ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన పండ్లు, కూరగాయలు ఇప్పుడు భిన్నమైన బహూమతుల్ని మనకు అందజేస్తున్నాయి. కూరగాయలు, పండ్లలో కాలేయాన్ని కాటేసే విషాలు ూన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. కేన్సర్, గుండె జబ్బులు కలిగించే విషపూరిత రసాయనాలు దండిగా ఉన్నట్లు వెల్లడయింది. దేశ రాజధాని ఢిల్లీలో అమ్ముడవుతోన్న కూరగాయల్లో ఎలుకల్ని చంపేందుకు వినియోగించే విషం సహా, నాలుగురకాల నిషేధిత విష వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో లాభాల కోసం ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే వ్యాపారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషపదార్థాల కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు తేల్చారు. తలనొప్పి, నలత, ఆహారం అరగని సమస్య, సంతాన లేమి తదితర రుగ్మతలు కూడా సోకుతున్నాయట. పొలాల్లో ఉండగా అటు రైతులూ, కోత అనంతరం వ్యాపారులు పంట త్వరగా రావడానికీ, ఫలదీకరణకూ, రంగు కోసం ఉపయోగించే క్రిమిసంహారకాలు, విషపూరిత రంగులు ఇలా మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి కూడా ఈ వ్యర్థాలు కారణమవుతున్నాయని కూడా గుర్తించారు. అదనపు సాలిసిటర్ జనరల్ ఎఎస్ చందోక్ నేతృత్వంలో ఆరుగురు న్యాయవాదులు, ఇద్దరు ఎన్‌జిఓ ప్రతినిధులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసిన కోర్టు రానున్న ఐదు వారాల్లో వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. దేశంలో పండ్లు, కూరగాయల్లో యూరోపియన్ ప్రమాణాలకంటే 750 రెట్లు అధికంగా క్రిమిసంహారక మందులు, విషపూరిత రసాయనాలు ఉంటున్నాయని ఢిల్లీకి చెందిన ఎన్‌జిఓ సంస్థ ‘వినియోగదారుల గొంతుక’ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన పరిశీలనలో వెల్లడయింది.
10 మార్చి