గృహశోభ అనీ ఓ తెలుగు మాస పత్రికను ఢిల్లీ ప్రెస్ అనే సంస్థ ప్రచురిస్తోంది. 2011 ఆగస్టు నాటికి 104 పత్రికలను ప్రచురించిందట. ఈ సంస్థ హిందీ సహా మరో తొమ్మిది భాషల్లో మొత్తం 31 పత్రికలను ప్రచురిస్తోంది. అంతో ఇంతో పేరున్న చంపక్ అనే పిల్లల పత్రికకూడా ఈ సంస్థదే. సలీల నామధేయంతో ప్రారంభించిన రాజకీయ పక్ష పత్రికను ఇప్పుడు శృంగార, సింగారాల రాతలతో నింపుతున్నట్లు అనగా విన్నాను. అన్నట్లు ఉత్తరాదికి చెందిన పరేష్‌నాథ్ ఈ సంస్థకు సంపాతకుడూ, ప్రచురణకర్త కూడా. ఈయన భాషా పత్రికల యజమానుల సంఘానికి జాతీయ అధ్యక్షుడట. ఇదంతా కొసరు విషయమే. ఇక అసలు విషయానికొస్తే… అనువాదకులు మొదలు ఉప సంపాదకులు, పత్రికల్ని అమ్మేవాళ్ల మొదలు ప్రకటనల సేకర్తల వరకూ వివిధ ఉద్యోగాల కోసం ఆగస్టు రెండు, మూడు తేదీలలో పరేష్ స్వయంగా ముఖాముఖి పరీక్షలు నిర్వహించాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ పత్రిక కార్యాలయం సికింద్రాబాద్ సిటిసిలో ఉంది. సిటిసి ఎంత అపరిశుభ్రంగా, ఎంత దరిద్రంగా ఉంటుందో! పైగా వేలాది మందితో నిత్యం రణగొణ ధ్వని. అలాంటి చోట ఓ మారుమూల, చీకట్లో తడుముకుంటూ, రెండో అంతస్తుకు పాక్కుంటూ, ఒక్కోచోట మూత్రమో, మురుగో ఏదోగానీ దాన్లో ఈదుకుంటూ వెళ్తే శిథిలావస్తకు చేరుతోన్న ఓ గది ముందు ఏదో ఏజన్సీ పేరుతో ఓ బోర్డు ఉంటుంది. అదే ఘనత వహించిన ఢిల్లీ ప్రెస్ కార్యాలయం. నేను ప్రస్తుతం వెలగబెడుతోన్న ఉద్యోగం బాగానే ఉందిగానీ, వ్యక్తి నడుపుతున్నందున అంతగా నమ్మకం లేక సంస్థ అయితే శాశ్వతంగా పత్రికల్ని నడుపుతుందనీ, నాలాంటి దౌర్భాగ్యులకు మంచి మంచి జీతాలు, ఇతర సౌకర్యాలతో శాశ్వతంగా ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తుందన్న గుడ్డి నమ్మకంతో నేనూ అక్కడకు పోయి ఏడ్చాను లెండి. మధ్యాహ్నం మూడు గంటల నుంచీ ముఖాముఖీ పరీక్ష మొదలవుతుందన్న పత్రికా ప్రకటన నిజమేననుకున్న నాలాంటి వాళ్లందరమూ రెండూ, రెండున్నర గంటలకల్లా అక్కడ పోగుబడ్డాం. మాకున్న ప్రావీణ్యతలకుతోడు లేని పలు రకాల మసాలాలతో పోపుపెట్టి రూపొందించిన అర్హత పత్రాలను ఆఫీస్ బాయ్ అను ఆ కార్యాలయం సహాయకుడి కాల్మొక్కినంత పనిచేసి అతగాడి చేతిలో పెట్టాము. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవని చెప్పకనే చెప్పటంతో అందరూ నిలువుగాళ్లమీద తపస్సు ప్రారంభించారు. నాలుగవుతుండగా పరేష్ అడుగులో అడుగు వేసుకుంటూ కిక్కిరిసిన జనాన్ని తోసుకుని లోపలకు చేరాడు. ఆ తర్వాత మరో అరగంటకు పిలుపులు మొదలు. హమ్మయ్య అనుకున్నాంగానీ, ఆయన తీరు చూసి ఓ వారం గడిస్తేగానీ పరీక్షలు పూర్తిగావని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించేశారు. ఒక్కరితో మాట్లాడటం పూర్తయిన తర్వాత వళ్లు విరుచుకుని, గటగటా మంచినీరు తాగేసి తన పాత సిబ్బందితో బాతాఖానీ కొట్టేసిన తర్వాతగానీ మరొకరికి పిలుపు రాదు. ఇంతకూ ఆయన ఉద్యోగార్థులను అడిగే ప్రశ్న ఒక్కటే, హిందీ వచ్చా (ఆర్ యూ నో హిందీ) అని. రాదు (ఐ డోంట్ నో) అంటే ఇక అంతే సంగతులు. నాతో అయితే ఇక తొందరగా పో నాయనా! అని హిందీలో కూసినట్లు అన్పించింది.లేచి చెవులు జాడించి కుంటూ వచ్చేశాను. ఇప్పుడు నేను సంపాదకత్వం వహిస్తోన్న పత్రికలను అక్కడకు వచ్చిన మిత్రులకు పంచి వారి నుంచి ఆహా, ఓహో అంటూ గొప్ప ప్రశంసలు అందుకున్నాను. అయితే తెలుగు రాని పరేష్‌కు కూడా వాటిని అందజేసినా వాడెవడికో మొగలి పూవు ఇస్తే ఎదురయిన అనుభవమే నాకూ అక్కడ చవిచూశాను. ఇంతకూ చెప్పొచ్చే దేమిటంటే …. గృహశోభ అంటూ పొదుపుగా బట్టలు తొడుక్కున్న ఆడవాళ్ల చిత్రాలను మదుపు పెడుతూ పాఠకుల్నీ, హిందీ అనువాదాలతో భాషా పత్రిక అంటూ తెలుగులోకాన్నీ, గొర్రెతోక జీతాలతో ఉద్యోగుల్నీ దోచుకుంటున్న పరేష్ అనే ఉత్తరాది పెద్దాయన ఢిల్లీ విమానం ఎక్కబోయే ముందు హైదరాబాదులో ఓ సమావేశం నిర్వహించి ిస్థానిక పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ధ్వజమెత్తి మరీ వెళ్లిపోయాడు. వంద పేజీల గృహశోభ జులై సంచికలో అటూ ఇటూ ఎటు తిప్పి చూసినా ఒక్కటీ చదవదగిన అంశం లేకపోగా, 17 పేజీల ప్రకటనలు మాత్రం ఉన్నాయి. అయితే అవన్నీ ఆడవాళ్లు ఉపయోగించే వస్తు సంబంధిత ప్రకటనలు. ప్రభుత్వాన్ని నోరారా తిట్టాడు కదా, ఇక ప్రజల సొమ్ముతో పాలకులు జారీచేసే అసంబద్ధ, అబద్ధాల ప్రచారాలను కూడా పాతిక రూపాయలు పోసి ఎవరయినా గృహహింస క్షమించాలి – గృహశోభ(నం) పత్రికలో వీక్షించవచ్చు.
5 ఆగ