Archive for సెప్టెంబర్, 2011

కేజీ గ్యాస్‌ – రిలయన్స్‌ లూటీ

రిలయన్స్‌ తన చిత్తం వచ్చినట్టు కేజీ బేసిన్‌లో వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ పట్టువదలని విక్రమార్కునిలా కెజి గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే కాలం వెళ్లబుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు.

ఇటీవల వెల్లడయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక మన రాష్ట్రంలోని కృష్ణా గోదావరి (కెజి) బేసిన్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ కంట్రాక్టు వ్యవహారంలో చోటుచేసున్న అనేక అవకతవకలను ఎత్తిచూపింది. గత కొన్నేళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్రంలోను, రాష్ట్రంలోను ఈ భారీ లూటీని ఎండగట్టి, చేస్తున్న ఆందోళనల సహేతుకతను ఈ నివేదిక ధ్రువీకరిస్తున్నది. సహజ వనరుల అన్వేషణ వెలికితీతలకు సంబంధించి భారత ప్రభుత్వం, పని అప్పగించబడిన ప్రైవేటు సంస్థల మధ్య ప్రాతిపదిక ఒప్పందం అయిన ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టును (పిఎస్‌సి) రిలయన్స్‌ ఉల్లంఘించిన తీరును కాగ్‌ స్పష్టం చేసింది. పెట్టుబడి వ్యయాన్ని అనుచితంగా పెంచి ఉత్పత్తిలో అత్యధిక వాటాను రిలయన్స్‌ కాజేస్తున్న వైనాన్ని వివరించింది.

భారత దేశంలో కనుగొన్న అతి పెద్ద గ్యాస్‌ నిక్షేపాలు ధీరూబారు-1, ధీరూబారు-3 క్షేత్రాలు. అంతేకాదు, ఇవి దేశంలో అతిపెద్ద చమురు అన్వేషణా క్షేత్రాలు కూడా. ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టు ప్రకారం రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ తర్వాత కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని వదిలివేయాలి, రెండవదశ అన్వేషణ తర్వాత మరో 25 శాతం ప్రాంతాన్ని వదిలి వేయాలి. చమురు కనుగొన్న ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటిస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత పరిమాణంలో గ్యాస్‌ లభిస్తుంది అన్నదాన్ని బావులు తవ్వడం ద్వారా కచ్చితంగా నిర్ధారిస్తారు. డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించిన దాన్ని కాంట్రాక్టుదారు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మిగతా కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ప్రభుత్వం తిరిగి తీసుకున్న దానిని ఆసక్తికలిగిన ఇతర పార్టీలకు కాంట్రాక్టుకు ఇస్తుంది. కాని ఇక్కడ రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ ముగిసిన తర్వాత 25 శాతం మిగతా ప్రాంతాన్ని అప్పగించకుండానే రెండవ దశ అన్వేషణకు పూనుకుంది. ఆ తర్వాత 2009లో మొత్తంగా 765 చదరపు కిలోమీటర్ల కాంట్రాక్టు ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌, చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యానికి ప్రభుత్వం కట్టబెట్టింది. మొదటి దశలో రిలయన్స్‌ తన కంట్రాక్టు ప్రాంతంలో కేవలం వాయవ్య ప్రాంతంలో మాత్రమే అన్వేషణ జరిపి, రెండవదశకు సాగిపోయింది. బావులు తవ్వి కచ్చితంగా డిస్కవరీని నిర్ధారించడానికి బదులు, భూప్రకంపనల అధ్యయనం ఆధారంగా నిక్షేపాలగురించి రిలయన్స్‌ పేర్కొన్న అంచనాలను ఆమోదించి ప్రభుత్వం మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించింది.

ఈ విధంగా మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించడాన్ని సమీక్షించమని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖను కాగ్‌ ఆదేశించింది. మొదటి దశ రెండవ దశ అన్వేషణ తర్వాత తిరిగి అప్పగించాల్సిన 25 శాతం ప్రాంతాన్ని కూడ నిర్ధారించమని కోరింది. మొదటి దశలో కాని, రెండవ దశలో కాని నిర్దేశిత ప్రాంతంలో, నిర్దేశిత కాలవ్యవధిలో కనుగొన్న నిక్షేపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, కాలపరిమితి తర్వాత ఆ ప్రాంతంలో తవ్వి కనుగొన్న క్షేత్రాలను కచ్చితంగా మినహాయించాలని కూడ చెప్పింది. ఈ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని, ఎట్టిపరిస్థితిలోను మినహాయింపులు ఇవ్వకూడదని, డిస్కవరీ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మరొకరికి కాంట్రాక్టుకు ఇవ్వడం ద్వారా ఇంధన వనరుల అన్వేషణ సంపూర్ణంగా జరుగుతుందని చెప్పింది.

కాగ్‌ నివేదిక ఎత్తిచూపిన మరొక ప్రధాన అంశం పెట్టుబడి వ్యయం అంచనాలను భారీగా పెంచడం గురించి. మొదటి దశలో కనుగొన్న వనరులను అభివృద్ధి చేయడానికి 240 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని రిలయన్స్‌ 2004లో చూపించింది. కానీ ఆ తర్వాత 2006లో అనుబంధ అంచనాలో మొదటి దశకు 520 కోట్ల డాలర్లు, రెండవ దశకు 360 కోట్ల డాలర్లు అవుతుందని చూపించింది. అనుబంధ అంచనాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపచేసుకోవడానికి ముందే దాని ప్రకారం అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టారు. డి-1, డి-3 క్షేత్రాలను సకాలంలో అభివృద్ధి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని కాంట్రాక్టరు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆమోదం దానంతటదే వస్తుందన్న ధీమాతో ఇలా చేస్తుంటారని కాగ్‌ పేర్కొంది.

ఇలా పెట్టుబడి వ్యయ అంచనాను పెంచడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం ప్రకారం ఒక ఏడాదిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, అన్వేషణా వ్యయం, అభివృద్ధికి అయిన వ్యయం కలుపుకొని ఆ ఏడాది ఉత్పత్తి అయిన దానిలో ‘కాస్ట్‌ పెట్రోలియం’ను నిర్ణయిస్తారు. దానికోసం ఆ ఏడాది అయిన ఉత్పత్తిలో 90 శాతం వరకు మినహాయిస్తారు. మిగతాదాన్ని ‘ప్రాఫిట్‌ పెట్రోలియం’గా గుర్తిస్తారు. ఈ ప్రాఫిట్‌ పెట్రోలియంలో కూడ మొత్తం పెట్టుబడిని బట్టి కాంట్రాక్టరుకు వాటా లభిస్తుంది. మిగిలినదే ప్రభుత్వానికి దక్కేది. వనరుల అభివృద్ధి వ్యయం అంచనా ఇలా పెరగడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి అధికంగా జరిగే తొలి దశలో ప్రభుత్వం వాటా నామమాత్రంగా ఉంటుంది. క్రమంగా చివరికి వాటా పెరిగినా ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. అధిక వాటా ప్రభుత్వానికి లభించే సమయానికి అసలు ఆ వనరే వట్టిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే అనేక దేశాలు పెట్టుబడి వ్యయం అంచనాల పెంపుదలపై కచ్చితమైన, నిఘాను, నియంత్రణను అమలుచేస్తున్నాయి. ఉదాహరణకు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ పెట్టుబడి వ్యయం 5 లక్షల డాలర్లు పెరిగితే దాన్ని ప్రభుత్వ ప్రతినిధులు కూడ సగం మంది ఉండే మేనేజింగ్‌ కమిటీ ఆమోదించి తీరాలని నిబంధన విధించింది. అలాంటి పద్ధతి మనకు లేదు.

మరొక ముఖ్యమైన అంశం గ్యాస్‌ ధర. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వలోని సాధికార కమిటీ రిలయన్స్‌ గ్యాస్‌కు ఒక ఎంఎంబిటికి 4.2 డాలర్ల ధరను నాలుగేళ్ల క్రితమే ఆమోదించింది. ఇది అంతకుముందు రిలయన్స్‌ సంస్థ ఎన్‌టిపిసికి సరఫరా చేస్తానన్న 2.34 డాలర్ల కన్నా ఎక్కువ. అంబానీ సోదరులు తమ ప్రైవేటు ఒప్పందంలో అంగీకరించుకున్న 2.25 డాలర్ల కన్నా ఎక్కువ. 4.33 డాలర్లను అనుమతించమని రిలయన్స్‌ చేసిన ప్రతిపాదనను 0.1 శాతం తగ్గించి ప్రభుత్వం ఆమోదించింది. దీని మూలంగా ఆ గ్యాస్‌ను వినియోగించే విద్యుత్‌ కేంద్రాలు, ఎరువుల ఫ్యాక్టరీలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అంతిమంగా భరించేది ప్రజలే. గ్యాస్‌ను వెలికి తీయడానికి ఒక ఎంఎంబిటికి ఒక డాలరుకు మించి ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెప్పలేదని నిపుణులు ఎన్ని సార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు దీన్ని కాగ్‌ ప్రశ్నించినా ప్రభుత్వం నుండి మౌనమే సమాధానం.

ఆరంభంలోనే చెప్పినట్లు ఈ అన్ని అంశాల గురించి చాల కాలంగా పోరాటం చేస్తున్నది సిపిఎం పార్లమెంటు సభ్యుడు తపన్‌ సేన్‌. 2006 డిసెంబరు 21న మొదలుపెట్టి అనేక లేఖలను పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు రాశారు. వాటి కాపీలను ప్రధానమంత్రికి పంపించడంతోపాటు నేరుగా ఆయనకూ లేఖలు రాశారు. రాష్ట్రానికి చెందిన అప్పటి సిపిఎం పార్లమెంటు సభ్యులు పి. మధు, ఎం. బాబూరావు ప్రధానికి లేఖ రాస్తూ కెజి బేసిన్‌లో రిలయన్స్‌ వెలికితీసే గ్యాసుకు నిర్ణయించిన అహేతుకమైన ధర గురించి, అన్యాయమైన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం గురించి ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ముందుగా మన అవసరాలకు వినియోగించాలని, ఆ తర్వాతనే బయటికి తరలించాలని కోరారు. సహజవనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పినదాన్ని అమలుచేయాలని, లేదంటే ప్రభుత్వానికి లభించే గ్యాస్‌లో అయినా 50 శాతం ఈ రాష్ట్రానికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ 2007లోనే ఈ అంశంపై సిపిఎం ఎంపీల లేఖలు, పొలిట్‌బ్యూరో ప్రకటనలతో పాటు, పలువురు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో ఒక బుక్‌లెట్‌ను ప్రచురించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఈ బుక్‌లెట్‌ ముందుమాటలో ”సహజవాయు నిక్షేపాలు రాష్ట్రంలో లభిస్తున్నప్పటికీ వాటి అభివృద్ధి మీద, వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. పెత్తనమంతా కేంద్రానిదే. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలలో భాగంగా ఇప్పుడంతా ప్రైవేటు సంస్థలదే రాజ్యంగా మారిపోయింది. ముఖ్యంగా రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యాన్ని సంపాదించి తన చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమేమో నామమాత్రంగా లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నది.” అని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, కెజి బేసిన్‌ గ్యాస్‌పై రాష్ట్రానికే హక్కు అని నినదిస్తూ ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా కెజి బేసిన్‌ గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే సరిపుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు. పైగా ఆంధ్రప్రదేశ్‌ను పెట్రోలియం, కెమికల్స్‌,పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌గా తయారుచేస్తానని ఒక వైపున గొప్పలు చెప్పుకొంటూ, తన ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకున్న కాకినాడ ఓఎన్‌జిసి రిఫైనరీ బయటికి తరలిపోతున్నా అడ్డుకోలేకపోయారు.

-గుడిపూడి విజయరావు

కోనసీమ క్రాప్‌ హాలిడేలో కాలిపోతున్న బతుకులెవరివి?

వ్యవసాయ కూలీగా కౌలు చేస్తున్నవారు కూలిపై వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేదరైతుగా కౌలుచేస్తున్న వారు సొంత భూమి పై వచ్చిన ఆదాయంలో వచ్చిన కొంత భాగాన్ని కూడా కౌలుసాగు నష్టంలో కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రాప్‌ హాలీడే ప్రకటించిన 3 మాసాల్లోనే అటు వ్యవసాయం లేకపోవడంతో కొత్తగా అప్పులిచ్చేవాళ్ళు లేక పాత అప్పులు వత్తిడితో దిక్కుతోచక కోనసీమలో 10 మంది కౌలురైతుల ఆత్మహత్యతో వారి బతుకులు కాలిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమగా పిలువబడే అమలాపురం ప్రాంతంలో 8 మండలాల్లో పూర్తిగాను 5 మండలాల్లో పాక్షికంగాను సుమారు 80 వేల ఎకరాల్లో భూస్వాములు, పెద్దరైతులు క్రాప్‌ హాలీడే (పంట విరామం) ప్రకటించారు. పేదరైతులు, కౌలురైతులు చేసేదిలేక అయిష్టంగానే ఫాలో అయినారు. దీనికి కారణాలను, పరిష్కారాలను సూచించేందుకు రిటైర్డు చీఫ్‌ సెక్రటరీ మోహన్‌కందా కన్వీనర్‌గా క్రాప్‌ హాలీడే పరిశీలనా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఒకరోజు మాత్రమే ఆ ప్రాంతంలో పర్యటించింది. వ్యవసాయ కార్మికులు, పేదరైతులు, కౌలురైతులను కలుసుకోకుండానే పాక్షిక పరిష్కారాలతో రిపోర్టును రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. ఈ పరిస్థితుల్లో క్రాప్‌ హాలీడేకు ముందు తర్వాత పచ్చని పంట మంటల్లో కాలిపోతున్న బ్రతుకులెవరివన్నది మౌలిక ప్రశ్న. అప్పుడే ప్రభుత్వాలు, సమాజం ఆదుకోవాల్సిందెవరిని అనేది తేలుతుంది.

ప్రత్యేకించి కోససీమ ప్రాంతంలో సాగవుతున్న భూమిలో 80 శాతం పైగా కౌలురైతులే సాగుచేస్తున్నారు. సామాజికంగా చూస్తే వీరిలో అత్యధికులు దళితులు, బిసిలు. వర్గరీత్యా వ్యవసాయ కార్మికులు, పేదరైతులు. రెండు పంటలకు కౌలు సుమారు 24 బస్తాలుగా ఉంది. ప్రభుత్వ బ్యాంకులు పావలా వడ్డీ రుణాలు వ్యవసాయం చేయని భూ యజమానులకే ఇస్తున్నందున కౌలురైతులు వ్యవసాయ పెట్టుబడికి 48శాతం వడ్డీ రేటుకు కమీషన్‌, వడ్డీ, ఫెర్టిలైజర్‌ వ్యాపారుల(వీరే కౌలుకిస్తున్న భూ యజమానులుగా కూడా ఉంటున్నారు.) వద్ద అప్పుగా తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నామకా తెరిచి నాణ్యతా ప్రమాణాల పేరుతో నామమాత్రంగా కొంటున్నారు. అవి పలుకుబడి కల్గిన పెద్దరైతుల వద్ద, మిల్లర్ల వద్ద మాత్రమే. దీంతో మొదటి పంట భూయజమానులకు కౌలుగా చెల్లించగా రెండవ పంటను అయినకాడికి పంట కల్లాల్లోనే మద్దతు ధర కన్నా 100 నుండి 200 రూపాయలు తక్కువకు పెట్టుబడి పెట్టిన షావుకారులకే కౌలు రైతులు, పేదరైతులు అమ్ముకోవలసి వస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలు తరుచూ రావడంతో పంట దెబ్బతిని నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ కూలీగా కౌలు చేస్తున్నవారు కూలిపై వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేదరైతుగా కౌలుచేస్తున్న వారు సొంత భూమి పై వచ్చిన ఆదాయంలో వచ్చిన కొంత భాగాన్ని కూడా కౌలుసాగు నష్టంలో కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రాప్‌ హాలీడే ప్రకటించిన 3 మాసాల్లోనే అటు వ్యవసాయం లేకపోవడంతో కొత్తగా అప్పులిచ్చేవాళ్ళు లేక పాత అప్పులు వత్తిడితో దిక్కుతోచక కోనసీమలో 10 మంది కౌలురైతుల ఆత్మహత్యతో వారి బతుకులు కాలిపోయాయి.

కోనసీమలో వ్యవసాయం గిట్టుబాటు కానిదెవరికి?

తమ భూములను కౌలుకిస్తూ ఏ ఖర్చు పెట్టకుండా, ఒకరోజూ శ్రమ చేయకుండా ఎకరానికి 24 బస్తాలు రెండుపంటలకు కౌలుగా భూ యజమానులు తీసుకుంటున్నారు. సుమారు 18 వేల రూపాయల ఆదాయం పొందుతున్న వీరికి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం ఏమిటి ? వ్యవసాయం చేయకపోయినా వేలు, లక్షల్లో బ్యాంకుల నుండి పావలా వడ్డీపై సబ్సిడీ పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట వేయకపోయినా, నష్టం జరక్కపోయినా పంట నష్టపరిహారాలు, పంటభీమా పరిహారాలు వ్యవసాయం చేయనందుకు బోనస్‌ అన్నట్టుగా వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెతగా ప్రభుత్వం భూయజమానులకు కట్టబెడుతోంది. అయినా మాకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, అందుకే క్రాప్‌హాలీడే చేస్తున్నామని వీరు గొంతెత్తి అరవడం ”తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా” లేదూ! వీరికే వడ్డీ వ్యాపారాలు, కమీషన్‌ వ్యాపారాలు, ఫెర్టిలైజర్స్‌ షాపులు, ట్రాక్టర్లు , పట్టణాల్లో వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎకరానికి 25 వేల రూపాయల నికరాదాయం వచ్చే ఎకరాల కొద్దీ కొబ్బరి తోటలూ వీరికి ఉన్నాయి. క్రాప్‌హాలీడే పేరుతో కౌలు రైతులకు రుణార్హత కార్డులివ్వని ప్రభుత్వం సాగు చేయకపోయినా భూ యజమానులకు మాత్రం పావలా వడ్డీ రుణాలు ఇచ్చి తన వర్గ నైజాన్ని చాటుకున్నది. భూ యజమానులే షావుకార్లుగా కూడా ఉండి కౌలురైతుల, పేదరైతులకు పెట్టుబడిపెట్టిన పేరుతో వారి దగ్గర తెగ్గోసి ధాన్యం కొని నిల్వచేసి హెచ్చురేటుకు అమ్ముకుంటారు. 2009, 2010 సంవత్సరాల్లో గతంలో లాగా నిల్వచేసిన ధాన్యానికి హెచ్చురేటు రాలేదన్నదే వీరి దుగ్ధ. అందుకే వీరు సహజంగానే క్రాప్‌ హాలీడేకి నాయకత్వం వహించారు. వాస్తవంగా కనీస మద్దతు ధరలు అందని, లేటుగా కాలువలు వదలడం వలన పంట నష్టపోతున్న కౌలురైతుల, పేద రైతుల్లో అసంతృప్తిని వాడుకున్నారు. వీరి తరపున బికెఎస్‌, రైతాంగ సమాఖ్య లాంటి కార్పొరేట్‌ వ్యవసాయ అనుకూల సంఘాలు క్రాప్‌హాలీడేకు మద్దతు పలుకుతూ నష్టపోతున్న కౌలురైతులను, పేదరైతులను వదిలేసి భూ యజమానులకే ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం వ్యవసాయం చేయని భూయజమానులకు కోరడం న్యాయమా? వారి వర్గ నైజమా? తెలుగుదేశం, బిజేపి, లోక్‌సత్తా పార్టీలు గల్లీ నుండి ఢిల్లీ పార్లమెంటు దాకా ఇదే డిమాండ్‌ చేయడం తగునా? లోపాయికారిగా అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు దీన్నే కోరుకుంటున్నారు. ఈ తంతే రాష్ట్రంలో అక్కడక్కడా ఇతర జిల్లాల్లోను జరుగుతోంది.

అణగదొక్కబడుతున్న పేద, కౌలు రైతుల, కూలీల గొంతు

అమలాపురం ప్రాంతంలో భూకేంద్రీకరణలు ఎక్కువ. వ్యవసాయ కార్మికులూ ఎక్కువే. దళితులు, బిసీలు ఎక్కువ మంది కూలీలుగా ఉన్నారు. క్రాప్‌ హాలీడేతో 3 మాసాలుగా వ్యవసాయ పనులు లేవు. ఉపాధి హామీ పనులు నామమాత్రం. పెరిగిన ధరలతో కుటుంబాన్ని పోషించుకోవడానికి వలసలు పోతున్నారు. అప్పులు చేసుకుంటున్నారు. అర్ధాకలితో, పచ్చడి మెతుకులతో బతుకీడుస్తున్నారు. కౌలురైతుల పరిస్థితి వ్యవసాయం లేక పనులు దొరక్క, అప్పులు దొరక్క పాత ప్రయివేటు అప్పుల వత్తిడితో జీవన్మరణ సమస్యగా తయారైంది. ప్రభుత్వం ప్రకటించిన కౌలురైతుల రుణార్హత కార్డులు వీరికి రాలేదు. ఎకరా రెండెకరాలున్న పేదరైతులు తమ సొంత భూములే సాగుచేసుకోలేక, పనులు లేక అప్పులతో సహజీవనం చేస్తున్నారు. వీరి బాధలు, కన్నీరు, కష్టాలు ఓట్లేయించుకున్న కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి పట్టడం లేదు. వీరు ఓట్లేయించుకొని ప్రధాన ప్రతిపక్షంలో ఉండి అధికారానికి వస్తే ఒరగబెడతామంటున్న తెలుగుదేశం పార్టీకి పట్టడం లేదు. పైగా వీరి కోర్కెల గొంతునొక్కి, వీరి కష్టాల పునాదులపై భూస్వాముల తరపున గొంతెత్తి అరుస్తున్నారు. మోహన్‌కందా కమిటీకి కూడా ప్రభుత్వానికి సమర్పించిన తమ రిపోర్టులో వీరి కష్టాలు, పరిష్కారాలు వ్రాయడానికి ”సిరా” చాలలేదు.

రైతుకూలీలంతా ఏకం కావాలి

వ్యవసాయం సాగుచేసేవాడే రైతు. రైతులంటే సాగుచేస్తున్న పేద రైతులు, కౌలురైతులే అసలైన రైతులు. పెరిగిన వ్యవసాయ ఖర్చులతో, అధిక కౌలు చెల్లింపుతో వ్యవసాయం గిట్టుబాటు కానిది వీరికే. కూలి పనులకు వెళుతూ , పాడి పై ఆధారపడుతూ కూడా అప్పులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. వీరితో పాటు రెక్కల కష్టంపై ఆధారపడి పంటలు పండిస్తున్న వారు వ్యవసాయ కూలీలు. కోనసీమలో స్త్రీకి 100 రూపాయలు పురుషునికి 200 రూపాయలు మాత్రమే కూలీ ఉన్నది. ఉపాధిహామీ పనులు ఈ ప్రాంతంలో చాలా తక్కువ. కానీ భూస్వామ్య శక్తులు కూలీరేట్లు రూ. 200, 300 లకుపైగా ఉన్నాయని, ఉపాధిహామీ వల్ల కూలీలు దొరకడం లేదని మాట్లాడడం అన్యాయం. అవాస్తవం.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి ఉపాధికోల్పోయిన పేద, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి.

కోర్కెలు:

1. స్వామినాథన్‌ కమీషన్‌ సిఫారసు చేసినట్టు ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం అదనంగా ఉండేట్లు ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించాలి. ఈలోపుగా రాష్ట్రప్రభుత్వం క్వింటాలు వరికి 200 రూపాయలు బోనస్‌ ఇవ్వాలి.

2. జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలందరికి ఉపాధి కల్పించాలి. నగదు, వస్తురూపేణా వెంటనే సహాయం చేయాలి.

3.రబీ సీజన్‌కు వర్తించేలా కౌలురైతులకు రుణార్హత కార్డులిచ్చి పంట రుణాలు ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇవ్వాలి.

4.ప్రభుత్వం న్యాయమైన కౌలురేటును నిర్ణయించాలి.

5. మే 15 కల్లా ఖరీఫ్‌కు పంట కాలువలు వదలాలి. ఇరిగేషన్‌, డ్రైనేజి కాలువల ఆదునీకరణ పనులు సత్వరమే పూర్తిచేయాలి.

ఈ కోర్కెల సాధనకు రైతు కూలీలంతా పేదలంతా ఏకం కావాలి. గొంతెత్తి నినదించాలి.పోరాడాలి.

 

-వంగల సుబ్బారావు
(కౌలురైతుసంఘం ప్రధాన కార్యదర్శి)

మేకవన్నె పులి మమతా బెనర్జీ

  • పారిశ్రామికవేత్తలను పిండేస్తున్న తృణమూల్‌ నేతలు
  • భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్న ఐఎన్‌టిటియుసి
  • ఇవ్వొద్దంటూనే వసూళ్లకు ముఖ్యమంత్రి అండదండలు
  • సిఎం ద్వంద్వ వైఖరి
  • ‘టెలిగ్రాఫ్‌’ ప్రత్యక్ష పరిశీలన

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామికీకరణను ముందుకుతీసుకెళ్తామంటూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, అధికారంలోకొచ్చాక పారిశ్రామికాభివృద్ధి మాటేమిటోగాని పార్టీ కోసమంటూ పారిశ్రామికవేత్తల నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ పార్టీ నేతలకు ఎవరూ డబ్బులివ్వొద్దని ముఖ్యమంత్రిగా మమత పైకి ఘనంగా ప్రకటిస్తూనే… తెరవెనుక మాత్రం పార్టీ నేతలకు పూర్తి అండదండలిస్తున్నారు. దీంతో హల్దియా ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలోని పలువురు పెట్టుబడిదారులు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల నుంచి ఏ విధంగా బెదిరింపులను, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారో ‘ది టెలిగ్రాఫ్‌’  పత్రిక రెండు రోజులపాటు అక్కడి పరిస్థితులను పరిశీలించి, వెలుగులోకి తీసుకొచ్చిన కఠోర వాస్తవాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. వామపక్ష ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోగా, ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ బాధ్యతలు చేపట్టిన ఈ నాలుగు నెలల సమయంలోనే హల్దియా ప్రాంత పారిశ్రామికవేత్తలు తృణమూల్‌ నేతల వైఖరితో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

పంకజ్‌ ధనూకా… లాల్‌బాబా సీమ్‌లెస్‌ ట్యూబ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి. హల్దియా పెట్రోకెమికల్స్‌కు ఎదురుగా ఉన్న పరిశ్రమలో ధనూకా రూ. 80 కోట్ల పెట్టుబడి పెట్టారు. తమ పార్టీ తరపున ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే ఇవ్వొద్దంటూ గత నెల 21న ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బహిరంగంగా ప్రకటించడంతో కొంత ఉపశమనం పొందారు. అయితే రెండు రోజుల తర్వాత ఒక ఉద్యోగి నుంచి ధనూకాకు ఫోన్‌ వచ్చింది. బర్దాన్యాఘత ఫ్యాక్టరీలో మళ్ళీ కార్మిక సమస్య వచ్చిందని, దీంతో ఉత్పత్తిపై ప్రభావం పడిందని అవతలి వ్యక్తి చెప్పారు. ఈ ‘సమస్య’ పరిష్కారం కావాలంటే కొందరు వ్యక్తులకు కొంత మొత్తం చెల్లించాలని ఫోన్‌లో వ్యక్తి చెప్పారు. ఇక్కడ కొందరు వ్యక్తులంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందినవారు. ఈ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల నుంచి ఈ విధమైన బెదిరింపులు/డిమాండ్లు ఎదుర్కొంటున్న వారిలో ధనూకా ఒక్కరే కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్మిక విభాగమైన ఐఎన్‌టిటియుసి పేరుతో మితిమీరిన స్థాయిలో జరుగుతున్న ఈ డిమాండ్లతో అనేకమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తృణమూల్‌ నుంచి ఎదుర్కొంటున్న సమస్యల పరిశీలనకు సహకరించిన పలువురు పారిశ్రామికవేత్తలు తమ పేర్లను మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు. అయితే ఇలాంటి డిమాండ్లతో విరక్తి చెందిన ధనూకా మాత్రం తన పేరును ప్రచురించడానికి సముఖత వ్యక్తం చేశారు. ‘పార్టీ నేతలకు డబ్బులివ్వొద్దని ముఖ్యమంత్రి చెప్పడంతో ఎంతో సంతోషించాం. కానీ, స్థానికంగా మాత్రం ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్న మేరకు డబ్బులు ఇవ్వలేకపోతే వ్యాపారం చేసుకోవడం కష్టం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కంపెనీ అధికారి అన్నారు. తృణమూల్‌కు చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులూ వారి వాటాల కోసం తమను దోచుకుంటూనే ఉన్నారని కెఎస్‌ ఆయిల్స్‌ కంపెనీకి చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. మిలన్‌ మండల్‌, శ్యామల్‌ అదోక్‌, అజీజుల్‌ రెహ్మాన్‌, జుగల్‌ మండల్‌, సుధాంఘ్షు మండల్‌ తదితర పారిశ్రామికవేత్తలను ఈ పరిశీలనలో ‘ది టెలిగ్రాఫ్‌’ కలిసింది. వీరిలో కొందరు లేబర్‌ కాంట్రాక్టర్లుగా ఉన్నారు. ఈ ప్రాంతంలోని పలు ప్లాంట్లకు వారు కార్మికులను అందిస్తుంటారు. ఈ కాంట్రాక్టర్లకు తృణమూల్‌ కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయి. హల్దియా పట్టణ యువజన తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూడా మిలన్‌ మండల్‌ వ్యవహరిస్తున్నారు. దీనికి రెహాన్‌ అధ్యక్షులుగా ఉంటున్నారు. తంలుక్‌ ఎంపీ, తృణమూల్‌ నేత సుభేందు అధికారికి అదోక్‌ వ్యక్తిగత సహాయకునిగా వ్యవహరిస్తున్నారు. అంతులేని డిమాండ్లతో ఈ స్థానిక నేతలు ఫ్యాక్టరీల బయట క్యూ కడుతున్నారని పారిశ్రామికవేత్తలంటున్నారు.

నియామకాలకూ ముడుపులిచ్చుకోవాల్సిందే

స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికులను పనిలోకి తీసుకోవడం వంటి చర్యలను కూడా ఐఎన్‌టిటియుసి నేతలకు చెప్పే చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఒక పేరున్న కెమికల్‌ ఫ్యాక్టరీలో జూనియర్‌ కెమిస్ట్‌ పోస్టుకు ఒక నిరుద్యోగిని పంపాలంటే సదరు వ్యక్తి స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలకు రెండు లక్షలు చెల్లించుకోవాల్సివస్తోందని, ఉద్యోగ హోదాను బట్టి ఈ విలువ మారుతోందని ఒక కెమికల్‌ కంపెనీలో మానవ వనరుల విభాగం అధ్యక్షులుగా పనిచేస్తున్న అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో క్యాంపస్‌ ఇంటర్యూలు చేసి కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదని, తృణమూల్‌ నేతలు సూచించిన వారినే తీసుకోవాల్సి వస్తోందని పలు కంపెనీల్లోని హెచ్‌ఆర్‌ విభాగాధిపతులంటున్నారు. ఫ్యాక్టరీల బయట ఆఫీసులు ఏర్పాటు చేసుకుని తృణమూల్‌ నేతలు చేస్తున్న హెచ్చరికల వల్ల స్థానికేతరులను ఉద్యోగంలోకి తీసుకున్నా… కొన్ని రోజుల్లోనే వారు ఉద్యోగం మానేయాల్సి వస్తోందని వారు వివరించారు.

లాల్‌బాబా కంపెనీలో విధులకు ఆటంకం కలిగించడం ద్వారా తృణమూల్‌ నేతలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాంటి దిగుమతులూ జరగకుండా తృణమూల్‌ నేతలు అడ్డుతగలడంతో పరిశ్రమలోని సిబ్బందికి పోలీసులు రక్షణ ఉండి కంపెనీ గేటు బయట మెయిన్‌ రోడ్డు వరకూ తోడు వెళ్ళాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని తృణమూల్‌ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పలుమార్లు వివరించినా ఎలాంటి ఫలితమూ లేకపోయిందని, మరోవైపు తమ ఉత్పత్తి తీవ్రంగా పడిపోయిందని ధనూకా ఆవేదనగా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎంత కాలం ఉండగలమని ప్రశ్నించారు. అయితే తృణమూల్‌ ఎంపీ మాత్రం ఈ విషయంలో రాజకీయ జోక్యం ఏమీలేదని, భూమి కోల్పోయిన వారికి తాము ఎల్లప్పుడూ రక్షణగా ఉంటున్నామని అంటున్నారు.

పారిశ్రామికీకరణకు ప్రమాద ఘంటికలు

ఆగస్టు 23న జరిగిన సిఐఐ సమావేశంలో పారిశ్రామిక వేత్తలు ఈ విషయాన్ని లేవనెత్తారు. తృణమూల్‌ నేతలు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే హల్దియాకు కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని సిఐఐ హల్దియా జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎకె డే ప్రశ్నించారు. హల్దియాలో పరిస్థితులు భరించలేని స్థాయిలో ఉన్నాయని పలువురు పారిశ్రామికవేత్తలంటున్నారు.

