Archive for ఆగస్ట్ 22nd, 2011

ఆర్థిక విధానాలే అవినీతికి మూలం – రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత సాయినాథ్‌

సమాజంలో వివిధ రకాల అసమానతలు, సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వని అపరిమిత అధికారాలు అవినీతికి ప్రధాన కారణాలని ప్రఖ్యాత జర్నలిస్టు, రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మూలాలను పరిష్కరించకుండా అవినీతి నిర్మూలన సాధ్యంకాదని స్పష్టం చేశారు. ప్రజాశక్తి 31వ వార్షికోత్సవం సందర్భంగా శాసనమండలిలో పిడిఎఫ్‌ పక్ష నేత ఎంవిఎస్‌ శర్మ అధ్యక్షతన ‘అవినీతి-పర్యవసానాలు-పరిష్కారాలు’  అంశంపై విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సులో సాయినాథ్‌ ప్రసంగించారు. లోక్‌పాల్‌ బిల్లు, దాని పరిధిలోకి ప్రధానిని చేర్చడం అవసరమని అన్నారు. లోక్‌పాల్‌తో మొత్తం అవినీతి అంతమైపోతుందన్న అంచనాలు తప్పనీ, సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న అవినీతిని అదొక్కటే నిర్మూలించలేదనీ స్పష్టం చేశారు. జనలోక్‌పాల్‌ బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం ఇవ్వకుండా, బిల్లు ఆమోదంపై కేంద్రానికి డిక్టేటర్‌ మాదిరి డెడ్‌లైన్‌ విధించడం ప్రజాస్వామ్య భారతావనిలో పౌర సమాజానికి తగదని విమర్శించారు. ఎవరికీ జవాబుదారుకాని లోక్‌పాల్‌ వ్యవస్థ ఉండాలనుకోవడం పొరపాటన్నారు. ప్రజాస్వామ్యమంటేనే జవాబుదారీతనమనీ, దాన్ని విస్మరించడం సరైనదికాదనీ అన్నారు. దేశంలోని అత్యధిక ధనవంతులు, కార్పొరేట్‌ కంపెనీలు రోజూ రూ.240 కోట్లు పన్ను ఎగ్గొట్టిన ధనాన్ని స్విస్‌తో సహా విదేశీ బ్యాంకుల్లోని అక్రమ ఖాతాలకు తరలిస్తున్నాయని చెప్పారు.
వాషింగ్టన్‌లోని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రేషన్‌ (జిఎఫ్‌ఐ) నివేదిక ప్రకారం 1948-2008 మధ్య రూ.25 లక్షల కోట్లు విదేశీ బ్యాంకులకు తరలిపోగా, ఐఎంఎఫ్‌ నివేదిక ప్రకారం ఈ మొత్తంలో సగంకంటే ఎక్కువ సొమ్ము 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత గత ఇరవై ఏళ్లలో లూటీ అయిందని తెలిపారు. సగటున ప్రతి గంటకూ రూ.10 కోట్లు దేశం నుంచి బయటకుపోయి విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతోందని చెప్పారు. 2011-12 బడ్జెట్‌లో కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రూ.88వేల కోట్లు ప్రత్యక్ష పన్నుల రాయితీ ఇచ్చిందని ఈ మొత్తంతో దేశవ్యాప్తంగా సమగ్ర ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఏటేటా కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రాయితీలు పెంచుకుంటూపోతోందనీ, గత కొన్నేళ్లలో కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం రూ.ఐదు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చిందని చెబుతూ దీన్ని చట్ట పరిధిలో జరుగుతున్న అతి పెద్ద అవినీతిగా అభివర్ణించారు. ఈ అవినీతి లోక్‌పాల్‌ పరిధిలోకి రాదని చెప్పారు. ఎయిర్‌ ఇండియాని సర్వనాశనంచేసిన ప్రఫుల్‌పటేల్‌ ఎన్నికల అఫిడవిట్‌ల ప్రకారం క్యాబినెట్‌ మంత్రుల్లో అత్యధిక ధనవంతుడనీ, ఆయనకి మీడియా నాలుగు సార్లు అవార్డు ఇచ్చిందనీ, అదే ప్రస్తుత మీడియా ధోరణి అని చెప్పారు. మోస్ట్‌ హానెస్ట్‌ పిఎం, మోస్ట్‌ కరప్ట్‌ గవర్నమెంట్‌ సరితూగవని చెబుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఐడియలాజికల్లీ కరెప్ట్‌ అని విమర్శించారు.
దేశంలో బిలియనీర్ల ఆస్తులు ఏటేటా పెరుగుతుంటే 2007 అర్జున్‌సేన్‌ కమిటీ నివేదిక ప్రకారం 83 కోట్ల మంది భారతీయుల ఆదాయం రోజుకు రూ.20 అని చెప్పారు. పట్టణాల్లో రూ.20, గ్రామాల్లో రూ.15లోపు రోజువారీ ఆదాయం ఉన్నవారిని బిపిఎల్‌ కుటుంబాలుగా కేంద్రం నిర్వచిస్తోందని అన్నారు. సక్సేనా కమిటీకి తమ అంచనాల కంటే 20శాతం మించొద్దని ప్లానింగ్‌ కమిషన్‌ పేర్కొందని వెల్లడించారు. సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టాన్ని ప్రయివేటు, కార్పొరేట్‌ కంపెనీలకు కూడా వర్తింపజేయాలని సూచించారు. అవినీతిపై గొంతెత్తి లోక్‌పాల్‌ కోసం పట్టుబడుతున్న పౌరసమాజం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేట్‌ కంపెనీలను బహిష్కరించాలనీ, వాటి షేర్లను విక్రయించాలని పిలుపిస్తే మంచిదనీ అన్నారు. దేశంలో వ్యవస్థలన్నీ విఫలమైపోయాయనుకోనక్కర్లేదని చెబుతూ కామన్‌వెల్త్‌ కుంభకోణాన్ని కాగ్‌, స్పెక్ట్రమ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, రాడియా స్కామ్‌ని ఆదాయపన్ను శాఖ, సత్యం కుంభకోణాన్ని ఆడిటర్లు, కెజి బేసిన్‌ స్కామ్‌ని అఫీషియల్‌ ఎంక్వైరీ బయటపెట్టాయని గుర్తు చేశారు. మేలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో గెలిచిన 825 మంది శాసనసభ్యుల ఆదాయం రూ.2,128 కోట్లనీ, ఉపాధిహామీ పేదలు ఈ స్థితికి చేరుకోవాలంటే వందల ఏళ్లుపడుతుందని చెప్పారు.