‘ఆ ఒక్కటీ అడక్కు’ తెలుగు సినిమాలో దేన్ని అడగకూడదని చెప్పారో తెలియదుగానీ … హైదరాబాదు నగర బస్సుల్లో విహరించే విద్యార్థులు మాత్రం ఆ ఒక్కటీ మోయరుగాక మోయరు. ఆ ఒక్కటీ అంటే వాళ్ల చేతుల్లో ఉండేది ఒకే పుస్తకం కదా మరి. విద్యార్థులు బస్సెక్కీ ఎక్కగానే తమ చేతనున్న ఒక్క పుస్తకాన్నీ అందుబాటులో ఉన్న ఏ ప్రయాణికుడి వళ్లోనో పడేస్తారు. కనీసం వాడిని అడగాలన్న నాగరికత వాళ్లకు ఎందుకు తెలియకుండా పోయిందో నాకు తెలియదు. అడగరు సరికదా, ఆ ప్రయాణికుడి ముఖమైనా చూడరు. ఎటో చూస్తూ, ఏదో చేస్తూ ముందు పుస్తక భారాన్ని వదిలించుకుంటారు. చైనాలో పాతరపోళ్లు బిడ్డల్ని వీపుకి కట్టుకున్నట్లుగా కొందరు విద్యార్థులు తెచ్చుకున్న సంచినయినా సరే ఎవడో ఒకటిడికి అప్పగించి సెల్ ఫోన్లని చెవుల్లో ఇరుకించుకుని ఎఫ్‌ఎం పాటల తోటలో పిచ్చోళ్లయి పోతుంటారు. ఇక పిడుగులు పడ్డా వాళ్లకు ఈ లోకం పట్టదు. కావాలంటే మీరూ ఒక్కసారి పరిశీలించి చూడండి. ఫోన్లని చెవుల్లో దూర్చుకుని పాటలు వినేవాళ్లకీ, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి రోగులకీ పెద్దగా తేడా కనపడదు. ఏదో లోకంలో ఉంటారు. నాకయితే వాళ్లను చూస్తే ‘మట్టి పాము’ అనీ ‘మట్టి పింజర’ అనీ మా ఊళ్లో పిలిచే అంతంతమాత్రానికి కదలని, మెదలని పాములే గుర్తుకొస్తాయి. ఇలా కుర్రకుంకల పుస్తకాలనో, సంచుల్నో మోయటం అంటే నాకు మహా చికాకు. అందుకని వీలయినంత వరకూ ఈ అనాగరిక వ్యవహారంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడతాను. అయితే ముఖాలు చూడకుండానే మన మీద వాళ్ల సంచుల్ని వస్తున్న సంస్కృతిని బాగా ఒంట బట్టించుకున్న ఈ నగరపోళ్ల వెకిలికి నేను అప్పుడప్పుడూ చిక్కిపోతుంటాను. అయినా నా నిరసనను వ్యక్తం చేయకుండా మాత్రం ఉండను.
నగరం అంటే నా దృష్టిలో నాగరీకుల పురం. గ్రామీణుల కంటే, పట్టణవాసుల కంటే నగరవాసులు నాగరీకంగా వ్యవహరించాలి. అయితే తెలుగు రాజధాని హైదరాబాదులో ఆ భాగ్యమే కనపడదు.
ఇప్పుడేమన్నా టీవీలు నేర్పాయేమో తెలియదుగానీ, కొన్నాళ్ల క్రితందాకా చెన్నయ్, బెంగళూరు, విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ తరహా కుసంస్కృతి లేదు. ఇప్పుడు అక్కడకూ ఆ… ఒక్కటీ మోయకు విధానం పాకి ఉంటే, గింటే అదంతా టీవీల పుణ్యమే అయి ఉంటుంది.
నాగరీకులారా, మీ పుస్తకాన్ని మీరే మోసుకుంటున్నారు కదూ! మీ సంచిని ఇంకొకడి వళ్లో పారేయటం లేదు కదూ!!
Archive for ఫిబ్రవరి 12th, 2012
12 ఫిబ్ర