ప్రపంచ మహిళా దినోత్సవం 101వ ఏడాది సందర్భంగా ఆంధ్రభూమి విడుదల చేయబోయే తెలుగు వారపత్రికకు కొందరు పనిగట్టుకుని తెగతెగ ప్రచారం చేసేస్తున్నారు. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ విడుదల కాలేదని ఢంకా భజాయించటం వెనుక ఏ మతలబు ఉందో అర్థం కావటం లేదు. అందరూ ఈ పత్రికను చదవమని ప్రచారం చేస్తున్నారు. అయితే ఓ ఊసులగూడు ఎక్కిన ఆ పత్రిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే దానికంత లేదని మాత్రం చెప్పక తప్పటం లేదు. ముఖ చిత్రం బొమ్మలే దాని అంతర్గతాన్ని ఇట్టే పట్టిచూపుతున్నాయి. డబ్బుల కోసం బట్టలూడదీసుకుని తైతక్కలాడిన అమ్మలక్కల్ని కూడా మహా గొప్ప ఆడోళ్లంటూ డబ్బా కొట్టబూనుకున్న ఆంధ్రభూమి యాజమాన్యానికి మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల భవిత కోసం జీవితాలను త్యాగం చేసిన వారు కనిపించక పోవకటం విచిత్రం కాదు. చిన్ననాటనే తుపాకీ చేతబట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గురించి లోపల రాశారేమో తెలియదుగానీ, ఆమె చిత్రం పత్రిక ముఖచిత్రంలో చోటు దక్కకపోవటం ఘోరం. అదే పోరాటంలో నిజాం ముష్కరులపై వడిసెలతో విరుచుకుపడిన చాకలి అయిలమ్మ ఎక్కడ? నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో భుజం భుజం కలిపి పోరాడిన లక్ష్మీ సెహగల్‌కు స్ధానమే లేదా? అలనాడు బ్రిటీష్ ముష్కరులను ఊళ్లోకి రానీయకుండా రాళ్లతో నిలవరించిన ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్లకు చెందిన జట్టి అక్కమ్మ గురించి ఈ పత్రిక రాతగాళ్లకు అసలు తెలుసా? ఇలాంటివారి జాబితా కోకొల్లలుగా ఉంది. అయితే ఆంధ్రభూమి ధోరణిని పట్టిచూపేందుకు ఈ కొంచం చాలు. ఏమంటారు?
Archive for మార్చి 6th, 2011
6 మార్చి
ఆంధ్రభూమికి అంత లేదు!
6 మార్చి
‘పర’భూములు మా పేనం.. మా పేనాలు తీసి పేక్టరీ కట్టుకోండి
‘పర భూములు మా పేనం.. బురదలో పుట్టిన పిత్త పరిగలు ఏరుకుని బతుకుతున్నాం. మాకు డబ్బొద్దు, మాకు దనమొద్దు. పేక్టరీ అంతకంటే వద్దు. మా నోటికాడ కూడు దూరం చేయొద్దు. మా తలుపులు పగలగొట్టి ఇళ్లల్లో జరబడి మగాళ్లను తీసుకుపోయారు. జైలులో పెట్టారు. ఆడపిల్లల్ని చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్లిపోయారు. ఇంతకంటే గోరం ఎక్కడైనా ఉంటాదా!’
– ఇది వడ్డితాండ్ర మత్స్యకార మహిళల గోడు.
శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం కాకరాపల్లి థర్మల్ విద్యుత్తు కేంద్రం పరిధిలోని వడ్డితాండ్ర, సంతబమ్మాళి, కొత్తూరు ప్రాంతాల్లో మూడువేల మత్స్యకార కుటుంబాలున్నాయి. వారంతా తంపరభూముల్లో చేపలవేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలపాటు ఈ తంపర భూముల్లో చేపల వేట సాగుతుంది. అక్కడ దొరకనప్పుడు చెరువుల్లో పెంచుకున్న చేపల్ని పట్టి అమ్ముకుంటారు. మహిళలు పరిసర ప్రాంతాలతోపాటు వంద కిలోమీటర్ల దూరంలోని గుణపురం, పర్లాకిమిడి, రాయగడ్, పలాసకు కూడా పోయి అమ్ముకుని వస్తుంటారు. చేపలు లేని సమయంలో తంపర భూముల్లో ఏపుగా పెరిగే బరుసు గడ్డిని సేకరిస్తారు. దీనినిఇళ్ల పైకప్పులకు వినియోగిస్తారు. బరుసు గడ్డి అమ్మకం ద్వారా రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకూ సంపాదిస్తామని మహిళలు ధీమాగా చెప్తున్నారు.
పొట్టగొట్టిన థర్మల్ యాజమాన్యం
థర్మల్ ప్రాజెక్టు యాజమాన్యం తాము సొంతం చేసుకున్న 2,450 ఎకరాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోని వెయ్యి ఎకరాల్లో బరుసుగడ్డి పెరగకుండా కలుపు మందు పిచికారీ చేశారని వడ్డితాండ్ర వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చేపలు చచ్చిపోవడంతోపాటు గడ్డి కూడా పెరగడం లేదని వాపోయారు. ”మూడేళ్ల నుంచీ పాకలు నెయ్యిట్లేదు. కలుపు మందు చల్లేసినారు. చేపలు, బరుసుగడ్డి చచ్చిపోయాయి. మహా కంగాళీ చేసేసినారు” అని మత్స్యకార మహిళ హేమలత వివరించారు. ”ఈ బురదలో పుట్టి పెరిగినోళ్లం. బురద తినే బతుకుతాం. మమ్మల్ని ఇలా వదిలేయండి బావూ!” అని మరో మహిళ చేతులెత్తి దండం పెట్టారు.
మరిచిపోలేని పోలీసు క్రౌర్యం
గత నెల 26, 28 తేదీల్లో జరిగిన సంఘటనలను తలచుకుని ఇప్పటికీ మహిళలు భయంతో వణికిపోతున్నారు. ‘ పోలీసులు ఆడవాళ్ల జాకెట్లు చించేసినారు. బూతులు తిట్టారు. ఇళ్లల్లోకి దూరిపోయి, తుపాకీ మడమలతో తలుపులు పగలగొట్టారు. మగాళ్లను లాక్కెళ్లిపోయారు. ఆడాళ్లని కూడా చూడకుండా చేతుల్లో ఎత్తుకెళ్లిపోయినారు’ అంటూ అప్పటి సంఘటనల్ని వృద్దురాలు గాయత్రి వైలమ్మ కళ్లకు గట్టినట్టు గుర్తుచేసుకున్నారు. పోలీసుల దౌర్జన్యకాండ కారణంగా అన్నూరావు తదితరుల ఇళ్లలో పగిలిపోయిన తలుపులు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో ఉన్నవారిని బయటకు రప్పించేందుకు వేసిన పొగబాంబుల వలన కాలిపోయిన ధాన్యం కుప్పలు, ఇళ్లు, వాహనాలు పోలీసు క్రౌర్యానికి ప్రతీకలుగా కళ్లకు కడుతున్నాయి. ‘మా పొట్టకొట్టారు. ఇళ్లు తగలెట్టారు. ఇంకేమి మిగిలింది మాకు’ అంటూ మహిళలు రోదిస్తున్నారు. పొగబాంబుల శకలాలు తగిలి పలువురు చిన్నారులు గాయపడ్డారు. పోలీసులకు భయపడి అందరూ పారిపోగా నాలుగేళ్ల నాగుల గాయత్రి మాత్రం ఉంది. ఆ బాలిక గాయాలు నాటి భయానక దృశ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బడులు మూసేశారు. టెక్కలి ప్రభుత్వ కళాశాలకు వెళ్లి చదువునే ఇంటర్, డిగ్రీ విద్యార్థులను కూడా పోనివ్వకుండా అడ్డుకోవటం పట్ల వడ్డితాండ్ర మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ప్రాజెక్టు రాకముందే ఆకలితో రోడ్డున పడ్డాం. అదే వస్తే మా గతేం కాను. పండించుకోడానికి భూముల్లేవు. చేపలు పట్టుకోడానికి పర భూములే లేకుండా సేత్తున్నారు. పర భూములు మా పేనం. పేనాలిచ్చయినా వాటిని కాపాడుకుంటాం’ అంటూ అమాయక మత్స్యకారుల కృతనిశ్చయంతో పలుకుతున్నారు.
నష్టపోనున్న సముద్ర మత్స్యకారులు
మత్స్యలేశం, ఎం.సునాపల్లి, మేఘవరం, గెద్దలపాడు తదితర ప్రాంతాల్లో ఏడువేల మంది మత్స్యకారులు సముద్రపు వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. థర్మల్ ప్రాజెక్టు నుంచి వచ్చే వ్యర్థ జలాలు సముద్రంలోకి చేరటంతోపాటు నౌకలు తీరానికి వస్తే చేపలు దొరికే అవకాశం లేదని అక్కడి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
పర్యావరణానికీ, విదేశీ పక్షులకూ పెను ప్రమాదం
దేవతా పక్షులుగా ఇక్కడి ప్రజలు భావించే విదేశీ పక్షుల విహార కేంద్రం ఈ ప్రాజెక్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని తేలినీలాపురంలో ఉంది. రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఈ ప్రాంతం అలరారుతోంది. సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్స్ పక్షులు తంపర భూముల్లో దొరికే చేపలను తినేందుకూ, ఇక్కడి చల్లటి వాతావరణంలో బతికేందుకూ వస్తుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసి, పిల్లలు పెరిగిన తర్వాత వాటితో కలిసి సైబీరియా వెళ్లిపోతాయి. థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నందున వెలువడుతోన్న శబ్దాలతో అవి బెదిరిపోయి, వెళ్లిపోతున్నాయి. థర్మల్ కాలుష్యానికి తంపర భూముల్లో చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉండటంతో సైబీరియా పక్షులు కూడా వలస రాకుండా ఆగిపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సైబీరియా పక్షుల సమస్యను థర్మల్ యాజమాన్యం తన నివేదికలో ప్రాథమికంగా కూడా పేర్కొనలేదు. దీనికితోడు ప్రాజెక్టును నిర్మిస్తోన్న తీరప్రాంతంలో అరుదైన, విలువైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లతోపాటు 120 రకాల జీవజాలం అంతరించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.