మా చిన్ననాటి కాలంలో ప్రతి సంక్రాంతికీ ఏడెనిమిది మంది చొప్పున నాలుగయిదు బృందాలుగా ఏర్పడి విధిగా నాటకాలాడేవాళ్లం. పంజా అనే నాటికలో ఓ రాజకీయ నాయకుడు అంటాడూ ”ప్రజాస్వామ్యం పత్తి కట్టెలూ” అని విరగబడి నవ్వుతాడు. దాని అర్థం నాకు ఆనాడు తెలియలేదు. తర్వాత కాలంలో తెలిసిందనుకోండి. ఎండిన (పత్తి) చెట్టునే పత్తి కట్టె అంటారు. అది మహా పెళుసు. అందువలన చేయివేస్తే చాలు ఇట్టే విరిగిపోయేది. పొయ్యిలో పెడితే గనగన మండేది. వంట చెరకుగా బాగా ఉపయోగపడుతుంది. సరే, అసలు విషయానికొస్తే పత్తి కట్టె మాదిరిగానే ప్రజాస్వామ్యం కూడా పెళుసనీ, చేయి వేస్తేనే అది విరిగిపోతుందనీ ఆ పాత్ర ఉద్దేశం.
ఇంతకీ ఆ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే ….
ప్రజాస్వామ్య ప్రియుల విశ్లేషణ ప్రకారం ప్రజాస్వామ్య సౌథానికి నాలుగు స్తంభాలు. వాటిలో వార్తా రంగం ఒకటటటటటటటట!
సరే నాదేమి పోయింది ఒప్పుకుంటానులే. అయితే ఆ (అ)ప్రజాస్వామ్య (శిథిల) సౌధం తీరూతెన్నును పట్టి చూపేందుకు ఎంచగ్గా సరిపోయే చేతల వ్యవహారం ఒకటి అందరికీ చెప్పాలని ఉంది.
పుట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఏ వికాసమూ లేని ప్రకాశం జిల్లాలోని ఓ మండలం. అక్కడ ఏడుగురు విలేకరులు ఉంటారు. విశేషం ఏమిటంటే ఆ ఏడుగురూ ఒకే కుటుంబ సభ్యులు. అంతా అన్నదమ్ములు. వాళ్లలో ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పలుక్కోరు సరికదా, ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. అయితేగియితే ఏ కారణంగానయినా వారిలో ఎవరినయినా తొలగించి కొత్త విలేకరి కావాలని ఏ పత్రికయినా ప్రకటన జారీచేసిందో, ఇక చూడండి…. అందరూ ఒక్కటయి పోతారు. వారిలోనే ఒకరు ఆ పత్రికలో చేరిపోతారు. అతని స్థానంలో తీసేసిన విలేకరి చేరిపోతాడు. వేరెవరన్నా ప్రయత్నిస్తే బెదిరిస్తారు. చేయవలసినదంతా చేస్తారు. ఈ అన్నదమ్ముల వైఖరితో వాడు మరెప్పుడూ విలేకరిగా చేరాలని కనీసం మనస్సులో కూడా అనుకునేందుకు కూడా భయపడిపోతాడన్నమాట. ఒకే పత్రికకు కాస్త కాస్త సమయం తర్తాత ఏ మూడు నాలుగుసార్లో ఒక్కడే విలేకరిగా చేసిన దాఖలాలూ ఉన్నాయి. అంటే ఎవ్వరూ రాకపోవటంతో పత్రికాధిపతులు చేసేది లేక ”మీరే కొనసాగండి మహాప్రభో” అంటూ కాళ్లబేరానికి రాక తప్పదక్కడ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తున్నట్లు ఇటీవల మిత్రులు చెప్పారు. ఎంత మార్పు అంటే పాతోళ్లు ఆమోదిస్తేనే కొత్తగా ఎవరయినా విలేకరిగా చేరాలి. అంటే (అమ్యామ్యాల) వసూళ్ల విషయమూ, ఏ వార్త రాయాలో, రాయకూడదో నిర్ణయించే విషయమూ, ప్రకటనలు ఎవరెంత వేసుకునే విషయమూ వారే నిర్ణయిస్తారు.
అదండీ సంగతి. అక్కడ (అ) ప్రజాసామ్య (శిథిల)సౌథం అలరారుతోన్న తీరు ఇదన్నమాట. ఆ ప్రజాస్వామ్య సౌథంలో నాలుగో స్తంభమయిన వార్తా రంగం గట్టి తనానికి ఇదో మచ్చుతునక మాత్రమే. పంజా నాటికలో ఓ పాత్రధారి, ”ప్రజాస్వామ్యం పత్తి కట్టెలు” అంటే దాంట్లో తప్పేముంది.
Archive for అక్టోబర్ 15th, 2011
15 అక్టో
ప్రజాస్వామ్యం పత్తికట్టెలు
15 అక్టో
దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ద్వితీయ వార్షికోత్సవం నీరసం… నిర్జీవం
ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఏడాది క్రితం ప్రారంభించిన ఏబీఎన్ ఛానల్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఓ పాత్రికేయుడిగా అభినందనలు.
తమది దమ్మున్న ఛానల్ అని చెప్పుకునే ఏబీఎన్ ద్వితీయ వార్షికోత్సవాన్ని నీరసంగా … నిర్జీవంగా జరుపుకుందని చెప్పక తప్పటం లేదు.
వార్షికోత్సవం అంటే దుమ్ముదుమ్ముగా ఉంటుందని ఆశపడిన నాకు దమ్ములేకపోవటం నిరాశ కలిగించింది. యంగిస్తాన్ పురాస్కారాల పంపిణీ కార్యక్రమంలోగానీ, వార్తల చదువరులు ఉమ్మడిగా నిర్వహించిన పాత చింతకాయ పచ్చడి సినీమసాల కార్యక్రమంలోగానీ దమ్ము, దర్పం లేని దండగమారివయ్యాయి. బహుశా తెలంగాణవాదుల రైళ్ల బందు కార్యక్రమం వలనేమో ఒక ప్రాంతవాసులే యంగిస్తాన్ పురస్కాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని తర్వాత జరపాలన్న ఆలోచన ఏబీఎన్ ఎమ్డీ రాధాకృష్ణకు రాలేదా? వచ్చినా అనుకున్నది అనుకున్నట్లు జరపటమే దమ్మున్నట్లని భావించారో? తెలియదు. పోతే యంగిస్తాన్ పురస్కార గ్రహీతలు తమ తమ గ్రామాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం జరపటం ముదావహం. అదే సందర్భంలో ఏ ఒక్కరిలోనూ సమకాలీన సమాజం పట్ల కనీస అవగాహన లేదని వారి మాటలు పట్టిచూపాయి. ఇదే ఈ దేశ దౌర్భాగ్యం. దానికితోడు సంక్షేమ కార్యక్రమాలపట్ల తనకున్న వ్యతిరేకతను అందరికీ ఎక్కించేందుకు ఎక్కడ వీలయితే అక్కడ ఆర్కే బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన విఫలం కావాలని గట్టిగా కోరుకుంటున్నాను. అవుతాడని నమ్ముతున్నాను.
పేరు కూడా గుర్తులేని ఏదో చెత్తరకం సినీమసాల కార్యక్రమం ఏబీఎన్ ఉన్నతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. బహుశా వీక్షకులకు నవ్వులు పుట్టించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం చీదర పుట్టించింది. కాస్తంత సంగీతంగానీ, స్వరజ్ఞానంగానీ లేని వారంతా కలిసి గాన విషం చిమ్మారు. పోనీ ఈనాటి యువత మాదిరిగా కాసిన్ని పాటలన్నా వీళ్లకు రావు. కాగాపోగా ఉన్నంతలో వార్తలు చదువుతుంటే వినబుద్దేసే స్వామి పాడిన ఓ పాట అంతో ఇంతో వినసొంపుగా ఉంది. అయితే పాపం సహజంగానే తక్కువ మాట్లేడేవాడయినందునేమో ఆయన మౌన ప్రేక్షకుడి పాత్రే పోషించారు. అది ఆయన తప్పు కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని ఆయనకు ఒప్పజెప్పటం నిర్వాహకుల తప్పు. దానికన్నా వార్తల చదువరిగా ఆయన అనుభవాలను చెప్పించి ఉంటే భావి తరానికీ, వీక్షకులికీ ఉపయోగపడేదేమో! ఆసక్తిగా ఉండేదేమో!! మరొక వార్తల చదువరి ఫణి (అనుకుంటాను) చెత్తచెత్తగా కార్యక్రమాన్ని నడిపినా, అనుకరణ కార్యక్రమాన్ని మాత్రం కొంతలో కొంత రక్తి కట్టించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, చంద్రబాబు, వైఎస్ జగన్మోహనరెడ్డిని అనుకరించటం బాగానే కుదిరింది. ఆసక్తిగానే ఉంది.
మూడో వార్షికోత్సవాన్ని ఇలా మాత్రం జరుపుకోవద్దని సూచించేందుకే ఈ స్పందన.