
మలేరియా చాలా ప్రాచీనమైన వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా 106 దేశాల్లో 3.3 బిలియన్ల ప్రజలు మలేరియా వ్యాధికి సంవత్సరంలో 9,85,000 మంది చనిపోయారు. 2009లో 7,81,000 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 2010 నుండి మలేరియా మరణాలు దాదాపు 25 శాతం తగ్గాయి. గత దశాబ్దంలో ఆఫ్రికా దేశాలలో మూడింట ఒక వంతు మరణాలు తగ్గాయి. ఆఫ్రికా దేశాలు మినహాయించి చూస్తే, 53 దేశాల్లోని 35 దేశాల్లో మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య 50 శాతం తగ్గింది. బాగా మలేరియా నియంత్రణ చర్యలు చేపట్టిన దేశాల్లో పిల్లల్లో మరణాలు 20 శాతం తగ్గాయి. యునైటెడ్ అరబ్ ఎమిరెటిస్, మోరాకో, టర్కెమినిస్తాన్, ఆర్మీనియా దేశాలు మలేరియాను పూర్తిగా నిర్మూలించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 60వ సమావేశం 2007లో జరిగింది. ఈ సమావేశంలో 2008నుండి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినం జరుపుకోవాలని నిర్ణయించారు. మనం ఈ సంవత్సరం 25న ఐదవ ప్రపంచ మలేరియా దినం జరుపుకుంటున్నాం. ప్రతీ సంవత్సరం ప్రపంచ మలేరియా దినం ఒక సందేశంతో జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం సందేశం ‘సాధించిన ఫలితాలను నిలబెట్టుకోండి. ప్రాణాలను కాపాడండి : మలేరియాపై పెట్టుబడులు పెట్టండి’.
మన దేశంలో జాతీయ కీటక జనిత రోగనియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఏటా మలేరియా ఏ మాత్రం ఉందని తెలుసుకోవడానికి దేశ జనాభాలో 10 శాతం మందికి మలేరియా పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో దాదాపు 1.5 నుండి 2 మిలియన్ల ప్రజల్లో మలేరియా క్రిమి ఉన్నట్లు తెలుస్తున్నది. మనదేశంలో ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. 95 శాతం ప్రజలు మలేరియా వ్యాధికి గురయ్యే పరిస్థితుల్లో జీవిస్తున్నారు. 80 శాతం మలేరియా 20 శాతం ప్రజలు జీవించే ప్రాంతాలైన అడవులు, కొండ ప్రాంతాలు, ఆదివాసీలు జీవించే ప్రాంతాల్లో వస్తున్నది. మలేరియా ఎక్కువగా ఉండే సమాజాల్లో దాదాపు 1.3 శాతం జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి) తగ్గిపోతుంది. ప్రజారోగ్య ఖర్చులో 40 శాతం మలేరియా నివారణకే ఖర్చవుతుంది. 30 నుండి 50 శాతం ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకునే రోగులు మలేరియా వ్యాధి కొరకే. ఔట్‌పేషెంట్ ప్రక్రియ ద్వారా వైద్యం పొందే రోగుల్లో 60 శాతం మలేరియా వ్యాధి వైద్యం కోసమే. మలేరియా ఎవరికైనా రావొచ్చు. మలేరియా పేదవారిలో, పనుల కోసం తిరిగే వారిలో, గుంపులు గుంపులుగా జీవించే వారిలో ఎక్కువ వస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో నిద్రించే వారిలో కూడా ఎక్కువగా వస్తుంది.
మలేరియా పరాన్నజీవి
మలేరియా నాలుగు రకాల పరాన్న జీవుల ద్వారా మనిషికి వస్తుంది. ప్లాస్మోడియా ఫాల్సిఫారమ్, ప్లాస్మోడియా వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఒవేల్. వీటిలో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ చాలా ప్రమాదకరం. మలేరియా ఒకరి నుండి ఒకరికి ఆడ అనాఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ రాత్రిపూట ఎక్కువగా కుడుతుంది. దాదాపు 20 రకాల అనాఫిలిస్ దోమలు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయి. మలేరియా వ్యాప్తి వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
మూడు దశల్లో లక్షణాలు
దోమకుట్టిన 10 నుండి 15 రోజుల్లో మలేరియా వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. మలేరియా జ్వరం 3 దశల్లో ఉంటుంది.
