Archive for జూన్ 4th, 2011

అమ్మో !… కీర !!

  • ఐరోపాలో ‘ఇ.కొలి’ బాక్టీరియా

మా ఆహార, వస్తు ప్రమాణాలే వేరు అంటూ వర్ధమాన దేశాల ఉత్పత్తులను తక్కువ చేసి చూసే ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు తమ దేశాల్లో పండిన కీర(దోసకాయలు), టమాటాలు, కాబేజిని చూస్తే అల్లంత దూరం ఉండమని తమ పౌరులకు చెబుతున్నాయి. మోన్‌శాంటో, బేయర్‌ వంటి బహుళజాతి గుత్త సంస్థలు తమ లాభాలకోసం జన్యుమార్పిడితో తయారు చేస్తున్న విత్తనాలు, మొక్కల కారణంగా ఇప్పటివరకు జీవరాశులకు ఎలాంటి హాని చేయని బాక్టీరియా కూడా ప్రాణాలు తీసే శక్తిని సంతరి0చుకుంటున్నది. కారణాలేమిటో ఇంకా వెల్లడి కాలేదుగాని ఇప్పుడు ఐరోపా, అమెరికా, జపాన్‌లను వణికిస్తున్న ‘ఇ.కొలి’ బాక్టీరియా అటువంటి ప్రభావాన్నే చూపుతోంది.

మానవ, జంతువుల జీర్ణవ్యవస్థలలో హాని కలిగించని అనేక బాక్టీరియాలలో ‘ఇ.కొలి’ ఒకటిగా ఇప్పటివరకు పరిగణిస్తున్నారు. అయితే వీటిలో షెర్చియా కొలి అనే రకం షిగా టాక్సిన్‌ అనే విషపదార్ధాన్ని విడుదల చేస్తుంది. ఇది  అతిసార  కలిగిస్తుంది. మరీ ఎక్కువైతే జీర్ణవ్యవస్థలోని ఎర్ర రక్తకణాలను దెబ్బతీసి చివరకు కిడ్నీ వైఫల్యానికి కారణం అవుతుంది. నరాల వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘హెచ్‌యుఎస్‌’ అంటారు. ఇది ప్రపంచ వ్యాపితంగా ఉంది.  అయితే జర్మనీలో తీవ్రంగా ఉందని గతంలో ఎప్పుడూ వెల్లడికాలేదని స్వీడన్‌లోని వ్యాధినిరోధక, అదుపు కేంద్రం పేర్కొన్నది.

ఇది అంటు వ్యాధి కాదు. అయితే ఒకసారి ఈ వ్యాధి సోకినవారు చేసిన వంటను ఇతరులు తింటే వారికి కూడా సోకే అవకాశం ఉంది. ఇది సాధారణంగా చేతులు సరిగ్గా కడుక్కోని పిల్లల్లో మాత్రమే ప్రభావం చూపుతుందని ఇప్పటివరకూ తెలుసు. కానీ, ఇప్పుడు పెద్దవారిలో, అందులోనూ మూడింట రెండువంతుల మంది మహిళ్లో కనిపించటం, మరణాలకు దారితీయటం శాస్త్రవేత్తలకు అంతుబట్టటం లేదు. ఇది ఇంతకు ముందు కనిపించని కొత్త తరహా ప్రమాదకరమైన విష బాక్టీరియా అని చైనా, జర్మన్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

జర్మనీలో ఈ ఏడాదిలో ఇది రెండో వైపరీత్యం. జనవరిలో గుడ్లు, కోళ్లు, పందిమాంసం విషపూరితం అయి జనాన్ని భయపెట్టింది. ఇది తమ దేశంలోకూడా వ్యాపించే అవకాశం ఉందని అమెరికా భీతిల్లుతోంది. ఎందుకుంటే ఇక్కడ కూడా ఆహార పదార్ధాల్లో కల్తీ, ప్రమాణాలను గాలికి వదలటం వంటి ఉదంతాలున్నాయి.  ముందు జాగ్రత్తగా ఐరోపా నుంచి దిగుమతి అయిన ఆహార పదార్ధాలను అమెరికాలో పరీక్ష చేస్తున్నారు. అమెరికాలో 1993లో ఇ.కొలి 0157:హెచ్‌7 అనే బాక్టీరియా ఒక బడా సంస్థ దుకాణాల్లో అమ్మిన కల్తీ మాంసం కారణంగా వ్యాధులను కలిగించింది. తరువాత 2006లో పాలకూరతో ఈ సమస్య తలెత్తింది.

ఇప్పుడు ఐరోపాను బెంబేలెత్తిస్తున్న బాక్టీరియా ఇంతవరకు 1,600 మందికి వ్యాధిని కలిగించగా 18 మంది మరణించారు. వ్యాధిగ్రస్తులలో ఐదువందల మందికి కిడ్నీ సమస్య తలెత్తింది. అమెరికాలో కొన్ని రకాల ఇ.కొలీస్‌ బ్యాక్టీరియా ఏడాదికి లక్షా పన్నెండువేల మందిలో స్వల్ప వ్యాధులను కలిగిస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు జరపకుండానే స్పెయిన్‌ నుంచి వచ్చిన కీర దోసకాయలతో వ్యాధి వచ్చిందని ముందు ప్రకటించారు. తీరా వ్యాధికి అవికారణం కాదని జర్మన్‌ శాస్త్రవేత్తలు ప్రకటించటంతో తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని స్పెయిన్‌ డిమాండ్‌ చేసింది. స్పెయిన్‌ నుంచి కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి. తమ రైతులు కూడా నష్టపోయారని హంగరీ, నెదర్లాండ్స్‌, గ్రీస్‌,ఐర్లండ్‌ ప్రతినిధులు ఐరోపా యూనియన్‌ సమావేశంలో ఫిర్యాదు చేశారు. నష్ట పరిహారం చెల్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, జపాన్‌,ఆస్ట్రియా, స్పెయిన్‌, స్విట్జర్‌లాండ్‌, అమెరికాలో ఈ వ్యాధి బయట పడింది. వ్యాధిగ్రస్తులలో ఎక్కువ మంది జర్మనీకి వచ్చి వెళ్లిన వారు లేదా జర్మనీ నుంచి వెళ్లిన వారి ద్వారా సంక్రమించినట్లు చెబుతున్నారు. బాక్టీరియాను గుర్తించేందుకు వారం రోజుల పాటు జరిపే కల్చర్‌ పరీక్షను రెండు రోజులకు కుదించేందుకు రోమ్‌ కృషి చేస్తోంది. కొన్నిదేశాలు కీరా, టమాటా, క్యాబేజీ అమ్మకాలను నిషేధించాయి. ఇదొక అసాధారణ బాక్టీరియా,  గతంలో రోగులనుంచి దీనిని వేరు చేసి చూడలేదని ప్రపంచ ఆహార సంస్థ ఆహార భద్రత నిపుణుడు హైల్డ్‌ క్రుస్‌ వ్యాఖ్యానించారు. అనేక లక్షణాలు కలిగి ఉన్న కారణంగానే  విషపదార్దాలను విడుదల చేస్తున్నదన్నారు.

అయితే అమెరికా ఆహార సంబంధ వ్యాధుల నిపుణుడు రాబర్ట్‌ టాక్సీ 1990 దశకంలో ఇలాంటి బ్యాక్టీరియా దక్షిణకొరియాలో బయటపడిందంటున్నారు.