Archive for మే 15th, 2011

తెలుగిల్లు తెర లేచింది


గత కొంతకాలంగా తెలుగిల్లు తాళం వేసి ఉండటంతో కొందరు ”అయ్యో! ఏమయింది” అంటూ జాలిగా ప్రశ్నించారు. వందలాది మంది ఆందోళనతో సెల్‌ఫోన్లో పరామర్శించారు. కొద్దిమందే అయినా ముఖాముఖీ బాధపడ్డారు. ఒకరిద్దరు ఎదురు పడీ ముఖం తిప్పుకున్నారు. అందులో ఒకడితో నేనే బలవంతంగా మాట్లాడే ప్రయత్నం చేయగా, నిలబడి నోరు విప్పితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్లుగా పారిపోయాడు. మరికొంతమంది తెగ సంతోషపడిపోయారు. పీడ వదిలిందని మెయిళ్లు పంపారు. కొందరు నాలుగడుగులు ముందుకేసి తిట్టిపోశారు. అసలు పేరుతో రాశాడో? లేదోగానీ, నన్ను ఆ…. కార్యాలయానికే రావద్దని ఆంక్షలు పెట్టాడొకడు. మొత్తం మీద మిత్రులు కొందరు శత్రువుల్లా వ్యవహరించారు. అంతా బాగానే ఉందిగానీ, బ్లాగులో రాయటమే బాగలేదని కొందరు తీర్మానించారు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడిందన్నట్లుగా ఉద్యోగానికి నా రాజీనామా వ్యవహారం నడిచింది. కొందరిలా నటించటం చేతగాని నేను కడుపు చించుకోకుండా ఉండలేకపోయాను మరి. కాళ్ల మీద పడకుండా ఆపకుండా ఉండలేకపోయాను. అయితే, గియితే వీటిన్నంటికీ అతీతంగా నేను, నా రోజుల్ని గడుపుతున్నానని మాత్రం చెప్పగలను. మిత్రుల మౌనం ఒక్కటే కొద్దిగా బాధిస్తోంది. కాలమే ఆ బాధను మాపుతుందని ఆశిస్తున్నాను.
అన్నట్లు ఆ … కార్యాలయంలో జరిగే ఓ సాహితీ సంస్థ సమావేశానికి ఇటీవల ఆహ్వానం వచ్చింది. ఆహ్వానితులకు ఇదేమీ తెలియదు పాపం. అందుకనే వివరించి చెప్పి, పెద్దల సలహా తీసుకున్న తర్వాత ఆహ్వానం పంపితే నేను అక్కడకు వచ్చి ముఖం చూపించగలనో? లేదో? ఆలోచిస్తానని వారికి చెప్పాను. అంతే మళ్లీ పిలుపు రాలేదు. ఏమయిందో? తెలియదు. నాలాంటి వాడిని భరించే శక్తి ఆ కార్యాలయానికి, దాని నిర్వాహకులకూ లేకపోవటాన్ని నేను ఏ మాత్రం తప్పుపట్టటం లేదు. కాకపోతే నా బాధల్లా … వాళ్లకు జనం దూరం అవుతున్నారో? జనానికే వాళ్లు దూరం అవుతున్నారో? నేను తేల్చి చెప్పలేనుగానీ, అది నన్ను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది.
అయినా మంచికి శాశ్వత చావు ఉండదని నా నమ్మకం.!
మంచి అంటే మార్జ్కిజం తప్ప వేరొకటి లేదు.
ఇక చివరిగా…. ఆ కార్యాలయం నుంచి నన్ను తిట్టిపోసిన కొద్దిమందికీ, మద్దతు తెలిపిన ఎంతో మందికి, మౌనం వహించిన పెద్దలకూ, ”ఈ గొడవతో మాకు పనే లేదు, అలా చేయకపోతే నువ్వు నువ్వే కాదు గదా” అన్నట్లుగా స్నేహాన్ని కొనసాగిస్తున్న మిత్రులందరికీ, ప్రత్యేకించి నా ఒంగోలు స్నేహితులందరికీ నా కృతజ్ఞతలు. నా ధన్యవాదాలు.
అన్నట్లు ఇంకో సంగతి…. నాకు మద్దతు తెలిపిన చైతన్య ఎవరో? సాక్షి ఎవరో? వాళ్లెవరు? వీళ్లెవరూ? అంటూ కొంతమంది వాకబులు మీద వాకబులు చేశారు పాపం. మీ వక్రబుద్ధి నశించుగాక!
వాళ్లెవరూ? వీళ్లెవరూ? అని తెలుసుకునేకన్నా…. వాళ్లేమన్నారు, వీళ్లేమన్నారు అని చూస్తే మేలు. దాంట్లో నిజముంటే సమీక్ష చేసుకోండి. తప్పులున్నాయని భావిస్తే సరిదిద్దుకోండి. లేదూ కక్షగట్టి సంస్థను నాశనం చేయాలనుకుంటున్నారని తేలితే నిర్భయంగా వాళ్లని తప్పుపట్టండి. అట్లాంటివారిని (నేనయినా సరే!) దూరంగా ఉంచండి. అవసరమయితే వేటేయండి. అంతేగానీ అన్ని వేళలా మౌనం మంచిది కాదు. శస్త్రచికిత్స అవసరమని వైద్యుడు చెప్పినా మౌనం వహిస్తే అది మధుమేహి కాలిపుండులా దేహం మొత్తాన్నీ కుళ్లిస్తుంది.
లేదూ, గోటితో పోయేదానికి గొడ్డలి పెడితే మనిషే పోతాడని గ్రహించండి. అదే ఇప్పుడు జరుగుతుందేమోనని నా అనుమానం.
ఆలస్యమయితేనేం మే 14నో, 15నో స్పందించిన ఆమనిగారికి కృతజ్ఞతలు చెప్పనీయండి. బహుశా ఆయన సాహితీ మిత్రుడు కావచ్చు . నాకు అంతర్గత పోరాటం గురించి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఆ … కార్యాలయంలో నేను రెండోమారు అడుగు పెట్టక ముందు ఓ తీర్మానం చేసుకున్నాను. మా మిత్రుడొకడు ఎప్పుడూ వల్లించే ”గుళ్లో గుగ్గిలం వేయకపోతేమానే, పిత్తి కంపు కంపు చేయకు” అన్న సామెతలాగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నందున అంతర్గత పోరాటానికి దిగలేదు. అంతేకాదనుకోండి…. రాజకీయ పార్టీ సభ్యత్యం తీసుకునే వయస్సు రాక మునుపే ఆ అర్హత సాధించాను. నిన్న , మొన్నటి వరకూ మా పెద్దవాళ్ల సొమ్ము తింటూ నమ్మకంగా పనిచేశానని నమ్ముతున్నాను. కరపత్రాలు పంచాను. గోడ పత్రికలు అంటించాను. తెల్లగోడల్ని ఎర్రబరిచాను. పోలీసులు తలపగలగొడితే ఎర్రోడిని కదా అని వెర్రిగా గర్వపడ్డాను. ఇంట్లో వాళ్ల తిట్లను మౌనంగా భరించాను. అవినీతిపరుల దాడులు ఎదుర్కొన్నాను. వీడింతే మారడు అని వేనోళ్ల అన్పించుకున్నాను. ఇప్పటికీ ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాననుకుంటున్నాను. అయితే గియితే ఆమని గారూ! పోరాటాలంటారా? జెండా పట్టి ఒంగోలు వీధుల్లో గొంతు చించుకున్న అలనాటి రోజులు మళ్లీ రాకపోవచ్చునేమోగానీ, పశ్చిమబెంగాలులో మమత గెలుపు ముందు సిపిఎంకూ, ఆ వంటనే భారతదేశానికే నష్టమని స్పష్టంగా నమ్ముతున్నవాడిని. అందువలన నన్ను నేను సరిగ్గానే ఉంచుకుంటున్నాననుకుంటున్నాను. ఏమంటారు?
నిరుద్యోగినయ్యానని తెలిసి ఓదార్చిన, మంచి భవిష్యత్తు ఉంటుందని దీవించిన దేశ, విదేశ మిత్రులందరికీ మరోమారు నా ధన్యవాదాలు తెలియజేయనీయండి.
మీరు దీవించినట్లుగానే నాకు గతదఫా కన్నా రెట్టింపు జీతంతో ఓ ఉద్యోగం వచ్చింది. ఆ కార్యాలయం…. నాకు ఇవ్వాల్సిన 15 రోజుల వేతనాన్ని మరచిపోయిందిగానీ, నా పనితనానికి మెచ్చుకుని నేను ప్రస్తుతం కార్యనిర్వాహక సంపాదకుడిగా పనిచేస్తోన్న ‘రియల్‌ అడ్వైజర్‌’ మాస పత్రిక యాజమాన్యం కేవలం 12 రోజులకే నెల జీతాన్ని అందించింది. తదుపరి రెండో నెల జీతాన్ని కూడా అందుకున్నాను. అంటే నేను సంతోషంగా ఉన్నట్లే గదా ! రియల్‌ అడ్వైజర్‌ పత్రికను ఉచితంగా అందుకోదలచినవాళ్లు 9393641593కి ఫోను చేయండేం.
ఇంటి కంప్యూటరు వైరస్‌బారిన పడటంతో తెలుగింటికి తాత్కాలికంగా తాళం వేయక తప్పలేదు. వైరస్‌ను పారదోలలేదుగానీ, ఇప్పుడు నా కార్యాలయ కార్యక్రమానికి అలవాటు పడినందున వెసులుబాటు వచ్చింది.
దాని ఫలితమే ఇప్పుడు పచ్చపచ్చని తెలుగిల్లు తాళం తెరుచుకుని మళ్లీ కళకళలాడేందుకు సిద్ధమయింది. ఇక మిత్రులందరి సాయంతో రోజూ వండి వార్చాలనుకుంటున్నాను. తినేందుకు అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికింతే. రేపటికి ఆహ్వానం.

మీ మిత్రుడు
వెంకట సుబ్బారావు కావూరి