పటిష్ట లోక్‌పాల్‌ కోసం ప్రభుత్వం స్పందించాలి – ప్రకాశ్‌ కరత్‌

ప్రస్తుతానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పటిష్టమైన లోక్‌పాల్‌ అథారిటీని ఏర్పాటు చేయడమొక్కటే మార్గం. ప్రభుత్వ లోక్‌పాల్‌ బిల్లును ప్రజలు తిరస్కరించారు. ఈ బిల్లు వామపక్షాలకు, ఇతర ప్రతిపక్షాలకు కూడా సమ్మతం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బిల్లులో తగు మార్పులు చేర్పులు అయినా చేయాలి. లేదా పటిష్టమైన లోక్‌పాల్‌ ఏర్పాటుకు వీలుగా తిరిగి కొత్త బిల్లును తేవాలి. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఈ పని చేయడం మినహా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మరో మార్గం లేదు.

అన్నాహజారే ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్షకు దేశ వ్యాపితంగా మద్దతు లభిస్తోంది. జన లోక్‌పాల్‌ బిల్లు కోసం సాగిస్తున్న ఈ ఆందోళనకు మద్దతు పలుకుతున్నవారిలో ఎక్కువమంది పట్టణ, మధ్యతరగతికి చెందినవారే. దీంట్లో గణనీయమైన సంఖ్యలో పాల్గొంటున్న యువతలో కూడా ఎక్కువ మంది ఈ దొంతరకు చెందినవారే. ఏప్రిల్‌లో అన్నా హజారే మొదటిసారి నిరాహార దీక్షకు దిగినప్పటి నుంచి అవినీతి వ్యతిరేకోద్యమం బాగా ఊపందుకుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

అవినీతిని ఎదుర్కోవడంలో యుపిఏ ప్రభుత్వ వైఫల్యం, దాని ధోరణి ప్రజాగ్రహం విస్తరించడానికి కారణమైంది. మొదటి అంశం యుపిఏ ప్రభుత్వాన్ని ప్రజలు అవినీతిలో భాగస్వామిగా చూస్తున్నారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో అత్యంత అవినీతికర ప్రభుత్వమిది. మచ్చలేని ప్రధాని అంటూ ఎంతగా ఊదరగొట్టినా ఆయన సారథ్యంలోని ప్రభుత్వం పట్టణ మధ్య తరగతి ప్రజల చైతన్య వెల్లువలో మునిగిపోతున్నది. మన్మోహన్‌ సింగ్‌ను సంస్కర్త, సచ్ఛీలుడు, నిజాయితీ పరుడు అని ఇంతవరకూ పొగుడుతూ వచ్చింది ఈ తరగతే.

అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వంలోని మంత్రులు సమర్థించిన వైనం, 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణంలో జీరో లాస్‌ థియరీ (ప్రభుత్వ ఆదాయానికి పైసా కూడా నష్టం లేదని చెప్పడం)ని ముందుకు తేవడం వంటివన్నీ ఈ ప్రభుత్వం అవినీతిలో నిలువునా కూరుకుపోయిందని, ఎలాంటి అర్థవంతమైన చర్య తీసుకోగలిగే స్థితిలో లేదన్న భయాలు నిజమేనని నిర్ధారిస్తున్నాయి. అది 2జి కానివ్వండి, కామన్వెల్త్‌ క్రీడలు కానివ్వండి ఈ కుంభకోణాలన్నిటిపైన సుప్రీం కోర్టు, కాగ్‌ వంటి సంస్థల ఆదేశాలమేరకే సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు సాగిస్తోంది, తప్పు చేసినవారిని ప్రాసిక్యూట్‌ చేస్తోంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్‌ బిల్లుతో ఈ సమస్య మరింత జటిలంగామారింది. ఇంతకుముందు ఉన్న విజిలెన్స్‌, దర్యాప్తు సంస్థల పొందికనే కొనసాగించాలని ఈ బిల్లు కోరుతోంది. ప్రధానమంత్రిని లోక్‌పాల్‌ పరిధి నుంచి మినహాయించింది. లోక్‌పాల్‌ నియామక పద్ధతిని బట్టి చూస్తే ఇదొక స్వతంత్ర సంస్థ కాదని అర్థమవుతుంది. ఈ బిల్లు ద్వారా ఏర్పడే లోక్‌పాల్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపైన, లేదా బడా వ్యాపారులు- పాలకపార్టీ నేతలు- బ్యూరోక్రాట్ల మధ్య గల అపవిత్ర పొత్తు పైన స్వతంత్రంగా చర్య తీసుకోలేని, అసమర్థ సంస్థగా మిగిలిపోతుంది.

రెండవది, ఆగస్టు16న అన్నా హజారే నిరాహార దీక్ష ప్రారంభించకముందే ఆ రోజు ఉదయాన్నే ఆయనను, ఆయన సహచరులను అరెస్టు చేయించిన తీరు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని బోనులో నిలబెట్టింది. అవినీతికి చిహ్నంగా మారిన ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిని తీహార్‌ జైలుకు పంపడం ప్రజలపై దాడి మాత్రమే కాదు, శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే పౌరుల ప్రజాతంత్ర హక్కుపై దాడి కూడా. ఈ చర్యతో ప్రభుత్వం అటు ప్రజల్లోను, ఇటు పార్లమెంటులోపల ఒంటరి అయింది. హజారే నాయకత్వంలోని ఉద్యమాన్ని పార్లమెంటుపైన, ప్రజాతంత్ర సంస్థలపైన దాడిగా పాలక పార్టీ నిందించింది. పార్లమెంటులో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాక, దానిపై ఎవరు ఏ విధమైన ఆందోళన చేసినా అది పార్లమెంటుపై దాడే అవుతుందని పాలకపార్టీ నేతలు చెబుతున్నారు. ఇది బయటకు చూడడానికి సబబుగానే అనిపించవచ్చు. అయితే, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించే హక్కు, దానికి వ్యతిరేకంగా పోరాడే హక్కు రాజకీయ పార్టీలకు, పౌర సంస్థలకు ఉన్న తిరుగులేని హక్కు అన్న విషయం మరచిపోరాదు. కార్మికవర్గానికి వ్యతిరేకమైన బిల్లులను చాలా వాటిని వామపక్షాలు, కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. వాటికి వ్యతిరేకంగా సంఘటిత నిరసన చర్యలు చేపట్టాయి. పోరాటాలు సాగించాయి. బీమా, బ్యాంకింగ్‌ తదితర రంగాలను విదేశీ సంస్థలకు బార్లా తెరవడానికిగాను తీసుకొస్తున్న ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా సమ్మెలు జరిగాయి. అంతెందుకు, 2002లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక (పోటా) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడుకాంగ్రెస్‌ దానిని వ్యతిరేకించింది. అది చట్టంగా మారిన తరువాత కూడా దానిని ఉపసంహరించాలని డిమాండ్‌ చేసింది.

అవినీతి అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. దీనిపై ప్రజల్లో చైతన్యం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్న పట్టుదల అంతకంతకూ పెరుగుతోంది. ఇది స్వాగతించదగినది. అయితే, ప్రజాజీవనానికి సంబంధించిన అన్ని రంగాలను పట్టి పీడిస్తున్న ఈ అంతులేని అవినీతికి కారణమేమిటన్నదానిపై సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం. ప్రస్తుత అవినీతి జబ్బు, దాని ప్రభావాలు, కారణాలకు సంబంధించి సిపిఐ(ఎం) తన అవగాహనను ఇప్పటికే స్పష్టంగా వెల్లడించింది.

