Archive for డిసెంబర్ 11th, 2011

లోక్‌చెత్త … సంచిక – 3


జయప్రకాష్‌ నారాయణతో నా స్వీయానుభవాన్ని రాసి, ఇక లోక్‌చెత్తను చెరిగే పనికి తాత్కాలికంగా విరామమిచ్చేదానికి అనుమతి ఇవ్వండి.
ఈ సంఘటన ప్రకాశం జిల్లాకు జెపి కలెక్టరుగా పనిచేస్తున్న కాలంలో జరిగింది. నేను అప్పుడే మా గ్రామం ఈదుమూడి నుంచి ఒంగోలుకు చేరాను. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఒంగోలును జ్వరాలు చుట్టుముట్టాయి. ఇంటికి ఇద్దరు ముగ్గురికి తక్కువగాకుండా మంచాలెక్కారు. అదే సమయంలో పురపాలక సంఘాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఎక్కడి చెత్త అక్కడే నిల్వ చేరటంతో పట్టణమంతా ఒకటే కంపు. అసలే రాష్ట్రం మొత్తం మీద ఒంగోలు నీఛ నికృష్ట అపరిశుభ్ర పట్టణం. కార్మికుల సమ్మె కారణంగా పూర్తిగా పాడయిపోయింది. మా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. కొన్ని ప్రాంతాల్లో ఊడ్చి, కాలువల్లో పూడికలు కూడా తీశాము. అయినా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన కార్యక్రమాన్ని ఒక యువజన సంఘం నెత్తుకుని విజయవంతం చేయటం అంత తేలిక కాదు. అందుకని మేము పడుతున్న బాధల్ని ప్రభుత్వానికి నేరుగా చెబితేనన్నా స్పందించి చర్యలు తీసుకుంటారేమోనన్న భ్రమతో కుర్రాళ్లమంతా కలిసి కలెక్టరు జెపిని కలిసి వినతి పత్రం అందజేసి ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నాము. ఆ వినతి పత్రాన్ని అలా అలా చదువుతూనే పిడుగులు కురిపించటం ప్రారంభించాడు. బుద్ధున్నవాడెవడూ ఇలా కాగితాలు తీసుకుని ఏదో చేయమంటూ రాడు. మీరు కలెక్టరు ఆఫీసుల చుట్టూ తిరిగే సమయాన్ని ప్రజల కోసం వినియోగిస్తే అసలు సమస్యలే రావు. మీరు మీ ఇళ్ల నుంచి తలా ఒక చీపురు, తట్టా తీసుకుని వీధులన్నీ ఊడవండి. అంతేగానీ ఇలా అది చేయండి ఇది చేయండి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవద్దు.” అంటూ ఇంకా ఏదేదో బడబడా ఉపన్యసించాడు. చివరలో తక్షణం మేము బయటకు వెళ్లక పోతే తానే నెట్టించాల్సి వస్తుందని బెదిరించాడు జెపి. అప్పుడప్పుడే లోకాన్ని అర్ధం చేసుకుంటున్న మేము జెపి తీరుతో హతాశులమయ్యాము. వాస్తవానికి బెదిరిపోయాము. సరే, ఆయనతో వాదించే శక్తిలేక, కాళ్లీడ్చుకుంటూ ఇళ్లకు చేరాము. తర్వాతెప్పుడూ ఆయన దగ్గరకు రాయబారం వెళ్లే సాహసం చేయలేదు. మా సంఘం తర్వాత కూడా ఎన్నెన్నో ఉచిత వైద్యశిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన విషయం వేరే సంగతనుకోండి.
ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే…. ప్రభుత్వం చేయవలసిన పనిని వ్యక్తులుగానీ, చిన్న సంస్థలుగానీ పరిపూర్ణంగా చేయగలవా? అదే వాస్తవయితే, జెపి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు? స్వచ్ఛంద సంస్థ లోక్‌సత్తాతోనే ఈ దేశంలోని సమస్త రోగాలనూ పారదోలవచ్చుగదా? అంతా ఒక్కసారి చేయలేకపోతే ఒక్క ఊరిలోనయినా చేసి నిరూపించి ప్రజలను నమ్మించి రాజకీయాలు, శాసనసభలు, పాలన లేకుండా స్వచ్ఛంద సంస్థలకే దేశాన్ని అప్పగించేందుకు కృషి సల్పవచ్చుగదూ?
అంటే జెపికి అంతా తెలుసు. ఏమి చేసినా ప్రభుత్వమే చేయాలి. కాకపోతే ఎప్పుడన్నా, ఎక్కడన్నా అత్యవసరమైతే వ్యక్తులు పూనుకుని తాత్కాలికంగా సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చు. ప్రభుత్వేతర సంస్థలు స్పందించి చేయూత ఇవ్వవవచ్చు. అంతేగానీ వ్యక్తులో, ఏదో ఒక సంస్థో అంతా చేసేస్తే ఇదంతా ఎందుకు దండగ. అది వీలుకానందునే ప్రపంచవ్యాపితంగా రాజకీయాలు, శాసనసభలు, ప్రభుత్వాలు ఉన్నాయి. చేసినా చేయకపోయినా ప్రభుత్వానికే సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే సత్తా ఉంటుంది.
అయితే తాను తీసుకోవలసిన చర్యలు తీసుకోని జెపి కసికసిగా కుర్రాళ్లమీద కన్నెర్ర జేశాడు. ప్రభుత్వానికి వాస్తవం చెప్పలేని, ప్రశ్నించలేని ఆయన కళ్లెదుట కనపడినవాళ్లతో యుద్ధానికి దిగాడు.
ఆయనకు ఆ దృక్పధం నుంచి బయట పడనందునే ఇప్పటికీ తాను ఎన్నెన్నో విషయాల మీద తెగతెగ పోరాడుతున్నానని తరచూ చెప్పుకుంటుంటాడు. ఎన్నెన్నో లాభాల్ని తెచ్చిపెట్టానని చెప్పుకుంటుంటాడు. ఎన్నో చట్టాలు తన పోరాటం వలనే వచ్చాయని చెబుతుంటాడు. అయనో విచిత్రం. అయనదో లోకం. ఏం చేద్దాం. కారణం ఏదయినాగానీ ప్రజల సంగతి పట్టాల్సిన వాళ్లు వారికి దూరమయ్యారు. ఆ జాగాలో జరబడిన జెపీలు, స్వాములోర్లు ప్రజల్ని ప్రభావితం చేసేందుకు తెగ చెమటోడ్చుతున్నారు. కానీండి ప్రజలు తెలుసుకునే దాకా… అందరి బొక్కల్నీ విరగదీసేదాకా …. కానీండి. కానీండి.

విప్లవకారుల విషాదం

‘పశ్చిమ బెంగాల్‌కి ముఖ్యమంత్రిగా చేయదగిన అత్యుత్తమ వ్యక్తి మమత బెనర్జీ’ అని ‘ఆనంద్‌ బజార్‌’ పత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో ఇటీవల మరణించిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ అన్నారు.

మమత అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్‌లో జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లోనే కిషన్‌జీని బలితీసుకున్నారు. ‘ఉగ్రవాదులందరి కంటే నక్సలైట్లే ప్రమాదకారులు’ అని కూడా మమత వాకృచ్చారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాలుగో రోజు (గత నెల27న) మౌనం వీడిన మమత ‘జంగల్‌ మహల్‌ని బలగాలు చుట్టుముట్టి తుపాకులు అప్పగించి లొంగిపోవాలంటూ కిషన్‌జీకి, ఇతర నేతలకూ మూడు రోజులు గడువిచ్చినా వారు వెనక్కు తగ్గలేదు. వెయ్యికిపైగా రౌండ్లు కాల్పులు జరిపి, ఎన్‌కౌంటర్‌ తప్ప మరే ప్రత్యామ్నాయం లేకుండా చేశార’ని తనదైన శైలిలో నెపమంతా మావోయిస్టులపైనే నెట్టారు. అంతేకాదు, ‘కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ వల్ల వేలాది ఆదివాసీలు రక్షించబడ్డారు’ అని కూడా ఆమె చెప్పారు. నవంబరు 23న మిడ్నాపూర్‌ జిల్లాలోని గోసాయిబంద్‌ గ్రామంలో కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారని ఫొటోలతో సహా మావోయిస్టులు, హక్కుల సంఘాలు ఆరోపిస్తుంటే, ఇది నూరు శాతం నిజమైన ఎన్‌కౌంటర్‌ అని మమతాబెనర్జీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రకటిస్తున్నారు. దశాబ్దాల తరబడి అధికారం కోసం కాచుక్కూర్కున్న మమతకి, వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపర్చటమే ఏకైక కార్యక్రమంగా మలుచుకున్న మావోయిస్టు పార్టీ, దాని నాయకుడు కిషన్‌జీలు అయాచిత వరంగా లభించారు. ఒకరకంగా వామపక్ష ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం పట్ల చాలా ఉదారంగానే వ్యవహరించిందని చెప్పాలి. నక్సల్బరీ ఉద్యమం ఏర్పడ్డ ప్రారంభదినాల్లో సాగించిన నిర్బంధ దుష్ఫలితాల పట్ల చివరి రోజువరకు భయపడుతూనే వుంది. పరిస్థితిని అవకాశంగా తీసుకొని మావోయిస్టులు దేశంలో బెంగాల్‌ని ‘షెల్టర్‌ జోన్‌’గా మార్చుకున్నారనేది వాస్తవం. తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కున్న అవివేకిలా మావోయిస్టు పార్టీ ప్రవర్తించింది. ప్రజలు ప్రయత్నిస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలుని పడగొట్టేలాంటి నీచమైన పనులకు సైతం పాల్పడి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచటం ద్వారా మమత విజయానికి సర్వశక్తులూ ఒడ్డింది. సర్వ పాపాలు చేసింది. ఈ నీచకృత్యాలన్నీ చూసింది కనుకనే దీదీకి వీళ్లు ప్రమాదకారులుగా కనిపించారు.

చుట్టుముట్టిన బలగాల నుండి తప్పించుకున్నాడని పథకం ప్రకారం ప్రచారం చేశారు. కొన్ని బలగాల్ని వెనక్కి పంపించారు. ప్రజల్ని, మావోయిస్టుల్ని నమ్మించారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో మావోయిస్టులు రాణించలేకపోయినా పోలీసులు విజయం సాధించారు. ఆదమరచి ఉన్న కిషన్‌జీని, మరి కొంతమందిని బురిపాల్‌ గ్రామంలో అదుపులో తీసుకొని ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. ఈయనతో వున్న సుచిత్ర మహతో తప్పించుకుందో లేక పోలీస్‌ కస్టడీలో వుందో తెలియదు. తమ నాయకుల ఆచూకీ తమకే తెలియని దురవస్థ మావోయి స్టులది. ఇంత పేలవమైన నిర్మాణమూ, నాయకత్వమూ వున్న నెట్‌వర్కు ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకీ ఉన్నట్లు లేదు.

