కప్పల కోసం నిలబడతానంటూ మాటలు
పాముల కోసం జేపి అను జయప్రకాష్ నారాయణ చేతలు
నిజం నిలకడ మీదగానీ తెలియదంటారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ లోపలి మనిషి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. తమ రాజకీయ దళం ప్రజల సత్తాను వెలికితీస్తుందని జేపి చెప్పుకోవటం ఇక ఎంత మాత్రమూ సాగదు. తన లోపలి మనిషి నమ్మే చెత్తాచెదారాన్నంతా ప్రజల మీద రుద్దే ప్రయత్నాల గుట్టును విప్పి చెప్పకపోతే ముందు ముందు ఈ జేపీ కాంగ్రెసుకన్నా, బిజేపికన్నా, తెలుగుదేశంకన్నా, టిఆర్‌ఎస్‌కన్నా ప్రమాద స్థాయికి చేరతాడన్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. అందుకనే కొంత ఆలస్యం అయినా తెలుగిల్లు చెత్తాచెదారాన్ని చెరిగిపారేసే పనిని నెత్తికెత్తుకుంది.
అనగనగా ఓ పాము – కప్ప కథ
అనగనగనగా తెనుగుపురం గ్రామం. ఆ గ్రామంలో ఉందో వూరచెరువు. ఆ చెరువు ఒడ్డున పొదల్లో ఓ పాము ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. చెరువులో ఓ కప్ప ఉంటోంది. ఓ రోజు కప్ప ఏమరపాటుగా ఉండగా అదును చూసి పాము దానిని నోట కరచుకుంది. ఇంకేముంది రెండింటి మధ్యా పోరాటం ప్రారంభమయింది. దాంతో ఒక్కొక్కరుగా ఆ దృశ్యాన్ని చూసేందుకుగాను గ్రామ ప్రజలంతా అక్కడ చేరిపోయారు. కొంత సమయం గడిచేసరికి గ్రామస్తుల్లో మూడు చీలికలు ఏర్పడ్డాయి. వాళ్లలో కొందరు కప్పపట్ల సానుభూతి ప్రకటించారు. సాధు జంతువు కప్పను పాము మింగాలనుకోవటం నేరమని నిరసన తెలిపారు. మరి కొందరు పాముకు మద్దతు పలికారు. పాము కప్పను తినటం ప్రకృతి సహజమని వివరించబూనుకున్నారు. తన కన్నా బలవంతుడిని తినటం సాధ్యం కాదు గనుక కప్పను తినటం పాము సహజ లక్షణమని ప్రకటించారు. ఇంకా మిగిలిన కొందరు తాము కప్ప వైపూ కాదనీ, పాముకీ మద్దతు పలకబోమంటూ తలలు ఎగరేస్తూ చెప్పుకున్నారు. ఈ మూడు ముఠాల మధ్యా వాగ్వివాదం ముదిరి తగాదాకు దారితీసింది. కొందరు కోపం పట్టలేక ప్రత్యర్థులను చావబాదేందుకని కర్రలు కూడా తీశారు. అదే సమయంలో అటు వెళ్తూ పరిస్థితిని గమనించిన ఆ ఊరి సర్పంచి ఎటు వారిని అటు నెట్టివేసి కొట్లాట జరక్కుండా నివారించాడు. ఉద్రిక్తత సద్దుమణిగాక అసలు ఏమి జరిగిందో చెప్పమంటూ వాకబు చేశాడు. ఓ నోటిగలాయన అంతా పూసగుచ్చినట్లు వివరించాడు. అంతా విన్న సర్పంచి తన తీర్పు చెప్పాడు. ఎక్కువ మంది గ్రామస్తులు పామును సమర్ధిస్తున్నందున వారు చెప్పిందే వేదమని ప్రకటించాడు. దీంతో కప్పను సమర్థిస్తోన్న వర్గానికి చెందిన నాయకులు కొందరు ముందుకు వచ్చి ”అదెలా? ఇద్దరం సమానంగానే ఉన్నాం. కావాలంటే వరుసల్లో నిలబెట్టి లెక్క వేయండి” అంటూ సవాలు విసిరారు. అయితే వారి వాదనను సర్పంచి తిరస్కరించాడు. ”పిచ్చోళ్లారా! మూడో వర్గాన్ని పక్కనబెడితే మీరిద్దరూ సమాన సంఖ్యలోనే ఉన్నారు. కానీ వాళ్లను కూడా పాములోళ్లతో కలుపుకుంటే ఎక్కువకదా? అంటూ ఎగాదిగా చూశాడు సర్పంచి. అదెలా అటూ, ఇటూ, ఎటూ లేమన్నవాళ్లను పాముకి మద్దతుదారులతో ఎలా కలుపుతారు! మళ్లీ పలు కంఠాలు ప్రశ్నించాయి.
అప్పుడిక వివరంగా చెప్పక తప్పదనిపించింది సర్పంచికి.
”ఇక్కడ ఏమి జరుగుతుంటే మీరంతా మూడు ముఠాలుగా విడిపోయారు?” సర్పంచి ప్రశ్నించాడు.
”పాము కప్పను మింగుతుంటే చూసి” జవాబిచ్చారు జనం.
”అట్ల చెప్పండి. ఇప్పుడు దారికొచ్చారు. మీలో కొందరు పాము అఘాయిత్యాన్ని చూడలేక కప్పకు మద్దతు పలికారు. మరి కొందరు ప్రకృతి ధర్మమంటూ పామును సమర్ధించారు. మీ ఇద్దరితో సమస్య లేదు. ఎవరు ఎటు ఉన్నారో తేలిగ్గానే అందరికీ అర్ధం అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి మూడో వర్గం ఏమని చెప్పింది?
”అటూగాదు ఇటూకాదు అని”
”కదా అంటే వాళ్లు కప్పను సమర్ధించటం లేదు, అవునా?
”అవును, అవును” జనం నుంచి కేకలు
”మరి వాళ్లు పాముకు మద్దతు పలికారా?” సర్పంచి మరో ప్రశ్న.
”లేదు … లేదు” కొందరి అరుపులు.
”అదేనర్రా, మిమ్మల్ని అందరూ అమాయకులు అనేది అందుకే. మరి వాళ్లు కప్పను పాము తినటాన్ని వ్యతిరేకించారా? లేదే. అంటే వాళ్లు చెప్పింది ఏమయినా, గోడ మీద పిల్లి మాదిరిగా వ్యవహరించినందున వాళ్లు వాస్తవంలో పాముకి మద్దతు పలికినట్లే కదా! అందుకనే నేను అటూ ఇటూ ఎటూ కాదన్నవాళ్లను కూడా పాముకు మద్దతుదారులుగానే లెక్క వేశాను. ఏమంటారు?”
ఎవ్వరూ ఏమీ పలక్క పోవటంతో సర్పంచి లేచి వెళ్లిపోయాడు. సర్పంచి తీర్పు తనకు అనుకూలంగా రావటంతో పాము గబగబా మహా సంతోషంతో కప్పను మింగేసింది. బ్రేవ్ మంటూ తేపి తన పొదల్లోకి జారుకుంది. పొట్ట నిండటంతో నిద్ర తన్నుకొచ్చింది. అంతే హాయిగా పాము నిద్రలోకి జారిపోయింది.
అదండీ సంగతి! జేపీదీ పైకి చూసేందుకు మూడో వర్గమేగానీ, వాస్తవంగా పరిశీలించి చూస్తే మాత్రం పాముల్లాంటి కాంగ్రెసు వైపేనని తేలిపోలేదూ!
పైగా ఓటు వేయనివాళ్లంతా దేశ ద్రోహులని రోజూ శాపనార్థాలు పెట్టే జెపి తనదాకా వచ్చేసరికి ఓటును ఎందుకు మురగేసినట్లు? అదేమంటే తనది నిరసన ఓటని వివరించకోవటం ఒట్టి బూటకం కాదూ! ఓటేయటానికి ఇష్టం లేని వారిలో అత్యధికులు చెప్పేది అదేగదా. ఏ దొంగ వెధవకూ ఓటేయటం ఇష్టం లేక ఇంట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేశామనేకదూ! వాళ్లు చెప్పేది. మరి ఓటర్లుకు లేని ప్రత్యేకత జేపీకి ఎక్కడ నుంచి వచ్చినట్లో?
అంతేనా! కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకుగాను తీవ్రంగా కృషి సల్పుతున్నాడని కూడా జెపి సిగ్గూ ఎగ్గూ లేకుండా కితాబులు కూడా మెడలో వేసేశాడు. కృషి సల్పుతున్నాడా? వీలులేని పరిస్థితుల్లో అలా నటిస్తున్నాడా? జవాబు చెప్పాల్సింది జెపీయే.
మాటల కోటలెక్కి
లెక్కల మూటలు దొర్లించే జెపీజీ
దోవ మళ్లించి జవాబివ్వటం మీకు వెన్నతో పెట్టిన విద్య
బాగా మాగిన బంగినపల్లిని జుర్రుకున్నంత!
మరి, మీరేమంటారు ?????!!!!!