నేను నాస్తికుడిని. అంటే పెద్దగా ఆస్తిలేని వాడినన్నమాట. అందుకనేగదా, రాత కూలివాడుగా బతుకీడుస్తున్నాను. హై – ధరా- బాదు – లో బస్సుల్లో తిరిగే అతితక్కువ మంది పాత్రికేయుల్లో నేనొకడిని. ఈ బస్సుల మీద వార్తలుగానీ, కవితలుగానీ, కథలుగానీ, నవలలుగానీ… ఇలా దేన్నయినా సరే టన్నుల కొద్దీ రాసిపారేయొచ్చని నాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. నేనేంటి – ఆ మాటకొస్తే రాయటం బొత్తిగా రానే రాదని తేల్చేసుకున్నవారెవరయినా సరే గుట్టలకు గుట్టలు రాసిపారేయొచ్చు. కాకపోతే బస్సు ప్రయాణికుడయి ఉండాలి. నా విషయానికే వస్తే నగరంలో బస్సు ప్రయాణికుడిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్నాను. ఇక మీకు అనుమానం తీరినట్లేగా మరి!
ఇక ఇప్పటి నుంచీ రోజూ ‘బస్సు భాగోతం’ పేరిట రాసేయాలని నిర్ణయించేసుకున్నాను. అతే కాదు, ఇప్పటి నుంచే రాసేయటం ప్రారంభిస్తున్నాను …. కాసుకోండి మరి!
ఓ రోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ”కావేసురా, కావేసురా … నీకు ఇష్టమైన కోరిక అదీ ఒక్కటంటే ఒక్కటి కోరుకో. అది ఎలాంటి కోరికయినా ఇట్టే తీర్చేస్తాను” అంటూ పలికాడు.
”అయితే హైదరాబాదు నగర బస్సులన్నింటిలోనూ, అన్ని సమయాల్లోనూ, ప్రతి రాకపోకలోనూ విధిగా ఒక్క సీటయినా ఖాళీగా ఉండేంత అధిక సంఖ్యలో వాహనాలు నడిచేలా చేయి స్వామీ” గుక్క తిప్పుకోకుండా చెప్పేశాను నా కోరికను.
తెనుగు సినిమాలకు మల్లే ”తథాస్తు” అంటాడు కదా అని ఆయనకల్లే చూస్తున్నాను. అయితే మరో రకంగా ఆ చోద్యం ముగిసింది. నా కోరికను విన్నంతనే ఆయన ముఖ కవళికలు వేగంగా మారాయి. చేత్తో తన నుదుటి మీద గబగబా రెండుసార్లు బాదుకున్నాడు. ”అమ్మో, అమ్మో, ఇక మీదట ఎప్పుడూ కోటి సంవత్సరాలపాటు ఘోరాతి ఘోరంగా తపస్సు చేసినా సరే, పాత్రికేయ దొంగ ముండాకొడుకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షం కానే కాను బాబోయ్!.” అంటూ దేవుడు క్షణాల్లో మాయమయిపోయాడు.
10 ఫిబ్ర
Posted by కృష్ణశ్రీ on ఫిబ్రవరి 11, 2012 at 4:04 సా.
“కావేసురా….కావేసురా…..”
“పాత్రికేయ దొంగ ముండాకొడుకులకు…..”
“……కాను బాబోయ్!”
భలే, భలే!