ప్రస్తుతాన్ని వెనక్కు నెట్టి ముందుకు సాగటం ప్రయాణం అయితే రెండు విభిన్నమైన ప్రయాణాలను హృద్యంగా పట్టిచూపిన అరవ అనువాద సినిమా జర్నీ. ప్రయాణం పేరిట ఇటీవలే ఓ చిత్రం వచ్చినందునేమో, దీనికి జర్నీ అని ఆంగ్ల నామం తగిలించారు.
నేను ఆరేళ్ల హైదరాబాదువాసిగా ముచ్చటగా చూసిన మూడో చిత్రం కూడా నచ్చింది. మొదటి రెండు చిత్రాలలో ఒకటి లీడర్ కాగా రెండోది వేదం.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులూ మిగతా హీరోలతో పోలిస్తే నిజ్జంగా మంచివాళ్లు కావటం ఈ కథకే కాదు, దారి తప్పుతోన్న యువతను కాసింత గాడిలో పెట్టేందుకు ఉపరిస్తుందేమో! అదే విధంగా ఇద్దరు కథానాయికలూ తమదైన శైలిలో కాసింత సొంత బుర్రకలిగినవాళ్లు కావటం మరో విశేషం. దీనికితోడు అమ్మాయిలు పొట్టి లాగూలు వేసుకుని సముద్రపు ఒడ్డున పరుగులు పెట్టరు. అంటే ఎక్కడా వికారం పుట్టించరు. అబ్బాయిలూ అంతే ప్రేమిస్తారు తప్ప అడ్డదిడ్డంగా పాటలు పాడే పని పెట్టుకోరు. దీన్లో ప్రేమ ఉంది… శృంగారాలూ, వికారాలూ లేవు. విరహం ఉంది… గడ్డాలు పెంచుకోవటం కన్పించదు. విషాద గీతాలు విన్పించవు.
ఈ చిత్రంలో రెండు ప్రయాణాలున్నాయని మొదట్లో అన్నాను కదూ, దానిలో ఒకటేమో బస్సు ప్రయాణం చేయకూడని పద్ధతిని చూపింది. రెండోది ఒక యువకుడు, ఒక యువతి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక సోదరి, ఆ మాటకొస్తే పౌరులందరి జీవన ప్రయాణం ఎలా ఉంటే బాగుంటుందో ఉన్నమేరకు ఆదర్శంగా చూపే ప్రయత్నం జరిగింది.
ప్రస్తుతం అన్నిచోట్లా పెద్ద సమస్యగా మారిన అపరిమిత వేగం తెచ్చిపెడుతోన్న అనర్థాలను వాస్తవానికి దగ్గరగా చూపిన దర్శకుడు అందరినీ ఆలోచింపజేస్తాడు.
ఇక రెండో ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్ర మధుమతి. ముందుగా పాత్రలో నూరు శాతం వదిగిపోయిన పాత్రధారిణి అంజలికి అభినందనలు చెప్పాలి.
ఆరేళ్లు వెంటబడినా చెత్తగాడికి లొ0గక పోవటం మధుమతి ప్రత్యేకత. దానికి భిన్నంగా ఆర్రోజుల్లోనే తొమ్మిది వేలు సంపాదిస్తూ ఒద్దికగా బతికే జై ప్రేమను అంగీకరించటం విశేషం. పైగా చాటుమాటుగా, గుడ్డిగా ప్రేమలో పడిపోవటం కాకుండా అతగాడిని పోలీసయిన తన తండ్రి దగ్గరకు పంపటం, తన వెంటబడిన వాడినీ కలవమనటం, హెచ్‌ఐవి పరీక్ష చేయించటం, అవయవదానానికి తాను సంతకం చేస్తూ, అతనినీ ఒప్పించటం… ఈ అన్ని వ్యవహారాలోనూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పటం, ఆమె వైద్యురాలని జై అనుకున్నప్పుడు బేషజాలకు పోకుండా నర్సును మాత్రమేనని నమ్రతగా తెలపటం, అవసరమైనచోట మానవత్వంతో వ్యవహరించిన మధుమతి ఈనాటి యువతకు, ప్రత్యేకించియువతులకు ఆదర్శపాత్రం. ఇష్టపడటం మొదలు పెట్టాక అదుపు తప్పని నడవడికతో ప్రియుడిని (చూసేవాళ్లు రెచ్చిపోయే సన్నివేశాలు లేవు సుమా) సున్నితంగా అలరించటం గొప్పగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు మానవత్వంతో సేవలు చేయటం మన మనసు పొరల్లో ఎక్కడో దాగి ఉన్న దుఖ:ం కట్టలు తెంచుకుని కన్నీటి రూపాన బయటపడిపోతుంది. నేనయితే కేవలం పక్కవాళ్ల కోసమే బిగ్గరగా ఏడవలేకపోయాను. రెప్పలు దాటిన దుఖ:జలాన్ని తుడవలేక చచ్చాననుకోండి. అనన్య పాత్ర కూడా అంతే. నగరవాసుల వెగటు వ్యవహారాలు నచ్చని పల్లెటూరి అమ్మాయిప్రతిదాన్నీ అనుమానించే లక్షణమున్న పాత్ర అది. జీవిత వాస్తవాలు నేర్పిన భయం తప్ప నిజాయితీకి, ఆలోచలనకూలోటు లేదు. అలా ఇద్దరు కథాయికలూ ఎలా వ్యవహరించాలో చూపి ఆడపిల్లలు ఇలా ప్రయాణించాలని నేర్పే ప్రయత్నం చేశారు. అలా అని ఎక్కడా ఆదర్శం పేరిట సాధ్యం కాని ఉపదేశాలు, ఉపన్యాసాలతో నేలవిడిచి సాము చేయలేదు. వారి ప్రవర్తనే వారిచ్చే సందేశం.
ఇక ఈ చిత్రంలో కన్పించే ఒకటి రెండు తప్పులు కూడా లేకుండా ఉంటే బాగుండేది. నాలుగు వరుసల రహదారిలో వాహనాలు ఎదురెదురుగా రావు. అందువలన ఈ చిత్రంలో చూపిన విధంగా విజయవాడ నుంచి హైదరాబాదు బస్సు, హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎదురెదురుగా ఢీకొనటం సాధారణంగా జరగదు. రెండు వరుసల రోడ్డులో మాత్రం అలా జరగవచ్చు. అయితే నాలుగు వరుసల రహదారిలో ఒకేవైపు వెళ్లే వాహనాలతోనే ప్రమాదం.
ఆరు వేల రూపాయలు ఖరీదయిన బట్టలు నాలుగు వందలకే వస్తాయని విజయవాడ వాసులు అప్పటికప్పుడు కోఠికి పోదామని అనుకోరు. అక్కడ బీసెంట్ రోడ్డు, వస్త్రలత ఉన్నాయిగా. అక్కడకు పోదామనుకుంటారు గదా! నాలుగు వరుసల రహదారిలో ఎదురెదురు వాహనాలు ఢీకొన్నట్లు చూపటం దర్శకుడి అనాలోచన కాగా, విజయవాడవాసులను కోఠికి పంపే ఆలోచన మాటల రచయిత తప్పిదం. వీలయినచోట తెలుగు ఫలకాలను చూపించటం – అంతలోనే వాతావరణం అరవంలోకి దూకటం వీక్షకులకు ఎంతో కొంత ఇబ్బందే. హైదరాబాదులో కనిపించని ప్రైవేటు సిటీ బస్సుల్ని చూడటం కూడా ఎబ్బెట్టుగా ఉంది.
ఈ సినిమా చూసిన తర్వాత నా కన్పించిందీ… ఎదిగే తోటి తెలుగువాడిని తోటివాళ్లు కాళ్లు పట్టుకుని ఎందుకు లాగుతారంటే అనర్హులు అలా ఎదగ కూడదని మాత్రమే. పక్కనున్న తమిళ తంబిలుజర్నీలా చక్కటి చిత్రాలు నిర్మిస్తుండగా మనోడికి ఆ తెలివి లేకపోయే మరి. కాళ్లు పట్టుకుని కాదు ప్రస్తుతం మన తెలుగు చిత్రసీమను ఏలుతున్నవాళ్లందరికీ మోకులు కట్టి మరీ సముద్రంలోకి లాగి పారేయాలి. అప్పుడు అరవ అన్నల్లా కాసింత తెలివి ప్రదర్శించి, వీక్షకులకు కాసింత తెలివి పంచిపెట్టేవాళ్లకు కాసింత చోటు దొరుకుతుందేమోనని నాబోట్లకు పెద్ద ఆశ.
Archive for డిసెంబర్ 23rd, 2011
23 డిసెం