అతడు ఒకనాటి ఉగండా నియంత ఇడీ అమీన్‌కు ఏమాత్రం తీసిపోడు. అతడు ఒకనాటి చిలీ నియంత పోల్‌పాట్‌కు ఫొటోస్టాట్. అతడు ముస్సోలినీకి మారు రూపం. అతడు హిట్లర్ సంతతి. అతడే నర రక్తం రుచి మరిగిన కేవీపీ రామచంద్రరావు. 14 ఏళ్లపాటు ఎంబీబీఎస్ చదివిన ఈ ఆంధ్ర ఇడీ అమీన్‌కు నరుడి నెత్తురు రుచి బాగా ఎరుకే. వైఎస్‌కు తాను ఆత్మనని తనకు తాను చెప్పకనే చెప్పుకునే కేవీపీ షాడో గృహమంత్రిగా పాలన సాగిస్తో మనుజుల రక్తాన్ని తరచూ జుర్రుకోవటం సాధారణమయింది. ఖమ్మం జిల్లా ముదిగొండలో, తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన సాంఘీక సంక్షేమ విద్యార్థుల పోరాటంలో, అటు తర్వాత పోలవరం వద్దన్న గిరిజనుల రక్తాన్ని భద్రాచలంలో, నిన్నగాక మొన్న సోంపేటలో రక్తం రుచి చూశాడు కెవీపీ.
తాజాగా సోమవారంనాడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రలో కేవీపీ బినామీ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి వ్యతిరేకంగా ూద్యమిస్తోన్న ముగ్గురు మత్స్యకారులను పోలీసులు పొట్టనబెట్టుకుని తమ నేతకు సంతృప్తి కలిగించారు. ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, ఏ ఊరో ఇంకా ప్రకటించని గణేష్, బీరపువానిపేట నివాసి ఎర్రయ్య రక్తం ఏరులైపారింది. ఆకాశలక్కవరం గ్రామానికే చెందిన రాజు గాయాలపాలయి సాయంత్రం ఆరు గంటల సమయంలోనూ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తమకు ఇంత బువ్వ పెడుతోన్న భూములను లాక్కోవటాన్ని సహించలేని మత్స్యకార రైతులు గత రెండు వందల రోజులుగా గాంధీ పథాన నిరసన తెలపటమే వారు చేసిన ఘోర నేరం. కేవీపీ బినామీ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణాన్ని కాకరపల్లి, హనుమంతరాయపేట, ఆకాశలక్కవరం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. కర్మాగార పనులు జరగకుండా రహదారులను దిగ్బంధిస్తున్నారు. దీంతో థర్మల్ కేంద్ర నిర్మాణంలో వినియోగించాల్సిన యంత్రాలు విదేశాల నుంచి దిగుమతి అయినా ప్రతిపాదిత స్థలంలోకి చేరవేసేందుకు కేవీపీ అండ్ కంపెనీ వల్లకాలేదు. దీంతో పైకి కన్పించే నిర్మలమైన ముఖం స్థానే కేవీపీ అసలు రూపం నిద్ర లేచింది. రెండు వేల మంది పోలీసులను అక్కడకు తరలించేలా ఆయన తెరవెను కథ నడిపాడు. గత శనివారంనాడే తొలివిడతగా ప్రజలపై యుద్ధానికి తెరలేపారు. లాఠీలు ఝళిపించి వీపులు పగలగొట్టారు. ఆ తర్వాతా ఇంటికి పది మంది అన్నట్లుగా పోలీసులు తమదైన శైలిలో కాపలా మొదలు పెట్టారు. మత్స్యకారులు బహిర్భూమికి వెళ్లేందుకు లేదు. తడికల దొడ్లో స్నానాలు చేసే అవకాశం లేదు. కదిలే అవకాశం లేదు. మెదిలే అవకాశం లేదు. ఇంకొకరి పెత్తనాన్ని సహజంగానే సహించలేని స్వేచ్ఛాజీవులయిన మత్స్యకారుల ఓపికను 50 మంది డిఎస్పీలు, 100 మంది సిఐలు, 200 మంది ఎస్సైలు, మరొక పదిహేడు వందలమంది పోలీసులు నిట్టనిలువునా కాజేశారు. పిల్లినయినా గదిలో బంధిస్తే … ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వడ్డితాండ్రలోనూ అదే జరిగింది. తాము బహిర్భూమికి పోయేందుకూ, తమ మహిళలు దొడ్లలో సాన్నాలు చేసేందుకూ స్వేచ్ఛ కావాలంటూ పోలీసులను మత్స్యకారులు అభ్యర్థించారు. అంతే… నిరక్షరకుక్షులు, మడ్డోళ్లు, కంపు మనుషులు తమను ప్రశ్నించటమా? అంటూ దొరవారి విశ్వాసపాత్రులకు సహజంగానే కోపం నషాళానికంటింది. వాళ్లు చెబుతున్నట్లు రబ్బరు తూటాలో, ఉక్కు తూటాలో తెలియదుగానీ చేపల కంపు మనుషుల శరీరాలను తుత్తునియలు చేశాయి. వాళ్లలో ముగ్గురు అక్కడికక్కడే వాలిపోయారు. వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పొగబాంబుల తాకిడికి పూరిళ్ళు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. 150 ఇళ్ళు అంటుకున్నాయి. బాధితుల ఆక్రందనలు, పోలీసుల బూట్ల చప్పుడు, ఆందోళనకారుల పరుగులతో వడ్డితాండ్ర వణికిoది. ఈ ఘటనలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. శభాష్ అంటూ ప్రపంచబ్యాంకు నుంచి మన ఘనత వహించిన ప్రభుత్వాధినేతలకు ఫోను వచ్చే ఉoడవచ్చు. పనామా కాలువను ప్రైవేటీకరించేందుకు ఒప్పుకోని ఆ దేశ అధ్యక్షుడి విమానాన్ని కూల్చి వేసిన ప్రపంచబ్యాంకు నిర్వాహకుడు అమెరికా పెట్టుబడికి శ్రీకాకుళంలో పారిన రక్తం ఒక లెక్కలోది కాదంటే దాని అసలైన భయంకర రూపం ఎంతటితో తెలియాలంటే చరిత్ర, తాజా తాజా సంఘటనల లోతుపాతుల్లోకి వెళ్లాల్సిందే.