Archive for జనవరి 8th, 2012

వ్యాపారాలు … పదవులు – ప్రపంచ తెలుగు మహోత్సవం


”ఏ పదాల వెనుక ఏమి దాగి ఉందో తెలుసుకోనంతవరకూ మనం మోసపోతూనేఉంటాం” అంటారు లెనిన్‌ మహాశయుడు.
ఈ నేపథ్యంలో జనవరి ఐదో తేదీ నుంచీ ఏడో తేదీవరకూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని పరిశీలిస్తే కొన్ని అసలు నిజాలు బయటపడతాయి.
ఒకనాడు శూద్రులే అయినా స్వాతంత్య్రాననంతరం ప్రభువులగా మారిన ఓ సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేసే ఒక చిన్న ఉద్దేశంతోనూ, చెత్త వ్యాపారాన్ని కైవశం చేసుకునేందుకూ, పనిలోపనిగా పదవుల్నీ దక్కించుకునే లక్ష్యంతోనూ ఈ మహోత్సవాలను రాంకీ సంస్థ నిర్వహించిందన్న విమర్శలు విన్పించాయి. ఈ రాంకీ సంస్థ ప్రస్తుత లోక్‌సభ నరసరావుపేట (గుంటూరు జిల్లా) సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి (తెలుగుదేశం) కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సంస్థ నిర్మాణ రంగంతోపాటు చెత్త నుంచి విద్యుదుత్పత్తి పరిశ్రమలనూ నిర్వహిస్తోంది. పనిలో పనిగా సేవ కోసమంటూ అదే పేరుతో ఓ ట్రస్టును కూడా ప్రారంభించింది.
రాష్ట్రంలోనే అత్యంత అపరిశుభ్ర పట్టణంగా నమోదయిన ఒంగోలు త్వరలో పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించనుంది. దాన్నలా ఉంచితే ఒంగోలులో ప్రస్తుతం అరకొరగా సేకరిస్తేనే 300 టన్నులకు పైగా చెత్త పోగుబడుతోంది. అదే చిత్తశుద్ధితో పనిచేస్తే వెయ్యి టన్నులకు పైగానే దొరుకుతుంది. దీనిపైనే రాంకీ దృష్టి సారించింది. ఇక్కడి చెత్తను సేకరించే పనిని కొట్టేసేందుకు పన్నాగం పన్నింది. చెత్తాచెదారంతో విద్యుదుత్పత్తి పరిశ్రమను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగానే ఒంగోలు వాసులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదే ప్రంచ తెలుగు మహోత్సవాల పేరిట తెర మీదకు వచ్చింది. ప్రకాశం జిల్లాకు ప్రత్యేకించి ఒంగోలుకు చెందిన అధికారులనూ, అనధికార ప్రముఖులనూ, పెద్దలనూ బుట్టలో వేసుకునేందుకుగాను భాషాభిమానాన్ని వాడుకుంది. నోరు జిల ఉన్నవాళ్లను వేదిక ఎక్కించి మైకు అందించింది. శాలువాల పిచ్చోళ్లకు సన్మానాలు చేసింది. మొత్తం మీద రాంకీ అనే సంస్థ ప్రజల కోసం, ప్రత్యేకించి తెలుగు ప్రజల కోసం, ప్రకాశం వికాసం కోసం, ఒంగోలు వాసుల వెలుగుకోసం పనిచేసేందుకే ఉద్భవించిందని అనిపించుకునేందుకుగాను నానా తంటాలూ పడింది. తాను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని ఓ గొంతుయ్య, తెలుగు యాంకరమ్మ సుభాషిణి వ్యాఖ్యాతలుగా మూడు రోజుల పాటు తిరునాళ్లు జరిపింది. తెలుగుకు తెగులు పట్టిందని ఈ మహోత్సవంలో పలువురు పాచి పాటను తెగపాడేశారు. తెగులును వదిలించేందుకు తాము ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు ఆంగ్లంలో వీరావేశంతో ప్రకటించారు. తెలుగువాళ్లంటే బట్టు పెట్టుకోవాల్సిందేనంటూ ప్రవాసాంధ్ర మహిళా మణులు తెగవాగేశారు. చీరలు కడితే చాలు తెలుగుకు వెలుగొస్తుందని తీర్మానించారు. తమ బిడ్డలకు వేద గణితం నేర్పుతూ తెలుగును బతికించేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషను చంపేసిన ఆంగ్ల భాషా మసాలను దట్టించిన ప్రసంగాలు నిజమైన తెలుగోడికి రోత పుట్టించాయంటే నమ్మాలి. ఈ కార్యక్రమంలో ప్రతి అడుగూ డబ్బు కంపు కొట్టింది. సదస్సులంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కొక్కరికి కేవలం అరగంట కేటాయించటమే ఆయా విషయాలను కరివేపాకు చందంగా వాడుకునేందున్న వాదనకు బలం చేకూరుతోంది. ఉదాహరణకు వ్యవసాయ, విద్య తదితర రంగాలు ప్రస్తుతం దివాళాదశకు చేరుకున్నాయి. అలాంటి వాటిని గురించి ఎంతటి మేథావయినా కేవలం అరగంటలో చెప్పేయటం ఏ విధంగా సాధ్యం? ఈ రంగాలకు పట్టింది చిన్నా చితకా వ్యాధులా? ఓ గొట్టాన్ని మింగిస్తే సరిపోవటానికి? సరిజేయటానికి??
ఇక సాంస్కృతిక కార్యక్రమాలు తెగ బలిసినవాళ్ల తైతక్కలే తప్ప తెలుగు వాసన, తెలుగు సంప్రదాయం చిటికెడు కానరాలేదు. పైగా విదేశీ కరాటే కంటే గొప్ప యుద్ధకళలు దేశంలో చాలా ఉన్నాయంటూ కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన ఏవేవో జిమ్మిక్కులకు వేదిక కల్పించారు. ఎవరితో ఎవరు యుద్ధం చేయాలో? ఎందుకు యుద్ధం చేయాలో? మాత్రం నిర్వాహకులు తేల్చి చెప్పలేదు. మొత్తం మీద తెలుగు సంస్కృతి అంటే ద్రవిడులను చంపేసిన అమ్మలు ఎర్రటి నాలుకల్ని వేలాడేసి పిచ్చెక్కినట్లు గిరగిరా తిరగటమేనన్న ప్రదర్శనలకూ బాగానే చోటు కల్పించారు. అక్కడ, ఇక్కడ, ఎక్కడైనా అన్నట్లుగా ఒంగోలు వీధుల్లో ప్రవహించే మురుగుకు తోడు భక్తిని కూడా యథావిథిగానే బాగా పారించేరు. అలా అలా తమ భవిష్యత్తు వ్యాపారాలకు ఎవ్వరూ అడ్డురాకుండా చూసుకునే పనిలో రాంకీ గట్టిగానే తెలుగువాడిని వాటేసుకుంది. చెత్త వ్యాపారాలకు సంబంధించి ఎవడన్నా నిజం చెప్పాలనుకునే పిచ్చోడుంటే వాడి నోరును గట్టిగా మూయించేందుకు తగినవారిని ఏర్చికూర్చి పెట్టేసుకుంది.
”తెలుగు మహోత్సవాలను రాంకీ ఒంగోలులో ఎందుకు జరపాలనుకుందో నాకు తెలియదుగానీ, రెండు మూడు రోజులలో వాళ్లే చెబుతారనుకుంటున్నాను” అంటూ రాష్ట్ర పురపాలకశాఖామాత్యుడు మానుగుంట మహీధరరెడ్డి చివరి రోజు నిర్వహించిన విజయోత్సవ సభలో విసిరిన విసురు యాదృచ్చికం కానేకాదు. వ్యాపారాలు – వాణిజ్యాల రక్షణ కోసం శాసన వేదికలు ఎంతగా ఉపయోగపడతాయో తెలిసిన రాంకీ తమ అధినేతను ఈ సారి ఒంగోలు నుంచి గెలుపించుకోవాలన్న కోరికతో ఉంది. గెలాక్సీ గ్రానైటు, ముడి ఇనుము, అపారమైన సముద్ర సంపద, 140 కిలోమీటర్ల తీర ప్రాంతం, మెగా ఓడరేవు నిర్మాణానికి అవకాశాలు ఇలా పలు ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న ఒంగోలును సొంతం చేసుకునేందుకు రాంకీ పావులు కదుపుతోంది. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో తమ అధినేతను ఒంగోలు నుంచి గెలుపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదీ ఇప్పుడు ఊరేగుతోన్న తెలుగుదేశం పల్లకీ కాదట. వేణుగోపాలరెడ్డి తానున్న తెలుగు తక్కెడ నుంచి త్వరలో దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. కొడితే కుంభస్థలాన్ని కొట్టి కోట్లు వెనకేసుకోవాలన్న తపనతో వైఎస్‌ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెసు అభ్యర్ధిత్వం కోసం వేణుగానం చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఎవరో అల్లాయి, పుల్లాయి చెప్పింది కాదు. ఓ మంత్రివర్యుడు తెలుగు మహోత్సవ విజయోత్సవ సభ వేదిక సాక్షిగా వ్యక్తిగత సంభాషణల్లో వెల్లడించిన ఓ నిజం.
అదండీ సంగతి. రాంకీ తెలుగు తిరునాళ్ల వెనుక వ్యాపారాలు, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన పదవుల వ్యవహారం ఉందంటే మీరు ఏమంటారు ?