Archive for డిసెంబర్, 2011

జర్నీ … చూసేవాటిలో మొదట ఎంచుకోదగిన మoచి చిత్రం


ప్రస్తుతాన్ని వెనక్కు నెట్టి ముందుకు సాగటం ప్రయాణం అయితే రెండు విభిన్నమైన ప్రయాణాలను హృద్యంగా పట్టిచూపిన అరవ అనువాద సినిమా జర్నీ.   ప్రయాణం పేరిట ఇటీవలే ఓ చిత్రం వచ్చినందునేమో, దీనికి జర్నీ అని ఆంగ్ల నామం తగిలించారు.
నేను ఆరేళ్ల హైదరాబాదువాసిగా ముచ్చటగా చూసిన మూడో చిత్రం కూడా నచ్చింది. మొదటి రెండు చిత్రాలలో ఒకటి లీడర్‌ కాగా రెండోది వేదం.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులూ మిగతా హీరోలతో పోలిస్తే నిజ్జంగా మంచివాళ్లు కావటం ఈ కథకే కాదు, దారి తప్పుతోన్న యువతను కాసింత గాడిలో పెట్టేందుకు ఉపరిస్తుందేమో! అదే విధంగా ఇద్దరు కథానాయికలూ తమదైన శైలిలో కాసింత సొంత బుర్రకలిగినవాళ్లు కావటం మరో విశేషం. దీనికితోడు అమ్మాయిలు పొట్టి లాగూలు వేసుకుని సముద్రపు ఒడ్డున పరుగులు పెట్టరు. అంటే ఎక్కడా వికారం పుట్టించరు. అబ్బాయిలూ అంతే ప్రేమిస్తారు తప్ప అడ్డదిడ్డంగా పాటలు పాడే పని పెట్టుకోరు. దీన్లో ప్రేమ ఉంది… శృంగారాలూ, వికారాలూ లేవు. విరహం ఉంది… గడ్డాలు పెంచుకోవటం కన్పించదు. విషాద గీతాలు విన్పించవు.
ఈ చిత్రంలో రెండు ప్రయాణాలున్నాయని మొదట్లో అన్నాను కదూ, దానిలో ఒకటేమో బస్సు ప్రయాణం చేయకూడని పద్ధతిని చూపింది. రెండోది ఒక యువకుడు, ఒక యువతి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక సోదరి, ఆ మాటకొస్తే పౌరులందరి జీవన ప్రయాణం ఎలా ఉంటే బాగుంటుందో ఉన్నమేరకు ఆదర్శంగా చూపే ప్రయత్నం జరిగింది.
ప్రస్తుతం అన్నిచోట్లా పెద్ద సమస్యగా మారిన అపరిమిత వేగం తెచ్చిపెడుతోన్న అనర్థాలను వాస్తవానికి దగ్గరగా చూపిన దర్శకుడు అందరినీ ఆలోచింపజేస్తాడు.
ఇక రెండో ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్ర మధుమతి. ముందుగా పాత్రలో నూరు శాతం వదిగిపోయిన పాత్రధారిణి అంజలికి అభినందనలు చెప్పాలి.
ఆరేళ్లు వెంటబడినా చెత్తగాడికి   లొ0గక పోవటం మధుమతి ప్రత్యేకత. దానికి భిన్నంగా ఆర్రోజుల్లోనే తొమ్మిది వేలు సంపాదిస్తూ ఒద్దికగా బతికే జై ప్రేమను అంగీకరించటం విశేషం. పైగా చాటుమాటుగా, గుడ్డిగా ప్రేమలో పడిపోవటం కాకుండా అతగాడిని పోలీసయిన తన తండ్రి దగ్గరకు పంపటం, తన వెంటబడిన వాడినీ కలవమనటం, హెచ్‌ఐవి పరీక్ష చేయించటం, అవయవదానానికి తాను సంతకం చేస్తూ, అతనినీ ఒప్పించటం… ఈ అన్ని వ్యవహారాలోనూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పటం, ఆమె వైద్యురాలని జై అనుకున్నప్పుడు బేషజాలకు పోకుండా నర్సును మాత్రమేనని నమ్రతగా తెలపటం, అవసరమైనచోట మానవత్వంతో వ్యవహరించిన మధుమతి ఈనాటి యువతకు, ప్రత్యేకించియువతులకు ఆదర్శపాత్రం. ఇష్టపడటం మొదలు పెట్టాక అదుపు తప్పని నడవడికతో ప్రియుడిని (చూసేవాళ్లు రెచ్చిపోయే సన్నివేశాలు లేవు సుమా) సున్నితంగా అలరించటం గొప్పగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు మానవత్వంతో సేవలు చేయటం మన మనసు పొరల్లో ఎక్కడో దాగి ఉన్న దుఖ:ం కట్టలు తెంచుకుని కన్నీటి రూపాన బయటపడిపోతుంది. నేనయితే కేవలం పక్కవాళ్ల కోసమే బిగ్గరగా ఏడవలేకపోయాను. రెప్పలు దాటిన దుఖ:జలాన్ని తుడవలేక చచ్చాననుకోండి. అనన్య పాత్ర కూడా అంతే. నగరవాసుల వెగటు వ్యవహారాలు నచ్చని పల్లెటూరి అమ్మాయిప్రతిదాన్నీ అనుమానించే లక్షణమున్న పాత్ర అది. జీవిత వాస్తవాలు నేర్పిన భయం తప్ప నిజాయితీకి, ఆలోచలనకూలోటు లేదు. అలా ఇద్దరు కథాయికలూ ఎలా వ్యవహరించాలో చూపి ఆడపిల్లలు ఇలా ప్రయాణించాలని నేర్పే ప్రయత్నం చేశారు. అలా అని ఎక్కడా ఆదర్శం పేరిట సాధ్యం కాని ఉపదేశాలు, ఉపన్యాసాలతో నేలవిడిచి సాము చేయలేదు. వారి ప్రవర్తనే వారిచ్చే సందేశం.
ఇక ఈ చిత్రంలో కన్పించే ఒకటి రెండు తప్పులు కూడా లేకుండా ఉంటే బాగుండేది. నాలుగు వరుసల రహదారిలో వాహనాలు ఎదురెదురుగా రావు. అందువలన ఈ చిత్రంలో చూపిన విధంగా విజయవాడ నుంచి హైదరాబాదు బస్సు, హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎదురెదురుగా ఢీకొనటం సాధారణంగా జరగదు. రెండు వరుసల రోడ్డులో మాత్రం అలా జరగవచ్చు. అయితే నాలుగు వరుసల రహదారిలో ఒకేవైపు వెళ్లే వాహనాలతోనే ప్రమాదం.
ఆరు వేల రూపాయలు ఖరీదయిన బట్టలు నాలుగు వందలకే వస్తాయని విజయవాడ వాసులు అప్పటికప్పుడు కోఠికి పోదామని అనుకోరు. అక్కడ బీసెంట్‌ రోడ్డు, వస్త్రలత ఉన్నాయిగా. అక్కడకు పోదామనుకుంటారు గదా! నాలుగు వరుసల రహదారిలో ఎదురెదురు వాహనాలు ఢీకొన్నట్లు చూపటం దర్శకుడి అనాలోచన కాగా, విజయవాడవాసులను కోఠికి పంపే ఆలోచన మాటల రచయిత తప్పిదం. వీలయినచోట తెలుగు ఫలకాలను చూపించటం – అంతలోనే వాతావరణం అరవంలోకి దూకటం వీక్షకులకు ఎంతో కొంత ఇబ్బందే. హైదరాబాదులో కనిపించని ప్రైవేటు సిటీ బస్సుల్ని చూడటం కూడా ఎబ్బెట్టుగా ఉంది.
ఈ సినిమా చూసిన తర్వాత నా కన్పించిందీ… ఎదిగే తోటి తెలుగువాడిని తోటివాళ్లు కాళ్లు పట్టుకుని ఎందుకు లాగుతారంటే అనర్హులు అలా ఎదగ కూడదని మాత్రమే. పక్కనున్న తమిళ తంబిలుజర్నీలా చక్కటి చిత్రాలు నిర్మిస్తుండగా మనోడికి ఆ తెలివి లేకపోయే మరి. కాళ్లు పట్టుకుని కాదు ప్రస్తుతం మన తెలుగు చిత్రసీమను ఏలుతున్నవాళ్లందరికీ మోకులు కట్టి మరీ సముద్రంలోకి లాగి పారేయాలి. అప్పుడు అరవ అన్నల్లా కాసింత తెలివి ప్రదర్శించి, వీక్షకులకు కాసింత తెలివి పంచిపెట్టేవాళ్లకు కాసింత చోటు దొరుకుతుందేమోనని నాబోట్లకు పెద్ద ఆశ.

ప్రకటనలు

జనం ఛస్తే నాకేమి … బతికితే నాకేమి – మానవహక్కుల కమిషను ఛైర్మన్‌ తీరూతెన్ను


14 డిసెంబరు 2011. హైదరాబాదు.
ఉదయం 9.30 గంటల సమయం. బస్సులో రాంనగర్‌ నుంచి ఎస్సార్‌ నగర్‌ నందున్న మా కార్యాలయానికి వెళ్తుండగా ఖైరతాబాద్‌లోని ఓ ఇంటి గోడ మీద కన్పించిందా ఆంగ్ల ప్రకటన. మహిళల హక్కుల పరిరక్షణ సదస్సు బెంగళూరులో జరగబోతుందట. ఆ సదస్సులో మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్యతోపాటు రాష్ట్ర హక్కుల కమిషను ఛైర్మన్‌గా పనిచేసిన సుభాషణరెడ్డి ప్రసంగిస్తారు. అది చదవగానే నాకు గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది.
బహుశా రెండేళ్లవుతుందనుకుంటాను ఈ సంఘటన జరిగి. నా మిత్రడొకరిని కలుసుకుందామని జూబ్లీహిల్స్‌కు వెళ్లాను. అతని ఇల్లూ, కార్యాలయమూ పక్కపక్కనే ఉంటాయి. నేను కార్యాలయంలోనే నా మిత్రుడిని కలుసుకుంటుంటాను. ఆ రోజు కూడా కార్యాలయానికి వెళ్లగా అతను ఇంకా రాలేదనీ, ఇంట్లోనే ఉన్నాడనీ సిబ్బంది చెప్పారు. అందువలన మిత్రుడిని కలిసే వెళ్తామని ఆనాటి దినపత్రికలు చదువుతూ అక్కడే కూర్చున్నాను.
అరగంట తర్వాత నా మిత్రుడు వస్తూనే, ”అనుకోకుండా ఓ పెద్దమనిషి చెప్పా పెట్టకుండా వచ్చిందికాక నా సమయాన్నంతా తినేశాడు సుబ్బారావ్‌” అన్నాడు.
”ఎవరా పెద్దమనిషి” వాకబు చేశాను నేను.
”నువ్వు వింటే ఆశ్చర్యపోతావు!” అన్నాడు మిత్రుడు.
”ఇప్పుడు జరిగేవన్నీ విచిత్రాలే గదా! ఇంతకీ ఎవరా పెద్దమనిషి? పట్టు వదలకుండా మళ్లీ అడిగాను.
”నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను, చెబితే వార్త రాసేస్తావని భయంగానూ ఉంది”
”నిన్ను ఇరుకున పడేయనులే. చెప్పు, నువ్వు రాయమంటేనే వార్త రాస్తాను. లేకపోతే లేదు. విషయం తెలుసుకోవాలిగా” అంటూ ఒత్తిడి చేశాను నేను.
”మానవ హక్కుల కమిషను ఛైర్మను లేడూ …. .. వచ్చింది ఆయనే. అదిగో అక్కడ కొండ కన్పిస్తున్నది చూడు. (సమీపంలోనే ఉంది) దాన్ని గవర్నమెంటు నుంచి ఆయన బంధువు కంకర రాయి కొట్టుకునేందుకుగాను లీజుకు తీసుకున్నాడు. గత వారం రోజుల నుంచీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి కొండను పేలుస్తున్నాడు. రాళ్లు వేగంగా ఎగిరొచ్చి ఈ చుట్టుపక్కల ఇళ్లమీదా, ఇళ్లల్లోనూ పడుతున్నాయి. కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి. కాంట్రాక్టరుకు ఎంత చెప్పినా వినకపోవటంతో తట్టుకోలేక అందరూ కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లారు. పైగా మా బంధువు ఫలానా న్యాయమూర్తి అంటూ అందరినీ బెదిరించాడు. కంకర కొట్టద్దని పోలీసులు చెప్పేశారు. ఇంకొకటేందంటే, హౌసింగ్‌ సొసైటీ నుంచి నేను కూడా కాంట్రాక్టరు మీద చర్య తీసుకోమని అర్జీ ఇచ్చాను. ఇక చూడు, ఈ పెద్ద మనిషి ఒకటే ఫోన్లు. నువ్వు చెబితే అందరూ వింటారు చెప్పమంటాడు. అదేందండీ మీరు మానవహక్కుల కమిషను జడ్జి అయి ఉండి ఇట్లా మాట్లాడటం ఏమీ బాగాలేదే! అన్నా వినడాయె. ఏదో దగ్గర బంధువు, ఏడుస్తున్నాడని చెప్పాల్సి వచ్చిందంటాడు. చూసీ చూడనట్లు ఉండండి సార్‌, మిగతాది నేను చూసుకుంటానుఅంటాడాయన. అప్పటికీ ”జనం బతుకు ముఖ్యమా? బంధువు ఆదాయం ముఖ్యమా??” అని ఘాటుగానే అడిగాను. అసలు విన్పించుకుంటే గదా! వినడు, ఆలోచించడు. తలబప్పి కట్టించాడంటే నమ్ము. జనందేముంది వెర్రోళ్లు, నీబోటి నోరున్నాడు పదిసార్లు ఏది చెబితే అదే నిజమని నమ్ముతారని నాకు నచ్చజెప్పబోతాడు తప్ప తను మాత్రం ఆలోచించడు అంటూ హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌ భాగోతాన్ని పూసగుచ్చాడు మిత్రుడు.
జనం కన్నా తన బంధువు కాంట్రాక్టు పనులే ముఖ్యమని బల్ల గుద్దినట్లు చెప్పాడట. హక్కుల దేముంది? సార్‌, ఎవడి కోసం ఎవరాగుతారు? అని బుట్టలో వేసుకునే ప్రయత్నాలను ఎలా చేశాడో? వివరించాడు.
అదండీ సంగతి… జనం కన్నా, జనం బతికే హక్కు కన్నా… జనం వాదన కన్నా, తన బంధువు ఆదాయమే ముఖ్యమని తాపత్రయ పడిన ఓ మానవ హక్కుల కమిషనరు తీరూతెన్నుకు ఓ చిన్న ఉదాహరణ ఇది

తానోడి నన్నోడెనా? – – సారంపల్లి మల్లారెడ్డి

కాంగ్రెస్‌ ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది.

పాండవులను వారి రాజ్యాన్ని ధర్మరాజు జూదంలో ఓడి పోయాడు. చివరికి శకుని సలహాతో ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడతాడు. గెలిస్తే తాను ఓడిపోయిన రాజ్యంతోపాటు తన తమ్ములు విముక్తులవుతారని అందుకు ద్రౌపదిని ఆటలో పందెంలో పెట్టమని షరతు విధిస్తారు. జూదం వ్యామోహం గల ధర్మరాజు ద్రౌపదిని పందెం కాసి ఓడిపోతాడు. కౌరవులు ద్రౌపదిని ధృతరాష్ట్ర సభకు తెచ్చి కౌరవులకు భానిసగా ఉండమంటారు. ఆ సభలో భీష్మునితో సహా ధర్మకోవిదులందరూ ఉండగానే ద్రౌపది ఒక ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ధర్మరాజు ‘తానోడి నన్నోడెనా.? లేక నన్నోడి తానోడెనా.?’ అని అడుగుతుంది. సభలో ఉన్నవారు తానోడిన తర్వాతనే నిన్ను ఓడాడని సెలవిస్తారు. సర్వం ఓడిపోయినవాడికి నన్ను పందెంలోకాసే అర్హత ఉందా.? అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. నిండుసభలో ఎవరూ ఈ ధర్మ సందేహానికి సమాధానం చెప్పలేకపోయారు. అది ”అప్రస్తుతం” అంటూ దాటవేశారు.

అలాంటి పరిస్థితే నేడు ప్రజా రాజ్యం పార్టీ(ప్రరాపా)ని ఆవహించింది. పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తానని, కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతానని ధీరోదాత్త వచనాలు పలికి తిరుపతి బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ సందర్భంగా తొడగొట్టి ప్రకటించారు. ఆ విధంగా కాంగ్రెస్‌ను, దాని విధానాలను విమర్శిస్తూ ఎన్నికల్లో పోటీచేసి 18 స్థానాలు గెలుపొందారు. అందులో నుండి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ ఎంఎల్‌ఏ పార్టీ ఫిరాయించారు. అతనిపై వేటు వేసే ధైర్యం ప్రరాపాకు లేకుండా పోయింది. అతను కాంగ్రెస్‌ సానుభూతిపరునిగా ఉంటున్నాడు. చివరకు ప్రజారాజ్యం నేత మూటాముల్లె సర్దుకొని మొత్తం తన దుకాణాన్ని మూసేసి కాంగ్రెస్‌ దుకాణంలో చేరాడు. పార్టీ ఏర్పర్చినపుడు కాంగ్రెస్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకించి నేడు ఆ విధానాలనే భుజాన వేసుకొని కాంగ్రెస్‌లో కలిశాడు. తాను రూపొందించిన కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసిన శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ పార్టీ తరపున స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కోరే సందర్భంగా ప్రరాపా ఉనికిలో ఉందా లేదా? అన్నది సంశయమే. అంతకు ముందే తెలంగాణా అంశంపై శాసనసభ సభ్యత్వాలకు టిడిపి, కాంగ్రెస్‌ వారు రాజీనామాలు ఇచ్చినా వారి రాజీనామాలను స్పీకర్‌ అంగీకరించలేదు. స్పీకరు తన విచక్షణాధికారాన్ని వినియోగించి వారి రాజీనామాల్ని తిరస్కరించడమో, లేదా ఆమోదించడమో చేయాలి. ఒకే ఫార్మేట్‌లో రాజీనామాలు సమర్పించిన వారిలో కొందరివి ఆమోదించారు, భావోద్వేగంతో రాజీనామాలు సమర్పించారనే సాకుతో మరికొందరివి తిరస్కరించారు. నేడు శాసనసభలో మూడింట ఒక వంతు శాసనసభ్యులు ఏ పార్టీలో ఉన్నారో అంతుచిక్కని అంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ విప్‌ను ధిక్కరించిన 16 మంది శాసనసభ్యులను ఏమి చేయాలన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపి క్రమశిక్షణా చర్యకు స్పీకర్‌ను కోరింది. స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ సభ్యత్వం రద్దు చేయమని కోరడం విచిత్రంగా ఉంది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.

ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో ‘ పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు’ తెచ్చినపుడు కాంగ్రెస్‌వారు దీనిని అభ్యుదయ చర్యగా అభివర్ణించారు. కాని అప్పుడే వామపక్షాలు ఈ బిల్లులో ఉన్న లొసుగులను ఎత్తిచూపాయి. మూడింట ఒక వంతు శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడదని, పార్టీ బహిష్కరించినవారికి ఈ చట్టం వర్తించదని మెలికలు పెట్టారు. ఈ లొసుగులే కాక స్పీకర్‌కుగల విచక్షణాధికారాలను వినియోగించి పాలకపార్టీలకు రక్షణ కల్పించడం జరుగుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని అనేక రాష్ట్రాలలో చివరికి పార్లమెంటు ఉభయసభల్లో కూడా ఈ ఫిరాయింపుల సమస్య నిరాఘాటంగా సాగిపోతోంది. కొందరు తెలివిగా మరొక పార్టీలో చేరకుండా పాలకపార్టీకీ ప్రమాదం ఏర్పడ్డపుడు సహాయం చేస్తూ వస్తున్నారు. విప్‌ను ధిక్కరించడం ఫిరాయింపుల బిల్లురీత్యా నేరం. ఈ నేరానికి పాల్పడిన వారిని వారి సభ్యత్వాన్ని రద్దుపర్చి తిరిగి అక్కడ ఎన్నికలు జరిపించాలి. కాని పాలకుల విచక్షణకు లోబడి ఈ చట్టం పనిచేస్తోంది. పాలకులు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొంటూ ప్రజలకు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని’ నమ్మబలుకుతున్నారు.

ఒక పార్టీ బ్యానర్‌తో గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని ‘ధృతరాష్ట్రకౌగిలి’ లోకి వెళ్లాడని అనడం రివాజు. ధృతరాష్ట్రుని కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది. పార్టీలో కలిసినాక కాంగ్రెస్‌ పార్టీ విప్‌కు లోబడి ఉండాలి తప్ప ఆ పార్టీ విప్‌ జారీ చేసే అర్హత న్యాయపరంగా ఉందా అన్నది పరిశీలించాలి. నేడు రాష్ట్రంలో పాలన అస్థిరమై, ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 104 ఉద్యోగుల సమ్మె, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఉపాధిహామీ పనుల అమలు చర్చకు రాకుండా పోయాయి. తమ పార్టీలో అతి ప్రజాస్వామ్యముందని చెప్పే కాంగ్రెస్‌, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. తన పాలనను నిలుపుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నది. దేశాన్ని బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతున్నది. ప్రజాందోళనలపై నిర్బంధం ప్రయోగిస్తున్నది.

అవిశ్వాసంపై గట్టెక్కడానికి పార్లమెంటరీ నిబంధనలను తుంగలోతొక్కి సభ్యులపై సామ దాన భేద దండోపాయాలను ప్రభుత్వం ప్రయోగించింది.. కాంగ్రెస్‌ను పార్లమెంటులో గట్టెక్కించడానికి నాడు పివి నర్సింహారావు ఆనాడు అనుసరించిన ఓటుకు నోటు సంస్కృతినే రాష్ట్ర పాలకవర్గం పుణికిపుచ్చుకుంది. పార్లమెంటరీ విధానానికి తూట్లు పొడవడం కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే విప్‌ జారీ చేసినా తనకు లోబడినవారికి ఒకతీర్పు, వ్యతిరేకించినవారికి మరొక తీర్పు ఇచ్చి తన కుటిలరీతిని ప్రదర్శిస్తోంది.

‘దేగుడు” మా ప్రాంతపు ఆడవాళ్ల తిట్టు


ఈ తెనుగు పదం ఇంకెక్కడయినా విన్పిస్తుందో? లేదో? నాకు తెలియదు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మా ఈదుమూడి గ్రామంలో మాత్రం నేను చిన్నప్పటి నుంచీ విన్న, వింటున్న పదం ఇది. ఈ పదం ఆడవాళ్ల ప్రత్యేకం. వాస్తవానికి ఇది తిట్టు పదం. గ్రామ్యం. ఎవరయినా మగవాళ్లు కానిపనిచేసినా, నోరు జారినా ఆడవాళ్లు కసిగా, కోపంగా, తొలిగా ”దేగుడా” అంటూ తిడతారు. ఒక్కోసారి, కొందరు ”దొంగ నా దేగుడా” అని కూడా కలిపి మరీ తిడతారు.
మా ఊళ్లో ఏ ఏ తిట్లు తిడతారో ఇక్కడ చెప్పబోవటం లేదు సుమా. ఆడవారి తిట్ల భాషనో, మగవారు ఏ పదాలతో తిడతారో అసలే చెప్పబోవటం లేదు. కేవలం దేగుడు పదంపై నా అభిప్రాయాన్ని బ్లాగ్మిత్రులతో పంచుకుందామనే దీన్ని రాస్తున్నాను.
సరే, అసలు విషయానికొస్తే…. దేగుడు – ఈ పదం ”దేవుడు” పదానికి వికృతి. దైవం – దేవుడు అన్న సంస్కృత పదాల నుంచి పుట్టిన తెనుగు పదమే ఈ దేగుడు. ఇంత వరకూ పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదుగానీ, ఈ పద ప్రయోగమే కాస్త విచిత్రం. దేవుడు అంటే మంచివాడు అని కదా మరి దాన్నించి పుట్టిన దేగుడును తిట్టుగా ఎందుకు వినియోగిస్తున్నట్లు? తమ అనుభవాన్నుంచి ఈ పద ప్రయోగం ప్రారంభం అయి ఉండవచ్చు. అయితే ఈ పదం ఎప్పటి నుంచీ వినియోగంలో ఉందో తేలితేగానీ తిట్టుగా ఎలా మారిందన్న విషయాన్ని కచ్చితంగా తేల్చలేమని నా అభిప్రాయం. అయితే రెండు అంశాలు నేపథ్యంగా ఈ పదం వినియోగంలోకి వచ్చి ఉండవచ్చని నా అంచనా. అందులో ఒకటి – ఈ పదం గనుకు స్వాతంత్య్రోద్యమ కాలంలోనో, స్వాతంత్య్రం ఆగమించిన కాలం నుంచో గనుక ప్రారంభమయి ఉంటే మాత్రం అది త్రిపురనేని రామస్వామి చౌదరి నేతృత్వంలో మా ప్రాంతంలోనూ ప్రభావం చూపిన హేతువాద ఉద్యమ ఫలితం అయి ఉండాలి. ఎలాగంటే త్రిపురనేని, ఆయన శిష్యులు మా ప్రాంతంలో పురాణాల గుట్టును విప్పి చెప్పారు.రామాయణం – రాముడు – రావణాసురుడు, శంభూక వధ – సురులు – అసురులు ఇలా దేవుళ్ల బండారాన్ని ప్రచారం చేశారు. రచ్చబండలమీద చేరి రాక్షసుల గురించీ వివరించేవాళ్లు. దీనివలన కొంతమంది ఆలోచనాపరులు రాక్షసుల అభిమానులయ్యారు. సురాపానం చేసే సురులంటే అసహ్యం పెంచుకున్నారు. అంటే దేవుళ్లను తమ శత్రువులుగా గుర్తించారు. అలా దేవుడు అన్న పదాన్ని తప్పుడు పనిచేసిన వారికి, తమకు అన్యాయం చేసిన వారికి, తమపై నోరు పారేసుకున్న వారికీ ఆపాదించి ఛీదరించుకోవటం ప్రారంభం అయి ఉండాలి. కాలగమనంలో పలు పదాలు నోటికి తిరిగినట్లుగా మారిపోయినట్లుగానే దేవుడు పదం కూడా దేగుడుగా మారింది. అన్నట్లు మా ప్రాంతంలో ఈ పదాన్ని చేయిచేసుకునే భర్తలను తిట్టేందుకు కూడా స్త్రీలు విరివిగా వాడతారు.
ఈ పదం ఇంకా ప్రాచీనమయినదయితే మాత్రం దానికి మరో కోణం ఉంది. ఆర్యులు – ద్రావిడుల మధ్య చెలరేగిన తగాదాల్లోనే ఈ పదం పుట్టి ఉండాలి. ఆర్యులు సహజంగానే తమను ఇక్కడ ప్రతిష్టించుకునే పనిలో ఇంద్రుడు, రాముడు, కృష్ణుడిని దేవుళ్లను చేసి ద్రవిడులతో ఆటాడుకున్నారుగదా! అది గిట్టని ద్రవిడులు దేవుళ్లను తిట్టటం సహజం. రాక్షసులను (అసురులు) తమవాళ్లుగా భావించటమూ కద్దు. ఇక్కడ పాగా వేసేందుకు ఆర్యులు – తమ అస్థిత్వాన్ని కాపాడుకుని ఆర్యుల అరాచకాలను తిప్పికొట్టే పనిలో ద్రవిడులు మునిగిపోయిన క్రమంలో ఈ పదం పుట్టి ఉండాలి. తమ శత్రువులకు సంబంధించిన వాడయిన దేవుడుని, తాము చెడ్డవాడని భావించే వారికి ఆపాదించటం ప్రారంభమయి ఉండాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే దేవుడు అన్న ప్రకృతి మన గ్రామీణుల నోటపడి అది దేగుడుగా మారి ఉండాలి. ఏదేమయినా మా ప్రాంతంలో వినియోగించే తిట్టు పదం వెనుక  కొంత చరిత్ర – వాస్తవం – తమ శత్రువులను కచ్చితంగా గుర్తించిన వైనం – ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ పదం అంటే నాకెంతో ఇష్టం. అది మా గ్రామ్యం. అది మా వికృతి. అది మా అనుభవం నుంచి పుట్టిన పదం.

లోక్‌చెత్త … సంచిక – 3


జయప్రకాష్‌ నారాయణతో నా స్వీయానుభవాన్ని రాసి, ఇక లోక్‌చెత్తను చెరిగే పనికి తాత్కాలికంగా విరామమిచ్చేదానికి అనుమతి ఇవ్వండి.
ఈ సంఘటన ప్రకాశం జిల్లాకు జెపి కలెక్టరుగా పనిచేస్తున్న కాలంలో జరిగింది. నేను అప్పుడే మా గ్రామం ఈదుమూడి నుంచి ఒంగోలుకు చేరాను. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఒంగోలును జ్వరాలు చుట్టుముట్టాయి. ఇంటికి ఇద్దరు ముగ్గురికి తక్కువగాకుండా మంచాలెక్కారు. అదే సమయంలో పురపాలక సంఘాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఎక్కడి చెత్త అక్కడే నిల్వ చేరటంతో పట్టణమంతా ఒకటే కంపు. అసలే రాష్ట్రం మొత్తం మీద ఒంగోలు నీఛ నికృష్ట అపరిశుభ్ర పట్టణం. కార్మికుల సమ్మె కారణంగా పూర్తిగా పాడయిపోయింది. మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. కొన్ని ప్రాంతాల్లో ఊడ్చి, కాలువల్లో పూడికలు కూడా తీశాము. అయినా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన కార్యక్రమాన్ని ఒక యువజన సంఘం నెత్తుకుని విజయవంతం చేయటం అంత తేలిక కాదు. అందుకని మేము పడుతున్న బాధల్ని ప్రభుత్వానికి నేరుగా చెబితేనన్నా స్పందించి చర్యలు తీసుకుంటారేమోనన్న భ్రమతో కుర్రాళ్లమంతా కలిసి కలెక్టరు జెపిని కలిసి వినతి పత్రం అందజేసి ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఆ వినతి పత్రాన్ని అలా అలా చదువుతూనే పిడుగులు కురిపించటం ప్రారంభించాడు. బుద్ధున్నవాడెవడూ ఇలా కాగితాలు తీసుకుని ఏదో చేయమంటూ రాడు. మీరు కలెక్టరు ఆఫీసుల చుట్టూ తిరిగే సమయాన్ని ప్రజల కోసం వినియోగిస్తే అసలు సమస్యలే రావు. మీరు మీ ఇళ్ల నుంచి తలా ఒక చీపురు, తట్టా తీసుకుని వీధులన్నీ ఊడవండి. అంతేగానీ ఇలా అది చేయండి ఇది చేయండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవద్దు.” అంటూ ఇంకా ఏదేదో బడబడా ఉపన్యసించాడు. చివరలో తక్షణం మేము బయటకు వెళ్లక పోతే తానే నెట్టించాల్సి వస్తుందని బెదిరించాడు జెపి. అప్పుడప్పుడే లోకాన్ని అర్ధం చేసుకుంటున్న మేము జెపి తీరుతో హతాశులమయ్యాము. వాస్తవానికి బెదిరిపోయాము. సరే, ఆయనతో వాదించే శక్తిలేక, కాళ్లీడ్చుకుంటూ ఇళ్లకు చేరాము. తర్వాతెప్పుడూ ఆయన దగ్గరకు రాయబారం వెళ్లే సాహసం చేయలేదు. మా సంఘం తర్వాత కూడా ఎన్నెన్నో ఉచిత వైద్యశిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన విషయం వేరే సంగతనుకోండి.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే…. ప్రభుత్వం చేయవలసిన పనిని వ్యక్తులుగానీ, చిన్న సంస్థలుగానీ పరిపూర్ణంగా చేయగలవా? అదే వాస్తవయితే, జెపి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు? స్వచ్ఛంద సంస్థ లోక్‌సత్తాతోనే ఈ దేశంలోని సమస్త రోగాలనూ పారదోలవచ్చుగదా? అంతా ఒక్కసారి చేయలేకపోతే ఒక్క ఊరిలోనయినా చేసి నిరూపించి ప్రజలను నమ్మించి రాజకీయాలు, శాసనసభలు, పాలన లేకుండా స్వచ్ఛంద సంస్థలకే దేశాన్ని అప్పగించేందుకు కృషి సల్పవచ్చుగదూ?
అంటే జెపికి అంతా తెలుసు. ఏమి చేసినా ప్రభుత్వమే చేయాలి. కాకపోతే ఎప్పుడన్నా, ఎక్కడన్నా అత్యవసరమైతే వ్యక్తులు పూనుకుని తాత్కాలికంగా సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వేతర సంస్థలు స్పందించి చేయూత ఇవ్వవవచ్చు. అంతేగానీ వ్యక్తులో, ఏదో ఒక సంస్థో అంతా చేసేస్తే ఇదంతా ఎందుకు దండగ. అది వీలుకానందునే ప్రపంచవ్యాపితంగా రాజకీయాలు, శాసనసభలు, ప్రభుత్వాలు ఉన్నాయి. చేసినా చేయకపోయినా ప్రభుత్వానికే సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే సత్తా ఉంటుంది.
అయితే తాను తీసుకోవలసిన చర్యలు తీసుకోని జెపి కసికసిగా కుర్రాళ్లమీద కన్నెర్ర జేశాడు. ప్రభుత్వానికి వాస్తవం చెప్పలేని, ప్రశ్నించలేని ఆయన కళ్లెదుట కనపడినవాళ్లతో యుద్ధానికి దిగాడు.
ఆయనకు ఆ దృక్పధం నుంచి బయట పడనందునే ఇప్పటికీ తాను ఎన్నెన్నో విషయాల మీద తెగతెగ పోరాడుతున్నానని తరచూ చెప్పుకుంటుంటాడు. ఎన్నెన్నో లాభాల్ని తెచ్చిపెట్టానని చెప్పుకుంటుంటాడు. ఎన్నో చట్టాలు తన పోరాటం వలనే వచ్చాయని చెబుతుంటాడు. అయనో విచిత్రం. అయనదో లోకం. ఏం చేద్దాం. కారణం ఏదయినాగానీ ప్రజల సంగతి పట్టాల్సిన వాళ్లు వారికి దూరమయ్యారు. ఆ జాగాలో జరబడిన జెపీలు, స్వాములోర్లు ప్రజల్ని ప్రభావితం చేసేందుకు తెగ చెమటోడ్చుతున్నారు. కానీండి ప్రజలు తెలుసుకునే దాకా… అందరి బొక్కల్నీ విరగదీసేదాకా …. కానీండి. కానీండి.

విప్లవకారుల విషాదం

‘పశ్చిమ బెంగాల్‌కి ముఖ్యమంత్రిగా చేయదగిన అత్యుత్తమ వ్యక్తి మమత బెనర్జీ’ అని ‘ఆనంద్‌ బజార్‌’ పత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో ఇటీవల మరణించిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ అన్నారు.

మమత అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్‌లో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లోనే కిషన్‌జీని బలితీసుకున్నారు. ‘ఉగ్రవాదులందరి కంటే నక్సలైట్లే ప్రమాదకారులు’ అని కూడా మమత వాకృచ్చారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాలుగో రోజు (గత నెల27న) మౌనం వీడిన మమత ‘జంగల్‌ మహల్‌ని బలగాలు చుట్టుముట్టి తుపాకులు అప్పగించి లొంగిపోవాలంటూ కిషన్‌జీకి, ఇతర నేతలకూ మూడు రోజులు గడువిచ్చినా వారు వెనక్కు తగ్గలేదు. వెయ్యికిపైగా రౌండ్లు కాల్పులు జరిపి, ఎన్‌కౌంటర్‌ తప్ప మరే ప్రత్యామ్నాయం లేకుండా చేశార’ని తనదైన శైలిలో నెపమంతా మావోయిస్టులపైనే నెట్టారు. అంతేకాదు, ‘కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ వల్ల వేలాది ఆదివాసీలు రక్షించబడ్డారు’ అని కూడా ఆమె చెప్పారు. నవంబరు 23న మిడ్నాపూర్‌ జిల్లాలోని గోసాయిబంద్‌ గ్రామంలో కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారని ఫొటోలతో సహా మావోయిస్టులు, హక్కుల సంఘాలు ఆరోపిస్తుంటే, ఇది నూరు శాతం నిజమైన ఎన్‌కౌంటర్‌ అని మమతాబెనర్జీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రకటిస్తున్నారు. దశాబ్దాల తరబడి అధికారం కోసం కాచుక్కూర్కున్న మమతకి, వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపర్చటమే ఏకైక కార్యక్రమంగా మలుచుకున్న మావోయిస్టు పార్టీ, దాని నాయకుడు కిషన్‌జీలు అయాచిత వరంగా లభించారు. ఒకరకంగా వామపక్ష ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం పట్ల చాలా ఉదారంగానే వ్యవహరించిందని చెప్పాలి. నక్సల్బరీ ఉద్యమం ఏర్పడ్డ ప్రారంభదినాల్లో సాగించిన నిర్బంధ దుష్ఫలితాల పట్ల చివరి రోజువరకు భయపడుతూనే వుంది. పరిస్థితిని అవకాశంగా తీసుకొని మావోయిస్టులు దేశంలో బెంగాల్‌ని ‘షెల్టర్‌ జోన్‌’గా మార్చుకున్నారనేది వాస్తవం. తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కున్న అవివేకిలా మావోయిస్టు పార్టీ ప్రవర్తించింది. ప్రజలు ప్రయత్నిస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుని పడగొట్టేలాంటి నీచమైన పనులకు సైతం పాల్పడి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచటం ద్వారా మమత విజయానికి సర్వశక్తులూ ఒడ్డింది. సర్వ పాపాలు చేసింది. ఈ నీచకృత్యాలన్నీ చూసింది కనుకనే దీదీకి వీళ్లు ప్రమాదకారులుగా కనిపించారు.

చుట్టుముట్టిన బలగాల నుండి తప్పించుకున్నాడని పథకం ప్రకారం ప్రచారం చేశారు. కొన్ని బలగాల్ని వెనక్కి పంపించారు. ప్రజల్ని, మావోయిస్టుల్ని నమ్మించారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో మావోయిస్టులు రాణించలేకపోయినా పోలీసులు విజయం సాధించారు. ఆదమరచి ఉన్న కిషన్‌జీని, మరి కొంతమందిని బురిపాల్‌ గ్రామంలో అదుపులో తీసుకొని ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. ఈయనతో వున్న సుచిత్ర మహతో తప్పించుకుందో లేక పోలీస్‌ కస్టడీలో వుందో తెలియదు. తమ నాయకుల ఆచూకీ తమకే తెలియని దురవస్థ మావోయి స్టులది. ఇంత పేలవమైన నిర్మాణమూ, నాయకత్వమూ వున్న నెట్‌వర్కు ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకీ ఉన్నట్లు లేదు.

ఎన్‌కౌంటర్‌గా చెప్పబడే ప్రతి సంఘటనా నకిలీదే. నాయకులందర్నీ పట్టుకొని కాల్చి చంపినదే. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 90 శాతం సందర్భాలలో నాయకులు ‘విద్రోహం’ కారణంగా పట్టుబడ్డ వారే కావడం. చాల మంది భ్రమ పడుతున్నట్లు వెంగళరావు ‘సమర్థత’ వలనో, కొంతమంది పోలీసుల ‘కఠినత్వం’ వలనో గాక మావోయిస్టు పార్టీలో విచ్చలవిడిగా సాగిన ‘కోవర్టు ఆపరేషన్లే’ ఈ ఘటనలన్నిటికీ కారణం. ప్రారంభ దినాల్లో పై స్థాయి నాయకత్వంలో తక్కువ స్థాయి జ్ఞానం వున్నవారు కింద స్థాయిలో ఎక్కువ సిద్ధాంత పరిజ్ఞానం కలిగినవారు పార్టీలో ఉన్నారు. కాలక్రమంలో దానికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడింది. చారు మజుందార్‌ నాయకత్వంలోని సిపిఐ(యంయల్‌) తర్వాత పీపుల్స్‌్‌వార్‌ పార్టీగా, మావోయిస్టు పార్టీగా రూపం మార్చుకునే క్రమంలో మార్క్స్‌, ఎంగెల్స్‌పేరు కూడా వినని వాళ్లను దళాల్లోకి ‘రిక్రూట్‌’ చేసుకోవడం, మార్క్స్‌ ఫొటో,గద్దరు ఫొటో చూపిస్తే ఎవరో చెప్పలేని దళ సభ్యులున్న దళాల్తో నిండిన ఘోరస్థితి మావోయిస్టు పార్టీలో నెలకొంది. భర్తపై అలిగివెళ్లిన భార్యలు, ఇంట్లో పెద్దలు కొడితే ఇల్లు వదిలివెళ్లిన పిల్లలు, జన నాట్యమండలి పాటలు విని ఉత్సాహపడ్డవారు, అడవుల సమీప గ్రామాల్లో వివిధ సమస్యల బారినుండి ‘అన్న’ల సహాయం కోరి వెళ్లిన వాళ్లతో దళాలు నిండిపోయాయి. దీంతో సిద్ధాంత పరిజ్ఞానం కింది స్థాయిలో పూర్తిగా లోపించింది. ప్రజాసంఘాల ద్వారా గాక సరాసరి ‘రిక్రూట్‌మెంట్లు’ పెరగడం, అసలే లోపభూయిష్ట వ్యూహాలున్న పార్టీకి కనీస జ్ఞానం కొరవడిన కార్యకర్తలు తోడవ్వడంతో దేశవ్యాప్తంగా పోలీసుల పని చాలా సులువైంది. నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌ రెడ్డి, నరేష్‌లను బెంగుళూరులో పట్టుకుని హెలికాప్టర్‌లో ఇక్కడికి తీసుకొచ్చి ఎన్‌కౌంటర్‌ కథలల్లటం అటుంచితే వాళ్లని పట్టించిన కోవర్టు గోవిందరెడ్డి, అతని కుటుంబం ఎక్కడుందో? అసలుందో లేదో కూడా తెలియదు. 1993లో అర్ధరాత్రి సొంత దళంపై కాల్పులు జరిపిన దళ నాయకుడు కొడిమంజు ఎల్లయ్య అలియాస్‌ భూపతిని చంపిన కత్తుల సమ్మయ్య కథ గుర్తుందా? 1996లో సొంత కృష్ణపట్టి దళ సభ్యుల్ని కాల్చి చంపిన సోమ్లా నాయక్‌ గుర్తున్నాడా? కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కార్యదర్శి విజరుని కాల్చి చంపిన జడల నాగరాజు అనే మావో కోవర్టు గుర్తున్నాడా? ఇంకా నయీం, అతి దారుణమైన మానాల ఎన్‌కౌంటర్‌, 2006లో ప్రకాశం జిల్లాలో రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌, అప్పారావు, పులి అంజయ్య, అనంతపురం జిల్లాలో సుదర్శన్‌, వరంగల్‌ జిల్లాలో టెక్‌ రమణ, పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ఎన్‌కౌంటర్‌ కథ విన్నా దాని వెనుక వున్నది కోవర్టే. వ్యక్తులు చేసిన కోవర్టు ఆపరేషన్లు పక్కన పెడితే చాలా ఎన్‌కౌంటర్‌లకు పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణం కావడం మరో విషాదం.

కాంగ్రెస్‌పై కోపంతో ఎన్‌టియార్‌కి ఓట్లేయిస్తే 5వేల మందితో గ్రేహౌండ్స్‌ దళాన్ని ఏర్పాటు చేసి అనేక మందిని కాల్చి చంపడానికి ఆ ప్రభుత్వం కారణమైంది. ఆ కోపంతో చెన్నారెడ్డికి మద్దతిస్తే ఆయనా అదే పని చేశారు. బెంగుళూరు నాయకుల ఎన్‌కౌంటర్‌కి బాధ్యుడని చంద్రబాబుని దించటానికి కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ‘శాంతి చర్చల’ నెపంతో అడవుల్లోని అనుపానులన్నీ ఆకళింపు చేసుకొని తర్వాత ఆంధ్రలో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవటానికి కృషి చేశారు. ఇన్ని సంఘటనల నుండి కొంచెం కూడా గుణపాఠం నేర్చుకోకుండా అదే తప్పు ఇంకా చెప్పాలంటే అంతకంటే పెద్ద తప్పు బెంగాల్‌లో చేశారు. తత్ఫలితమే కిషన్‌జీలాంటి సమర్థుడైన నాయకుణ్ణి కోల్పోవడం. ఈ విషయాలన్నీ సింహావలోకనం చేసుకుంటే అవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలా? నక్సలైట్లు వారే చేసుకున్న ఆత్మహత్యలా అనిపిస్తుంది.

ఇక్కడ మావోయిస్టులు ఆత్మ పరిశీలన కోసం మరో విషయం కూడా చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎన్‌కౌంటర్‌ జరిగిందంటే ప్రజల్లో స్పందన రకరకాల రూపంలో తీవ్రంగా వుండేది. డా.చాగంటి భాస్కరరావుని శ్రీకాకుళం జిల్లాలో కాల్చి చంపితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని వేల ఇళ్లలో పొయ్యిల్లో పిల్లులు లేవలేదు. చివరగా ఆదిరెడ్డి, సంతోష్‌ రెడ్డి ఎన్‌కౌంటర్‌ తరువాత రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. అజాద్‌, కిషన్‌జీలాంటి అగ్ర నేతలు చంపబడ్డా చాలా యథాలాపంగా వార్తలు చదువుతున్నారు. చూస్తున్నారు. ఒక సాధారణ రోడ్డు ప్రమాద వార్త చూస్తున్నంత సామాన్యంగా ఈ వార్తను కూడా చూసి వేరే చానల్‌లోకి మారిపోతున్నారు.మావోయిస్టులు ఇచ్చే 2 రోజుల బంద్‌ పిలుపులు ఎవరూ ఖాతరు చేయడం లేదు. ప్రజల నుండి మావోయిస్టులు వేరుపడ్డమే దీనికి కారణం. కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులు గాని వారికి ఉండివుంటే -ప్రజా సంఘాలు కానీ ఒక్క ప్రజా సమస్యపై పనిచేసిన దాఖలాలు లేవు. హక్కుల సంఘాలు మొక్కుబడిగా మారాయి. సాహితీ సాంస్కృతిక రంగాల్లో సైతం కొత్తగా కనిపించే స్పందనలు లేవు. ఉత్తేజపరిచే స్థితిలో ఉద్యమాలు లేవు. ఉత్తేజపరిచే నాయకులు లేరు. ఈ కాలక్రమంలో పోలీసుల నుంచే కాదు ప్రజల నుండి కూడా తప్పించుకు తిరిగే పరిస్థితుల్లో విప్లవకారులు ఉండటం ఒక మహా విషాదం.

-చెరుకూరి సత్యనారాయణ

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

పంజాబ్‌లో మూడో ఫ్రంట్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు దగ్గర బంధువు, ఆ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ పాలక శిరోమణి అకాలీదళ్‌ నుంచి విడిపోయి పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) ని ఏర్పాటు చేశారు.   తాను అకాలీదళ్‌, కాంగ్రెస్‌ పార్టీలకు భిన్నమైన విధానాలను అనుసరిస్తానని మన్‌ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పంజాబ్‌ రాజకీయాలు బాదల్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌, కాంగ్రెస్‌ చుట్టూ తిరుగుతూన్నాయి. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా  వామపక్షాలను కలుపుకుని రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను నిర్మించేందుకు పిపిపి కృషి చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకావముంది. పంజాబ్‌లో రాజకీయాలు, ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకత గురించి ది వీక్‌ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మన్‌ప్రీత్‌ సింగ్‌ విపులంగా విశ్లేషించారు. ఆ విశేషాలు….

పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) ఏర్పాటుకు మిమ్మల్ని పురిగొల్పిన అంశమేమిటి?

గత నలబై ఏళ్లలో పంజాబ్‌ అన్నింటా తిరోగమనంలో ఉండడం నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది. విద్య, ఉపాధి, గడచిన 15-20 ఏళ్లలో పేదరిక నిర్మూలన తీరుతెన్నులను ఒక్కసారి పరికించినట్లైతే మీకే తెలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 64 ఏళ్లు గడచినా భారత్‌ కానీ, పంజాబ్‌ కానీ ఆశించిన స్థితికి చేరుకోలేకపోయాయి. భారత దేశానికే తలమానికంగా ఉండాల్సిన పంజాబ్‌ నేడు ఈ స్థితికి దిగజారడానికి కారణమెవరు? 500 ఏళ్ల చరిత్ర మాపై ఉంచిన బాధ్యతల బరువును మోయడానికి ఎన్నడూ వెనుకాడను, సవాల్‌ను చూసి బెదిరిపోయి కాడిని కింద పడేయడం మా తరానికి అసలు నచ్చదు.

ర్యాలీల్లో ప్రజలకు మీరెటువంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారు?

పంజాబ్‌ అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి…అవసరమైతే ఉప్పు కారంతో సంగం రొట్టెతోనే గడపాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. సంపాదించడానికి మరింత కష్టపడాలి. అప్పుడు పేద – ధనికుల మధ్య అంతరాలను చెరిపేయాలి. ఈ విషయాల్నే పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ ప్రజలకు తెలియజెప్తుంది. వారు చెప్పాలనుకునేది వినడం కాదు, మేము చెప్పేదేమిటో వారు వినాలి.

పిపిపి రాజకీయ వ్యూహం ఏమిటి?

గల్లిపోలి పోరాటంలో ముస్తఫా కమల్‌ టర్కిష్‌ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే ధ్యేయంగా ముందుకుసాగాడు. విజయం సాధించాడు. అతని వ్యూహాన్నే నేను అనుసరిస్తున్నాను. ప్రపంచమంతటా రాణిస్తున్న పంజాబీలు ఇక్కడే ఎందుకు రాణించలేకపోతున్నారు? మన పాఠశాల విద్య కుప్పకూలిపోయింది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడడానికి నా దృష్టిలో 12 -15 ఏళ్లు పట్టవచ్చు. పేదరిక తాకిడి 7శాతందాకా ఉన్నది. పంజాబీల్లో చాలా మందిది తుదిదాక పోరాడేతత్వం. వారిలో నిద్రాణంగా ఉన్న ఆత్మస్థయిర్యాన్ని రగుల్కొల్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను.

మీరు ఎదుర్కొంటున్న సవాల్‌ ఏమిటి?

ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని మనం పారదోలాల్సిన అవసరముంది. ఏ సమాజానికైనా న్యాయం చట్టం కలిగివుండడమనేది అత్యంతావశ్యకం. పంజాబ్‌లో నేడు అదే కొరవడింది. పోలీస్‌ సంస్కరణలు పిపిపి ఎజెండాలో మొట్టమొదటి అంశంగా ఉంటుంది. అధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా పంజాబ్‌ ఉన్నా పారిశ్రామి కీకరణకు నోచుకోలేదు. వీటితోబాటు అవినీతిని అరికట్టడంపైన , విద్యపైన దృష్టి పెడతాము. ఇవే పిపిపి ఎన్నికల ఎజెండాల్లో ముఖ్యమైన మైలురాళ్లుగా ఉంటాయి. వీటిని సాధించడం కష్టంతో కూడుకున్న పనే కావచ్చు. కానీ, అసాధ్యమేమీ కాదు. మాకు జనంలో స్పందన కూడా బాగుంది. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అరబ్‌ ప్రజల్లో చైతన్యం ప్రభావం మన ఉపఖండం మీద కూడా ఉంటుంది. ఇది నా గురించి చెబుతున్నది కాదు. సూత్రబద్ధమైన విధానాలు, అభివృద్ధి, సౌభాగ్యం కోసం ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్ష నుంచి ఇది వస్తున్నది. పంజాబ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు.

మీరు కూడా బాదల్‌యే కదా. అలాంటప్పుడు పిపిపిని అకాలీ దళ్‌ చీలిక గ్రూపుగా భావించవచ్చా?/font>

మాది చీలిక గ్రూపు కాదు. అకాలీదళ్‌, దాని ధోరణులు మా ప్రణాళికలో మచ్చుకు కూడా కానరావు. ఏడు మాసాల యవ్వనం గల పిపిపి లౌకికవాద జాతీయపార్టీ. సిపిఐ(ఎం), సిపిఐతో కలిసి సమాజ్‌ మోర్చాను ఏర్పాటుచేశాం. మా కనీస ఉమ్మడి కార్యక్రమ ఆవిష్కరణకు ప్రకాశ్‌కరత్‌, ఎబి బర్దన్‌ వస్తున్నారు. అదే సమయంలో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మ్యానిఫెస్టోలను కలిగివుంటాయి.

మీ పార్టీ సభ్యులు ఏయే తరగతులనుంచి ఎక్కువగా వస్తున్నారు?

పిపిపి సభ్యుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి, తరగతుల నుంచి వచ్చినవారు ఉన్నారు. పార్టీకి యువత వెన్నెముకలా నిలుస్తున్నది. మా పార్టీకి 40 శాతం మద్దతు వీరినుంచే వస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో మేము ఉన్నత ప్రమాణాలను పాటిస్తాము. చాలా వరకు కొత్త ముఖాలే ఉంటాయి. మా విధానం, ఎజెండాతో అంగీకరించినవారే ఇందులో చేరతారు. యువతకు రాజకీయంలో రాటుదేలిన అనుభం లేకపోవచ్చు కానీ, వారు మంచి పౌర ప్రతినిధులు. నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడి మనుమడు, ఆక్స్‌ఫర్డ్‌లో పిహెచ్‌డి చేసిన వ్యక్తి లండన్‌ నుంచి తిరిగి వచ్చి పార్టీ కోసం పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అతనికి మేము టికెట్‌ ఇచ్చాము. ఇటువంటి ప్రతిభ ఉన్నవారిని, వారి మద్దతును పొందేందుకు మేము ప్రయత్నిస్తున్నాము.

వామపక్షాలతో మీ సీట్లసర్దుబాటు ఎలా ఉండబోతుంది?

మొత్తం సీట్లలో 15శాతం సీట్లలో వామపక్షాలు పోటీ చేస్తాయి. మిగతా స్థానాల్లో పిపిపి తన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది.

ఈ ఎన్నికల నుంచి మీరెటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు?

ఫలితాలు ఎలా ఉండబోతున్నదీ నాకు తెలియదు. ప్రజలు ఈ రెండు పార్టీలు (అకాలీదళ్‌, కాంగ్రెస్‌ ) నుంచి మార్పు కోరుకుంటున్నారనే భావం నాకు కలుగుతోంది.