Archive for అక్టోబర్ 25th, 2011

వామపక్షానికే మళ్లీ పట్టం

  • అర్జెంటీనా ఎన్నికల్లో క్రిస్టినా ఎన్నిక
  • భారీ మెజార్టీతో విజయం

అర్జెంటీనాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ డీ కిర్చ్‌నర్‌ (58) మరోమారు భారీ అధిక్యతతో ఎన్నికయ్యారు. అర్జెంటీనాలో వామపక్షమైన క్రిస్టినా పార్టీకి, ఆమె అభ్యుదయ విధానాలకు విస్తృతమైన ప్రజా మద్దతు లభించింది. దేశవ్యాప్తంగా 24 శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెల్లడైన ఫలితాల్లో ఆమెకు 54 శాతం ఓట్లు లభించడంతో అసాధారణ విజయం సొంతమైంది. ఆమెపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ బాగా వెనుకబడ్డారు. ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 17 శాతం ఓట్లే వచ్చాయి. వామపక్షాల కంచుకోటగా ఉన్న దేశంలో అతిపెద్దదైన బ్యూయోనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్సులోని కొన్ని బ్యాలెట్లలో మాత్రమే ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అందువల్ల క్రిస్టినా మరింత భారీ అధిక్యత సాధిస్తారని హోంమంత్రి ప్లోరెన్సియో రాంన్డాజ్‌ తెలిపారు. వామపక్షాల గెలుపుతో దేశంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. వేలాది మంది మద్దతుదారులు రాజధానిలోని చరిత్రాత్మక ప్లాజా డి మయోలో గుమిగూడి పతాకాలను గాలిలో ఊపుతూ వేడుకలు జరుపుకున్నారు. లాటిన్‌ అమెరికాలో వరుసగా రెండోసారి ఎన్నికైన ప్రథమ మహిళ ఫెర్నాండజే కావడం విశేషం. అయితే ఇంతటి ఘన విజయోత్సవ వేళ తన భర్త, మాజీ దేశాధ్యక్షులు నెస్టోర్‌ కిర్చెనర్‌ తమ మధ్య లేడన్న విషాదం ఆమెను కలిచివేసింది. నెస్టోర్‌ గతేడాది అక్టోబరు 27న మరణించిన సంగతి తెలిసిందే.

నెస్టోర్‌ సొంత పట్టణంలో ఓటింగ్‌ పూర్తయిన తరువాత ఓ పక్క విజయానందం, మరో పక్క విషాదం ఆమెను కమ్ముకొంటుండగా గద్గద స్వరంతో మాట్లాడారు. ‘మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామని ఈ విజయం ధృవపరుస్తోంది. ఇందుకు నేనెంతగానో గర్వపడుతున్నాను’ అని అన్నారు. 1983లో అర్జెంటీనాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగినప్పటి నుంచి ఇంత భారీ ఓటింగ్‌ శాతంతో ఏ అధ్యక్షుడు గెలుపొందలేదు. ఆ ఏడాది రౌల్‌ అల్ఫోన్సిన్‌ కూడా 52 శాతం ఓట్లు సాధించారు. 1973లో విజయం సాధించినప్పటి కంటే కూడా ఇప్పుడు గవర్నర్‌ హెర్మస్‌ బిన్నెర్‌, మరో ఐదుగురు అభ్యర్థులపై అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెసులో తగినన్ని స్థానాలు మళ్లీ సాధించగలమన్న విశ్వాసాన్ని ఫెర్నాండెజ్‌ రాజకీయ కూటమి వ్యక్తం చేస్తోంది. 2009లో కోల్పోయిన నియంత్రణను మళ్లీ సాధిస్తామని, కొత్త పొత్తులు ఏర్పాటు చేస్తామనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఫెర్నాండెజ్‌ అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తల్లో తీవ్ర ప్రతికూల రేటింగులు వచ్చినప్పటికీ అనతి కాలంలోనే ఆమె విశేష ప్రజాదరణ చూరగొన్నారు. ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకొని రాజకీయ మేధావుల గౌరవాన్ని చూరగొన్నారు.

తాము స్థిరమైన ప్రభుత్వాన్ని, తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అత్యధిక మంది ఓటర్లు చెప్పారు. తన భర్త నెస్టర్‌ కిర్చ్‌నర్‌ విధానాలనే తాను అనుసరిస్తున్నట్లు ఫెర్నాండెజ్‌ తరచూ గుర్తు చేస్తుంటారు. నెస్టర్‌ 2003లో అధ్యక్ష పదవిని అధిష్టించారు. సోయా, ఇతర అర్జెంటీనా వ్యవసాయ ఉత్పత్తులకు చైనా, తదితర చోట్ల మంచి డిమాండ్‌ ఉండటంతో గత ఎనిమిదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ సగటున 7.6 శాతం వృద్ధిని సాధించింది.

లాటిన్‌ అమెరికా మరింత పటిష్టం..

ఫెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికైనందుకు యూనియన్‌ ఆఫ్‌ సౌత్‌ అమెరికన్‌ నేషన్స్‌ (యునాసుర్‌) అభినందనలు తెలిపింది. ఆమె ఘన విజయం సాధించడాన్ని అసాధారణ సంఘటనగా యునాసుర్‌ సెక్రటరీ జనరల్‌ మారియా ఎమ్మా మెజియా అభివర్ణించారు. ‘మీరు తిరిగి ఎన్నిక కావడంతో లాటిన్‌ అమెరికా పటిష్టమవుతుంది. మీరు, మాజీ అధ్యక్షుడు నెస్టర్‌ నిర్ణయాత్మకంగా అందించిన మద్దతుతో మంచి సమగ్రత ఏర్పడుతుందని ఆకాంక్షిస్తున్నాం’ అని క్రిస్టినాకు పంపిన అభినందన సందేశంలో మెజియా తెలిపారు. నెస్టర్‌ ప్రథమ వర్థంతికి నాలుగు రోజుల ముందు క్రిస్టినా తిరిగి ఎన్నికయ్యారు. ఆర్థిక మంత్రి అమదో బౌడౌను ఉపాధ్యక్షునిగా నియమించుకోనున్నారు.