
- కార్పొరేట్లకు రూ.5 లక్షల కోట్ల రాయితీలు
- మంత్రులతో నిండుతున్న జైళ్లు
- ఇక కేబినెట్ మీటింగ్ జైల్లోనే
ప్రపంచీకరణ నేపథ్యంలోనే దేశంలో అవినీతి పెరిగిపోతోందని ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ‘ప్రపంచీకరణ-అవినీతి’ అంశంపై ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలోబుధవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. విమానయాన మంత్రి రవూఫ్ పటేల్ రోజువారీ ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్నట్లు పిఎంఓ ప్రకటించిందన్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో పని చేస్తున్న 40 శాతం మంది ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులుగా ఉన్నారన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఏడాది వేతనం రూ.2 నుండి రూ.3 లక్షలు ఉందన్నారు. ఆ మాత్రం వేతనం ఇచ్చే స్థితిలో కూడా ఎయిర్‌లైన్స్ లేదని మంత్రి చెబుతున్నారన్నారు. పిఎంఓ ప్రకటించిన వివరాల ప్రకారం మంత్రిగా ఉన్న పటేల్ ఆస్తులు 2009 ఎన్నికల నుండి 28 నెలల్లో రూ.43 కోట్లకు పెరిగాయన్నారు. మంత్రిగా బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఆస్తులు ఈ విధంగా పెరగడం అవినీతి పెరగడానికి నిదర్శనం అన్నారు. అయితే ఇదే మంత్రి హయాంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ పూర్తిగా నష్టాల్లోకి నెట్టివేయబడిన విషయం గమనించాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లకు కనీస వేతనాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మంత్రులే ప్రకటించారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా 5లక్షల కోట్లరాయితీలకు డబ్బు ఎక్కడని ప్రశ్నించారు. గంటకు రూ.10 కోట్లు సంపాదించిన మంత్రి కూడా ఉన్నారన్నారు. మహారాష్ట్రలో 15 ఏళ్ళలో 50 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ఆ రాష్ట్రానికి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. అత్యధికంగా 50వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విదర్భకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అతను పెద్ద వడ్డీ వ్యాపారని అన్నారు. ఆ ఎమ్మెల్యే వేధింపుల గురించి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అరెస్టుకు యత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు వెళ్ళాయన్నారు. అవినీతితో పాలకులకున్న బంధాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు. పోలీసులు నాగపూర్ బెంచ్‌ను ఆశ్రయిస్తే కోర్టు ఎమ్మెల్యేకు రూ.25వేల జరిమానా విధించిందన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 10లక్షల రూపాయల జరిమానా విధించిందన్నారు. ఆ మంత్రికి అత్యంత కీలకమైన గ్రామీణ అభివృద్ధి శాఖ అప్పగించి ప్రధాని ప్రమోషన్ కల్పించారన్నారు. ఈ విధంగా అవినీతి మంత్రులకు ప్రధానమంత్రి అండదండలున్నాయన్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉండదన్నారు. మంత్రులంతా అవినీతి ఆరోపణలతో జైలు పాలవుతున్నారనీ, ఇక కేబినెట్ సమావేశాలు జైళ్లలో నిర్వహించుకోవాల్సిందేనని అన్నారు. అవినీతికి మేము వ్యతిరేకం అని కొందరు చెబుతుండగా మరి కొందరు ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వస్తున్నారన్నారు. ఈ అవినీతికి మూలం ఏమిటీ, ఎవరి విధానాలు కారణం అనేది మాత్రం చెప్పటం లేదన్నారు. ఇదే విషయం అంధ్రప్రదేశ్‌తోపాటు అనేక రాష్ట్రాల్లో బయట పడిందన్నారు.
2010-11లో కార్పొరేట్లకు వాణిజ్య, కస్టమ్స్, పలు రాయితీల కింద 88వేల 263కోట్ల రాయితీ ఇచ్చిందన్నారు. కానీ రైతులకు 73వేల కోట్లు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఎక్సైజ్ పాలసీ కింద కార్పొరేట్ సంస్థలకు ఐదు లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందన్నారు. అవినీతికి బడ్జెట్‌లోనే చట్టబద్దతకల్పిస్తున్నారని అన్నారు. 2006 బడ్జెట్‌లో కార్పొరేట్ సంస్థలకు ఎంత రాయితీ ఇస్తున్నారో తెలపాలని వామపక్షాలు ప్రశ్నించాయనీ, ఆ ఫలితంగానే అవినీతి బయటకు వస్తోందని అన్నారు. ముంబాయి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. గోద్రెజ్, టాటా ఉద్యోగాలు రోజురోజుకూ తగ్గిస్తున్నాయని అన్నారు. కెజిబేసిన్ ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనీ, దీనిని అంబానీల్లో ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్లమెంట్ ఓ సెషన్‌లో చర్చించారన్నారు. వ్యవసాయరంగం సంక్షోభానికి పాలకులే కారణమన్నారు. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి 14శాతం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 3శాతం కూడా కేటాయించడం లేదన్నారు. ఎఫ్‌డిఐలు రిటైల్ మార్కెట్‌లోకి వస్తే ఉన్న ఉద్యోగాలుపోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.