ప్రజలు అధికంగా తింటున్నందునే ఆహారోత్పత్తుల ధరలు పెరిగాయని కేంద్రం బడ్జెట్టుకు ముందు విడుదలచేసిన ఆర్థిక పరిశీలనా పత్రంలో పేర్కొందని పిడిఎఫ్ శాసనమండలి సభ్యుడు డాక్టర్ కె.నాగేశ్వర్ విమర్శించారు. విశాఖ విజ్ఞాన వేదిక శుక్రవారం నిర్వహించిన ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు-ప్రజలపై ప్రభావం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. నిజంగా ఆహార వినియోగం పెరిగితే బిడ్డ బాగా తింటే ఆనందపడే తల్లిదండ్రుల్లా సంతోషపడాల్సిన ప్రభుత్వం, దానివల్లే ధరలు పెరిగాయని పేర్కొనడం దౌర్భాగ్యమని తప్పుపట్టారు. దేశంలో 2009-10లో 218 మిలియను టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తికాగా, 2010-11లో 233 మిలియను టన్నులు ఉత్పత్తి అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 150 లక్షల టన్నుల నుంచి 190 లక్షల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా ధరలు ఆకాశాన్నంటాయని గుర్తుచేశారు. ధరల పెరుగుదలకు దళారీ వ్యవస్థే కారణమని విశ్లేషించారు. ఫార్వర్డ్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ లాంటి స్పెక్యులేషన్ వ్యాపారాలు వినియోగదారుణ్ణీ, ఉత్పత్తిదారుణ్ణీ నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి కూడా చెప్పినా వాటిని నియంత్రిస్తామని కేంద్రం ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించారు. ధరల సమస్యను రాష్ర ప్రభుత్వం బడ్జెట్టులో ప్రస్తావించకుండా తప్పించుకుందనీ, కేంద్ర ప్రభుత్వం విడ్డూరమైన కారణాలు వినిపించిందని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ధరాభారం … ప్రభుతకు సుంకాల ఆదాయం
ప్రజలు పెట్రో ధరల భారం మోస్తుండగా, ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకుంటున్నాయని వివరించారు. అవినీతిని అడ్డుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పకపోగా, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్ని అమ్మి రూ.40 వేల కోట్లు సేకరిస్తామని పేర్కొనడం అన్యాయమన్నారు. ప్రభుత్వ బీమారంగాన్ని హత్య చేసేందుకుగాను కేంద్రం చట్టాలు చేసే పనిలో పడిందని హెచ్చరించారు. పాలసీదారులే ఏజెంటుకు కమిషను చెల్లించాలని ప్రభుత్వం చట్టం చేయబూనుకోవటం విచిత్రాల్లో విచిత్రమని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన నగదు బదిలీ పథకం పెద్ద బూటకమని అభివర్ణించారు.
4 మార్చి
Posted by Praveen Sarma on మార్చి 5, 2011 at 1:56 ఉద.
జనం తిండిపోతులైతే పాలక వర్గంవాళ్లు తాగుబోతులా?
Posted by telugite on మార్చి 5, 2011 at 5:00 సా.
దేశంలొ ఆహర ధాన్యాల ఉత్పత్తి, వినియోగం తో పాటు పెరగటం లేదు. ఇదే సాధారణ భాషలో ప్రజలను తిట్టినట్లుగా, ప్రజలు తెగ తింటున్నట్లుగా అర్ధం వస్తుంది. భావాన్ని మాత్రమే చూస్తే పెద్దగా తప్పు లేదేమో ఆ వ్యాఖ్యల్లో.
ఉత్పత్తి పెరగకపోవడానికి కారణం ప్రభుత్వ అసమర్ధతే!