ఉపసంపాదకుడు తెనుగీకరించిన వార్త ఇదీ
పెట్రోలియం ధరలు పెరగొచ్చు : రంగరాజన్
చెన్నయ్ : లిబియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల బ్యారెల్‌కు 100 డాలర్లకుపైగా పెరిగిన ముడి చమురు ధర ఈ స్థాయిలోనే మరికొంతకాలం కొనసాగితే దేశంలో పెట్రోల్ ధరలు పెంచాల్సి వస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ రంగరాజన్ తెలిపారు. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 106 డాలర్లు. ”చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగడం ఆందోళనకరమే. ఇలాగే మరికొంత కాలం కొనసాగితే తట్టుకునేందుకు మేం కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పెట్రోలియం ధరలు పెంచడం అనివార్యమవుతుంది. మేం మరికొన్ని వారాలు ఎదురు చూస్తాం” అని ఒక కార్యక్రమంలో పాల్గనేందుకు సోమవారం ఇక్కడికొచ్చిన రంగరాజన్ పేర్కొన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తేస్తారా? అన్న ప్రశ్నకు ”ఈ విషయంలో విధాన నిర్ణయంలో మార్పులు అవసరం” అన్నారు. ఆహార ద్రోవ్యోల్బణం మార్చి నుండి తగ్గుముఖం పట్టిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ”ఫిబ్రవరి రెండో వారం నుండి కూరగాయల ధరలు తగ్గాయి. మార్చిలో వాటి ధరలు మరింత వేగంగా తగ్గడాన్ని మీరు చూడొచ్చు” అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)ల్లో నెలకొల్పిన కంపెనీలకు మ్యాట్ పన్ను నుండి మినహాయించే ప్రసక్తేలేదని రంగరాజన్ చెప్పారు. లాభాలు సంపాదించే కంపెనీలన్నీ నిర్ణీత కనీస పన్ను చెల్లించాల్సిందేనన్నారు.
అయితే ఈ వార్త పాఠకుడిని ఆకట్టుకోవాలంటే …
1. చిన్న వాక్యాలను మాత్రమే రాయాలి. మొదటి వాక్యంలో ముడి చమురు ధర పెరిగినందున దేశంలోనూ పెంచాల్సి రావచ్చని చెప్పి ఆపేయాలి. రెండో వాక్యంలో లిబియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధర పెరిగిందని చెప్పొచ్చు. మొదటిసారిగా చెబుతున్నప్పుడు దానికి వెల్లడించారు అంటే బాగా నప్పుతుంది. లేదా పేర్కొన్నారనీ అనొచ్చు. ఇక్కడ తెలిపారు అనటం తప్పుకాదుగానీ నప్పదు.
2. బ్యారెల్ చమురు ధర 106 డాలర్లు. … ఇలా వేరొకరి ప్రకటనలో సబ్ ఎడిటర్ తన వ్యాఖ్యానాలు జప్పించటం పాఠకుడిని గందరగోళ పరిచే అవకాశం ఉంది. సంప్రదాయమూ కాదు. చట్టమూ కాదు. ఈ విషయం ఇక్కడ సమస్య కాదుగానీ, కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదమూ పొంచి ఉంటుందని గమనించాలి. ఒకటి అంకెలనూ, వివరాలనూ తప్పుగా ఇవ్వొచ్చు. అది పాఠకులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లవుతుంది. తాను చెప్పని విషయాన్ని పత్రిక రాసిందని ఆ .. చెప్పినవారు కోర్టుకు ఎక్కవచ్చు. కనీసం ప్రకటన చేసినా సంస్థకు నష్టమే కదా! దానివలన పత్రిక ఏదిబడితే అది రాస్తుందనన్నా పాఠకుల్లో చులకన ఏర్పడుతుంది.
3. వార్తను స్థానికీకరించాలి…. అంటే రాష్ట్రంలో అత్యధికులకు తెలిసే విధంగా బ్యారల్‌ను లీటర్ల లోకీ, డాలర్లను రూపాయలలోకీ మార్చి రాయాలి.
4. ”చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగడం ఆందోళనకరమే.” …. వారి మాటలను కోట్స్‌లో చెబితే అత్యంత ప్రభావితం చేస్తాయని భావిస్తే తప్ప వ్యాఖ్యానాలన్నింటినీ పాఠకులకు పత్రిక నివేదించినట్లు మార్చి రాయటమే బాగుంటుంది. పై వాక్యాన్ని …. చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకుపైగా పలకటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అని రాయొచ్చు.
5. ఆయన ఎవరితో వ్యాఖ్యానించారో ఇందులో వివరం లేదు. అయినా మీరూ చూడొచ్చు అని రాశారు. ఆ ‘మీరు’… ఎవరు?
6. మ్యాట్ పన్నును ఏమిటో కొంతమేరయినా వివరణతో రాస్తేనే పాఠకుడికి తెలుస్తుంది.
7. మార్పులు అవసరం” అన్నారు….. చూడొచ్చు” అన్నారు. ఇలా పదేపదే రాయటం విసుగు కలిగిస్తుంది.
8. అనవసరమయిన పదాలను తొలగించాలి. … నిర్ణీత కనీస పన్ను అనే కన్నా కనీస పన్ను అంటే సరిపోతుది.
9. ఈ సమావేశం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికోసం, ఎవరు నిర్వహించారన్న వివరం కనీసంగా ఇవ్వటం పత్రిక ధర్మం. పాఠకుడు తనకు ఆ మాత్రం కనీస సమాచారం కావాలని కోరుకుంటాడు గదా!
10. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) … ఆంగ్లానికి తెలుగులో వివరణ అవసరం అవుతుందేమోగానీ, తెలుగుకు ఇంగ్లీషు వివరణ అవసరమా?
చివరిగా …
ఇప్పుడు మళ్లీ పెట్రో ధర పెరటం అంటే వినియోగదారుడిపై బాంబు పడ్డట్టే. వార్త శీర్షిక, లీడ్ భాష బాంబు పడిన తీరున ఉంటే ఆకట్టుకుంటుంది.