నిజమైన ప్రపంచం మీడియాకు వెలుపల ఉంది – వి.శ్రీనివాసరావు

ప్రజలు, ప్రజా ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిబింబించే సరికొత్త ప్రజాస్వామిక మీడియా తలెత్తుతోంది. రానున్న కాలంలో అదే ప్రజలకు చిరునామా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టెక్నాలజీ దోపిడీదార్లకు లాభాలు సంపాదించిపెట్టే సాధనమయితే ప్రజలకు అదొక పోరాట సాధనంగా కూడా పనికొస్తుంది. అర చేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేనట్లే అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజల కళ్లుకప్పలేమని కార్పొరేట్‌ మీడియా గుర్తించాలి. మీడియా పరిధిని దాటి ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వారి చైతన్యం కట్టలు తెంచుకుని పాలకులకు ఉరితాళ్లుగా మారతాయి. క్రీస్తు అన్నట్లుగా ”నువ్వు సత్యాన్ని తెలుసుకో. సత్యమే నీకు స్వేఛ్చనిస్తుంది.”

ప్రపంచీకరణ తర్వాత సమాచార విప్లవం ప్రజ్వరిల్లింది. ప్రతి క్షణం ఏం జరుగుతుందో బ్రేకింగ్‌ న్యూస్‌- ఆర్థ్దిక, రాజకీయ, సామాజిక పరిణామాలపై విశ్లేషణలు- ఇలా చూసుకుంటే రెండు దశాబ్దాల క్రితం నాటి కన్నా నేడు మనిషి సత్యానికి చాలా దగ్గరగా ఉండాలి. కాని వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. జరుగుతున్నదొకటి- మీడియా చూపేది, రాసేది, విశ్లేషించేదీ- మరొకటి. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా లేక స్వంత రాజకీయ ఎజెండాలకు సాధనాలా? అన్న సందేహం సామాన్య పాఠకులకు కలుగకమానదు. ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా గాక తమ ఆలోచనలను ప్రజలపై రుద్దే సాధనంగా మీడియా మారింది. ప్రజల కోసం మీడియా అన్న భావం పోయి, లాభం కోసం మీడియా అన్న రోజులొచ్చాయి. దీనికి ప్రాతినిధ్యం వహించేదే కార్పోరేట్‌ మీడియా. రాజకీయ నాయకులు మీడియాను తమ రాజకీయపరమపదసోపాన పటంలో నిచ్చెనమెట్లుగా భావిస్తున్నారు. ప్రజల్ని వదిలేసి మీడియాలో కనిపిస్తే చాలు పదవులు పరిగెత్తుకుంటూ వస్తాయని భ్రమిస్తూ మీడియా మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యమకారులు సైతం కొన్ని సందర్భాల్లో మీడియా భ్రమల్లో పడి మౌఖిక ప్రచారం ఆవశ్యకతను విస్మరిస్తుంటారు.

రాష్ట్రానికి వెలుపల ఉన్న తెలుగువారికి మీడియానే గుండె చప్పుడు. మీడియా ద్వారా తాము రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్నట్లు భావిస్తారు. ఆ రకంగా రాష్ట్రం ముఖాన్ని అద్దంలో చూస్తుంటారు. కాని ఇటీవల అది తలకిందులుగా కనిపిస్తోంది. ఏరోజు పత్రికలు తిరగేసినా బ్యానర్‌ స్టోరీలు తమ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేవే. సాక్షిలో అవినీతి ఎంత జరిగిందో ఒకరు రాస్తే, ఈనాడు ఎన్ని కుంభకోణాలకు పాల్పడిందో మరొకరు రాస్తారు. మధ్యలో ప్రజల స్థానమెక్కడీ అవినీతిపై యుద్ధమా? అవినీతిని కప్పెట్టుకునే మార్గమా? మీడియా తీరు చూస్తుంటే అంతుబట్టదు. రాజకీయ నాయకులను మించి సవాళ్లు, ప్రతిసవాళ్లు అడ్డగోలుగా విసురుకుంటున్నాయి. తాము నిర్దోషులమని ప్రజల ముందు నిరూపించుకోవాల్సిన వారే అవతల వారు తమ కన్నా పెద్ద అవినీతిపరులని చెప్పడం ద్వారా తమ అవినీతి కనపడకుండా చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఎవరికి వారే తాము ప్రజల పక్షం, అవతలివారు శత్రుపక్షం అన్నట్లుగా తమ రచనాకౌశల్యం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గీతను చిన్నది చేయాలంటే దానికి ముందు పెద్దగీత గీయాలన్న (”సాపేక్ష సిద్దాంతాన్ని”) తిమ్మరుసు మంత్రాన్ని వీరు చక్కగా అర్థం చేసుకున్నారు. వామపక్ష పత్రికలను మినహాయిస్తే దాదాపు మొత్తం మీడియా అటో ఇటో చీలిపోయినట్లు కనిపిస్తున్నది. ఒక పార్టీ నాయకుడు తన అవినీతిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోతే తప్పు అని తీవ్రంగా ఖండించేవారే మరో పార్టీ నాయకుడు కూడా ఇదే చేస్తే శభాష్‌ అంటుంది. మీడియా వృత్తిధర్మం ఇదేనా? దొంగలు దొంగలు తిట్టుకుంటే ఊర్లో పెద్దమనుషుల పేర్లన్నీ బయటకు వచ్చినట్లే ఈ చెడులో కూడా ఒక మంచి జరుగుతోంది. ”పెద్దమనుషుల” అవతారాలను జనం అర్థ్దం చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో కరువు కాటకాలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగుల ఆక్రందనలు, ఉద్యోగులు, కార్మికుల వీధి పోరాటాలు మీడియా కెమెరాలకు చిక్కవు. పత్రికల్లో ఏదో ఒక మూల అదీ జిల్లా టాబ్లాయిడ్‌లో స్లిప్‌ పేజీలో ఒక మూలన వేస్తాయి. ప్రత్యేక కథనాల పేరిట స్పెక్యులేటివ్‌ న్యూస్‌కు పెద్దపీట వేసి పాఠకులను జూదంలోకి దింపుతాయి.

పాలకుల బంటుగా కార్పోరేట్‌ మీడియా:

జాతీయ, అంతర్జాతీయ మీడియా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇటీవల కేంద్రం రిటైల్‌ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ”అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న” అన్నట్లుగా పాలకులను మించి మీడియా దాన్ని ప్రతిభావంతంగా సమర్థిస్తోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు- పాలక పార్టీలలోని కొంత మంది సహా – ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, నాలుగు కోట్ల మంది రిటైల్‌ వ్యాపారులు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు- వ్యతిరేకిస్తున్నా వారి మాటకు పూచికపుల్ల విలువివ్వడంలేదు మీడియా. పార్టీల వ్యతిరేకతను రాజకీయమంటూ కొట్టిపారేస్తున్నది. వ్యాపారుల వ్యతిరేకతను భ్రమ కింద జమ కడుతోంది. ఇదే మీడియా రిటైల్‌పై అమెరికా రాయబారి బహిరంగ జోక్యాన్ని మాటమాత్రంగా కూడా ఖండించడం లేదు. భారత ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా పాలకులు, కార్పొరేట్‌ కంపెనీలు ఎందుకు ఆనందంగా ఉన్నాయో గుర్తించడం లేదు.ప్రజల ఆందోళన ఒకవైపు, కంపెనీల ఆనందం మరోవైపు. మీడియా ఎవరి పక్షం? పైగా వారు మన ఉద్ధరణ కోసమే వస్తున్నట్లు చూపుతోంది. ఢిల్లీ వీధుల్లో ఈ మధ్యనే దాదాపు లక్షమంది కార్మికులు, ఉద్యోగులు పింఛను బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తే అసలు పట్టించుకోలేదు. పెన్షన్‌ ఫండ్‌ ప్రైవేటీకరణను కార్పొరేట్‌ మీడియా బలపరుస్తోంది. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వపక్షం వహించి ప్రజాఉద్యమాల తీవ్రతను తగ్గించాలని చూస్తోంది. స్వాతంత్య్రోద్యమంలో, ఎమర్జన్సీకి వ్యతిరేకంగా, ఎన్టీయార్‌ ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చినపుడు నిర్వహించిన పాత్రకు భిన్నంగా నేడు మీడియా వ్యవహరిస్తోంది.

అసత్యం కన్నా అర్థసత్యం అత్యంత ప్రమాదకరమైంది:

మీడియా కళలో అతి ముఖ్యమైన సాధనం అర్ధ సత్యం. అబద్ధాలు, అసత్యాలు రాస్తే ప్రజలు సులభంగా గ్రహిస్తారు. కానీ, ఒక నిజం చెప్పి దాని మాటున పది అబద్ధాలు చలామణి చేసే కళలో కార్పొరేట్‌ మీడియా ఆరితేరింది. దేశీయ మీడియాలోకి కూడా విదేశీ పెట్టుబడులు దొడ్డిదారిన ప్రవేశిస్తున్నాయి. పరోక్షంగా అంతర్జాతీయ మీడియాతో జాతీయ మీడియా కుమ్మక్కవుతోంది. వీరి కాలమ్స్‌, వ్యాసాలు ప్రత్యేక పేజీలతో వస్తున్నాయి. ఇండియా ఎడిషన్లు విదేశాల నుండి నడుపుతున్నారు. ఆ విధంగా మీడియా కంపెనీల ప్రయోజనాలు, పాలకవర్గాల ప్రయోజనాలతో మిళితమైపోతున్నాయి. యాడ్స్‌, వార్తలు కలగలసిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి రానున్న ప్రమాదానికి ఇవి సూచికలు.

మీడియాలో వచ్చిందే వార్త. అదే సత్యం అనుకోమంటున్నారు. కానీ, మీడియాతో సంబంధం లేకుండానే అనేక సంఘటనలు జరిగిపోతున్నాయి. మీడియా కళ్లుతెరిచేసరికి పరిణామాలు మారిపోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనివార్యంగా తమ విధానాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవడానికి అంతర్జాతీయ మీడియా తంటాలు పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలను పరిశీలిద్దాం.

‘వాల్‌స్ట్రీట్‌ ముట్టడి’ ఇప్పుడు ప్రఖ్యాతిగాంచింది. అమెరికా వర్తమాన చరిత్రలో ఇదో పెద్ద ఉద్యమం. కానీ, మీడియా దాన్ని గుర్తించి ప్రపంచానికి తెలిపింది అది ఆరంభమైన పదిహేను రోజులకు. అంతవరకు అది నిద్రపోతున్నదా? లేక నిద్రపోతున్నట్లు నటించిందా? రెండోదే కరెక్టు. ఈ ఉద్యమానికి ”మీడియా” మద్దతు లేదు. వారసలు ఈ ఉద్యమ సన్నాహాలకు తోడ్పడనే లేదు. అయినా ‘మీడియా’తో నిమిత్తం లేకుండానే అది అమెరికా సరిహద్దులు కూడా దాటి ప్రపంచాన్ని ఆవహించింది. ‘మీడియా’ సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమిది. జులైలో ‘వాల్‌స్ట్రీట్‌ ముట్టడి’కి నిర్ణాయక ప్రకటన వెలువడింది. ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌, బ్లాగులు, ఫోన్లద్వారా ఇది విస్తరించింది. ఇవన్నీ సంప్రదాయ మీడియా అన్న అర్దంలో దాని కిందికిరావు. నోటి మాటద్వారా ప్రచారం అన్న పురాతన కాలం నాటి ప్రక్రియకు ఆధునిక రూపం. ”వర్డు టు మౌత్‌” పేరుతో నేడిది ప్రసిద్ధి చెందింది. తమ ఉద్యమ సన్నాహాల గురించి ఏ కార్పొరేట్‌ మీడియా ప్రచారం ఇవ్వకపోయినా ఆందోళనకారులు పట్టించుకోలేదు. తమ సొంత ప్రచార సాధనాలపైనే వారు ఆధారపడ్డారు. దీనికి ఖర్చు తక్కువ. ప్రచారం ఎక్కువ. ప్రజల హృదయాల్లో చెలరేగుతున్న ఆందోళన, అసహనాన్ని గొప్పలు చెప్పుకునే అమెరికా మీడియా గుర్తించలేకపోయింది. ముట్టడి చేపట్టిన ఉద్యమకారులే సొంతంగా వీడియోలు తీసి ‘నెట్‌’ ద్వారా ప్రపంచానికి ఏరోజుకారోజు అందించగలిగారు. యుస్ట్రీమ్‌ వంటి సాధనాల ద్వారా ‘లైవ్‌ కవరేజ్‌’ ఇచ్చారు. ఆలస్యంగా మేల్కొన్న ‘మీడియా’ కొద్ది రోజులకే స్వరం మార్చి ఆ ఉద్యమానికి ‘కమ్యూనిస్టు’, ‘ వామపక్ష”, ఉగ్రవాద’ ముద్రలు వేసి అణచడానికి పాలకులకు పరోక్షంగా ఆయుధాలు, సాక్ష్యాలు సమకూర్చే ‘పవిత్ర’ కర్తవ్యాన్ని చేపట్టింది.

ఈ కాలంలో జరిగిన మరో ముఖ్యమైన ఘటన అరబ్‌ దేశాలలో వెల్లివిరిసిన ప్రజాస్వామ్య సంరంభం. ట్యునీషియాతో ఆరంభమై ఈజిప్టును కుదిపేసిన ఘటనలపై మీడియా ఏం చేసింది? తహ్రీర్‌ మైదానంలో లక్షలాది మంది గుమికూడిన తరువాతనే మీడియాకు స్పృహ వచ్చింది. అంతకు ముందు అంత తీవ్రమైన అశాంతి ఈజిప్టు ప్రజల్లో ఉన్నట్లు కనీసం చూచాయగానైనా మీడియా గుర్తించిందా? ఎందుకు విఫలమైంది? ఈ ఘటనలకు పదినెలల ముందే ‘ఆల్‌ అశ్వని’ అనే ప్రఖ్యాత రచయిత కొద్ది రోజుల్లో ఈజిప్టును కుదిపేసే ఘటనలు జరగబోతున్నాయని రాశారు. తరువాత ఆ ఉద్యమంలో ఆయన కూడా ముఖ్యపాత్ర వహించారు. ఈ ఉద్యమానికి ముందు అనేక సమ్మెలు జరిగాయి. స్థానికంగా జరిగిన అనేక ఆందోళనలను ముబారక్‌ ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేసింది. ఇక ప్రజా ఉద్యమాలు కోలుకోలేవన్న అంచనాకు మీడియా వచ్చింది. కానీ, అంతిమంగా ప్రజాస్వామ్యం పైచేయి సాధించింది. ఇప్పుడు దాన్ని హైజాక్‌ చేసేందుకు మిలిటరీని అడ్డం పెట్టుకుని అమెరికా నాటకాలాడుతోంది. ఈ నాటకాన్ని మన కళ్లకు కనిపించకుండా చేయడానికి ‘మీడియా’ నానా తంటాలు పడుతోంది. వాల్‌స్ట్రీట్‌ ముట్టడికి ముందు కూడా అమెరికాలో విన్‌స్కాన్సిన్‌ వంటి చోట్ల ఫ్యాక్టరీల ముట్టడి జరిగింది. ఉపాధి కోసం ఉద్యమాలు నడిచాయి. ఇప్పుడు యూరపులో సమ్మెల వెల్లువ. పార్లమెంటు ముట్టడి. కాల్పులు- ఇంగ్లండ్‌లో సమ్మెలు, ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఆఖరికి జర్మనీలో సైతం అస్థిరత చోటు చేసుకుంది. దీనినుండి బయటపడేందుకు ‘ఉపాయాలు’ చెప్పే పనిలో మీడియా నిమగమైంది తప్ప ప్రజల హృదయ ఘోషను వినిపించడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి బాధ్యతను స్వీకరించిన వామపక్ష, అభ్యుదయ మీడియాను ఎగతాళి చేయడానికి స్థలం, సమయం వెచ్చిస్తోంది.వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘వికీ లీక్స్‌’ వంటి సరికొత్త ప్రజాస్వామ్య సాధనాలు మీడియాకు ప్రతినిధిగా నిలబడుతున్నాయి. దాని అధినేత అసాంజేను కుట్ర చేసి కేసులు పెట్టి దెబ్బతీయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు.

కార్పోరేట్‌ మీడియా వర్సెస్‌ ప్రజాస్వామిక మీడియా

తాజా ప్రపంచ పరిణామాలు ఉదయిస్తున్న సూర్యుని పోలి ఉన్నాయి. చీకట్లు పారదోలుకొని వెలుగు కోసం ప్రయత్నిస్తున్న ప్రపంచానికి ఈ సరికొత్త మీడియానే ద్వారాలు తెరుస్తోంది. కార్పొరేట్‌ మీడియా కళ్లు తెరుస్తుందో లేక లాభాల వేటలో శాశ్వతంగా కళ్లు పోగొట్టుకుంటుందో చూద్దాం. ప్రజలు, ప్రజా ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిబింబించే సరికొత్త ప్రజాస్వామిక మీడియా తలెత్తుతోంది. రానున్న కాలంలో అదే ప్రజలకు చిరునామా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టెక్నాలజీ దోపిడీదార్లకు లాభాలు సంపాదించిపెట్టే సాధనమయితే ప్రజలకు అదొక పోరాట సాధనంగా కూడా పనికొస్తుంది. అర చేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేనట్లే అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజల కళ్లుకప్పలేమని కార్పొరేట్‌ మీడియా గుర్తించాలి. మీడియా పరిధిని దాటి ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వారి చైతన్యం కట్టలు తెంచుకుని పాలకులకు ఉరితాళ్లుగా మారతాయి. క్రీస్తు అన్నట్లుగా ”నువ్వు సత్యాన్ని తెలుసుకో. సత్యమే నీకు స్వేఛ్చనిస్తుంది.’

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

 1. నిజం చెప్పారు
  మరి ముఖ్యంగా తెలుగు మీడియ , పూర్తి గా నాసిరాకంగా మారిండి

  స్పందించండి

 2. good nd thought provoking post

  స్పందించండి

 3. నిజం చెప్పారు
  మరి ముఖ్యంగా తెలుగు మీడియ , పూర్తి గా నాసిరాకంగా మారిండి ee vaartha nu naa book lo (successnews) prachuristhanu mee neme thank you

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: