Archive for మే, 2012

స్థిరాస్తి రంగంలో రూ. 200 కోట్లకు పైగా మట్టి

Image
స్థలం కొనేదిక్కులేదు – వడ్డీ చెల్లింపుకు దారిలేదు
దళారులు విలవిల – ప్రకాశంలో కానరాని వికాసం
ఒంగోలు స్థిరాస్తిరంగ దళారులు వడ్డీల చక్రబంధంలో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఆకాశాన్నంటిన ధరలతో కొనుగోలు చేసిన స్థలాలు తిరిగి అమ్ముడుపోకపోవటంతో ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా మట్టి రూపాన ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నిరుటి వరకూ మే నెల రాకముందే ఒంగోలులో స్థిరాస్తి రంగ దళారుల హడావుడి కన్పించేది. ఇప్పుడు ఏ దళారి ముఖం చూసినా నేలనే చూస్తోంది. ఇబ్బడిముబ్బడిగా జేబులు నిండుతుండటంతో అప్పు చేసి మరీ స్థలాలు కొన్న దళారులకు ఇప్పుడు దిక్కుతోచని దుస్థితి ఏర్పడింది. దాదాపు రెండు వేల మంది దళారులు ఇప్పుడు రుణదాతలకు ముఖం చాటేసి తిరుగుతున్నట్లు చెబుతున్నారు. స్థలాలకుతోడు నగరం వెలుపల ప్రాంతాలలో నిర్మించిన అపార్టుమెంట్ల అమ్మకాలు కూడా కునారిల్లుతున్నాయి.
దళారుల అత్యాశ కారణంగా ఒంగోలు నగరంలో స్థలాల ధరలు పదేళ్లకు సరిపడా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభాన్ని చూడాలని పేరు రాయటానికి ఇష్టపడని స్థిరాస్తి రంగ విశ్లేషకులు ఒకరు రియల్‌ అడ్వైజరు ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. వందలాదిఆ మంది నూనుగు మీసాల కుర్రోళ్లు బృందాలుగా ఏర్పడి స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి ముందుచూపు, లెక్కలేకుండా వ్యవహారాలు నడిపారని గుర్తుచేశారు.
ఫైనాన్స్‌ కంపెనీల నుంచీ పల్లెటూరి భూస్వాముల నుంచీ మూడు రూపాయలు మొదలు పది రూపాయలదాకా వడ్డీకి అప్పులు తెచ్చి భూముల్ని దళారులు కొనుగోలు చేశారు. ఇలాంటివారు ప్రస్తుతం నగరంలో రెండు వేల మందిదాకా ఉన్నట్లు లెక్కలు విన్పిస్తున్నాయి. వారిలో ఒక్కొక్క బృందం కనీసం రూ. 20 లక్షల మొదలు ఏడు కోట్ల రూపాయలదాకా పెట్టుబడులు పెట్టారు. ఒంగోలు నగరానికి సమీపంలోని మంగమూరు గ్రామానికి చెందిన 17.50 ఎకరాల భూమిని కొందరు యువకులు కలిసి ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే దానికి సమీపంలో శ్మశాన స్థలం ఉండటంతో రోడ్డు నిర్మాణం సమస్యల్లో పడింది. దీంతో మౌలిక వసతుల నిర్మాణం వీలుకాలేదు. ఫలితంగా ఏడాది నుంచీ ఈ స్థలాన్ని తిరిగి విక్రయించుకోలేక పెట్టుబడి మొత్తం స్తంభించిపోయింది.
నగరం వెలుపల ప్రధాన కూడళ్లలో గది (సెంటుకు ఆరు గదులు) ఒక్కొంటికి లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలాలు ఇప్పుడు ఎందుకూ కాకుండా పడిఉన్నాయి. 40 లక్షల రూపాయలు పెట్టి కొన్న 40 గదుల భూమిని ఇప్పుడు రూ. 30 లక్షలకు అమ్ముదామన్నా కొనేదిక్కు లేదని ఓ దళారి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదంతా వడ్డీకి తెచ్చిన డబ్బుతోనే కొనుగోలు చేశానని తెలిపాడు. అసలు కాదుగదా, ఇప్పుడు వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితిలో పడిపోయానని చేయెత్తి నమస్కరించాడు. వడ్డీ ఎంత అని అడిగితే, ”ఆ … ఒక్కటీ అడక్కండి.” అంటూ ముఖం తిప్పుకుని చకచకా వెళ్లిపోయాడు.
అపార్టుమెంట్లదీ అదే దారి
అద్దంకి బస్సుస్డాండు, కర్నూలురోడ్డు, అంజయ్యరోడ్డు పరిసర ప్రాంతాలలో స్థలాల ధరలు మిన్నంటి ఉన్నా నగరం లోపల అయినందున ఒకింత చేతులు మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గది స్థలం రూ 15 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా పలుకుతోంది.
సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినందున రాష్ట్రప్రభుత్వం ఇసుక తవ్వకాలు నిలిపివేసిన తదుపరి గత నెల, నెలన్నర రోజుల నుంచీ ఒంగోలు, దాని పరిసరాల్లో నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. అయినా నగరం వెలుపల నిర్మించిన అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్ల్లు కూడా కునారిల్లుతూనే ఉన్నాయి. నిషేధానికి ముందు ట్ట్రారు ఇసుక మూడు వేల రూపాయలు ఉండగా, ఇప్పుడది రూ. 15 వేలు వెచ్చించినా దొరకటం లేదు. దీంతో నిర్మాణ రంగ పరిస్థితి దారుణంగా తయారయింది. ఈ స్థితిలోనూ నగరం వెలుపల అదీ దగ్గరంగా నిర్మించిన అపార్టుమెంట్లలో రెండు పడక గదులున్న 1070 చదరపు అడుగుల ఫ్లాట్లు రూ. 20 లక్షల మొదలు రూ. 22 లక్షల దాకా పలుకుతున్నాయి. అదే రెండు, మూడు కిలోమీటర్ల దూరం మధ్య నిర్మించిన ఆపార్టుమెంట్లలో కేవలం రూ. 14 లక్షలకే లభిస్తుండటం విశేషం. నగరం వెలుపల దాదాపు 500కు పైగా ఫ్లాట్లు ప్రస్తుతం అమ్మకం కోసం సిద్ధంగా ఉన్నట్లు లెక్కలు విదితం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదు మాదిరిగానే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోనూ అపార్టుమెంట్‌ ఫ్లాట్ల ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదే తరుణం కదూ!

ప్రకటనలు

పెట్రో భారం – ‘పన్నే’ అధికం

Image
పెట్రో ధరలో దాదాపు 80 శాతం దాకా పన్ను భారమే. ప్రభుత్వం ఎప్పుడూ చెబుతున్నట్లుగా వాస్తవానికి పెట్రో భారం మొత్తం నిజంగా అంతర్జాతీయంగా పెరిగింది కానేకాదని లెక్కలు విదితం చేస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. దేశావసరాన్నీ, ప్రజలపై పడుతోన్న భారాన్నీ చూడటం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు లీటరు ఒక్కొంటికి ప్రాంతాలను బట్టి రూ. 81 నుంచి రూ. 82 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా రూ. 14.78. రాష్ట్రానికి చెందిన పన్నులు రూ. 19.63. మొత్తం రూ. 34.41. ఇంతవరకూ చూసినా పెట్రోలు వాస్తవ ధరలో ఈ పన్నుల వాటా 78.17 శాతం. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 33 శాతం మేర అమ్మకం పన్ను కూడా విధిస్తోంది.
వాస్తవానికి అమ్మకం పన్నును మూల ధరపై విధించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ఇతర పన్నులు, కేంద్ర పన్నులు, రవాణా ఖర్చులు కలిపిన తర్వాత ధరపై అమ్మకం పన్ను వసూలు చేస్తోంది. అంటే కేంద్రం విధించిన పన్నులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పన్ను వసూలు చేస్తోంది. మూల ధరమీద అమ్మకం పన్ను విధిస్తే లీటరుకు రూ. 14.53 పడుతుంది. అయితే అన్నీ కలుపుకున్న ధరపైన పన్ను వసూలు చేస్తున్నందున రూ. 19.63 పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ విధానాన్ని అనుసరించినా ఇక్కడ లీటరుకు కనీసం ఐదు రూపాయలన్నా తగ్గుతుంది.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న దానిలో రూ. 6.35 వ్యాట్‌, రూ. 6.00 ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీ, రూ. 2.00 జాతీయ రహదారుల సెస్‌ ఉన్నాయి. దీనిలో వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్‌ డ్యూటీనిగానీ తగ్గిస్తే ఆరు రూపాయలు తగ్గుతుంది.
దేశ పన్నుల విధివిధానాలను బట్టి దేశంలో లభ్యంకానుందన దిగుమతి చేసుకునే అత్యవసర సరకులపై వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్‌ డ్యూటీనిగానీ విధించకూడదు.
నంగనాచి తుంగబుర్ర బీజేపీ
అంతర్జాతీయంగా పన్నులు పెరిగినప్పటికీ దేశంలో యధాతథంగా ఉంచేందుకుగాను 1960 నుంచీ కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధానాన్ని అనుసరించటం ప్రారంభించింది. అదే ‘ఆయిల్‌ పూల్‌’ (చమురు నిధి) విధానం. దీనికోసం దేశంలో అమ్ముడుపోయే ప్రతి లీటరు పెట్రోలుకు వినియోగదారులు చెల్లించే ధర నుంచి రూపాయి నిధిని వసూలు చేశారు. అంతర్జాతీయంగా ధర పెరిగినప్పుడల్లా ఈ నిధిని ప్రభుత్వం ఉపయోగించుకునేది. అలా ధర దాదాపుగా స్థిరంగా ఉండేది. కనీసం చీటికీ మాటికీ పెరిగేది కాదు. అయితే బీజేపీ కేంద్రం గద్దెనెక్కిన కాలంలో ఈ చమురు నిధి విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. ఈ నిధిలో ఆనాడున్న 30 వేల కోట్ల రూపాయలను వేరే అవసరాలకు తరలించింది. దానివలన అంతర్జాతీయంగా పెట్రో ధర పెరిగిన ప్రతిసారీ ఇక్కడ కూడా మనపై భారాలు వేయాల్సిన తప్పని పరిస్థితిని ఆనాటి వాజపేయి ప్రభుత్వం దేశంపై రుద్దింది. అయితే ప్రజలకు ఇదంతా ఎక్కడ గుర్తుంటుందిలే అన్న ధీమాతో పెట్రో ధర పెరిగినప్పుడల్లా ఆ పార్టీ కార్యకర్తలు తగుదునమ్మా అన్నట్లుగా జెండాలు బుజానవేసుకుని తప్పంతా కాంగ్రెసుదేనన్నట్లుగా వెర్రికేకలు పెట్టటం క్షంతవ్యంగాని నేరం.
కాంగ్రెసు మోసం
ప్రస్తుతం కేంద్రంలో గద్దెనెక్కి పాలిస్తోన్న కాంగ్రెసు కూడా తనదైన శైలిలో ప్రజలను మోసం చేస్తోంది. పద్ధతి ప్రకారం దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసిన తదుపరి ధరను లెక్కించాలి. అయితే ప్రభుత్వం దానికి భిన్నంగా శుద్ధి చేసిన చమురు దిగుమతి ధరకు సమానంగా పన్నులు లెక్కలు కడుతోంది. దీని వెనుకే అసలు మోసం దాగి ఉందని చమురు రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దేశానికి చెందిన కొన్ని సంస్థలకు కూడా చమురు దిగుమతి చేసుకుని విక్రయించేందుకు అవకాశం కల్పించేందుకే ఈ తప్పడు విధానానికి ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ సంస్థలకు అధిక లాభాలు రావాలంటే ఇక్కడ ప్రభుత్వం శుధ్ది చేసిన తర్వాతి ధరకూ, నేరుగా శుద్ధిచేసిన చమురుకు చెల్లించిన ధరకూ తేడా లేకుండా ఉండాలి. అప్పుడు ప్రభుత్వ ధరకే ప్రవేటు సంస్థలు కూడా విక్రయిస్తున్నారని కొంతకాలంపాటు ప్రచారం చేసుకునేందుకు వీలుపడుతుంది. తర్వాత నెమ్మదిగా చమురు రంగాన్నుంచి ప్రభుత్వం తప్పుకుని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తుంది. ఆ తర్వాత ప్రవేటు సంస్థలు తమ నిజస్వరూపాన్ని చూపించి మన జేబుల్ని పూర్తిగా ఖాళీ చేసేపనికి పూనుకుంటాయి.
పాతొక రోత కాదు – కొత్తొంతా మోతే
దీనికి తోడు దేశంలోని చమురు బావులను కూడా ప్రభుత్వం రిలయన్స్‌కు అప్పగించి చోద్యం చూస్తోంది. వాస్తవానికి తూర్పుగోదావరి తీరంలో లభ్యమయ్యే గ్యాస్‌ను ప్రభుత్వమే పంపిణీ చేపడితే ఒక్కొక్క బండను రూ. 50లకే అందించే వీలుందని నిపుణులు ఏనాడో తేల్చారు. అదే తీరున మిగతా పెట్రో పదార్థాలకు కూడా ఇప్పటి ధరతో పోలిస్తే నాలుగో వంతు కూడా పడదు. పన్నుల భారం తగ్గిస్తే వినియోగదారుల జేబులకు భారం తగ్గుతుంది. దానికి తోడు గతం మాదిరిగానే చమురు నిధిని కూడా తిరిగి పునరుద్ధరిస్తే ఇక చెప్పేదేముంది…. అప్పుడు పెట్రో మంటలుండవు – ఆందోళనలకూ ఆస్కారం ఉండదు. పెట్రోలు చౌకగా లభ్యమయితే నిత్యావసరాలు సహా వస్తువులన్నింటికీ రవాణా ఛార్జీలు తగ్గిపోయి సరసమైన ధరలకు లభ్యమవుతాయి. ఇదండీ పెట్రోలు కథ. మరి మీరేమంటారు!

