Archive for ఆగస్ట్, 2011

పటిష్ట లోక్‌పాల్‌ కోసం ప్రభుత్వం స్పందించాలి – ప్రకాశ్‌ కరత్‌

ప్రస్తుతానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పటిష్టమైన లోక్‌పాల్‌ అథారిటీని ఏర్పాటు చేయడమొక్కటే మార్గం. ప్రభుత్వ లోక్‌పాల్‌ బిల్లును ప్రజలు తిరస్కరించారు. ఈ బిల్లు వామపక్షాలకు, ఇతర ప్రతిపక్షాలకు కూడా సమ్మతం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బిల్లులో తగు మార్పులు చేర్పులు అయినా చేయాలి. లేదా పటిష్టమైన లోక్‌పాల్‌ ఏర్పాటుకు వీలుగా తిరిగి కొత్త బిల్లును తేవాలి. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఈ పని చేయడం మినహా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మరో మార్గం లేదు.

అన్నాహజారే ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షకు దేశ వ్యాపితంగా మద్దతు లభిస్తోంది. జన లోక్‌పాల్‌ బిల్లు కోసం సాగిస్తున్న ఈ ఆందోళనకు మద్దతు పలుకుతున్నవారిలో ఎక్కువమంది పట్టణ, మధ్యతరగతికి చెందినవారే. దీంట్లో గణనీయమైన సంఖ్యలో పాల్గొంటున్న యువతలో కూడా ఎక్కువ మంది ఈ దొంతరకు చెందినవారే. ఏప్రిల్‌లో అన్నా హజారే మొదటిసారి నిరాహార దీక్షకు దిగినప్పటి నుంచి అవినీతి వ్యతిరేకోద్యమం బాగా ఊపందుకుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

అవినీతిని ఎదుర్కోవడంలో యుపిఏ ప్రభుత్వ వైఫల్యం, దాని ధోరణి ప్రజాగ్రహం విస్తరించడానికి కారణమైంది. మొదటి అంశం యుపిఏ ప్రభుత్వాన్ని ప్రజలు అవినీతిలో భాగస్వామిగా చూస్తున్నారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో అత్యంత అవినీతికర ప్రభుత్వమిది. మచ్చలేని ప్రధాని అంటూ ఎంతగా ఊదరగొట్టినా ఆయన సారథ్యంలోని ప్రభుత్వం పట్టణ మధ్య తరగతి ప్రజల చైతన్య వెల్లువలో మునిగిపోతున్నది. మన్మోహన్‌ సింగ్‌ను సంస్కర్త, సచ్ఛీలుడు, నిజాయితీ పరుడు అని ఇంతవరకూ పొగుడుతూ వచ్చింది ఈ తరగతే.

అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వంలోని మంత్రులు సమర్థించిన వైనం, 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణంలో జీరో లాస్‌ థియరీ (ప్రభుత్వ ఆదాయానికి పైసా కూడా నష్టం లేదని చెప్పడం)ని ముందుకు తేవడం వంటివన్నీ ఈ ప్రభుత్వం అవినీతిలో నిలువునా కూరుకుపోయిందని, ఎలాంటి అర్థవంతమైన చర్య తీసుకోగలిగే స్థితిలో లేదన్న భయాలు నిజమేనని నిర్ధారిస్తున్నాయి. అది 2జి కానివ్వండి, కామన్వెల్త్‌ క్రీడలు కానివ్వండి ఈ కుంభకోణాలన్నిటిపైన సుప్రీం కోర్టు, కాగ్‌ వంటి సంస్థల ఆదేశాలమేరకే సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు సాగిస్తోంది, తప్పు చేసినవారిని ప్రాసిక్యూట్‌ చేస్తోంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్‌ బిల్లుతో ఈ సమస్య మరింత జటిలంగామారింది. ఇంతకుముందు ఉన్న విజిలెన్స్‌, దర్యాప్తు సంస్థల పొందికనే కొనసాగించాలని ఈ బిల్లు కోరుతోంది. ప్రధానమంత్రిని లోక్‌పాల్‌ పరిధి నుంచి మినహాయించింది. లోక్‌పాల్‌ నియామక పద్ధతిని బట్టి చూస్తే ఇదొక స్వతంత్ర సంస్థ కాదని అర్థమవుతుంది. ఈ బిల్లు ద్వారా ఏర్పడే లోక్‌పాల్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపైన, లేదా బడా వ్యాపారులు- పాలకపార్టీ నేతలు- బ్యూరోక్రాట్ల మధ్య గల అపవిత్ర పొత్తు పైన స్వతంత్రంగా చర్య తీసుకోలేని, అసమర్థ సంస్థగా మిగిలిపోతుంది.

రెండవది, ఆగస్టు16న అన్నా హజారే నిరాహార దీక్ష ప్రారంభించకముందే ఆ రోజు ఉదయాన్నే ఆయనను, ఆయన సహచరులను అరెస్టు చేయించిన తీరు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని బోనులో నిలబెట్టింది. అవినీతికి చిహ్నంగా మారిన ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిని తీహార్‌ జైలుకు పంపడం ప్రజలపై దాడి మాత్రమే కాదు, శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే పౌరుల ప్రజాతంత్ర హక్కుపై దాడి కూడా. ఈ చర్యతో ప్రభుత్వం అటు ప్రజల్లోను, ఇటు పార్లమెంటులోపల ఒంటరి అయింది. హజారే నాయకత్వంలోని ఉద్యమాన్ని పార్లమెంటుపైన, ప్రజాతంత్ర సంస్థలపైన దాడిగా పాలక పార్టీ నిందించింది. పార్లమెంటులో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాక, దానిపై ఎవరు ఏ విధమైన ఆందోళన చేసినా అది పార్లమెంటుపై దాడే అవుతుందని పాలకపార్టీ నేతలు చెబుతున్నారు. ఇది బయటకు చూడడానికి సబబుగానే అనిపించవచ్చు. అయితే, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించే హక్కు, దానికి వ్యతిరేకంగా పోరాడే హక్కు రాజకీయ పార్టీలకు, పౌర సంస్థలకు ఉన్న తిరుగులేని హక్కు అన్న విషయం మరచిపోరాదు. కార్మికవర్గానికి వ్యతిరేకమైన బిల్లులను చాలా వాటిని వామపక్షాలు, కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. వాటికి వ్యతిరేకంగా సంఘటిత నిరసన చర్యలు చేపట్టాయి. పోరాటాలు సాగించాయి. బీమా, బ్యాంకింగ్‌ తదితర రంగాలను విదేశీ సంస్థలకు బార్లా తెరవడానికిగాను తీసుకొస్తున్న ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా సమ్మెలు జరిగాయి. అంతెందుకు, 2002లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక (పోటా) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడుకాంగ్రెస్‌ దానిని వ్యతిరేకించింది. అది చట్టంగా మారిన తరువాత కూడా దానిని ఉపసంహరించాలని డిమాండ్‌ చేసింది.

అవినీతి అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. దీనిపై ప్రజల్లో చైతన్యం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్న పట్టుదల అంతకంతకూ పెరుగుతోంది. ఇది స్వాగతించదగినది. అయితే, ప్రజాజీవనానికి సంబంధించిన అన్ని రంగాలను పట్టి పీడిస్తున్న ఈ అంతులేని అవినీతికి కారణమేమిటన్నదానిపై సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం. ప్రస్తుత అవినీతి జబ్బు, దాని ప్రభావాలు, కారణాలకు సంబంధించి సిపిఐ(ఎం) తన అవగాహనను ఇప్పటికే స్పష్టంగా వెల్లడించింది.

గత రెండు దశాబ్దాల సరళీకరణ, నయా ఉదారవాద విధానాల అమలు ఫలితంగా ఉన్నత స్థానాల్లో అవినీతి సంస్థాగతమైంది. నయా ఉదారవాద విధానాలు వచ్చాక అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈ అవినీతిలో ఎక్కువ భాగం బడా వ్యాపార వేత్తలు, పాలక పార్టీ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య అపవిత్ర పొత్తు వల్ల వచ్చిందే. ఈ ఏడేళ్ల యుపిఏ ప్రభుత్వం, అంతకుముందున్న ఆరేళ్ల ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన విధానాలు బడా వ్యాపారుల ప్రయోజనాలను ఎలా కాపాడుతున్నదీ, పైన పేర్కొన్న ఈ అపవిత్ర కూటమి సహజ వనరుల లూటీకి ప్రయివేటీకరణ ఎలా ఉపయోగపడుతున్నదీ, భూమి, ఖనిజాలు, గ్యాస్‌ వంటి సహజ వనరులను భారతీయ, విదేశీ బడా వ్యాపారులు కొల్లగొట్టుకోవడానికి వీలుగా వాటిని బదలాయిస్తూ యుపిఏ ప్రభుత్వం తన విధానాలను, వ్యవస్థలను ఎలా మలచుతున్నదీ మనం చూస్తున్నాము. నయా ఉదారవాద విధానాలు రాజకీయ వ్యవస్థను బడా పెట్టుబడిదారుల చేతిలో సాధనంగా మార్చుతున్నాయి. రాజకీయాలను వ్యాపారంగాను, రాజకీయాల ద్వారా వ్యాపారాలు సాగించే ధోరణిని పెంచుతున్నాయి.

