Archive for మార్చి 27th, 2012

అందరూ దొంగలే! అప్పటిదాకా ….

ప్రపంచం నివ్వెరపోయింది. నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
దేశదేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలన్నీ ప్రత్యక్షంగా వార్తల సేకరణ కోసం తమ తమ ప్రత్యేక ప్రతినిధులను ఆగమేఖాలమీద భారతదేశానికి పంపాయి. ప్రపంచంలో ఏ పత్రికను తిరగేసినా, ఏ ఎలక్ట్రానిక్‌ ఛానల్‌ను తిలకించినా ఒక్కటే వార్త – భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీచేసిన అత్యవసర ఆదేశంపై చర్చలు … చర్చోపచర్చలు. ఆయా దేశాధినేతల స్పందనలు. ఇంతవరకూ, ఏ దేశంలోనూ చోటు చేసుకోని సంఘటన ఇప్పుడు భారతదేశాన్ని అతలాకుతలం చేస్తోంది.
దేశం అట్టుడికిపోతోంది. ఏమి జరుగుతుందో అర్థంకాక సామాన్య ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
దీనికంతటికీ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలే కారణమయినా, మూలం మాత్రం ఓ సామాన్యుడు. అదీ ఓ తెలుగువాడు. మారుమూల పల్లెకు చెందిన బడుగుజీవి. పదో తరగతితో చదువుకు స్వస్తి పలికి తనకున్న నాలుగెకరాల భూమిలో ‘ఎగ’సాయం చేసుకుని బతుకీడుస్తున్న పల్లెటూరోడు.
ఇప్పటిదాకా ఆ ఊరు ఏనాడూ మీడియాకు ఎక్కిన దాఖలాలు లేవు.
ప్రపంచస్థాయి సంచలనానికి మూలమయిన ఆ పల్లెటూరోడు తన ఊళ్లోనూ అందరికీ తెలిసినవాడూ కాదు. ఇప్పటిదాకా తన పనేందో తనేందో అంతే. పొలం నుంచి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి దిన పత్రికను తిరగేసి వచ్చేవాడు. ఇంట్లో టీవీ వార్తల్ని వీక్షించేవాడు.
సాయంకాలం ఐదు గంటలయింది. ఎప్పటిమాదిరిగానే పల్లెటూరోడు పంచాయతీ కార్యాలయంలో ఆనాటి దినపత్రికను ఆ మూలాగ్రం చదివేస్తున్నాడు. ఒక్కొక్క వార్త చదివేకొద్దీ అతని మనసు వికలమవుతోంది. అవినీతి … అవినీతి. దేశాన్ని అవినీతి మహా వృక్షం ఆవరించింది. ప్రధాన మంత్రి మొదలు పంచాయతీ గుమస్తాదాకా అవినీతిపరులు రాజ్యమేలుతున్నారు. ఎవరినీ మరెవ్వరూ వేలెత్తి చూపించకుండా అంతో ఇంతో నోరున్న ప్రతివాడికీ అవినీతి రుచి చూపించి మాయచేస్తున్నారు. నువ్వు అవినీతి పరుడువంటే – కాదు, కాదు నువ్వే మహా అవినీతి పరుడువంటూ పత్రికల నిండా తిట్ల దండకాలకు కొరవే ఉండదు. మారుమూల కుగ్రామంలో ఉండే నాలాంటి వాడికే ఇంత బాధగా ఉంటే పార్లమెంటుకు ఎందుకు పట్టదు? సుప్రీంకోర్టు ఎందుకు స్పందించదు?? కాసేపు తర్జనబర్జన పడ్డాడు పల్లెటూరోడు.
”అయినా బుర్ర చెడగొట్టుకోవటమేగానీ, నన్నెవరు పట్టించుకుంటారు? నా బాధ ఎవరికి కావాలి.” అనుకుంటూ దినపత్రికను మడత పెడుతుండగా ఓ చిన్న వార్త ఆకర్షించింది.
‘రేపు తడకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక”
ఆ వార్తను ఒకటికి రెండుసార్లు చదివాడు. తమ మండల కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నాడు. అదీ రేపే… ”నాకేమీ తెలియదని ఊరుకుంటే లాభం లేదు. ఏమీ చేతగాదని అనుకుంటుంటే ఏమీ చేయలేము. పాత రోత అనుకుని సరిపెట్టుకోవటం కాదు. ఆ రోతను కడిగిపారేసేందుకుగాను ఎక్కడోకక్కడ… ఎవడో ఒకడు ప్రారంభించాలి.” తన చిన్నప్పుడు ఉపాధ్యాయుడు పదే పదే చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంతే …. పల్లెటూరోడికి చేయాల్సిన పనేదో తలకెక్కింది.
”అయ్యా, న్యాయమూర్తిగారూ” పల్లెటూరోడు పెద్దగా కేకేశాడు. సభలో కలకలం. ఒక్కుమ్మడిగా పోలీసులు పల్లెటూరోడి మీద పడి పిడి గుద్దులు గుద్దుతూ లాక్కుపోతుండగా…. ప్రధాన న్యాయమూర్తి వారిని నివారించాడు. అతనిని తన దగ్గరకు పంపమని ఆదేశించారు.
పేరూ, ఊరూ కనుక్కున్నాడు. ”సభలో అరిచినందుకు మామూలుగానయితే నీకు శిక్ష వేయొచ్చుగానీ, ఏదన్నా బలమైన కారణం ఉంటే మాత్రం క్షమిస్తా” అంటూ న్యాయమూర్తి భరోసా ఇచ్చారు. పైగా సమస్య పరిష్కారానికి తాను చేయగలిగిందంతా చేస్తానని కూడా మాటిచ్చారు. దాంతో పల్లెటూరోడు కాస్త ఊపిరి పోసుకున్నాడు.
”న్యాయమూర్తిగారూ, మీరంటే నాకు వ్యతిరేకత లేదు. పైగా గౌరవిస్తాను కూడా. ఇవాల్టి పత్రిక చదివారా? ఇవాల్టి పత్రిక అనేముంది ఏ రోజు చూసినా ఒకటే రకం వార్తలు. అవినీతి… అవినీతి. ప్రధాన మంత్రి దగ్గర నుంచి పంచాయతీ గుమస్తాదాకా అవినీతికి పాల్పడ్డ వార్తలే వార్తలు. ఎన్నాళ్లిలా కొనసాగాలి? ఎవరు పరిష్కరిస్తారు? మీకు తెలియదని కాదుగానీ, ఎక్కడోకక్కడ – ఎవరో ఒకరు ప్రారంభించాలని మా పంతులుగారు చెబుతుండేవాడు. అవినీతి అంతానికి ఏదో ఒకటి చేయమని చెప్పటం కోసమే నేను అరిచాను. రాష్ట్రపతి విదేశీ పర్యటన ఖర్చు రూ. 205 కోట్లు – సైన్యాధిపతికి రూ. 14 కోట్ల లంచం ఇవ్వజూపిన వైనం – కోల్‌గేట్‌ కుంభకోణం ఖరీదు రూ. 10 లక్షల కోట్లు – పామోలిన్‌ మొక్కల కొనుగోలుమాల్‌ – సిండికేట్లకు సహకరించిన ఆరుగురు సిఐలకు జైలు – సిండికేట్లకు సహకరించిన పోలీసుల జాబితాను తారుమారు చేసిన ఏసీబీ అధికారుల సస్పెన్షన్‌ – ఉద్యోగాల పేరిట ఆరు కోట్లు వసూలు చేసుకుని ఉడాయించిన మోసగాడు – పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన ఉపాధ్యాయులు – ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతూ ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు అరెస్టు – రుణ మంజూరు కోసం పారిశ్రామికవేత్త నుంచి లంచం తీసుకుంటూ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు – పరీక్షల్లో చూచిరాతలకు అవకాశం కల్పించిన అధ్యాపకురాలు” వినండి న్యాయమూర్తిగారూ వినండి. ఆనాటి దినపత్రిక నుంచి వరుసగా అవినీతికి సంబంధించిన వార్తల్ని చదివి విన్పించాడు.
”మీకు ఓపిక ఉంటే చెప్పండి. నేను ఇప్పటిదాకా చదివింది కాసింత పెద్ద అవినీతి వ్యవహారాలు మాత్రమే. ఇంకా బోలెడన్ని వార్తలున్నాయి. పైగా ఇవన్నీ పెద్ద పేపర్లోనివి మాత్రమే. జిల్లా పేజీలు కూడా పరిశీలిస్తే వీటికి రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి. అందులోనూ ఇవి ఒక్క పత్రికలోవే. అన్ని భాషల పత్రికల్నీ, అన్ని రాష్ట్రాల వాటినీ చూసి జాబితా తయారు చేస్తే ఒక్క రోజు ప్రచురితమయ్యే అవినీతి వార్తలన్నింటినీ చదవాలంటే నా అనుభవాన్ని బట్టి కనీసం ఒక్క నెలయినా పడుతుంది మరి.” గడగడా మాట్లాడుతూ ఊపిరి తీసుకునేందుకు ఆగాడు పల్లెటూరోడు.
న్యాయమూర్తి చప్పట్లు చరిచాడు. అంతే సభలో ఉన్నవాళ్లంతా అందుకున్నారు. ఆ ప్రాంతం చప్పట్లతో మారుమోగిపోయింది.
”అందరికీ తెలిసిందే అయినా, దేశంలో వేళ్లూనుకున్న అవినీతి వ్యవహారాన్ని ఎంతో ధైర్యంగా, ఉదాహరణలు సహా మన దృష్టికి తీసుకొచ్చిన పల్లెటూరోడిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారానికి మనమంతా ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది. నా వంతుగా నేనూ ప్రయత్నిస్తాను. ఏమి చేస్తానని మాత్రం ఇప్పటికిప్పుడే ఇక్కడ చెప్పలేకపోతున్నందుకు పల్లెటూరోడు నన్ను క్షమించాలి. వీలయినంత వెంటనే కలుస్తానని మాత్రం అతనికి హామీ ఇస్తున్నాను. అందరి నుంచీ సెలవు తీసుకుంటున్నాను” అంటూ చేతులు జోడించారు న్యాయమూర్తి. వేదిక నుంచి దిగబోతూ … ”అన్నట్లు నేను అటు వెళ్లగానే పల్లెటూరోడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారేమో! అలా చేయొద్దు. అతనిని వదిలేయండి.” అంటూ హెచ్చరించారు.
మూడు రోజుల తర్వాత ….
సుప్రీంకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ప్రస్తుతం దేశం మొత్తం అవినీతిలో కొట్టుమిట్టాడుతోంది. అందువలన మొత్తం వ్యవస్థే ప్రక్షాళన జరగాలి. ఉన్న సమాచారాన్ని బట్టి దేశ ప్రథమ పౌరుడు మొదలు గ్రామ నౌకరు వరకూ తాము అవినీతి పరులం కాదని ఎవరికి వారే నిరూపించుకోవాలి. అలా నిరూపించుకునేవరకూ దేశంలో న్యాయమూర్తులుసహా ఉద్యోగులంతా, ప్రజాప్రతినిధులంతా కారాగారంలో ఉండాల్సిందే. ఇన్ని లక్షల మందికి తగినన్ని కారాగారాలు దేశంలో లేనందున ప్రతి కార్యాలయమూ – అన్ని చట్టసభలను కూడా కారాగారాలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాము. అంటే ఉద్యోగులంతా వారి వారి కార్యాలయాల్లోనూ, ప్రజాప్రతినిధులంతా వారి వారి చట్ట సభల్లోనూ బందీలుగా ఉంటారు. తమ పనేదో తామేదోగా బతికిన సామాన్యులు సభ్యులుగా ప్రాథమిక న్యాయ కేంద్రాలను ప్రజలే ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తొలివిడతగా ప్రాథమిక న్యాయస్థానాల నుంచి నీతివంతులుగా గుర్తింపు పొందిన వివిధ రకాల నిపుణులతో ఏర్పాటయ్యే సంఘాలు పూనుకుని రెండో దఫా పరిశీలనను పూర్తిచేస్తాయి. మూడోదఫాగా న్యాయమూర్తులతో ఏర్పాటయ్యే కోర్టులు తమస్థాయిలో పరిశీలించి తుది తీర్పులు వెలువరిస్తాయి. ఆ తర్వాత అవసరమైతే ప్రత్యేక కోర్టుల్నీ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం దేశమంతటా ఒకేదఫా ప్రారంభమవుతుంది. మూడు నెలల్లో ముగుస్తుంది. ఈ ఉత్తర్వుల నుంచి ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు. అవినీతిపరులకూ, వక్రమార్గాలతో తప్పించుకునే ప్రయత్నాలు చేసేవారికి, వారికి సాయం చేసేవారికి విధించాల్సిన శిక్షల జాబితాను కూడా దీనితో జత చేస్తున్నాము.”
ఇట్లు
ప్రధాన న్యాయమూర్తి,
సుప్రీంకోర్టు
ఇప్పుడు దేశమే కారాగారామయింది. తమ పనేదే తాము చేసుకునే సామాన్యులు తప్ప అందరూ కారాగారవాసులయ్యారు. ప్రపంచం నివ్వెరపోయి చూస్తోంది.