Archive for అక్టోబర్, 2011

సమైక్యాంధ్ర వాదం లేదనటం తెరాస మరో పెద్ద తప్పుడు వాదన


తెలంగాణవాదం లేదనీ, ఆందోళనలు జరగటం లేదని ఎవ్వరూ అనటం లేదు కాబట్టి దానిమీద వివాదం లేదు.
అయితే సమైక్యవాదం ఒట్టట్టిదని తెరాస ప్రచారం చేస్తోంది. ఆంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక సాయంతో కొందరు పత్రిక పులులు గోల చేస్తున్నారని కేసీఆర్‌ సహా తెలంగాణ వాదులు తరచూ ఎద్దేవా చేయటం సాధారణమయింది. సమైక్యవాదమే ఉంటే అక్కడ ఆందోళనలు ఎందుకు జరగటం లేదని కూడా వీళ్లు ప్రశ్నిస్తుంటారు.
తెరాస వాదనలో ఒక్కటి మాత్రం నిజం … సీమాంధ్రలో ఇప్పుడు ఆందోళనలు జరగని మాట వాస్తవం. ప్రజలు ఆందోళనలకు ఎప్పుడు దిగుతారో కూడా తెలియకపోవటమే తెరాస తప్పిదం. తమ మీద నేరుగా భారాలు పడినప్పుడో, తమ చేతుల్లోది జారిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడో, అడుగంతా జారిపోయినప్పుడు మాత్రమే ప్రజా సమాన్యం ఆందోళనలకు దిగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే సీమాంధ్రులు ఇప్పుడు అలాంటి నొప్పులేమీ లేవు. అందువలన అక్కడి నేతలు తమ భావాలు ప్రకటిస్తారు తప్ప జనం కనీసం మాట్లాడే అవకాశాలు కూడా లేవు. సరే, దాన్నలా ఉంచి సమైక్య వాదం ఎందుకు ఉందో చూద్దాం!
1. ప్రస్తుతం సీమాంధ్రలో ఇంజినీరింగు, మేనేజిమెంటు, ఫార్మసీ తదితర కోర్సులు చదివే పిల్లలు కనీసం పది పదిహేను మంది లేని గ్రామం లేదు. ఈ చదువులకు సంబంధించిన ఉద్యోగాలకు హైదరాబాదు కేంద్రమని విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. అలా వేలాది కుటుంబాలు సమైక్యతను కోరుతున్నాయి.
2. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, బ్యాంకు తదితర రంగాలలో ప్రవేశించాలనుకునేవారికి హైదరాబాదులో మాత్రమే ఉత్తమ శిక్షణ సంస్ధలు ఉన్నాయన్న నమ్మకం ఏర్పడింది. అలా మరి కొన్ని వేలమంది సమైక్యవాదానికి కట్టుబడిపోయారు.
3. వేలాది మంది సీమాంధ్ర ప్రవాసులు హైదరాబాదులో ఆస్తులు కొనుగోలు చేసుకున్నారు. వారి తల్లిదండ్రులను ఇక్కడే ఉంచి తరచూ కలిసి పోతుంటారు. అందువలన కూడా సమైక్య రాష్ట్రం కావాలని మరి కొన్ని వేలమంది కోరుకుంటున్నారు.
4. వ్యవసాయంలో అంతో ఇంతో సంపాదించుకున్న పెద్ద రైతులూ, వివిధ పాలక పార్టీల నాయకులు కూడా హైదరాబాదులో స్థలాలు, ఇళ్లు కొనుక్కున్నారు. అందువలన హైదరాబాదుతో అనుబంధం పెంచుకున్నారు. రాష్ట్రం విడిపోతే తామంతా తమ తమ ఆస్తుల్ని వదులేసుకోక తప్పదన్న భయం తెరాస చర్యల వలనే వారిలో ఏర్పడింది.
5. డిగ్రీలు చదివిన లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో అనుబంధ చదువుల కోసం హైదరాబాదులో కాపురాలు ఉంటున్నారు.
6. వీటన్నింటికీ తోడు సహజంగానే హైదరాబాదు రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడకు వచ్చి లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవిస్తే ఉద్యోగాలు వదులుకోవలసి వస్తుందనీ, కొత్తగా ఏర్పడే రాజధానిలో తమకు అవకాశాలు దక్కవని వీళ్లు భావిస్తున్నారు.
ఇలా ఉద్యోగార్ధులు, ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు, ఇక్కడ ఆస్తిపాస్తులున్నవారంతా లక్షల సంఖ్యలోనే సమైక్యవాదం విన్పిస్తున్నారు.
తెలంగాణ ప్రకటన ఏ క్షణంలో వచ్చినా వీళ్లంతా ఉవ్వెత్తున వీధుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఆందోళనకు తీసిపోని విధంగా సీమాంధ్రలోనూ ఆందోళనలు చెలరేగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనటంలో అతిశయోక్తి లేదు.

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు! ఇక నడుస్తాను వెనక్కే వెనక్కు !!


2011 అక్టోబరు 16న వేసిన తెలుగిల్లు అంచనాలు నిజమవుతున్నాయి. తెలంగాణ సజసలో తొలి వెనుకడుగు ఆర్టీసి ఐకాస వేయగా తెలుగిల్లు అంచనా వేసినట్లే ఉపాధ్యాయ ఐకాస మలి వెనకడుగు వేసింది. ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ ఆవిర్భవించేదాకా సమ్మె కొనసాగుతుందంటూ గొంతు చించుకున్న ఈ ఐకాసలు తప్పుడు అంచనాలతో పడవల్ని నడుపుతున్న (అ)రాచకీయ నాయకుల వలలో చిక్కి విలవిలలాడారు. చివరకు చావు తప్పి కన్ను లట్టబోయి చేసేది లేక సమ్మె విరామమంటూ ప్రకటనలు జారీ చేస్తున్నాయి.
పంతులుగారూ పంతులుగారూ ఏమి చేస్తున్నావంటే ఇంట్లో కూర్చుని చేసిన తప్పుల్ని దిద్దుకుంటున్నానన్నట్లుగా ఉపాధ్యాయ ఐకాస గోల కొంత విచిత్రంగా ఉంది. నిన్నటిదాకా ఆదివారాలు, సంక్రాంతి సెలవులు, రాత్రిపూట కూడా పాఠాలు చెబుతామన్న పంతుళ్ల నాయకులు ఇప్పుడు మాట మార్చి ఒక పూట పాఠాలు బోధన, మరోపూట ఉద్యమం అంటూ ప్రకటించారు. ఎవరి కన్నీళ్లు తుడవటానికి ఈ ప్రకటనలు? ఒక్క పూటలో ఏమి చెబుతారు? అయినా పంతుళ్లు కూడా రోజూ ఇంటి దగ్గర చదవాలి కదా? అదెప్పుడు చేస్తారు? సరే, చదవకుండానే చెబుతారనుకుందాం! మరి జీతాలు తీసుకోబోమని వీర ప్రతిజ్ఞలు ఎందుకో? జీతపు రాళ్లు జేబులో పడకపోతే ఇతర ఆదాయాలు లేని పంతుళ్ల కుటుంబాలు గడిచేదెట్లా? వాళ్లకు కూడా నెలకు అరకేజీ బియ్యం, పది గ్రాముల నూనె, ఇరవై గ్రాముల కందిపప్పు కిట్లు పంచుతారా? బుర్రలతో పనిచేయాల్సిన పంతుళ్లకు నాయత్వం వహించే వారి ఆలోచనల స్ధాయి ఇదేనా?
ఈ పంతుళ్ల నాయకులు సూటిగా చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది. మీలో ఎంతమంది మీ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారో? లెక్క చెబుతారా? చెప్పలేరు! ఎందుకంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పని చేయటం లేదని వాస్తవాలు పట్టిచూపుతున్నాయి. మీ బిడ్డలకు పనికిరాని మీ పాఠాలు ఇతరులకు కూడా ఎటూ పనికి రావన్న నమ్మకంతోనేనాసమ్మెకు దిగింది?
అసలు మీ పెద్ద పంతులుగారు కోదండరాముడే అనాలోచితంగా వ్యవహారాలు నడుపుతుంటే మిమ్మల్నని లాభం ఏముందిలే? నీకేమి నాయనా లక్షన్నర రూపాయల జీతం తీసుకుంటున్నావు? ఎన్నయినా చెబుతావు? అంటే ఉలకడు – పలకడు. నీ పిల్లగాడిని అమెరికాలో చదివిస్తూ మా పిల్లలకు చదువు లేకుండా చేస్తావా? అంటూ తల్లిదండ్రులు కళ్లెర్రజేస్తే నోరు విప్పడు. వాటిని అలా పెడదాం. మూడు రోజుల రైళ్ల బందు కార్యక్రమాన్ని ముప్పై ఆరుసార్లు వాయిదా ఎందుకు వేశాడో సూటిగా, నాలాంటి బుర్ర లేనివాళ్లకు కూడా అర్ధం అయ్యేలా చెప్పడు. పోనీ మొదలు పెట్టారు కదా, అర్ధాంతరంగా ఎందుకు ముగింపు పలికినట్లు? ఆయనగారి వివరణ వింటే బుర్ర ఖాళీ కావాల్సిందే. నేతలు జైళ్లలో మగ్గిపోతున్నారంటూ పదే పదే ప్రకటించటం చూస్తే రోత పుడుతోంది. ఒక్క రోజు కూడా జైల్లో కూర్చోలేని వెధవాయత్వం. ఇదీ నాయకుల తీరు. రోట్లో తలపెట్టి, రాస్కెల్‌ రోకటితో పొడుస్తావా? అని ప్రశ్నించటం తెలివితక్కువ తనం కాదూ? రైళ్ల బందును అడ్డుకుంటున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే ఆ కార్యక్రమాన్ని నిలిపేశామంటూ నిస్సిగ్గు ప్రకటనలు మీకే చెల్లు. తెలంగాణ వేడి -వాడి కేంద్రానికి తాకాలంటే రైళ్ల బందు ఒక్కటే మార్గమని ప్రకటించిన రాచకీయ ఐకాస దాన్ని నిలిపేసి ఎందుకు చల్లార్చిందో?? సూటిగా చెప్పాలి. పోనీ హడావుడిగా తెలంగాణ బందు ఎందుకు చేపట్టారో? అదన్నా చెబుతారా?
ప్రశ్నించేవాడిని ప్రతివాడినీ అవమానించటం – జై అన్న దొంగల్ని కూడా కౌగలించుకుని మీరు ఉద్యమం పేరిట మీ ఇష్టాల్ని రుద్దితే అది మీరు బయటకు చెప్పే లక్ష్యాలకు చేరుకోవటం అనుమానమే. అయితే గియితే మీ రహస్య అజెండాను మాత్రం పూర్తి చేస్తే చేయవచ్చునేమో!

తెరాస అతి అంచనాలతో సజసలో తొలి వెనకడుగు


ఓ పోరాటాల అనుభవశీలి అంటారూ, ”అంచనాలు లేని ఆచరణ … ఆచరణ లేని అంచనాలు వ్యర్థం” అని.
విజయానికి అంచనాలూ ఆచరణ పరస్పర ఆధారితాలు. అంచనా వేయకుండా తోచిందేదో ఆచరించినా, పడక్కుర్చీలో సేదదీరుతూ ఊరికే అంచనాలు వేస్తూ సరిపెట్టినా అది ఒట్టి వ్యర్థం. వ్యక్తులకయినా, శక్తులకయినా ఇదే వర్తిస్తుంది. అందులోనూ వర్తమాన, భావికాలాల్లో వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా జయాపజయాలు ప్రభావం చూపుతాయి కాబట్టి శక్తులు జాగ్రత్త వహించాలి.
తెలంగాణ వచ్చే వరకూ సజస (సకల జనుల సమ్మె) కొనసాగి తీరుతుందని తెరాస, దాని అనుంగులు బీరాలు పలుకుతోన్న నేపథ్యంలోనే ఆర్టీసీ ఐకాస సమ్మె విరమణ ప్రకటన చేయటం పరిశీలనార్హం. తమను తాము సంరక్షించుకునే పనిలో సహజంగా చేసే సమ్మె విరమణ ప్రకటనను పక్కనబెడితే ఈ వ్యవహారం వెనకంజేననక తప్పదు. అయితే ప్రజలరీత్యా చూస్తే ఇది మంచి అడుగేననక తప్పదు. ఈ నేపథ్యంలో రేపో,మాపో బడి పంతుళ్లూ అటేపే అడుగులు కదపక తప్పని పరిస్థితులు గోచరిస్తున్నాయి.
తొలుత ఉటంకించిన పోరాటాల అనుభశీలి ప్రకారం చూస్తే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెరాస అంచనాలు వేస్తున్నట్లే ఉంది. ఆచరణను గురించి ప్రశ్నించాల్సిన పనిలేదనుకోండి. అందువలన అంచనాలు వేయటంతోనే సరికాదు. సరైన అంచనాలు వేయటం విజయ సాధనకు ముఖ్యం. తెరాస తప్పిదం అదే. అంచనా వేసింది తప్ప తప్పుడు అంచనాలు వేసింది. అతిగా అంచనా వేసింది. ప్రతిదాన్నీ నాలుగున్నర కోట్ల మందికి చుట్టి చూపటం రెచ్చగొట్టేందుకు ఉపకరించినా కార్యక్రమం కొనసాగింపుకు ఉపకరించే అవకాశాలు తక్కువ. కలిసొచ్చే ప్రజల్ని, కలిసొచ్చే సమయంలో, కలిసొచ్చే తీరున కలుపుకుని రాజకీయ పార్టీలు నడపాల్సిన ఆందోళన కార్యక్రమాల్ని జనసామాన్యానికంతా చుట్టి నిర్వహించేదానికి పూనుకుంది. తాము ఇచ్చిన కార్యక్రమాన్ని జన సామాన్యం ఎంత వరకూ ముందుకు తీసుకుపోతారన్న దానిపై తెరాస భ్రమలకు గురయింది. ఇక్కడ అంతో ఇంతో పని దొరుకుతూ, అరకొరగానయినా కడుపు నిండుతోన్న పరిస్థితులలో వాటిని వదులుకుని అమర త్యాగాలు చేసేందుకు జన సామాన్యం పూర్తిగా సిద్ధపడరన్న వాస్తవాన్ని తెరాస గ్రహించలేదు. తెలంగాణ వస్తే గిస్తే నేరుగా లాభపడేవాళ్లు మాత్రమే స్పందించే వీలున్న ఆందోళనల్లో అందరూ పాల్గొంటారన్న భ్రమలను తెరాస ఇప్పటికయినా వీడటం మంచిదేమో!
ఉద్యోగం చేస్తే, ఆటో నడిపితే, వ్యాపారం చేస్తే తానూ, తన కుటుంబం కొంతమేర భద్రంగా ఉంటోన్న నిజాన్ని ఎవ్వరూ ఆవలబెట్టి వ్యవహరించరు. అదే ప్రభుత్వ వ్యవహారాల వలన ఉద్యోగం, ఆటో నడక, వ్యాపారాలు పూర్తిగా అబధ్రతలో పడి ఉంటే వారి స్పందన తెరాస ఆశించే స్థాయిలో ఉండేది.
ఉద్యోగ సద్యోగాలకు తోడు విద్యారంగం సమ్మెది కూడా అదే పరిస్థితి. ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులది మిగతా ఉద్యోగుల తీరే. దానికితోడు చదువుకుంటే ఈ దేశంలోనో, విదేశంలోనో చిన్నదో చితకదో ఉద్యోగం సంపాదించుకుని ఇప్పటికన్నా సుఖంగా బతికే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతోన్న సమాజంలో ఆ చదువులనే వదిలేయమంటే ఏ తల్లిదండ్రి ఊరుకుంటాడో తెరాసే సమాధానం చెప్పాలి. అందులోనూ నాయకుల బిడ్డల చదువులు విదేశాల్లో, పరాయి రాష్ట్రాల్లో, కార్పొరేట్‌ సంస్థల్లో సజావుగా సాగుతున్నాయన్న ప్రచారం సాగుతోన్నందున ఎవ్వరూ తమ బిడ్డలతో చదువులు మాన్పించి గొడ్లు కాచే పనులకు పంపేందుకు ఇష్టపడరు కాక ఇష్టపడరు.
చివరిగా జన సామాన్యం త్యాగాలు చేయాలంటే అవసరంతోపాటు నాయకత్వంపై నమ్మకం కూడా ముఖ్యమే. ఆందోళనకు పిలుపునిచ్చిన నాయకులు నలగని దుస్తుల్లో వెలిగిపోతూ, రాయంచలాంటి వాహనాల్లో తిరుగుతూ జనం తమను నమ్ముతున్నారని అనుకుంటే అది భ్రమే. అది కొంతకాలమే సాగుతుంది. అందులోనూ కొందరు నాయకులు వారినీ వీరినీ గిల్లి డబ్బుల మూటలు పోగేసుకుంటున్నారంటూ విమర్శలు వస్తుంటే వాటిలో సత్యాసత్యాలను విడదీసి చూసే సమయం సామాన్యుడికి ఉండదేమో! సహజంగా అదే జరుగుతుంది కాబట్టి ఆ విమర్శల్ని సులువుగా బుర్రలో వేసుకుంటాడు. గుంపులో గోవిందలాగా కొన్నాళ్లు ఆందోళన బాట పట్టినా కడుపు కాలగానే, పిల్లలు ”అమ్మా, నాన్నా” అంటూ కాళ్లు పట్టేసుకోగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మెడకాయమీద తలకాయున్న ప్రతివాడూ ఆ పరిస్థితుల్లో తాను ఏమి చేయాలో ఆలోచిస్తాడు. నిర్ణయించుకుంటాడు. తొలుత భయంతో గొణుగుతాడు. తర్వాత తర్వాత అడుగులు కదుపుతాడు. తెలంగాణ సజసలో అదే కన్పిస్తోంది. ఆర్టీసి ఐకాస తొలి అడుగు వేసింది. ఇక ఎవరి అడుగులయినా వారి బాటలోనే పడక తప్పదు. తెరాస ఆలోచించి అడుగువేయకపోతే తప్పో ఒప్పో తెలంగాణ ఆవిర్భావ కల సాకారం కావటం నూటికి నూరు పాళ్లూ కేవలం కలే. కలగానే మిగలాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలన్నీ ఆ మాటకొస్తే ఏ ప్రజల కోరికయినా మంచి ప్రభుత్వంతో మాత్రమే సాకారం అవుతుందని బలంగా నమ్మేవాడిని మరి.

ప్రజాస్వామ్యం పత్తికట్టెలు


మా చిన్ననాటి కాలంలో ప్రతి సంక్రాంతికీ ఏడెనిమిది మంది చొప్పున నాలుగయిదు బృందాలుగా ఏర్పడి విధిగా నాటకాలాడేవాళ్లం. పంజా అనే నాటికలో ఓ రాజకీయ నాయకుడు అంటాడూ ”ప్రజాస్వామ్యం పత్తి కట్టెలూ” అని విరగబడి నవ్వుతాడు. దాని అర్థం నాకు ఆనాడు తెలియలేదు. తర్వాత కాలంలో తెలిసిందనుకోండి. ఎండిన (పత్తి) చెట్టునే పత్తి కట్టె అంటారు. అది మహా పెళుసు. అందువలన చేయివేస్తే చాలు ఇట్టే విరిగిపోయేది. పొయ్యిలో పెడితే గనగన మండేది. వంట చెరకుగా బాగా ఉపయోగపడుతుంది. సరే, అసలు విషయానికొస్తే పత్తి కట్టె మాదిరిగానే ప్రజాస్వామ్యం కూడా పెళుసనీ, చేయి వేస్తేనే అది విరిగిపోతుందనీ ఆ పాత్ర ఉద్దేశం.
ఇంతకీ ఆ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే ….
ప్రజాస్వామ్య ప్రియుల విశ్లేషణ ప్రకారం ప్రజాస్వామ్య సౌథానికి నాలుగు స్తంభాలు. వాటిలో వార్తా రంగం ఒకటటటటటటటట!
సరే నాదేమి పోయింది ఒప్పుకుంటానులే. అయితే ఆ (అ)ప్రజాస్వామ్య (శిథిల) సౌధం తీరూతెన్నును పట్టి చూపేందుకు ఎంచగ్గా సరిపోయే చేతల వ్యవహారం ఒకటి అందరికీ చెప్పాలని ఉంది.
పుట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఏ వికాసమూ లేని ప్రకాశం జిల్లాలోని ఓ మండలం. అక్కడ ఏడుగురు విలేకరులు ఉంటారు. విశేషం ఏమిటంటే ఆ ఏడుగురూ ఒకే కుటుంబ సభ్యులు. అంతా అన్నదమ్ములు. వాళ్లలో ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పలుక్కోరు సరికదా, ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. అయితేగియితే ఏ కారణంగానయినా వారిలో ఎవరినయినా తొలగించి కొత్త విలేకరి కావాలని ఏ పత్రికయినా ప్రకటన జారీచేసిందో, ఇక చూడండి…. అందరూ ఒక్కటయి పోతారు. వారిలోనే ఒకరు ఆ పత్రికలో చేరిపోతారు. అతని స్థానంలో తీసేసిన విలేకరి చేరిపోతాడు. వేరెవరన్నా ప్రయత్నిస్తే బెదిరిస్తారు. చేయవలసినదంతా చేస్తారు. ఈ అన్నదమ్ముల వైఖరితో వాడు మరెప్పుడూ విలేకరిగా చేరాలని కనీసం మనస్సులో కూడా అనుకునేందుకు కూడా భయపడిపోతాడన్నమాట. ఒకే పత్రికకు కాస్త కాస్త సమయం తర్తాత ఏ మూడు నాలుగుసార్లో ఒక్కడే విలేకరిగా చేసిన దాఖలాలూ ఉన్నాయి. అంటే ఎవ్వరూ రాకపోవటంతో పత్రికాధిపతులు చేసేది లేక ”మీరే కొనసాగండి మహాప్రభో” అంటూ కాళ్లబేరానికి రాక తప్పదక్కడ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తున్నట్లు ఇటీవల మిత్రులు చెప్పారు. ఎంత మార్పు అంటే పాతోళ్లు ఆమోదిస్తేనే కొత్తగా ఎవరయినా విలేకరిగా చేరాలి. అంటే (అమ్యామ్యాల) వసూళ్ల విషయమూ, ఏ వార్త రాయాలో, రాయకూడదో నిర్ణయించే విషయమూ, ప్రకటనలు ఎవరెంత వేసుకునే విషయమూ వారే నిర్ణయిస్తారు.
అదండీ సంగతి. అక్కడ (అ) ప్రజాసామ్య (శిథిల)సౌథం అలరారుతోన్న తీరు ఇదన్నమాట. ఆ ప్రజాస్వామ్య సౌథంలో నాలుగో స్తంభమయిన వార్తా రంగం గట్టి తనానికి ఇదో మచ్చుతునక మాత్రమే. పంజా నాటికలో ఓ పాత్రధారి, ”ప్రజాస్వామ్యం పత్తి కట్టెలు” అంటే దాంట్లో తప్పేముంది.

దమ్మున్న ఛానల్‌ ఏబీఎన్‌ ద్వితీయ వార్షికోత్సవం నీరసం… నిర్జీవం


ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఏడాది క్రితం ప్రారంభించిన ఏబీఎన్‌ ఛానల్‌ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఓ పాత్రికేయుడిగా అభినందనలు.
తమది దమ్మున్న ఛానల్‌ అని చెప్పుకునే ఏబీఎన్‌ ద్వితీయ వార్షికోత్సవాన్ని నీరసంగా … నిర్జీవంగా జరుపుకుందని చెప్పక తప్పటం లేదు.
వార్షికోత్సవం అంటే దుమ్ముదుమ్ముగా ఉంటుందని ఆశపడిన నాకు దమ్ములేకపోవటం నిరాశ కలిగించింది. యంగిస్తాన్‌ పురాస్కారాల పంపిణీ కార్యక్రమంలోగానీ, వార్తల చదువరులు ఉమ్మడిగా నిర్వహించిన పాత చింతకాయ పచ్చడి సినీమసాల కార్యక్రమంలోగానీ దమ్ము, దర్పం లేని దండగమారివయ్యాయి. బహుశా తెలంగాణవాదుల రైళ్ల బందు కార్యక్రమం వలనేమో ఒక ప్రాంతవాసులే యంగిస్తాన్‌ పురస్కాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని తర్వాత జరపాలన్న ఆలోచన ఏబీఎన్‌ ఎమ్డీ రాధాకృష్ణకు రాలేదా? వచ్చినా అనుకున్నది అనుకున్నట్లు జరపటమే దమ్మున్నట్లని భావించారో? తెలియదు. పోతే యంగిస్తాన్‌ పురస్కార గ్రహీతలు తమ తమ గ్రామాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం జరపటం ముదావహం. అదే సందర్భంలో ఏ ఒక్కరిలోనూ సమకాలీన సమాజం పట్ల కనీస అవగాహన లేదని వారి మాటలు పట్టిచూపాయి. ఇదే ఈ దేశ దౌర్భాగ్యం. దానికితోడు సంక్షేమ కార్యక్రమాలపట్ల తనకున్న వ్యతిరేకతను అందరికీ ఎక్కించేందుకు ఎక్కడ వీలయితే అక్కడ ఆర్కే బాగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన విఫలం కావాలని గట్టిగా కోరుకుంటున్నాను. అవుతాడని నమ్ముతున్నాను.
పేరు కూడా గుర్తులేని ఏదో చెత్తరకం సినీమసాల కార్యక్రమం ఏబీఎన్‌ ఉన్నతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. బహుశా వీక్షకులకు నవ్వులు పుట్టించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం చీదర పుట్టించింది. కాస్తంత సంగీతంగానీ, స్వరజ్ఞానంగానీ లేని వారంతా కలిసి గాన విషం చిమ్మారు. పోనీ ఈనాటి యువత మాదిరిగా కాసిన్ని పాటలన్నా వీళ్లకు రావు. కాగాపోగా ఉన్నంతలో వార్తలు చదువుతుంటే వినబుద్దేసే స్వామి పాడిన ఓ పాట అంతో ఇంతో వినసొంపుగా ఉంది. అయితే పాపం సహజంగానే తక్కువ మాట్లేడేవాడయినందునేమో ఆయన మౌన ప్రేక్షకుడి పాత్రే పోషించారు. అది ఆయన తప్పు కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని ఆయనకు ఒప్పజెప్పటం నిర్వాహకుల తప్పు. దానికన్నా వార్తల చదువరిగా ఆయన అనుభవాలను చెప్పించి ఉంటే భావి తరానికీ, వీక్షకులికీ ఉపయోగపడేదేమో! ఆసక్తిగా ఉండేదేమో!! మరొక వార్తల చదువరి ఫణి (అనుకుంటాను) చెత్తచెత్తగా కార్యక్రమాన్ని నడిపినా, అనుకరణ కార్యక్రమాన్ని మాత్రం కొంతలో కొంత రక్తి కట్టించారు. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, చంద్రబాబు, వైఎస్‌ జగన్మోహనరెడ్డిని అనుకరించటం బాగానే కుదిరింది. ఆసక్తిగానే ఉంది.
మూడో వార్షికోత్సవాన్ని ఇలా మాత్రం జరుపుకోవద్దని సూచించేందుకే ఈ స్పందన.

”వార్తోడు యాభయ్యేలు ఏసుకుపోయాడు … రెండు లక్షలు ఇవ్వాలంటూ ఈనాడోడు దుంపతెంచుతున్నాడు”


”హలో, సుబ్రావేనా?” 2011 అక్టోబరు 10న నాకొచ్చిన ఫోన్లో ఎవరో వాకబు.
”అవును, మీరెవరు? జవాబుతోపాటు నేనూ వాకబు చేశాను.
”అరేయ్‌! నేన్రా, ఎల్‌ఎన్‌కేని”
”ఓ… నువ్వా! చాన్నాళ్లకు పలకరించావు”
”ఎక్కడరా, నువ్వు రెండు నెలలకొకసారి నంబర్లు మారుస్తుంటే? నాకెక్కడ దొరుకుతావు??
”చేసేదేముంది. పనిచేసే సంస్థ మారినప్పుడల్లా నా ఫోను మారక తప్పదు కదా? సర్దిచెప్పాను. సరే ఇంతకీ సంగతులేంటి.”
”ఏమున్నాయిరా, ఎప్పట్లానే అక్టోబరు రెండున మనూరివాళ్లమంతా కలిసి సభ జరిపాము. నా దగ్గరున్న నంబరుకు చేస్తే నీకు కలవకపోయె. అందుకని నీకు సమాచారం చేర్చలేకపోయాము.”
”అరరే, ఈసారన్నా సభకు వద్దామనుకున్నానే.” విచారం వ్యక్తం చేశాను.
”అందరూ వచ్చారా? సభ బాగా జరిగిందా??”
”ఆ… బాగానే జరిగింది. దాదాపు హైదరాబాదులో ఉన్నవాళ్లంతా వచ్చారు.
”బాగుంది… బాగుంది. ఇంకా సంగతులేంటి?”
”చిన్న పనిబడి ఫోను చేశానురా.”
”చెప్పు”
”అపార్ట్‌మెంట్‌ కోసం ఫలానా చోట కొన్న స్థలంలో రాయిని పగలగొట్టేందుకు బ్లాస్టింగ్‌ చేశామురా. ఆ సంగతి ఎట్లా పసిగట్టాడోగానీ, వార్త విలేకరి ఫోటోలు తీశాడు. రెండు రోజుల తర్వాత మాకు స్థలం అమ్మిన ఆసామి ద్వారా వచ్చి విలేకరులందరికీ కలిపి రూ. 50 వేలు ఇస్తే వార్త రాయకుండా ఆపుతానన్నాడు. లేకపోతే అన్ని పత్రికల్లోనూ బీభత్సంగా వార్తలు రాస్తామని బెదిరించాడు. పోలీసులకు కూడా ఫోటోలు అందజేస్తానని కూడా చెప్పాడు. సరే చేసేదేముందని వాడడిగింది ఇచ్చాను. తీరా ఇప్పుడు రెండు రోజుల నుంచీ ఈనాడు విలేకరి నుంచి ఒకటే ఫోన్లురా. తనకు రెండు లక్షల రూపాయలు ఇస్తే బ్లాస్టింగ్‌ వార్త రాయకుండా ఆపుతానని బెదిరిస్తున్నాడు. ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. నువ్వూ విలేకరివేగదా, ఏమన్నా సలహా ఇస్తావేమోనని మనూరి నుంచి నీ నంబరు తెప్పించి ఫోను చేస్తున్నాను.
”వార్తోడికి యాభైవేలు ఇచ్చానంటున్నావుగదా! ఈనాడువాడితో కూడా బేరం కుదుర్చుకుంటే పోలా!” నా గొంతులో వ్యంగ్యం ధ్వనించింది.
”ఒరేయ్‌, ఫ్రెండ్‌వని ఫోను చేస్తే ఎగతాళి చేస్తావేంరా? ఏమి చేయమంటావో? చెప్పరా!” గొంతుకలో బాధ వ్యక్తమయింది.
”ఈనాడులో ఫలానా ఫలానా వాళ్లతో నాకు బాగా పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడదామా?” నేను సూచించాను.
”మరి వాడు ఈసారి జ్యోతివాడినో, హెచ్‌ఎంటీవీ వాడినో పంపితే? ఏమి చేయాలి” మిత్రుడి అనుమానం.
”నిజమే, అక్కడి విలేకరులందరినీ భోజనానికి పిల్చి విస్తట్లో తలో కవరు వడ్డించటమే మార్గం” మళ్లీ వ్యంగ్యం.
అవతలి నుంచి మౌనం. బాధితుడు గదా? మరి. అందులోనూ అందరూ అత్యంత ప్రమాదకరమని అనుకునే ఏ పోలీసు వలలోనో చిక్కితే ఇంతని పారేసి బయటపడొచ్చు. ఇప్పుడు చిక్కింది, పోలీసుల్నే భయపెట్టే విలేకరుల వలలోనయిపోయె.
”జ్యోతి వాడొస్తే ఫలానా మా చుట్టమని చెప్పు, హెచ్‌ఎంటీవీ వాడొస్తే ఫలానావాడు మా మిత్రుడని వివరించు, మహాటీవీ వాడొస్తే ఫలానా వాడితో చెబుతానని నువ్వే బెదిరించు” సూచించాను నేను.
”ఒరేయ్‌, పైవాళ్లకు చెప్పి మనం తాత్కాలికంగా బయటపడ్డా, మన విషయాన్ని పోలీసులకు చెప్పి వాళ్లచేతే అనుకున్నదానికన్నా ఎక్కువే వసూలు చేయించుకుంటారట విలేకరులు. పైగా ఇంకొక సమస్య కూడా తెస్తారు. నేను ఫలానా ప్రాంతం వాడిగా ఈ ప్రాంత ప్రత్యేక ఉద్యమాన్నీ, అది నడుపుతున్నవారినీ రోజూ తిడుతున్నానని కూడా వాళ్లకు ఫిర్యాదు చేస్తారట. అట్లయితే అది పెద్ద ప్రమాదం. చేతులారా, మనకు మనమే అసలుకే ఎసరు పెట్టుకున్నట్లే. ఏమి చేయాలో పాలుపోవటం లేదురా. ఇంకేమీ చేయలేవా?
”నువ్వే చెప్పు ఏమి చేయమంటావో? దాదాపు అన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఇంతో, అంతో తెలిసినవాళ్లున్నారు. వాళ్లతోజెప్పి నిన్ను ఇబ్బంది పెడుతున్నవాళ్లను పీకేయించగలను.”
”నీకున్న పలుకుబడితో ఉద్యోగం పీకేయించగలవు బాగానే ఉంది. వాడు ఇంకో పత్రికలో చేరి మళ్లీ వెంటబడతాడు. అదికాకపోతే ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని ప్రచారం చేస్తాడు. ఎట్లయినా ఇబ్బందులు తప్పేలా లేవు. ఏడెనిమిది లక్షల రూపాయలు విలేకరుల కోసం తీసి పక్కన బెట్టాల్సి వచ్చేట్లుంది.”
”అందుకే మా జాతోళ్లు (జర్నలిస్టులు అను పాత్రికేయ ముండాకొడుకులు) పూర్తిగా పాడయిపోయారని నీతో ఎన్నిసార్లు చెప్పలేదూ? సరే, నాకు చేతనయినంతమేర నీకు దాచుకోకుండా సాయం చేస్తా. ఏమి చేయమంటావో? నువ్వే తేల్చుకుని చెప్పు.”
”సరే, ఆలోచించుకుని రేపు మాట్లాడతాన్లే. ఉంటా” అంటూ నా మిత్రుడు ఆ రోజు పెట్టేశాడు.  మళ్లీ ఫోను రాలేదు. ఏమయిందో తెలియదు.
అవునండీ, ఇంకా చెప్పవలసిందేముంది. అంతా తెలిసిపోలేదూ? మా ఊరి మిత్రుడు హైదరాబాదులో బిల్డరు. ఓ స్థలంలో ఉన్న రాయిని పేలుడు పదార్దాలతో పేల్చి తొలగించాడు. ఆ సంగతి తెలుసుకున్న విలేకరులు వేలు, లక్షలు ఇవ్వాలంటూ ఫోన్లమీద ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. ఇప్పటికే వార్త విలేకరి తన ముఠా పేరు చెప్పి రూ. 50 వేలు వసూలు చేసుకెళ్లాడు. ఇప్పుడు రెండు లక్షలు కావాలంటూ ఈనాడు విలేకరి వెంటబడుతున్నాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక మా మిత్రుడు నరకం అనుభవిస్తున్నాడు. నేను ఏమి చేయగలను చెప్పండి. ఇదేమీ సినిమా కాదాయె. అప్పటికీ ఆయా సంస్థల ముఖ్యులకు ఫిర్యాదు చేద్దామని చెప్పానుగానీ, అలా చేస్తే సమస్య పరిష్కారం అయ్యేలా మాత్రం లేదన్నది హైదరాబాదు నగరానికి చెందిన ఫలానా ప్రాంత విలేకరుల సాక్షిగా నిజం. నిజం. మరి మీరేమంటారు??????

కిటికీ అంటే ఇంకా ఇంకా ఇష్టం

అవును, కిటికీ అంటే ఎంతెంతో ఇష్టం
ఎందుకంటే?
వీధిలో ఏమి జరుగుతుందో నాకు పట్టి చూపేది అదేగదా!

పిల్ల గాలుల్ని, ఉదయాగమనాన్ని
ఇంట్లోకి మోసుకొచ్చేది అదేకదా ! !

ప్రశ్నంటే నాకెంతో ఇష్టం

అవును, ప్రశ్న అంటే నాకెంతో ఇష్టం
ఎందుకంటే?
భూత – భవిష్యత్తు – వర్తమానాల సత్యాసత్యాలను పట్టిచూపేది అదేగదా మరి.

ఈ ప్రభుత్వాలు నాశనంగానూ!

అవును, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం కావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వాలు బతికితే నాలాంటి వాళ్లు బతకలేరంటే ఇక బతకలేని కాలం దాపురించింది మరి.
మిగతా విషయాల్ని పక్కనబెట్టి ఒక్క విషయాన్నే ఇక్కడ ప్రస్తావిస్తాను. నా ఆదాయం రోజుకు రూ. 600. అందులో రూ. 130 ఇంటి అద్దెకే పోతుంది. ప్రస్తుతం ‘హై – ధర – బాదు’తో సహా తెలంగాణలో సాగుతోన్న (స)కల జనుల సమ్మెకు ముందు నా కార్యాలయానికి రాకపోకలకుగాను రోజుకు రూ. 22 నుంచి రూ. 26 ఖర్చయ్యేది. అయితే ఆర్టీసి ఆగిపోయిన ఫలితంగా ఇప్పుడు ఆటోలను ఆశ్రయించక తప్పటం లేదు. దీంతో నాకు రోజుకు రూ. 100 నుంచి రూ. 225 దాకా ఖర్చవుతోంది. అంతే ఖర్చు అవుతున్నందున మా అమ్మాయి తన శిక్షణకు సెలవు పెట్టేసింది. అంతెందుకు ఆటోవాళ్లనే తప్పుపట్టాల్సిన పని లేదు. ఆర్టీసి కూడా కొన్ని ప్రాంతాలకు ఒకటో రెండో బస్సుల్ని నడుపుతోందిగదా. వాటిలోనూ అధికంగానే వసూలు చేస్తున్నారు. గతంలో నాలుగు రూపాయలయితే సరిపోయే దూరానికి ఇప్పుడు పది రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేమంటే ”మాకేమీ తెలవదు. అధికార్లు ఎట్ట చెబితే అట్టే జేస్తన్నం.” అంటున్నారు సిబ్బంది. నాలుగడుగులకు కూడా పది రూపాయలు ఇచ్చుకోవాల్సి రావటంతో పీకలదాకా కోపం తన్నుకు వస్తున్నా ఎక్కడి నుంచే వచ్చి తమకు చేతనయిన సేవలు అందిస్తోన్న సిబ్బందిని చేయగలిగేది ఏముంది?
ఇలా నా సంపాదనలో సగానికిపైగా కేవలం అద్దె, రవాణాకే ఖర్చయితే ఇక కుటుంబం జరిగేదెలా? అందులోనూ ఏ రోగమో, రొష్టో వస్తే వైద్యం మాటేమిటి??
ఇక పండగలయితే ఎప్పటి నుంచో చేసుకోవటం ఎటూ మానుకున్నామనుకోండి. ఇప్పుడిక రోజూవారి సాధారణ జీవితాన్ని కూడా ఆచితూచి గడపతప్పని దుస్థితి ఏర్పడింది. నా ఆదాయాన్ని ప్రత్యక్షంగా ఆటోవాళ్లు లాగేసుకుంటున్నా, దానికి కారణం మాత్రం తెలంగాణ విషయంలో
ఏదో ఒకటి తేల్చని…కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి
సమ్మె విషయంలో చర్యలు తీసుకోని … రాష్ట్ర ప్రభుత్వం రెండో ముద్దాయి
తెలంగాణ వస్తే అరచేతిలో స్వర్గం చూపెడతామని అబద్ధాలు కుమ్మరించి ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆరెస్స్‌, దాని అనుంగు సంస్థలు …. మూడో ముద్దాయి.
సందు దొరికింది కదా అని ప్రైవేటు చూపు చూడటమే కాకుండా ఇష్టారీతిన ప్రయాణికుల్ని దోచుకుంటున్న ఆర్టీసి … నాలుగో ముద్దాయి.
నిరుద్యోగుల పేరిట ఖద్దరు చొక్కాలాళ్లు లాగేసుకుని నడుపుకుంటున్న సెట్విన్‌ … ఐదో ముద్దాయి.
మాటల్లో తెలంగానం చేస్తూనే ప్రయాణికుల నుంచి దొరికినంత దోచుకుంటున్న ఆటోవాలా … ఆరో ముద్దాయి
ఇంత తప్పుడు రాజ్యంలో బతుకుతూ కూడా మౌనంగా చూస్తోన్న నేను …. ఏడో ముద్దాయిని.
అయితే, గియితే తప్పుడుగాళ్లమీద అంతో ఇంతో అక్షర కోపాగ్నిని ప్రదర్శించి నా పాపంలో సముద్రంలో కాకిరెట్టంత పరిహారం పొందానని భావిస్తున్నాను. మీరేమంటారు. ????????

మన వివేకానందుడు అంటారూ …..

నిత్యం నిర్భీతితో ఉండు
భయమే మృత్యువు
నీవు భయానికి అతీతుడవు కావాలి
కండరాలతో కూడిన నీ శరీరం
అంత్యదశలో ఎముకల గూడును
మోసుకు పోవటం వలన ప్రయోజనం ఏముంది?
దేశంలో చాలామంది రోగం చేతనో – చలిచేతనో – ఆకలి చేతనో చనిపోవచ్చు…
కానీ యువకులారా!
మీరు బీదలకోసం…
అగ్నానుల కోసం…
పతితుల కోసం…
పోరాడి మాత్రమే కన్నుమూయండి!!