Archive for మార్చి, 2011

మళ్లీ నిరుద్యోగ లోకంలోకి….

అవును, నేను మరోమారు నిరుద్యోగ లోకంలోకి దూకాను. 2011 మార్చి 15న నేను పనిచేస్తోన్న సంస్థతో బంధుత్వం తెంచుకున్నాను. ఆ సంస్థలో 2010 సెప్టెంబరులో రెండోమారు చేరాను. మొదటిసారి 2001 ఫిబ్రవరిలో ఒంగోలు కేంద్రంలో చేరిన నేను దాదాపు ఎనిమిదన్నరేళ్లపాటు అందులో పనిచేశాను. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌లో సేవలమ్ముకున్నాను. ఆ సంస్థలో కొందరి సహచరుల పని విధానం నచ్చక బయటపడ్డాను. అనంతరం ఆంధ్రజ్యోతిలో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా ఆరు నెలలపాటు పనిచేశాను. మా టీవీలో న్యూస్‌ కో-ఆర్డినేటర్‌గా అవకాశం వచ్చింది. ఓ ఏడాది గడిచిందో లేదో మళ్లీ నాకు బతుకు గండం ఏర్పడింది. మాటీవీ యాజమాన్య భాగస్వామి చిరంజీవి రాజకీయాల్లో చేరటంతో వార్తా విభాగానికి చావొచ్చిపడింది. అందులో భాగస్వాములయిన అక్కినేని నాగార్జున, మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌కు కాంగ్రెసుపార్టీతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా చిరంజీవికి అనుకూల వార్తల్ని ప్రసారం చేయటం వారికి ఇబ్బందిగా మారింది. దీంతో వార్తల విభాగం గొంతు నొక్కేసి ఉద్యోగుల్ని వీధులపాలు చేశారు. అలా సరళీకృత విధానాలకు నేను కూడా బలయ్యాను. ప్రజారాజ్యం పాడుగానూ అంటూ ఆనాడు సిబ్బంది పెట్టిన శాపాలు రెండేళ్లకు ప్రాణం పోసుకున్నట్లుంది. చావు పేగు మెడలో వేసుకుని పుట్టిన ప్రజారాజ్యం తనకు తానే ఉరేసుకుని ఉసురు తీసుకుంది. తర్వాత కొంతకాలం యథావిథిగా నిరుద్యోగం. కొందరు మిత్రుల ప్రభావంతో రెండోమారు నా మాతృ సంస్థ అనదగిన ఆ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేరాను. వాస్తవానికి పూలమ్మిన చోటే కట్టెలమ్మేందుకు సిద్ధపడ్డాను. అది నా గొప్పతనమూ కాదు, చేతగాని తనం అంతకన్నా కాదు. మార్క్సిజం నాపై చూపించిన ప్రభావంరీత్యా మనస్సును అదుపులో పెట్టుకున్నాను. మా టీవీలో నేను తీసుకున్న జీతంలో మూడో వంతు తీసుకుంటూ పనిచేశాను. అదే సంస్థలో మొఫిసిల్‌ డెస్క్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన నేను అదే విభాగంలో సాధారణ ఉప సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. అయితే సంతృప్తిగా పనిచేయని మాట వాస్తవం. కారణాలు మాత్రం జీతమూ కాదు, బాధ్యతలూ కాదు. ఏ పనిచేసినా, ఎక్కడ చేసినా ప్రథమ స్థానంలో ఉండాలనేది నా విధానం. మేమిచ్చిన పనేదో చేసిపోతే చాలు అన్న రీతిన నా పనిపై ఆంక్షలు విధించిన ఫలితంగా ఏర్పడిన అసంతృప్తి అది. అక్కడ కేవలం ఇతరుల ఆదేశాలను పాటించటమే నా పని. ఆదేశాలు అంటే ఏదో నా కన్నా మెరుగ్గా పని చేయగలిగినవాళ్లో, బాధ్యతలరీత్యానన్నా ఉన్నతులో ఇస్తే అమలు చేసేవాడినేమోగానీ, దారినబోయే దానయ్యల పెత్తనాన్ని సహించలేకపోయాను. నా కన్నా సబ్‌ జూనియర్లు, పొట్టగోస్తే అక్షరం ముక్కరాని ఉప సంపాతకులు, అర్ధవంతంగా ఒక్క వాక్యాన్ని రాయలేని కలం వీరుల వికటాట్టహాసాలను చెవిలో వేసుకోవటం కనాకష్టమయింది. దీనికితోడు నన్ను పనిదొంగగా చిత్రించేందుకు ప్రయత్నం ప్రారంభమయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాయటం సాధ్యం కాదు. రాయటమూ అనవసరమే. అయితే నేను పనిచేసే విభాగం బాధ్యుడు నాతో మాట్లాడిన తీరును బ్లాగ్మిత్రులకు వివరించటం అవసరమని అనుకుంటున్నాను. దయచేససి ఇక్కడ మారుపేర్లు రాసేందుకు అనుమతివ్వండి.
రాజ్‌కుమార్‌ : నా సెలవు రోజయిన శుక్రవారం రాత్రి 9 గంటలకు ఫోను చేశారు.
నేను : చెప్పండి!
రాకు : ఫలానా జిల్లా నుంచి ఫలానా ఫలానా స్పెషల్‌ స్టోరీలు రెండు వచ్చాయటగదా?
నేను : ఒక్కటి మాత్రమే నాకు తెలుసు. అది అసమగ్రంగా ఉన్నందున వెనక్కి పంపాను. ఏమేమి అదనపు సమాచారం కావాలో వాళ్లకు వివరించాను సార్‌. రెండో స్టోరీ విషయం నాకు తెలియదు.
రాకు : మీరడిగిన సమాచారాన్ని అరగంటలోనే వాళ్లు పంపారట. దాన్ని జయారెడ్డి మీ ఫోల్డర్‌లో వేసి మీకు చెప్పారట కదా?
నేను : లేదండీ, ఇప్పటివరకూ నాకా విషయం తెలియదు.
రాకు : లేదండీ, మీకు చెప్పారట.
నేను : సార్‌, ఇద్దరే ఉన్నచోట వాళ్లు మాట్లాడుకున్నారో? లేదో? మాట్లాడుకున్నా ఏమి మాట్లాడుకున్నారో? సాక్ష్యం ఎక్కడ దొరుకుతుందండీ?
రాకు : లేదు, లేదండీ, సుబ్బారావుగారూ! ఆయన చెప్పకుండా, చెప్పానని చెప్పడండీ.
నేను : సరేనండీ, అతనిపట్ల మీకు అంత నమ్మకం ఉంటే, ఉండనీయండి. కానీ నేను ఈ సంస్థకు పనికొస్తానో? లేదో? తేల్చి చెబితే నాకు మంచిది.
రాకు : అంతెందుకు లెండి. రేపు సమావేశం వేసుకుని చర్చించుకుందాం.
ఇదీ మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ. నాకు అర్ధం అయినదాన్నిబట్టి పని ఉన్నా , నేను కావాలనే చేయకుండా తప్పుకు తిరుగుతున్నానని ఆయన ఆరోపిస్తున్నట్లు భావించాను. రెండోది సమావేశాలతో ఏదీ తేలదని నా పూర్వ అనుభవం. కాకపోతే అలాంటి సమావేశాల్లో చేయని తప్పును నాతో ఒప్పించే పని జరగవచ్చు. అందువలన అన్నింటికీ తలొంచి అక్కడ పనిచేయటమా? తలొంచికుని బయటకు నడవటమా? అన్న రెండు అవకాశాలే నాకు కన్పించాయి. తలొంచి బతకటం నేను నేర్చుకోని ఓ మంచి పని. ఇక మిగిలిన పని తలొంచుకుని బద్దెనను గుర్తుచేసుకోవటమే. అన్నట్లు సుమతీ శతకకారుడు బద్దెన, మిడిమేలపు కొలువుగొలిచేకన్నా మడి దున్నుకు బతకవచ్చు మహిలో సుమతి అన్నాడు కదా.
మడి దున్నగలనో? లేదోగానీ ముందు కొలువును వీడి రాజధానిలో వీధినపడ్డాను.