గత రెండు దశాబ్దాల సరళీకరణ, నయా ఉదారవాద విధానాల అమలు ఫలితంగా ఉన్నత స్థానాల్లో అవినీతి సంస్థాగతమైంది. నయా ఉదారవాద విధానాలు వచ్చాక అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈ అవినీతిలో ఎక్కువ భాగం బడా వ్యాపార వేత్తలు, పాలక పార్టీ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య అపవిత్ర పొత్తు వల్ల వచ్చిందే. ఈ ఏడేళ్ల యుపిఏ ప్రభుత్వం, అంతకుముందున్న ఆరేళ్ల ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన విధానాలు బడా వ్యాపారుల ప్రయోజనాలను ఎలా కాపాడుతున్నదీ, పైన పేర్కొన్న ఈ అపవిత్ర కూటమి సహజ వనరుల లూటీకి ప్రయివేటీకరణ ఎలా ఉపయోగపడుతున్నదీ, భూమి, ఖనిజాలు, గ్యాస్‌ వంటి సహజ వనరులను భారతీయ, విదేశీ బడా వ్యాపారులు కొల్లగొట్టుకోవడానికి వీలుగా వాటిని బదలాయిస్తూ యుపిఏ ప్రభుత్వం తన విధానాలను, వ్యవస్థలను ఎలా మలచుతున్నదీ మనం చూస్తున్నాము. నయా ఉదారవాద విధానాలు రాజకీయ వ్యవస్థను బడా పెట్టుబడిదారుల చేతిలో సాధనంగా మార్చుతున్నాయి. రాజకీయాలను వ్యాపారంగాను, రాజకీయాల ద్వారా వ్యాపారాలు సాగించే ధోరణిని పెంచుతున్నాయి.

అత్యున్నత స్థానాల్లో అవినీతికి వ్యతిరేకంగా సాగించే పోరాటం బహుముఖంగా ఉండాలి. అందుకు పటిష్టమైన లోక్‌పాల్‌ అథారిటీ ఏర్పాటుతో బాటు ఎన్నికల్లో పెరిగిపోతున్న ధన ప్రాబల్యాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంస్కరణలు తేవాలి. అలాగే న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో అవినీతిని అరికట్టేందుకు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. నల్లధనాన్ని వెలికితీసేందుకు, పన్ను ఎగవేతదారుల స్వర్గధామాలుగా ఉన్న విదేశాలలోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. పైన పేర్కొన్నవన్నీ నయా ఉదారవాద విధానాల ముఖ్య లక్షణాలు. అవినీతికర పద్ధతుల ద్వారా, సహజ వనరులను కొల్లగొట్టడం ద్వారా బడా వ్యాపారులు పెద్దయెత్తున పెట్టుబడి పోగేసుకునేందుకు వీలుకల్పిస్తున్న ఈ విధానాలకు స్వస్తి పలకాలి.

హజారే నేతృత్వంలోని ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ప్రధాన సెక్షన్‌ పట్టణ మధ్య తరగతి. వీరిలో చాలా మంది మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, నయా ఉదారవాద విధానాలను సమర్థిస్తున్నవారే. ఇప్పుడు తమ దైనందిక జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న అవినీతి మహమ్మారి నుంచి తమను ఆదుకునేందుకు ఒక రక్షకుడు కావాలని వారు కోరుకుంటున్నారు. వారు అవినీతి పోవాలనుకుంటున్నారు. అదే సమయంలో తమకు లబ్ధి చేకూర్చే ప్రస్తుత ఆర్థిక విధానాలు యథావిధిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. అంతేకానీ, తమను పీడిస్తున్న అవినీతికి, నయా ఉదారవాద విధానాలకు మధ్యన ఉన్న సజీవ లింకును వారు చూడలేకపోతున్నారు.

రాజకీయాలను యావగించుకోవడం, రాజకీయనాయకులందరినీ ఒకే గాటన కట్టి నిందించడం, పార్లమెంటును శాసించాలని చూడడం వంటి ధోరణులవైపు మధ్య తరగతి మొగ్గు చూపుతోంది. దాని స్వభావమే అంత.

ధనస్వామ్యం పట్ల వ్యక్తమైన న్యాయమైన ఆగ్రహం రాజకీయ వ్యవస్థపై ఆధిపత్యం చలాయించే స్థితికి వచ్చింది. రాజకీయ పార్టీలను టార్గెట్‌గా పెట్టుకోవడం ద్వారానో, కేవలం దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అవినీతిపై కేంద్రీకరించడం ద్వారానో ఈ ధనస్వామ్యం, అవినీతి పొత్తుపై పోరాడలేము. ఇటువంటి అవ్యవస్థిత స్వభావమే అన్నా హజారే ఉద్యమంలో కనిపిస్తోంది. కార్పొరేట్‌ మీడియాతో సహా మితవాద శక్తులు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. అవినీతి మూలాలపైకి గాకుండా ఉద్యమ దృష్టిని ఇవి పక్కకు మళ్లిస్తున్నాయి. సమాజంలో అవినీతి ఇంతగా పెరిగిపోవడానికి గల అసలు కారణాలు ప్రజలకు తెలియనీయకుండా జాగ్రత్తగా మరుగున పరచే యత్నాలు చేస్తున్నాయి. ఇటీవల హిందూ పత్రిక ప్రచురించిన సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీస్‌ సంస్థ సర్వేలో అత్యంత అవినీతిపరులెవరు అని ఒక ప్రశ్న అడిగారట. దానికి ఆ సర్వేలో ఇలా సమాధానం వచ్చిందట. ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత అవినీతిపరులని ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 32 శాతం మంది అభిప్రాయపడగా, ఎన్నికైన ప్రజా ప్రతినిధులేనని 43 శాతం మంది చెప్పారట. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు అత్యంత అవినీతిపరులని కేవలం మూడు శాతం మంది మాత్రమే చెప్పారని ఆ సర్వే తెలియజేస్తోంది. ఇదీ మధ్యతరగతి వారిలో ఉన్న బలమైన అబిప్రాయం. ఇటీవల కాలంలో వెలుగుచూసిన ప్రతి భారీ కుంభకోణమూ బడా వ్యాపారుల లేదా కార్పొరేట్‌ సంస్థలు, అవినీతిపరులైన ప్రజా సేవకులు (మంత్రులు కానీయండి, పౌర ఉన్నతాధికారులు కానీయండి) కుమ్మక్కవడం ద్వారా జరిగినవే. 2జి స్పెక్ట్రమ్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, కెజి గ్యాస్‌ కుంభకోణం ఇలా దేనిలో చూసినా వీటి వెనక బడా వ్యాపారుల హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్‌ బిల్లులో ఈ రకమైన అవినీతిపై అసలేమాత్రం దృష్టి పెట్టలేదు. జన లోక్‌పాల్‌ బిల్లులో మాత్రం ఇటువంటి సందర్భాల్లో వ్యాపారులు అక్రమంగా కాంట్రాక్టులు పొందినట్లు తేలితే వాటిని రద్దు చేయాలని ఒక క్లాజ్‌ను మాత్రం పేర్కొన్నారు.మొత్తం మీద ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అవినీతికి మూలమైన ఈ ప్రధాన కారణాన్ని విస్మరించింది.

అవినీతిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిపిఐ(ఎం), వామపక్షాలు తమ ప్రచారాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తాయి. లోక్‌పాల్‌ బిల్లుతో బాటు, న్యాయవ్యవస్థలో జవాబుదారీని పెంచేందుకు ఒక ప్రత్యేక చట్టం కోసం పోరాడతాయి. న్యాయమూర్తులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు, న్యాయమూర్తు నియామక వ్యవహారాలను చూసేందుకు జాతీయ స్థాయిలో జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుకు వీలుగా ఈ చట్టం ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులను బడా వ్యాపారులకు ధారాదత్తం చేసే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం కొనసాగిస్తాయి.

ప్రస్తుతానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పటిష్టమైన లోక్‌పాల్‌ అథారిటీని ఏర్పాటు చేయడమొక్కటే మార్గం. ప్రభుత్వ లోక్‌పాల్‌ బిల్లును ప్రజలు తిరస్కరించారు. ఈ బిల్లు వామపక్షాలకు, ఇతర ప్రతిపక్షాలకు కూడా సమ్మతం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బిల్లులో తగు మార్పులు చేర్పులు అయినా చేయాలి. లేదా పటిష్టమైన లోక్‌పాల్‌ ఏర్పాటుకు వీలుగా తిరిగి కొత్త బిలునైనా తేవాలి. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఈ పని చేయడం మినహా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మరో మార్గం లేదు. దీక్ష చేస్తున్న అన్నా హజారేబృందంతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. పటిష్టమైన లోక్‌పాల్‌ కోసం తిరిగి తాజాగా బిల్లును తెచ్చి పార్లమెంటులో చర్చకు, ఆమోదానికి పెట్టాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: