కుంభకోణాల భారతం

2జి స్పెక్ట్రం(సెల్‌ఫోన్‌ తరంగాలు)కు సంబంధించి 1.76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం పార్లమెంట్‌ను స్తంభింపచేసింది. విచారణకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని మొత్తం పార్లమెంట్‌ శీతకాలపు సమావేశాలను పాలకపక్షం మినహా మిగతా పక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి స్తంభింపజేశాయి. తిరిగి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సంద ర్భంగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయ డానికి అంగీకరించింది ప్రభుత్వం. సంస్క రణల అనంతరం భారతదేశంలో లక్షల కోట్ల రూపాయల్లో కుంభకోణాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల్లో కుంభకోణాలపై చర్చ జరుగుతున్నది. కుంభకోణాలు విచారణకు రాకుండా పాలకవర్గాలు వక్రమార్గం పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కామన్‌వెల్త్‌ ఆటల సందర్భంగానూ, కార్గిల్‌ మృతవీరుల కుటుం బాల కోసం చేపట్టిన ఆదర్శ్‌ విల్లాల నిర్మాణం లోనూ, ఎస్‌ బాండ్‌ (ధ్వని తరంగాల) వేెలం పాటల సందర్భంగా కుంభకోణాలు జరిగినట్లు దేశ వ్యాపితంగా చర్చ సాగుతున్నది. చివరకు ఐపిఎల్‌ క్రికెట్‌ పోటీల్లో కూడా కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. వామపక్ష పాలిత రాష్ట్రా ల్లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచుస్తున్నాయి. జార్ఖండ్‌ మంత్రి మధుకోడా గనుల కుంభకోణంలో ప్రస్తుతం జైల్లో ఉండి విచారణ ఎదుర్కొంటు న్నాడు. మధుకోడా లాంటి వారు ప్రతి రాష్ట్రం లో పాలకవర్గంలో కొనసాగుతున్నారు.

కుంభకోణాలు చోటుచేసుకోడానికిగల ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమై ఉన్నాయి. అందులో సంస్కరణలు వచ్చిన తరువాత కుంభకోణాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం, ఆరోగ్యశ్రీ, ఇర్రిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు, రహదారుల నిర్మాణం, ఔటర్‌ రింగురోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మా ణం, భూసేకరణ సందర్భంగా కుంభకోణాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలలో ప్రముఖుల పాత్ర, సహకార బ్యాంకులలో వందలకోట్ల డిపాజిట్లు కాజేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిం చిన రాయితీ పథకాల్లో నగంగా సాగుతున్న కుంభకోణాలు…. వీటి బాధ్యుల్లో అత్యధిక శాతం పాలకపక్షంలోనే కొనసాగుతున్నారు. కుంభకోణాలతో వేలకోట్లు ఆర్జించి వ్యాపారాలు వెలగబెట్టడంతో బాటు రాజకీయ రంగంలో కూడా ఎన్నికవుతున్నారు. వీరిపై ఎలాంటి అనర్హతా పడడం లేదు.

మనదేశంలో కుంభకోణాల చరిత్ర ఈనాటిది కాదు. ఆంగ్లేయుల కాలంలో జరిగిన అవినీతి కార్యక్రమాలకు బ్రిటీష్‌ పార్లమెంటు చర్చించి బాధ్యులను శిక్షించిన ఘటనలు చరిత్రలో చూశాం. కాని 1947 స్వాతంత్య్రా నంతరం జరిగిన కుంభకోణాలు పాలక వర్గాల కనుసన్నలలో జరిగినవే. నేడు క్రోనీ క్యాపిటలిజం కొనసాగుతున్నది. అందువల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ నడకే ఒక పెద్ద కుంభకోణంగా మారి పోయింది.

చరిత్ర

1957లో ”ముంద్రా” కుంభకోణం నెహ్రూ హయాంలోనే బయట పడింది. ముంద్రా అన్న పెద్ద మనిషి విద్యుత్‌ పరికరాల వ్యాపారి. అతని ఆస్తి రూ 1 కోటీ 50 లక్షలు కాగా అప్పులు 5 కోట్ల 25 లక్షలు. అతను తన అప్పులు తీర్చు కోడానికి తన కంపెనీలో వాటా షేర్లను జీవిత భీమాసంస్థ కోనుగోలు చేసేట్లూ, ప్రతిగా తనకు కోటి రూపాయలు అప్పు ఇచ్చేట్లూ నాటి జీవిత భీమా సంస్థ ఛైర్మన్‌ జిఆర్‌ కామత్‌తోనూ, ఆర్థిక మంత్రి టి. కృష్టమాచార్యులుతోనూ కుమ్మకై కుంభకోణానికి పాల్పడ్డారు. ఫిరోజ్‌గాంధీ ఈ కుంభకోణాన్ని బయటకు లాగి పార్లమెంట్‌ను ఆశ్చర్యం – ఆందోళనలో ముంచెత్తారు. ఈ అవకతవకలను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్‌ వారికి విరాళం ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అప్పుడు ప్రారంభమైంది భారతదేశంలో కుంభ కోణాల పర్వం.

తరువాత 1971 మే 24 తేదీన నగర్వాల ఉదంతం (కుంభకోణం) పెద్ద సంచలనం రేపిం ది. ఇందిరా గాంధీ హయాంలో ఢిల్లీలో పార్ల మెంట్‌ వీధిలోని స్టేట్‌బ్యాంకు బ్రాంచీలో పని చేస్తున్న క్యాషియరు నగర్వాలాకు పరిచయమైన ప్రధాని ఇందిరాగాంధీ గొంతు లాగా రూ.60 లక్షలు కోరినట్లు ఫోన్‌ వచ్చింది. కొరియరు వచ్చి డబ్బు తీసుకొని, ప్రధాని ఇంటికి వెళ్ళి రశీదు తీసుకొమ్మన్నాడు. నగర్వాలా ప్రధాని ఇంటికి వెళితే ఆమె పార్లమెంట్‌కి వెళ్ళిందన్నారు. ప్రధాని కార్యదర్శి మేము ఫోన్‌ చేయలేదని రశీదు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నగర్వాలాను అరెస్టు చేశారు. రూ. 6 వేలు తప్ప మిగతా పైకం అంతా స్వాధీనం చేసుకు న్నారు. కేసు అంగీకరించిన నగర్వాలాకు నాలు గు సంవత్సరాల జైలు శిక్షపడింది. కేసు పునర్వి చారణ జరుగుతుండగా నగర్వాలా గుండె జబ్బుతో మరణించారు. ఒక క్యాషియర్‌ గతంలో ఎలాంటి సంబంధం లేకుండా ఇంత డబ్బు ఏలా ఇవ్వగలిగాడు అన్న విషయం పార్లమెంటు లో చర్చకు వచ్చింది. కాని తరువాత కేసు మూసివేయబడింది.

జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును తిరిగి విచారించడానికి జస్టిస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని నియమించారు. ఫోన్‌ కాల్‌ మీద 60 లక్షల సొమ్మును ఒక సామాన్య క్యాషియర్‌ ఇస్తారా? అలా ఇచ్చాడు అంటే గతంలో ఈ విధంగా ఎన్ని సార్లు ఇచ్చాడు. నగర్వాలా మరణం సహజమైనదా? ఈ విషయా లన్నీ పరిశీలన లేకుండానే కేసు ముగిసింది.

ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్‌ రహమాన్‌ అంతూలే ‘ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్ఠాన్‌’ పేరుతో ట్రస్టు ఏర్పరచి కుంభకోణానికి పాల్పడ్డారు. 1980లో జపాన్‌కు చెందిన ”కువో” అయిల్‌ కంపెనీ భారత్‌కు పెట్రోల్‌, డిజీల్‌ టెండర్లపై రూ. 9 కోట్ల కుంభ కోణానికి పాల్పడింది.

వీటన్నింటినీ మించినది బోఫోర్స్‌ కుంభ కోణం. స్వీిడన్‌ నుండి ఒక్కొక్కటీ రూ. 1,700 కోట్ల వ్యయంతో నాలుగు వందల హౌవిట్జర్‌ శతఘ్నులు కొనుగోలు చేసిన సందర్భంగా కుంభకోణం జరిగింది. 1986 ఏప్రిల్‌ 16న స్వీడన్‌ రెేడియో ఈ ముడుపుల వార్తను ప్రకటిం చింది. ఇందులో రాజీవ్‌గాంధీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2010 వరకు విచారణ సాగింది. ఇందులో బోఫోర్స్‌ మాజీ అధ్యక్షుడు, విన్‌ చద్దా, జెడి హిందూజాతో సహా 14 మందిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. కమిషన్‌ ఏజెంట్లకు రూ. 64 కోట్లు ముట్టే అవకాశం ఉన్నట్లు విచారణ అంశాలలో ఉంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఇటలీ ఆయుధ వ్యాపారి అట్టావో ఖత్రోకి పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అతనిని భారతదేశం తీసుకు రావడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం రు.250 కోట్లు వ్యయం చేసింది. కాని ఆ పని జరగలేదు. విసిగిపోయిన భారతీయ అధికారులు అతనిని భారత్‌ రప్పించడం కష్ట సాధ్యమని 2011 మార్చి 5న కేసును మూసి వేశారు. ఇటలీ బహుళజాతి సంస్థలు రాజీవ్‌ గాంధీ హయాంలో తమ అక్రమ వ్యాపారాలను విస్తరించుకొని లాభాలార్జిం చాయి. నేటికీ ఇటలీ వ్యాపార సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.

1992 మార్చిలో సెక్యురిటీ కూపన్‌ ధరలు పెరిగిన సందర్భంలో హర్షద్‌మెహత కుంభ కోణం బయటపడింది. రూ. 649 కోట్ల సెక్యురిటీలు బకాయి పడ్డారు. 1992 ఏప్రిల్‌ 13-24 మధ్య రూ. 620 కోట్లు బ్యాంకులకు చెల్లించారు. ఇంత మొత్తాన్ని ఒకేసారి ఎలా చెల్లించగలిగాడు అన్నది చర్చనీయాంశం అయిం ది. ఆ సందర్భంగా కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసిన అనేక మంది దివాలా తీశారు. రూ. 3,000 కోట్ల అవకతవకలకు సంబంధిం చిన పత్రాలతో నరోత్తం, హితేన్‌ దళాల్‌కు ప్రధాన పాత్ర ఉన్నట్లు సిబిఐ విచారణలో తెలింది. 1992 జూన్‌లో పార్లమెంట్‌ సభ్యులు రాం నివాస్‌ మీర్ధా నాయకత్వాన సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. కొందరికి చిన్న, చిన్న శిక్షలు పడ్డా వేలాది మంది వాటాలు కొని దివాళా తీసారు.

రైల్వే శాఖా మంత్రి జాఫర్‌ షరీప్‌ కాలం లో (1991) స్విట్జర్లాండ్‌ నుండి 6,000 హెచ్‌పి సామర్థ్యం గల 30 రైల్‌ ఇంజన్లు కొనుగోలు కుంభకోణం చోటు చేసుకుంది.

‘ఇస్కో’ను (ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీిల్‌ కంపెనీ) ప్రైవేటీకరించేందుకు 1992 జూలై 11న కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ప్రపంచ వ్యాపిత టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఎంపికలో కుంభకోణం జరిగింది.

సంస్కరణల పేర ప్రభుత్వ రంగ సంస్థలోని వాటాల విక్రయాలకుగాను కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఒక పెట్టుబడుల ఉపసంహరణ (డిస్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌) మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. ఈ వాటాల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఎసి), కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)లు తమ నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. రూ. 3,442 కోట్ల నష్టం జరిగినట్లు 1993 జూలై 18న పీపుల్స్‌ డెమోక్రసీ పత్రిక వెల్లడించింది. కొచ్చిన్‌ రిఫైనరీస్‌ లిమిటెడ్‌, అలహదాబాద్‌ బ్యాంకుతోపాటు మరో 8 సంస్థలు ఇందులో ఉన్నాయి. లాబాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అప్పనంగా, అతి తక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీల పరంచేశారు. నాల్‌కొ, బాల్‌కొ లాంటి అల్యూమినియం సంస్థలను కూడా ఇదే గతిపట్టించారు.

దేశంలో నవరత్నాలుగా పేరుపొందిన ప్రభుత్వ రంగ సంస్థలు:1) భారత్‌ హెవీ ఎల క్ట్రికల్స్‌ లి, 2) భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి, 3) గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లి, 4) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లి, 5) హిందూ స్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి, 6) మహా నగర్‌ టెలికం లి, 7) ఇండియన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి. (ఇందులో రియలన్స్‌ కంపెనీకి ఎక్కువ వాటాలు అమ్మారు.) 8) నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లి, 9) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లి. విదేశ్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (సంస్థలలోని వాటాలను టాటా వారికి అతి తక్కువ రేట్లకు అమ్మకాలు చేశారు.)

వీటన్నింటినీ మించినది హవాలా కుంభ కోణం. విదేశీ మారకం కావల్సిన వారు చట్టబద్దంగా కాకుండా బ్లాక్‌ మార్కెట్లలో రూపాయలను విదేశీ ధనంలోకి మార్చడానికి సంబంధించిన హవాలా కుంభకోణంలో అనేక మంది కేంద్ర మంత్రులకు సంబంధం ఉన్నట్లు విచారణలో తెలింది.1991 మార్చి 25వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈకుంభకోణంలో జైన్‌ సోదరులు ప్రధాన పాత్ర వహించగా భారత మాజీ ప్రధాని పి.వి నరసింహారావు తోపాటు రాజీవ్‌గాంధీ, భజన్‌లాల్‌, ఎల్‌కె అద్వా నీ, మదన్‌లాల్‌ ఖురానా, ఆర్‌కె ధావన్‌ల తోపాటు మెజారిటీ కేంద్ర మంత్రులకు ఈ కుంభకోణంలో ముడుపులు ముట్టినట్లు వెల్లడైంది. ఈశాన్య భారతదేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో రూ. 63 వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ సాక్ష్యాలతో సహా ప్రభు త్వం దృష్టికి తెచ్చాడు. ఆరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ. 4 లక్షల కోట్లు విలువైన పేరులేని జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చి అక్కడి కాంగ్రెస్‌ నేతలు లబ్దిపొందారు.

ఆదర్శ్‌ కుంభకోణం: కార్గిల్‌ యుద్ధం తరు వాత 1999లో మహరాష్ట్రలో ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీని స్థాపించారు. దీనికింద ఇళ్ల నిర్మాణం ఒక కుంభకోణంగా మారింది. ఇందులో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఉన్నతా ధికారుల హస్తమున్నట్లు రుజువులు దొరికాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రులైన అశోక్‌ చావన్‌తో పాటు విలాస్‌రావు దేశ్‌ముఖ్‌, సుశీల్‌కుమార్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి నారాయణ రాణే భాగస్వాములుగా ఉన్నారు. కార్గిల్‌ యుద్ధంలో మరణించిన అమర వీరుల కుటుంబాల కోసం నిర్మాణం గావించిన 31 అంతస్థుల భవనంలో ఫ్లాట్ల కేటాయింపులలో ఈ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. రూ. 10 కోట్లు విలువగల విల్లాలను రూ. 60-70 లక్షలకు లోపు విలువ లకు అక్రమార్కులకు కట్టాబెట్టారు. ఆదర్శ్‌ సొసైటీ సభ్యులకు విక్రయించిన ఫ్లాట్లలో ఒకటి కూడా యుద్ధ వీరుల భార్యలకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ కేటాయించలేదు. విచారణ కొనసాగుతూనే ఉంది.

ఐపిఎల్‌ కుంభకోణం: క్రికెట్‌ ఆటలకోసం ఏర్పాటు చేసిన ఐపిఎల్‌ సంస్థలో కుంభకోణం చోటు చేసుకున్నది. దీనిపై వచ్చిన ఆరోపణలతో కేంద్ర మంత్రి శశి థరూర్‌ రాజీనామా చేశారు. ఆటల టీములను వేలానికి పెట్టారు. ఒక్కొక్క టీము 1,500 కోట్ల ధర పలికింది. ఈ వేలం లో చాలా మంది బినామీ పేర్లతో పాల్గొని వందల కోట్లు సంపాదించారు.

చక్కెెర కుంభకోణాలు: 1993లో భారత ఆహార సంస్థ కోర్కె మేరకు 6 లక్షల టన్నుల చక్కెర దిగుమతి కోసం రూ. 300 కోట్ల విలువ గల గ్లోబల్‌ టెండర్‌లను పిలిచాడు. నాటి ఆహార శాఖా మంత్రి కల్పనాథ్‌ రారు చక్కెర మిల్లు యజమానుల ప్రయోజనాలను కాపాడడానికి టెండర్లు పిలిచినా ఆహార శాఖ కార్యదర్శి అశోక్‌ చంద్రసేన్‌ను మందలించి దిగుమతులు జరుగకుండా అడ్డు పడ్డాడు. దిగుమతును అడ్డు కోవడం ద్వారా మంత్రి మిల్లు యజమానులతో కుమ్మక్కయ్యాడు. స్థానికంగా చక్కెర ధర కిలో రూ.1.75 పెంచడం వల్ల ప్రజలపై రూ. 230 కోట్ల భారం పడింది. తిరిగి 2010లో కేంద్ర వ్యవసాయశాఖా మాత్యులు శరద్‌పవార్‌ నేతృత్వంలో దేశీయ పంచదారను కిలో రూ. 14 చొప్పున ఎగుమతి చేసి రూ. 28ల చొప్పున దిగుమతులు చేసుకున్నారు. ప్రతి ఎగుమతి- దిగుమతి సందర్భంగా కుంభకోణాలు కొనసా గుతూనే ఉన్నాయి.

బిజెపి నేతృత్వంలో జరిగిన కుంభ కోణా లు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.

ఆమరావతి లేఅవుట్‌లో ముఖ్యమంత్రి కుమారులు, అల్లుళ్లకు రూ. 15 కోట్ల విలువైన భూమిని కేవలం కోటి రూపాయలకే కట్టాబెట్టారు. బాణశంకరిలో రూ.175 కోట్ల విలువైన భూమిని తన కుమారులు భాగస్వాములుగా ఉన్న సంస్థకు డినోటిఫై చేశారు. ఒక పారిశ్రామిక లే అవుట్‌లో తన కుమారులు, అల్లుళ్ళు డైరెక్టరుగా ఉన్న ఫ్లూయిడ్‌ పవర్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు, అది ఏర్పడిన కేవలం 15 రోజులకు 2 ఎకరాలు కేటాయించాడు. దాని విలువ రూ.8.5 కోట్లు. కాని వారు చెల్లించింది మాత్రం రూ. 84 లక్షలు. బెంగుళూరుకు 55 కిమీ దూరంలో ఒక బిపిఓ స్థాపించడానికి ఎడ్యూరప్ప తన కుమారైకు 2 ఎకరాలు కేటాయించారు. దానికి చెల్లించింది రూ.40 లక్షలు. కాని దాని విలువ రు. 2కోట్లు. ఆమెకే బెంగుళూరులో నిబంధనలకు విరుద్ధంగా ఒక నివాస స్థలాన్ని కూడా కేటాయించారు. ఆయన తన చెల్లెలికీ, మేనల్లునికీ రూ.5 కోట్ల విలువైన స్థలాలను కట్టబెట్డారు. మరొక వ్యవహారంలో రూ.181 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌కు నామమాత్రపు ధరకు విక్రయించారు. దానిలో రూ.39 కోట్ల విలువైన భూమిని ఆయన కుమారుడు నిర్వహిస్తున్న కంపెనీలో భాగస్వాములుగా ఉన్న వారికి కేవలం రూ. 3 కోట్లకు అమ్మారు. రూ.13 కోట్ల విలువైన 2.05 ఎకరాల మరొక ప్లాటును కేవలం రూ. 2.20 కోట్లకు విక్రయించారు.

ఇన్ని కుంభకోణాలు బయటపడ్డ తర్వాత సైతం కర్ణాటక ముఖ్యమంత్రిగా తనకు అధి ష్టానం ‘ఆశీస్సులు’ ఉన్నాయని గర్వంగా చెప్పు కుంటున్నారు ఎడ్యూరప్ప.

దేశ స్థాయిలో టెలికంలో 2జి స్పెక్ట్రం 1లక్షా 76 వేల కోట్ల కుంభకోణం, ఎస్‌.బాండ్‌ వేలంలో జరిగిన 2 లక్షల కోట్ల కుంభకోణాలు సర్వే సర్వత్రా తెలిసినవే.

రాష్ట్రంలో కుంభకోణాలు

1998 నుండి 2004 వరకూ మన రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు:

1) నకీలీ స్టాంపుల కుంభకోణం రూ. 5 వేల కోట్లు. 2) అర్ధంతరంగా మూసివేసిన అర్బన్‌ బ్యాంకుల డిపాజిట్ల కుంభకోణం 2 వేల కోట్లు. 3) నీరు – మీరు పథకంలో 1,600 కోట్లు. 4) వాటర్‌ షెడ్‌ పథకంలో 2,000 కోట్లు. 5) పనికి ఆహారం పథకంలో 560 కోట్లు. 6) ప్రభుత్వ సంస్థల అమ్మకం 400 కోట్లు. 7) మద్యం అక్రమాలు 600 కోట్లు. 8) సోమశీల భూముల కుంభకోణం 112 కోట్లు. 9) స్కాలర్‌ షిప్‌ అవినీతి 100కోట్లు. 10) ముఖ్యమంత్రి సహయ నిధి 10 కోట్లు. 11) విజయవాడ సిమెంట్‌ ఫ్యాక్టరీ స్థలం 50 కోట్లు. 12) టూరిజం స్థలాలకు 350 కోట్లు. 13) మదా పూర్‌ రహెజా భూముల కుంభకోణం 50 కోట్లు. 14) ఏలేరు భూములు కుంబకోణం 100 కోట్లు. 15) టైమర్ల కుంభకోణం 30 కోట్లు. 16) సింహచలం భూములు 144 ఏకరాలు.

మొత్తం రూ.12,367 కోట్లు కుంబకోణాలు చోటు చేసుకున్నాయి.

నాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రిచెన్నా రెడ్డి ఏకంగా చందాలరెడ్డిగా ప్రసిద్ది కెక్కారు. మరో మాజీ ముఖ్యమంత్రి జనార్ధన్‌రెడ్డి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని లక్ష్మీ పురం గ్రామం రాజుపాలెంలో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలు కలిగిన 60 ఎకరాల మిగులు భూమిని తమ కుమారుడు రాం కుమార్‌ రెడ్డికి చెందిన ఆక్రోఫోలాన్‌, రీటా ఇండిస్టియల్‌ కార్పోరేషన్‌, ఉపేంద్ర గ్రానైట్స్‌, పల్లరా గ్రానైట్స్‌ సంస్థలకు నామమాత్రపు కౌలుకు కట్టబెట్టారు. 1990 అక్టోబర్‌ 10న కడపజిల్లా మంగం పేట బైరైటీస్‌ గనుల తవ్వకానికి నెలకు 34,000 టన్నుల ముడి ముగ్గురాయి తవ్వకానికి ప్రయాక్స్‌ కంపెనీ ఇండియన్‌ బైరైటీస్‌ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ది సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుం బం కీలకంగా ఉంది. రాష్ట్రంలోని ఏ ముఖ్య మంత్రీ కుంభకోణాలకు దూరంగా లేరు.

2004 మేలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ హయాంలో వేలాది కోట్ల కుంభకోణా లు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డెరెక్టర్‌ ధనుంజయ ‘రాజీవ్‌ ఉద్యోగ శ్రీ’ పేర ముడుపులు వసులు చేశారు. సత్యం కంపూటర్స్‌ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్ప డింది. అనంతపురంలో వేరుశనగల విత్తనాల పంపిణిలో కుంభకోణం, మిక్సింగ్‌ ప్లాంట్లకు సబ్సిడీ ఎరువులను సరఫరా సంఘటన, ఎంఆర్‌ ప్రాపర్టీస్‌ భూముల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఓబుళాపురం మైన్స్‌, బయ్యారం మైన్స్‌ (1.40 లక్షల ఎకరాలు) నుండి వేల కోట్ల రూపాయల ఖనిజ సంపద విదేశాలకు తరలిపోయింది. గాలి జనార్థన్‌ రెడ్డి సోదరులు (కర్ణాటక బిజెపి ప్రభుత్వంలో మంత్రులు) ముఖ్యమంత్రి బంధువు పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఇందిరమ్మ ఇళ్ళలోనూ, ఉపాధి హామీ పథకంలోనూ, ఆరోగ్యశ్రీ అమల్లోనూ పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంది. సహకార సంస్థల్లో వేల కోట్ల రూపాయలు పాలక వర్గాలు కాజే శాయి. చివరకు సర్వశిక్షా అభియాన్‌ (అందరికి విద్య)లో మాజీ ముఖ్యమంత్రిని నిరంతరం వెన్నంటి ఉండే వ్యక్తి కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడు. మత్స్య శాఖలో ఇంజనీరు ఎలుగు బంటి సూర్యనారాయణ పాల్పడిన కుంభకోణం నేటికీ పరిష్కరించబడలేదు. నెల్లూరు జిల్లాలోని కిసాన్‌ సెజ్‌కు సంబంధించి 2,776 ఎకరాల భూముల సేకరణలో రైతుకు రూ. 40 వేలు ఇచ్చి ఎకరాకు రూ. 40 లక్షలు యాజమాన్యం కోరుతున్నది. వాస్తవానికి ఇప్పుడు ఎకరాకు రూ. 20 లక్షల ధర పలుకుతున్నది. 1993లో ఈ భూముల సేకరణ జరిగింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు, అల్లూరు, దగదర్తి మండలలో భూ సేకరణ జరిగింది.

ఎపిఐఐసి కొనుగోలు చేసిన భూములను నామమాత్రపు ధరలకు కంపెనీలకు కట్టబెట్ట టంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది.

అవినీతి-కుంభకోణాలపై విచారించి చర్యలు తీసుకోవడానికి సిబిఐ, స్పెషల్‌ బ్రాంచ్‌, అవినీతి నిరోధక శాఖ ఇంకా ప్రతీ ప్రభుత్వ శాఖల్లో విజిలెన్స్‌ వ్యవస్థలు ఉన్నప్పటికీ కుంభ కోణాలు జరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా సంస్కరణల అనంతరం భూకుంభ కోణాలు వేల కోట్లలో సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు పేదరైతులనుండి సేకరిస్తు న్నది. ఇందులో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. చివరికి ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణంలో కూడా ”గ్రీస్‌ ఆన్‌ వీల్స్‌” మరియు ”కిక్‌-బ్యాక్స్‌” పేర అవినీతిని పాలక వర్గాల్లోనే ప్రోత్సహిస్తున్నారు.

దేశంలో నేడు జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలపై జరుపుతున్న విచారణలన్నీ ఫలితాన్ని సాధిస్తాయని చెప్పలేం. ఎందుకంటే కుంభకోణాలు చేస్తున్నది పాలకవర్గాలే, అధికార పక్షమే గనుక. ప్రజలు చైతన్య వంతులై ఎదిరించ నంత కాలం అవినీతి – కుంభకోణాలు కొనసా గుతూనే ఉంటాయి. ఇందుకుగాను అవినీతికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడమే మన కర్తవ్యం.

సారంపల్లి మల్లారెడ్డి

2 వ్యాఖ్యలు

  1. Posted by krishna on మే 30, 2011 at 8:38 ఉద.

    కష్టం బాసు దేశం బాగుపడటం మనకు ఏదైనా లాబం వచ్చే కుంబకోణం పేరు చెప్పు మనంకూడా ఒక చెయ్యి వేద్దాం ఏమంటావ్

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: