Archive for అక్టోబర్ 20th, 2011

చమురు దొంగ చేతిలో గడాఫీ హతం


గడాఫీ కిదే నా నివాళి
దేశభక్తియుత లిబియా అధ్యక్షుడు గడాఫీని 2011 అక్టోబరు 20న చమురు దొంగ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక దళాలు దారుణంగా హత్యచేశాయి.
ప్రపంచస్థాయి మానవుడికి ఇదే నా నివాళి.
సొంత బుర్రలు లేని, ఉన్నా మెదడుకి మేకులు కొట్టుకుని బతికే తెలుగు వార్తా ఛానళ్లు యథావిధిగానే అమెరికా తైనాతీ సంస్థలు విడుదల చేసిన సమాచారాన్ని గుమ్మరించటం ఘోరం. నేరం. గడాఫీ పూర్వాపరాలను తెలుసుకోకుండానే నియంత హతుడయ్యాడంటూ వ్యాఖ్యానించటం ఏమీ బాగాలేదు. మిగతా విషయాలు ఎలాగున్నా లిబియా మనకు మిత్ర దేశం. అనేక పర్యాయాలు కష్టకాలంలో మనకు అండగా నిలబడింది. అదంతా గడాఫీ చలవే. ప్రధానంగా వైద్య సేవల రంగంలోనూ, చమురు అందజేసి మనకు సాయం అందించిన దేశమది.
చేయూత, సాయం, మిత్రత్వం తదితర వ్యవహారాలను పక్కనబెట్టి మరొక రకంగా ఈ విషయాన్ని పోల్చి పరిశీలిద్దాం. ఉదాహరణకు మీ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది. దానికి కారణం మీరని నాకు తెలిసింది. మీ ఇంటి పొరుగునున్న నేను, మీ ఇంట్లోకి జొరబడి మిమ్మల్ని కొట్టాను.
మీ ఇంటి సమస్యలో నేను కలుగజేసుకోవటం సరయినదేనా?
మీ సమస్యను మీరే పరిష్కరించుకోలేరా?
కాకుంటే మీరు కోరితే సలహాలు – సూచనలు ఇచ్చి సమస్య పరిష్కారానికి సాయం చేయటంతో సరిపెడితే సరిపోదా?
ఈ ప్రకారం లిబియా వ్యవహారాన్ని చూద్దాం.
గడాఫీ నియంతే అయితే, లిబియన్లకు ఆయన పాలన నచ్చకపోతే ఎదురు తిరగాల్సింది ఆ దేశస్తులా? అమెరికా పాలకులా?
గడాఫీని చంపేందుకు నాటో సైన్యానికి ఏమి హక్కు ఉంది?
గడాఫీకి విదేశాల్లో వ్యాపారాలున్నాయనీ, సొంత విమానం ఉందనీ అమెరికా ప్రచారం చేసింది. అదే నిజమయితే… గడాఫీ తన సొంత విమానంలో ఎందుకు పారిపోలేదు? నెలల తరబడీ తన వ్యాపారాలను వదిలేసి తన సొంత ఊరిలో ఎందుకు ఉండిపోయాడు? వీటికి అమెరికా అనుంగు వార్తా సంస్థలు జవాబు చెప్పాలి.

పోచారం ఓ ప్రజాద్రోహి


బాన్సువాడ ఉప ఎన్నికల్లో తనకు నాలుగు ఓట్లు రాగానే పోచారం శ్రీనివాసరెడ్డి అనే ప్రజాద్రోహి ప్రజలకే హెచ్చరికలు జారీ చేశాడు. తనకు ఓటేయని సీమాంధ్రులంతా తెలంగాణ ద్రోహులని తిట్టిపోశాడు. వాళ్లంతా మారిపోవాలని ఆదేశాలు జారీ చేశాడు. మారకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు.
ప్రజల మనోభావాలంటూ తెదేపా గూటి నుంచి తెరాస కారెక్కిన ఇతగాడిని ఇప్పటిదాకా కాపాడిన చంద్రబాబు కూడా ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. అయితే తెరాసకూ తెదేపాకు మూల సూత్రాల్లో తేడా లేదు కాబట్టి పోచారం ఎక్కడయినా బతికిపోతాడు. ఎవ్వరయినా కాపాడతారు. కాకపోతే ఏ గూటి మాటలు అక్కడ మాట్లాడటమే పోచారం పని. చేతలు మాత్రం ఒకటే. అదే ప్రజాద్రోహం.
ప్రజల మనోభావాలంటూ ఫోజులు కొడుతోన్న పోచారం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా అవేమీ గుర్తుకు రాకపోవటం అతగాడి తప్పేమీ లేదు. కాకపోతే ఇలాంటి వారి తీరును మనం సదా గుర్తు చేసుకుంటుండాలి. స్టేషనరీ కొనుగోలుమాలుకు పాల్పడి ఇతగాడు తన మంత్రి పదవిని కోల్పోవలసి వచ్చిందని గుర్తుంది కదూ!
ఈనాటి ప్రజా ప్రతినిధుల్లో అవినీతి లేకపోతే చెప్పుకోవాలిగానీ, ఉందని చెప్పుకోవటం దండగమారి పని. ప్రజలు … ప్రజల మనోభావాలు అంటూ తెగ తెగ వాగేస్తున్నాడు కాబట్టి పోచారానికి సంబంధించి గుర్తుచేసుకోదగిన విషయం ఒకటుంది.
అది విద్యుత్తు ఉద్యమం జోరుగా సాగుతోన్న సమయం. ఆ సమయంలో రాష్ట్ర మంత్రిగా వెలగబెడుతోన్న పోచారం ఒంగోలుకు వచ్చాడు. అది కనిపెట్టిన వామపక్ష కార్యకర్తలు ఆయన వాహనానికి అడ్డంపడ్డారు. ఆ సాయం సమయంలో వేలాది మంది పౌరులు అక్కడ పోగుబడ్డారు. వారంతా చోద్యం చూస్తూ, ప్రభుత్వ తీరుపై శాపనార్ధాలు పెట్టారు. కొంతసేపు నినాదాలు, వాగ్వివాదాలు సాగిన తర్వాత పోచారం కారు దిగి పోలీసు వలయం మధ్య కాలి నడకన అతిథి గృహానికి వెళ్లిపోయాడు. దీంతో ప్రజలతోపాటు కార్యకర్తలు కూడా ఎవరిదోవన వారెళ్లారు. ఇక తర్వాత జరిగిందే అసలు సంగతి. అతిథి గృహానికి చేరుకున్న పిదప పోచారం లోపలి మనిషి నిద్రలేచాడు. క్రోధంతో ఉడికిపోయాడు. అంతే పోలీసు ఉన్నతాధికారులను ఆగమేఘాలమీద పిలుపించుకున్నాడు. వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బొక్కలిరిగేదాకా విరగదీయమని ఆదేశాలు జారీచేశాడు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంటుంది. పోలీసు అధికారులు విజృంభించారు. కార్యకర్తల ఇళ్లమీద పడి ఎత్తుకొచ్చి కేసులు పెట్టారు. లాఠీలతో ఇష్టారీతిన ఆడుకున్నారు. తర్వాతెప్పుడో తీరిగ్గా ఇళ్లకు పంపారు. ఆ సమాచారాన్ని పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు పోచారం తెలుసుకుంటూ తెగ సంతోషపడిపోయాడట! ఇదీ ప్రజల మనోభావల పట్ల పోచారంగారికున్న నిబద్ధత. ఆ తర్వాత అల్లుడి అక్రమాల పుణ్యమాని మంత్రి పదవిని కూడా ఊడగొట్టుకోవటం వేరే సంగతనుకోండి. అయితే పోచారానికి ఇప్పటికీ తిక్క కుదిరినట్లు లేదు. తనకు ఓటేయకపోవటం నేరమంటూ తెగ తెగ హూంకరిస్తున్నాడు. ప్రజాస్వామ్యం పత్తి కట్టెలు. ప్రజా ప్రతినిధులు, ప్రజల మనోభావాలు పేరేదయితేనేం అన్నీ దోచుకునేందుకే తప్ప సమాజం కోసం కాదు. అందులోనూ ఆయనగారు ఇప్పుడు వల్లె వేస్తున్నట్లుగా తెలంగాణ ప్రజల కోసం అసలే కాదు. తెలంగాణ అంటే అంత ఇష్టమే అయితే తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అదీ తెలంగాణవారిపైనే పోలీసుల కేసులు ఎందుకు పెట్టిస్తాడు? దటీజ్‌ ప్రజాద్రోహి పోచారం.