ఇచ్చట లంచాల గడ్డి మేయబడును

ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు రిజిస్ట్రారు కార్యాలయంలో ఇదీ సంగతి

దేశంలో అవినీతి విశ్వరూపం దాల్చిందంటే కాబోలనుకున్నాను. పేరున్న పెద్దలు హస్తిన వేదికగా నిరసనలు తెలుపుతుంటే మంచిదే కదా అని నాలో నేనే అనుకున్నాను.
అయితే ఇటీవల నేను వారసత్వ స్థిరాస్తిని రిజిస్ట్రేషను చేయించేందుకుగాను ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు కార్యాలయానికి వెళ్లినప్పుడు అవినీతి విశ్వరూప సందర్శన జరిగింది.
మేము ఇద్దరం అన్నదమ్ములం. పదెకరాల మా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పంచుకోవాలనుకున్నాం. అయితే పూర్వంలా ఇప్పుడు ఊరకూరకే పంచేసుకుంటే లాభం లేదని కొందరు తెలిసినవాళ్లు చెవినేశారు. పంచుకున్న ఆస్తుల్ని ఎట్లా పంచుకున్నారో? ఎంతెంత పంచుకున్నారో? వాటికి నాలుగు దిక్కుల ఎవరెవరున్నారో? అలాంటి అలాంటి సమాచారాన్ని సమగ్రంగా రిజిస్ట్రారు కార్యాలయంలో రాసేసుకుంటనే ప్రభుత్వం గుర్తిస్తుందంట. రెవెన్యూశాఖ పాస్‌ పుస్తకాల్ని జారీ చేయాలన్నా, పంచాయతీవాళ్లు మా పేర్లమీద పన్ను రశీదులు ఇవ్వాలన్నా రిజిస్టరు చేసుకోవలసిందేనని నమ్మబలికారు. సరే, చేసేదేముంది. ప్రభుత్వానిదే పై చేయి కదా! వ్యక్తులు చట్టాలను అమలు చేయటం తప్ప మార్గం ఏముంది. బ్యాంకుల నిండా లచ్చుమ్మోరు మూలుగుతుంటే ఒప్పుల్ని తప్పులు చేసి, తప్పుల్ని ఒప్పులు చేసేయొచ్చనుకోండి. అది వేరే విషయం. సరేగదాని మా తమ్ముడితో సహా వెళ్లి అమ్మనబ్రోలు రిజిస్ట్రారును కలిసి ”నేను ఫలానా…., హైద్రావాద్‌లో పాత్రికేయుడిగా వెలగబెడుతున్నాను. గత ఇరవై ఏళ్లుగా మీడియాలో ఉన్నా అక్రమంగా పైసా సంపాదించలేదు. కాబట్టి మీకు కూడా అక్రమంగా పైసా కూడా ఇచ్చుకోలేను. దయచేసి నా పనిని చేసిపెట్టండి. అట్టని మీరు నా పనిలో దారి తప్పి చేయమని నేను అడగనే అడగను.” అని సదరు రిజిస్ట్రారు మౌలాలిని కలిసి విన్నవించుకున్నా. ఆయన ఏ కళనున్నాడోగానీ నా పని చేయమని సిబ్బందిని ఆదేశించాడు. అబ్బో నేను పాత్రికేయుడిని కాబట్టి … ఎందుకొచ్చిన గొడవలే అనుకుని రిజిస్ట్రారు నా పని చేయిస్తున్నాడనుకుని నేను తబ్బిబ్బయ్యాను చాలాసేపు. అందులోనూ మరి కొద్ది రోజుల్లోనే ఉద్యోగ విరమణ చేయనున్నందున రిజిస్ట్రారు దొరికినకాడ దొరికనట్లుగా తెగ మేసేస్తున్నాడని కార్యాలయం ముందు చేరిన గుంపులో చర్చ జరుగుతుండగా విని … ‘అబ్బో పెద్ద లంచగొండికి ఏ నజరానా ఇవ్వకుండా పనిచేయించుకుపోతున్నానన్నమాట” నన్ను నేనే పదేపదే అభినందించుకున్నాను కూడా. ఇదంతా జరుగుతుండగానే సిబ్బంది కాగితాలు మీద కాగితాలు రాసేశారు. వాటిని కంప్యూటరులో నిక్షిప్తం చేసేశారు. స్టాంపు డ్యూటీ అనీ, రిజిష్ట్రేషను ఫీజు అనీ పదహారు వేల రూపాయల దాకా కట్టించుకున్నారు. అదంతా చట్టం ప్రకారమే అయినా, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అవినీతి గోచరించింది నాకు. మా వ్యవహారంలో అమ్మిందీ లేదు, కొన్నది లేదు. కేవలం తండ్రి చనిపోయాడు గాబట్టి, ఉన్న కొద్దిపాటి స్థిరాస్తిని వారసులముగా చెరికాస్త తీసుకున్నాం. అంతే దీంట్లో మాకు ఏమి ఆదాయం ఉందని ప్రభుత్వం ఉట్టినే మానుంచి పదహారు వేల రూపాయల్ని లాగేసుకుంది? ప్రజాస్వామ్యం అని నమ్మిస్తూ ప్రభుత్వం ఆడే నిరంకుశ చర్య.
ఇక్కడే మరొక విషయం చెప్పాలి. స్టాంపులకూ, రిజిస్ట్రేషనుకూ కలిపి రూ. 17500 ఇవ్వమని ఒకరు ముందే తీసుకున్నారు. పని పూర్తయిన తర్వాత ఎటూ లెక్క చెబుతారని నేను అనుకున్నాను. అదే విధంగా పనంతా అయిపోయిన తర్వాత అధికారికంగా రూ. 16000 ఖర్చయిందనీ, మరొక రూ. 1500 మామూలు తీసుకున్నామనీ సదరు చిన్న మనిషి వివరించాడు. మామూలు అన్న పదం వినపడగానే నాకు వళ్లు మండిపోయింది. కోపం రగిలిపోయింది. అయినా తమాయించుకుని నేను ఫలానా… అని మళ్లీ విన్నవించుకున్నాను. ”నిజమేనండీ, మీరేమో పాత్రికేయుడిని అంటున్నారు. లంచం ఇవ్వనంటున్నారు. బాగానే ఉంది. కానీ మీ దగ్గర నుంచి రూ. 1500 మామూలు తీసుకున్నానని రిజిస్ట్రారుకు చెప్పాను కూడా. అయన ఏమీ అనలేదే?! అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు. ” ఆయన మరచిపోయి ఉంటాడేమో? మీరొకసారి వెళ్లి గుర్తుచేయండి. ఆయన ఇచ్చేయమంటే తిరిగిస్తాను. నాదేముంది సార్‌, చిరుద్యోగిని. పెద్దోళ్లు ఎట్ల చేయమంటే అట్లా చేస్తాను.” జేబురించిన ముఖంతో ఉచిత సలహా ఒకటి పారేసి ఆయన లోపలికి వెళ్లిపోయాడు. దాంతో నేను రిజిస్ట్రారు మౌలాలిని కలిసి నా పాత్రికేయ సంబంధిత పాత రికార్డును మరోమారు వల్లెవేశాను. మౌలాలి మహా మునిలా అంతా విన్నాడు. ”నిజమేనండీ, మీరు పాత్రికేయుడు కాబట్టి పని చేయించాను. అసలు నాకు ఆరోగ్యం బాగాలేదు. ఇంకొకరయితే రేపో, తర్వాతో రమ్మనమనేవాడిని” అంటూ ఏదో చిట్టాను విప్పి దానిని చదివే పనిలో నిమగ్మమయ్యాడు. నేను నచ్చచెబుదామనుకున్నా వినే ధోరణి కనపడలేదు. దాంతో కోపం నషాళానికి అంటింది. ప్రశాంతమయిన మనస్సులో కల్లోలం చెలరేగింది. కడుపు భగభగ మండటం ప్రారంభమయింది. ” మేత వేస్తే తప్ప పని చేయనని ముందే చెప్పి ఉండాల్సింది. నేను మీకు గడ్గి వేయాలనుకుంటే, వేయగలిగి ఉంటే మీతో పనిచేయించుకునేవాడిని. లేకుంటే వెళ్లిపోయేవాడిని గదా? అంత అనారోగ్యంగా ఉంటే నా తర్వాత వచ్చిన మరొక ఇద్దరి పనిని ఎట్లా చేయించారు? అంటే మీరు తినటానికి గడ్డి వేస్తే ఆరోగ్యం దానంతటదే వస్తుంది. గడ్డి లేకపోతే మీకు దానంతట అదే అనారోగ్యమూ కలుగుతుంది. అసలు నీలాంటి వాళ్లను మనుషుల మీదకు తోలిన ప్రభుత్వాన్ని అనాలిగానీ, నిన్నని ఏమి లాభం? రాజస్తాన్‌ థార్‌ ఎడారిలో ఎర్రటి ఎండలో ఇసుక ఎత్తే పని చేయించాల్సిన నీతో ఆస్తిపాస్తుల్ని లెక్కలుగట్టే పని చేయిస్తోన్న ప్రభుత్వానికి సిగ్గూ లజ్జా లేదు. ఛీ … నీతో మాట్లాడటం దండగ” అని సదరు లంచగొండిని చీదరించుకుని బయటకు వచ్చేశాను.
కొసమెరుపు : అవినీతిని అంతమొందించేకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ రాజధానిలో అన్నా హజారే నిరాహార దీక్ష సాగిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరగటంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ అన్నా హజారే, ఆయన పరివారం, ప్రభుత్వం, వాళ్లు తెచ్చే చట్టాలు అవినీతిని నిజంగా అంతం చేస్తాయా? నమ్మొచ్చా?? నాకయితే నమ్మకం లేదు. మరి మీకో?!

3 వ్యాఖ్యలు

  1. నమ్మకం లేదని ఇంట్లో కూరు్చంటే ప్రపంచం అస్సలు మారదు కదండీ. మీకు జరిగిన చిన్న సంఘటననే మీరు సరిగ్గా ప్రతిఘటించలేదు.. మరి జాతీయస్థాయిలో జరిగే సంఘటనలని, వ్యకు్తలని ఇట్టే తృణీకరించటం తగదు మరి. అందునా పాతి్రకేయులైయుండి మీరే అలా అంటే, ఇక సామాన్య మానవుడి సంగతేంటి?

    స్పందించండి

  2. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృధ్ధులు….అన్నట్టు, యువత నిరాశలో మునిగిపోతే యెలా?

    నాకు నమ్మకం వుంది. అన్నా చెపుతున్నది 1 లక్షా ఇరవైవేలమది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులనీ “జన లోక్ పాల్” పరిధిలోకి తీసుకు రావాలని. ప్రభుత్వం మాట్లాడుతున్నది “లోక్ పాల్” వ్యవస్థ గురించి మాత్రమే!

    ఆ రిజిస్ట్రార్ మీద మీ ఆగ్రహమే నేటి “జనాగ్రహం”. దానికి మద్దతు ఇవ్వండి…..అవినీతి అంతం యెందుకు కాదో చూద్దాం.

    ఇంకా కొంతమంది, అన్నా అవినీతి గురించి మాట్లాడకుండా, ఒక్క జనలోక్ పాల్ గురించే మాట్లాడుతున్నాడు అని విమర్శిస్తున్నారు. కానీ, ఒక్కొక్క సమస్యా ఒక్కొక్కసారే పరిష్కరింపబడతాయి. ఒకటి తరవాత ఒకటి మాత్రమే. అందుకే “బారాందే” ఫెయిలయ్యాడు.

    “ఎండ్స్ జస్టిఫై ది మీన్స్ కాదు….మీన్స్ జస్టిఫై ది ఎండ్స్!” అని మహాత్ముడో యెవరో అన్నారట. గాంధేయవాది అన్నాని తన దారిలో సాగనివ్వండి. మీ పూర్తి మద్దతు ఆయనకి ఇవ్వండి. స్వతంత్ర భారతం మీనుంచి కోరేది ఇంకేమీ వుండదు! చేస్తారా?!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: