విశ్వసనీయత కోల్పోతున్న యుపీఏ-2 (రెండేళ్ల పాలనపై పరిశీలన)

ఆర్ధిక, రాజకీయ రంగాల్లో పెరిగిపోతున్న సంక్షోభ భారాల నుండి ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి? దేశం ఎలా ముందుకు పోవాలి? ఈప్రశ్నలు నేడు అందరినీ వేధిస్తున్నాయి. దేశం సంక్షోభ సుడిగుండంలోకి లాగబడుతోంది. గత ఐదారేళ్లుగా వ్యవసాయం గడ్డుపరిస్థితి నెదుర్కొంటోంది. పారిశ్రామికోత్పత్తి కూడా ఈ ఏడాది తగ్గిపోయింది. గతంలో సర్వీసు రంగం వేగంగా పురోగమించి జిడీపీ పెరగడానికి ప్రధాన దోహదకారి అయింది. నేడు దాని వేగం కూడా మందగించింది.

కేంద్రంలోని యుపీఏ సర్కారు తన రెండో ఇన్నింగ్సులో రెండేళ్లు పూర్తి చేసుకుoది. రెండేళ్లుగా దేశం అధికధరలు, అవినీతితో అట్టుడికి పోతున్నది. ప్రజల్లో అసం తృప్తి పెరుగుతోంది. ఈ అసంతృప్తిని అదుపు చేయడానికి ప్రభుత్వం నిరంకుశచర్యలకు తెగ బడుతోంది. ”లక్ష్యం 2014” దిశలో తప్పటడు గులు వేసుకుంటూ నడుస్తోంది. ఇంటా బయటా సవాళ్లు ముప్పెరగొంటున్నాయి. ప్రధాని మన్మో హన్‌, ఆయన బృందం ఊపిరాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో వామపక్షాల వల్ల తాము ముందడుగు వేయలేకపోతున్నామని వాపోయినవారే నేడు తమ కాళ్లకు తామే బంధనాలుగా మారారు. అదే కాంగ్రెసుకు పట్టిన అసలు దురవస్థ.

స్వీయ వైరుధ్యాల నడుమ ఇరుక్కున్న యుపీఏ

యుపిఎ1తో పోలిస్తే యుపిఎ-2 రెండు సంవత్సరాల పరిపాలనలో సంస్కరణలను మరింత వేగంగా అమలు జరిపింది. అధికారం లోకి వచ్చిన మొదటి రోజునుండే ఎటువంటి ఆటంకాలు, ప్రతిఘటన లేకుండా తన ఎజెం డాను నిరాటంకంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. 100 రోజుల పథకం పేరుతో విద్యా, వైద్య రంగాలను ప్రైవేటీకరించే దిశలో చాలా వేగంగా అడుగులేసింది. కీలకమైన రంగాలతో సహా అన్ని రంగాల్లోకీ విదేశీ పెట్టుబడులకు పెద్దఎత్తున అనుమతిస్తోంది. ఇన్సూరెన్స్‌ వంటి కీలకమైన వ్యవస్థను ప్రైవేటీ కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత వేగంగా ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ కాలంలో సంస్కరణల వేగం సంతృప్తికరంగా లేదని కొంద రు ఆర్థికరంగ విశ్లేషకులు, సంస్థలు, పత్రికలు, మీడియా యుపిఎని విమర్శించడం మనం గమనించదగిన విషయం. ”వాల్‌స్టీట్‌ జర్నల్‌” ప్రత్యేకంగా భారత దేశ ఆర్థిక సంస్కరణల మీద కొన్ని విశ్లేషణలు చేసింది. కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లతో విజయం సాధించి, వామపక్షాల మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్ప టికీ సంస్కరణలవైపు వేగంగా అడుగులు వేయలేకపోతున్నదని పత్రిక పేర్కొంది. సంక్షేమ కార్యక్రమాలను వదిలించుకోలేకపోతున్నారని విమర్శించింది. యుపిఎ2 అధికారంలోకి రావ డానికి గ్రామీణ ఉపాధి హామీ, అటవీ హక్కుల రక్షణచట్టం, సమాచార హక్కు వంటి సంక్షేమ పథకాలే కారణమనీ, వాటిని వదిలిపెట్టినా, తగ్గించినా ప్రజాభిమానం కోల్పోయి రాజకీయం గా బలహీనపడతామన్న భయం ఈరోజు కాంగ్రెస్‌ వర్గాల్లో వుందనీ, అందువల్లనే వారు సంస్కరణలవైపు వేగంగా అడుగులు వేయలేక పోతున్నారనీ వాల్‌స్ట్రీట్‌ విశ్లేషించింది. అలాగే ”ఎకనమిక్‌ టైమ్స్‌” లాంటి దేశీయపత్రికలు కూడా సంస్కరణల వేగం తగ్గిందని విమర్శిస్తూ వ్యాసా లు ప్రచురిస్తున్నాయి.

అంటే మనకు దీనిలో స్పష్టంగా రెండు వైరుధ్యాలు కనిపిస్తాయి. ఒకటి ఈరోజు అంతర్జా తీయంగా వచ్చిన అవకాశాలను ఉపయోగించు కొని వేగంగా సంపద పోగుచేసుకోవాలనీ, ప్రపంచ మార్కెట్‌లో వేగంగా విస్తరించాలనీ ఉవ్విళ్లూరుతున్న బడా పెట్టుబడిదారీ వర్గమూ, వారి ప్రయోజనాలూ ఒకవైపు, సామాన్య ప్రజల సంక్షేమం, వాళ్ల సబ్సిడీలు, రాయితీలు, బతుకు తెరువు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదరికం, ఆకలి వంటి సమస్యల నుండి బయటపడటమనే అంశం రెండోవైపు. ఈ రెంటిమధ్య స్పష్టమైన ఘర్షణ కనిపిస్తోంది. ఈ ఘర్షణలో యుపిఎ2 బడాపెట్టుబడిదారీ వర్గంవైపు మొగ్గుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయం లో రాజకీయ అవసరాల రీత్యా రెండో అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అనుకుంటున్నారు. దీన్ని పరిష్కరించడం ఇప్పుడున్న పాలకవర్గాలకు అంత సులభం కాదు.

మసకబారుతున్న మన్మోహన్‌ వ్యక్తిత్వం

ఈ కాలంలో ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా ప్రధాని మన్మో హన్‌ సింగ్‌ను కేంద్రంగా చేసుకొని యుపిఎ ప్రతిష్టను పెంచుకోవాలనుకున్న కాంగ్రెస్‌ వ్యూ హం దెబ్బతిన్నది. యుపిఎ1 పరిపాలనతో పోల్చుకుంటే మన్మోహన్‌ సింగ్‌ ప్రతిష్ట ఈ కాలంలో దారుణంగా పడిపోయింది. సంస్కరణ ల భాషలో చెప్పాలంటే మన్మోహన్‌ రేటింగ్‌ ‘బి’ గ్రేడుకు చేరింది. తదుపరి ర్యాంకుకు దిగితే దివాళానే. ముఖ్యంగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో మన్మోహన్‌ పాత్ర కూడా వున్నట్లు రుజువు కావడంతో ఆయన వ్యక్తిత్వం బాగా మసకబారి పోయింది. ఆయనను అడ్డంపెట్టుకొని బలపడా లన్న కాంగ్రెస్‌ వ్యూహం దెబ్బతిన్నది. దీంతో కాంగ్రెస్‌ ఆత్మరక్షణ స్థితిలో పడిపోయింది. ఈ స్థితిలో ప్రజలు, ప్రజా ఉద్యమాలపై నిర్భంధానికి తెగబడుతోంది. ప్రజాస్వామ్య హక్కులు హరించ బడుతున్నాయి. నిరంకుశత్వం దిశగా అడుగులే స్తోంది. పెరుగుతున్న రెండో వైరుధ్యం ఇది.

ఒత్తిడికి గురవుతున్న ప్రజాస్వామ్యం

ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురౌతోంది. అసంతృ ప్తిని అదుపు చేయాలంటే దానికి రెండు మార్గాలు. ఒకటి సమస్యలను పరిష్కరించాలి. లేదా సమస్యల మీద నోరెత్తకుండా అణిచివేయా లి. ప్రస్తుతం రెండో దానివైపే యుపిఎ అడుగులు వేస్తున్నది. ఇటీవల కొత్తగా వచ్చిన చాలా చట్టాలు, బిల్లులు పరిశీలిస్తే అన్యాయానికి గురైన వారు ఏవైనా ఆరోపణలు చేస్తే వాటిని పరిష్క రించడానికి బదులు ఆరోపణలు చేసినవారిపైనే ఎదురు కేసులు పెట్టి వేధించే ప్రక్రియ ఒకటి మనకు కనిపిస్తుంది. బయోటెక్నాలజీ బిల్లు, తాజా లోక్‌పాల్‌ బిల్లు, ఉపాధ్యాయుల నైతిక పరిరక్షణాబిల్లు వగైరాల్లో ఈ అంశం మనకు కనిపిస్తుంది. అలాగే ఉద్యమించే ప్రజలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతున్నది. జైతాపూర్‌ అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై కాల్పులు తాజా ఉదాహరణ. గతంలో ఆంధ్రప్రదేశ్‌ సహా ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌ మొదలైన రాష్ట్రాల్లో నిర్భంధానికి దిగింది. పోలీసు కాల్పులు సర్వసాధారణమయ్యాయి.

మొత్తంమ్మీద చూసినప్పుడు ఈ కాలంలో ఆరు అంశాల్లో యుపిఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 1 అవినీతి. 2 అధిక ధరలు. 3 వ్యవసాయ సంక్షోభం.4 విదేశాంగ విధానం. 5 సంస్కరణలపేరుతో ప్రజలపై భారాలు, సంప న్నులకు వరాలు. 6 ప్రజాస్వామ్య అపహరణ. ఒక్కొక్క అంశాన్ని మనం విడివిడిగా పరిశీలిద్దాం.

నాటికీ నేటికీ తేడా

మొదటి అంశం, యుపిఎ1 ప్రభుత్వం వామపక్షాల మద్దతు మీద ఆధారపడింది కనుక కనీస ఉమ్మడి కార్యక్రమంలోని అంశాలను కొంతమేరకైనా అమలుచేయక తప్పింది కాదు. మన్మోహన్‌ బృందానికి ఇష్టం వున్నా లేకపోర ుునా ఆరోజు కొన్ని అంశాల్లోనైనా ప్రజానుకూ లంగా వ్యవహరించక తప్పలేదు. ఒకవైపు సంస్కరణల వేగం తగ్గించి మరోవైపు ప్రజా సంక్షేమానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సివచ్చింది. ఉపాధి హామీ పథకం, అటవీ రక్షణ చట్టం లాంటివి వచ్చాయంటే దానికి కారణం వామ పక్షాల ఒత్తిడే. అలాగే ఇన్స్యూరెన్సు, బ్యాంకింగ్‌ వంటి ఫైనాన్స్‌ రంగాల్లో తలుపులు బార్లా తెరవకుండా వాటిమీద నియంత్రణ కొనసాగిం ది. పెట్రోలు ధరల పెంపుదల, ఆహార సబ్సిడీల కొనసాగింపు మొదలైన విషయాల్లో అడుగడు గునా వామపక్షాలు జోక్యం చేసుకున్నాయి. ఈ పరిణామం నచ్చని బిజేపీ నాయకులు వామ పక్షాలు అభివృద్దికి బ్రేకులు వేస్తున్నాయని విమర్శించారు. మన్మోహన్‌కు పరోక్షంగా మద్దతు పలికారు. వామపక్షాలు అడ్డుకోవడం వల్ల యుపిఎ1 ప్రభుత్వం పరిమితంగానే ధరలు పెంచాల్సి వచ్చింది. వీటన్నిటి వల్ల ప్రజల మీద భారాలకు అడ్డుకట్ట పడింది. ఇవన్నీ కూడా వామపక్షాల ఒత్తిడి వల్లే జరిగినా కూడా, కాంగ్రెస్‌కు పరోక్షంగా రాజకీయ లబ్దిని చేకూర్చాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంత బలపడటానికి తోడ్పడ్డాయి. ఫలితంగా వామ పక్షాల మద్దతు అవసరం లేని యుపిఎ2 ప్రభు త్వం ఏర్పడింది.

ఇప్పుడు వామపక్షాల మద్దతు లేదు కాబట్టి ప్రభుత్వం రెండో ఇన్నింగ్స్‌లో సంస్కరణ లను పూర్తిస్థాయిలో అత్యంత వేగంగా అమలు జరపొచ్చనుకున్నది. అయితే అనుకోకుండా అంతర్జాతీయంగా చాలా పెద్ద ఆర్థిక సంక్షోభం రావడం, కుత్తిక లోతు సంక్షోభంలో అమెరికా కూరుకుపోవడం, దాని ప్రభావం అన్ని దేశాల మీద పడటం జరిగింది. కొద్ది మోతాదులోనైనా భారత్‌, చైనాల మీద దీని ప్రభావం పడింది. సంక్షోభ ప్రభావం మనదేశం మీద తక్కువగా వుండటానికి ప్రధాన కారణం ఫైనాన్స్‌ రంగాన్ని పూర్తిగా సరళీకరించకపోవడం. కీలకమైన ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాలు ప్రధానంగా ప్రభుత్వరంగంలో వుండటం వల్ల ఇది సాధ్యం అయింది. మన్మోహన్‌సింగ్‌ కోరుకున్నట్లు మొద టనే ఫైనాన్స్‌ రంగాన్ని సరళీకరించి ఉంటే అమె రికా కంటే భారతదేశం ఈ సంక్షోభాన్ని ఎక్కు వగా ఎదుర్కొని ఉండేది.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోడానికి భారతదేశం బడా కార్పొరేట్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచంలో అమె రికా ఆధిపత్యం తగ్గడం, బహుళజాతి కంపెనీ లనేకం దివాళా తీయడం, విదేశాల్లో వారి పెట్టుబడుల పురోగమనం మందగించడం తది తర అంశాలను భారత పెట్టుబడిదారీ వర్గం తమకనుకూలంగా మలుచుకున్నది. భారతీయ కార్పొరేట్‌లు ఆఫ్రికా, ఆసియా ఆఖరుకి అనేక యూరప్‌ దేశాల్లో కూడా కంపెనీలు పెట్టి, గ్లోబల్‌ కంపెనీలుగా తయారయ్యాయి. దీనికి బదులుగా మన ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. ఉదాహరణకు, అమెరికా, అస్ట్రేలియా లాంటి దేశాల్లో ఊరూపేరూ లేని విశ్వవిద్యాలయాల (ట్రైవ్యాలీ లాంటి బోగస్‌ వర్శిటీలు) బ్రాంచీలను మన దేశంలో ఏర్పాటు చేయడానికి అనుమతు లివ్వజూస్తున్నారు. ఇది హాస్యాస్పదమైన నిర్ణయ మని నోబెల్‌ బహుమతి గ్రహీత వెంకటేశన్‌ రామకృష్ణన్‌ విమర్శించారు. ఇప్పటికే ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదవర్గాలు దీనితో మరింతగా వేరుపడిపోతారు.

ఇక పదేళ్ళ క్రితం ప్రపంచంలోని శతకోటీ శ్వరుల జాబితాలో తొమ్మిది మంది భారతీయు లుండగా ఇప్పుడు వారి సంఖ్య 52కి పెరిగింది. దేశ సంపదలో 40 శాతం ఈ శతకోటీశ్వరుల చేతిలో కేంద్రీకృతమై వుంది. మరో వైపు దేశంలో నూటికి 80 మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. వీరి చేతిలో సంపద 4 శాతానికి మించి లేదు. ఇలా అసమానతలు పెరిగిపోవడం అనేది ఈ కాలంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యుపిఎ1 కన్నా యుపిఎ2 కాలంలో ప్రజల మీద భారాలు బాగా పెరిగాయి. సంక్షోభం ముదిరింది. సమస్యలు పెరిగాయి. దాంతోపాటు అసంతృప్తి కూడా పెరిగింది.

అంతులేని అవినీతి

ఈ కాలంలో గతంలో ఎన్నడూలేని విధం గా ఒకదానివెంట మరొకటి అవినీతి కుంభకో ణాలు వెలుగులోకి వచ్చాయి. 2జి కుంభకోణం, కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌ కుంభకోణం, కర్నాటక కుంభకోణం, ఎస్‌బ్యాండ్‌ కుంభకోణం, సివిసి నియామకం ఇలా ఏకకాలంలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు వెలుగు చూశాయి. ఆఖ రికి ఉన్నత స్థానాల్లో ఉండే న్యాయమూర్తులు కూడా అవినీతికి మినహాయింపు కాదని రుజువైంది. వికీలీక్స్‌ సహాయంతో హిందూ పత్రిక బయటపెట్టిన కుంభకోణాలు సంచలనం రేపాయి. గత పార్లమెంటులో యంపీలను కొను గోలు చేయడానికి కోట్లు కుమ్మరించిన వైనాన్ని స్వయంగా చూసిన అమెరికా కన్సోలేట్‌ నివేదిక కళ్లు తెరిపిస్తుంది. వీటిపై తమకేమీ సంబంధం లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మన్మోహన్‌ సింగ్‌ చెబుతూ వచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ, కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చేకొద్దీ వీటన్నిటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, ఆయన ప్రభుత్వం పాత్ర వున్నట్లు ఆధారాలతో సహా బయట పడ్డాయి. దాంతో సంకీర్ణధర్మం వల్లనే తాను ఉదాసీనంగా వ్యవహరించాల్సి వచ్చిందని సర్దిచెప్పుకునే ధోరణిలో పడ్డారు. ప్రధాని స్థానంలో ఉండి దేశసందపను దొంగలు కొట్టుకు పోతుంటే చూస్తూ ఊరుకోవడం పెద్దనేరం.

రోజుకో కుంభకోణం బయటపడుతూ ఉంటే అవినీతిని నియంత్రించడానికి బదులుగా పాలకుల మనసంతా దాన్ని చట్టబద్దం చేయడం మీదనే కేంద్రీకరించబడింది. కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా వున్న కౌషిక్‌బసు ఇటీవల ఆర్ధికశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం పెట్టారు. దాని ప్రకారం అవినీతిని చట్టబద్ధం చేస్తే సరిపోతుంది. ఎవరి కౖనా డబ్బులిచ్చి చాటుమాటుగా పని చేయించు కోవడానికి బదులుగా నేరుగా చట్టబద్దంగా ఇచ్చేస్తే ఏ రిస్కూ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే అవినీతిని చట్టబద్ధం చేసి తద్వారా అవినీతిని లేని దేశం కింద కీర్తి తెచ్చు కోవాలనే తాపత్రయంలో పాలకులున్నారన్న మాట.

అవినీతిద్వారా సంపాదించిన డబ్బు విదేశీ బ్యాంకుల్లో 20 లక్షల కోట్ల మేర మూలు గుతోందని ఐయంఎఫ్‌ అంచనా వేసింది. ఈ డబ్బే గనుక భారతదేశానికి తిరిగి తీసుకువస్తే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కానీ ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూప డం లేదు. జర్మనీ ప్రభుత్వం మన ప్రభుత్వానికి నల్లడబ్బు ఆసాములు పేర్లు పంపినా, నల్లడబ్బు పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం చలించడం లేదంటే బ్లాక్‌ మనీదార్ల పట్ల కేంద్ర ప్రభుత్వానికెంత ప్రేమ వుందో అర్థమౌతోంది. విదేశాల్లో మూలుగు తున్న డబ్బంతా పార్టిస్పేటరీ నోట్స్‌ పేరుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన షేర్‌ మార్కెట్లోకి వచ్చి తెల్లడబ్బుగా మారిపోతు న్నది. ఈ షేర్లు ఎవరివి, ఎవరి పేరు మీద కొంటున్నారనేది తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ బ్లాక్‌మనీ షేర్‌మార్కెట్‌లో అదృశ్య శక్తిగా పనిచేస్తోంది. దాంతో షేర్‌మార్కెట్‌ అనేక కుదుపులకు గురవుతున్నది. మధ్యతరగతి మదుపుదార్లు ఈ షేర్‌ మార్కెట్లో వచ్చే కుదుపు లకు బలైపోతున్నారు.

ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వానికి ఆవగిం జంత ఆందోళన లేకపోగా కార్పోరేట్‌ సంస్థలకు మరిన్ని వరాలు కురిపిస్తూనే ఉన్నది. గత ఏడాది కార్పొరేట్‌ కంపెనీలకు కేవలం పన్ను రాయితీల రూపంలో 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు బడ్జెట్‌ పత్రంలోనే పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌ లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 88,000 కోట్ల రాయితీలిచ్చారు. మరోవైపు సబ్సిడీల మీద రూ. 70,000 కోట్లు కోత పెట్టారు. ఇలా ఆదాయ పంపిణీలో కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధానం అవలంభించింది. ఈ మధ్య కాలంలో హసన్‌ అలీ అనే ఒక హవాలా బ్రోకర్‌ ను అరెస్టు చేశారు. కొంతకాలంగా ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌) అదుపులో ఉన్నాడు. ఆయనను విచారించగా అనేకమంది అధికార, ప్రతిపక్షాలకు చెందిన బడా నాయకుల పేర్లు బయటకొచ్చినట్లు మీడియా లో వార్తలొస్తున్నాయి. అంటే విదేశాల్లో డబ్బుల్ని రహస్యంగా దాచుకునేవాళ్లు ఈ హవాలా వ్యాపారి ద్వారా పనులు చక్కబెట్టుకుంటుంటారు. వాళ్ల రహస్యాలన్నీ తెలుసుకాబట్టే ఇప్పుడు ఇతని నోరు నొక్కేసే ప్రయత్నం జరుగుతోంది.

పేదలపై భారాలు తగ్గించడానికి నిరాకరిం చిన ఈ ప్రభుత్వమే పార్లమెంట్‌ సభ్యుల జీతభత్యా లను మాత్రం ఆఘమేఘాలపై పెంచేసింది. యుపిఏ -1 హయాంతో పోలిస్తే యుపిఎ2 హయాంలో పార్లమెంటు సభ్యుల జీతాలు 300 శాతం పెరిగాయి.

ధరల పెరుగుదల

2010 జనవరి, 2011 జనవరి మధ్య ఆహార సరుకుల ధరలు 15 నుండి 20 శాతం వరకు పెరిగాయి. పెట్రోలు. ఆహారోత్పత్తులు, కూరగాయలు, సామన్యులు వాడే నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగాయి. ఇదే కాలంలో ధనికులు వాడే కార్ల ధరలు బాగా తగ్గాయి. పేద ప్రజలు ఎక్కువగా తినడం వల్ల ధరలు పెరుగుతున్నాయన్నది ప్రపంచ బ్యాంకు వాదన. గతంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఇదే వాదన చేశారు. మన మంత్రుల శరద్‌ పావర్‌ వంటివారు కూడా నేడు ఇదే వాదన నెత్తికెత్తు కున్నారు. ఇది పూర్తి అజ్ఞానంతో, అహంకారం తో చేసే అవాస్తవిక ఆరోపణ తప్ప ఇందులో ఇసుమంత కూడా వాస్తవం లేదు. ఎందుకంటే గత రెండు సంవత్సరాల కాలంలోనే దేశంలో తలసరి ఆహార ధాన్యాల వినియోగం 176 కేజీల నుండి 171 కేజీలకు అంటే సగటున మనిషికి 5 కేజీలు తగ్గింది. కనుక ఎక్కువ తినడం వల్ల ధరలు పెరిగాయనడానికి ఆధారం లేదు. పోనీ నిల్వలు లేవు, డిమాండ్‌ ఎక్కువున్నది సప్లయి తగ్గి ధరలు పెరిగాయంటే, నిల్వలు రెట్టింపయ్యాయి. గతంలో 2.5 కోట్ల టన్నులు నిల్వలుండగా ప్రస్తుతం 4.8 కోట్ల టన్నుల నిల్వ లున్నాయి. వీటిని పేదలకు తక్కువ ధరకూ ఇవ్వరూ, ఓపెన్‌ మార్కెట్‌లోకి విడుదలా చేయరూ. అక్కడ ఎలుకలు వాటిని తినేస్తుంటే పేదల కడుపులు మాడుస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు.

ప్రజలంతా అవినీతి సొమ్ము గురించి ఆందోళన పడుతూ వుంటే మన ప్రధానమంత్రి మాత్రం సబ్సిడీలు వృధా అయిపోతున్నాయని ఎక్కువ ఆందోళన పడిపోతున్నారు. సబ్సిడీల్లో జరుగుతున్న అవినీతి ఆయనకు కనపడుతోంది తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి విదేశాలకు పెద్దయెత్తున వెళుతున్న కోట్లాది రూపాయల అవినీతి కనపడడం లేదు. అందుకనే సబ్సిడీల తొలగింపు కోసం ప్రత్యేకించి ఒక కమిటీని కూడా వేశారు. ఇన్ఫోసిప్‌ మాజీఅధినేత నందన్‌ నీలకని ఆధ్వర్యంలో ఆ కమిటీ గత కొద్దిరోజు లుగా పనిచేస్తున్నది. ఇప్పటికే బియ్యం, ఎరువులు, పెట్రోల్‌ తదితర నిత్యావసరాలపై ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేసి ఆ స్థానంలో ”నగదు బదిలీ పథకం” ప్రవేశపెట్టాలనేది కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు. దానికను గుణంగానే నిలకని సిఫార్సులు చేస్తారు. భవిష్య త్‌లో సబ్సిడీ బదులు క్యాష్‌ ఇస్తారు. సబ్సిడీలు రద్దయిపోతాయి. ఉదాహరణకు రెండు రూపా యల కిలో బియ్యం పథకం తీసుకుందాం. రేషన్‌ షాపులో రెండు రూపాయలకిచ్చే బియ్యం మార్కెట్‌లో 25 రూపాయలు ఉందనుకోండి, మిగతా 23 రూపాయలు ప్రస్తుతానికి క్యాష్‌ రూపంలో పేదలకు బదిలీచేస్తారు. అదికూడా బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం పేదవారందరికీ కాదు. తర్వాత ఏదో ఒకరోజు 25 రూపాయల బియ్యం 40 రూపా యలు అయిందనుకోండి అయినా క్యాష్‌ బదిలీ 23 రూపాయలే ఉంటుంది. మిగతా 17 రూపాయలు వినియోగదారుడే భరించాలి. ఒక ఉదుటున ఏడాదిలో సబ్సిడీ బియ్యం రేటు రెండు రూపాయల నుండి 17 రూపాయలకు పెరిగి పోతుందన్నమాట. అంటే తెలియకుండానే 15 రూపాయల సబ్సిడీ కరిగిపోతుంది. దాన్ని పేదలే భరించాలి. ఇక అప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్‌షాపులు)తో పనే లేదు. నేరుగా ఓపెన్‌ మార్కెట్‌లో కొనుక్కోవాలి. అలాగే రైతులకు కూడా. ప్రస్తుతం ఎరువులపై సబ్సిడీ ప్రతిరైతుకీ వస్తుంది. ఇక నుండి మార్కెట్‌ రేటుకి కొనుక్కోవాలి. బియ్యం లాగానే సబ్సిడీ తేడాను రైతులకు డబ్బు రూపంలో ఇస్తారు. అది ఎలా ఇస్తారో ఇంతవరకు స్పష్టం కాలేదు. ఉదాహ రణకు కౌల్దార్లు లక్షల సంఖ్యలో వున్నారు. వీరికి స్వంత భూమి లేదు. సహజంగానే భూ రికార్డు వున్నటువంటి వారికే క్యాష్‌ బదిలీ పథకం వస్తుంది. కౌల్దార్లు పూర్తిగా మార్కెట్‌ రేటుమీదే ఎరువులు కొనుక్కోవాల్సి వుంటుంది. ఈరోజు రైతులందరీకీ కూడా సబ్సిడీ రేటు మీదే ఎరువులు దొరుకుతున్నాయి. రేపట్నుంచి దీన్ని కొద్దిమందికే పరిమితం చేస్తారు. నిజంగా సన్నచిన్నకారు రైతులు వీథిన పడతారు. ధనవం తులు, పలుకుబడి ఉన్న కామందులే క్యాష్‌ను జేబులో వేసుకుంటారు. ఇప్పుడు సబ్సిడీ రేటుకి ఎరువులు దొరుకుతున్నాయి కాబట్టి వ్యవసాయ ఖర్చు అదుపులో వుంది. ఆహారధాన్యాలను ప్రభుత్వమే మిల్లర్లనుండి సేకరించి చౌకగా పేదలకందిస్తోంది. ఈ విధానంలో ఉన్న లోపా లను సరిదిద్దే బదులు ఎలుకలున్నాయని ఇంటినే తగలబెట్టుకున్న మూర్ఖుని కథమాదిరి కేంద్రం వ్యవహరిస్తోంది.

యుపిఎ 2 హయాంలోనే పెట్రోల్‌, డీజిల్‌ మీద పూర్తిస్థాయిలో నియంత్రణ ఎత్తేశారు. కిరోసిన్‌, గ్యాస్‌పై ఇప్పటివరకూ సబ్సిడీ వుంది. క్యాష్‌ బదిలీ పథకం వచ్చిన తర్వాత వాటిమీద కూడా సబ్సిడీ ఎత్తేస్తారు. ఇప్పుడు అన్ని కుటుం బాలకు సబ్సిడీపై గ్యాస్‌ లభిస్తోంది. ఇక నుండి దీన్ని కొద్దిమందికే పరిమితం చేస్తారు. ముఖ్యం గా మధ్యతరగతి ఈ భారాన్ని బాగా మోయాల్సి వస్తుంది. ఈవిధంగా ప్రత్యామ్నాయంగా ప్రవేశ పెడుతున్న నగదుబదిలీ పథకం అనేది పేద, మధ్యతరగతి పాలిట శాపంగా మారనుంది. ప్రభుత్వ ఖజానా మీద భారం తగ్గించుకో వడానికే ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నది. ఈ విధంగా మిగిలిన సొమ్మునంతా పెట్టుబడిదారు లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.

వ్యవసాయ సంక్షోభం

గత సంవత్సరం వర్షాలు బాగుండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఇదంతా తమ ఘనతగా యుపిఎ చెప్పుకుంటోంది. గత సంవత్సరం ఉత్పత్తి రెండేళ్ళ క్రితం వున్న పరిస్థి తిని చేరుకోవడం తప్ప అదనంగా పెరిగింది మాత్రం కాదు. గత 5-6 సంవత్సరాలుగా వ్యవసాయ ఉత్పత్తులు పడిపోతున్నాయి. సగటు అభివృధ్దిరేటు 2.4శాతం మాత్రమే. ఈ సంవత్సరం మాత్రమే అది 5.4 శాతానికి చేరింది. స్థూలజాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 2.5 శాతం మాత్రమే. రైతాంగ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనితో కేంద్ర సర్కారుకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినా దీన్ని తమ ఘనతగా యుపిఎ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇటీవల ప్లానింగ్‌కమిషన్‌ మనరాష్ట్రానికొచ్చి విద్యుత్‌ సబ్సిడీ, ఉచిత విద్యుత్‌పథకాలను ఎత్తేయ్యాలని ఆదేశించిపోయింది. ఈ పూర్వరంగంలోనే రాష్ట్రం మళ్లీ విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. ఒక వైపు వ్యవసాయోత్పత్తి పడిపోతున్నా మరోవైపు రైతాంగం నడ్డివిరుస్తోంది. కనీసం గిట్టుబాటు ధరల కల్పనలో పూర్తిగా విఫలమైంది. ఈ సంవత్సరం ధాన్యం కొనేనాధుడే కన్పించడం లేదు. ఈ సంక్షోభం నుండి బయటపడేయటానికి బదులుగా స్వేచ్ఛగా విదేశాల నుండి వ్యవసా యోత్పత్తుల్ని దిగుమతి చేసుకోడానికి పలుదేశా లతో ఒప్పందాలు చేసుకుంటోంది. వ్యాపార పంటల ధరలు దీనితో దారుణంగా ఒడిదుడు కులకు గురవుతున్నాయి.

విదేశాంగ విధానం

యుపిఎ2 హయాంలో విదేశాంగ విధానం లో పూర్తి తిరోగమనం కనిపిస్తున్నది. ఏ దేశ విదేశాంగ విధానమైనా ఆ దేశ ప్రయోజనాల కనుగుణంగా ఉండటం సహజం. కానీ మన పాలకవర్గాలు ఇరాన్‌ విషయంలోకానీ, ఇప్పుడు లిబియాపై దాడి విషయంలోకానీ గతంలో ఐక్యరాజ్యసమితిలో వచ్చిన అనేక సమస్యల విషయంలోగానీ అమెరికా ఎటు చేయి ఎత్తమం టే అటు చేయి ఎత్తుతున్నాయి. అమెరికా ఆధిప త్యానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ స్థాయి లో బ్రిక్స్‌ ఏర్పడింది. అందులో భారత్‌ కూడా భాగస్వామిగా వుంది. అయినా ఆ విషయంలో బ్రిక్స్‌ని బలవత్తరం చేయడంలో, దాన్ని ఒక స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దడంలో భారతదేశం చొరవ చూపలేకపోతోంది. నేను కూడా ఉన్నాను అనిపించుకోవడానికి మీటింగులకు హాజరవు తున్నది తప్ప చైనా, రష్యాతో చేతులు కలిపి మన దేశ ప్రతిష్టనూ, స్వతంత్ర ప్రతిపత్తిని కాపా డడం కోసం మాత్రం చిత్తశుద్దితో ప్రయత్నం చేయడం లేదు. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఇది అత్యంత విషాదకర పరిణామం.

దేశ భవిష్యత్తు ఎటు?

ఆర్ధిక, రాజకీయ రంగాల్లో పెరిగిపోతున్న సంక్షోభ భారాల నుండి ప్రజలకు ప్రత్యామ్నా యం ఏమిటి? దేశం ఎలా ముందుకు పోవాలి? ఈప్రశ్నలు నేడు అందరినీ వేధిస్తున్నాయి. దేశం సంక్షోభ సుడిగుండంలోకి లాగబడుతోంది. గత ఐదారేండ్లుగా వ్యవసాయం గడ్డుపరిస్థితినెదుర్కొం టోంది. జీడీపీలో దాని వాటా 26 నుండి 21 శాతానికి తగ్గిపోయింది. దానిపై ఆధారపడే జనం సంఖ్య (62శాతం) తగ్గడం లేదు. తగ్గిపో తున్న ఆదాయాన్నే ఈ అధికజనాభా ప్రజలు పంచుకోవాలి. తద్వారా నిజ ఆదాయాలు పడి పోతున్నాయి. ఫలితంగా కొనుగోలు శక్తి తగ్గిపో తోంది. పారిశ్రామికోత్పత్తి కూడా ఈ ఏడాది తగ్గిపోయింది. గతంలో సర్వీసు రంగం వేగంగా పురోగమించి జిడీపీ పెరగడానికి ప్రధాన దోహ దకారి అయింది. దాని వేగం కూడా మందగిం చింది. ఈ స్థితిలో పారిశ్రామికవర్గాలు విదేశీ మార్కెట్‌లపై దృష్టిసారించాయి. ఆఫ్రికా, యూరోప్‌ మొదలైన ఖండాలకు మన కార్పొరేట్‌కంపెనీలు వ్యాపిస్తున్నాయి. పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. మన పెట్టుబడులు ప్రపంచ వ్యాపితమవుతున్నం దుకు గర్వపడాలని సామాన్యులకు చెపుతున్నారు.

కాంగ్రెసు, బిజేపీలు రెంటిదీ అదే బాట

ఇక రాజకీయ రంగంలో కూడా ఈ రెండేళ్లలోచాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ 2009లో అధికారంలోకి వచ్చినపుడు అత్యంత ఉత్సాహంగా వుంది. ఆ విజయాన్ని ఆసరా చేసుకొని ప్రాజెక్టు 2014 పేరుతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యం, ఏక పార్టీ పరిపాలన ఏర్పాటు చేయాలనేదే ఈ లక్ష్యం. సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మిత్రుల మీద ఆధారపడకుండా వుండే ప్రభుత్వం తీసుకురా వాలని కాంగ్రెసు అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 2014 నాటికి రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ కాంగ్రెస్‌ ఆశలు అడియాసలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తు న్నది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ చాలాచోట్ల ఓడిపోయింది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది బీహార్‌ ఎన్నికలు. బీహార్‌లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వస్తామని ఆశించినప్ప టికీ కూడా కాంగ్రెస్‌ అడుగులు ముందుకు పడలేదు. గతంలోఉన్న సీట్లు కూడా పడిపోయి నాలుగు సీట్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ఒక రాజకీయశక్తిగా తన ఉనికిని కోల్పోతున్న పరిస్థితి అనేక రాష్ట్రాలలో ఈరోజు వుంది. అలాగే అధికారంలోవున్న చోట కూడా అది అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతు న్నది. దానికి మన ఆంధ్ర ప్రదేశ్‌ చక్కటి ఉదాహరణ. మరోవైపు బిజేపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కర్నాటక బిజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇటీవల కార్మికవ్యతిరేక పెన్షన్‌బిల్లు పార్లమెంటు లో పెట్టినప్పుడు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించగా బిజేపీ దాన్ని ఒడ్డెక్కించింది. ఇలా ఆపత్కాలంగా రెండు పార్టీలు ప్రజలకు వ్యతిరే కంగా ఒక్కటవుతున్నాయి.