అత్యున్నత స్థానాల్లో అవినీతికి వ్యతిరేకంగా సాగించే పోరాటం బహుముఖంగా ఉండాలి. అందుకు పటిష్టమైన లోక్‌పాల్‌ అథారిటీ ఏర్పాటుతో బాటు ఎన్నికల్లో పెరిగిపోతున్న ధన ప్రాబల్యాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంస్కరణలు తేవాలి. అలాగే న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో అవినీతిని అరికట్టేందుకు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. నల్లధనాన్ని వెలికితీసేందుకు, పన్ను ఎగవేతదారుల స్వర్గధామాలుగా ఉన్న విదేశాలలోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. పైన పేర్కొన్నవన్నీ నయా ఉదారవాద విధానాల ముఖ్య లక్షణాలు. అవినీతికర పద్ధతుల ద్వారా, సహజ వనరులను కొల్లగొట్టడం ద్వారా బడా వ్యాపారులు పెద్దయెత్తున పెట్టుబడి పోగేసుకునేందుకు వీలుకల్పిస్తున్న ఈ విధానాలకు స్వస్తి పలకాలి.

హజారే నేతృత్వంలోని ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ప్రధాన సెక్షన్‌ పట్టణ మధ్య తరగతి. వీరిలో చాలా మంది మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, నయా ఉదారవాద విధానాలను సమర్థిస్తున్నవారే. ఇప్పుడు తమ దైనందిక జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న అవినీతి మహమ్మారి నుంచి తమను ఆదుకునేందుకు ఒక రక్షకుడు కావాలని వారు కోరుకుంటున్నారు. వారు అవినీతి పోవాలనుకుంటున్నారు. అదే సమయంలో తమకు లబ్ధి చేకూర్చే ప్రస్తుత ఆర్థిక విధానాలు యథావిధిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. అంతేకానీ, తమను పీడిస్తున్న అవినీతికి, నయా ఉదారవాద విధానాలకు మధ్యన ఉన్న సజీవ లింకును వారు చూడలేకపోతున్నారు.

రాజకీయాలను యావగించుకోవడం, రాజకీయనాయకులందరినీ ఒకే గాటన కట్టి నిందించడం, పార్లమెంటును శాసించాలని చూడడం వంటి ధోరణులవైపు మధ్య తరగతి మొగ్గు చూపుతోంది. దాని స్వభావమే అంత.

ధనస్వామ్యం పట్ల వ్యక్తమైన న్యాయమైన ఆగ్రహం రాజకీయ వ్యవస్థపై ఆధిపత్యం చలాయించే స్థితికి వచ్చింది. రాజకీయ పార్టీలను టార్గెట్‌గా పెట్టుకోవడం ద్వారానో, కేవలం దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అవినీతిపై కేంద్రీకరించడం ద్వారానో ఈ ధనస్వామ్యం, అవినీతి పొత్తుపై పోరాడలేము. ఇటువంటి అవ్యవస్థిత స్వభావమే అన్నా హజారే ఉద్యమంలో కనిపిస్తోంది. కార్పొరేట్‌ మీడియాతో సహా మితవాద శక్తులు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. అవినీతి మూలాలపైకి గాకుండా ఉద్యమ దృష్టిని ఇవి పక్కకు మళ్లిస్తున్నాయి. సమాజంలో అవినీతి ఇంతగా పెరిగిపోవడానికి గల అసలు కారణాలు ప్రజలకు తెలియనీయకుండా జాగ్రత్తగా మరుగున పరచే యత్నాలు చేస్తున్నాయి. ఇటీవల హిందూ పత్రిక ప్రచురించిన సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీస్‌ సంస్థ సర్వేలో అత్యంత అవినీతిపరులెవరు అని ఒక ప్రశ్న అడిగారట. దానికి ఆ సర్వేలో ఇలా సమాధానం వచ్చిందట. ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత అవినీతిపరులని ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 32 శాతం మంది అభిప్రాయపడగా, ఎన్నికైన ప్రజా ప్రతినిధులేనని 43 శాతం మంది చెప్పారట. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు అత్యంత అవినీతిపరులని కేవలం మూడు శాతం మంది మాత్రమే చెప్పారని ఆ సర్వే తెలియజేస్తోంది. ఇదీ మధ్యతరగతి వారిలో ఉన్న బలమైన అబిప్రాయం. ఇటీవల కాలంలో వెలుగుచూసిన ప్రతి భారీ కుంభకోణమూ బడా వ్యాపారుల లేదా కార్పొరేట్‌ సంస్థలు, అవినీతిపరులైన ప్రజా సేవకులు (మంత్రులు కానీయండి, పౌర ఉన్నతాధికారులు కానీయండి) కుమ్మక్కవడం ద్వారా జరిగినవే. 2జి స్పెక్ట్రమ్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, కెజి గ్యాస్‌ కుంభకోణం ఇలా దేనిలో చూసినా వీటి వెనక బడా వ్యాపారుల హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్‌ బిల్లులో ఈ రకమైన అవినీతిపై అసలేమాత్రం దృష్టి పెట్టలేదు. జన లోక్‌పాల్‌ బిల్లులో మాత్రం ఇటువంటి సందర్భాల్లో వ్యాపారులు అక్రమంగా కాంట్రాక్టులు పొందినట్లు తేలితే వాటిని రద్దు చేయాలని ఒక క్లాజ్‌ను మాత్రం పేర్కొన్నారు.మొత్తం మీద ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అవినీతికి మూలమైన ఈ ప్రధాన కారణాన్ని విస్మరించింది.

అవినీతిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిపిఐ(ఎం), వామపక్షాలు తమ ప్రచారాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తాయి. లోక్‌పాల్‌ బిల్లుతో బాటు, న్యాయవ్యవస్థలో జవాబుదారీని పెంచేందుకు ఒక ప్రత్యేక చట్టం కోసం పోరాడతాయి. న్యాయమూర్తులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు, న్యాయమూర్తు నియామక వ్యవహారాలను చూసేందుకు జాతీయ స్థాయిలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుకు వీలుగా ఈ చట్టం ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులను బడా వ్యాపారులకు ధారాదత్తం చేసే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం కొనసాగిస్తాయి.

ప్రస్తుతానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పటిష్టమైన లోక్‌పాల్‌ అథారిటీని ఏర్పాటు చేయడమొక్కటే మార్గం. ప్రభుత్వ లోక్‌పాల్‌ బిల్లును ప్రజలు తిరస్కరించారు. ఈ బిల్లు వామపక్షాలకు, ఇతర ప్రతిపక్షాలకు కూడా సమ్మతం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బిల్లులో తగు మార్పులు చేర్పులు అయినా చేయాలి. లేదా పటిష్టమైన లోక్‌పాల్‌ ఏర్పాటుకు వీలుగా తిరిగి కొత్త బిలునైనా తేవాలి. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఈ పని చేయడం మినహా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మరో మార్గం లేదు. దీక్ష చేస్తున్న అన్నా హజారేబృందంతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. పటిష్టమైన లోక్‌పాల్‌ కోసం తిరిగి తాజాగా బిల్లును తెచ్చి పార్లమెంటులో చర్చకు, ఆమోదానికి పెట్టాలి.

హజారే ఉద్యమం _ కొన్ని కోణాలు

అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండో స్వాతంత్య్రోద్యమం నడుస్తోందా ? అవినీతికి వ్యతిరేకంగా ప్రజా విప్లవం పెల్లుబికిందా ?? సంఫ్‌ు పరివార్‌ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోందా ??? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్దా ఒక్కో సమాధానముంది. ఏ సమాధానం సరైనదన్న విషయాన్ని కాలమే త్వరలో నిర్ణయించనుంది. అవునన్నా, కాదన్నా…ఇప్పుడు దేశంలో అవినీతి అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని దేశ ప్రజలందరూ నినదించవచ్చు..ప్రభుత్వం ఒక్కరోజులో తగ్గించనూ వచ్చు. వేతనాలు పెంచాలని, లాకౌట్లు ఎత్తివేయాలని కార్మికులు సమ్మె చేయవచ్చు…ప్రభుత్వాలు, యాజమన్యాలు తలొగ్గవచ్చు. ఇలా అత్యధిక శాతం ప్రజలు కొన్ని ‘నిర్దిష్టమైన’ డిమాండ్ల ఆధారంగా (నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై) ఏకమవ్వడం..ఆందోళనల్లోకి రావడం సర్వ సాధారణం. అవినీతిని అంతమొందించాలని ‘ దేశ ప్రజలందరూ ‘ వీధుల్లోకి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ! వ్యవస్థీకృతమైన అవినీతిని అరికట్టడం, ఒకటి రెండు చట్టాలతోనే సాధ్యమౌతుందని భావించడమూ అటువంటిదే. అన్నా హజారే దీక్ష రూపంలో ప్రస్తుతం దేశవ్యాపితంగా సాగుతోన్న ఆందోళనలోనూ పైకి కనిపించని వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. సయోధ్యకు ఇరుపక్షాలూ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో..అన్నా బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య నేడో, రేపో ఒక ఒప్పందం కుదరవచ్చు. ఈ సయోధ్యమాటున అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దాగున్న కీలకాంశాలను మరుగున పడేయడం మాత్రం సాధ్యం కాదు.

కల్లోల కాంగ్రెస్‌

ప్రస్తుతం యుపిఎ 2 ప్రభుత్వం రెండు సంవత్సరాల వయసులోనే అపారమైన అవినీతి (అప్రతిష్ట) మూటగట్టుకుందనడంలో వివాదం లేదు. హాజారే, రామ్‌దేవ్‌బాబా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ‘ఉద్యమాన్ని’ ఎదుర్కోవడంలోనూ తలపండిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పసితనాన్ని ప్రదర్శించింది. హజారేబృందాన్ని లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా తయారీ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం – ఆపాదమస్తకమూ హజారే అవినీతిపరుడేనని విమర్శించడం….రామ్‌దేవ్‌బాబాతో విమానాశ్రయానికి వెళ్లి చర్చలు జరపడం – దీక్షలో కూర్చున్న వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడం…ఇలా గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఆగస్టు 16న హజారేను ఇంటి నుండి నేరుగా తీహార్‌ జైలుకు తరలించడం వీటికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్య హక్కులపై అధికార పార్టీ నగంగా చేసిన దాడి. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీలోకి కొందరు వ్యక్తులను సభ్యులుగా తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం..నాడు కాంగ్రెస్‌కు అప్రజాస్వామికంగానూ, పార్లమెంటును అగౌరవపర్చే చర్యగానూ అనిపించకపోవడం విడ్డూరం. అప్రజాస్వామిక డిమాండ్లతో అన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించే హక్కు ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉందా అన్నదే ప్రశ్న. అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై, వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులపై గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ సూత్రబద్ధమైన, నిలకడైన వైఖరిని ప్రదర్శించలేదు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, ఇలా ఏపూటకాపూట బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ఇంత జరుగుతున్నా అవినీతి అంశంపై కనీసం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. ‘ఆర్థిక సంస్కరణల అమలు వల్లే దేశంలో అవినీతి పెరిగిందని కొందరు అంటున్నారు. ఇది అవాస్తవం. సంస్కరణలకూ, అవినీతికీ సంబంధం లేదు. ఇంకా కొన్ని రంగాల్లో సంస్కరణల కారణంగానే, అవినీతి తగ్గింది’ అంటూ ప్రధాని మన్మోహన్‌ రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ జెండాను, ఎజెండానూ చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యలో సంస్కరణలకు ఎక్కడ అగౌరవం కలుగుతుందోనన్న ఆందోళన తప్ప…ప్రధాని ప్రకటనలో మరేమీ కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు.

ఆరెస్సెస్‌ చొరబాటు యత్నాలు

గత ఏప్రిల్‌లో మొదటి సారి జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనకన్నా ప్రస్తుత ఆందోళన విస్తృతి పెరిగింది. హజారే దీక్షలో చొరబడి దీనిని సొమ్ము చేసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్యమంలో తమ శ్రేణులు పూర్తి స్థాయిలో, ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేత సునీల్‌ జోషి కొద్ది రోజుల క్రితం స్వయంగా చెప్పడం, ఎబివిపి ఆధ్వర్యంలో నడిచే ‘ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌’ ఈ ఉద్యమంలో చొరబడడం దీనినే సూచిస్తున్నాయి. అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని అన్నా ఆందోళనలో ప్రజలెవరూ స్వచ్ఛదంగా పాల్గొనడం లేదన్నది దీనర్ధం కాదు. హజారే ఉద్యమంతో ఊపందుకున్న అవినీతి వ్యతిరేక వాతావరణం నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ఇంకొకవైపు నుంచి ప్రయత్నిస్తున్నది. అదలా ఉంచితే అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, యువత, మధ్యతరగతి జీవులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం ఆహ్వనించదగ్గ పరిణామమే.

పార్లమెంటు…ప్రజాస్వామ్యం

ఈ ఉద్యమం సందర్భంగా అన్నా బృందం లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించిన కొన్ని అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఫలానా గడువులోగా ఫలానా చట్టాన్ని రూపొందించాలని శాసించజూడడం అన్నా బృందం పట్టుబట్టడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ…పార్లమెంటు అధికారమే అత్యున్నతమైనదని భీష్మించుక్కూర్చొన్న యుపిఏ ప్రభుత్వ ధోరణి ప్రజల ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నది. ‘అవినీతి’ అంశానికి నిర్దిష్టత్వం లేదు కాబట్టి దేశ కార్పొరేట్‌ రంగం కూడా అన్నా ఆందోళనకు మద్దతునిస్తున్నది. అన్నా బృందం ప్రస్తావిస్తున్న జన లోక్‌పాల్‌లో ప్రభుత్వ అవినీతి గురించి తప్ప కార్పొరేట్‌ అవినీతి గురించిన ఊసే లేకపోవడం గమనార్హం. ఇప్పుడు వెల్లువెత్తిన అవినీతి కుంభకోణాలన్నీ దాదాపు ఈ కార్పొరేట్‌ రంగం ప్రమేయంతో జరిగినవేనన్న విషయం మరువరాదు. రెండో దశ సంస్కరణలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్న అసంతృప్తితో ఉన్న కార్పొరేట్‌ గణం… కూడా హజారే ఉద్యమానికి మద్దతు నిస్తున్నదనే వార్తలను కొట్టిపారేయలేం. మధ్యతరగతి స్పందిస్తుందన్న కారణం చెప్పి, అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కార్పొరేట్‌ మీడియా కల్పిస్తోన్న ప్రాధాన్యతా శ్రుతి మించుతోందనే చెప్పాలి. ఏడాది క్రితం ఇదే రామ్‌లీలా మైదానం నుండి ఇదే జంతర్‌మంతర్‌ వరకూ లక్షలాది అంగన్‌వాడీలు ప్రదర్శనగా వస్తే…’ ట్రేడ్‌యూనియన్‌ ఆందోళనలతో ఢిల్లీ వాసులుకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ‘ అంటూ లోపలి పేజీల్లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ఇచ్చింది. అదే పత్రిక ప్రస్తుతం అన్నా ఉద్యమంపై నిత్యం 8 పేజీలకు తగ్గకుండా వార్తలిస్తోంది. ‘సంస్కరణలను కొనసాగించడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమౌతోంది. ఈ కారణంగా దేశంలో మధ్య తరగతి ఆకాంక్షలు, అభిలాషలు తీరడం లేదు. అందువల్లే దేశ మధ్యతరగతి అన్నా ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, కాంగ్రెస్‌ పుట్టి మునిగినట్లే’ అని మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదకుడు రెండ్రోజుల క్రితం వ్యాసమే రాశారు !

-డి.జయప్రకాష్

ఆర్థిక విధానాలే అవినీతికి మూలం – రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత సాయినాథ్‌

సమాజంలో వివిధ రకాల అసమానతలు, సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వని అపరిమిత అధికారాలు అవినీతికి ప్రధాన కారణాలని ప్రఖ్యాత జర్నలిస్టు, రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మూలాలను పరిష్కరించకుండా అవినీతి నిర్మూలన సాధ్యంకాదని స్పష్టం చేశారు. ప్రజాశక్తి 31వ వార్షికోత్సవం సందర్భంగా శాసనమండలిలో పిడిఎఫ్‌ పక్ష నేత ఎంవిఎస్‌ శర్మ అధ్యక్షతన ‘అవినీతి-పర్యవసానాలు-పరిష్కారాలు’  అంశంపై విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సులో సాయినాథ్‌ ప్రసంగించారు. లోక్‌పాల్‌ బిల్లు, దాని పరిధిలోకి ప్రధానిని చేర్చడం అవసరమని అన్నారు. లోక్‌పాల్‌తో మొత్తం అవినీతి అంతమైపోతుందన్న అంచనాలు తప్పనీ, సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న అవినీతిని అదొక్కటే నిర్మూలించలేదనీ స్పష్టం చేశారు. జనలోక్‌పాల్‌ బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం ఇవ్వకుండా, బిల్లు ఆమోదంపై కేంద్రానికి డిక్టేటర్‌ మాదిరి డెడ్‌లైన్‌ విధించడం ప్రజాస్వామ్య భారతావనిలో పౌర సమాజానికి తగదని విమర్శించారు. ఎవరికీ జవాబుదారుకాని లోక్‌పాల్‌ వ్యవస్థ ఉండాలనుకోవడం పొరపాటన్నారు. ప్రజాస్వామ్యమంటేనే జవాబుదారీతనమనీ, దాన్ని విస్మరించడం సరైనదికాదనీ అన్నారు. దేశంలోని అత్యధిక ధనవంతులు, కార్పొరేట్‌ కంపెనీలు రోజూ రూ.240 కోట్లు పన్ను ఎగ్గొట్టిన ధనాన్ని స్విస్‌తో సహా విదేశీ బ్యాంకుల్లోని అక్రమ ఖాతాలకు తరలిస్తున్నాయని చెప్పారు.
వాషింగ్టన్‌లోని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రేషన్‌ (జిఎఫ్‌ఐ) నివేదిక ప్రకారం 1948-2008 మధ్య రూ.25 లక్షల కోట్లు విదేశీ బ్యాంకులకు తరలిపోగా, ఐఎంఎఫ్‌ నివేదిక ప్రకారం ఈ మొత్తంలో సగంకంటే ఎక్కువ సొమ్ము 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత గత ఇరవై ఏళ్లలో లూటీ అయిందని తెలిపారు. సగటున ప్రతి గంటకూ రూ.10 కోట్లు దేశం నుంచి బయటకుపోయి విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతోందని చెప్పారు. 2011-12 బడ్జెట్‌లో కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రూ.88వేల కోట్లు ప్రత్యక్ష పన్నుల రాయితీ ఇచ్చిందని ఈ మొత్తంతో దేశవ్యాప్తంగా సమగ్ర ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఏటేటా కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రాయితీలు పెంచుకుంటూపోతోందనీ, గత కొన్నేళ్లలో కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రూ.ఐదు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చిందని చెబుతూ దీన్ని చట్ట పరిధిలో జరుగుతున్న అతి పెద్ద అవినీతిగా అభివర్ణించారు. ఈ అవినీతి లోక్‌పాల్‌ పరిధిలోకి రాదని చెప్పారు. ఎయిర్‌ ఇండియాని సర్వనాశనంచేసిన ప్రఫుల్‌పటేల్‌ ఎన్నికల అఫిడవిట్‌ల ప్రకారం క్యాబినెట్‌ మంత్రుల్లో అత్యధిక ధనవంతుడనీ, ఆయనకి మీడియా నాలుగు సార్లు అవార్డు ఇచ్చిందనీ, అదే ప్రస్తుత మీడియా ధోరణి అని చెప్పారు. మోస్ట్‌ హానెస్ట్‌ పిఎం, మోస్ట్‌ కరప్ట్‌ గవర్నమెంట్‌ సరితూగవని చెబుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఐడియలాజికల్లీ కరెప్ట్‌ అని విమర్శించారు.
దేశంలో బిలియనీర్ల ఆస్తులు ఏటేటా పెరుగుతుంటే 2007 అర్జున్‌సేన్‌ కమిటీ నివేదిక ప్రకారం 83 కోట్ల మంది భారతీయుల ఆదాయం రోజుకు రూ.20 అని చెప్పారు. పట్టణాల్లో రూ.20, గ్రామాల్లో రూ.15లోపు రోజువారీ ఆదాయం ఉన్నవారిని బిపిఎల్‌ కుటుంబాలుగా కేంద్రం నిర్వచిస్తోందని అన్నారు. సక్సేనా కమిటీకి తమ అంచనాల కంటే 20శాతం మించొద్దని ప్లానింగ్‌ కమిషన్‌ పేర్కొందని వెల్లడించారు. సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టాన్ని ప్రయివేటు, కార్పొరేట్‌ కంపెనీలకు కూడా వర్తింపజేయాలని సూచించారు. అవినీతిపై గొంతెత్తి లోక్‌పాల్‌ కోసం పట్టుబడుతున్న పౌరసమాజం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేట్‌ కంపెనీలను బహిష్కరించాలనీ, వాటి షేర్లను విక్రయించాలని పిలుపిస్తే మంచిదనీ అన్నారు. దేశంలో వ్యవస్థలన్నీ విఫలమైపోయాయనుకోనక్కర్లేదని చెబుతూ కామన్‌వెల్త్‌ కుంభకోణాన్ని కాగ్‌, స్పెక్ట్రమ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, రాడియా స్కామ్‌ని ఆదాయపన్ను శాఖ, సత్యం కుంభకోణాన్ని ఆడిటర్లు, కెజి బేసిన్‌ స్కామ్‌ని అఫీషియల్‌ ఎంక్వైరీ బయటపెట్టాయని గుర్తు చేశారు. మేలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో గెలిచిన 825 మంది శాసనసభ్యుల ఆదాయం రూ.2,128 కోట్లనీ, ఉపాధిహామీ పేదలు ఈ స్థితికి చేరుకోవాలంటే వందల ఏళ్లుపడుతుందని చెప్పారు.

వీళ్లకు ఇదేం రోగం ! టమోటాలతో యేమిటా భొగం ! !

150 క్వింటాళ్ల ఆహారం నాశనం
రెండు లక్షల ఖరీదు
ప్రవేశ రుసుము రూ. 2000
ఎవ్వరయినా చేయరాని పనిచేస్తే ”ఇదేం రోగం! అని ఈసడించుకోవటం మా ఊరి ఆచారం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా 2011 ఆగస్టు 7న మన హైదరాబాదులో కొంతమంది యువతీయువకులు టమోటా(రామములగ)లతో కొట్టుకున్నారట. హైదరాబాదులో ఇదే మొదటిసారట. వాస్తవానికి టమోటాలతో కొట్టుకునే పండుగ స్పెయిన్లో జరుపుకుంటారని చదివినట్లు గుర్తు. మద్యం తాగటం, వేగంగా వాహనాలు నడిపి ఆనందపడటం, తైతక్కలాడటం, సినిమాలు, చిందులు, అరవటం, చేతులూపుకోవటం, చేతులకు ఏ దారాలో, ప్లాస్టిక్‌ రింగులో కట్టటం … ఇలా ఇప్పటిదాకా పండగలు గడపటం మన యువతకు తెలుసు. పాతొక రోత – కొత్తొక వింత అన్నట్లుగా ఈ దఫా స్పెయిను వాళ్లను అనుకరించారు.
రోజుకో దినం, అనుకరణ … అదేమోగానీ, ఇలా విలువయిన ఆహార పదార్ధాన్ని వ్యర్థం చేయటం చూసి నాకు కడుపు రగిలిపోయింది. టమోటాలతో కొట్టుకున్నాళ్లు ఎవరయినా నాకు కనపడి ఉంటే కొట్టి ఉండేవాడినేమో కూడా. కనీసం నిరసన వ్యక్తం చేసి ఉండేవాడిని. దారీతెన్ను కానని యువత ఏదో చేసింది పో… టమోటినో ఫెస్ట్‌లో పాల్టొన్నవాళ్లకు మీడియా కితాబులు ఇవ్వటం దాని దిగజారుడు కాదూ! అయ్యయ్యో! ఎంత తక్కువ వేసుకున్నా రెండు లక్షల రూపాయల విలువచేసే 150 క్వింటాళ్ల టమోటాలను ఇలా నేలపాలు చేసిన పాపం ఊరకే పోతుందా? ఇంత విలువయిన ఆహారాన్ని నేలపాలు చేయటం మనలాంటి పేదదేశాలకు అరిష్టం కదూ! ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జలవిహార్‌ సంస్థ యాజమాన్యానికి తగిన శిక్ష వేయాలి. నేనేగనుక న్యాయమూర్తినయితే, కూలీలను వినియోగించుకోకుండా యాజమాన్య ప్రతినిధులు, దాని అధికార బృందంలో వాళ్లంతా ఏడాది పాటు ఒక్కొక్కరు ఎకరం నేలలో టమోటాలు పండించాలని శిక్ష వేసేవాడిని. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులూ, ఈ వార్త ప్రసారంలో పాల్గొన్న మీడియా సిబ్బంది కనీసం ఏడాదిపాటు ఏడాదిపాటు టమోటాలు తినకూడదని నిషేధించేవాడిని. వారంతా కనీసం వారం రోజులపాటు చిత్తూరు జిల్లా వెళ్లి టమోట రైతుల వద్ద ఉచితంగా సేవ చేయాలని ఆదేశించేవాడిని. అయినా ఈనాడు నా మాటలు ఎవడు వింటాడు? నా పిచ్చి కాకపోతే! ”వాస్తవంగా నాకు స్పానిష్‌ టమోటాలను వినియోగించాలన్న కోరిక ఉంది. అయితే అవి కిలో రూ. 65 పలుకుతున్నందున స్థానిక పంటనే వినియోగించకతప్పలేదు” అని ఈ కార్యక్రమ నిర్వాహకుడు బిస్కెట్‌ శ్రీకాంత్‌ వాపోయాడట పాపం. యువతను ఆకర్షించేందుకుగాను ఈ సంస్థ ప్రవేశ ధరను కూడా తగ్గించిందట. మామూలుగా ఓ జంట ప్రవేశానికి రూ. 3500 వసూలు చేస్తారు. టమోటా పండుగకు మాత్రం కేవలం రెండు వేల రూపాయలనే వసూలు చేశారు మరి. అంటే ఇంతింత చెల్లించి ఆహార నాశనం పండుగ చేసుకున్నారంటే వాళ్ల బాబులకు అప్పనంగా సొమ్ములు వస్తుంటేనే సాధ్యం.
1. అమెరికా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశం రేపు ఏమి కాబోతుందో టమోటా యువతకు అవసరం లేదా?
2. ఆరుగాలం శ్రమించి పండించిన టమోటా రైతన్నకు ఎంత ప్రతిఫలం దక్కుతుంతో ఈ ఆటగాళ్లు ఎన్నడయినా ఆలోచించారా?
3. దేశాన్నీ, ప్రపంచాన్నీ త్వరలో ఆహార కొరత సమస్య ఆవరించబోతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయటం ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎప్పుడయినా విన్నారా?
4. తప్పును తప్పుగా చెప్పలేని మీడియాకు ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా వ్యవహరించే దమ్ముందా?
5. ఇంతకూ ఈ బ్లాగు చదువరులు ఏమంటారు? చెబుతారు కదూ!

ధరాభారం … ఒంటరి తనం – సమస్యలకు సమాధానమే ఉమ్మడి నిర్మాణం

అది హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇద్దరు ఇంజినీరింగు ఆచార్యులను కలిసేందుకు ఆర్కిటక్ట్‌ ఒకరు అక్కడకు వెళ్లారు. ముగ్గురూ ముచ్చటాడుతుండగా….
ఆచార్యుడు – 1 : నాకూ, వీరికీ పక్కపక్కనే చెరొక వంద చదరపు గజాల స్థలాలున్నాయి. సరిపోనంత లేనందున ఇల్లు కట్టుకోలేక పోతున్నాము. పోనీ రెండింటినీ కలిపి ఒకరు తీసుకుందామంటే మా ఇద్దరి దగ్గరా అంత డబ్బు లేదు. ఏమీ పాలుపోవటం లేదు.
ఆర్కిటెక్ట్‌ : నేనో ఉపాయం చెప్పనా?
ఆచార్యుడు – 2 : భలేవాడివే చెప్పు, చెప్పు.
ఆర్కి: సరే మంచిది. రెండు స్థలాలనూ కలిపేసి ఇంటిని కట్టుకోండి. లాటరీ వేసి ఎవరు కింద ఉండాలో? ఎవరు పైన ఉండాలో తేల్చుకోండి.
ఆచా1 – 2 : ఇదేదో ఆలోచించదగిందిగా ఉందే.
అంతలోనే మరొక ఆచార్యుడు అక్కడకు వస్తూనే… ఏవో రహస్యంగా ప్లాన్లు వేస్తున్నట్లున్నారే! చమత్కరించాడు.
ఆచా – 2 : రహస్యాలా? పాడా!. మా ఇద్దరి స్ధలాల్నీ కలిపి రెండంతస్తుల ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాము.
ఆర్కి : ఇష్టమయితే మీరూ కలవచ్చు. మూడంతస్తులు వేసి, తలా ఒకటి తీసుకోవచ్చు.
ఆచార్యులంతా ఓ పావు గంటసేపు తర్జనబర్జనపడ్డారు. స్థలం ధరలో మూడో వంతును మూడో ఆచార్యుడు చెల్లించే విధంగానూ, కట్టుబడి ఖర్చు ముగ్గురూ భరించేవిధంగానూ ఒప్పందం కుదిరింది. అటూ ఇటూ కాని స్థలాలున్న వారి సమస్య, అసలే లేని ఆచార్యుల సమస్య పరిష్కారమయింది. మరుసటి రోజు నుంచీ పనులు ప్రారంభమయ్యాయి. ఇక రేపో, మాపో లాటరీ తీసి ఎవరికి వచ్చిన అంతస్తులో వాళ్లు కాపురం పెట్టేయటమే తరువాయి.
—————————————————————————–
శరత్‌ : హలో, సాగర్‌ నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను.
సాగర్‌ : హాయ్‌! శరత్‌, మా అమ్మగారికి ఇప్పుడు బాగానే ఉంది. పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. మీరేమీ కంగారు పడాల్సిన పనేలేదు. పనులన్నీ చూసుకుని రండి.
శరత్‌ : అదేమిటీ? మీ అమ్మగారికి కూడా బాగాలేదా? హతవిధి! నేను మా అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో? కనుక్కుందామని ఫోను చేశాను. అయ్యో! మీరూ బాధల్లో ఉన్నారన్నమాట.
సాగర్‌ : శరత్‌, మీ అమ్మగారే – మా అమ్మగారయ్యా! మనమంతా ఒక్కటే. వాస్తవానికి నేను చెప్పింది మీ అమ్మగారి గురించే.
కొందరు మిత్రులు కలిసి సొంతంగా నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌వాసులే సాగర్‌, శరత్‌లు. సాధారణంగా అపార్ట్‌మెంట్లలో గాలించినా దొరకని ఆప్యాయత, స్నేహ మాధుర్యాలు వారి మధ్య పరిమళించటం వెనుక ఏ సూత్రం దాగి ఉందో? తెలుసా!
—————————————————————————–
ప్రతాప్‌ : అదేంటయ్యా ప్రసాద్‌, మీ ఆవిడ ఇంట్లో లేనప్పుడు మమ్మల్ని భోజనానికి ఆహ్వానించావు? నువ్వే చేతులు కాల్చుకుంటావా ఏంది? అయినా ఎందుకు చెప్పు. మేమేదో ఒక హోటళ్లో ఇంత తినేసి మా ఊరికి చెక్కేసేవాళ్లం కదా!
ప్రసాద్‌ : అయ్యయ్యో! అంత మాట అనకండి సార్‌. మాకు ఇంత నీడ కల్పించిన ఇంజినీరు మీరు. మీరు మా ఊరు వచ్చి హోటల్లో తింటే ఊరుకుంటామా! ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టిచూడండి.
పావు గంట గడిచిందో లేదో బిలాబిలామంటూ పలువురు ఆ ఇంట్లోకి దిగబడ్డారు. అందరి చేతుల్లోనూ గిన్నెలు. హాట్‌బాక్సులు, ఆవకాయ, చింతకాయ తదితర పచ్చళ్ల సీసాలతో దిగబడ్డారు. కమ్మని నెయ్యి వాసన. మూతలు తీసి చూస్తే నాలుగయిదు గిన్నెల్లో గడ్డ పెరుగు. మజ్జిగ చారు, వడియాలు, అప్పడాలు, గారెలు, బూందీ, మైసూర్‌పాక్‌. ఇక లేని కూరే లేదు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఇంజినీరు వంతయింది. బంధుమిత్రులు కలిసి సొంతంగా నిర్మించుకున్న ఆ అపార్ట్‌మెంటుకు రూపకల్పన చేసింది ఆయనే. స్నేహం, బంధుత్వం, సహాయం, చేయూత, అండదండలు ఇలా మానవత్వానికి మారుపేరుగా నిలిచే ఆప్యాయతలన్నీ సొంతంగా నిర్మించుకునే అపార్ట్‌మెంట్లో వెల్లివిరుస్తాయని ఊహించాడుగానీ ఇంత ఇదిగా ఉంటాయని అనుకోలేదు. ఈనాటి అపార్ట్‌మెంట్లలో ఏవయితే కొరవడ్డాయని ఆందోళన వ్యక్తమవుతుందో, అవన్నీ అక్కడ సాకారమయ్యాయి. తన ఊహ నిజమయి అక్కడ దర్శనమివ్వటంతో ఆనంద భాష్పాలు రాలాయి. నోట్లో పెట్టుకున్న అన్నం ముద్ద …అమ్మ తన చిన్ననాట తినిపించిన గోరుముద్దను గుర్తుకు తెచ్చింది.
సమస్యలు ముదరుపాకాన పడి సమాజాన్ని పట్టిపీడిస్తున్నప్పుడు వాటిని పరిష్కరించటానికి తాను అన్ని యుగాల్లోనూ జన్మిస్తానని చెబుతాడు విష్ణువు. అదెంత నిజమోగానీ, చిన్నదో పెద్దదో సమస్య కొనసాగుతుంటే మాత్రం దాన్ని పరిష్కరించేందుకు పరిశోథకులు పూనుకోవటం, కద్దు. అలా ఇప్పటిదాకా కోట్లాది సమస్యలు పరిష్కారం అయిన విషయం అందరికీ విదితమే. కూడు, గుడ్డ తర్వాత అత్యవసరమైన గూటిని సాకారం చేసుకునే పనిలో నగరవాసులు ,పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
నానాటికీ ఆకాశాన్నంటుతోన్న స్థలం ఖరీదులే ప్రథమ సమస్య. ఏదో ఒక విధంగా స్థలాన్ని సమకూర్చుకుని సొంత ఇల్లు కట్టుకుందామంటే క్షణం క్షణం మీదపడే సమస్యలతో ఎవ్వరికైనా వైరాగ్యం కలుగకపోతే అనుమానించాల్సిందే.
పోనీ అపార్ట్‌మెంటు ఫ్లాటు కొనుక్కుని బతుకీడుద్దామనుకుంటే అది ఒంటిరిగా ఎదుర్కోవాల్సిన మహా నరకం. ప్రాణాలు పోతున్నా పలికేనాధుడుండడు. ఈ పక్కవాళ్లు తెలియదు. ఆ పక్కింటివాళ్లు అసలు తలుపే తీయరు. ఫాట్లో దొంగలు పడి దోచుకుపోతుంటే చూసీ చూడనట్లే వ్యవహరించే ధోరణి అతి సాధారణం.
ధరాభారం … ఒంటరితనం అక్కడ వేధించవు
ఈ సమస్యల పరిష్కారానికి దొరికిన సమాధానమే … ఉమ్మడి నిర్మాణం. అంటే అపార్ట్‌మెంటును సొంతంగా నిర్మించుకోవటమే. బంధుమిత్రులు ఒప్పందం చేసుకోవటంతో ఇది మొదలవుతుందన్నమాట. కాస్త వెసులుబాటుగా ఇంటిని నిర్మించుకోవాలనుకున్నవాళ్లు కొనేంత స్థలమే దీనికీ సరిపోతుంది కాబట్టి, ధర భారం కాదు. ఇక అపార్ట్‌మెంటు వాసులంతా బంధువులుగానో, మిత్రులుగానో, సహచరులుగానో ముందునుంచే బాగా తెలిసినవాళ్లయినందున ఆప్యాయత, అనురాగాలకు కొరవుండదు. దీని వలన రెండు ప్రధాన సమస్యలూ పరిష్కారమవుతాయి. ఇక లాభాలు తీయరుగనుక ఫ్లాటు ఖరీదు కూడా కొనుక్కున్నదానికన్నా కనీసం 20 శాతం తక్కువకే గిట్టుబాటవుతుంది.
చదరపు గజం రూ. 15 వేల చొప్పున కొన్న 250 చదరపు గజాలలో ఓ సొంతిల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ. 1000 చొప్పున 1250 చదరపు అడుగుల మొత్తం కట్టుబడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుంది.
అదే 370 చదరపు గజాలలో రెండు ఇళ్లు నిర్మిస్తే 20 శాతం తక్కువగా అంటే రూ. 40.25 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. దీనినిబట్టి ఎంతమంది కలిసి కట్టుకోబోతున్నారో దానికి అనుగుణంగా స్థలాన్ని కొనుగోలు చేస్తే ధరాభారం తొలగిపోతుంది. ఒక్కరే సొంతగా ఇంటిని నిర్మించుకుంటే స్థలం ధర మొత్తాన్నీ వారొక్కరే భరించాలి. అదే స్థలంలో అపార్ట్‌మెంటు నిర్మిచుకుంటే ఆ స్థలం ఖరీదును అందరూ పంచుకుంటారుగనుక అసలు భారమే కాదు. అందువలన ఇంటి విషయంలో ఇప్పటి వరకూ ధరాభారం సమస్యను పరిష్కరించే సూత్రం ఇదొక్కటే.
ఉమ్మడి నిర్మాణంలో బంధాలు – అనుబంధాలు
బంధువులుగానీ, మిత్రులుగానీ, ఒకే కార్యాలయంలో పనిచేసే సిబ్బందిగానీ, ఒకే ఆలోచనతో పనిచేసే బృందంగానీ కలిసి సొంతంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి దిగితే కొద్దిపాటి సమస్యలున్నా పలు సమస్యలు పరిష్కారం అవుతాయనటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి ప్లాను ఆమోదం, రుణం మంజూరు తదితర పనులు ఉమ్మడిగా అయితే సులభంగానూ, లంచాలు, కాళ్లతిప్పటా లేకుండా పూర్తవుతాయి.
– ఉమ్మడి నిర్మాణాలను ఇద్దరు మొదలు ఎంతమందయినా కలిసి చేసుకోవచ్చు.
– స్థలం ధరను అందరూ పంచుకుంటారు.
– ఏ పరిసరాలున్న స్థలాన్ని ఎంపికచేసుకోవాలో యజమానులే నిర్ణయించుకోవచ్చు. ధర సమస్య కారణంగా ఊరవతల కొనుగోలు చేయాల్సిన పనిలేదు. ఊరిమధ్యలోనూ కొనొచ్చు.
– భవన నిర్మాణ తీరును నిర్ధేశించవచ్చు.
– నిర్మాణ సామగ్రిని టోకున సరసమయిన ధరకు కొనుగోలు చేయవచ్చు.
– భారాన్ని పెంచే ఏ పనీ చేయనవసరం లేదు.
– చెట్లు నాటేందుకూ, ఆటలకూ ఇలా ఇష్టమైన వాటికి తగిన స్థలాన్ని కేటాయించుకోవచ్చు. అంతగా అవసరం లేని హెలీప్యాడ్‌లు లాంటివాటి జోలికి వెళ్లాల్సిన పనిలేదు.
– నిర్మాణ పనుల్లోనూ, తర్వాత రోజూవారీ ఎదరయ్యే పనులనూ సొంతంగా నిర్వహించి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. వ్యక్తిగత శక్తిని పెంపొందించుకునే వీలుంటుంది. ప్రదర్శించి అందరి మన్ననలనూ అందుకోవచ్చు.
– ప్రతి దానినీ అత్యధికుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్వహించే పద్ధతిద్వారా అది మనదేనన్న భావన పెంపొందుతుంది. ఆ మేరకు ఫలితాలు కూడా ఆశించినమేర వస్తాయి.
– కలిసి ఉంటే దక్కే సుఖాలనూ, సౌలభ్యాలనూ నిజంగా అందరూ అనుభవించవచ్చు.
– ముఖ్యంగా కష్టసమయంలో అందరి అండదండలూ అందుకోవచ్చు. ఆనందాన్ని అందరూ కలిసి ఆస్వాదించవచ్చు.

సంపాదనలో పొదుపు … స్థిరాస్తి రంగంలో మదుపు

26 జులై 2011.
ఉదయం 11.30 గంటలు.
అది హైదరాబాద్‌లోని మాధాపూర్‌. జనభేరి కార్యాలయం. తూర్పు నుంచి నడినెత్తికి పాకుతోన్న మార్తాండుడు చిమ్ముతోన్న వెలుగుల్లో ఆ కార్యాలయం గోడలకు తాపడం చేసిన గ్రానైట్‌ రాళ్లు తళాతళా మెరుపులీనుతున్నాయి. కారు దిగుతూనే రియల్‌ అడ్వైజర్‌ ప్రతినిధులకు ఆ కార్యాలయ సిబ్బంది నుంచి సాదర స్వాగతం లభించింది. లోపలంతా ప్రశాంతత. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ వాతావరణం మధ్య సంప్రదాయంగా తీర్చిదిద్దిన ఓ గదిలోకి ప్రవేశించిన ప్రతినిధులకు అక్కడ ఓ మౌని దర్శనమిచ్చాడు మాగంటి రాజబాబు. ఏవో నివేదికలను పరిశీలిస్తోన్న ఆయనకు నమస్కరించగానే తలెత్తి చూసి, నవ్వు మోముతో ప్రతి నమస్కారం చేస్తూనే ఆహ్వానం పలికారు.
మాగంటి రాజబాబు అంటే కొందరికి తెలియదేమోగానీ, మురళీమోహన్‌ అంటే మాత్రం ఎవరికయినా టక్కున గుర్తుకొస్తారు తెలుగు సినీ నటుడు. స్థిరాస్తి రంగంలో అట్టే పరిచయం అక్కరలేని ‘జయభేరి’కి ఆయన అధినేత. అన్నట్లు జయభేరి పేరిటే ఆయన పలు తెలుగు చలనచిత్రాలను కూడా నిర్మించారు. రాజకీయాల్లోనూ ప్రవేశం ఉంది. తెలుగుదేశం నాయకుడాయన. మురళీమోహన్‌ స్థిరాస్తి రంగంలోకి రాకముందు రాష్ట్రంలో స్థలాల, ఇళ్ల వ్యాపారస్తుల్లో అత్యధికులు సరిహద్దు రాళ్లను పాతేవాళ్లు. మురళీమోహన్‌ మాత్రం నిజాయితీగా కాళ్లు కదిపారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నిజాయితీ – నమ్మకమే ఆయనను నిర్మాణ రంగంలో రారాజును చేశాయి. ఇదేదో సంప్రదాయంగానో, మొహమాటం కోసమో చెబుతున్న మాట కానేకాదు. నిజ్జంగా నిజం. రెండు రెళ్లు నాలుగన్నంత నిజం. అందుకే ఆయన స్థిరాస్తి రంగంలో స్ఫూర్తిమంతులు.
పొదుపు – మదుపు విషయంలో మురళీమోహన్‌కు తెలుగు సినీ కథానాయకుడు శోభన్‌బాబు స్ఫూర్తి.
నడినత్తికి ఎగబాకేందుకు మార్తాండుడు పరుగులు పెడుతోన్న వేళ ‘రియల్‌ అడ్వైజర్‌’ ప్రతినిధులు జరిపిన మాటామంతీ ఇది. చదవండి మరి.
పొదుపుకూ – మదుపుకూ మారు పేరనదగిన తెలుగు సినీ నట దిగ్గజం శోభన్‌బాబు పేరును తొలుత తలచుకుని రియల్‌ అడ్వైజర్‌ ప్రతినిధులతో తన మాటామంతిని ప్రారంభించారు మురళీమోహన్‌. సినీమా జనం నిన్నటిని గుర్తుంచుకోరన్న విమర్శ జనసామాన్యంలో సాధారణంగా వినపడుతుంది. అలాంటిది తన జీవితానికి మార్గదర్శకం చేసినవారిని మరవకపోవటం మురళీమోహన్‌ విభిన్నత కావచ్చు.
మాగంటి రాజబాబుగా మురళీమోహన్‌ 1963లో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. విజయవాడలో కిసాన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలో భాగస్వామిగా చేరారాయన. ఆయన మిత్రులు శారద చిత్రాన్ని నిర్మిస్తోన్న సమయంలో ఆ సినిమా కథానాయకుడు శోభన్‌బాబుతో పరిచయం ఏర్పడింది. దీనికితోడు విజయవాడవాసి ఒకరు ఇద్దరికీ మిత్రుడు కావటంతో అప్పుడప్పుడూ కలుసుకోవటం, ముచ్చట్లు కలబోసుకోవటం కొనసాగింది. తామిద్దరి మనస్తత్వాలూ ఒక్కటేనని ఆ ఇద్దరికీ ఆ ముచ్చట్లలోనే బోధపడింది.
ఆ తర్వాత 70వ దశకంలో మురళీమోహన్‌గా మాగంటి రాజబాబు సినీ రంగ ప్రవేశం చేయటంతో వారిద్దరి బంధం మరీ గట్టిపడింది. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. మురళీమోహన్‌ నేతృత్వంలోని జయభేరి నిర్మించిన ముగ్గురు మిత్రులు చిత్రంలో శోభన్‌బాబు నాయకుడిగా నటించారు. అలా గుభాళిస్తోన్న వారి స్నేహ పరిమళం కేవలం సినిమాలతో ఆగిపోలేదు. మురళీమోహన్‌ సంపాదన ఎలా ఉందో? శోభన్‌బాబు ఆరా తీసేవారు. ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేయాలని సూచించేవారు. పొదుపు చేయటమే కాదు తెలివిగా మదుపు చేయాలని కూడా సలహా ఇచ్చేవారట.
నిజమయిన అంచనా
మురళీమోహన్‌ తన తొలినాటి సినీ ఆదాయం నుంచి చేసిన పొదుపు సొమ్ములో కొంత వెచ్చించి సినిమాల నిర్మాణం చేపట్టారు. కొన్ని చిత్రాలను కొనుగోలు చేసి విడుదల చేయటం ప్రారంభించారు. ఈ రెండింటికీ తోడు రెండు సినీ పంపిణీ సంస్థల్లో భాగస్వామిగా చేరారు. ఈ విషయాలు విన్న వెంటనే శోభన్‌బాబు అన్నారూ… ”జాగ్రత్తగా సినిమాలు తీసుకుంటే అంతో ఇంతో లాభాలు రావచ్చు. పరిశీలించి చిత్రాలు కొనుగోలు చేస్తే కూడా ఆదాయాలు గడించవచ్చు. అయితే వాళ్లెవరో డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం చేసి, నీకు లాభాలు పంచుతారంటే మాత్రం నాకు నమ్మకం లేదు. మురళీ ఆలోచించు. జాగ్రత్తగా పొదుపు చేసుకో. లేకుంటే అసలుకే ఎసరు తప్పదు”. శోభన్‌బాబు హెచ్చరిక మూడు మాసాల్లోనే నిజమయి కూర్చుంది. ఆ రెండు పంపిణీ సంస్థలూ మూతపడ్డాయి. ఒకదానిలో పెట్టుబడి సొమ్మే పోయింది. కానీ రెండోదానికి సంబంధించి పెట్టుబడి పోయిందే కా తన జేబు నుంచే వేలాది రూపాయల్ని అప్పులవాళ్లకు చెల్లించక తప్పలేదు. ఆ విషయాన్నే శోభన్‌బాబుతో మురళీమోహన్‌ చెప్పారు. అప్పుడు మురళీమోహన్‌ను చెంత కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ శోభన్‌బాబు ‘భూమోపదేశం’ చేశారు. ”ప్రపంచంలో మూడొంతుల నీరుండగా, నాలుగో వంతు మాత్రమే భూమి. అందులోనూ అడవులు, కొండలు, ఎడారులు 15- 20 శాతం ఉంటాయి. జనాభా చూస్తే రోజురోజుకూ పుట్టలు పగులుతోంది. మరి భూమి అంగుళం కూడా పెరగదు. జనాభాకు తగినంత భూమి ఈ ప్రపంచంలో లేదు. అందువలన దానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇంత వరకూ అందరికీ తెలిసిందే. అయితే గిరాకీ ఉన్న భూమి మీద పెట్టుబడి పెట్టేందుకు మాత్రం అత్యధికులు ఆలోచించటం లేదు. తెలివి తక్కువగా పెట్టుబడులు పెట్టి చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలిపోవద్దు. మీకు నచ్చితే స్థిరాస్తి రంగంలోకి దిగండి. ఎన్నటికీ నష్టపోరు.” అంటూ మురళీమోహన్‌ మదిలో ‘స్థిరాస్తి విత్తనాలు’ చల్లారు. అది మొదలు ఆనాటి మద్రాసులో స్థలాలను కొనటం ప్రారంభించారు మాగంటి.
భాగ్యనగరంలో
తర్వాత తెలుగు చలనచిత్ర రంగం హైదరాబాదుకు మారటంతో మురళీమోహన్‌ కూడా తెలుగు రాజధానికి చేరుకున్నారు. ఇక్కడ ఏదయినా పరిశ్రమ ప్రారంభించాలని తొలుత ప్రయత్నించారు. అయితే పరిశ్రమకు సరిపడేంత పెట్టుబడి లేకపోవటంతోపాటు శోభన్‌బాబు హితోపదేశం గుర్తుకొచ్చి మరొక ముగ్గురితో కలిసి స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. కొంపల్లి మేడ్చెల్‌ రోడ్డులో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాస్తవానికి అప్పటిదాకా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ అంటే స్థలం చుట్టూ నాలుగు రాళ్లు పాతి అమ్మకాలకు పెట్టేవాళ్లు. కానీ దానికి భిన్నంగా దేవాలయం సహా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేసి మరీ ఆ స్థలాలను మురళీమోహన్‌ బృందం అమ్మేసింది. తర్వాత మాధాపూర్‌ జయభేరి ఎన్‌క్లేవ్‌ ప్రాజెక్టును ముగ్గురి భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తిచేశారు. తర్వాత ఎవరికి వారే స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకోవాలని భాగస్వాములు నిర్ణయించుకుని విడిపోయారు.
చారిత్రక కారణాలరీత్యా హైదరాబాదులో భూసేకరణలో సాధారణంగా తలెత్తుతోన్న సమస్యల నుంచి బయటపడేందుకుగాను భవన నిర్మాణ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్న మురళీమోహన్‌ ప్రస్తుతం మాధాపూర్‌లో సిలికాన్‌ కౌంటీ ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని ఆనాడు కొనుగోలు చేశారు. నాణ్యంగా నిర్మాణ పనులు చేయాలనీ, కొనుగోలుదారులకు ఇచ్చిన ప్రతి హామీనీ చేతల రూపాన చూపాలనీ జయభేరి విధానంగా నిర్ణయించారు. అయితే తగిన అనుభవం లేనందున మొత్తం స్థలంలో ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించారు. దీంతో పలువురు బిల్డర్లు ఎగతాళి వ్యాఖ్యానాలు చేశారు. అయినా వెనుకంజ వేయకుండా అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల తరహా సౌకర్యాలను అదేతీరున సిలికాన్‌ కౌంటీలో ఏర్పాటు చేశారు. మూడు నాలుగేళ్లపాటు కుటుంబమంతా కష్టపడి ప్రాజక్టును పూర్తిచేశారు. తీరా ఆ ప్రాంతం ఊరికి దూరంగా ఉందంటూ స్థానికులెవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇక చేసేది లేక మురళీమోహన్‌ అమెరికా, దుబాయ్‌, సింగపూర్‌ తదితర దేశాలు పర్యటించి తెలుగువాళ్లను కలిశారు. తమ అపార్ట్‌మెంట్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉన్నాయంటే తొలుత నమ్మకపోయినా నెమ్మదిగా ఒక్కొక్కరూ స్వయంగా పరిశీలించి కొనుగోలు చేశారు. అలా తమ తొలి ప్రాజెక్టు వలన లాభనష్టాలు లేకపోయినా జయభేరికి బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చిందని ఆయన ఈ ప్రతినిధితో సంతోషంగా గుర్తుచేసుకున్నారు. గొట్టాల ద్వారా గ్యాస్‌ సరఫరా సౌకర్యాన్ని రాష్ట్రంలో తొలిగా తామే సిలికాన్‌ ఫ్లాట్లలో ఏర్పాటు చేశామన్నారు.
ఏదో ఒకటి తేల్చేయాలి
రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ఏదో ఒకటి తక్షణం తేల్చేయాలని మురళీమోహన్‌ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రం కలిసి ఉన్నా నష్టం లేదనీ, విభజించినా కష్టం లేదని పేర్కొన్నారు. దేశంలో ఏ నగరానికీ లేని విధంగా ఔటర్‌ రింగు రోడ్డుతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, తగినంత మానవవనరులు ఉన్నందున హైదరాబాదు నగరం తెలంగాణకే పరిమితి అయినా అభివృద్ధి ఆగిపోదని విశ్లేషించారు. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోతే మద్రాసు ప్రగతి ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. హైదరాబాదు ఆంధ్రలో ఉందా? తెలంగాణలో ఉందా? అని పెట్టుబడిదారులు చూడరంటూ, ఇక్కడ నెలకొన్న అపార సౌకర్యాలు చూసి పరిశ్రమలు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఏటా 30 శాతం పెట్టుబడులు చెన్నై, బెంగళూరుకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తీరు ఇంకా కొనసాగితే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు, చేనేత కార్మికులు ఆకలి చావులకు గురవతున్నట్లు ఉద్యోగాలు దొరక్క ఇంజినీర్లు కూడా అదే దోవ పట్టక తప్పదని ప్రభుత్వాన్ని డగ్గుత్తికతో హెచ్చరించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో వారూవీరూ అని కాకుండా అందరూ ఆలోచించాలని వినమ్రంగా అభ్యర్థించారు.
విద్యాదాతా సుఖీభవ!
ఆహార్యం చూడగానే పెద్ద మనిషని అన్పించే మురళీమోహన్లో గుప్తదాత కూడా దాగి ఉన్నాడు. ఆయనంటారూ ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు ఎవ్వరూ ఏదీ తేరు – పోయేప్పుడు కట్టుకు పోము. ఈ సూత్రాన్ని హృదయాంతరాళాల్లో ప్రతిష్టించుకున్న మురళీమోహన్‌ తన పేరిట ఏర్పాటుచేసిన ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 900 మంది తెలుగు పేద విద్యార్థులకు చేయూత ఇచ్చారు. ఇస్తున్నారు. తొలుత నూరు రూపాయల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ రోజుల్ని ఆయన ఎన్నడూ మరచిపోరు. తనకు సమాజం ఇచ్చిన ఆదాయాన్ని తిరిగి సమాజానికే అంకితం చేయటం మానవత్వం తప్ప త్యాగం కాదంటారు. ట్రస్టును ఆరేళ్ల క్రితం స్థాపించారు. ఇప్పటికే రెండు బృందాలు అంటే 400 మంది తమ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరిపోయారని మెరిసే కళ్లతో మురళీమోహన్‌ లెక్కలు వేశారు. 95 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులయిన పేద విద్యార్థుల ఉన్నత విద్యార్జనకు తమ సంస్థ ఆర్థిక, హార్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ప్రగతి సూచికలను సమీక్షిస్తామని వివరించారు. రియల్‌ అడ్వైజర్‌ ప్రతినిధులు వెళ్లిన సమయంలో ఆయన విద్యార్థుల ప్రగతి సూచికలను నిశితంగా పరిశీలిస్తూ కన్పించారు. 75 శాతానికంటే మార్కులు తగ్గితే ఉత్తరాల ద్వారా హెచ్చరిస్తామనీ, అదే ఒక్క పాఠ్యాంశంలో ఉత్తీర్ణులు కాలేకపోయినా సాయం నిలిపివేస్తామని చెప్పారు.
ఇష్టపడి మొదలు పెట్టు … కష్టపడి కొనసాగించు
ఆయనంటారూ ఏ పనినయినా ఇష్టపడి మొదలు పెట్టాలని. మొదలు పెట్టిన తర్వాత బాగాలేదంటూ నిలిపివేయకుండా కష్టపడి కొనసాగిస్తే ఏదో ఒకరోజు మనదవుతుందని నమ్మమంటారు. రిక్షా కార్మికుడయినా, ఐటీ ఉద్యోగయినా ఎంత సంపాదించామని కాకుండా, ఎంత పొదుపు చేశామని లెక్కలు వేసుకోవాలని సూచించారు. అదే రేపటికి ఉపకరిస్తుందని వివరించారు. పొదుపు సొమ్మును తెలివిగా పెట్టుబడి పెడితే అదే అభివృద్థని అభివర్ణించారు.
మధ్యవర్తులకు చెల్లు
తమ సంస్థ నిబద్ధత కారణంగా ఇప్పటికీ ఒక్క బ్రోరు కూడా లేకుండానే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. తమ ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలుదారులు నేరుగా కొంటున్నారని వివరించారు. ప్రాజెక్టుకు రూపకల్పన చేయగానే తమ వెబ్‌సైట్లో పూర్తి వివరాలు పొందుపరుస్తామన్నారు. దాని ఆధారంగా ఇళ్లను కొనుగోలు చేయదలచినవారు నేరుగా తమను సంప్రదించి సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారని తెలిపారు. లేనిదానిని ఉన్నట్లు, ఉన్నదానిని లేనట్లు చెప్పేదానికీ, చెప్పి ఒప్పించే తప్పుడు వ్యాపారాలకు మాత్రమే బ్రోకర్లు కావాలి తప్ప నిజాయితీ సంస్థలకు అవసరమే లేదని కొట్టివేశారు. బ్రోకర్లు అవసరమయితే అమెరికా తరహాలో లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టి క్రమబద్ధీకరించటం మేలని సూచించారు. రియల్‌ ఎస్టేట్ల సంస్థల పరమయిన పంట పొలాల్లో ఇళ్లు నిర్మించేంత వరకూ కనీసం తోటల సాగు చేయాలన్న నిబంధన విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని వెంచర్లలోనూ మొక్కలు నాటాలన్న నిబంధన కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు.

గృహశోభ … పత్రికాధిపతి పరేష్‌నాథ్‌ … హింస

గృహశోభ అనీ ఓ తెలుగు మాస పత్రికను ఢిల్లీ ప్రెస్‌ అనే సంస్థ ప్రచురిస్తోంది. 2011 ఆగస్టు నాటికి 104 పత్రికలను ప్రచురించిందట. ఈ సంస్థ హిందీ సహా మరో తొమ్మిది భాషల్లో మొత్తం 31 పత్రికలను ప్రచురిస్తోంది. అంతో ఇంతో పేరున్న చంపక్‌ అనే పిల్లల పత్రికకూడా ఈ సంస్థదే. సలీల నామధేయంతో ప్రారంభించిన రాజకీయ పక్ష పత్రికను ఇప్పుడు శృంగార, సింగారాల రాతలతో నింపుతున్నట్లు అనగా విన్నాను. అన్నట్లు ఉత్తరాదికి చెందిన పరేష్‌నాథ్‌ ఈ సంస్థకు సంపాతకుడూ, ప్రచురణకర్త కూడా. ఈయన భాషా పత్రికల యజమానుల సంఘానికి జాతీయ అధ్యక్షుడట. ఇదంతా కొసరు విషయమే. ఇక అసలు విషయానికొస్తే… అనువాదకులు మొదలు ఉప సంపాదకులు, పత్రికల్ని అమ్మేవాళ్ల మొదలు ప్రకటనల సేకర్తల వరకూ వివిధ ఉద్యోగాల కోసం ఆగస్టు రెండు, మూడు తేదీలలో పరేష్‌ స్వయంగా ముఖాముఖి పరీక్షలు నిర్వహించాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ పత్రిక కార్యాలయం సికింద్రాబాద్‌ సిటిసిలో ఉంది. సిటిసి ఎంత అపరిశుభ్రంగా, ఎంత దరిద్రంగా ఉంటుందో! పైగా వేలాది మందితో నిత్యం రణగొణ ధ్వని. అలాంటి చోట ఓ మారుమూల, చీకట్లో తడుముకుంటూ, రెండో అంతస్తుకు పాక్కుంటూ, ఒక్కోచోట మూత్రమో, మురుగో ఏదోగానీ దాన్లో ఈదుకుంటూ వెళ్తే శిథిలావస్తకు చేరుతోన్న ఓ గది ముందు ఏదో ఏజన్సీ పేరుతో ఓ బోర్డు ఉంటుంది. అదే ఘనత వహించిన ఢిల్లీ ప్రెస్‌ కార్యాలయం. నేను ప్రస్తుతం వెలగబెడుతోన్న ఉద్యోగం బాగానే ఉందిగానీ, వ్యక్తి నడుపుతున్నందున అంతగా నమ్మకం లేక సంస్థ అయితే శాశ్వతంగా పత్రికల్ని నడుపుతుందనీ, నాలాంటి దౌర్భాగ్యులకు మంచి మంచి జీతాలు, ఇతర సౌకర్యాలతో శాశ్వతంగా ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తుందన్న గుడ్డి నమ్మకంతో నేనూ అక్కడకు పోయి ఏడ్చాను లెండి. మధ్యాహ్నం మూడు గంటల నుంచీ ముఖాముఖీ పరీక్ష మొదలవుతుందన్న పత్రికా ప్రకటన నిజమేననుకున్న నాలాంటి వాళ్లందరమూ రెండూ, రెండున్నర గంటలకల్లా అక్కడ పోగుబడ్డాం. మాకున్న ప్రావీణ్యతలకుతోడు లేని పలు రకాల మసాలాలతో పోపుపెట్టి రూపొందించిన అర్హత పత్రాలను ఆఫీస్‌ బాయ్‌ అను ఆ కార్యాలయం సహాయకుడి కాల్మొక్కినంత పనిచేసి అతగాడి చేతిలో పెట్టాము. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవని చెప్పకనే చెప్పటంతో అందరూ నిలువుగాళ్లమీద తపస్సు ప్రారంభించారు. నాలుగవుతుండగా పరేష్‌ అడుగులో అడుగు వేసుకుంటూ కిక్కిరిసిన జనాన్ని తోసుకుని లోపలకు చేరాడు. ఆ తర్వాత మరో అరగంటకు పిలుపులు మొదలు. హమ్మయ్య అనుకున్నాంగానీ, ఆయన తీరు చూసి ఓ వారం గడిస్తేగానీ పరీక్షలు పూర్తిగావని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించేశారు. ఒక్కరితో మాట్లాడటం పూర్తయిన తర్వాత వళ్లు విరుచుకుని, గటగటా మంచినీరు తాగేసి తన పాత సిబ్బందితో బాతాఖానీ కొట్టేసిన తర్వాతగానీ మరొకరికి పిలుపు రాదు. ఇంతకూ ఆయన ఉద్యోగార్థులను అడిగే ప్రశ్న ఒక్కటే, హిందీ వచ్చా (ఆర్‌ యూ నో హిందీ) అని. రాదు (ఐ డోంట్‌ నో) అంటే ఇక అంతే సంగతులు. నాతో అయితే ఇక తొందరగా పో నాయనా! అని హిందీలో కూసినట్లు అన్పించింది.లేచి చెవులు జాడించి కుంటూ వచ్చేశాను. ఇప్పుడు నేను సంపాదకత్వం వహిస్తోన్న పత్రికలను అక్కడకు వచ్చిన మిత్రులకు పంచి వారి నుంచి ఆహా, ఓహో అంటూ గొప్ప ప్రశంసలు అందుకున్నాను. అయితే తెలుగు రాని పరేష్‌కు కూడా వాటిని అందజేసినా వాడెవడికో మొగలి పూవు ఇస్తే ఎదురయిన అనుభవమే నాకూ అక్కడ చవిచూశాను. ఇంతకూ చెప్పొచ్చే దేమిటంటే …. గృహశోభ అంటూ పొదుపుగా బట్టలు తొడుక్కున్న ఆడవాళ్ల చిత్రాలను మదుపు పెడుతూ పాఠకుల్నీ, హిందీ అనువాదాలతో భాషా పత్రిక అంటూ తెలుగులోకాన్నీ, గొర్రెతోక జీతాలతో ఉద్యోగుల్నీ దోచుకుంటున్న పరేష్‌ అనే ఉత్తరాది పెద్దాయన ఢిల్లీ విమానం ఎక్కబోయే ముందు హైదరాబాదులో ఓ సమావేశం నిర్వహించి ిస్థానిక పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ధ్వజమెత్తి మరీ వెళ్లిపోయాడు. వంద పేజీల గృహశోభ జులై సంచికలో అటూ ఇటూ ఎటు తిప్పి చూసినా ఒక్కటీ చదవదగిన అంశం లేకపోగా, 17 పేజీల ప్రకటనలు మాత్రం ఉన్నాయి. అయితే అవన్నీ ఆడవాళ్లు ఉపయోగించే వస్తు సంబంధిత ప్రకటనలు. ప్రభుత్వాన్ని నోరారా తిట్టాడు కదా, ఇక ప్రజల సొమ్ముతో పాలకులు జారీచేసే అసంబద్ధ, అబద్ధాల ప్రచారాలను కూడా పాతిక రూపాయలు పోసి ఎవరయినా గృహహింస క్షమించాలి – గృహశోభ(నం) పత్రికలో వీక్షించవచ్చు.