విశ్వేశ్వరయ్య జీవితం నేర్పే పాఠాలు

సెప్టెంబర్‌ 15 జాతీయ ఇంజనీర్స్‌డే. ఇంజనీర్‌గా, పాలనాదక్షునిగా, రాజనీతిజ్ఞునిగా, నిష్కామ దేశభక్తునిగా అఖండ కీర్తిని ఆర్జించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు.

భారతదేశంలో ఎంతోమంది మేధావులు జన్మించి వివిధ రంగాలకు ఎనలేని సేవలందించారు. అటువంటివారిలో ‘భారతరత్న’ విశ్వేశ్వరయ్య ఒకరు. నవ భారత నిర్మాణానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.1908లో మూసీ నదికి వరద రావడంతో హైదరాబాద్‌ నగరం తల్లడిల్లింది. వరదల నుండి రక్షణ కోసం అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి ఒక పథకం రూపొందించాలని కోరారు. నగర మురుగునీటి పారుదల పథకాన్ని కూడా తయారుచేయమని కోరారు. 1909 ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ వరకు విశ్వేశ్వరయ్య ఈ పని మీదనే శ్రమించారు. 250 కోట్ల రూపాయలతో పథకాలను సిద్ధం చేశారు. ఈ పనులు వెంటనే అమలు పరచలేదు. హైద్రాబాద్‌లోని బ్రిటీష్‌ ఇంజనీర్లు ఆ పనుల అమలుకు విముఖంగా ఉండడం వల్ల జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆయన పథకాలనే అమలుపరిచారు. దాని పర్యవసానమే మూసీ, ఈసీ నదులపై రిజర్వాయర్లను నిర్మించారు. వీటి నిర్మాణంతో హైదరాబాద్‌ నగరానికి వరద ప్రమాదం తప్పిపోయింది. ఈ పథకాలను ఆ తరువాత బ్రిటీష్‌ ఇంజనీర్లు కూడా కొనియాడారు.

1922 సంవత్సరంలో విశ్వేశ్వరయ్య నిజాం ప్రభుత్వ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌ సందర్శించి సమగ్ర అభివృద్ధికి ఒక పథకాన్ని రూపొందించారు. అప్పట్లో హైద్రాబాద్‌లోని ప్రఖ్యాత ఇంజనీర్‌ బహుదూర్‌ సాగర్‌ నిర్మించారు. ఈ రెండు రిజర్వాయర్లు హైదరాబాద్‌ నగరవాసులకు మంచినీటిని అందిస్తున్నాయి.విశ్వేశ్వరయ్య ఎంతో క్రమశిక్షణ కలిగినవారు. ఆయనకు ఒకటే ఆశయం, ప్రజలు ఆలోచనపరులు కావాలి, మారుతున్న సమాజాన్ని అధ్యయనం చేస్తుండాలి. సాంకేతిక మార్పులను అవగాహన చేసుకుంటుండాలి. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలను అధ్యయనం చేయాలి. ఏ పనిచేసినా చిత్తశుద్ధి ఉంటే ఆ పనికి అందరికీ ఆదర్శమవుతుంది.

విదేశీ వస్తువులను కొనుగోలు చేయడాన్ని విశ్వేశ్వరయ్య వ్యతిరేకించారు. వాటిని కొనుగోలు చేస్తే మన కార్మికుల పొట్టకొట్టినట్లవుతుందని బొంబాయిలో ఇండియన్‌ ఇండిస్టీస్‌ కార్మిక సమావేశంలో 1941 జూలైలో చెప్పారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను సూచించారు. పరిశ్రమలను దేశంలోని వివిధ ప్రాంతాలలో పెట్టడం వలన ఆర్థిక వికేంద్రీకరణ జరిగి జాతీయ ఆదాయం పెరుగుతుందని సూచించారు.

మన దేశ ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, రవాణా సౌకర్యాలు మొదలగువాటిని సమకూర్చటానికి ఉన్న వనరులను సమీకరించుకుంటే సరిపోతుందని తెలిపారు. పౌరులు శక్తివంతంగా రూపొందడానికి దశ సూత్ర ప్రణాళికను సూచించారు. అవి (1) స్వయం సహాయతను ఆచరణలోకి తీసుకురావటం (2) విజ్ఞానమే అధికారమని తెలుసుకోవడం (3) సామూహికంగా పని చేయటం (4) ఉత్పాదకశక్తిని, సేవలను పెంచడం (5) భారతదేశ పరిశ్రమలకు చేయూతనివ్వడం (6) దిగుమతులను తగ్గించడం (7) మంచి ప్రమాణాలను పెంచడం (8) సంస్థాగతంగా ఆలోచించి పనులు చేయడం (9) ఏ పనిచేసినా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చేయడం (10) పనిని సామూహికంగా చేయటాన్ని ప్రోత్సహించాలి.

దేశ జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని పండించాలని చెప్పారు. 1931లో ఆంధ్రా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో కష్టపడి చదవడం ద్వారానే ఉత్తీర్ణులవుతామని, అంతేకానీ విజయ రహస్యాలంటూ ఏమీ ఉండవని అన్నారు. అభివృద్ధి సాధించేందుకు కష్టించి పనిచెయ్యడమే మార్గమని ఉద్బోధించారు. ఏ దేశ అభివృద్ధి అయినా వ్యవసాయం, పారిశ్రామిక పురోగతిపై ఆధారపడి ఉంటుందని విశ్వేశ్వరయ్య నమ్మకం. మూఢాచారాలు, సంఘంలోని వివిధ రకాల దురాచారాలు మొదలైనవాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. కర్మ సిద్ధాంతం, గుడ్డి నమ్మకాల్ని వదిలపెట్టండని ప్రజలకు హితవు చెప్పారు.

విశ్వేశ్వరయ్య సూక్తులు

పని చేయటం దండగయితే నీవు తినటం దండగే నీకు అవసరం లేనిది నీవు కొంటూ ఉంటే నీవు కొనలేనిది నీకు అవసరమనిపిస్తాయి. తుప్పుపట్టి చావడం కంటే తుది వరకు జ్వలించడానికి నేను ఇష్టపడతాను ఉత్తమ జాతిని నిర్మించటానికి మార్గం ఉత్తమ వ్యక్తులను నిర్మించడమే

రైతులకు, ఇంజనీర్లకు సలహాలిస్తూ ఆయన చెప్పిన కథలు ఇలా ఉన్నాయి: ఒక రోజు ఒక పొలంలో ఒక చిన్న విమానం మరమ్మతుకు రావడంతో కిందకు దిగింది. ఆ వైమానికులు దాని విడి భాగాలు కొనుగోలు చేయటానికి పట్టణం వెళ్లారు. ఈలోపు ఆ భూమి రైతు తన కొడుకులను దానికి కాపలా వుంచి విమానం చూడటానికి ఆత్రుతగా వచ్చిన వారందరి దగ్గర కొంత డబ్బును టికెట్టు పెట్టి వసూలు చేశాడు. ఎంత తెలివైన రైతు! మీరు కూడా ఉట్టి కబుర్లతో కాలాన్ని వృథా చేయకుండా బాగా ఆలోచించి పనిచేస్తే ఫలితం దక్కుతుందని వారిని ఉత్సాహపరిచేవారు.

ఒక ఇంజనీర్‌ తప్పు దోవలో డబ్బు సంపాదిస్తే నరకానికి వెళ్తారట. అక్కడ నరకాన్ని తన మేధస్సుతో ఖాళీగా ఉంచకుండా, కాలాన్ని వృథా చేయకుండా బాగా కష్టపడి నరకాన్ని స్వర్గంగా మార్చాడు. అప్పుడు ఆ భగవంతుడు కూడా ఆ ఇంజనీర్‌ను చూసి చాలా సంతోషించాడట.

విశాలమైన దేశానికి ఆర్థిక ప్రగతికి గ్రామమే ఒక ప్రాతిపదిక కావాలి. అన్ని గ్రామాలలో పాఠశాలలు, గ్రంధాలయాలు, ఆహార ధాన్యాగారాలు, రైతాంగానికి కావలసిన అవసరాలు తీర్చే సంస్థలు ఉండాలని అభిలషించారు విశ్వేశ్వరయ్య.ఈనాడున్న బహుళ ఆర్థిక సాధక ప్రయోజన పథకం ఆలోచన అసలు విశ్వేశ్వరయ్యది. ఒక నదిలోని నీటిని బహువిధాలుగా వినియోగించి త్వరితగతిన ప్రగతిని సాధించవచ్చునే ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కృషి చేశారు. కావేరి ప్రాజెక్టు ద్వారా విద్యుత్తు ఉత్పాదనకు, వినోదానికి, వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు ఉపయోగపడేలా చేశారు.

విశ్వేశ్వరయ్య ఆలోచనలు నేటికీ ఈ సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ మన విధానాలు దేశ స్వావలంబనను దెబ్బతీసేవిగా ఉంటున్నాయి. క్రమంగా విదేశీ విధానం పరాయితనంగా తయారవుతోంది. దేశ ప్రజల మేలుకన్నా బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల అవసరాలు తీర్చడమే పరమావధిగా తయారైంది. దేశహితం, ప్రజల బాగోగులకన్నా ప్రపంచాన్ని శాసించే విదేశీయుల మెప్పే ముఖ్యమైందన్నట్లుగా తయారైంది. అవినీతి జాడ్యం దేశానికి పట్టిపీడిస్తున్నది. నయా ఉదారవాద సంస్కరణల పుణ్యమా అని దేశంలో ఆర్థిక గాలివాటం పెరిగిపోతున్నది. కార్పొరేట్‌ అవినీతి దేశ సంస్థాగత నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నది. ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి.

ఆర్థిక వృద్ధి రేటును, సంపన్నుల జాబితాను చూసి మురిసిపోతున్నాం. కానీ పెరుగుతున్న పేదరికాన్ని, పడిపోతున్న ప్రజాజీవన ప్రమాణాలు, ప్రజల నిస్సహాయతను చూడలేక పోతున్నాం. వ్యవసాయాన్ని ప్రజల నుండి వేరుచేసి కార్పొరేట్‌పరం చేస్తున్నాం. సామాన్య జనం ఆహార కొరతను ఎదుర్కొనే పరిస్థితులను కల్పిస్తున్నాం. విద్య, వైద్యం, ఉద్యోగం, ఆరోగ్యం, శ్రమ, పెట్టుబడి, ఉత్పత్తి అన్ని కార్పొరేట్‌పరం చేసి ప్రజలను సంకట స్థితిలోకి నెట్టివేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు. వీటన్నిటికి మూలం దేశంలో, రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు విధానాలు. వీటిని వదిలించుకొని మనకాళ్లమీద మనం నిలబడే విధానాలు అవలంభించడమే మనముందున్న కర్తవ్యం. ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని, భూమి, గాలి, నీరు అన్నిటిని కాపాడి, ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక గాలివాటును నియంత్రించి ఉత్పత్తిని, ఉపాధిని పెంపొందించే క్రమబద్ధమైన ఆర్థిక విధానాలు అవలంభించడమే దేశం ముందున్న ప్రధాన కర్తవ్యం. ఏ ఆర్థిక విధానాలైతే ఈ ప్రపంచానికి శ్రీరామరక్ష అని చెప్పబడినవో అవి సంక్షోభంలో కూరుకుపోయినా అవే విధానాలను అవలంభించడం శ్రేయస్కరం కాదు. స్వతంత్రను, స్వావలంబనను, స్వయం శక్తులను పెంపొందించే ఆర్థిక విధానాలను, సామాజిక పొందికను పెంపొందించడం మనముందున్న ప్రత్నామ్నాయం. విశ్వేశ్వరయ్య జీవితం, ఆలోచనలు, ఆచరణలు మనకు నేర్పుతున్న పాఠాలు ఇవే!

డి. నరేందర్‌

వీళ్లూ ‘ నల్ల’ ధనులే

  • సినీతారలు, క్రికెటర్లకూ స్విస్‌ ఖాతాలు
  • వెనక్కి తెప్పిస్తానంటే రాజకీయులు సహా అందరి జాబితా ఇస్తా
  • చిత్తశుద్ధి లేని భారత సర్కారు
  • టివి ఇంటర్వ్యూలో రుడాల్ఫ్‌ ఎల్మర్‌

స్విస్‌ బ్యాంకుల్లో రాజకీయ నాయకులకే నల్ల ధనం ఖాతాలు ఉన్నాయని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం. పన్నులు ఎగవేసిన డబ్బును వారు స్విస్‌ బ్యాంకులకు తరలిస్తున్నారని మనం ఆందోళనలు చేస్తున్నాం. అయితే ‘నల్ల’ దొరలు వీరు మాత్రమేనా? రాజకీయ నాయకులు మాత్రమే పాపాల భైరవులా? కాదు. ఆ జాబితా కొండవీటి చాంతాడులా చాలా పెద్దది. ప్రజలు వేలం వెర్రిగా అభిమానిస్తూ, డబ్బును, సమయాన్ని కూడా వృథా చేసుకునే సినిమా తారలు, క్రికెటర్లు కూడా ‘నల్ల’ దొరల జాబితాలో ఉన్నారు. సినిమాలు, క్రికెట్‌ పట్ల ప్రజల అభిమానమనే బలహీనతను క్యాష్‌ చేసుకుంటున్న సినీ, క్రికెట్‌ తారలు కూడా పన్నులు ఎగవేయడంలో దిట్టలే. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ తళుకు బెళుకుల తారలు పన్నులు కట్టకుండా ఎగవేసిన డబ్బును స్విస్‌ బ్యాంకు ఖాతాల్లో కుప్పపోస్తున్నారు.

నీతి, నిజాయితీలపై సినిమాల్లో తెగ ఉపన్యాసాలు ఇచ్చే భారత సినీతారలు, క్రికెటర్లకు కూడా స్విస్‌ బ్యాంకుల్లో రహస్య ఖాతాలున్నాయని స్విస్‌ బ్యాంకు మాజీ అధికారి రుడాల్ఫ్‌ ఎల్మర్‌ అన్నారు. ఈ ఏడాది జులై 25న జైలు నుండి విడుదలైన ఆయన తొలిసారిగా భారత్‌కు చెందిన ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పన్ను ఎగవేతదారుల్లో సినీతారలు, క్రికెటర్లు కూడా వున్నారని, వీరంతా పన్ను ఎగవేస్తూ ‘క్రిమినల్స్‌’గా మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలుంటాయని భయపడుతున్న ఎల్మర్‌ తన వద్ద వున్న పన్ను ఎగవేతదారుల జాబితాలోని ‘రాజకీయ నేతలు, సినీతారలు, క్రికెటర్ల’ పేర్లు వెల్లడించటానికి నిరాకరించారు. భారత ప్రభుత్వం నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చే అంశంలో చిత్తశు ద్ధితో వుంటే తాను ఈ జాబితాను ప్రభుత్వానికి అందచేస్తానన్నారు.విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా అంకితభావంతో కూడిన చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాను ఉదహరించిన ఎల్మర్‌ స్విస్‌ బ్యాంకుల్లో రహస్య ఖాతాలున్న అమెరికన్‌ పన్ను ఎగవేతదారుల జాబితాను సాధించటంలో అక్కడి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. భారత ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి కొరవడిందని తాను భావిస్తున్నానని, దీనిపై స్పందించేందుకు భారత ప్రభుత్వంపై ప్రజలు, సమాజం వత్తిడి తేవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత దేశం రోజురోజుకూ బలోపేతమవుతున్న అతి పెద్ద దేశం అన్న ఎల్మర్‌ దానికి చర్చలు జరిపే అధికారం కూడా వుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పుడు తాను తన వద్ద వున్న జాబితాను వెల్లడించలేనని, తాను చిక్కుల్లో వుండటమే ఇందుకు కారణమని వివరించారు. అయితే తాను తప్పకుండా ఒక తేదీ చెబుతానని, ఇందుకు కొంత సమయం అవసరమని అన్నారు. నల్లధనం విషయంలో ప్రభుత్వం తగిన రీతిగా స్పందించటం లేదని ఆయన పునరుద్ఘాటించారు.

ఎవరీ ఎల్మర్‌?

స్విట్జర్లాండ్‌లో ప్రఖ్యాతి చెందిన జులియస్‌ బార్‌ బ్యాంకుకు చెందిన మాజీ అధికారి ఈ రుడాల్ఫ్‌ ఎల్మర్‌. దాదాపు 20 ఏళ్లు బ్యాంకు అధికారిగా పనిచేసిన ఎల్మర్‌ కేమన్‌ దీవుల్లో బ్యాంకు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధిపతిగా వ్యవహించారు. బ్యాంకు సిఇఓ కేలాండ్‌ దీవుల్లో వున్న సమయంలో తమ బ్యాంకు పన్ను ఎగవేత దారులకు సహకరిస్తోందంటూ ఎల్మర్‌ సంచలన ప్రకటన చేయడంతో యాజమాన్యం ఆయన్ని ఉద్యోగం నుండి తొలగించింది. తాను చేసిన ప్రకటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఒక సిడిలో కాపీ చేసిన ఎల్మర్‌ దానిని వికీలీక్స్‌ అధినేత జులియన్‌ అసాంజేకు అందించారు. ఈ సిడిలో 1997 నుండి 2002 వరకూ స్విస్‌ బ్యాంకుల్లో వున్న రహస్య ఖాతాదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం వుంది. ఈ ఏడాది జనవరిలో దానిని వికీలీక్స్‌ అందచేసినపుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సిడిలో వున్న దాదాపు 2000 మంది పన్ను ఎగవేతదారుల సమాచారంలో పలువురు భారతీయ ప్రముఖుల పేర్లు కూడా వున్నాయి. ఎల్మర్‌ ఈ సిడిలపై కట్టుకథలు చెబుతున్నారని జులియస్‌ బార్‌ యాజమాన్యం ఆరోపించింది

చూడ చూడ కొండ వంపు … మనుజుడి ముఖారవిందపు సొంపు

అదిగో ! అదిగదిగో !!
తిరుమల కొండ
తిరుపతి – తిరుమల కొండ
చూడ చూడ రుచులు జాడవేరన్నట్లు
చూడండి … నిశితంగా చూడండి
మళ్లీ మళ్లీ చూడండి

కనరే మనుజులోరిని !
కనులారా కనరే, మనుజుని ముఖారవిందం !!
అవిగో అవిగో … అవి తిరుమల కొండలు
చూడ చూడ కొత్త కోణం … బహు కళాత్మకం
కొండ వంపులు – కొత్త సొంపులు
కనపడలేదా ! పరుండిన మనుజునివోలే !!
విశాలి నుదురు – పొడవాటి నాసిక
వాటి మధ్య ఓ నయనం మసక
కిందకొస్తే పెదాలు – వంపుదీరిన గడ్డం సరేసరి !
అదండీ, సంగతి మరి !!

లచ్చుమ్మ విష కౌగిలిలో సరస్వతమ్మ … పాడె మీద పంతులమ్మ


లచ్చుమ్మ విషకౌగిలిలో విద్యా దేవత సరస్వతమ్మ నలిగిపోతోంది. పంతులమ్మ/య్యను మన పాలకులు పాడెమీదకు చేర్చేశారు. కాకపోతే లోకం కళ్లుగప్పేందుకు మాత్రం ఏటా సెప్టెంబరు ఐదో తేదీన ఊరూరా ఉపాధ్యాయ దినోత్సవాలంటూ సంతర్పణలు జరపటం రివాజయింది. పైరవీలు చేసుకుని ఉత్తము(0డ)ల జాబితాలో పేర్లు చేర్చుకోగలిగిన కొద్దిమంది బెత్తంగాళ్లకు దండలేసి దండం పెట్టే తంతూ ఏటా నిర్వహిస్తోంది. మంచి పంతుళ్లు నన్ను చమింతురుగాక!
మన పాలకులకు పెద్ద పంతులుగారయిన అమెరికాలో సైతం ప్రభుత్వ విద్యా సంస్థలదే పెద్ద పాత్ర. దానికి భిన్నంగా చదువును సరస్వతి దేవతంటూ పూజలందుకునే సమాజంలో మాత్రం విద్యా రంగాన్ని విఫణివీధిలో వేలం వేసి మన ఘనత పొందిన వణిక్ప్రముఖులు లచ్చలు, కోట్లు కూడపెట్టుకుంటున్నారు.
ఏదెటుపోతే మాకెందుకు మా బాబు/ పాప వీలయితే డాట్రయి, కాకుంటే కనీసం ఇజ్నీరన్నా అయితే చాలనుకునే తల్లిదండ్రుల్ని కంటున్న సమాజంలో అంతకు మించి మరేదో జరగాలని ఎవరన్నా కోరుకుంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు వస్తున్నాయని చీదరించుకోవటమేగదూ!
కాళ్లకు కంకణాలు (బేడీలు అంటే మన సిల్మా జనానికి బాగా అర్ధం అవుతుందేమో!) వేయగలిగిన శక్తిమంతమైన విశ్వవిద్యాలయాలను అమెరికా నుంచి ఎప్పుడెప్పుడు దిగుమతి చేసుకుందామా అని మన ప్రభువులు తహతహలాడిపోతున్నారు. వాటిని కొట్టేసి తమ గాట్లో కట్టేసుకునేందుకుగాను మన అచేతనలూ, అపర నారాయణలూ, కత్తుల రత్తయ్యలూ, కొండొకచో గింబానీలు ఎవరికివారే గిమ్మిక్కులూ, జిమ్మిక్కులూ చేసేస్తున్నారహో!
అమ్మ (ఛా, ఛా, ఛీ, ఛీ అమ్మేంటి అమ్మ, తుమ్మ జిగురు మాదిరిగా మమ్మీ అనాలి… ఇంకా మామ్‌ అనీ అనొచ్చు. సరే, సరే, సరే సర్‌) మామ్‌ భాష తెణుంగును లాగులో ఒంటేలు పోసుకునే వయస్సులోనే వదిలేసిన పిల్ల గాండ్లు/మ్మలు ఆంగ్లాన్ని శ్వాసిస్తూ, ఆంగ్లాన్ని తాగుతూ, ఆంగ్లాన్ని తింటూ, ఆంగ్ల జీవితాల్లో పరకాయ ప్రవేశం చేసేస్తోన్న శుభవేళ మళ్లీ వచ్చింది… మరో ఉపాధ్యాయ దినం.
ఉపాధ్యాయ దినం వేళ పలుకుదాం… పంతుళ్లకు జేజేలు
ఎందుకంటే …
పొద్దున్నే తమ బుడ్డోడిని/డ్డదాన్ని మోటాలు సైకిలుపై సవారీ వేసుకుని ఇంటర్నేషనల్‌ స్కూల్లో దిగబెడుతున్నందుకుగాను…
ఆనక బడికి పోయినా పోక పోయినా … ఏదో ఇంటర్నేషనల్‌లోనో కాకుంటే ది స్లేట్‌లోనో నాలుగయిదు పీరియడ్లపాటు చమటోడ్చుతున్నందుకుగాను …
తర్వాత తీరిగ్గా పొగరెట్‌ దమ్ము లాగుతూ, వదుల్తూ ఏ మనీ సెక్యూరిటీస్‌ వాడితోనో సెల్‌ఫోన్లో చర్చోపచర్చలు. ఏ షేర్లు, తెగనమ్మాలో, ఏ షేర్లు కొనేయాలో ఆదేశాలు జారీచేసే పనిని ఏ రోజూ మరవకుండా చేస్తున్నందుకుగాను…
అప్పుడుప్పుడూ ఏ రమ్యమైన బార్‌ అండ్‌ రెస్టారెంట్లో భార్యాపిల్లలతో కడుపు నిండా లాగించేయటం కద్దు. కనీసం శనివారాల్లోనయినా ఒకరిద్దరు మిత్రులతో కలిసి మందుబాబులవుతున్నందుకు …
ఇలా అంటున్నానంటే ఏ జీకే మాస్టారినో … మరో డీకే టీచరమ్మనో అనటం కాదు సుమా. ఇలాంటివారిని మూసపోసిన మన వ్యవస్థను చూస్తూ ఊరుకోలేక, కూకలేస్తున్నానని కొందరయినా నమ్మితే చాలు. సెప్టెంబరు ఐదో తేదీ ఏదో ఒకనాడు నిజంగా, నిజ్జంగా నిజమౌన ఉపాధ్యాయ దినోత్సవం అవుతుందని ఘాట్టిగా నమ్మొచ్చు.
ఆ నమ్మకంతోనే… పంతుళ్లకు జేజేలు.

ఏళ్లొచ్చాయి దేనికి ? !


మేమేదయినా తప్పుచేస్తే, మా అమ్మ కోప్పడుతుందీ … ”ఏళ్లొచ్చాయి దేనికీ? అని.
తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్‌, సిబిఐ సహాయ సంచాలకుడు లక్ష్మీనారాయణ బావాబావమరుదులంటూ ఏ మాత్రం ఆధారంలేకుండానే ముసలి (అ)రాచకీయ నక్క వైఎస్‌ వివేకానందరెడ్డి కూసేశాడు. అంతేనా… లక్ష్మీనారాయణ పెద్ద లంచగొండి అని కూడా వాగేశాడు. అందుకే నేనంటానూ, ఏళ్లొచ్చాయి దేనికి?
”అయ్యయ్యో, పయ్యావుల కేశవ్‌ ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు. ఆ మాటకొస్తే నా బంధువుల్లో రాజకీయ నాయకులే లేరు” అంటూ ముసలి నక్క వాగుడితో నిశ్ఛేష్టుడయిన లక్ష్మీనారాయణ వాపోయారు పాపం. కేశవ్‌ కూడా ఆ మాటే చెప్పారనుకోండి. మరి గుంటనక్క (అ)వివేకానందరెడ్డిని ఏమి చేస్తే మనం ప్రశాంతంగా బతక్కలమో గదా? భూస్వామ్య ముఠా నాయకుల లక్షణాల్లో ఒకటయిన బూటకాల నాటకాలు ఆడిన వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆయన బాబాయి (అ)వివేకానందరెడ్డి ఇప్పుడు తెరతీసి చేతులు కలిపేసుకున్నారు. ఇది మాత్రం బాగుంది. కనీసం కాస్త బుర్రున్న వారంతా అసలు నిజ్జమేందో? నాటకాలేందో? తెలుసుకునే వీలుకలిగించినందుకుగాను వారిద్దరికీ నమోవాక్కులు చెబుదాం. నిజాన్ని నిజ్జంగా చూద్దాం. మన బతుకులు బాగు పడేందుకు అవసరమయిందేదో చేసి చూపిద్దాం.

నండూరికి నివాళి

నీతి – నిజాయితీలకు మారు పేరు
ప్రజా రచయిత
సమాజం పట్ల నిబద్ధత కలిగిన సంపాదకుడు
నండూరి రామమోహనరావుగారికి ఇదే నివాళి
నండూరి 02 సెప్టెంబరు 2011 సాయంత్రం విజయవాడలో చనిపోయారు

కన్నీరు పెట్టించే కథ … జర్రున చదివించే కథనం


అవును. దాన్దుంప తెగ, ఎన్నిసార్లు చదివినా ఆ కథ నా చేత కన్నీరు పెట్టిస్తూనే ఉంది. అన్నట్లు దానికి ఇంకో లక్షణం కూడా ఉంది. మొదలు పెట్టామో… ఇట్టే జర్రున జారిపోతుందనుకోండి. కథనం అంత బాగుంటుంది మరి. ఇక వస్తువంటారా, దాన్ని గురించి చెప్పటం ఎందుకు అది మనందరి జీవితమే. ఇన్ని సుగుణాలున్న ఆ కథను పరిచయం చేయకుండా ఉండలేకపోతున్నాను మరి.
ఆ కథ పేరు వికాసం. రచయిత – కే. ఆదర్శ సామ్రాట్‌. వాస్తవానికి ఈ కథ తొలుత 1998, సెప్టెంబరులో విపుల సంచికలో ప్రచురితమయింది. అనంతరం ఇప్పటి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు వి బాలసుబ్రమణ్యం సంపాదకత్వంలో డిపెప్‌ ప్రచురించిన చదువు విజ్ఞానం మాస పత్రికలోనూ ప్రచురితమయింది. ఇప్పుడేమో చదువుల సారం పేరిట జన విజ్ఞాన వేదిక – మంచి పుస్తకం సంయుక్తంగా ప్రచురించిన ఎనిమిది పుస్తకాల దొంతరలో మొదటి పుస్తకం ‘కథలు విందాం’లో చోటు చేసుకుంది.
రావుకు పిల్లలంటే ప్రాణం. పిల్లల్లో దాగి ఉండే సృజనాత్మకను వెలికి తీసే లక్ష్యంతో వేసవి బడిని ఏర్పాటు చేస్తాడాయన. దాని పేరు ‘వికాసం’. ప్రత్యక్ష అనుభవం నుంచి చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, ఆటలు, పాటలు, రచన, ఆంగ్ల పదాల పరిచయం నేర్పుతుంటారు. అంతకు ముందు వినటం తప్ప వాటితో పరిచయం లేని పిల్లలు అద్భుత ప్రతిభ కనబరుస్తారు. అక్కడ చేరిన అరుణగీత తొలుత వారం రోజులపాటు ముభావంగా గడిపినా అనంతరం అక్కడి ప్రత్యేక వాతావరణం కారణంగా స్పందిస్తుంది. మిగతావారితో కలిసిపోతుంది. అన్నింటిలోనూ ప్రతిభ కనబరుస్తుంది.
వేసవి బడులు ఉండాలా? వద్దా? అంశంపై నిర్వహించిన చర్చావేదికలో అరుణగీత అంటుందీ …”సంవత్సరం అంతా బడిలో చదువుకుని మళ్లీ వేసవి బడిలో చేరాలంటే ఎంతో బాధగా ఉంటుంది. నాకైతే మా అమ్మానాన్న వేసవి బడిలో చేర్పిస్తామనగానే చచ్చిపోవాలనిపించింది. కానీ ఇక్కడ టీచర్లు చేయిస్తున్న పనులు నాకు ఎంతో నచ్చాయి. నేను బాగా రాయగలననీ, బాగా పాడగలననీ, చక్కగా కవితలు కూడా రాయగలననీ, మంచిగా మాట్లాడగలననీ వాళ్లు చెబితేనే నేర్చుకున్నాను. మా బడిలో ఎప్పుడూ ఇలాంటివి చేయించలేదు. మా అమ్మానాన్నలు కూడా ఎన్నడూ ఇలాంటివి చేయమని చెప్పలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వేళ వేసవి బడులుగానీ, మామూలు బడులుగానీ ఉంటే ఇలాగే ఉండాలి”
బడి ముగుస్తుందనగా ఆమె తన తల్లిదండ్రులకు సంతోషంగా ఉత్తరం రాస్తుంది. అయితే ఉత్తరం తెలుగులో రాసినందుకు కోపగిస్తూ ఆమె తండ్రి తిరుగు ఉత్తరం రాస్తాడు. దాంతో ఆమె పసిహృదయం వికలమవుతుంది. తాను తయారు చేసిన వస్తువుల్ని పగలగొడుతుంది. గీసిన బొమ్మల్ని, రాసిన వ్యాసాల్నీ, కవితల్నీ, కథల్నీ చించిపారేస్తుంది. అదంతా తెలుసుకున్న టీచరు ముగింపు సందర్భంగా ఆ విషయం చెబుతూ కుమిలి కుమిలి ఏడుస్తుండగా … అరుణ గీత స్పందిస్తుంది. టీచరు ఏమి చెబుతాడు? – అరుణగీత స్పందన ఏమిటి? ఈ విషయాల్ని అరకొరగా ఇలా చెప్పేకన్నా ఎవరికివారే స్వయంగా చదివితేనే అనందంగా ఉంటుంది. పైగా నేనే చెప్పేస్తే ఆనక చదివేప్పుడు మీ కంట కన్నీరు రాకపోనూ వచ్చు. ఆ మధురిమను నేను తుంచటం ఎందుకు? అనుభవించండి. మనసారా ఏడవండి.
అన్నట్లు ఈ పుస్తకంలో ఇంకా లబ్దప్రతిష్టులయిన తెలుగు కథకులు సత్యం శంకరమంచి (లేగదూడ – చదువు), నామిని (గువ్వ చాతుర్యం), చాసో (ఎందుకు పారేస్తాను నాన్నా, స్వర్గం) రచనలు, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మాక్సిమ్‌గోర్కి, భీష్మసహానీ లాంటి మహామహుల రాతలు కూడా ఉన్నాయండోయి! చంద్ర బొమ్మలు సరేసరి.
కథలు విందాం పుస్తకం ఖరీదు రూ. 85.
కొనుక్కోదలచినవాళ్లు
జన విజ్ఞాన వేదిక ప్రచురణల విభాగం,
162, విజయలక్ష్మి నగర్‌,
నెల్లూరు, 524004
ఫోన్‌ : 9440503061
లేదా
మంచి పుస్తకం
12 – 13 – 450, ఒకటో వీధి,
తార్నాక, సికింద్రాబాద్‌ – 500017.
ఫోన్‌ : 9490746614 చిరునామాలోగానీ సంప్రదించవచ్చు.