పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు దగ్గర బంధువు, ఆ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్ పాలక శిరోమణి అకాలీదళ్ నుంచి విడిపోయి పంజాబ్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ని ఏర్పాటు చేశారు. తాను అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలకు భిన్నమైన విధానాలను అనుసరిస్తానని మన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబ్ రాజకీయాలు బాదల్ నేతృత్వంలోని అకాలీదళ్, కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూన్నాయి. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా వామపక్షాలను కలుపుకుని రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను నిర్మించేందుకు పిపిపి కృషి చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకావముంది. పంజాబ్‌లో రాజకీయాలు, ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకత గురించి ది వీక్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మన్‌ప్రీత్ సింగ్ విపులంగా విశ్లేషించారు. ఆ విశేషాలు….
పంజాబ్ పీపుల్స్ పార్టీ (పిపిపి) ఏర్పాటుకు మిమ్మల్ని పురిగొల్పిన అంశమేమిటి?
గత నలబై ఏళ్లలో పంజాబ్ అన్నింటా తిరోగమనంలో ఉండడం నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది. విద్య, ఉపాధి, గడచిన 15-20 ఏళ్లలో పేదరిక నిర్మూలన తీరుతెన్నులను ఒక్కసారి పరికించినట్లైతే మీకే తెలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 64 ఏళ్లు గడచినా భారత్ కానీ, పంజాబ్ కానీ ఆశించిన స్థితికి చేరుకోలేకపోయాయి. భారత దేశానికే తలమానికంగా ఉండాల్సిన పంజాబ్ నేడు ఈ స్థితికి దిగజారడానికి కారణమెవరు? 500 ఏళ్ల చరిత్ర మాపై ఉంచిన బాధ్యతల బరువును మోయడానికి ఎన్నడూ వెనుకాడను, సవాల్‌ను చూసి బెదిరిపోయి కాడిని కింద పడేయడం మా తరానికి అసలు నచ్చదు.
ర్యాలీల్లో ప్రజలకు మీరెటువంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారు?
పంజాబ్ అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి…అవసరమైతే ఉప్పు కారంతో సంగం రొట్టెతోనే గడపాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. సంపాదించడానికి మరింత కష్టపడాలి. అప్పుడు పేద – ధనికుల మధ్య అంతరాలను చెరిపేయాలి. ఈ విషయాల్నే పంజాబ్ పీపుల్స్ పార్టీ ప్రజలకు తెలియజెప్తుంది. వారు చెప్పాలనుకునేది వినడం కాదు, మేము చెప్పేదేమిటో వారు వినాలి.
పిపిపి రాజకీయ వ్యూహం ఏమిటి?
గల్లిపోలి పోరాటంలో ముస్తఫా కమల్ టర్కిష్ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే ధ్యేయంగా ముందుకుసాగాడు. విజయం సాధించాడు. అతని వ్యూహాన్నే నేను అనుసరిస్తున్నాను. ప్రపంచమంతటా రాణిస్తున్న పంజాబీలు ఇక్కడే ఎందుకు రాణించలేకపోతున్నారు? మన పాఠశాల విద్య కుప్పకూలిపోయింది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడడానికి నా దృష్టిలో 12 -15 ఏళ్లు పట్టవచ్చు. పేదరిక తాకిడి 7శాతందాకా ఉన్నది. పంజాబీల్లో చాలా మందిది తుదిదాక పోరాడేతత్వం. వారిలో నిద్రాణంగా ఉన్న ఆత్మస్థయిర్యాన్ని రగుల్కొల్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
మీరు ఎదుర్కొంటున్న సవాల్ ఏమిటి?
ఫ్యూడల్ మనస్తత్వాన్ని మనం పారదోలాల్సిన అవసరముంది. ఏ సమాజానికైనా న్యాయం చట్టం కలిగివుండడమనేది అత్యంతావశ్యకం. పంజాబ్‌లో నేడు అదే కొరవడింది. పోలీస్ సంస్కరణలు పిపిపి ఎజెండాలో మొట్టమొదటి అంశంగా ఉంటుంది. అధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా పంజాబ్ ఉన్నా పారిశ్రామి కీకరణకు నోచుకోలేదు. వీటితోబాటు అవినీతిని అరికట్టడంపైన , విద్యపైన దృష్టి పెడతాము. ఇవే పిపిపి ఎన్నికల ఎజెండాల్లో ముఖ్యమైన మైలురాళ్లుగా ఉంటాయి. వీటిని సాధించడం కష్టంతో కూడుకున్న పనే కావచ్చు. కానీ, అసాధ్యమేమీ కాదు. మాకు జనంలో స్పందన కూడా బాగుంది. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అరబ్ ప్రజల్లో చైతన్యం ప్రభావం మన ఉపఖండం మీద కూడా ఉంటుంది. ఇది నా గురించి చెబుతున్నది కాదు. సూత్రబద్ధమైన విధానాలు, అభివృద్ధి, సౌభాగ్యం కోసం ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్ష నుంచి ఇది వస్తున్నది. పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు.
మీరు కూడా బాదల్‌యే కదా. అలాంటప్పుడు పిపిపిని అకాలీ దళ్ చీలిక గ్రూపుగా భావించవచ్చా?/font>
మాది చీలిక గ్రూపు కాదు. అకాలీదళ్, దాని ధోరణులు మా ప్రణాళికలో మచ్చుకు కూడా కానరావు. ఏడు మాసాల యవ్వనం గల పిపిపి లౌకికవాద జాతీయపార్టీ. సిపిఐ(ఎం), సిపిఐతో కలిసి సమాజ్ మోర్చాను ఏర్పాటుచేశాం. మా కనీస ఉమ్మడి కార్యక్రమ ఆవిష్కరణకు ప్రకాశ్‌కరత్, ఎబి బర్దన్ వస్తున్నారు. అదే సమయంలో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మ్యానిఫెస్టోలను కలిగివుంటాయి.
మీ పార్టీ సభ్యులు ఏయే తరగతులనుంచి ఎక్కువగా వస్తున్నారు?
పిపిపి సభ్యుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి, తరగతుల నుంచి వచ్చినవారు ఉన్నారు. పార్టీకి యువత వెన్నెముకలా నిలుస్తున్నది. మా పార్టీకి 40 శాతం మద్దతు వీరినుంచే వస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో మేము ఉన్నత ప్రమాణాలను పాటిస్తాము. చాలా వరకు కొత్త ముఖాలే ఉంటాయి. మా విధానం, ఎజెండాతో అంగీకరించినవారే ఇందులో చేరతారు. యువతకు రాజకీయంలో రాటుదేలిన అనుభం లేకపోవచ్చు కానీ, వారు మంచి పౌర ప్రతినిధులు. నేతాజి సుభాష్ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడి మనుమడు, ఆక్స్‌ఫర్డ్‌లో పిహెచ్‌డి చేసిన వ్యక్తి లండన్ నుంచి తిరిగి వచ్చి పార్టీ కోసం పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అతనికి మేము టికెట్ ఇచ్చాము. ఇటువంటి ప్రతిభ ఉన్నవారిని, వారి మద్దతును పొందేందుకు మేము ప్రయత్నిస్తున్నాము.
వామపక్షాలతో మీ సీట్లసర్దుబాటు ఎలా ఉండబోతుంది?
మొత్తం సీట్లలో 15శాతం సీట్లలో వామపక్షాలు పోటీ చేస్తాయి. మిగతా స్థానాల్లో పిపిపి తన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది.
ఈ ఎన్నికల నుంచి మీరెటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు?
ఫలితాలు ఎలా ఉండబోతున్నదీ నాకు తెలియదు. ప్రజలు ఈ రెండు పార్టీలు (అకాలీదళ్, కాంగ్రెస్ ) నుంచి మార్పు కోరుకుంటున్నారనే భావం నాకు కలుగుతోంది.