తానోడి నన్నోడెనా? – – సారంపల్లి మల్లారెడ్డి

కాంగ్రెస్‌ ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది.

పాండవులను వారి రాజ్యాన్ని ధర్మరాజు జూదంలో ఓడి పోయాడు. చివరికి శకుని సలహాతో ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడతాడు. గెలిస్తే తాను ఓడిపోయిన రాజ్యంతోపాటు తన తమ్ములు విముక్తులవుతారని అందుకు ద్రౌపదిని ఆటలో పందెంలో పెట్టమని షరతు విధిస్తారు. జూదం వ్యామోహం గల ధర్మరాజు ద్రౌపదిని పందెం కాసి ఓడిపోతాడు. కౌరవులు ద్రౌపదిని ధృతరాష్ట్ర సభకు తెచ్చి కౌరవులకు భానిసగా ఉండమంటారు. ఆ సభలో భీష్మునితో సహా ధర్మకోవిదులందరూ ఉండగానే ద్రౌపది ఒక ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ధర్మరాజు ‘తానోడి నన్నోడెనా.? లేక నన్నోడి తానోడెనా.?’ అని అడుగుతుంది. సభలో ఉన్నవారు తానోడిన తర్వాతనే నిన్ను ఓడాడని సెలవిస్తారు. సర్వం ఓడిపోయినవాడికి నన్ను పందెంలోకాసే అర్హత ఉందా.? అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. నిండుసభలో ఎవరూ ఈ ధర్మ సందేహానికి సమాధానం చెప్పలేకపోయారు. అది ”అప్రస్తుతం” అంటూ దాటవేశారు.

అలాంటి పరిస్థితే నేడు ప్రజా రాజ్యం పార్టీ(ప్రరాపా)ని ఆవహించింది. పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తానని, కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతానని ధీరోదాత్త వచనాలు పలికి తిరుపతి బహిరంగ సభలో పార్టీ ఆవిర్భావ సందర్భంగా తొడగొట్టి ప్రకటించారు. ఆ విధంగా కాంగ్రెస్‌ను, దాని విధానాలను విమర్శిస్తూ ఎన్నికల్లో పోటీచేసి 18 స్థానాలు గెలుపొందారు. అందులో నుండి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ ఎంఎల్‌ఏ పార్టీ ఫిరాయించారు. అతనిపై వేటు వేసే ధైర్యం ప్రరాపాకు లేకుండా పోయింది. అతను కాంగ్రెస్‌ సానుభూతిపరునిగా ఉంటున్నాడు. చివరకు ప్రజారాజ్యం నేత మూటాముల్లె సర్దుకొని మొత్తం తన దుకాణాన్ని మూసేసి కాంగ్రెస్‌ దుకాణంలో చేరాడు. పార్టీ ఏర్పర్చినపుడు కాంగ్రెస్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకించి నేడు ఆ విధానాలనే భుజాన వేసుకొని కాంగ్రెస్‌లో కలిశాడు. తాను రూపొందించిన కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసిన శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ పార్టీ తరపున స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కోరే సందర్భంగా ప్రరాపా ఉనికిలో ఉందా లేదా? అన్నది సంశయమే. అంతకు ముందే తెలంగాణా అంశంపై శాసనసభ సభ్యత్వాలకు టిడిపి, కాంగ్రెస్‌ వారు రాజీనామాలు ఇచ్చినా వారి రాజీనామాలను స్పీకర్‌ అంగీకరించలేదు. స్పీకరు తన విచక్షణాధికారాన్ని వినియోగించి వారి రాజీనామాల్ని తిరస్కరించడమో, లేదా ఆమోదించడమో చేయాలి. ఒకే ఫార్మేట్‌లో రాజీనామాలు సమర్పించిన వారిలో కొందరివి ఆమోదించారు, భావోద్వేగంతో రాజీనామాలు సమర్పించారనే సాకుతో మరికొందరివి తిరస్కరించారు. నేడు శాసనసభలో మూడింట ఒక వంతు శాసనసభ్యులు ఏ పార్టీలో ఉన్నారో అంతుచిక్కని అంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ విప్‌ను ధిక్కరించిన 16 మంది శాసనసభ్యులను ఏమి చేయాలన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపి క్రమశిక్షణా చర్యకు స్పీకర్‌ను కోరింది. స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ సభ్యత్వం రద్దు చేయమని కోరడం విచిత్రంగా ఉంది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.

ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో ‘ పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లు’ తెచ్చినపుడు కాంగ్రెస్‌వారు దీనిని అభ్యుదయ చర్యగా అభివర్ణించారు. కాని అప్పుడే వామపక్షాలు ఈ బిల్లులో ఉన్న లొసుగులను ఎత్తిచూపాయి. మూడింట ఒక వంతు శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడదని, పార్టీ బహిష్కరించినవారికి ఈ చట్టం వర్తించదని మెలికలు పెట్టారు. ఈ లొసుగులే కాక స్పీకర్‌కుగల విచక్షణాధికారాలను వినియోగించి పాలకపార్టీలకు రక్షణ కల్పించడం జరుగుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని అనేక రాష్ట్రాలలో చివరికి పార్లమెంటు ఉభయసభల్లో కూడా ఈ ఫిరాయింపుల సమస్య నిరాఘాటంగా సాగిపోతోంది. కొందరు తెలివిగా మరొక పార్టీలో చేరకుండా పాలకపార్టీకీ ప్రమాదం ఏర్పడ్డపుడు సహాయం చేస్తూ వస్తున్నారు. విప్‌ను ధిక్కరించడం ఫిరాయింపుల బిల్లురీత్యా నేరం. ఈ నేరానికి పాల్పడిన వారిని వారి సభ్యత్వాన్ని రద్దుపర్చి తిరిగి అక్కడ ఎన్నికలు జరిపించాలి. కాని పాలకుల విచక్షణకు లోబడి ఈ చట్టం పనిచేస్తోంది. పాలకులు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొంటూ ప్రజలకు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని’ నమ్మబలుకుతున్నారు.

ఒక పార్టీ బ్యానర్‌తో గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని ‘ధృతరాష్ట్రకౌగిలి’ లోకి వెళ్లాడని అనడం రివాజు. ధృతరాష్ట్రుని కౌగిలిలోకి వెళ్లినవారు తిరిగి సొంత ఉనికితో బయటపడడం అసాధ్యమని చరిత్ర చెబుతున్న సత్యం. వారు జీవచ్ఛవమై పోతారు. అందుకే ఈ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్న ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా దీన్నే రుజువు చేస్తోంది. పార్టీలో కలిసినాక కాంగ్రెస్‌ పార్టీ విప్‌కు లోబడి ఉండాలి తప్ప ఆ పార్టీ విప్‌ జారీ చేసే అర్హత న్యాయపరంగా ఉందా అన్నది పరిశీలించాలి. నేడు రాష్ట్రంలో పాలన అస్థిరమై, ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 104 ఉద్యోగుల సమ్మె, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, రైతాంగ సమస్యలు, ఉపాధిహామీ పనుల అమలు చర్చకు రాకుండా పోయాయి. తమ పార్టీలో అతి ప్రజాస్వామ్యముందని చెప్పే కాంగ్రెస్‌, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. తన పాలనను నిలుపుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నది. దేశాన్ని బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతున్నది. ప్రజాందోళనలపై నిర్బంధం ప్రయోగిస్తున్నది.

అవిశ్వాసంపై గట్టెక్కడానికి పార్లమెంటరీ నిబంధనలను తుంగలోతొక్కి సభ్యులపై సామ దాన భేద దండోపాయాలను ప్రభుత్వం ప్రయోగించింది.. కాంగ్రెస్‌ను పార్లమెంటులో గట్టెక్కించడానికి నాడు పివి నర్సింహారావు ఆనాడు అనుసరించిన ఓటుకు నోటు సంస్కృతినే రాష్ట్ర పాలకవర్గం పుణికిపుచ్చుకుంది. పార్లమెంటరీ విధానానికి తూట్లు పొడవడం కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే విప్‌ జారీ చేసినా తనకు లోబడినవారికి ఒకతీర్పు, వ్యతిరేకించినవారికి మరొక తీర్పు ఇచ్చి తన కుటిలరీతిని ప్రదర్శిస్తోంది.

One response to this post.

  1. ఎన్నికల వాగ్ధానంలో తెలంగాణా ఇవ్వాలని రాసుకొని, మాట మీద నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ప్లేటు ఫిరాయించినందుకు తగిన శాస్తి జరిగింది. తెలంగాణా ప్రజల ఉసురు ఊరికే పోదు. చిరంజీవి, చంద్రబాబులు ఇద్దరూ మూల్యం చెల్లించక తప్పదు.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: