Archive for డిసెంబర్ 1st, 2011

అయ్యప్ప అయ్యప్పే – అబద్ధాలు అబద్ధాలే

‘తమ్ముడు తమ్ముడే – తీర్పు తీర్పే’ చందంగా ‘అయ్యప్ప అయ్యప్పే – అబద్ధాలు అబద్ధాలే’ అన్నట్లుగా కొందరు నల్లగుడ్డల స్వాములు వ్యవహరిస్తున్నారు.
అయ్యప్పలతో ఇటీవలి నా అనుభవాలను చెబితే, ”అదేంటి వాళ్లలా వ్యవహరించకపోతే ఆశ్చర్యపడాలిగానీ” అన్నాడు హేతువాద మిత్రుడు నార్నె వెంకటసుబ్బయ్య.
2011 నవంబరు చివరి వారంలో నా ప్రింటర్‌ పాడయ్యింది. ఆన్‌ చేయగానే పొగలు, ఆ వెంటనే రబ్బరు కాలిన కంపు వచ్చేది. ఒకటికి రెండు పవర్‌ కార్డులు కాలిపోయిన తర్వాత ఇక చేసేదేమీ లేదని, బ్రదర్‌ ప్రింటర్‌ని బాగు చేసేవాళ్ల ఫోను నంబర్లు చెప్పమంటూ ‘జస్ట్‌ డెయిల్‌’ వాళ్లకు ఫోను చేశానో, లేదో బిలబిలమంటూ పాతిక మంది నుంచి స్పందనలు వచ్చాయి. వాళ్లలో మా ఒంగోలుకు పక్కన కదా అని నెల్లూరుకు చెందిన సురేంద్రరెడ్డికి సాదరంగా ఆహ్వానం పలికాను. అప్పుడే ప్రారంభమయింది అబద్ధాల జడివాన. ‘స్వామీ, స్వామీ’ అని సంబోధిస్తుంటే అయ్యప్ప మాల వేశాడని అర్ధం చేసుకున్నాను. హైదరాబాదులో ఏ పని పెట్టుకున్నా సహజంగానే మోసాల్ని కూడా భరాయించక తప్పదని నా అనుభవం. అయ్యప్ప కదా మోసం చేయడేమో అని భ్రమపడ్డాను కూడా. సరే, సురేంద్ర స్వామి ఇంటికి వచ్చి అదీ ఇదీ చెప్పి తన దుకాణంలో చూసిన తర్వాత ఏమి జరిగిందీ, మరమ్మతుకు ఎంత అవుతుందీ అన్న వివరాలను ఫోనులో చెబుతాననీ, ఒప్పుకుంటే బాగుచేసి తీసుకొస్తాననీ చెప్పి ప్రింటరును వెంట తీసుకెళ్లాడు.
చెప్పినట్లుగానే సాయంత్రానికి ఫోను చేశాడు. సర్క్యూట్‌ కాలిపోయిందనీ, దానికి రూ. 1250 ఖర్చవుతుందనీ చెప్పాడు.
”అదేంది స్వామీ, కొత్తదాని ఖరీదే ఐదు వేల రూపాయలు, మరమ్మతుకు నాలుగో వంతా?” అంటూ ప్రశ్నించాను.
”నన్ను నమ్మండి స్వామీ, మీరు జర్నలిస్టు, నేను మిమ్మల్ని మోసం చేస్తానా? అసలు దాని ఖరీదే రూ. 1175 అవుతుంది. మీరు ఎక్కడయినా విచారించుకోండి. మరమ్మతు చేసినందుకు నేను అడిగింది 75 రూపాయలేగా? వివరించాడు స్వామి.
”ఏమో! స్వామీ నాకు తెలియదు. నేను వెయ్యి రూపాయల కన్నా ఒక్క పైసా కూడా ఇవ్వలేను. చేయగలిగితే చేయండి. లేకుంటే నా ప్రింటర్‌ తిరిగివ్వండి” అన్నాను.
స్వామి వెంటనే స్పందించాడు. ఒక అరగంటలో తమ కుర్రవాళ్ల చేత ప్రింటరును పంపిస్తాననీ, వాళ్లతో డబ్బులు పంపమనీ వివరించాడు. నేను సరే అన్నాను.
ఓ గంట తర్వాత స్వామి మనుషులు ప్రింటరు తెచ్చి ఇచ్చి డబ్బు పట్టుకుపోయారు. అయితే దానితోపాటు పవర్‌ కార్డు తీసుకురాకుండా వచ్చారు. అదేమిటని అడిగితే రూ. 50 పెట్టి కొత్తది కొనిచ్చారు.
ఇక్కడ చెప్పవలసిందేమిటంటే …. కొత్త సర్క్యూటే రూ. 1175 అవుతుందని చెప్పిన స్వామి రూ. 950 (నేను వెయ్యి రూపాయలు ఇచ్చినా, రూ. 50 పెట్టి పవర్‌ కార్డు కొన్నారు గదా!)కి ఎలా పనిచేశాడు??
అంటే ఖరీదు విషయంలో అబద్దమన్నా చెప్పి ఉండాలి. లేదా ఏదో మోసం అన్నా చేసి ఉండాలి కదా?? మరి మీరేమంటారు?
మా స్వామిదీ అదే బాట
మా స్వామి అంటే నేను ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా పనిచేస్తోన్న రియల్‌ అడ్వైజర్‌ పత్రిక ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ అన్నమాట. ఆయన కూడా నల్ల చొక్కా, లుంగీ, మెడలో మాల వేసేశాడు మరి.
ఒక సెల్ఫ్‌ యాడ్‌లోనే యాడ్‌ టారిఫ్‌ను కూడా డిజైను చేయించి పెట్టమని నాకు ఆయన సూచించాడు. నేను ఆయన ఆదేశం ప్రకారం డిజైను చేయించాను.
అయితే పత్రిక ప్రచురణకు వెళ్తున్న సమయంలో అది ఆయన కంటబడింది.
”ఇదేంటి ఇలా డిజైను చేయించావు. యాడ్‌ టారిప్‌ వేరుగా పెడుతున్నాము గదా? అడిగాడు ఎడిటర్‌ స్వామి.
”మీరేగదా అలా చేయించమని చెప్పింది” నా సమాధానం.
”ఏంటీ నేను చెప్పానా?” రాయని భాస్కరుడిగారి హూంకారం.
”అవును, మీరే చెప్పారు.” నా సమర్థన.
”అబ్బే నేను చెప్పలా” మళ్లీ గద్దింపు.
”మీరు చెప్పకుండా యాడ్స్‌ విషయంలో నేను సొంత నిర్ణయం ఎప్పుడూ చేయలేదుగదా! ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తాను? నా ప్రశ్న.
”మార్పించండి, మార్పించండి” చేసేదేమీ లేక దారికొచ్చాడు పబ్లిషర్‌.
ఇక్కడ మా స్వామి కూడా నిరభ్యంతరంగా అబద్ధాలు అడేశాడు.
మరి మీరేమంటారు??
చాన్నాళ్లనాటి ఓ జ్ఞాపకం
అది 1997గానీ 1998గానీ అని గుర్తు. నెలేమో డిసెంబరు. ఒంగోలులో కర్నూలురోడ్డు నుంచి మా ఇంటికి వెళ్లే దోవలో బ్లూఫ్లాక్స్‌ బార్‌ ఉండేది. అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. నేను ఇంటికి వెళ్లున్నాను. ఆ సమయంలో ఓ స్వామి బార్‌ లోపల ప్రహరీకి ఆనుకుని కనపడటంతో ఆసక్తిగా గమనించాను.
”రారా, మాలదేముంది? కాసేపు పక్కనపడేసి పనిపూర్తయిన తర్వాత మళ్లీ వేసుకోవచ్చు” ఇవే పదాలు కాకపోయినా, ఇదే అర్ధంతో లోపలున్న స్వామి బయటున్న మరో స్వామితో అన్నాడు.
”ఏమోరా, నాకు భయం. అయినా, తాగుడెక్కువయిందనేగదా మాలేసింది?”
”నాలుక పీకుతుందిరా, నువ్వు వస్తే రా, లేకపోతే గుడికెళ్లు, నేను సాయంత్రం పూజకు వస్తాను.” బారు లోపలకు వెళ్లిపోయాడు. రెండో వాడు మాత్రం వెళ్లిపోయాడు.
ఇదండీ అయ్యప్పలకు సంబంధించి నా పాత జ్ఞాపకం. మరి ఈ సంఘటనపై మీరేమంటారు??