చలిదశ : ఈ దశలో తలనొప్పి, కడుపులో తిప్పటం, నిస్సత్తువ, చలిలో వణకడం ఉంటుంది. ఈ దశ పావుగంట నుండి ఒక గంట వరకు ఉండొచ్చు.
వేడి దశ : ఈ దశలో ఒళ్లు కాలిపోతున్నట్లు ఉంటుంది. రోగులు బట్టలు వదులు చేసుకోవడం, తీసేయడం చేస్తారు. ఈ దశ రెండు నుండి 6 గంటలు ఉంటుంది.
చెమట దశ : జ్వరం తగ్గుతుంది. బాగా చెమట పడుతుంది. ఈ దశ రెండు నుండి 4 గంటలు ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ-వైద్యం
మనదేశంలో ‘జ్వరమా?-మలేరియా కావొచ్చు’ అనే నినాదంతో ప్రతి జ్వరానికి మలేరియా పరీక్ష చేసే ఏర్పాట్లున్నవి. ఆరోగ్య కార్యకర్తలకు ఇందుకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. వారికి మలేరియా గురించి పూర్తి అవగాహన ఉంది. వారు రక్తపరీక్ష చేసి, మలేరియా నిర్ధారించి మందులు కూడా ఇస్తారు. మలేరియా ఎండెమిక్ జిల్లాల్లో ‘ఆశా’ కార్యకర్తలకు మలేరియా శిక్షణ ఇచ్చారు. ప్లాస్మోడియం ఫాల్సిఫారం మలేరియా నిర్ధారించడానికి ‘ర్యాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్స్’తో చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహించే వసతులున్నాయి. జ్వరం వచ్చిన రోజే పరీక్షలు నిర్వహించి, వైద్యం తీసుకుంటే చాలా మరణాలు తగ్గించొచ్చు.
మలేరియా అనుమానిత జ్వరాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నిర్దారణ చేసి మాత్రమే మలేరియా మందులు వాడాలని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూత్రాలున్నవి. వ్యాధి నిర్ధారిత పరీక్షలు రోగులకు అందుబాటులో లేనప్పుడే మలేరియా జ్వరం అని అనుమానించి రోగులకు మలేరియా మందులతో వైద్యం చేయాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మన దేశంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో ఎలాంటి వైద్య సేవలు ఇవ్వాలనే మార్గదర్శకాలున్నాయి. ప్లాస్మోడియం వైవాక్స్‌తో వచ్చే మలేరియాలో క్లోరోక్విన్ 3 రోజులు, ప్రైమాక్వీన్ 14 రోజులు ఇవ్వాలి. ప్లాస్మోడియం ఫాల్సిఫారంతో వచ్చే మలేరియాలో ఆర్టిమిసినిన్ కాంబినేషన్ చికిత్స ఇవ్వాలి.
తీవ్ర మలేరియా
ఈ మలేరియా జ్వరంలో మత్తుగా ఉండటం, ఫిట్స్ రావడం, తీవ్ర బలహీనత, మూత్రవిసర్జన తగ్గిపోవడం, తీవ్రమైన వికారం, తీవ్ర మలేరియా లక్షణాలు. ఇలాంటి లక్షణాలుంటే అన్ని వసతులున్న ఆసుపత్రుల్లో రోగిని చేర్పించాలి.
వ్యాధి నిరోధక చర్యలు
మలేరియా వ్యాధినిరోధానికి ఎలాంటి టీకా మందు లేదు. దోమల నిరోధమే కీలకం.
* ఇళ్లల్లో క్రిమి సంహారక మందులు చల్లించడం కీలకమైన కార్యక్రమం. ఎపిఐ(ఆన్యువల్ పారసైట్ ఇన్సిడెన్స్) బట్టి వివిధ రకాల క్రిమి సంహారక మందులు వాడతారు. అవి-సింథటిక్ పైరిథ్రాయిడ్స్, డిడిటి(డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోఎథేన్)-50 శాతం, మలాథయాన్- 25 శాతం.
* లార్వాలపై చర్యలు – దోమలు పెరిగే ప్రాంతాలలో లార్వాలను నియంత్రించడానికి టెమిఫాస్ అనే మందును నీటి గుంటలపై చల్లుతారు.
* శాశ్వత నీటివనరులలో గంబూజియా చేపలను వదలాలి.
* గాలిలోని దోమలను చంపడానికి పైరిథ్రమ్‌ను స్ప్రే చేయాలి.
మాలాథయాన్ పెక్నికల్‌తో ఫాగింగ్ చేయాలి.
* దోమ తెరల వాడకం. ఇప్పుడు మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ‘దీర్ఘకాలం మన్నే క్రిమి సంహారిణి మిలిత దోమ తెరలను’ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం మన రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతున్నది.
* మలేరియా నిరోధక కార్యక్రమంలో వ్యక్తిగత రక్షణ చర్యలు కూడా ఎంతో పాత్రనిర్వహిస్తాయి. మురికి కాల్వల నిర్మాణం మంచిగా చేపట్టాలి. మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు పూర్తిగా కప్పి ఉంచే బట్టలు ధరించాలి. వీలైతే ఇళ్లకు మెష్షులు ఏర్పాటు చేసుకోవాలి.
నియంత్రణ నుంచి రోల్‌బ్యాక్ మలేరియా వరకూ మనదేశంలో 1953లో జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో మలేరియా వ్యాధి వచ్చే ప్రాంతాలను స్ల్పీన్ రేటును బట్టి నిర్ణయించేవారు. 10 శాతం స్ల్పీను ఉండే ప్రాంతాలను మలేరియా ప్రాంతాలుగా పిలిచేవారు. ఈ కార్యక్రమం బాగా విజయవంతమైంది. 1953 నుండి 1958 వరకు మలేరియా కేసులు 75 మిలియన్ల నుండి 2 మిలియన్లకు తగ్గాయి. 1958 తర్వాత మలేరియా కార్యక్రమం వెనుకబడింది. 1961లో 50 వేల కేసులు రిపోర్టు అయితే, 1976లో 6.4 మిలియన్ల కేసులు రిపోర్టు అయ్యాయి. 1977 ఏప్రిల్ 1 నుండి మలేరియా సవరించిన కార్యక్రమం అమలైంది. 1999లో జాతీయ మలేరియా వ్యతిరేక కార్యక్రమం మొదలైంది. 2003-2004లో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మలేరియా కార్యక్రమం అమలు చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం నడుస్తున్నది. మనదేశంలో 1998లో రోల్‌బ్యాక్ మలేరియా కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యసేవలు నాణ్యంగా అందించేలా ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తారు. క్రిమిసంహారక మిలిత దోమతెరల వాడకం పెంచుతారు. ఆరోగ్య కార్యకర్తలందరికీ తగిన శిక్షణ ఇచ్చి, మౌళిక ఆరోగ్యసేవలందేలా చేస్తారు. మందుల పంపిణీలో సులభపద్ధతులు అవలంబిస్తారు. బాగాపనిచేసే మందుల కోసం పరిశోధనలు, టీకాలు కనుక్కోవడానికి పరిశోధనలు చేస్తారు.
మన ముందున్న సవాళ్లు
మన ముందు కొన్ని సవాళ్లున్నవి. ఇటీవల కాలంలో మందులకు లొంగని మలేరియా క్రిములు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున మనపై సవాళ్లు విసురుతున్నాయి. ప్రయివేటు వైద్యసేవలందించే వారు మలేరియా వ్యాధికి జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఇచ్చే మార్గదర్శక సూత్రాలు పాటించాలి. అలాగే ప్రయివేటు వైద్యులు మలేరియా నిర్ధారించిన వివరాలు ప్రభుత్వ సంస్థలకు తెలియజేయాలి. మలేరియా ఎక్కువగా పేదరికం జబ్బు మాత్రమే కాకుండా మలేరియా వల్ల కుటుంబాలు పేదరికంలోకి వెళ్లడం సామాజిక సమస్య. 2015 నాటికి మలేరియా పెరుగుదలను ఆపి, తగ్గింపు వైపు పయనించడం మలేరియా కార్యక్రమంలో సహస్రాబ్దిలక్ష్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ఆరోగ్య కార్యక్రమం విజయవంతం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఊరూరా ప్రపంచ మలేరియా దినం జరపండి. ఇందులో పేర్కొన్న అంశాలు అందరితో మాట్లాడండి. మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి. అందరం కలిసి అడుగులో అడుగు వేద్దాం. ప్రపంచాన్ని మలేరియా నుండి విముక్తి చేద్దాం.
డాక్టర్ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్
హైదరాబాద్