- సినీతారలు, క్రికెటర్లకూ స్విస్ ఖాతాలు
- వెనక్కి తెప్పిస్తానంటే రాజకీయులు సహా అందరి జాబితా ఇస్తా
- చిత్తశుద్ధి లేని భారత సర్కారు
- టివి ఇంటర్వ్యూలో రుడాల్ఫ్ ఎల్మర్
స్విస్ బ్యాంకుల్లో రాజకీయ నాయకులకే నల్ల ధనం ఖాతాలు ఉన్నాయని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం. పన్నులు ఎగవేసిన డబ్బును వారు స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారని మనం ఆందోళనలు చేస్తున్నాం. అయితే ‘నల్ల’ దొరలు వీరు మాత్రమేనా? రాజకీయ నాయకులు మాత్రమే పాపాల భైరవులా? కాదు. ఆ జాబితా కొండవీటి చాంతాడులా చాలా పెద్దది. ప్రజలు వేలం వెర్రిగా అభిమానిస్తూ, డబ్బును, సమయాన్ని కూడా వృథా చేసుకునే సినిమా తారలు, క్రికెటర్లు కూడా ‘నల్ల’ దొరల జాబితాలో ఉన్నారు. సినిమాలు, క్రికెట్ పట్ల ప్రజల అభిమానమనే బలహీనతను క్యాష్ చేసుకుంటున్న సినీ, క్రికెట్ తారలు కూడా పన్నులు ఎగవేయడంలో దిట్టలే. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ తళుకు బెళుకుల తారలు పన్నులు కట్టకుండా ఎగవేసిన డబ్బును స్విస్ బ్యాంకు ఖాతాల్లో కుప్పపోస్తున్నారు.
నీతి, నిజాయితీలపై సినిమాల్లో తెగ ఉపన్యాసాలు ఇచ్చే భారత సినీతారలు, క్రికెటర్లకు కూడా స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతాలున్నాయని స్విస్ బ్యాంకు మాజీ అధికారి రుడాల్ఫ్ ఎల్మర్ అన్నారు. ఈ ఏడాది జులై 25న జైలు నుండి విడుదలైన ఆయన తొలిసారిగా భారత్‌కు చెందిన ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పన్ను ఎగవేతదారుల్లో సినీతారలు, క్రికెటర్లు కూడా వున్నారని, వీరంతా పన్ను ఎగవేస్తూ ‘క్రిమినల్స్’గా మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలుంటాయని భయపడుతున్న ఎల్మర్ తన వద్ద వున్న పన్ను ఎగవేతదారుల జాబితాలోని ‘రాజకీయ నేతలు, సినీతారలు, క్రికెటర్ల’ పేర్లు వెల్లడించటానికి నిరాకరించారు. భారత ప్రభుత్వం నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చే అంశంలో చిత్తశు ద్ధితో వుంటే తాను ఈ జాబితాను ప్రభుత్వానికి అందచేస్తానన్నారు.విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా అంకితభావంతో కూడిన చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాను ఉదహరించిన ఎల్మర్ స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతాలున్న అమెరికన్ పన్ను ఎగవేతదారుల జాబితాను సాధించటంలో అక్కడి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. భారత ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి కొరవడిందని తాను భావిస్తున్నానని, దీనిపై స్పందించేందుకు భారత ప్రభుత్వంపై ప్రజలు, సమాజం వత్తిడి తేవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత దేశం రోజురోజుకూ బలోపేతమవుతున్న అతి పెద్ద దేశం అన్న ఎల్మర్ దానికి చర్చలు జరిపే అధికారం కూడా వుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పుడు తాను తన వద్ద వున్న జాబితాను వెల్లడించలేనని, తాను చిక్కుల్లో వుండటమే ఇందుకు కారణమని వివరించారు. అయితే తాను తప్పకుండా ఒక తేదీ చెబుతానని, ఇందుకు కొంత సమయం అవసరమని అన్నారు. నల్లధనం విషయంలో ప్రభుత్వం తగిన రీతిగా స్పందించటం లేదని ఆయన పునరుద్ఘాటించారు.
ఎవరీ ఎల్మర్?
స్విట్జర్లాండ్‌లో ప్రఖ్యాతి చెందిన జులియస్ బార్ బ్యాంకుకు చెందిన మాజీ అధికారి ఈ రుడాల్ఫ్ ఎల్మర్. దాదాపు 20 ఏళ్లు బ్యాంకు అధికారిగా పనిచేసిన ఎల్మర్ కేమన్ దీవుల్లో బ్యాంకు వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అధిపతిగా వ్యవహించారు. బ్యాంకు సిఇఓ కేలాండ్ దీవుల్లో వున్న సమయంలో తమ బ్యాంకు పన్ను ఎగవేత దారులకు సహకరిస్తోందంటూ ఎల్మర్ సంచలన ప్రకటన చేయడంతో యాజమాన్యం ఆయన్ని ఉద్యోగం నుండి తొలగించింది. తాను చేసిన ప్రకటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఒక సిడిలో కాపీ చేసిన ఎల్మర్ దానిని వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేకు అందించారు. ఈ సిడిలో 1997 నుండి 2002 వరకూ స్విస్ బ్యాంకుల్లో వున్న రహస్య ఖాతాదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం వుంది. ఈ ఏడాది జనవరిలో దానిని వికీలీక్స్ అందచేసినపుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సిడిలో వున్న దాదాపు 2000 మంది పన్ను ఎగవేతదారుల సమాచారంలో పలువురు భారతీయ ప్రముఖుల పేర్లు కూడా వున్నాయి. ఎల్మర్ ఈ సిడిలపై కట్టుకథలు చెబుతున్నారని జులియస్ బార్ యాజమాన్యం ఆరోపించింది