అది హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇద్దరు ఇంజినీరింగు ఆచార్యులను కలిసేందుకు ఆర్కిటక్ట్ ఒకరు అక్కడకు వెళ్లారు. ముగ్గురూ ముచ్చటాడుతుండగా….
ఆచార్యుడు – 1 : నాకూ, వీరికీ పక్కపక్కనే చెరొక వంద చదరపు గజాల స్థలాలున్నాయి. సరిపోనంత లేనందున ఇల్లు కట్టుకోలేక పోతున్నాము. పోనీ రెండింటినీ కలిపి ఒకరు తీసుకుందామంటే మా ఇద్దరి దగ్గరా అంత డబ్బు లేదు. ఏమీ పాలుపోవటం లేదు.
ఆర్కిటెక్ట్ : నేనో ఉపాయం చెప్పనా?
ఆచార్యుడు – 2 : భలేవాడివే చెప్పు, చెప్పు.
ఆర్కి: సరే మంచిది. రెండు స్థలాలనూ కలిపేసి ఇంటిని కట్టుకోండి. లాటరీ వేసి ఎవరు కింద ఉండాలో? ఎవరు పైన ఉండాలో తేల్చుకోండి.
ఆచా1 – 2 : ఇదేదో ఆలోచించదగిందిగా ఉందే.
అంతలోనే మరొక ఆచార్యుడు అక్కడకు వస్తూనే… ఏవో రహస్యంగా ప్లాన్లు వేస్తున్నట్లున్నారే! చమత్కరించాడు.
ఆచా – 2 : రహస్యాలా? పాడా!. మా ఇద్దరి స్ధలాల్నీ కలిపి రెండంతస్తుల ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాము.
ఆర్కి : ఇష్టమయితే మీరూ కలవచ్చు. మూడంతస్తులు వేసి, తలా ఒకటి తీసుకోవచ్చు.
ఆచార్యులంతా ఓ పావు గంటసేపు తర్జనబర్జనపడ్డారు. స్థలం ధరలో మూడో వంతును మూడో ఆచార్యుడు చెల్లించే విధంగానూ, కట్టుబడి ఖర్చు ముగ్గురూ భరించేవిధంగానూ ఒప్పందం కుదిరింది. అటూ ఇటూ కాని స్థలాలున్న వారి సమస్య, అసలే లేని ఆచార్యుల సమస్య పరిష్కారమయింది. మరుసటి రోజు నుంచీ పనులు ప్రారంభమయ్యాయి. ఇక రేపో, మాపో లాటరీ తీసి ఎవరికి వచ్చిన అంతస్తులో వాళ్లు కాపురం పెట్టేయటమే తరువాయి.
—————————————————————————–
శరత్ : హలో, సాగర్ నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను.
సాగర్ : హాయ్! శరత్, మా అమ్మగారికి ఇప్పుడు బాగానే ఉంది. పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. మీరేమీ కంగారు పడాల్సిన పనేలేదు. పనులన్నీ చూసుకుని రండి.
శరత్ : అదేమిటీ? మీ అమ్మగారికి కూడా బాగాలేదా? హతవిధి! నేను మా అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో? కనుక్కుందామని ఫోను చేశాను. అయ్యో! మీరూ బాధల్లో ఉన్నారన్నమాట.
సాగర్ : శరత్, మీ అమ్మగారే – మా అమ్మగారయ్యా! మనమంతా ఒక్కటే. వాస్తవానికి నేను చెప్పింది మీ అమ్మగారి గురించే.
కొందరు మిత్రులు కలిసి సొంతంగా నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌వాసులే సాగర్, శరత్‌లు. సాధారణంగా అపార్ట్‌మెంట్లలో గాలించినా దొరకని ఆప్యాయత, స్నేహ మాధుర్యాలు వారి మధ్య పరిమళించటం వెనుక ఏ సూత్రం దాగి ఉందో? తెలుసా!
—————————————————————————–
ప్రతాప్ : అదేంటయ్యా ప్రసాద్, మీ ఆవిడ ఇంట్లో లేనప్పుడు మమ్మల్ని భోజనానికి ఆహ్వానించావు? నువ్వే చేతులు కాల్చుకుంటావా ఏంది? అయినా ఎందుకు చెప్పు. మేమేదో ఒక హోటళ్లో ఇంత తినేసి మా ఊరికి చెక్కేసేవాళ్లం కదా!
ప్రసాద్ : అయ్యయ్యో! అంత మాట అనకండి సార్. మాకు ఇంత నీడ కల్పించిన ఇంజినీరు మీరు. మీరు మా ఊరు వచ్చి హోటల్లో తింటే ఊరుకుంటామా! ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టిచూడండి.
పావు గంట గడిచిందో లేదో బిలాబిలామంటూ పలువురు ఆ ఇంట్లోకి దిగబడ్డారు. అందరి చేతుల్లోనూ గిన్నెలు. హాట్‌బాక్సులు, ఆవకాయ, చింతకాయ తదితర పచ్చళ్ల సీసాలతో దిగబడ్డారు. కమ్మని నెయ్యి వాసన. మూతలు తీసి చూస్తే నాలుగయిదు గిన్నెల్లో గడ్డ పెరుగు. మజ్జిగ చారు, వడియాలు, అప్పడాలు, గారెలు, బూందీ, మైసూర్‌పాక్. ఇక లేని కూరే లేదు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఇంజినీరు వంతయింది. బంధుమిత్రులు కలిసి సొంతంగా నిర్మించుకున్న ఆ అపార్ట్‌మెంటుకు రూపకల్పన చేసింది ఆయనే. స్నేహం, బంధుత్వం, సహాయం, చేయూత, అండదండలు ఇలా మానవత్వానికి మారుపేరుగా నిలిచే ఆప్యాయతలన్నీ సొంతంగా నిర్మించుకునే అపార్ట్‌మెంట్లో వెల్లివిరుస్తాయని ఊహించాడుగానీ ఇంత ఇదిగా ఉంటాయని అనుకోలేదు. ఈనాటి అపార్ట్‌మెంట్లలో ఏవయితే కొరవడ్డాయని ఆందోళన వ్యక్తమవుతుందో, అవన్నీ అక్కడ సాకారమయ్యాయి. తన ఊహ నిజమయి అక్కడ దర్శనమివ్వటంతో ఆనంద భాష్పాలు రాలాయి. నోట్లో పెట్టుకున్న అన్నం ముద్ద …అమ్మ తన చిన్ననాట తినిపించిన గోరుముద్దను గుర్తుకు తెచ్చింది.
సమస్యలు ముదరుపాకాన పడి సమాజాన్ని పట్టిపీడిస్తున్నప్పుడు వాటిని పరిష్కరించటానికి తాను అన్ని యుగాల్లోనూ జన్మిస్తానని చెబుతాడు విష్ణువు. అదెంత నిజమోగానీ, చిన్నదో పెద్దదో సమస్య కొనసాగుతుంటే మాత్రం దాన్ని పరిష్కరించేందుకు పరిశోథకులు పూనుకోవటం, కద్దు. అలా ఇప్పటిదాకా కోట్లాది సమస్యలు పరిష్కారం అయిన విషయం అందరికీ విదితమే. కూడు, గుడ్డ తర్వాత అత్యవసరమైన గూటిని సాకారం చేసుకునే పనిలో నగరవాసులు ,పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
నానాటికీ ఆకాశాన్నంటుతోన్న స్థలం ఖరీదులే ప్రథమ సమస్య. ఏదో ఒక విధంగా స్థలాన్ని సమకూర్చుకుని సొంత ఇల్లు కట్టుకుందామంటే క్షణం క్షణం మీదపడే సమస్యలతో ఎవ్వరికైనా వైరాగ్యం కలుగకపోతే అనుమానించాల్సిందే.
పోనీ అపార్ట్‌మెంటు ఫ్లాటు కొనుక్కుని బతుకీడుద్దామనుకుంటే అది ఒంటిరిగా ఎదుర్కోవాల్సిన మహా నరకం. ప్రాణాలు పోతున్నా పలికేనాధుడుండడు. ఈ పక్కవాళ్లు తెలియదు. ఆ పక్కింటివాళ్లు అసలు తలుపే తీయరు. ఫాట్లో దొంగలు పడి దోచుకుపోతుంటే చూసీ చూడనట్లే వ్యవహరించే ధోరణి అతి సాధారణం.
ధరాభారం … ఒంటరితనం అక్కడ వేధించవు
ఈ సమస్యల పరిష్కారానికి దొరికిన సమాధానమే … ఉమ్మడి నిర్మాణం. అంటే అపార్ట్‌మెంటును సొంతంగా నిర్మించుకోవటమే. బంధుమిత్రులు ఒప్పందం చేసుకోవటంతో ఇది మొదలవుతుందన్నమాట. కాస్త వెసులుబాటుగా ఇంటిని నిర్మించుకోవాలనుకున్నవాళ్లు కొనేంత స్థలమే దీనికీ సరిపోతుంది కాబట్టి, ధర భారం కాదు. ఇక అపార్ట్‌మెంటు వాసులంతా బంధువులుగానో, మిత్రులుగానో, సహచరులుగానో ముందునుంచే బాగా తెలిసినవాళ్లయినందున ఆప్యాయత, అనురాగాలకు కొరవుండదు. దీని వలన రెండు ప్రధాన సమస్యలూ పరిష్కారమవుతాయి. ఇక లాభాలు తీయరుగనుక ఫ్లాటు ఖరీదు కూడా కొనుక్కున్నదానికన్నా కనీసం 20 శాతం తక్కువకే గిట్టుబాటవుతుంది.
చదరపు గజం రూ. 15 వేల చొప్పున కొన్న 250 చదరపు గజాలలో ఓ సొంతిల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ. 1000 చొప్పున 1250 చదరపు అడుగుల మొత్తం కట్టుబడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుంది.
అదే 370 చదరపు గజాలలో రెండు ఇళ్లు నిర్మిస్తే 20 శాతం తక్కువగా అంటే రూ. 40.25 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. దీనినిబట్టి ఎంతమంది కలిసి కట్టుకోబోతున్నారో దానికి అనుగుణంగా స్థలాన్ని కొనుగోలు చేస్తే ధరాభారం తొలగిపోతుంది. ఒక్కరే సొంతగా ఇంటిని నిర్మించుకుంటే స్థలం ధర మొత్తాన్నీ వారొక్కరే భరించాలి. అదే స్థలంలో అపార్ట్‌మెంటు నిర్మిచుకుంటే ఆ స్థలం ఖరీదును అందరూ పంచుకుంటారుగనుక అసలు భారమే కాదు. అందువలన ఇంటి విషయంలో ఇప్పటి వరకూ ధరాభారం సమస్యను పరిష్కరించే సూత్రం ఇదొక్కటే.
ఉమ్మడి నిర్మాణంలో బంధాలు – అనుబంధాలు
బంధువులుగానీ, మిత్రులుగానీ, ఒకే కార్యాలయంలో పనిచేసే సిబ్బందిగానీ, ఒకే ఆలోచనతో పనిచేసే బృందంగానీ కలిసి సొంతంగా అపార్ట్‌మెంట్ నిర్మాణానికి దిగితే కొద్దిపాటి సమస్యలున్నా పలు సమస్యలు పరిష్కారం అవుతాయనటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి ప్లాను ఆమోదం, రుణం మంజూరు తదితర పనులు ఉమ్మడిగా అయితే సులభంగానూ, లంచాలు, కాళ్లతిప్పటా లేకుండా పూర్తవుతాయి.
– ఉమ్మడి నిర్మాణాలను ఇద్దరు మొదలు ఎంతమందయినా కలిసి చేసుకోవచ్చు.
– స్థలం ధరను అందరూ పంచుకుంటారు.
– ఏ పరిసరాలున్న స్థలాన్ని ఎంపికచేసుకోవాలో యజమానులే నిర్ణయించుకోవచ్చు. ధర సమస్య కారణంగా ఊరవతల కొనుగోలు చేయాల్సిన పనిలేదు. ఊరిమధ్యలోనూ కొనొచ్చు.
– భవన నిర్మాణ తీరును నిర్ధేశించవచ్చు.
– నిర్మాణ సామగ్రిని టోకున సరసమయిన ధరకు కొనుగోలు చేయవచ్చు.
– భారాన్ని పెంచే ఏ పనీ చేయనవసరం లేదు.
– చెట్లు నాటేందుకూ, ఆటలకూ ఇలా ఇష్టమైన వాటికి తగిన స్థలాన్ని కేటాయించుకోవచ్చు. అంతగా అవసరం లేని హెలీప్యాడ్‌లు లాంటివాటి జోలికి వెళ్లాల్సిన పనిలేదు.
– నిర్మాణ పనుల్లోనూ, తర్వాత రోజూవారీ ఎదరయ్యే పనులనూ సొంతంగా నిర్వహించి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. వ్యక్తిగత శక్తిని పెంపొందించుకునే వీలుంటుంది. ప్రదర్శించి అందరి మన్ననలనూ అందుకోవచ్చు.
– ప్రతి దానినీ అత్యధికుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్వహించే పద్ధతిద్వారా అది మనదేనన్న భావన పెంపొందుతుంది. ఆ మేరకు ఫలితాలు కూడా ఆశించినమేర వస్తాయి.
– కలిసి ఉంటే దక్కే సుఖాలనూ, సౌలభ్యాలనూ నిజంగా అందరూ అనుభవించవచ్చు.
– ముఖ్యంగా కష్టసమయంలో అందరి అండదండలూ అందుకోవచ్చు. ఆనందాన్ని అందరూ కలిసి ఆస్వాదించవచ్చు.
Archive for ఆగస్ట్ 6th, 2011
6 ఆగ
ధరాభారం … ఒంటరి తనం – సమస్యలకు సమాధానమే ఉమ్మడి నిర్మాణం
6 ఆగ
సంపాదనలో పొదుపు … స్థిరాస్తి రంగంలో మదుపు
26 జులై 2011.
ఉదయం 11.30 గంటలు.
అది హైదరాబాద్‌లోని మాధాపూర్. జనభేరి కార్యాలయం. తూర్పు నుంచి నడినెత్తికి పాకుతోన్న మార్తాండుడు చిమ్ముతోన్న వెలుగుల్లో ఆ కార్యాలయం గోడలకు తాపడం చేసిన గ్రానైట్ రాళ్లు తళాతళా మెరుపులీనుతున్నాయి. కారు దిగుతూనే రియల్ అడ్వైజర్ ప్రతినిధులకు ఆ కార్యాలయ సిబ్బంది నుంచి సాదర స్వాగతం లభించింది. లోపలంతా ప్రశాంతత. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ వాతావరణం మధ్య సంప్రదాయంగా తీర్చిదిద్దిన ఓ గదిలోకి ప్రవేశించిన ప్రతినిధులకు అక్కడ ఓ మౌని దర్శనమిచ్చాడు మాగంటి రాజబాబు. ఏవో నివేదికలను పరిశీలిస్తోన్న ఆయనకు నమస్కరించగానే తలెత్తి చూసి, నవ్వు మోముతో ప్రతి నమస్కారం చేస్తూనే ఆహ్వానం పలికారు.
మాగంటి రాజబాబు అంటే కొందరికి తెలియదేమోగానీ, మురళీమోహన్ అంటే మాత్రం ఎవరికయినా టక్కున గుర్తుకొస్తారు తెలుగు సినీ నటుడు. స్థిరాస్తి రంగంలో అట్టే పరిచయం అక్కరలేని ‘జయభేరి’కి ఆయన అధినేత. అన్నట్లు జయభేరి పేరిటే ఆయన పలు తెలుగు చలనచిత్రాలను కూడా నిర్మించారు. రాజకీయాల్లోనూ ప్రవేశం ఉంది. తెలుగుదేశం నాయకుడాయన. మురళీమోహన్ స్థిరాస్తి రంగంలోకి రాకముందు రాష్ట్రంలో స్థలాల, ఇళ్ల వ్యాపారస్తుల్లో అత్యధికులు సరిహద్దు రాళ్లను పాతేవాళ్లు. మురళీమోహన్ మాత్రం నిజాయితీగా కాళ్లు కదిపారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నిజాయితీ – నమ్మకమే ఆయనను నిర్మాణ రంగంలో రారాజును చేశాయి. ఇదేదో సంప్రదాయంగానో, మొహమాటం కోసమో చెబుతున్న మాట కానేకాదు. నిజ్జంగా నిజం. రెండు రెళ్లు నాలుగన్నంత నిజం. అందుకే ఆయన స్థిరాస్తి రంగంలో స్ఫూర్తిమంతులు.
పొదుపు – మదుపు విషయంలో మురళీమోహన్‌కు తెలుగు సినీ కథానాయకుడు శోభన్‌బాబు స్ఫూర్తి.
నడినత్తికి ఎగబాకేందుకు మార్తాండుడు పరుగులు పెడుతోన్న వేళ ‘రియల్ అడ్వైజర్’ ప్రతినిధులు జరిపిన మాటామంతీ ఇది. చదవండి మరి.
పొదుపుకూ – మదుపుకూ మారు పేరనదగిన తెలుగు సినీ నట దిగ్గజం శోభన్‌బాబు పేరును తొలుత తలచుకుని రియల్ అడ్వైజర్ ప్రతినిధులతో తన మాటామంతిని ప్రారంభించారు మురళీమోహన్. సినీమా జనం నిన్నటిని గుర్తుంచుకోరన్న విమర్శ జనసామాన్యంలో సాధారణంగా వినపడుతుంది. అలాంటిది తన జీవితానికి మార్గదర్శకం చేసినవారిని మరవకపోవటం మురళీమోహన్ విభిన్నత కావచ్చు.
మాగంటి రాజబాబుగా మురళీమోహన్ 1963లో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీలో భాగస్వామిగా చేరారాయన. ఆయన మిత్రులు శారద చిత్రాన్ని నిర్మిస్తోన్న సమయంలో ఆ సినిమా కథానాయకుడు శోభన్‌బాబుతో పరిచయం ఏర్పడింది. దీనికితోడు విజయవాడవాసి ఒకరు ఇద్దరికీ మిత్రుడు కావటంతో అప్పుడప్పుడూ కలుసుకోవటం, ముచ్చట్లు కలబోసుకోవటం కొనసాగింది. తామిద్దరి మనస్తత్వాలూ ఒక్కటేనని ఆ ఇద్దరికీ ఆ ముచ్చట్లలోనే బోధపడింది.
ఆ తర్వాత 70వ దశకంలో మురళీమోహన్‌గా మాగంటి రాజబాబు సినీ రంగ ప్రవేశం చేయటంతో వారిద్దరి బంధం మరీ గట్టిపడింది. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. మురళీమోహన్ నేతృత్వంలోని జయభేరి నిర్మించిన ముగ్గురు మిత్రులు చిత్రంలో శోభన్‌బాబు నాయకుడిగా నటించారు. అలా గుభాళిస్తోన్న వారి స్నేహ పరిమళం కేవలం సినిమాలతో ఆగిపోలేదు. మురళీమోహన్ సంపాదన ఎలా ఉందో? శోభన్‌బాబు ఆరా తీసేవారు. ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేయాలని సూచించేవారు. పొదుపు చేయటమే కాదు తెలివిగా మదుపు చేయాలని కూడా సలహా ఇచ్చేవారట.
నిజమయిన అంచనా
మురళీమోహన్ తన తొలినాటి సినీ ఆదాయం నుంచి చేసిన పొదుపు సొమ్ములో కొంత వెచ్చించి సినిమాల నిర్మాణం చేపట్టారు. కొన్ని చిత్రాలను కొనుగోలు చేసి విడుదల చేయటం ప్రారంభించారు. ఈ రెండింటికీ తోడు రెండు సినీ పంపిణీ సంస్థల్లో భాగస్వామిగా చేరారు. ఈ విషయాలు విన్న వెంటనే శోభన్‌బాబు అన్నారూ… ”జాగ్రత్తగా సినిమాలు తీసుకుంటే అంతో ఇంతో లాభాలు రావచ్చు. పరిశీలించి చిత్రాలు కొనుగోలు చేస్తే కూడా ఆదాయాలు గడించవచ్చు. అయితే వాళ్లెవరో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేసి, నీకు లాభాలు పంచుతారంటే మాత్రం నాకు నమ్మకం లేదు. మురళీ ఆలోచించు. జాగ్రత్తగా పొదుపు చేసుకో. లేకుంటే అసలుకే ఎసరు తప్పదు”. శోభన్‌బాబు హెచ్చరిక మూడు మాసాల్లోనే నిజమయి కూర్చుంది. ఆ రెండు పంపిణీ సంస్థలూ మూతపడ్డాయి. ఒకదానిలో పెట్టుబడి సొమ్మే పోయింది. కానీ రెండోదానికి సంబంధించి పెట్టుబడి పోయిందే కా తన జేబు నుంచే వేలాది రూపాయల్ని అప్పులవాళ్లకు చెల్లించక తప్పలేదు. ఆ విషయాన్నే శోభన్‌బాబుతో మురళీమోహన్ చెప్పారు. అప్పుడు మురళీమోహన్‌ను చెంత కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ శోభన్‌బాబు ‘భూమోపదేశం’ చేశారు. ”ప్రపంచంలో మూడొంతుల నీరుండగా, నాలుగో వంతు మాత్రమే భూమి. అందులోనూ అడవులు, కొండలు, ఎడారులు 15- 20 శాతం ఉంటాయి. జనాభా చూస్తే రోజురోజుకూ పుట్టలు పగులుతోంది. మరి భూమి అంగుళం కూడా పెరగదు. జనాభాకు తగినంత భూమి ఈ ప్రపంచంలో లేదు. అందువలన దానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇంత వరకూ అందరికీ తెలిసిందే. అయితే గిరాకీ ఉన్న భూమి మీద పెట్టుబడి పెట్టేందుకు మాత్రం అత్యధికులు ఆలోచించటం లేదు. తెలివి తక్కువగా పెట్టుబడులు పెట్టి చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలిపోవద్దు. మీకు నచ్చితే స్థిరాస్తి రంగంలోకి దిగండి. ఎన్నటికీ నష్టపోరు.” అంటూ మురళీమోహన్ మదిలో ‘స్థిరాస్తి విత్తనాలు’ చల్లారు. అది మొదలు ఆనాటి మద్రాసులో స్థలాలను కొనటం ప్రారంభించారు మాగంటి.
భాగ్యనగరంలో
తర్వాత తెలుగు చలనచిత్ర రంగం హైదరాబాదుకు మారటంతో మురళీమోహన్ కూడా తెలుగు రాజధానికి చేరుకున్నారు. ఇక్కడ ఏదయినా పరిశ్రమ ప్రారంభించాలని తొలుత ప్రయత్నించారు. అయితే పరిశ్రమకు సరిపడేంత పెట్టుబడి లేకపోవటంతోపాటు శోభన్‌బాబు హితోపదేశం గుర్తుకొచ్చి మరొక ముగ్గురితో కలిసి స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. కొంపల్లి మేడ్చెల్ రోడ్డులో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాస్తవానికి అప్పటిదాకా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అంటే స్థలం చుట్టూ నాలుగు రాళ్లు పాతి అమ్మకాలకు పెట్టేవాళ్లు. కానీ దానికి భిన్నంగా దేవాలయం సహా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేసి మరీ ఆ స్థలాలను మురళీమోహన్ బృందం అమ్మేసింది. తర్వాత మాధాపూర్ జయభేరి ఎన్‌క్లేవ్ ప్రాజెక్టును ముగ్గురి భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తిచేశారు. తర్వాత ఎవరికి వారే స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకోవాలని భాగస్వాములు నిర్ణయించుకుని విడిపోయారు.
చారిత్రక కారణాలరీత్యా హైదరాబాదులో భూసేకరణలో సాధారణంగా తలెత్తుతోన్న సమస్యల నుంచి బయటపడేందుకుగాను భవన నిర్మాణ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్న మురళీమోహన్ ప్రస్తుతం మాధాపూర్‌లో సిలికాన్ కౌంటీ ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని ఆనాడు కొనుగోలు చేశారు. నాణ్యంగా నిర్మాణ పనులు చేయాలనీ, కొనుగోలుదారులకు ఇచ్చిన ప్రతి హామీనీ చేతల రూపాన చూపాలనీ జయభేరి విధానంగా నిర్ణయించారు. అయితే తగిన అనుభవం లేనందున మొత్తం స్థలంలో ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించారు. దీంతో పలువురు బిల్డర్లు ఎగతాళి వ్యాఖ్యానాలు చేశారు. అయినా వెనుకంజ వేయకుండా అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల తరహా సౌకర్యాలను అదేతీరున సిలికాన్ కౌంటీలో ఏర్పాటు చేశారు. మూడు నాలుగేళ్లపాటు కుటుంబమంతా కష్టపడి ప్రాజక్టును పూర్తిచేశారు. తీరా ఆ ప్రాంతం ఊరికి దూరంగా ఉందంటూ స్థానికులెవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇక చేసేది లేక మురళీమోహన్ అమెరికా, దుబాయ్, సింగపూర్ తదితర దేశాలు పర్యటించి తెలుగువాళ్లను కలిశారు. తమ అపార్ట్‌మెంట్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉన్నాయంటే తొలుత నమ్మకపోయినా నెమ్మదిగా ఒక్కొక్కరూ స్వయంగా పరిశీలించి కొనుగోలు చేశారు. అలా తమ తొలి ప్రాజెక్టు వలన లాభనష్టాలు లేకపోయినా జయభేరికి బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని ఆయన ఈ ప్రతినిధితో సంతోషంగా గుర్తుచేసుకున్నారు. గొట్టాల ద్వారా గ్యాస్ సరఫరా సౌకర్యాన్ని రాష్ట్రంలో తొలిగా తామే సిలికాన్ ఫ్లాట్లలో ఏర్పాటు చేశామన్నారు.
ఏదో ఒకటి తేల్చేయాలి
రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ఏదో ఒకటి తక్షణం తేల్చేయాలని మురళీమోహన్ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రం కలిసి ఉన్నా నష్టం లేదనీ, విభజించినా కష్టం లేదని పేర్కొన్నారు. దేశంలో ఏ నగరానికీ లేని విధంగా ఔటర్ రింగు రోడ్డుతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, తగినంత మానవవనరులు ఉన్నందున హైదరాబాదు నగరం తెలంగాణకే పరిమితి అయినా అభివృద్ధి ఆగిపోదని విశ్లేషించారు. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోతే మద్రాసు ప్రగతి ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. హైదరాబాదు ఆంధ్రలో ఉందా? తెలంగాణలో ఉందా? అని పెట్టుబడిదారులు చూడరంటూ, ఇక్కడ నెలకొన్న అపార సౌకర్యాలు చూసి పరిశ్రమలు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఏటా 30 శాతం పెట్టుబడులు చెన్నై, బెంగళూరుకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే తీరు ఇంకా కొనసాగితే రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు, చేనేత కార్మికులు ఆకలి చావులకు గురవతున్నట్లు ఉద్యోగాలు దొరక్క ఇంజినీర్లు కూడా అదే దోవ పట్టక తప్పదని ప్రభుత్వాన్ని డగ్గుత్తికతో హెచ్చరించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో వారూవీరూ అని కాకుండా అందరూ ఆలోచించాలని వినమ్రంగా అభ్యర్థించారు.
విద్యాదాతా సుఖీభవ!
ఆహార్యం చూడగానే పెద్ద మనిషని అన్పించే మురళీమోహన్లో గుప్తదాత కూడా దాగి ఉన్నాడు. ఆయనంటారూ ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు ఎవ్వరూ ఏదీ తేరు – పోయేప్పుడు కట్టుకు పోము. ఈ సూత్రాన్ని హృదయాంతరాళాల్లో ప్రతిష్టించుకున్న మురళీమోహన్ తన పేరిట ఏర్పాటుచేసిన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 900 మంది తెలుగు పేద విద్యార్థులకు చేయూత ఇచ్చారు. ఇస్తున్నారు. తొలుత నూరు రూపాయల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ రోజుల్ని ఆయన ఎన్నడూ మరచిపోరు. తనకు సమాజం ఇచ్చిన ఆదాయాన్ని తిరిగి సమాజానికే అంకితం చేయటం మానవత్వం తప్ప త్యాగం కాదంటారు. ట్రస్టును ఆరేళ్ల క్రితం స్థాపించారు. ఇప్పటికే రెండు బృందాలు అంటే 400 మంది తమ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరిపోయారని మెరిసే కళ్లతో మురళీమోహన్ లెక్కలు వేశారు. 95 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయిన పేద విద్యార్థుల ఉన్నత విద్యార్జనకు తమ సంస్థ ఆర్థిక, హార్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ప్రగతి సూచికలను సమీక్షిస్తామని వివరించారు. రియల్ అడ్వైజర్ ప్రతినిధులు వెళ్లిన సమయంలో ఆయన విద్యార్థుల ప్రగతి సూచికలను నిశితంగా పరిశీలిస్తూ కన్పించారు. 75 శాతానికంటే మార్కులు తగ్గితే ఉత్తరాల ద్వారా హెచ్చరిస్తామనీ, అదే ఒక్క పాఠ్యాంశంలో ఉత్తీర్ణులు కాలేకపోయినా సాయం నిలిపివేస్తామని చెప్పారు.
ఇష్టపడి మొదలు పెట్టు … కష్టపడి కొనసాగించు
ఆయనంటారూ ఏ పనినయినా ఇష్టపడి మొదలు పెట్టాలని. మొదలు పెట్టిన తర్వాత బాగాలేదంటూ నిలిపివేయకుండా కష్టపడి కొనసాగిస్తే ఏదో ఒకరోజు మనదవుతుందని నమ్మమంటారు. రిక్షా కార్మికుడయినా, ఐటీ ఉద్యోగయినా ఎంత సంపాదించామని కాకుండా, ఎంత పొదుపు చేశామని లెక్కలు వేసుకోవాలని సూచించారు. అదే రేపటికి ఉపకరిస్తుందని వివరించారు. పొదుపు సొమ్మును తెలివిగా పెట్టుబడి పెడితే అదే అభివృద్థని అభివర్ణించారు.
మధ్యవర్తులకు చెల్లు
తమ సంస్థ నిబద్ధత కారణంగా ఇప్పటికీ ఒక్క బ్రోరు కూడా లేకుండానే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. తమ ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలుదారులు నేరుగా కొంటున్నారని వివరించారు. ప్రాజెక్టుకు రూపకల్పన చేయగానే తమ వెబ్‌సైట్లో పూర్తి వివరాలు పొందుపరుస్తామన్నారు. దాని ఆధారంగా ఇళ్లను కొనుగోలు చేయదలచినవారు నేరుగా తమను సంప్రదించి సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారని తెలిపారు. లేనిదానిని ఉన్నట్లు, ఉన్నదానిని లేనట్లు చెప్పేదానికీ, చెప్పి ఒప్పించే తప్పుడు వ్యాపారాలకు మాత్రమే బ్రోకర్లు కావాలి తప్ప నిజాయితీ సంస్థలకు అవసరమే లేదని కొట్టివేశారు. బ్రోకర్లు అవసరమయితే అమెరికా తరహాలో లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టి క్రమబద్ధీకరించటం మేలని సూచించారు. రియల్ ఎస్టేట్ల సంస్థల పరమయిన పంట పొలాల్లో ఇళ్లు నిర్మించేంత వరకూ కనీసం తోటల సాగు చేయాలన్న నిబంధన విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని వెంచర్లలోనూ మొక్కలు నాటాలన్న నిబంధన కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు.