అవును. దాన్దుంప తెగ, ఎన్నిసార్లు చదివినా ఆ కథ నా చేత కన్నీరు పెట్టిస్తూనే ఉంది. అన్నట్లు దానికి ఇంకో లక్షణం కూడా ఉంది. మొదలు పెట్టామో… ఇట్టే జర్రున జారిపోతుందనుకోండి. కథనం అంత బాగుంటుంది మరి. ఇక వస్తువంటారా, దాన్ని గురించి చెప్పటం ఎందుకు అది మనందరి జీవితమే. ఇన్ని సుగుణాలున్న ఆ కథను పరిచయం చేయకుండా ఉండలేకపోతున్నాను మరి.
ఆ కథ పేరు వికాసం. రచయిత – కే. ఆదర్శ సామ్రాట్. వాస్తవానికి ఈ కథ తొలుత 1998, సెప్టెంబరులో విపుల సంచికలో ప్రచురితమయింది. అనంతరం ఇప్పటి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు వి బాలసుబ్రమణ్యం సంపాదకత్వంలో డిపెప్ ప్రచురించిన చదువు విజ్ఞానం మాస పత్రికలోనూ ప్రచురితమయింది. ఇప్పుడేమో చదువుల సారం పేరిట జన విజ్ఞాన వేదిక – మంచి పుస్తకం సంయుక్తంగా ప్రచురించిన ఎనిమిది పుస్తకాల దొంతరలో మొదటి పుస్తకం ‘కథలు విందాం’లో చోటు చేసుకుంది.
రావుకు పిల్లలంటే ప్రాణం. పిల్లల్లో దాగి ఉండే సృజనాత్మకను వెలికి తీసే లక్ష్యంతో వేసవి బడిని ఏర్పాటు చేస్తాడాయన. దాని పేరు ‘వికాసం’. ప్రత్యక్ష అనుభవం నుంచి చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, ఆటలు, పాటలు, రచన, ఆంగ్ల పదాల పరిచయం నేర్పుతుంటారు. అంతకు ముందు వినటం తప్ప వాటితో పరిచయం లేని పిల్లలు అద్భుత ప్రతిభ కనబరుస్తారు. అక్కడ చేరిన అరుణగీత తొలుత వారం రోజులపాటు ముభావంగా గడిపినా అనంతరం అక్కడి ప్రత్యేక వాతావరణం కారణంగా స్పందిస్తుంది. మిగతావారితో కలిసిపోతుంది. అన్నింటిలోనూ ప్రతిభ కనబరుస్తుంది.
వేసవి బడులు ఉండాలా? వద్దా? అంశంపై నిర్వహించిన చర్చావేదికలో అరుణగీత అంటుందీ …”సంవత్సరం అంతా బడిలో చదువుకుని మళ్లీ వేసవి బడిలో చేరాలంటే ఎంతో బాధగా ఉంటుంది. నాకైతే మా అమ్మానాన్న వేసవి బడిలో చేర్పిస్తామనగానే చచ్చిపోవాలనిపించింది. కానీ ఇక్కడ టీచర్లు చేయిస్తున్న పనులు నాకు ఎంతో నచ్చాయి. నేను బాగా రాయగలననీ, బాగా పాడగలననీ, చక్కగా కవితలు కూడా రాయగలననీ, మంచిగా మాట్లాడగలననీ వాళ్లు చెబితేనే నేర్చుకున్నాను. మా బడిలో ఎప్పుడూ ఇలాంటివి చేయించలేదు. మా అమ్మానాన్నలు కూడా ఎన్నడూ ఇలాంటివి చేయమని చెప్పలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వేళ వేసవి బడులుగానీ, మామూలు బడులుగానీ ఉంటే ఇలాగే ఉండాలి”
బడి ముగుస్తుందనగా ఆమె తన తల్లిదండ్రులకు సంతోషంగా ఉత్తరం రాస్తుంది. అయితే ఉత్తరం తెలుగులో రాసినందుకు కోపగిస్తూ ఆమె తండ్రి తిరుగు ఉత్తరం రాస్తాడు. దాంతో ఆమె పసిహృదయం వికలమవుతుంది. తాను తయారు చేసిన వస్తువుల్ని పగలగొడుతుంది. గీసిన బొమ్మల్ని, రాసిన వ్యాసాల్నీ, కవితల్నీ, కథల్నీ చించిపారేస్తుంది. అదంతా తెలుసుకున్న టీచరు ముగింపు సందర్భంగా ఆ విషయం చెబుతూ కుమిలి కుమిలి ఏడుస్తుండగా … అరుణ గీత స్పందిస్తుంది. టీచరు ఏమి చెబుతాడు? – అరుణగీత స్పందన ఏమిటి? ఈ విషయాల్ని అరకొరగా ఇలా చెప్పేకన్నా ఎవరికివారే స్వయంగా చదివితేనే అనందంగా ఉంటుంది. పైగా నేనే చెప్పేస్తే ఆనక చదివేప్పుడు మీ కంట కన్నీరు రాకపోనూ వచ్చు. ఆ మధురిమను నేను తుంచటం ఎందుకు? అనుభవించండి. మనసారా ఏడవండి.
అన్నట్లు ఈ పుస్తకంలో ఇంకా లబ్దప్రతిష్టులయిన తెలుగు కథకులు సత్యం శంకరమంచి (లేగదూడ – చదువు), నామిని (గువ్వ చాతుర్యం), చాసో (ఎందుకు పారేస్తాను నాన్నా, స్వర్గం) రచనలు, రవీంద్రనాథ్ ఠాగూర్, మాక్సిమ్‌గోర్కి, భీష్మసహానీ లాంటి మహామహుల రాతలు కూడా ఉన్నాయండోయి! చంద్ర బొమ్మలు సరేసరి.
కథలు విందాం పుస్తకం ఖరీదు రూ. 85.
కొనుక్కోదలచినవాళ్లు
జన విజ్ఞాన వేదిక ప్రచురణల విభాగం,
162, విజయలక్ష్మి నగర్,
నెల్లూరు, 524004
ఫోన్ : 9440503061
లేదా
మంచి పుస్తకం
12 – 13 – 450, ఒకటో వీధి,
తార్నాక, సికింద్రాబాద్ – 500017.
ఫోన్ : 9490746614 చిరునామాలోగానీ సంప్రదించవచ్చు.
1 సెప్టెం