Archive for అక్టోబర్ 12th, 2011

”వార్తోడు యాభయ్యేలు ఏసుకుపోయాడు … రెండు లక్షలు ఇవ్వాలంటూ ఈనాడోడు దుంపతెంచుతున్నాడు”


”హలో, సుబ్రావేనా?” 2011 అక్టోబరు 10న నాకొచ్చిన ఫోన్లో ఎవరో వాకబు.
”అవును, మీరెవరు? జవాబుతోపాటు నేనూ వాకబు చేశాను.
”అరేయ్‌! నేన్రా, ఎల్‌ఎన్‌కేని”
”ఓ… నువ్వా! చాన్నాళ్లకు పలకరించావు”
”ఎక్కడరా, నువ్వు రెండు నెలలకొకసారి నంబర్లు మారుస్తుంటే? నాకెక్కడ దొరుకుతావు??
”చేసేదేముంది. పనిచేసే సంస్థ మారినప్పుడల్లా నా ఫోను మారక తప్పదు కదా? సర్దిచెప్పాను. సరే ఇంతకీ సంగతులేంటి.”
”ఏమున్నాయిరా, ఎప్పట్లానే అక్టోబరు రెండున మనూరివాళ్లమంతా కలిసి సభ జరిపాము. నా దగ్గరున్న నంబరుకు చేస్తే నీకు కలవకపోయె. అందుకని నీకు సమాచారం చేర్చలేకపోయాము.”
”అరరే, ఈసారన్నా సభకు వద్దామనుకున్నానే.” విచారం వ్యక్తం చేశాను.
”అందరూ వచ్చారా? సభ బాగా జరిగిందా??”
”ఆ… బాగానే జరిగింది. దాదాపు హైదరాబాదులో ఉన్నవాళ్లంతా వచ్చారు.
”బాగుంది… బాగుంది. ఇంకా సంగతులేంటి?”
”చిన్న పనిబడి ఫోను చేశానురా.”
”చెప్పు”
”అపార్ట్‌మెంట్‌ కోసం ఫలానా చోట కొన్న స్థలంలో రాయిని పగలగొట్టేందుకు బ్లాస్టింగ్‌ చేశామురా. ఆ సంగతి ఎట్లా పసిగట్టాడోగానీ, వార్త విలేకరి ఫోటోలు తీశాడు. రెండు రోజుల తర్వాత మాకు స్థలం అమ్మిన ఆసామి ద్వారా వచ్చి విలేకరులందరికీ కలిపి రూ. 50 వేలు ఇస్తే వార్త రాయకుండా ఆపుతానన్నాడు. లేకపోతే అన్ని పత్రికల్లోనూ బీభత్సంగా వార్తలు రాస్తామని బెదిరించాడు. పోలీసులకు కూడా ఫోటోలు అందజేస్తానని కూడా చెప్పాడు. సరే చేసేదేముందని వాడడిగింది ఇచ్చాను. తీరా ఇప్పుడు రెండు రోజుల నుంచీ ఈనాడు విలేకరి నుంచి ఒకటే ఫోన్లురా. తనకు రెండు లక్షల రూపాయలు ఇస్తే బ్లాస్టింగ్‌ వార్త రాయకుండా ఆపుతానని బెదిరిస్తున్నాడు. ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. నువ్వూ విలేకరివేగదా, ఏమన్నా సలహా ఇస్తావేమోనని మనూరి నుంచి నీ నంబరు తెప్పించి ఫోను చేస్తున్నాను.
”వార్తోడికి యాభైవేలు ఇచ్చానంటున్నావుగదా! ఈనాడువాడితో కూడా బేరం కుదుర్చుకుంటే పోలా!” నా గొంతులో వ్యంగ్యం ధ్వనించింది.
”ఒరేయ్‌, ఫ్రెండ్‌వని ఫోను చేస్తే ఎగతాళి చేస్తావేంరా? ఏమి చేయమంటావో? చెప్పరా!” గొంతుకలో బాధ వ్యక్తమయింది.
”ఈనాడులో ఫలానా ఫలానా వాళ్లతో నాకు బాగా పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడదామా?” నేను సూచించాను.
”మరి వాడు ఈసారి జ్యోతివాడినో, హెచ్‌ఎంటీవీ వాడినో పంపితే? ఏమి చేయాలి” మిత్రుడి అనుమానం.
”నిజమే, అక్కడి విలేకరులందరినీ భోజనానికి పిల్చి విస్తట్లో తలో కవరు వడ్డించటమే మార్గం” మళ్లీ వ్యంగ్యం.
అవతలి నుంచి మౌనం. బాధితుడు గదా? మరి. అందులోనూ అందరూ అత్యంత ప్రమాదకరమని అనుకునే ఏ పోలీసు వలలోనో చిక్కితే ఇంతని పారేసి బయటపడొచ్చు. ఇప్పుడు చిక్కింది, పోలీసుల్నే భయపెట్టే విలేకరుల వలలోనయిపోయె.
”జ్యోతి వాడొస్తే ఫలానా మా చుట్టమని చెప్పు, హెచ్‌ఎంటీవీ వాడొస్తే ఫలానావాడు మా మిత్రుడని వివరించు, మహాటీవీ వాడొస్తే ఫలానా వాడితో చెబుతానని నువ్వే బెదిరించు” సూచించాను నేను.
”ఒరేయ్‌, పైవాళ్లకు చెప్పి మనం తాత్కాలికంగా బయటపడ్డా, మన విషయాన్ని పోలీసులకు చెప్పి వాళ్లచేతే అనుకున్నదానికన్నా ఎక్కువే వసూలు చేయించుకుంటారట విలేకరులు. పైగా ఇంకొక సమస్య కూడా తెస్తారు. నేను ఫలానా ప్రాంతం వాడిగా ఈ ప్రాంత ప్రత్యేక ఉద్యమాన్నీ, అది నడుపుతున్నవారినీ రోజూ తిడుతున్నానని కూడా వాళ్లకు ఫిర్యాదు చేస్తారట. అట్లయితే అది పెద్ద ప్రమాదం. చేతులారా, మనకు మనమే అసలుకే ఎసరు పెట్టుకున్నట్లే. ఏమి చేయాలో పాలుపోవటం లేదురా. ఇంకేమీ చేయలేవా?
”నువ్వే చెప్పు ఏమి చేయమంటావో? దాదాపు అన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఇంతో, అంతో తెలిసినవాళ్లున్నారు. వాళ్లతోజెప్పి నిన్ను ఇబ్బంది పెడుతున్నవాళ్లను పీకేయించగలను.”
”నీకున్న పలుకుబడితో ఉద్యోగం పీకేయించగలవు బాగానే ఉంది. వాడు ఇంకో పత్రికలో చేరి మళ్లీ వెంటబడతాడు. అదికాకపోతే ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని ప్రచారం చేస్తాడు. ఎట్లయినా ఇబ్బందులు తప్పేలా లేవు. ఏడెనిమిది లక్షల రూపాయలు విలేకరుల కోసం తీసి పక్కన బెట్టాల్సి వచ్చేట్లుంది.”
”అందుకే మా జాతోళ్లు (జర్నలిస్టులు అను పాత్రికేయ ముండాకొడుకులు) పూర్తిగా పాడయిపోయారని నీతో ఎన్నిసార్లు చెప్పలేదూ? సరే, నాకు చేతనయినంతమేర నీకు దాచుకోకుండా సాయం చేస్తా. ఏమి చేయమంటావో? నువ్వే తేల్చుకుని చెప్పు.”
”సరే, ఆలోచించుకుని రేపు మాట్లాడతాన్లే. ఉంటా” అంటూ నా మిత్రుడు ఆ రోజు పెట్టేశాడు.  మళ్లీ ఫోను రాలేదు. ఏమయిందో తెలియదు.
అవునండీ, ఇంకా చెప్పవలసిందేముంది. అంతా తెలిసిపోలేదూ? మా ఊరి మిత్రుడు హైదరాబాదులో బిల్డరు. ఓ స్థలంలో ఉన్న రాయిని పేలుడు పదార్దాలతో పేల్చి తొలగించాడు. ఆ సంగతి తెలుసుకున్న విలేకరులు వేలు, లక్షలు ఇవ్వాలంటూ ఫోన్లమీద ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. ఇప్పటికే వార్త విలేకరి తన ముఠా పేరు చెప్పి రూ. 50 వేలు వసూలు చేసుకెళ్లాడు. ఇప్పుడు రెండు లక్షలు కావాలంటూ ఈనాడు విలేకరి వెంటబడుతున్నాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక మా మిత్రుడు నరకం అనుభవిస్తున్నాడు. నేను ఏమి చేయగలను చెప్పండి. ఇదేమీ సినిమా కాదాయె. అప్పటికీ ఆయా సంస్థల ముఖ్యులకు ఫిర్యాదు చేద్దామని చెప్పానుగానీ, అలా చేస్తే సమస్య పరిష్కారం అయ్యేలా మాత్రం లేదన్నది హైదరాబాదు నగరానికి చెందిన ఫలానా ప్రాంత విలేకరుల సాక్షిగా నిజం. నిజం. మరి మీరేమంటారు??????