హజారే ఉద్యమం _ కొన్ని కోణాలు

అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండో స్వాతంత్య్రోద్యమం నడుస్తోందా ? అవినీతికి వ్యతిరేకంగా ప్రజా విప్లవం పెల్లుబికిందా ?? సంఫ్‌ు పరివార్‌ దీనిని సొమ్ము చేసుకోవాలని చూస్తోందా ??? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్దా ఒక్కో సమాధానముంది. ఏ సమాధానం సరైనదన్న విషయాన్ని కాలమే త్వరలో నిర్ణయించనుంది. అవునన్నా, కాదన్నా…ఇప్పుడు దేశంలో అవినీతి అతిపెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెట్రోల్‌ ధరలు తగ్గించాలని దేశ ప్రజలందరూ నినదించవచ్చు..ప్రభుత్వం ఒక్కరోజులో తగ్గించనూ వచ్చు. వేతనాలు పెంచాలని, లాకౌట్లు ఎత్తివేయాలని కార్మికులు సమ్మె చేయవచ్చు…ప్రభుత్వాలు, యాజమన్యాలు తలొగ్గవచ్చు. ఇలా అత్యధిక శాతం ప్రజలు కొన్ని ‘నిర్దిష్టమైన’ డిమాండ్ల ఆధారంగా (నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై) ఏకమవ్వడం..ఆందోళనల్లోకి రావడం సర్వ సాధారణం. అవినీతిని అంతమొందించాలని ‘ దేశ ప్రజలందరూ ‘ వీధుల్లోకి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే ! వ్యవస్థీకృతమైన అవినీతిని అరికట్టడం, ఒకటి రెండు చట్టాలతోనే సాధ్యమౌతుందని భావించడమూ అటువంటిదే. అన్నా హజారే దీక్ష రూపంలో ప్రస్తుతం దేశవ్యాపితంగా సాగుతోన్న ఆందోళనలోనూ పైకి కనిపించని వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. సయోధ్యకు ఇరుపక్షాలూ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో..అన్నా బృందం, కేంద్ర ప్రభుత్వం మధ్య నేడో, రేపో ఒక ఒప్పందం కుదరవచ్చు. ఈ సయోధ్యమాటున అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దాగున్న కీలకాంశాలను మరుగున పడేయడం మాత్రం సాధ్యం కాదు.

కల్లోల కాంగ్రెస్‌

ప్రస్తుతం యుపిఎ 2 ప్రభుత్వం రెండు సంవత్సరాల వయసులోనే అపారమైన అవినీతి (అప్రతిష్ట) మూటగట్టుకుందనడంలో వివాదం లేదు. హాజారే, రామ్‌దేవ్‌బాబా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ‘ఉద్యమాన్ని’ ఎదుర్కోవడంలోనూ తలపండిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పసితనాన్ని ప్రదర్శించింది. హజారేబృందాన్ని లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా తయారీ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం – ఆపాదమస్తకమూ హజారే అవినీతిపరుడేనని విమర్శించడం….రామ్‌దేవ్‌బాబాతో విమానాశ్రయానికి వెళ్లి చర్చలు జరపడం – దీక్షలో కూర్చున్న వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడం…ఇలా గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఆగస్టు 16న హజారేను ఇంటి నుండి నేరుగా తీహార్‌ జైలుకు తరలించడం వీటికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్య హక్కులపై అధికార పార్టీ నగంగా చేసిన దాడి. లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా కమిటీలోకి కొందరు వ్యక్తులను సభ్యులుగా తీసుకోవడం కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం..నాడు కాంగ్రెస్‌కు అప్రజాస్వామికంగానూ, పార్లమెంటును అగౌరవపర్చే చర్యగానూ అనిపించకపోవడం విడ్డూరం. అప్రజాస్వామిక డిమాండ్లతో అన్నా ఆందోళన చేస్తున్నారని విమర్శించే హక్కు ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉందా అన్నదే ప్రశ్న. అవినీతి వ్యతిరేక ఉద్యమాలపై, వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులపై గత ఏప్రిల్‌ నుండీ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ సూత్రబద్ధమైన, నిలకడైన వైఖరిని ప్రదర్శించలేదు. 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, ఇలా ఏపూటకాపూట బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ఇంత జరుగుతున్నా అవినీతి అంశంపై కనీసం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. ‘ఆర్థిక సంస్కరణల అమలు వల్లే దేశంలో అవినీతి పెరిగిందని కొందరు అంటున్నారు. ఇది అవాస్తవం. సంస్కరణలకూ, అవినీతికీ సంబంధం లేదు. ఇంకా కొన్ని రంగాల్లో సంస్కరణల కారణంగానే, అవినీతి తగ్గింది’ అంటూ ప్రధాని మన్మోహన్‌ రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ జెండాను, ఎజెండానూ చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యలో సంస్కరణలకు ఎక్కడ అగౌరవం కలుగుతుందోనన్న ఆందోళన తప్ప…ప్రధాని ప్రకటనలో మరేమీ కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు.

ఆరెస్సెస్‌ చొరబాటు యత్నాలు

గత ఏప్రిల్‌లో మొదటి సారి జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళనకన్నా ప్రస్తుత ఆందోళన విస్తృతి పెరిగింది. హజారే దీక్షలో చొరబడి దీనిని సొమ్ము చేసుకోవాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్యమంలో తమ శ్రేణులు పూర్తి స్థాయిలో, ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేత సునీల్‌ జోషి కొద్ది రోజుల క్రితం స్వయంగా చెప్పడం, ఎబివిపి ఆధ్వర్యంలో నడిచే ‘ఇండియా అగైనెస్ట్‌ కరప్షన్‌’ ఈ ఉద్యమంలో చొరబడడం దీనినే సూచిస్తున్నాయి. అన్నా ఉద్యమాన్ని 22 మంది సభ్యుల కోర్‌కమిటీ నడిపిస్తోంది. ఇందులో కనీసం సగం మంది సభ్యులతో అన్నాకు ముఖ పరిచయం కూడా లేదన్నది వాస్తవం. ఈ కమిటీ కింద మరో 13 ఉప కమిటీలు వివిధ అంశాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మీడియా, సమాచార విభాగం దేశవ్యాప్తంగా రోజుకు పది లక్షల మొబైల్‌ ఫోన్లకు, 20 లక్షల ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తోంది. ఇటువంటి వాటిలో ఆరెస్సెస్‌ చొరబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అని అన్నా ఆందోళనలో ప్రజలెవరూ స్వచ్ఛదంగా పాల్గొనడం లేదన్నది దీనర్ధం కాదు. హజారే ఉద్యమంతో ఊపందుకున్న అవినీతి వ్యతిరేక వాతావరణం నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ఇంకొకవైపు నుంచి ప్రయత్నిస్తున్నది. అదలా ఉంచితే అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, యువత, మధ్యతరగతి జీవులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం ఆహ్వనించదగ్గ పరిణామమే.

పార్లమెంటు…ప్రజాస్వామ్యం

ఈ ఉద్యమం సందర్భంగా అన్నా బృందం లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించిన కొన్ని అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఫలానా గడువులోగా ఫలానా చట్టాన్ని రూపొందించాలని శాసించజూడడం అన్నా బృందం పట్టుబట్టడం విమర్శలకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ…పార్లమెంటు అధికారమే అత్యున్నతమైనదని భీష్మించుక్కూర్చొన్న యుపిఏ ప్రభుత్వ ధోరణి ప్రజల ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నది. ‘అవినీతి’ అంశానికి నిర్దిష్టత్వం లేదు కాబట్టి దేశ కార్పొరేట్‌ రంగం కూడా అన్నా ఆందోళనకు మద్దతునిస్తున్నది. అన్నా బృందం ప్రస్తావిస్తున్న జన లోక్‌పాల్‌లో ప్రభుత్వ అవినీతి గురించి తప్ప కార్పొరేట్‌ అవినీతి గురించిన ఊసే లేకపోవడం గమనార్హం. ఇప్పుడు వెల్లువెత్తిన అవినీతి కుంభకోణాలన్నీ దాదాపు ఈ కార్పొరేట్‌ రంగం ప్రమేయంతో జరిగినవేనన్న విషయం మరువరాదు. రెండో దశ సంస్కరణలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్న అసంతృప్తితో ఉన్న కార్పొరేట్‌ గణం… కూడా హజారే ఉద్యమానికి మద్దతు నిస్తున్నదనే వార్తలను కొట్టిపారేయలేం. మధ్యతరగతి స్పందిస్తుందన్న కారణం చెప్పి, అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కార్పొరేట్‌ మీడియా కల్పిస్తోన్న ప్రాధాన్యతా శ్రుతి మించుతోందనే చెప్పాలి. ఏడాది క్రితం ఇదే రామ్‌లీలా మైదానం నుండి ఇదే జంతర్‌మంతర్‌ వరకూ లక్షలాది అంగన్‌వాడీలు ప్రదర్శనగా వస్తే…’ ట్రేడ్‌యూనియన్‌ ఆందోళనలతో ఢిల్లీ వాసులుకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ‘ అంటూ లోపలి పేజీల్లో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తను ఇచ్చింది. అదే పత్రిక ప్రస్తుతం అన్నా ఉద్యమంపై నిత్యం 8 పేజీలకు తగ్గకుండా వార్తలిస్తోంది. ‘సంస్కరణలను కొనసాగించడంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం విఫలమౌతోంది. ఈ కారణంగా దేశంలో మధ్య తరగతి ఆకాంక్షలు, అభిలాషలు తీరడం లేదు. అందువల్లే దేశ మధ్యతరగతి అన్నా ఉద్యమానికి బాసటగా నిలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, కాంగ్రెస్‌ పుట్టి మునిగినట్లే’ అని మరో ప్రముఖ ఆంగ్ల పత్రిక సంపాదకుడు రెండ్రోజుల క్రితం వ్యాసమే రాశారు !

-డి.జయప్రకాష్

2 వ్యాఖ్యలు

  1. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగులు చేసిన సమ్మెకి మీడియా పెద్ద పబ్లిసిటీ ఇవ్వలేదు. ప్రైవేటీకరణకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళకి మాత్రమే మీడియా బాగా పబ్లిసిటీ ఇస్తుంది.

    స్పందించండి

  2. లంచం ఇవ్వను అని ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే భయపడి చెప్పలేకపోవచ్చు.అందుకే లంచగొండి ఎదుట గుంపుగా చెప్పాలి.లంచాన్ని వ్యతిరేకించేవారికి మద్దతు ఇవ్వాలి.లంచం ఇవ్వాల్సి రావటం మానసిక హింస,మనసును గాయపరిచే నేరం.లంచం ఇస్తేగానీ పనిచెయ్యక పోవటం అశక్తుడైన నిరాయుధుడైన బాధితుడిని కట్టేసి కొట్టటం లాంటి నేరం.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: