Archive for అక్టోబర్, 2011

ప్రశ్నంటే వాళ్లు పారిపోతారు … బావిలో కప్ప వారికి గురువు


కొంతమంది నోరు పెట్టుకుని బతుకుతారు. ప్రశ్నంటే వాళ్లు ఆమడ దూరం పారిపోతారు. నిజం చెబితే నిష్టూరమాడతారు. సత్యం వాళ్లకు పరమ శత్రువు. చరిత్ర అంటే గిట్టనే గిట్టదు. బావిలో కప్ప వారికి గురువు. ఎదుటివాడు నోరు తెరుస్తుంటే చూస్తూనే బూతుబూతంటారు. నోరు తెరిస్తే వాళ్లకు ‘అమ్మ, అక్క’ తప్ప వేరే ఏదీ రాదు. ప్రపంచంలో అందరికీ సొంత పేరంటే మక్కువని పరిశోధనలో తేలింది. కానీ అదేంటోగానీ వీళ్లకు మారు పేర్లంటేనే మరీ మక్కువ పాపం. ఓ అరడజనో, డజనో పేర్లతో మెయిళ్లు తెరిచి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాంతో అభాండాలను వదులుతుంటారు. అన్నట్లు పిరికితనం వీళ్లను అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకనే ఎవడన్నా ఎవడ్రా నువ్వు? అన్నాడో వీళ్లు తమ దుకాణానికి తాళం పెట్టి అరవై ఆమళ్ల దూరం పారిపోతారు. తమ అస్తిత్వానికి ఎసరు వచ్చిందని వీళ్లకు అన్పిస్తే చాలు ఆదినారాయణ కాస్తా అబ్దుల్లా అయిపోతాడు. రాముడేమో రౌడీనంటాడు. ఘనశ్వాముడు శామ్యూలు అవతారమెత్తుతాడు. అప్పటిదాకా పరమతమతాలపై ఊరకూరకే ఉమ్ముతూ తిరిగే ఈ పెద్దమనుషులకు తాము దాక్కోవాలంటే సిగ్గూశరం లేకుండా పరమత సహనం హఠాత్తుగా గుర్తుకొస్తుంది. అంతే దాంట్లో దూరిపోతారు. తమ ముఖం కనపడకుండా ఎదుటివారిపై రాళ్లేస్తారు. అంతా ఛండాలం చేసేస్తారు. తమకు తెలియనిదానిని ఎవ్వరూ తెలుసుకోగూడదంటారు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటూనే తాము ఒప్పుకున్నదానినే అందరూ వల్లెవేయాలంటారు. ప్రజల మనోభావాలంటూ తమ కోరికల్ని అందరికీ అంటగడతారు. భక్తుల మనోభావాలంటూ ఊరకూరకే అందరినీ బెదిరిస్తుంటారు. ఏమిటీ మనోభావాలని ప్రశ్నిస్తే వీళ్లెప్పుడూ నోరు తెరిచి చెప్పలేదుగానీ, ఓ హేతువాది అంటారూ … ”అదో బ్రహ్మ పదార్ధం” . ఇదీ సంగతి. ఇప్పటికింతే. సెలవు.

భరతమాత ముద్దుబిడ్డ నరకాసురా! అందుకో నా నివాళి!!


భరతమాత ముద్దుబిడ్డడు నరకాసురునికి నా నివాళి. ఇక్కడి మట్టి మనుషుల రక్షణకోసం అడుగడుగునా తమను ఢీకొంటున్న నరకాసురుడిని నిలువునా చంపేసి ఆర్యులు జరుపుకున్న పండుగే దీపావళి. నరకాసురుడి తల్లి మట్టి. అంటే స్థానికురాలనే గదా. తొలుత బలవంతంగానూ, తర్వాత తర్వాత బాధితులతోనే దండుగ జరిపించే పాలకవర్గాల నీతికి పుట్టిందే దీపావళి. పుట్టెడు కరువు నుంచి తమనీ, తమ ఆవుల మందల్నీ కాపాడుకునేందుకు ఆర్యులు భరత భూమిలో అడుగుపెట్టారు. ఇక్కడి ప్రకృతిని ఆక్రమించుకునేందుకు నానా ఆగడాలకు పాల్పడ్డారు. ఆర్యుల ఆగడాలను అడ్డుకున్న పాపానికి, నరకాసురుడు క్రూరుడని ప్రచారం చేశారు. నానా తిప్పలు పెడుతున్నా తమ జాతిని రక్షించుకునేందుకు నరకుడు పడరాని పాట్లు పడి రాక్షసుడు (రక్షించువాడు) అయ్యాడు. దీంతో సురులు (సురాపానం అంటే సారా తాగువారు) అసురుడు (సురాపానం చేయనివాడు) నరకాసురుడిని చంపేందుకు పెద్ద కుట్రే పన్నారు. నరకాసురుడికి మహిళలంటే మహా గౌరవం. ఈ విషయం పుక్కిటి పురాణాల్లో స్పష్టంగా ఉంది. సురజాతిగా తమను తాము అభివర్ణించుకునే ఆర్యులూ (మత్తులో ఉండగా కాదు భయంతో ఒణికిపోతూ) ఒప్పుకున్నారు. తొలుతయుద్ధానికి దిగిన కృషుణ్ని మూడు చెరువుల నీళ్లు తాగించాడు నరకుడు. భార్య (సత్యభామ) ఎదుటే భర్తను చంపటానికి ఇష్టపడని నరకుడు కృష్ణుడికి దిమ్మతిరిగే దెబ్బలతో సరిపెట్టాడు. అయితే మహిళలను గౌరవించే నరకాసురుడి ముందు తన భార్య సత్యకు బాణమిచ్చి నిలబెట్టాడు కృష్ణుడు.దాంతో వినమ్రంగా నమస్కరించి ఆయుధాలను వదిలేసిన నరకాసురుడిపై ఆమె బాణాలు వేసి చంపేసింది. తమను అడుగడుగునా అడ్డగిస్తోన్న నరకుడిని మట్టుబెట్టి విజేతలయిన ఆర్యులు సంబరాలు జరుపుకున్నారు. నరకుడి ఆశ్రితులను కొందరితో బలవంతంగా సురాపానం చేయించి జై, జై కొట్టించుకున్నారు. ఆర్యుల ప్రచారం పుక్కిట పురాణ రూపం దాల్చి కాలక్రమంలో అనార్యులనూ ఆవరించింది. నరకాసుర రూపాన్ని భయం పుట్టించే విధంగా చిత్రించారు. నాలుగు చేతులు, తల మీద రెండు కొమ్ములు, పేద్ద నోరు, ఆయుధాలన్న తీరున పెరిగిన గోళ్లు, వీటన్నింటికీ తోడు మెడలో మనిషి పుర్రెలతోనూ, ఎముకలతోనూ రూపొందించిన దండనూ పుట్టించారు. నిజం గడపదాటే లోగా అబద్ధం ఆరవై ఆరు ఆమడ తిరిగొస్తుందన్న చందంగా వారి ప్రచారంతో నరకాసురుడంటే మహా క్రూరుడని ముద్ర వేయగలిగారు. విజేతలు చేసిన వక్ర ప్రచారం కాలక్రమంలో పరాజితుల బుర్రల్లో దూరి బాణాసంచా వ్యాపారానికి బాధితులను కూడా వెన్నూదన్నూగా నిలుపుతోంది. ఏటా కోట్లాది రూపాయల బాధితుల శ్రమశక్తిని దోమల నివారిణి పేరిట బాణాసంచా రూపాన దోచుకుంటోంది. దేనికయినా పర్యవసానం దోచుకోవటమే గదా. ఆనాడు తమ అస్థిత్వానికే ఇష్టపడని నరకాసురుడిని మట్టుబెట్టిన ఆర్యులు, ఆ సంఘటననే పెట్టుబడిగా చేసుకుని బాణాసంచా వ్యాపారాలతో నేటికీ సొమ్ముచేసుకుంటున్నారు.

వామపక్షానికే మళ్లీ పట్టం

  • అర్జెంటీనా ఎన్నికల్లో క్రిస్టినా ఎన్నిక
  • భారీ మెజార్టీతో విజయం

అర్జెంటీనాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ డీ కిర్చ్‌నర్‌ (58) మరోమారు భారీ అధిక్యతతో ఎన్నికయ్యారు. అర్జెంటీనాలో వామపక్షమైన క్రిస్టినా పార్టీకి, ఆమె అభ్యుదయ విధానాలకు విస్తృతమైన ప్రజా మద్దతు లభించింది. దేశవ్యాప్తంగా 24 శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెల్లడైన ఫలితాల్లో ఆమెకు 54 శాతం ఓట్లు లభించడంతో అసాధారణ విజయం సొంతమైంది. ఆమెపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ బాగా వెనుకబడ్డారు. ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 17 శాతం ఓట్లే వచ్చాయి. వామపక్షాల కంచుకోటగా ఉన్న దేశంలో అతిపెద్దదైన బ్యూయోనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్సులోని కొన్ని బ్యాలెట్లలో మాత్రమే ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అందువల్ల క్రిస్టినా మరింత భారీ అధిక్యత సాధిస్తారని హోంమంత్రి ప్లోరెన్సియో రాంన్డాజ్‌ తెలిపారు. వామపక్షాల గెలుపుతో దేశంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. వేలాది మంది మద్దతుదారులు రాజధానిలోని చరిత్రాత్మక ప్లాజా డి మయోలో గుమిగూడి పతాకాలను గాలిలో ఊపుతూ వేడుకలు జరుపుకున్నారు. లాటిన్‌ అమెరికాలో వరుసగా రెండోసారి ఎన్నికైన ప్రథమ మహిళ ఫెర్నాండజే కావడం విశేషం. అయితే ఇంతటి ఘన విజయోత్సవ వేళ తన భర్త, మాజీ దేశాధ్యక్షులు నెస్టోర్‌ కిర్చెనర్‌ తమ మధ్య లేడన్న విషాదం ఆమెను కలిచివేసింది. నెస్టోర్‌ గతేడాది అక్టోబరు 27న మరణించిన సంగతి తెలిసిందే.

నెస్టోర్‌ సొంత పట్టణంలో ఓటింగ్‌ పూర్తయిన తరువాత ఓ పక్క విజయానందం, మరో పక్క విషాదం ఆమెను కమ్ముకొంటుండగా గద్గద స్వరంతో మాట్లాడారు. ‘మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామని ఈ విజయం ధృవపరుస్తోంది. ఇందుకు నేనెంతగానో గర్వపడుతున్నాను’ అని అన్నారు. 1983లో అర్జెంటీనాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగినప్పటి నుంచి ఇంత భారీ ఓటింగ్‌ శాతంతో ఏ అధ్యక్షుడు గెలుపొందలేదు. ఆ ఏడాది రౌల్‌ అల్ఫోన్సిన్‌ కూడా 52 శాతం ఓట్లు సాధించారు. 1973లో విజయం సాధించినప్పటి కంటే కూడా ఇప్పుడు గవర్నర్‌ హెర్మస్‌ బిన్నెర్‌, మరో ఐదుగురు అభ్యర్థులపై అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెసులో తగినన్ని స్థానాలు మళ్లీ సాధించగలమన్న విశ్వాసాన్ని ఫెర్నాండెజ్‌ రాజకీయ కూటమి వ్యక్తం చేస్తోంది. 2009లో కోల్పోయిన నియంత్రణను మళ్లీ సాధిస్తామని, కొత్త పొత్తులు ఏర్పాటు చేస్తామనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఫెర్నాండెజ్‌ అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తల్లో తీవ్ర ప్రతికూల రేటింగులు వచ్చినప్పటికీ అనతి కాలంలోనే ఆమె విశేష ప్రజాదరణ చూరగొన్నారు. ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకొని రాజకీయ మేధావుల గౌరవాన్ని చూరగొన్నారు.

తాము స్థిరమైన ప్రభుత్వాన్ని, తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అత్యధిక మంది ఓటర్లు చెప్పారు. తన భర్త నెస్టర్‌ కిర్చ్‌నర్‌ విధానాలనే తాను అనుసరిస్తున్నట్లు ఫెర్నాండెజ్‌ తరచూ గుర్తు చేస్తుంటారు. నెస్టర్‌ 2003లో అధ్యక్ష పదవిని అధిష్టించారు. సోయా, ఇతర అర్జెంటీనా వ్యవసాయ ఉత్పత్తులకు చైనా, తదితర చోట్ల మంచి డిమాండ్‌ ఉండటంతో గత ఎనిమిదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ సగటున 7.6 శాతం వృద్ధిని సాధించింది.

లాటిన్‌ అమెరికా మరింత పటిష్టం..

ఫెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికైనందుకు యూనియన్‌ ఆఫ్‌ సౌత్‌ అమెరికన్‌ నేషన్స్‌ (యునాసుర్‌) అభినందనలు తెలిపింది. ఆమె ఘన విజయం సాధించడాన్ని అసాధారణ సంఘటనగా యునాసుర్‌ సెక్రటరీ జనరల్‌ మారియా ఎమ్మా మెజియా అభివర్ణించారు. ‘మీరు తిరిగి ఎన్నిక కావడంతో లాటిన్‌ అమెరికా పటిష్టమవుతుంది. మీరు, మాజీ అధ్యక్షుడు నెస్టర్‌ నిర్ణయాత్మకంగా అందించిన మద్దతుతో మంచి సమగ్రత ఏర్పడుతుందని ఆకాంక్షిస్తున్నాం’ అని క్రిస్టినాకు పంపిన అభినందన సందేశంలో మెజియా తెలిపారు. నెస్టర్‌ ప్రథమ వర్థంతికి నాలుగు రోజుల ముందు క్రిస్టినా తిరిగి ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రి అమదో బౌడౌను ఉపాధ్యక్షునిగా నియమించుకోనున్నారు.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆర్కే మొగోడి సవాలు


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ 2011 అక్టోబరు 23న మొగోడి సవాలు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ఆర్కే సవాలు విసిరారు. దమ్మూ ధైర్యమూ ఉంటే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపేందుకు స్వయంగా రావాలని కోరారు. తనపై ఆరోపణలు చేస్తోన్న పెంపుడు జంతువుల్ని మాత్రం వద్దన్నాడు. ఆంధ్రజ్యోతిలో తన భాగాన్ని జర్నలిస్టు సంఘానికి రాసిస్తానంటూ, 2004 తర్వాత జమపడిన ఆస్తిపాస్తుల్ని నువ్వు పేదలకు పంచగలవా? అంటూ జగన్మోహనరెడ్డికి సవాలు విసిరాడు. ఆర్కే సవాలులోగానీ, ఆయన వివరణలోగానీ ఎలాంటి శషబిషలు ఉన్న దాఖలాలు కన్పించలేదు. సూటిగా ఉంది. పద ప్రయోగం చాలా చాలా బాగుంది. అయితే ఒకే ఒక వాక్యం లేకుండా ఉంటే బాగుండేదని అన్పించింది. అది ఈనాడు రామోజీరావు విషయం. ఆయనన్నాడు ” మార్గదర్శి ఉండబట్టి మీ నాన్న ఈనాడుతో ఆడుకున్నాడుగానీ, ఆంధ్రజ్యోతిని ఏమీ చేయలేకపోయాడు” అని. అంటే మార్గదర్శి దారి తప్పి వ్యవహరించిందని ఆర్కే తేల్చినట్లయింది. ప్రస్తుతం విచారణ జరుగుతోన్న మార్గదర్శి వ్యవహారాన్ని తేల్చేయటం చట్టరీత్యా సరయినది కాదేమో! దీనికితోడు తనది కానిదానిని గురించి మాట్లాడటమూ అనవసరం కదా! మార్గదర్శి జోలికి ఆర్కే అనవసరంగా వెళ్లాడేమో అన్పించింది. జగన్మోనరెడ్డి అనుయాయుల అవాకులు చెవాకులు ఆర్కే నషాళానికి అంటినట్లుంది… వాళ్లని తొక్కల్ని పారేసినట్లు ఆర్కే విసిరేశాడు. వాళ్లని పెంపుడు కుక్కలని ఏకిపారేశాడు. వాస్తవం కూడా అదేననుకోండి. అక్కడ చేరినవారంతా అవినీతిపరులు, అక్రమార్కులు, విలువల్ని నిలువునా నిలువు లోతున పాతరేసిన మహాపాతకులు. అంబటి, రామచంద్రరావు ఎవరయితేనేం, ఎవరయితేనేం ఏ మాత్రం విలువలు లేని ముఠాకోర్లనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున దండుకున్న ఓ ఘనుడు కూడా ఆయన పెంపుడు జంతువుల్లో ఉన్నాడు. పలువురి ఘన చరితల్ని చదివినందునే ఆర్కే తీవ్రంగా చేసిన ఆరోపణలకు మద్దతు పలకాలని అన్పించింది. వైఎస్‌ మాట్లాడితే ఆనాడు రెండు పత్రికలు అనేవాడు, ఇప్పుడేమో జగన్‌ ఆశ్రితులు రెండు పత్రికలు, మూడు ఛానళ్లు అంటున్నారు. తన అవినీతి సాక్షి నూతి నుంచి నీతుల్ని తోడి రాష్ట్ర ప్రజల మెదళ్లను తెగ నింపేస్తున్నారు.
ఇక జగన్మోహరెడ్డి, ఆయన ఆశ్రితులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే స్పందిస్తారన్న జాడలు కన్పించటం లేదు.

చమురు దొంగ చేతిలో గడాఫీ హతం


గడాఫీ కిదే నా నివాళి
దేశభక్తియుత లిబియా అధ్యక్షుడు గడాఫీని 2011 అక్టోబరు 20న చమురు దొంగ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక దళాలు దారుణంగా హత్యచేశాయి.
ప్రపంచస్థాయి మానవుడికి ఇదే నా నివాళి.
సొంత బుర్రలు లేని, ఉన్నా మెదడుకి మేకులు కొట్టుకుని బతికే తెలుగు వార్తా ఛానళ్లు యథావిధిగానే అమెరికా తైనాతీ సంస్థలు విడుదల చేసిన సమాచారాన్ని గుమ్మరించటం ఘోరం. నేరం. గడాఫీ పూర్వాపరాలను తెలుసుకోకుండానే నియంత హతుడయ్యాడంటూ వ్యాఖ్యానించటం ఏమీ బాగాలేదు. మిగతా విషయాలు ఎలాగున్నా లిబియా మనకు మిత్ర దేశం. అనేక పర్యాయాలు కష్టకాలంలో మనకు అండగా నిలబడింది. అదంతా గడాఫీ చలవే. ప్రధానంగా వైద్య సేవల రంగంలోనూ, చమురు అందజేసి మనకు సాయం అందించిన దేశమది.
చేయూత, సాయం, మిత్రత్వం తదితర వ్యవహారాలను పక్కనబెట్టి మరొక రకంగా ఈ విషయాన్ని పోల్చి పరిశీలిద్దాం. ఉదాహరణకు మీ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది. దానికి కారణం మీరని నాకు తెలిసింది. మీ ఇంటి పొరుగునున్న నేను, మీ ఇంట్లోకి జొరబడి మిమ్మల్ని కొట్టాను.
మీ ఇంటి సమస్యలో నేను కలుగజేసుకోవటం సరయినదేనా?
మీ సమస్యను మీరే పరిష్కరించుకోలేరా?
కాకుంటే మీరు కోరితే సలహాలు – సూచనలు ఇచ్చి సమస్య పరిష్కారానికి సాయం చేయటంతో సరిపెడితే సరిపోదా?
ఈ ప్రకారం లిబియా వ్యవహారాన్ని చూద్దాం.
గడాఫీ నియంతే అయితే, లిబియన్లకు ఆయన పాలన నచ్చకపోతే ఎదురు తిరగాల్సింది ఆ దేశస్తులా? అమెరికా పాలకులా?
గడాఫీని చంపేందుకు నాటో సైన్యానికి ఏమి హక్కు ఉంది?
గడాఫీకి విదేశాల్లో వ్యాపారాలున్నాయనీ, సొంత విమానం ఉందనీ అమెరికా ప్రచారం చేసింది. అదే నిజమయితే… గడాఫీ తన సొంత విమానంలో ఎందుకు పారిపోలేదు? నెలల తరబడీ తన వ్యాపారాలను వదిలేసి తన సొంత ఊరిలో ఎందుకు ఉండిపోయాడు? వీటికి అమెరికా అనుంగు వార్తా సంస్థలు జవాబు చెప్పాలి.

పోచారం ఓ ప్రజాద్రోహి


బాన్సువాడ ఉప ఎన్నికల్లో తనకు నాలుగు ఓట్లు రాగానే పోచారం శ్రీనివాసరెడ్డి అనే ప్రజాద్రోహి ప్రజలకే హెచ్చరికలు జారీ చేశాడు. తనకు ఓటేయని సీమాంధ్రులంతా తెలంగాణ ద్రోహులని తిట్టిపోశాడు. వాళ్లంతా మారిపోవాలని ఆదేశాలు జారీ చేశాడు. మారకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు.
ప్రజల మనోభావాలంటూ తెదేపా గూటి నుంచి తెరాస కారెక్కిన ఇతగాడిని ఇప్పటిదాకా కాపాడిన చంద్రబాబు కూడా ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. అయితే తెరాసకూ తెదేపాకు మూల సూత్రాల్లో తేడా లేదు కాబట్టి పోచారం ఎక్కడయినా బతికిపోతాడు. ఎవ్వరయినా కాపాడతారు. కాకపోతే ఏ గూటి మాటలు అక్కడ మాట్లాడటమే పోచారం పని. చేతలు మాత్రం ఒకటే. అదే ప్రజాద్రోహం.
ప్రజల మనోభావాలంటూ ఫోజులు కొడుతోన్న పోచారం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా అవేమీ గుర్తుకు రాకపోవటం అతగాడి తప్పేమీ లేదు. కాకపోతే ఇలాంటి వారి తీరును మనం సదా గుర్తు చేసుకుంటుండాలి. స్టేషనరీ కొనుగోలుమాలుకు పాల్పడి ఇతగాడు తన మంత్రి పదవిని కోల్పోవలసి వచ్చిందని గుర్తుంది కదూ!
ఈనాటి ప్రజా ప్రతినిధుల్లో అవినీతి లేకపోతే చెప్పుకోవాలిగానీ, ఉందని చెప్పుకోవటం దండగమారి పని. ప్రజలు … ప్రజల మనోభావాలు అంటూ తెగ తెగ వాగేస్తున్నాడు కాబట్టి పోచారానికి సంబంధించి గుర్తుచేసుకోదగిన విషయం ఒకటుంది.
అది విద్యుత్తు ఉద్యమం జోరుగా సాగుతోన్న సమయం. ఆ సమయంలో రాష్ట్ర మంత్రిగా వెలగబెడుతోన్న పోచారం ఒంగోలుకు వచ్చాడు. అది కనిపెట్టిన వామపక్ష కార్యకర్తలు ఆయన వాహనానికి అడ్డంపడ్డారు. ఆ సాయం సమయంలో వేలాది మంది పౌరులు అక్కడ పోగుబడ్డారు. వారంతా చోద్యం చూస్తూ, ప్రభుత్వ తీరుపై శాపనార్ధాలు పెట్టారు. కొంతసేపు నినాదాలు, వాగ్వివాదాలు సాగిన తర్వాత పోచారం కారు దిగి పోలీసు వలయం మధ్య కాలి నడకన అతిథి గృహానికి వెళ్లిపోయాడు. దీంతో ప్రజలతోపాటు కార్యకర్తలు కూడా ఎవరిదోవన వారెళ్లారు. ఇక తర్వాత జరిగిందే అసలు సంగతి. అతిథి గృహానికి చేరుకున్న పిదప పోచారం లోపలి మనిషి నిద్రలేచాడు. క్రోధంతో ఉడికిపోయాడు. అంతే పోలీసు ఉన్నతాధికారులను ఆగమేఘాలమీద పిలుపించుకున్నాడు. వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బొక్కలిరిగేదాకా విరగదీయమని ఆదేశాలు జారీచేశాడు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంటుంది. పోలీసు అధికారులు విజృంభించారు. కార్యకర్తల ఇళ్లమీద పడి ఎత్తుకొచ్చి కేసులు పెట్టారు. లాఠీలతో ఇష్టారీతిన ఆడుకున్నారు. తర్వాతెప్పుడో తీరిగ్గా ఇళ్లకు పంపారు. ఆ సమాచారాన్ని పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు పోచారం తెలుసుకుంటూ తెగ సంతోషపడిపోయాడట! ఇదీ ప్రజల మనోభావల పట్ల పోచారంగారికున్న నిబద్ధత. ఆ తర్వాత అల్లుడి అక్రమాల పుణ్యమాని మంత్రి పదవిని కూడా ఊడగొట్టుకోవటం వేరే సంగతనుకోండి. అయితే పోచారానికి ఇప్పటికీ తిక్క కుదిరినట్లు లేదు. తనకు ఓటేయకపోవటం నేరమంటూ తెగ తెగ హూంకరిస్తున్నాడు. ప్రజాస్వామ్యం పత్తి కట్టెలు. ప్రజా ప్రతినిధులు, ప్రజల మనోభావాలు పేరేదయితేనేం అన్నీ దోచుకునేందుకే తప్ప సమాజం కోసం కాదు. అందులోనూ ఆయనగారు ఇప్పుడు వల్లె వేస్తున్నట్లుగా తెలంగాణ ప్రజల కోసం అసలే కాదు. తెలంగాణ అంటే అంత ఇష్టమే అయితే తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అదీ తెలంగాణవారిపైనే పోలీసుల కేసులు ఎందుకు పెట్టిస్తాడు? దటీజ్‌ ప్రజాద్రోహి పోచారం.

అబద్ధాల అద్వానీ … నోరుముయ్యి


తాను ఏది చెప్పినా చెల్లిపోతుందనుకునే అద్వానీ సహజంగానే (అ)జన చేతన యాత్రలోనూ అబద్ధాలు గుప్పిస్తున్నారు. జన చేతన యాత్ర పేరిట తెలంగాణలో 2011 అక్టోబరు 18-19 తేదీలలో యాత్ర జరిపిన ఆయన ఇష్టారీతిన అబద్ధాలు ఆడేశారు. తెలంగాణ విషయంలో, అవినీతి విషయంలోనూ ఆయన అబద్ధాలకు అంతే లేకుండా సాగింది. వాటినలా ఉంచి భరత జాతి ముద్దు బిడ్డలు భగత్‌సింగ్‌ – చంద్రశేఖర్‌ అజాద్‌ – వివేకానందుడి పేర్లను పలుకరించి మరీ అబద్ధాలకు దిగారు అద్వానీ. భగత్ సింఘ్, ఆజాద్, వివేకానందుడి ఆశయాల కొసం తమ పార్టీ క్రుషి చేస్తుందట.
పేర్లు తప్ప వారేమి చెప్పారో, ఏమి చేశారో ఇప్పటి తరానికి అంతగా తెలియని భగత్‌సింగ్‌ – అజాద్‌, వివేకానందుడి పేర్లను భాజపా ఉపయోగించుకోవటం అంటే కేవలం లబ్ధి కోసమేనంటే ఎవ్వరూ తప్పు పట్టలేరు. పైగా ఈ యువ కిశోరాలను ఆదర్శవాదులుగా భావించే వారి మద్దతు పొంద వచ్చన్న ఆశ అద్వానీలో కన్పిస్తోంది. వాస్తవానికి భాజపా విధానాలకూ – యువకిశోరాల విధానాలకూ ఎక్కడా పొంతన కుదరదు. పైగా భాజపా విధానాలకు వారి ఆలోచనలు – వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు – వారి రచనలు – వారి ఆచరణ పూర్తిగా వ్యతిరేకం, విరుద్ధం. భగత్‌సింగ్‌, అజాద్‌ హేతువాదులు – నాస్తికులు – మతోన్మాదానికి వ్యతిరేకులు – స్పష్టమయిన లౌకికవాదులు – వీటిన్నింటికీ తోడు భాజపాకు అస్సలు గిట్టని సామ్యవాదం వారి సిద్ధాంతం. ఈ కిశోరాలు పట్టుమని మూడు పదులకు ముందే బ్రిటీష్‌ ఉరికంభాలకు ఊగాల్సివచ్చినా, వారి కంపు తుపాకులకు బలయినా ఆ కొద్ది కాలంలోనే ఈ సిద్ధాంతాలతో కచ్చితంగా బతికారు. తాను ఎందుకు నాస్తికుడయ్యాడో వివరిస్తూ భగత్‌సింగ్‌ రచన కూడా చేశాడు. ఇక వివేకానందుడు ఆయన నాస్తికుడు కాకపోయినా, భౌతికవాదంతో పూర్తిగా మమేకం అయినట్లు ఆయన వ్యాఖ్యానాలు అడుగడుగునా పట్టిచూపుతాయి. పేదరికం నిర్మూలనకు కృషి చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. దైవపూజ కన్నా బాధితులకు సేవ చేయటం ముఖ్యమని సూచించారు. జీవించిన కొద్ది కాలంలో ఆయన ఎక్కడా మతోన్మాదానికి మద్దతు తెలపలేదు సరికదా, బాధల విముక్తికి చేతలు చూపాలని పదే పదే కోరటం స్పష్టంగా చూడవచ్చు. అలాంటివారి పేర్లను పదే పదే తలచినా చేసే పాపాలు, చెప్పే తప్పుడు సిద్ధాంతాల దోషం నుంచి భాజపా బయట పడబోదు. అయితే గియితే తమ తప్పిదాలను ప్రజలు సులభంగా గమనించే ప్రమాదం నుంచి కొద్దికాలంపాటు రక్షణ పొందవచ్చునేమో!

ఒక వేలు తెరాస వేపు … నాలుగేళ్లు సమైక్యం వైపు


రాష్ట్రాన్ని విడదీయాలన్న తెరాసవైపుకు సమైక్యవాదులు ఒక వేలు చూపితే, నాలుగేళ్లు తమవైపే ఉన్నాయన్న విషయాన్ని మంగళవారం నుంచీ మరోమారు ఆందోళనలకు దిగిన సీమాంధ్రులు గమనించటం మంచిది. ఈ సూచన పలువురికి మంట మండుతుందని నాకు ఎరికే. అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న బలమైన కోరికగా ఉన్నవాడిగా స్పందిస్తున్నాను. బలవంతంగా పెళ్లి చేయగలమేగానీ, కాపురం చేయించలేమన్న వాస్తవం మిత్రులకు తెలియంది కాదు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తోలకెళ్లగలంగానీ, బలవంతంగా నీళ్లు తాగించలేము కదా! సమైక్యవాదులు సీమాంధ్రలో జరిపే ఆందోళనలతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలరేమోగానీ, మనుషుల్ని, వారి మనసుల్ని ఒక్కటిగా ఉంచలేరని చెప్పటానికి వెనుకాడటం లేదు. సమైక్యవాదులకు నిజంగా తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్న కోరిక ఉంటే తెలంగాణ ప్రాంతవాసుల మనస్సులు గెలుచుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయం లేనే లేదు.
ఎదుటివారి మనస్సులను గెలుచుకుని తమ ఆశలను సాకారం చేసుకోసుకోవటం ఒక అంశం అయితే, తమ ప్రాంతవాసుల మద్దతు కనీసం అరవై శాతమయినా పొందాలి. అయితే, మంగళవారం ప్రారంభమయిన కొన్ని కార్యక్రమాలను చూస్తే సమైక్యవాదులు కూడా తెలంగాణవాదుల వలే ప్రజలకు దూరమయ్యే ప్రమాదం కన్పిస్తోంది. తమ వాదాలను విన్పించుకునేందుకు నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు కల్పించాలా? ఏ ఇబ్బందులూ లేకుండానే అటు ప్రజల్నీ, ఇటు ప్రభుత్వ దృష్టినీ ఆకర్షించవచ్చుగదా! ఉదాహరణకు రాస్తారోకోకు బదులు మానవహారంగా ఏర్పడవచ్చు. వీధుల్లో గందరగోళంగా కేకలు వేయటంకన్నా కరపత్రాలు పంపిణీ చేయటం మేలు కదా? పిల్లలతో ఊరేగింపులు తీయటం మాని 20 ఏళ్లకు పైబడినవారే కార్యక్రమాలు నిర్వహిస్తే తల్లిదండ్రులు బాధపడరేమో! ఇంకా పేటలకు పోయి చిన్నచిన్న సభలు జరపొచ్చు. నాటికలు వేయవచ్చు. పాటలు పాడొచ్చు. మిత్రులారా! ఆలోచించండి. కాపురం చేసే కళ కాళ్లు తొక్కిన సమయంలోనే తెలిసిపోతుందన్నట్లుగా సమైక్యాంధ్రవాదుల పోకడలు ప్రారంభంలోనే రాస్తారోకోలతో, అదీ పిల్లలతో చేయించటం చూస్తుంటే భవిష్యత్తు పట్ల భయపట్టుకుంది. జాగ్రతహో! జాగ్రత్త!!
తెలంగాణవాదులు నిర్వహించిన సజస మూలంగా విద్యుత్తు, ఆర్టీసీ ధరల్ని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో తెలుగువారి గుoడెలు నాలుగు వందలసార్లు కొట్టుకుంటున్న తీరును సమైక్యవాదులూ వినండి. సమైక్యవాదులు కూడా తెలంగాణవాదుల మాదిరిగానే పోటీబడి ప్రజలకు చీదర పుట్టించకండి. పలు భారాలతో సతమతమవుతోన్న ప్రజలకు తోడుగా నిలవండి. వారి మనస్సులు గెలవండి. రైతుల, దళితుల, విద్యార్థుల సమస్యలు ఈగల్లా ముసురుకుంటున్నాయి. వాటి పట్ల దృష్టి సారించండి. ప్రజలు మీరు చెప్పే నీతుల్ని వింటారు. రోగుల ఆహాకారాలు వినండి, వారికి ఉచితంగా వైద్యం చేయించండి. మీతో కలిసి ప్రజలు నడవకపోతే అప్పుడు అడగండి.

నేను మార్క్సిస్టుని కాదు … మూర్ఖుస్టుని అంతకన్నా కాదు … ఆ రెండూ అతి స్వల్పంగా తెలిసినవాడిని మాత్రమే


శ్రీకాకుళం శర్మగారు ప్రకటించినట్లుగా నేను మార్క్సిస్టునని ఎక్కడా లిఖితపూర్వకంగాగానీ, మౌఖికంగాగానీ ప్రకటించుకున్న జ్ఞాపకం లేదు. అయితే గియితే అలా జరిగి ఉంటే మాత్రం తప్పే. ఎందుకంటే నాకు మార్క్సిజం కొద్దిగా తెలుసు. చాలా విషయాలు నాకు అసలు అర్ధమే కాలేదు. అర్ధం చేసుకునేందుకుగాను కొంతమేర ప్రయత్నించి వదిలిపెట్టాను. ఆ మాటకొస్తే మార్క్సిజమే కాదు… తెలుగులో రాసిన కొన్ని కవితలు కూడా నాకు ఎందుకో అర్ధం కాలేదు. దాన్నలా ఉంచితే ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. నేను ఓ వామపక్ష పార్టీ కార్యకర్తగా రెండు దశాబ్దాలపాటు పనిచేసిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఆ ఊసే వదిలేశానని కాదు. ఇప్పటికీ మార్క్సిజం అంటే గట్టి విశ్వాసం ఉంది. అదే ఈ అస్తవ్యస్థ వ్యవస్థల నుంచి నాలాంటి వారిని రక్షిస్తుందని నమ్మకం. అందరికీ సమాన అవకాశాల్నీ, సొంత ఆస్తిలేని సమాజాన్ని నేను ఆకాంక్షిస్తున్నాను. మళ్లీ సమయం చిక్కితే నా ఆశయాల సాకారానికి గట్టిగా కృషి చేయటం ప్రారంభించాలన్న కోరిక ఉంది. ఒకటి రెండేళ్లలో అది సాధ్యం అవుతుందని విశ్వసిస్తున్నాను. శీర్షికలో చెప్పినట్లుగా మూర్ఖిస్టుని కూడా కాదు. నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అంటూ వాదించటం నాకు నచ్చదు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ వాదాన్నయినా, అటు సమైక్య రాగానన్నయినా చూస్తాను. అసలే నిత్యం ఈతి బాధలతో సతమతమవుతోన్న జనాలను ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఏ వాదాన్నయినా విన్పించవచ్చంటాను. సజస అయినా, రైలు, బస్సు, బడి బందుల్నయినా అదే కోణంలో విమర్శించాను తప్ప తెలంగాణ వాదమే తప్పని చెప్పటం నా పని కాదు. అయితే ఈ వాదనల్లో నేను ఉన్నాయనుకుంటున్న డొల్లతన్నాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేశాను. ఇక ముందూ చేస్తాను. అవే తప్పులు సమైక్యవాదంలో చోటు చేసుకున్నా చెప్పకుండా ఊరుకోను. పైగా నేను కూడా సమైక్యవాదినే కాబట్టి దానిలో తప్పులు దొర్లితే మరింత ఘాటుగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను.

ఉద్యమిస్తే పోయేదేమీ లేదు… బడులకు పడ్డ తాళాలు ఊడటం తప్ప!!


ఓ డజను రోజులపాటు తెలంగాణలో బడులకు వేసిన బలవంతపు తాళాలు 2011 అక్టోబరు 18 నుంచీ ఊడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రాంత ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం 17వ తేదీ సాయంత్రం ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రకటన రానున్న విషయాన్ని తెలుగిల్లు 15వ తేదీనే విశ్లేషించిన వైనం చదువరులకు విదితమే. ఏదయితేనేం బడులు తెరుచుకోవటం తల్లిదండ్రుల ఉద్యమ ఫలితమే. అందుకు తెలుగిల్లు తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతోంది. ఇదేదో తెలంగాణ వ్యతిరేక వ్యవహారం కాదు సుమా. ఉమ్మడిగా గొంతు విప్పితే వచ్చే లాభం ఏమిటో తెలియజెప్పేందుకే. ఈ విజయం మరిన్ని పోరాటాలకు దారి తీయాలని తెలుగిల్లు ఆశిస్తోంది. గ్యాస్‌ ధర పెరుగుదల, విద్యుత్తు భారాలు, నిరుద్యోగం, నిలిచిపోయిన నీటి సరఫరా, బడి మూత, పంతుళ్ల కొరత, రోడ్డుపై చెత్తాచెదారం, పన్నుల పెంపు, లంచాలు, అక్రమాలు ఇలా … ఇలా సమస్య ఏదయినా వీలయిన వాళ్లంతా ఉమ్మడిగా కదలాలి. ఒక్కటై గళం విప్పాలి. అప్పుడు విజయాలు ఒళ్లో వచ్చి వాలతాయి.