంలో కాలిఫోర్నియాకు చెందిన పెప్పర్‌డైన్ విశ్వవిద్యాలయ విభాగాన్ని నల్గండ-వరంగల్ రోడ్డులో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే ప్రభుత్వ ప్రకటన తొందరపాటు చర్య అని ఆ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఆండ్రూ కె బెంటన్ ఖండించారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఇప్పటివరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు. పెప్పర్‌డైన్, భారత్ మధ్య చర్చలు మొదటి దశలోనే ఉన్నాయని బెంటన్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్లు సమాచార, సాంకేతికశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో ప్రకటించారు. విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్‌రెడ్డితో సమావేశమైన నేపథ్యంలో ఫిబ్రవరి రెండో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రూ. 1000 కోట్ల పెట్టుబడి, మూడు వేల మంది విద్యార్థులతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్లు సిఎంఒ నుంచి వెలువడిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో ూన్న 20 విశ్వవిద్యాలయాల్లో పెప్పర్‌డైన్ ఒకటని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. తాము 22 కోట్ల డాలర్లను పెట్టబడి పెట్టనున్నట్లు వచ్చిన వార్తలు కూడా వాస్తవం కాదని ఆ విశ్వవిద్యాలయ నిర్వాహకులు తెలిపారు.
14 ఫిబ్ర