ఎన్‌కౌంటర్‌గా చెప్పబడే ప్రతి సంఘటనా నకిలీదే. నాయకులందర్నీ పట్టుకొని కాల్చి చంపినదే. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే 90 శాతం సందర్భాలలో నాయకులు ‘విద్రోహం’ కారణంగా పట్టుబడ్డ వారే కావడం. చాల మంది భ్రమ పడుతున్నట్లు వెంగళరావు ‘సమర్థత’ వలనో, కొంతమంది పోలీసుల ‘కఠినత్వం’ వలనో గాక మావోయిస్టు పార్టీలో విచ్చలవిడిగా సాగిన ‘కోవర్టు ఆపరేషన్లే’ ఈ ఘటనలన్నిటికీ కారణం. ప్రారంభ దినాల్లో పై స్థాయి నాయకత్వంలో తక్కువ స్థాయి జ్ఞానం వున్నవారు కింద స్థాయిలో ఎక్కువ సిద్ధాంత పరిజ్ఞానం కలిగినవారు పార్టీలో ఉన్నారు. కాలక్రమంలో దానికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడింది. చారు మజుందార్‌ నాయకత్వంలోని సిపిఐ(యంయల్‌) తర్వాత పీపుల్స్‌్‌వార్‌ పార్టీగా, మావోయిస్టు పార్టీగా రూపం మార్చుకునే క్రమంలో మార్క్స్‌, ఎంగెల్స్‌పేరు కూడా వినని వాళ్లను దళాల్లోకి ‘రిక్రూట్‌’ చేసుకోవడం, మార్క్స్‌ ఫొటో,గద్దరు ఫొటో చూపిస్తే ఎవరో చెప్పలేని దళ సభ్యులున్న దళాల్తో నిండిన ఘోరస్థితి మావోయిస్టు పార్టీలో నెలకొంది. భర్తపై అలిగివెళ్లిన భార్యలు, ఇంట్లో పెద్దలు కొడితే ఇల్లు వదిలివెళ్లిన పిల్లలు, జన నాట్యమండలి పాటలు విని ఉత్సాహపడ్డవారు, అడవుల సమీప గ్రామాల్లో వివిధ సమస్యల బారినుండి ‘అన్న’ల సహాయం కోరి వెళ్లిన వాళ్లతో దళాలు నిండిపోయాయి. దీంతో సిద్ధాంత పరిజ్ఞానం కింది స్థాయిలో పూర్తిగా లోపించింది. ప్రజాసంఘాల ద్వారా గాక సరాసరి ‘రిక్రూట్‌మెంట్లు’ పెరగడం, అసలే లోపభూయిష్ట వ్యూహాలున్న పార్టీకి కనీస జ్ఞానం కొరవడిన కార్యకర్తలు తోడవ్వడంతో దేశవ్యాప్తంగా పోలీసుల పని చాలా సులువైంది. నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌ రెడ్డి, నరేష్‌లను బెంగుళూరులో పట్టుకుని హెలికాప్టర్‌లో ఇక్కడికి తీసుకొచ్చి ఎన్‌కౌంటర్‌ కథలల్లటం అటుంచితే వాళ్లని పట్టించిన కోవర్టు గోవిందరెడ్డి, అతని కుటుంబం ఎక్కడుందో? అసలుందో లేదో కూడా తెలియదు. 1993లో అర్ధరాత్రి సొంత దళంపై కాల్పులు జరిపిన దళ నాయకుడు కొడిమంజు ఎల్లయ్య అలియాస్‌ భూపతిని చంపిన కత్తుల సమ్మయ్య కథ గుర్తుందా? 1996లో సొంత కృష్ణపట్టి దళ సభ్యుల్ని కాల్చి చంపిన సోమ్లా నాయక్‌ గుర్తున్నాడా? కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కార్యదర్శి విజరుని కాల్చి చంపిన జడల నాగరాజు అనే మావో కోవర్టు గుర్తున్నాడా? ఇంకా నయీం, అతి దారుణమైన మానాల ఎన్‌కౌంటర్‌, 2006లో ప్రకాశం జిల్లాలో రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌, అప్పారావు, పులి అంజయ్య, అనంతపురం జిల్లాలో సుదర్శన్‌, వరంగల్‌ జిల్లాలో టెక్‌ రమణ, పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ఎన్‌కౌంటర్‌ కథ విన్నా దాని వెనుక వున్నది కోవర్టే. వ్యక్తులు చేసిన కోవర్టు ఆపరేషన్లు పక్కన పెడితే చాలా ఎన్‌కౌంటర్‌లకు పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణం కావడం మరో విషాదం.

కాంగ్రెస్‌పై కోపంతో ఎన్‌టియార్‌కి ఓట్లేయిస్తే 5వేల మందితో గ్రేహౌండ్స్‌ దళాన్ని ఏర్పాటు చేసి అనేక మందిని కాల్చి చంపడానికి ఆ ప్రభుత్వం కారణమైంది. ఆ కోపంతో చెన్నారెడ్డికి మద్దతిస్తే ఆయనా అదే పని చేశారు. బెంగుళూరు నాయకుల ఎన్‌కౌంటర్‌కి బాధ్యుడని చంద్రబాబుని దించటానికి కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ‘శాంతి చర్చల’ నెపంతో అడవుల్లోని అనుపానులన్నీ ఆకళింపు చేసుకొని తర్వాత ఆంధ్రలో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవటానికి కృషి చేశారు. ఇన్ని సంఘటనల నుండి కొంచెం కూడా గుణపాఠం నేర్చుకోకుండా అదే తప్పు ఇంకా చెప్పాలంటే అంతకంటే పెద్ద తప్పు బెంగాల్‌లో చేశారు. తత్ఫలితమే కిషన్‌జీలాంటి సమర్థుడైన నాయకుణ్ణి కోల్పోవడం. ఈ విషయాలన్నీ సింహావలోకనం చేసుకుంటే అవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలా? నక్సలైట్లు వారే చేసుకున్న ఆత్మహత్యలా అనిపిస్తుంది.

ఇక్కడ మావోయిస్టులు ఆత్మ పరిశీలన కోసం మరో విషయం కూడా చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎన్‌కౌంటర్‌ జరిగిందంటే ప్రజల్లో స్పందన రకరకాల రూపంలో తీవ్రంగా వుండేది. డా.చాగంటి భాస్కరరావుని శ్రీకాకుళం జిల్లాలో కాల్చి చంపితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని వేల ఇళ్లలో పొయ్యిల్లో పిల్లులు లేవలేదు. చివరగా ఆదిరెడ్డి, సంతోష్‌ రెడ్డి ఎన్‌కౌంటర్‌ తరువాత రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. అజాద్‌, కిషన్‌జీలాంటి అగ్ర నేతలు చంపబడ్డా చాలా యథాలాపంగా వార్తలు చదువుతున్నారు. చూస్తున్నారు. ఒక సాధారణ రోడ్డు ప్రమాద వార్త చూస్తున్నంత సామాన్యంగా ఈ వార్తను కూడా చూసి వేరే చానల్‌లోకి మారిపోతున్నారు.మావోయిస్టులు ఇచ్చే 2 రోజుల బంద్‌ పిలుపులు ఎవరూ ఖాతరు చేయడం లేదు. ప్రజల నుండి మావోయిస్టులు వేరుపడ్డమే దీనికి కారణం. కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులు గాని వారికి ఉండివుంటే -ప్రజా సంఘాలు కానీ ఒక్క ప్రజా సమస్యపై పనిచేసిన దాఖలాలు లేవు. హక్కుల సంఘాలు మొక్కుబడిగా మారాయి. సాహితీ సాంస్కృతిక రంగాల్లో సైతం కొత్తగా కనిపించే స్పందనలు లేవు. ఉత్తేజపరిచే స్థితిలో ఉద్యమాలు లేవు. ఉత్తేజపరిచే నాయకులు లేరు. ఈ కాలక్రమంలో పోలీసుల నుంచే కాదు ప్రజల నుండి కూడా తప్పించుకు తిరిగే పరిస్థితుల్లో విప్లవకారులు ఉండటం ఒక మహా విషాదం.

-చెరుకూరి సత్యనారాయణ

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో