తాను ఏది చెప్పినా చెల్లిపోతుందనుకునే అద్వానీ సహజంగానే (అ)జన చేతన యాత్రలోనూ అబద్ధాలు గుప్పిస్తున్నారు. జన చేతన యాత్ర పేరిట తెలంగాణలో 2011 అక్టోబరు 18-19 తేదీలలో యాత్ర జరిపిన ఆయన ఇష్టారీతిన అబద్ధాలు ఆడేశారు. తెలంగాణ విషయంలో, అవినీతి విషయంలోనూ ఆయన అబద్ధాలకు అంతే లేకుండా సాగింది. వాటినలా ఉంచి భరత జాతి ముద్దు బిడ్డలు భగత్‌సింగ్ – చంద్రశేఖర్ అజాద్ – వివేకానందుడి పేర్లను పలుకరించి మరీ అబద్ధాలకు దిగారు అద్వానీ. భగత్ సింఘ్, ఆజాద్, వివేకానందుడి ఆశయాల కొసం తమ పార్టీ క్రుషి చేస్తుందట.
పేర్లు తప్ప వారేమి చెప్పారో, ఏమి చేశారో ఇప్పటి తరానికి అంతగా తెలియని భగత్‌సింగ్ – అజాద్, వివేకానందుడి పేర్లను భాజపా ఉపయోగించుకోవటం అంటే కేవలం లబ్ధి కోసమేనంటే ఎవ్వరూ తప్పు పట్టలేరు. పైగా ఈ యువ కిశోరాలను ఆదర్శవాదులుగా భావించే వారి మద్దతు పొంద వచ్చన్న ఆశ అద్వానీలో కన్పిస్తోంది. వాస్తవానికి భాజపా విధానాలకూ – యువకిశోరాల విధానాలకూ ఎక్కడా పొంతన కుదరదు. పైగా భాజపా విధానాలకు వారి ఆలోచనలు – వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు – వారి రచనలు – వారి ఆచరణ పూర్తిగా వ్యతిరేకం, విరుద్ధం. భగత్‌సింగ్, అజాద్ హేతువాదులు – నాస్తికులు – మతోన్మాదానికి వ్యతిరేకులు – స్పష్టమయిన లౌకికవాదులు – వీటిన్నింటికీ తోడు భాజపాకు అస్సలు గిట్టని సామ్యవాదం వారి సిద్ధాంతం. ఈ కిశోరాలు పట్టుమని మూడు పదులకు ముందే బ్రిటీష్ ఉరికంభాలకు ఊగాల్సివచ్చినా, వారి కంపు తుపాకులకు బలయినా ఆ కొద్ది కాలంలోనే ఈ సిద్ధాంతాలతో కచ్చితంగా బతికారు. తాను ఎందుకు నాస్తికుడయ్యాడో వివరిస్తూ భగత్‌సింగ్ రచన కూడా చేశాడు. ఇక వివేకానందుడు ఆయన నాస్తికుడు కాకపోయినా, భౌతికవాదంతో పూర్తిగా మమేకం అయినట్లు ఆయన వ్యాఖ్యానాలు అడుగడుగునా పట్టిచూపుతాయి. పేదరికం నిర్మూలనకు కృషి చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. దైవపూజ కన్నా బాధితులకు సేవ చేయటం ముఖ్యమని సూచించారు. జీవించిన కొద్ది కాలంలో ఆయన ఎక్కడా మతోన్మాదానికి మద్దతు తెలపలేదు సరికదా, బాధల విముక్తికి చేతలు చూపాలని పదే పదే కోరటం స్పష్టంగా చూడవచ్చు. అలాంటివారి పేర్లను పదే పదే తలచినా చేసే పాపాలు, చెప్పే తప్పుడు సిద్ధాంతాల దోషం నుంచి భాజపా బయట పడబోదు. అయితే గియితే తమ తప్పిదాలను ప్రజలు సులభంగా గమనించే ప్రమాదం నుంచి కొద్దికాలంపాటు రక్షణ పొందవచ్చునేమో!
Archive for అక్టోబర్ 19th, 2011
19 అక్టో