సంకీర్ణ రాజకీయాలు:

వామపక్షాల స్వతంత్ర పాత్ర

ప్రాంతీయపార్టీలు గతంలో ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వుండేవి. కానీ ఈరోజు ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయస్థాయి బడా వ్యాపారపార్టీల బాటనే పడుతున్నాయి. ఆర్థిక సంస్కరణల విషయంతో వాళ్ళ కెలాంటి బేధాభిప్రాయం లేకపోవడంతో అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపిలకు భిన్నంగా వాటి పాత్రను కోల్పోతున్నాయి. వాటికి ఒక విధానం లేదు. తమ తక్షణ అవసరాలకు ఏది ఉపయోగం అనుకుంటే ఆ పార్టీ వెంట సూత్రరహితంగా పోతున్నాయి. అవి ప్రత్యామ్నాయ శక్తిని కోల్పో తున్నాయి. ఈ బలహీనతను ఆసరా చేసుకొని బలహీనపడుతున్న ప్రజారాజ్యం వంటి ప్రాంతీ య పార్టీలను తమలో విలీనం చేసుకునే ప్రక్రియను కాంగ్రెసు అనుసరిస్తోంది. ప్రజల మద్దతును కోల్పోయేకొద్దీ ఇలాంటి అడ్డదారులు తొక్కడం రివాజవుతుంది. దాంతో ఈరోజు ప్రత్యామ్నాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల విజ యవాడలో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ విస్త ృత సమావేశం ఈ విషయంలో తీవ్రంగా శోధిం చింది. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యామ్నా యం మీద తీర్మానం చేసింది. అందులో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి సిపి ఎం తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం, వామపక్షాలతో కలిసి స్వతంత్ర కార్యాచరణ చేయడం, తద్వారా ప్రజలకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని, వేదికని చూపెట్టడం. ”స్వతంత్ర కార్యాచరణ” అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కింద విజయవాడ సమావేశం తీర్మానిం చింది. అదే సమయంలో ఈరోజు దేశంలో రాజకీయ బలాబలాల దృష్ట్యా వామపక్షాలు మాత్రమే తక్షణ రాజకీయ లక్ష్యాన్ని సాధించ లేవు. అందులో ప్రత్యేకించి బిజెపి, కాంగ్రెస్‌ రెండూ అధికారం కోసం కొట్లాడుతున్న సమయం లో ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలకు ఏదో ఒక వేదిక లేకుండా, అటో ఇటో చేరిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే మూడో ప్రత్యా మ్నాయానికి తగిన పరిస్థితుల్ని కల్పించాల్సిన అవసరాన్ని కూడా సమావేశం గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరలో వచ్చే ఏ ఎన్నికల్లో నైనా ఆ ఎన్నికల నాడున్న పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉండే లౌకిక ప్రాంతీయ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించింది. అలాగే పార్లమెంటు వెలుపలా, బయట కూడా ఈ పార్టీలతో సహకరించి ప్రజా సమస్యల మీద ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. తద్వారా ఒకవైపు సమస్యలపై విశాల వేదికలమీద పోరాటాలూ, మరోవైపు రాజకీయంగా సిపిఎం ఇతర వామపక్ష పార్టీల స్వతంత్రత పెంచుకోవడం- ఈ ద్విముఖ ఎత్తుగడలతో ముందుకు పోవాలని సిపిఎం విజయవాడ సమావేశంలో నిర్ణయించుకొంది. దానికోసం ఈరోజు పార్టీ కృషి సాగిస్తూ వుంది. ఈ పూర్వరంగంలో అవినీతి పాలకుల్ని ప్రజలు వదిలించుకోవాలి. దానికోసం ప్రజల్ని సంసిద్దం చేయాలి. ప్రత్యామ్నాయ విధానాల అమలు కోసం దీర్ఘకాలిక పోరాటానికి రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి సిద్ధం కావాలి.

వి. శ్రీనివాసరావు

2 వ్యాఖ్యలు

  1. Posted by Naresh on మే 26, 2011 at 12:42 సా.

    చాలా మంచి విశ్లేషణ. రాహుల్ గాంధీని భావిప్రధానిగా ప్రొజెక్ట్ చెయ్యడమే కాంగ్రేస్ వేసిన మొదటి తప్పటడుగు (అక్కడ ప్రత్యామ్నాయం కూడా లేదన్నది వాస్తవం). 30 ఏళ్ల వయసు దాటినా, ఏ రకంగానూ స్థిరపడని కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి స్థిరపరచాలన్నది తల్లిగారి కోరిక.

    తను కూడా ఎంతసేపూ మీడియాలో కనపడటానికి చూపించిన శ్రద్ధ తన ఆలోచనా విధానాన్ని, భవిష్యత్‌కార్యాచరణనీ ప్రజలకు విశదీకరించడంలో లేదనిపిస్తుంది. అది ప్రజామోదయోగ్యంగా వుంటుందన్నదీ నాకు అనుమానమే.

    స్పందించండి

  2. Posted by Pradeep on మే 26, 2011 at 1:35 సా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: