Archive for అక్టోబర్ 16th, 2011

తెరాస అతి అంచనాలతో సజసలో తొలి వెనకడుగు


ఓ పోరాటాల అనుభవశీలి అంటారూ, ”అంచనాలు లేని ఆచరణ … ఆచరణ లేని అంచనాలు వ్యర్థం” అని.
విజయానికి అంచనాలూ ఆచరణ పరస్పర ఆధారితాలు. అంచనా వేయకుండా తోచిందేదో ఆచరించినా, పడక్కుర్చీలో సేదదీరుతూ ఊరికే అంచనాలు వేస్తూ సరిపెట్టినా అది ఒట్టి వ్యర్థం. వ్యక్తులకయినా, శక్తులకయినా ఇదే వర్తిస్తుంది. అందులోనూ వర్తమాన, భావికాలాల్లో వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా జయాపజయాలు ప్రభావం చూపుతాయి కాబట్టి శక్తులు జాగ్రత్త వహించాలి.
తెలంగాణ వచ్చే వరకూ సజస (సకల జనుల సమ్మె) కొనసాగి తీరుతుందని తెరాస, దాని అనుంగులు బీరాలు పలుకుతోన్న నేపథ్యంలోనే ఆర్టీసీ ఐకాస సమ్మె విరమణ ప్రకటన చేయటం పరిశీలనార్హం. తమను తాము సంరక్షించుకునే పనిలో సహజంగా చేసే సమ్మె విరమణ ప్రకటనను పక్కనబెడితే ఈ వ్యవహారం వెనకంజేననక తప్పదు. అయితే ప్రజలరీత్యా చూస్తే ఇది మంచి అడుగేననక తప్పదు. ఈ నేపథ్యంలో రేపో,మాపో బడి పంతుళ్లూ అటేపే అడుగులు కదపక తప్పని పరిస్థితులు గోచరిస్తున్నాయి.
తొలుత ఉటంకించిన పోరాటాల అనుభశీలి ప్రకారం చూస్తే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెరాస అంచనాలు వేస్తున్నట్లే ఉంది. ఆచరణను గురించి ప్రశ్నించాల్సిన పనిలేదనుకోండి. అందువలన అంచనాలు వేయటంతోనే సరికాదు. సరైన అంచనాలు వేయటం విజయ సాధనకు ముఖ్యం. తెరాస తప్పిదం అదే. అంచనా వేసింది తప్ప తప్పుడు అంచనాలు వేసింది. అతిగా అంచనా వేసింది. ప్రతిదాన్నీ నాలుగున్నర కోట్ల మందికి చుట్టి చూపటం రెచ్చగొట్టేందుకు ఉపకరించినా కార్యక్రమం కొనసాగింపుకు ఉపకరించే అవకాశాలు తక్కువ. కలిసొచ్చే ప్రజల్ని, కలిసొచ్చే సమయంలో, కలిసొచ్చే తీరున కలుపుకుని రాజకీయ పార్టీలు నడపాల్సిన ఆందోళన కార్యక్రమాల్ని జనసామాన్యానికంతా చుట్టి నిర్వహించేదానికి పూనుకుంది. తాము ఇచ్చిన కార్యక్రమాన్ని జన సామాన్యం ఎంత వరకూ ముందుకు తీసుకుపోతారన్న దానిపై తెరాస భ్రమలకు గురయింది. ఇక్కడ అంతో ఇంతో పని దొరుకుతూ, అరకొరగానయినా కడుపు నిండుతోన్న పరిస్థితులలో వాటిని వదులుకుని అమర త్యాగాలు చేసేందుకు జన సామాన్యం పూర్తిగా సిద్ధపడరన్న వాస్తవాన్ని తెరాస గ్రహించలేదు. తెలంగాణ వస్తే గిస్తే నేరుగా లాభపడేవాళ్లు మాత్రమే స్పందించే వీలున్న ఆందోళనల్లో అందరూ పాల్గొంటారన్న భ్రమలను తెరాస ఇప్పటికయినా వీడటం మంచిదేమో!
ఉద్యోగం చేస్తే, ఆటో నడిపితే, వ్యాపారం చేస్తే తానూ, తన కుటుంబం కొంతమేర భద్రంగా ఉంటోన్న నిజాన్ని ఎవ్వరూ ఆవలబెట్టి వ్యవహరించరు. అదే ప్రభుత్వ వ్యవహారాల వలన ఉద్యోగం, ఆటో నడక, వ్యాపారాలు పూర్తిగా అబధ్రతలో పడి ఉంటే వారి స్పందన తెరాస ఆశించే స్థాయిలో ఉండేది.
ఉద్యోగ సద్యోగాలకు తోడు విద్యారంగం సమ్మెది కూడా అదే పరిస్థితి. ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులది మిగతా ఉద్యోగుల తీరే. దానికితోడు చదువుకుంటే ఈ దేశంలోనో, విదేశంలోనో చిన్నదో చితకదో ఉద్యోగం సంపాదించుకుని ఇప్పటికన్నా సుఖంగా బతికే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతోన్న సమాజంలో ఆ చదువులనే వదిలేయమంటే ఏ తల్లిదండ్రి ఊరుకుంటాడో తెరాసే సమాధానం చెప్పాలి. అందులోనూ నాయకుల బిడ్డల చదువులు విదేశాల్లో, పరాయి రాష్ట్రాల్లో, కార్పొరేట్‌ సంస్థల్లో సజావుగా సాగుతున్నాయన్న ప్రచారం సాగుతోన్నందున ఎవ్వరూ తమ బిడ్డలతో చదువులు మాన్పించి గొడ్లు కాచే పనులకు పంపేందుకు ఇష్టపడరు కాక ఇష్టపడరు.
చివరిగా జన సామాన్యం త్యాగాలు చేయాలంటే అవసరంతోపాటు నాయకత్వంపై నమ్మకం కూడా ముఖ్యమే. ఆందోళనకు పిలుపునిచ్చిన నాయకులు నలగని దుస్తుల్లో వెలిగిపోతూ, రాయంచలాంటి వాహనాల్లో తిరుగుతూ జనం తమను నమ్ముతున్నారని అనుకుంటే అది భ్రమే. అది కొంతకాలమే సాగుతుంది. అందులోనూ కొందరు నాయకులు వారినీ వీరినీ గిల్లి డబ్బుల మూటలు పోగేసుకుంటున్నారంటూ విమర్శలు వస్తుంటే వాటిలో సత్యాసత్యాలను విడదీసి చూసే సమయం సామాన్యుడికి ఉండదేమో! సహజంగా అదే జరుగుతుంది కాబట్టి ఆ విమర్శల్ని సులువుగా బుర్రలో వేసుకుంటాడు. గుంపులో గోవిందలాగా కొన్నాళ్లు ఆందోళన బాట పట్టినా కడుపు కాలగానే, పిల్లలు ”అమ్మా, నాన్నా” అంటూ కాళ్లు పట్టేసుకోగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మెడకాయమీద తలకాయున్న ప్రతివాడూ ఆ పరిస్థితుల్లో తాను ఏమి చేయాలో ఆలోచిస్తాడు. నిర్ణయించుకుంటాడు. తొలుత భయంతో గొణుగుతాడు. తర్వాత తర్వాత అడుగులు కదుపుతాడు. తెలంగాణ సజసలో అదే కన్పిస్తోంది. ఆర్టీసి ఐకాస తొలి అడుగు వేసింది. ఇక ఎవరి అడుగులయినా వారి బాటలోనే పడక తప్పదు. తెరాస ఆలోచించి అడుగువేయకపోతే తప్పో ఒప్పో తెలంగాణ ఆవిర్భావ కల సాకారం కావటం నూటికి నూరు పాళ్లూ కేవలం కలే. కలగానే మిగలాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలన్నీ ఆ మాటకొస్తే ఏ ప్రజల కోరికయినా మంచి ప్రభుత్వంతో మాత్రమే సాకారం అవుతుందని బలంగా నమ్మేవాడిని మరి.