రెచ్చగొట్టబడిన జనం లక్ష్యం లేకుండా విడిచిన బాణం ఒకటే


రెచ్చగొట్టబడిన జనానికి ఇంగిత జ్ఞానం తక్కువ. అలాంటి వాళ్లు లక్ష్యం లేకుండా విడిచిన బాణాల్లాంటివాళ్లు. ఎదుటివాళ్లను చంపమంటూ రెచ్చిగొట్టినవాళ్లు కూడా వారి చేతుల్లో చచ్చే ప్రమాదం ఉంది. అంతటి ప్రమాదాన్ని రాష్ట్రంలో కాంగ్రెసు పెంచి పోషిస్తోంది. పాలకులుగా తమ తప్పిదాలు ప్రజలు గుర్తించకుండా వారిని దారి తప్పించటం కాంగ్రెసుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మాటకొస్తే పాలకుల లక్షణాల్లో అదొకటనుకోండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కారణమయిన కాంగ్రెసు, అసలు కారణాలను ప్రజలు గుర్తించకుండా వాళ్లూ అందులో భాగస్వాములవుతున్నట్లు నటించటం కాంగ్రెసు నీతి – రీతి. మిలియన్‌ మార్చ్‌ పేరిట తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గురువారం (10 మార్చి 2011) హైదరాబాదులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఇదే తీరు వెల్లడయింది. రెచ్చిపోయిన జనం తొలుత కాంగ్రెసు నాయకులకు ఘనంగా సన్మానించారు. తర్వాత సహజంగానే దారి తప్పి వ్యవహరించారు. కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, పింగళి వెంకయ్య, శ్రీకృష్ణదేవరాయలు, త్రిపురనేని రామస్వామి చౌదరి, మొల్ల, ఎర్రాప్రెగ్గడ, అన్నమయ్యలకు కూడా ప్రాంతీయం అంటగట్టి ట్యాంక్‌బండ్‌ మీదున్న వారి విగ్రహాల ధ్వంసానికి పూనుకున్నారు. అంతటితో పోనీయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సంస్థల యాజమానులు కోస్తావాసులంటూ ఆ సంస్థలకు చెందిన ఓబీ వ్యాన్లను తగలబెట్టారు. విలేకరుల కెమెరాలను ధ్వంసం చేశారు. ఆంధ్రబ్యాంకు ఏటీఎంపై కూడా దాడి చేశారు. తర్వాత సహజంగానే పోలీసులతోనూ తలపడ్డారు. ఇదంతా అనుకోకుండా రెచ్చిపోయిన యువకుల కార్యకలాపాలు కావు. రోజుల తరబడీ రెచ్చగొట్టబడినవారి సహజమయిన చేష్టలు. విగ్రహాల ధ్వంస రచననూ, మీడియాపై దాడినీ వ్యతిరేకించేవారు చేయవలసింది ఆ పనులు చేసిన వారిని కాదు. ఆ పని చేయించేందుకు పురిగొల్పిన అంశాలు ఏమిటని ఎంచి చూడాలి. పురిగొల్పిన వారిని వెలికితీసి వారి రీతినీ, నీతినీ ప్రజల ముందుంచాలి. దీనికి మీడియానే ప్రధానంగా పూనుకోవాలి. ఈ వ్యవహారం ఒక్కసారితోనో, ఒకరోజులోనో పూర్తయ్యేది కాదు. సుదీర్ఘంగా సాగించవలసిన కార్యక్రమం.

పండ్లు, కూరగాయల్లో దండిగా పురుగు మందుల వ్యర్థాలు

ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన పండ్లు, కూరగాయలు ఇప్పుడు భిన్నమైన బహూమతుల్ని మనకు అందజేస్తున్నాయి. కూరగాయలు, పండ్లలో కాలేయాన్ని కాటేసే విషాలు ూన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కేన్సర్‌, గుండె జబ్బులు కలిగించే విషపూరిత రసాయనాలు దండిగా ఉన్నట్లు వెల్లడయింది. దేశ రాజధాని ఢిల్లీలో అమ్ముడవుతోన్న కూరగాయల్లో ఎలుకల్ని చంపేందుకు వినియోగించే విషం సహా, నాలుగురకాల నిషేధిత విష వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో లాభాల కోసం ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే వ్యాపారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషపదార్థాల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు తేల్చారు. తలనొప్పి, నలత, ఆహారం అరగని సమస్య, సంతాన లేమి తదితర రుగ్మతలు కూడా సోకుతున్నాయట. పొలాల్లో ఉండగా అటు రైతులూ, కోత అనంతరం వ్యాపారులు పంట త్వరగా రావడానికీ, ఫలదీకరణకూ, రంగు కోసం ఉపయోగించే క్రిమిసంహారకాలు, విషపూరిత రంగులు ఇలా మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి కూడా ఈ వ్యర్థాలు కారణమవుతున్నాయని కూడా గుర్తించారు. అదనపు సాలిసిటర్‌ జనరల్‌ ఎఎస్‌ చందోక్‌ నేతృత్వంలో ఆరుగురు న్యాయవాదులు, ఇద్దరు ఎన్‌జిఓ ప్రతినిధులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసిన కోర్టు రానున్న ఐదు వారాల్లో వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. దేశంలో పండ్లు, కూరగాయల్లో యూరోపియన్‌ ప్రమాణాలకంటే 750 రెట్లు అధికంగా క్రిమిసంహారక మందులు, విషపూరిత రసాయనాలు ఉంటున్నాయని ఢిల్లీకి చెందిన ఎన్‌జిఓ సంస్థ ‘వినియోగదారుల గొంతుక’ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన పరిశీలనలో వెల్లడయింది.

కెకె, యాష్కీలకు ప్రజా సన్మానం


తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 10 మార్చి 2011 తేదీన నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమానికి తగుదునమ్మా అంటూ హాజరయిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, లోక్‌సభ నిజామాబాద్‌ సభ్యుడు మధుయాష్కీకి యువకులు తగిన శాస్తి చేశారు. ఏనుగు అంబారీమీద ఊరేగే రాజు లెక్కన తన కారెక్కి చేతులూపుకుంటూ ట్యాంకు బండకు వస్తోన్న కెకెపై తెలంగాణవాదులు దాడి చేశారు. చెప్పులు, నీళ్ల సీసాలను విసిరి నిరసన తెలిపారు. వెనక్కు పోవాలంటూ నినదిస్తున్నా అంబారీ దిగపోగా, చేతులతో విన్యాసాలు చేయటం తట్టుకోలేనికొందరు యువకులు కెకె వాహనాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. అంతకంతకూ పెరుగుతోన్న నిరసనకారులనూ, వారి దాడికీ తట్టుకోలేక తొలుత చల్లగా వాహనం లోపలకు జారుకున్న కెకె అక్కడ నుంచి పలాయనం చిత్తగించాడు. బతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. తెలంగాణ మంటల్లో చలిగాచుకుంటున్న మధుయాష్కీకి కూడా తెలంగాణవాదులు తగిన బుద్ధి చెప్పారు. ఆయనను పిడిగుద్దులతో సత్కరించారు. కోపం పట్టలేక కొందరు మీదపడి బట్టలు చించివేశారు. వెంటబడి తరిమారు. ఆ సమయంలో పోలీసులు తమ రక్షక్‌ వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. తెలంగాణ వెనకబాటుకు ప్రధాన కారణమయిన కాంగ్రెసు నేతలు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు వేసే నాటకాలను అందరూ కాకపోయినా కొందరయినా గుర్తించిన ఫలితమే కెకె, యాష్కీలకు జరిగిన శాస్తి. దీనికితోడు తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెసే అయినా దానిని పక్కనబెట్టి తామూ పోరాడుతున్నట్లు నాటకమాడుతోన్న నేతలకు పిడిగుద్దుల సన్మానం పూర్తిగా సమర్థనీయమే. పదవులు సహా ప్రజల సొమ్ములతో అన్ని సౌకర్యాలనూ అనుభవిస్తో అవసరానికి ‘జై బోలో తెలంగాణ’ పాట పాడుతోన్న నేతలకు వాస్తవానికి ఆ మాత్రం సన్మానం బహూ చిన్నది. తెలంగాణను నిజంగా కాంక్షించే నేతలయితే, ఇవ్వాల్సిన తమ అధినేతల్ని నిలదీయాలి. వారు కాదని తిరస్కరిస్తే, ఆ పార్టీకీ, తమ పదవులకూ రాజీనామా చేసి పోరాడాలి. ఈ ప్రభుద్ధులు తమ పదవుల్ని వదులుకోరు, తెలంగాణ ఇస్తారా? ఛస్తారా? అని ఏనాడూ నిలదీసిన పాపానపోరు. పైగా తెలంగాణ రాకుండా సీమాంధ్రులు కుట్రపన్నుతున్నారంటూ తరచూ వాగటం మాత్రం ఆపరు. తాము తెలంగాణ కోరుకున్నట్టే ఎదుటి వాళ్లు సమైక్యత కోరుకోవచ్చన్న ఇంగిత జ్ఞానం స్వయం ప్రకటిత నేతలకు లేదు. ప్రజల మనోభావాలు అంటూ తరచూ వాగే ఈ నేతలకు పెరిగే ధరలతో ఆ ప్రజలు పడే ఈతి బాధలు మాత్రం ఏనాడూ గుర్తుకురావు. తామూ, తమ పరివారం అవినీతి కారణంగా ప్రజలకు కనీస సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందటం లేదని తెలిసి కూడా కించిత్తు బాధపడరు. తమ కారణంగానే బాధలనుభవిస్తోన్న జనాలను వాస్తవమేదో ఆలోచించకుండా తప్పుదోవ పట్టించి సొమ్ముచేసుకుంటున్నారీ నేతలు. కొత్త రాష్ట్రంలోనూ తమ పెత్తనాలను కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తోన్న నేతలందరికి కూడా కెకె, యాష్కీలకు జరిపిన సన్మానాన్నే తగురీతిన త్వరలో జరగాలని తెలుగిల్లు హృదయపూర్వకంగా కాంక్షిస్తోంది.

ఉప సంపాదకుడంటే వార్తల పారిశుధ్యకార్మికుడే


ఉపసంపాదకుడు తెనుగీకరించిన వార్త ఇదీ


పెట్రోలియం ధరలు పెరగొచ్చు : రంగరాజన్‌
చెన్నయ్‌ : లిబియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల బ్యారెల్‌కు 100 డాలర్లకుపైగా పెరిగిన ముడి చమురు ధర ఈ స్థాయిలోనే మరికొంతకాలం కొనసాగితే దేశంలో పెట్రోల్‌ ధరలు పెంచాల్సి వస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ రంగరాజన్‌ తెలిపారు. ప్రస్తుతం బ్యారెల్‌ చమురు ధర 106 డాలర్లు. ”చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగడం ఆందోళనకరమే. ఇలాగే మరికొంత కాలం కొనసాగితే తట్టుకునేందుకు మేం కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పెట్రోలియం ధరలు పెంచడం అనివార్యమవుతుంది. మేం మరికొన్ని వారాలు ఎదురు చూస్తాం” అని ఒక కార్యక్రమంలో పాల్గనేందుకు సోమవారం ఇక్కడికొచ్చిన రంగరాజన్‌ పేర్కొన్నారు. డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తేస్తారా? అన్న ప్రశ్నకు ”ఈ విషయంలో విధాన నిర్ణయంలో మార్పులు అవసరం” అన్నారు. ఆహార ద్రోవ్యోల్బణం మార్చి నుండి తగ్గుముఖం పట్టిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ”ఫిబ్రవరి రెండో వారం నుండి కూరగాయల ధరలు తగ్గాయి. మార్చిలో వాటి ధరలు మరింత వేగంగా తగ్గడాన్ని మీరు చూడొచ్చు” అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌)ల్లో నెలకొల్పిన కంపెనీలకు మ్యాట్‌ పన్ను నుండి మినహాయించే ప్రసక్తేలేదని రంగరాజన్‌ చెప్పారు. లాభాలు సంపాదించే కంపెనీలన్నీ నిర్ణీత కనీస పన్ను చెల్లించాల్సిందేనన్నారు.

అయితే ఈ వార్త పాఠకుడిని ఆకట్టుకోవాలంటే …
1. చిన్న వాక్యాలను మాత్రమే రాయాలి. మొదటి వాక్యంలో ముడి చమురు ధర పెరిగినందున దేశంలోనూ పెంచాల్సి రావచ్చని చెప్పి ఆపేయాలి. రెండో వాక్యంలో లిబియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధర పెరిగిందని చెప్పొచ్చు. మొదటిసారిగా చెబుతున్నప్పుడు దానికి వెల్లడించారు అంటే బాగా నప్పుతుంది. లేదా పేర్కొన్నారనీ అనొచ్చు. ఇక్కడ తెలిపారు అనటం తప్పుకాదుగానీ నప్పదు.
2. బ్యారెల్‌ చమురు ధర 106 డాలర్లు. … ఇలా వేరొకరి ప్రకటనలో సబ్‌ ఎడిటర్‌ తన వ్యాఖ్యానాలు జప్పించటం పాఠకుడిని గందరగోళ పరిచే అవకాశం ఉంది. సంప్రదాయమూ కాదు. చట్టమూ కాదు. ఈ విషయం ఇక్కడ సమస్య కాదుగానీ, కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదమూ పొంచి ఉంటుందని గమనించాలి. ఒకటి అంకెలనూ, వివరాలనూ తప్పుగా ఇవ్వొచ్చు. అది పాఠకులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లవుతుంది. తాను చెప్పని విషయాన్ని పత్రిక రాసిందని ఆ .. చెప్పినవారు కోర్టుకు ఎక్కవచ్చు. కనీసం ప్రకటన చేసినా సంస్థకు నష్టమే కదా! దానివలన పత్రిక ఏదిబడితే అది రాస్తుందనన్నా పాఠకుల్లో చులకన ఏర్పడుతుంది.
3. వార్తను స్థానికీకరించాలి…. అంటే రాష్ట్రంలో అత్యధికులకు తెలిసే విధంగా బ్యారల్‌ను లీటర్ల లోకీ, డాలర్లను రూపాయలలోకీ మార్చి రాయాలి.
4. ”చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగడం ఆందోళనకరమే.” …. వారి మాటలను కోట్స్‌లో చెబితే అత్యంత ప్రభావితం చేస్తాయని భావిస్తే తప్ప వ్యాఖ్యానాలన్నింటినీ పాఠకులకు పత్రిక నివేదించినట్లు మార్చి రాయటమే బాగుంటుంది. పై వాక్యాన్ని …. చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకుపైగా పలకటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అని రాయొచ్చు.
5. ఆయన ఎవరితో వ్యాఖ్యానించారో ఇందులో వివరం లేదు. అయినా మీరూ చూడొచ్చు అని రాశారు. ఆ ‘మీరు’… ఎవరు?
6. మ్యాట్‌ పన్నును ఏమిటో కొంతమేరయినా వివరణతో రాస్తేనే పాఠకుడికి తెలుస్తుంది.
7. మార్పులు అవసరం” అన్నారు….. చూడొచ్చు” అన్నారు. ఇలా పదేపదే రాయటం విసుగు కలిగిస్తుంది.
8. అనవసరమయిన పదాలను తొలగించాలి. … నిర్ణీత కనీస పన్ను అనే కన్నా కనీస పన్ను అంటే సరిపోతుది.
9. ఈ సమావేశం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికోసం, ఎవరు నిర్వహించారన్న వివరం కనీసంగా ఇవ్వటం పత్రిక ధర్మం. పాఠకుడు తనకు ఆ మాత్రం కనీస సమాచారం కావాలని కోరుకుంటాడు గదా!
10. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) … ఆంగ్లానికి తెలుగులో వివరణ అవసరం అవుతుందేమోగానీ, తెలుగుకు ఇంగ్లీషు వివరణ అవసరమా?
చివరిగా …
ఇప్పుడు మళ్లీ పెట్రో ధర పెరటం అంటే వినియోగదారుడిపై బాంబు పడ్డట్టే. వార్త శీర్షిక, లీడ్‌ భాష బాంబు పడిన తీరున ఉంటే ఆకట్టుకుంటుంది.

ఆంధ్రభూమికి అంత లేదు!


ప్రపంచ మహిళా దినోత్సవం 101వ ఏడాది సందర్భంగా ఆంధ్రభూమి విడుదల చేయబోయే తెలుగు వారపత్రికకు కొందరు పనిగట్టుకుని తెగతెగ ప్రచారం చేసేస్తున్నారు. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ విడుదల కాలేదని ఢంకా భజాయించటం వెనుక ఏ మతలబు ఉందో అర్థం కావటం లేదు. అందరూ ఈ పత్రికను చదవమని ప్రచారం చేస్తున్నారు. అయితే ఓ ఊసులగూడు ఎక్కిన ఆ పత్రిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే దానికంత లేదని మాత్రం చెప్పక తప్పటం లేదు. ముఖ చిత్రం బొమ్మలే దాని అంతర్గతాన్ని ఇట్టే పట్టిచూపుతున్నాయి. డబ్బుల కోసం బట్టలూడదీసుకుని తైతక్కలాడిన అమ్మలక్కల్ని కూడా మహా గొప్ప ఆడోళ్లంటూ డబ్బా కొట్టబూనుకున్న ఆంధ్రభూమి యాజమాన్యానికి మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల భవిత కోసం జీవితాలను త్యాగం చేసిన వారు కనిపించక పోవకటం విచిత్రం కాదు. చిన్ననాటనే తుపాకీ చేతబట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గురించి లోపల రాశారేమో తెలియదుగానీ, ఆమె చిత్రం  పత్రిక ముఖచిత్రంలో చోటు దక్కకపోవటం ఘోరం. అదే పోరాటంలో నిజాం ముష్కరులపై వడిసెలతో విరుచుకుపడిన చాకలి అయిలమ్మ ఎక్కడ? నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌తో భుజం భుజం కలిపి పోరాడిన లక్ష్మీ సెహగల్‌కు స్ధానమే లేదా? అలనాడు బ్రిటీష్‌ ముష్కరులను ఊళ్లోకి రానీయకుండా రాళ్లతో నిలవరించిన ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్లకు చెందిన జట్టి అక్కమ్మ గురించి ఈ పత్రిక రాతగాళ్లకు అసలు తెలుసా? ఇలాంటివారి జాబితా కోకొల్లలుగా ఉంది. అయితే ఆంధ్రభూమి ధోరణిని పట్టిచూపేందుకు ఈ కొంచం చాలు. ఏమంటారు?

‘పర’భూములు మా పేనం.. మా పేనాలు తీసి పేక్టరీ కట్టుకోండి

‘పర భూములు మా పేనం.. బురదలో పుట్టిన పిత్త పరిగలు ఏరుకుని బతుకుతున్నాం. మాకు డబ్బొద్దు, మాకు దనమొద్దు. పేక్టరీ అంతకంటే వద్దు. మా నోటికాడ కూడు దూరం చేయొద్దు. మా తలుపులు పగలగొట్టి ఇళ్లల్లో జరబడి మగాళ్లను తీసుకుపోయారు. జైలులో పెట్టారు. ఆడపిల్లల్ని చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్లిపోయారు. ఇంతకంటే గోరం ఎక్కడైనా ఉంటాదా!’
– ఇది వడ్డితాండ్ర మత్స్యకార మహిళల గోడు.

శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం కాకరాపల్లి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం పరిధిలోని వడ్డితాండ్ర, సంతబమ్మాళి, కొత్తూరు ప్రాంతాల్లో మూడువేల మత్స్యకార కుటుంబాలున్నాయి. వారంతా తంపరభూముల్లో చేపలవేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలపాటు ఈ తంపర భూముల్లో చేపల వేట సాగుతుంది. అక్కడ దొరకనప్పుడు చెరువుల్లో పెంచుకున్న చేపల్ని పట్టి అమ్ముకుంటారు. మహిళలు పరిసర ప్రాంతాలతోపాటు వంద కిలోమీటర్ల దూరంలోని గుణపురం, పర్లాకిమిడి, రాయగడ్‌, పలాసకు కూడా పోయి అమ్ముకుని వస్తుంటారు. చేపలు లేని సమయంలో తంపర భూముల్లో ఏపుగా పెరిగే బరుసు గడ్డిని సేకరిస్తారు. దీనినిఇళ్ల పైకప్పులకు వినియోగిస్తారు. బరుసు గడ్డి అమ్మకం ద్వారా రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకూ సంపాదిస్తామని మహిళలు ధీమాగా చెప్తున్నారు.
పొట్టగొట్టిన థర్మల్‌ యాజమాన్యం
థర్మల్‌ ప్రాజెక్టు యాజమాన్యం తాము సొంతం చేసుకున్న 2,450 ఎకరాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోని వెయ్యి ఎకరాల్లో బరుసుగడ్డి పెరగకుండా కలుపు మందు పిచికారీ చేశారని వడ్డితాండ్ర వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చేపలు చచ్చిపోవడంతోపాటు గడ్డి కూడా పెరగడం లేదని వాపోయారు. ”మూడేళ్ల నుంచీ పాకలు నెయ్యిట్లేదు. కలుపు మందు చల్లేసినారు. చేపలు, బరుసుగడ్డి చచ్చిపోయాయి. మహా కంగాళీ చేసేసినారు” అని మత్స్యకార మహిళ హేమలత వివరించారు. ”ఈ బురదలో పుట్టి పెరిగినోళ్లం. బురద తినే బతుకుతాం. మమ్మల్ని ఇలా వదిలేయండి బావూ!” అని మరో మహిళ చేతులెత్తి దండం పెట్టారు.
మరిచిపోలేని పోలీసు క్రౌర్యం
గత నెల 26, 28 తేదీల్లో జరిగిన సంఘటనలను తలచుకుని ఇప్పటికీ మహిళలు భయంతో వణికిపోతున్నారు. ‘ పోలీసులు ఆడవాళ్ల జాకెట్లు చించేసినారు. బూతులు తిట్టారు. ఇళ్లల్లోకి దూరిపోయి, తుపాకీ మడమలతో తలుపులు పగలగొట్టారు. మగాళ్లను లాక్కెళ్లిపోయారు. ఆడాళ్లని కూడా చూడకుండా చేతుల్లో ఎత్తుకెళ్లిపోయినారు’ అంటూ అప్పటి సంఘటనల్ని వృద్దురాలు గాయత్రి వైలమ్మ కళ్లకు గట్టినట్టు గుర్తుచేసుకున్నారు. పోలీసుల దౌర్జన్యకాండ కారణంగా అన్నూరావు తదితరుల ఇళ్లలో పగిలిపోయిన తలుపులు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో ఉన్నవారిని బయటకు రప్పించేందుకు వేసిన పొగబాంబుల వలన కాలిపోయిన ధాన్యం కుప్పలు, ఇళ్లు, వాహనాలు పోలీసు క్రౌర్యానికి ప్రతీకలుగా కళ్లకు కడుతున్నాయి. ‘మా పొట్టకొట్టారు. ఇళ్లు తగలెట్టారు. ఇంకేమి మిగిలింది మాకు’ అంటూ మహిళలు రోదిస్తున్నారు. పొగబాంబుల శకలాలు తగిలి పలువురు చిన్నారులు గాయపడ్డారు. పోలీసులకు భయపడి అందరూ పారిపోగా నాలుగేళ్ల నాగుల గాయత్రి మాత్రం ఉంది. ఆ బాలిక గాయాలు నాటి భయానక దృశ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బడులు మూసేశారు. టెక్కలి ప్రభుత్వ కళాశాలకు వెళ్లి చదువునే ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులను కూడా పోనివ్వకుండా అడ్డుకోవటం పట్ల వడ్డితాండ్ర మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ప్రాజెక్టు రాకముందే ఆకలితో రోడ్డున పడ్డాం. అదే వస్తే మా గతేం కాను. పండించుకోడానికి భూముల్లేవు. చేపలు పట్టుకోడానికి పర భూములే లేకుండా సేత్తున్నారు. పర భూములు మా పేనం. పేనాలిచ్చయినా వాటిని కాపాడుకుంటాం’ అంటూ అమాయక మత్స్యకారుల కృతనిశ్చయంతో పలుకుతున్నారు.
నష్టపోనున్న సముద్ర మత్స్యకారులు
మత్స్యలేశం, ఎం.సునాపల్లి, మేఘవరం, గెద్దలపాడు తదితర ప్రాంతాల్లో ఏడువేల మంది మత్స్యకారులు సముద్రపు వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. థర్మల్‌ ప్రాజెక్టు నుంచి వచ్చే వ్యర్థ జలాలు సముద్రంలోకి చేరటంతోపాటు నౌకలు తీరానికి వస్తే చేపలు దొరికే అవకాశం లేదని అక్కడి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
పర్యావరణానికీ, విదేశీ పక్షులకూ పెను ప్రమాదం
దేవతా పక్షులుగా ఇక్కడి ప్రజలు భావించే విదేశీ పక్షుల విహార కేంద్రం ఈ ప్రాజెక్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని తేలినీలాపురంలో ఉంది. రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఈ ప్రాంతం అలరారుతోంది. సైబీరియా నుంచి పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్స్‌ పక్షులు తంపర భూముల్లో దొరికే చేపలను తినేందుకూ, ఇక్కడి చల్లటి వాతావరణంలో బతికేందుకూ వస్తుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసి, పిల్లలు పెరిగిన తర్వాత వాటితో కలిసి సైబీరియా వెళ్లిపోతాయి. థర్మల్‌ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నందున వెలువడుతోన్న శబ్దాలతో అవి బెదిరిపోయి, వెళ్లిపోతున్నాయి. థర్మల్‌ కాలుష్యానికి తంపర భూముల్లో చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉండటంతో సైబీరియా పక్షులు కూడా వలస రాకుండా ఆగిపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సైబీరియా పక్షుల సమస్యను థర్మల్‌ యాజమాన్యం తన నివేదికలో ప్రాథమికంగా కూడా పేర్కొనలేదు. దీనికితోడు ప్రాజెక్టును నిర్మిస్తోన్న తీరప్రాంతంలో అరుదైన, విలువైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లతోపాటు 120 రకాల జీవజాలం అంతరించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

తెగ తింటున్నందునే ధరలు పెరిగాయట – శాసనసమండలి పిడిఎఫ్‌ సభ్యుడు డాక్టర్‌ కె. నాగేశ్వర్‌


ప్రజలు అధికంగా తింటున్నందునే ఆహారోత్పత్తుల ధరలు పెరిగాయని కేంద్రం బడ్జెట్టుకు ముందు విడుదలచేసిన ఆర్థిక పరిశీలనా పత్రంలో పేర్కొందని పిడిఎఫ్‌ శాసనమండలి సభ్యుడు డాక్టర్‌ కె.నాగేశ్వర్‌ విమర్శించారు. విశాఖ విజ్ఞాన వేదిక శుక్రవారం నిర్వహించిన ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు-ప్రజలపై ప్రభావం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. నిజంగా ఆహార వినియోగం పెరిగితే బిడ్డ బాగా తింటే ఆనందపడే తల్లిదండ్రుల్లా సంతోషపడాల్సిన ప్రభుత్వం, దానివల్లే ధరలు పెరిగాయని పేర్కొనడం దౌర్భాగ్యమని తప్పుపట్టారు. దేశంలో 2009-10లో 218 మిలియను టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తికాగా, 2010-11లో 233 మిలియను టన్నులు ఉత్పత్తి అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 150 లక్షల టన్నుల నుంచి 190 లక్షల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా ధరలు ఆకాశాన్నంటాయని గుర్తుచేశారు. ధరల పెరుగుదలకు దళారీ వ్యవస్థే కారణమని విశ్లేషించారు. ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌, ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ లాంటి స్పెక్యులేషన్‌ వ్యాపారాలు వినియోగదారుణ్ణీ, ఉత్పత్తిదారుణ్ణీ నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి కూడా చెప్పినా వాటిని నియంత్రిస్తామని కేంద్రం ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించారు. ధరల సమస్యను రాష్ర ప్రభుత్వం బడ్జెట్టులో ప్రస్తావించకుండా తప్పించుకుందనీ, కేంద్ర ప్రభుత్వం విడ్డూరమైన కారణాలు వినిపించిందని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ధరాభారం … ప్రభుతకు సుంకాల ఆదాయం
ప్రజలు పెట్రో ధరల భారం మోస్తుండగా, ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకుంటున్నాయని వివరించారు. అవినీతిని అడ్డుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పకపోగా, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్ని అమ్మి రూ.40 వేల కోట్లు సేకరిస్తామని పేర్కొనడం అన్యాయమన్నారు. ప్రభుత్వ బీమారంగాన్ని హత్య చేసేందుకుగాను కేంద్రం చట్టాలు చేసే పనిలో పడిందని హెచ్చరించారు. పాలసీదారులే ఏజెంటుకు కమిషను చెల్లించాలని ప్రభుత్వం చట్టం చేయబూనుకోవటం విచిత్రాల్లో విచిత్రమని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన నగదు బదిలీ పథకం పెద్ద బూటకమని అభివర్ణించారు.

రైతన్నకు ఈ ఏడాదీ పగాకే


ప్రకాశం జిల్లాలో పొగాకు వ్యాపారులు కూటమి కట్టారు. తాము నిర్ణయించిన ధరకు మించి వేలంలో ఒక్క పైసా అదనంగా పలకకుండా పథకం రూపొందించుకున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన, ప్రజల సొమ్ముతో, ప్రత్యేకించి రైతుల వలన పోగుబడుతోన్న సొమ్ములతో నడుస్తోన్న పొగాకు బోర్డు కూడా వ్యాపారులకే తందాన తాన పాడుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. సొంత లాభాలు, వారివారి (అ)రాచకీయాలతో రైతు గురించి ఆలోచించే తీరికే ప్రజా ప్రతినిధులకు లేకపోయె మరి. ఫలితంగా రైతులను నిలువునా దోచుకుంటోన్న పొగాకు వ్యాపారులకు అడ్డే లేకుండా పోతోంది. దీంతో నష్టానికే రైతన్న పొగాకును తెగనమ్ముకోవలసిన దుస్థితి దాపురించింది. గతనెల 24న పొగాకు వేలం ప్రారంభమయిన విషయం పాఠకులకు విదితమే. ఆనాడు క్వింటాలుకు గరిష్ట ధర రూ.12 వేలు పలికింది. అదే గిట్టుబాటు కాదని ఆ రోజు రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితులవలన కనీసం రూ.15 వేలన్నా ఇవ్వాలని తొలినుంచీ రైతులు మొరబెట్టుకుంటూనే ఉన్నారు. అయితే వ్యాపారులతో మాట్లాడటానికి అధికారులు ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. ఏదో రకంగా రైతులనే వంచించి వేలం కొనసాగించాలన్న ఆలోచనతో సాగుతున్నారు. వేలం రోజునే బోర్డు ఛైర్మన్‌ కమలవర్ధనరావు మాట్లాడుతూ విదేశాల్లో పొగాకు ఎక్కువగా పండిందని ప్రకటించారు. అంటే రైతులు కోరుతున్న ధర ఇవ్వబోమని ఆనాడే పరోక్షంగా తేల్చి చెప్పారు. దీంతో ఛైర్మన్‌ వైఖరి వ్యాపారులకు అనుకూలంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు నాలుగు రోజుల తర్వాత అధికారులే వ్యాపారులకు అనుకూలంగా రంగంలోకి దిగారు. పొగాకు అమ్ముకోకుంటే రైతులు నష్టపోతారని బెదిరించే ధోరణికి దిగారు. అమ్మాల్సిందేనని బలవంతం చేశారు. ప్రతిదానికీ ఆందోళనకు దిగితే తామేమీ చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో రైతులు మెత్తబడక తప్పలేదు. దాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు తిరిగి వేలాన్ని ప్రారంభించారు. వ్యాపారులు ముందుగా అనుకున్న ధర రూ.12 వేల కంటే కేవలం రూపాయి మాత్రమే పెంచారు.
నాణ్యమైన పొగాకు పండినా ఫలితం సున్న
వాస్తవానికి ఈ ఏడాది నాణ్యమైన పొగాకు దిగుబడి అవుతోంది. పైగా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు కూడా పండలేదు. గతేడాది 213 మిలియన్లు పండింది. ఈ ఏడాది వర్షాల వల్ల సాగు పడిపోయింది. దీంతో 120 మిలియను కిలోలు రావచ్చని అంచనా వేశారు. గతంలో 70 శాతం నాసిరకం పొగాకు వచ్చేది. ఈ ఏడాది ఆకు కోత కాలంలో అనుకూల వాతావరం కారణంగా ఇప్పుడు 80 శాతం ఎఫ్‌- 1 గ్రేడు వస్తోంది. అవసరాలు చూస్తే 200 మిలియన్‌ కిలోల దాకా ఉంది. దేశంలో పొగాకు నిల్వలు కూడా తగ్గినట్లు లెక్కలు విదితం చేస్తున్నాయి కూడా. గత ఏడాది చివరి ఆకును కూడా క్వింటాలు నాలుగు వేల రూపాయలకు కొన్నారు. ఎగుమతికి కూడా తగినంత అనుమతులు వ్యాపారులకు దక్కాయి. పైగా వంద దేశాలతో ఒప్పందాలు కుదిరాయి. ఇన్ని అనుకూల పరిస్థితులున్నా రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే పనిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పార్లమెంటు సభ్యులు ఢిల్లీలోనూ, శాసనసభ్యులు హైదరాబాదులోనూ మకాం వేశారు. ఎంతో కొంతయినా చేస్తాడని రైతులు నమ్మిన ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి మహీధరరెడ్డి కూడా వేలం ప్రారంభమయ్యాక జిల్లాకే రాలేదు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైంది. ప్రారంభంలోనే రైతుల కోరికకు తలగ్గితే భవిష్యత్తులో కష్టమనే ధోరణిలో వ్యాపారులున్నారు. ఏదోరకంగా బోర్డును లోబరచుకుని వేలం సాగించే పనిలో విజయం సాధించారు. గిట్టుబాటు ధర రాలేదని రైతులు వేలం నిలిపేస్తే బోర్డు అధికారులు బలవంతంగా వేలం జరుపుతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రారంభం రోజునే రైతులు వేలాన్ని నిలిపేశారు. గిట్టుబాటు ధరకోసం ఆందోళన చేశారు. తీరా రైతు సంఘాల నేతలు తిరిగి వెళ్లిపోయాక అధికారులు రైతులను బెదిరించి వేలం కొనసాగించే యత్నం చేశారు. వాస్తవానికి వేలం ఆగాక అదే రోజు మళ్లీ కొనుగోళ్లు జరపడం చట్టవిరుద్ధం. దీన్నిబట్టే బోర్డు అధికారులు వ్యాపారుల పంచన చేరారన్న విమర్శలకు తావిస్తోంది.
వ్యాపారులతో  అధికారులు కుమ్మక్కయ్యారు
వ్యాపారులతో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పొగాకు బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారు. తాము నిర్ణయించుకున్న ధరను వ్యాపారులు ముందుగానే బోర్డు అధికారులకు చెబుతారు. ఆ ధరతోనే అధికారులు వేలాన్ని మొదలు పెడతారు. ఇపుడూ అదే జరిగింది. రోజూ జరుగుతోంది. వేలం ప్రారంభం కాకముందు బోర్డు ఛైర్మన్‌ కమలవర్ధన్‌రావు పొగాకు రైతులతోపాటు రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహిచారు. క్వింటాలుకు రూ.16 వేలు ఇవ్వాలని రైతులు కోరారు. అదే సమయంలో వ్యాపారులు కూడా సమావేశమై ధర నిర్ణయించుకున్నారు. ఆ ధరను బోర్డుకు తెలిపారు. ఛైర్మన్‌ కూడా వ్యాపారులకే ప్రాధాన్యత ఇచ్చారు. గతేడాది గరిష్టధర రూ.12 వేలు పలికింది. ఈ ఏడాది కూడా ఇదే ధర ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే చేశారు. గతేడాది కంటే పెట్టుబడులు 20 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో వాస్తవానికి కొనుగోలు ధర కూడా పెరగాలి. పెంచాల్సిన బాధ్యత బోర్డు అధికారులపై అధికారులది.
ప్రత్యామ్నాయం లేకనే వ్యాపారులకు ఊతం
వేలంలో వ్యాపారులకు పోటీగా రంగంలోకి దించాల్సిన ప్రభుత్వం ఆ ఆలోచనే చేయటం లేదు. ఇదే అదనుగా వ్యాపారుల ఆట సాగుతోంది. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. కేంద్రం విదేశీ మారకద్రవ్యం ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం ఏటా గడిస్తోంది. పొగాకు ఉత్పత్తులపై సుంకాలు పిండుకుంటోంది. అయితే పొగాకు ఆధారంగాద ఆదాయాలను పోగేసుకోవటం తప్ప దాన్ని పండించే రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం, వ్యాపారులు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. రైతులు మాత్రం నష్టాల్లో కూరుకు పోతూనే ఉన్నారు.

సావుల పేక్టరీని ఆపాల్సిందే

జనాలు చస్తున్నా పేక్టరీ ఆపరేమి? ఈ బూములు వాళ్లమ్మా బాబు గడించారా! మగాళ్లను జైల్లో పెట్టారు. మా పెసిడెంటుని అడ్రసు లేకుండా సేశారు. పోలీసులు రాక్షసుల్లా మారారు. వాళ్ల దెబ్బలకు, తూటాలకు మగాళ్లు హాస్పటల్లో కుళ్లిపోతున్నారు. కూడుపెట్టే వాళ్లు లేకుండా పిల్లలతో మేమెలా బతకాల. కలెక్టర్‌ని, ఎస్పీని సస్పెండు సేయాలి.’
-ఇది ఆకాశ లఖవరం మహిళల ఆక్రందన.

వాళ్ల బతుకేదో వాళ్లది. అత్యధికులు కటిక పేదలు. పైగా నిరక్షరాస్యులు. మంచయినా, చెడయినా అంతా తమ కర్మ అని సరిపెట్టుకునే తత్వం వారిది. అలాంటి వ్యవసాయ కార్మిక మహిళలు శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పోలీసు తూటాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా, మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం ఆపేది లేదని ఎందుకు ప్రతిన బూనుతున్నారు? తెలుగిల్లు పరిశీలనలో పలు విస్మయకర అంశాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్‌కు చెందిన ఈస్టు కోస్టు ఎనర్జీ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ రూ.11,075 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం కాకరాపల్లిలో థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 660 మెగావాట్ల మొదటి యూనిట్‌ ఈ ఏడాది నవంబరుకూ, అంతే సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ 2012 మార్చినాటికీ పూర్తవుతుందని భావిస్తున్నారు. మూడో యూనిట్‌ను 2013 జూన్‌ నాటికీ, నాలుగో యూనిట్‌ను 2013 డిసెంబరుకు పూర్తి చేసేందుకూ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సాగిలపడిన సాగు
ప్రాజెక్టు ఏర్పాటుకుగాను ఎపిఐఐసి నుంచి 2,450 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. ఈ భూములను వాటి తీరును బట్టి తంపర, పర, చిత్తడి భూములని వర్గీకరించారు. ఈ భూముల్లో నిత్యం నీరు నిలువ ఉంటుంది. ఆ నీటిలో చేపలు పెరుగుతాయి. ఏపుగా బరుసు గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డిని పూరిళ్ల కప్పుకు వినియోగిస్తారు. సాగుకు యోగ్యమైన భూముల్లో వరి తదితర పైర్లను రైతులు సాగుచేస్తున్నారు. ఇక్కడ నీటి ఎద్దడి లేకపోవటంతో వ్యవసాయం లాభసాటిగానే ఉంది. వంశధార నీరు ఇక్కడ నుంచే సముద్రంలోకి ప్రవేశిస్తుంది. గరీబులగెడ్డ, దేశగెడ్డ, సందమ్మగెడ్డ తదితర వాగుల నీరు ఈ భూముల మీదుగా ప్రవహిస్తూ సముద్రానికి చేరుతుంది. విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఈ చిత్తడి నేలల్లోనే నిర్మాణం అవుతున్నందున మట్టితో మెరక వేశారు. నీటి మళ్లింపునకు పిల్ల కాలువను తవ్వించారు. దీనివలన నీరు సముద్రంలోకి పోకుండా లోతట్టు పొలాల్లో నిల్వ చేరుతోంది. ఫలితంగా పరిసరాల్లోని 30 గ్రామాలకు చెందిన 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. గత డిసెంబరులో ఐదు సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఈ పొలాల్లో వారం రోజులపాటు నీరు నిలువ ఉండిపోయింది. అందువల్ల పొట్టబోసుకున్న ధాన్యం తడిసి రంగుమారింది. గడ్డి కుళ్లిపోవటంతో పశువులు కనీసం వాసన కూడా చూడటం లేదు. తడిసిన ధాన్యం బస్తాకు రూ.200 కూడా ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని వడ్డితాండ్ర, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులకు సంబంధించి యాజమాన్య నివేదిక విశేషాలు ఇవీ
విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వలన 23 గ్రామాలపై అధిక ప్రభావం ఉంటుందని యాజమాన్యం తన నివేదికలో పొందుపరిచింది. ఈ గ్రామాల్లో 31,434 మంది జనాభా ఉన్నారని పేర్కొంది. వారిలో 55.8 శాతం మందిని అక్షరాస్యులుగా పేర్కొన్నారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయమని నివేదించారు. వారంతా పుట్టుక రీత్యా మత్స్యకారులని కూడా పొందుపరిచారు.
విద్యుదుత్పత్తి ప్రారంభమైతే అంతా బూడిదే
పచ్చని వరి పొలాలు. పూతతో కళకళలాడుతున్న జీడిమామిడి తోటలు. వాటికి ఆనుకుని మొగలి పువ్వులు. ఇలా పచ్చదనానికీ, పర్యావరణానికీ చిరునామాలా కాకరాపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆకాశలఖవరం, సీరపువానిపేట తదితర ప్రాంతాలు కనిపించాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన జీరు నాగేశ్వరరావు (45), సీరపు ఎర్రయ్య (28) పోలీసు కాల్పులకు బలయ్యారు. ఆకాశ లఖవరం జనాభా రెండు వేలు కాగా, సీరపువానిపాలెం జనాభా 450. ఇక్కడ ఎవరిని కదిపినా ఇప్పటిదాకా తమకు ఇంత కూడు పెట్టిన పచ్చని ప్రాంతమంతా కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బూడిదే మిగులుతుందని ఆవేదన చెందారు.
విశాఖ థర్మల్‌ ప్రాంతాన్ని చూసిన కాకరాపల్లి ప్రాంత వాసులు
విశాఖలో ఎన్‌టిపిసికి చెందిన వెయ్యి మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉంది. అక్కడి గాలిలో, నీటిలో, నేల మీదా అంతా బూడిదే కనపడుతుంది. లక్షల సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమైన బొగ్గును మండించినప్పుడు దాని నుంచి పాదరసం, కాడ్మియం, ఆర్సినిక్‌, యురేనియం, థోరియం తదితర రేడియో ధార్మిక రసాయనాలు వెలువడతాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్థారించిన సత్యం. ఈ రసాయనాలు గర్భిణులపై ప్రభావం చూపుతున్నాయని కూడా పరిశోధనల్లో రుజువైనట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కాకరాపల్లి ఐదు రెట్లు అధికం
కాకరాపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే బూడిద నిల్వ కోసం 520 ఎకరాలు కేటాయించారు. వెయ్యి మెగావాట్ల విశాఖ ప్రాజెక్టు వలనే భరించలేని కాలుష్యం ఏర్పడుతుండగా, దానికి ఐదు రెట్లు పెద్దదయిన కాకరాపల్లి ప్రాజెక్టు ఎంత ప్రమాదమో? ప్రజలకు ఎవరో చెప్పాల్సిన పనేముంది! పైగా విశాఖ ప్రాజెక్టు ఉన్న పరవాడ పరిసర ప్రాంతాలకు కూడా ఈ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వెళ్లి చూసి వచ్చారు. అక్కడి బోర్ల నీటిలో కూడా బూడిద కన్పించిందని పలువురు వివరించారు. పైగా పరవాడలో సాగుకు వీలులేకుండా పొలాలన్నీ నాశనమయ్యాయని కూడా తెలిపారు. అందువలనే తమ ప్రాంతం మరో పరవాడ కాకూడదని కాకరాపల్లి ప్రాంతవాసులు ప్రాణాలకు తెగించి మరీ తిరగబడుతున్నారు.
నోటికాడ కూడు నీటిపాలైంది
‘పేక్టరీ గట్టు ఎత్తుగా కట్టడం వల్ల సముద్రంలోకి నీరెళ్లక మా ఊళ్లో 1500 ఎకరాల వరి పొలం ముంపుబారిన పడింది. గడ్డంతా ముక్కిపోయింది. ఈ ధాన్యం చూడండి ఎంత నల్లగా ఉన్నాయో! గొడ్లు కూడా వాసన చూడని ఈ వడ్లను మనుషులెవరయినా తింటారా? గడ్డిలేక బక్కలు (పశువులు) అమ్మేశాం. పరవాడ వెళ్లి థర్మల్‌ పేక్టరీ చూసొచ్చాం. అక్కడంతా బూడిదే. నీళ్లు కూడా తాగడానికి పనికి రావడం లేదు. అందుకే మా కాడ పేక్టరీ వద్దనుకుంటున్నాం. వాళ్లకు అనుగుణంగా మాట్లాడేవారితో బూటంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పుడు మళ్లీ నిర్వహించాలి’ అని ఆకాశ లఖవరానికి చెందిన పరమట లక్ష్మణ తదితర పలువురు యువకులు ఘంటాపథంగా కోరారు.
తేరుకోని బాధిత కుటుంబాలు
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను చూసిన వారికెవరకయినా కడుపు తరుక్కు పోవలసిందే. కాల్పుల్లో మృతి చెందిన ఆకాశలఖవరానికి చెందిన జీరు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రులు పార్థసారధి, బత్స సత్యనారాయణను మృతుడి పదేళ్ల కుమార్తె భవాని ఛీకొట్టింది. ‘నా తండ్రి పేనాలు తీసిన ప్లాంటును ఆపాలి. మీరు డబ్బులిస్తే మా నాన్న తిరిగొస్తాడా? మాకు దిక్కెవరు? ఆస్పత్రిలో ఉన్న వాళ్ల నాన్న చచ్చిపోతే వాళ్లకు దిక్కెవరు? అంటూ నిలదీసింది.
పట్టించుకోని ప్రభుత్వం
ఇక మహిళల పరిస్థితి మరింత దీనంగా ఉంది. ఆకాశ లఖవరానికి చెందిన ధనలక్ష్మి భర్త రాజు చావుబతుకుల మధ్య విశాఖలోని సెవెన్‌హిల్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను తెచ్చే కూలితోనే ఆ కుటుంబం నడిచేది. ధనలక్ష్మి తన మూడు నెలల చిన్నారితో భర్త మళ్లీ తిరిగొస్తాడో? రాడోనన్న ఆందోళనతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నని కూడా ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.
పోలీసు నిర్బంధంలో గ్రామాలు
వేలకొద్దీ పోలీసుల్ని దింపి గ్రామంలోకి సరుకుల్ని రాకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆకాశ లఖవరం, సీరపువానిపేట మహిళలు మండిపడుతున్నారు. ఆకాశలఖవరం గ్రామానికి కూరగాయలు, పాలు, పత్రికలు కూడా రాకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వస్తున్న స్థానిక సంప్రదాయ వైద్యుడు బి.శ్రీనివాసరావును పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే చాలు మగవాళ్లను అరెస్టు చేస్తున్నారని తెలిపారు. దానివలన ఆదాయం కోల్పోయిన కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని చెప్పారు. ‘ఈళ్ల పేక్టరీ కోసం మేము సావాలా! అదేనా నాయం?’ అంటూ ఆకాశలఖవరం, సీరపువానిపేట తదితర ప్రాంతాల్లోని మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పేక్టరీ యాజమాన్యం అందరికీ నష్టపరిహారం చెల్లించిందన్న ప్రచారంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు పైసా కూడా ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు.
ఇంత చేసినా ఉద్యోగాలు వెయ్యే!
థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం వలన వచ్చే ఉద్యోగాలు 700 మాత్రమే. 2000 మంది నుంచి 2500 మందికి నిర్మాణ పనుల వలన తాత్కాలికంగా ూపాధి కలుగుతుంది. యాజమాన్యం నివేదికలో వివరించినట్లుగా భద్రత, ఉద్యాన వన అభివృద్ధి తదితర రంగాల్లో మరో 200 మంది నుంచి 300 మందికి ూపాధి లభించినా మొత్తం సంఖ్య 900 మంది నుంచి వెయ్యి మంది లోపే. అవి కూడా ఆయా రంగాల్లో అనుభవమూ, విద్యార్హతా ఉన్న వారికే లభిస్తాయి. అందులోనూ స్ధానికుల్లో అత్యధికులు నిరక్షరాస్యులే. అందువల్ల ఆ ఉద్యోగాలూ ఇతర ప్రాంతాల వారికే దక్కుతాయి. ఆ పాటి దానికి తమ భవితను బుగ్గిపాలుచేసుకునేందుకు ఎవ్వరయినా ఒప్పుకుంటారా? ఈ విషయాన్ని ప్రభుత్వమే తేల్చి చెప్పాలి. ఈ నేపథ్యమే ఆ ప్రాంత ప్రజలు తిరగబడేందుకు దోహదం చేస్తోంది.