సిమ్లా కార్పొరేషన్‌లో సిపిఎం అపూర్వ విజయం

  • మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలు కైవసం
  • కాంగ్రెసు, బిజెపి ఘోర పరాజయం
  • మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు
  • ప్రజలకు పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సిపిఎం చారిత్రాత్మక విజయం సాధించింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు మొట్టమొదటిసారిగా జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మేయర్‌ పదవికి సంజరు చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ పదవికి తికిందర్‌ పన్వర్‌ భారీ మెజారిటీలతో ఎన్నికయ్యారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. చౌహాన్‌, పన్వర్‌ ఘన విజయం సాధించడం పట్ల కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వ సారథి కాంగ్రెసు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెండు అత్యున్నత పదవులను సిపిఎం కైవసం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులతో పాటు 25 మంది సభ్యుల మున్సిపల్‌ కౌన్సిల్‌లో సిపిఎం మూడు కౌన్సిలర్‌ పదవులను కూడా గెలుచుకుంది. ఇక బిజెపి 12 కౌన్సిలర్‌ స్థానాలను గెల్చుకోగా, కాంగ్రెసు 10 స్థానాలు సాధించింది. సిపిఎం మేయర్‌ అభ్యర్థి సంజరు చౌహాన్‌ బిజెపి అభ్యర్థి డాక్టర్‌ ఎస్‌ఎస్‌ మన్హస్‌, కాంగ్రెసు అభ్యర్థి మధుసూద్‌లతో పోటీపడి తన సమీప బిజెపి అభ్యర్థిపౖౖె 7,868 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థికి 14,035 ఓట్లు రాగా, కాంగ్రెసు అభ్యర్థికి 13,278 ఓట్లు పోలయ్యాయి.

కాంగ్రెసు అభ్యర్థి దేవేందర్‌ చౌహాన్‌, బిజెపి అభ్యర్థి దిగ్విజరు సింగ్‌లతో పోటీ పడిన సిపిఎం డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి తికిందర్‌ పన్వర్‌ సమీప బిజెపి అభ్యర్థిని 4,778 ఓట్ల మెజారిటీతో ఓడించారు. బిజెపి అభ్యర్థికి 16,418 ఓట్లు రాగా, కాంగ్రెసు అభ్యర్థికి 13,205 ఓట్లు వచ్చాయి. మొత్తం 79,970 ఓట్లలో 51,115 ఓట్లు (64.84 శాతం) పోలయ్యాయి. పోలయిన మొత్తం 51,115 ఓట్లలో చౌహాన్‌కు 21,903 ఓట్లు (42.85 శాతం) రాగా, పన్వర్‌కు 21,000 ఓట్లు (41.42 శాతం) వచ్చాయి.1851లో సిమ్లా మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి మొదటిసారిగా సిపిఎం రెండు అత్యున్నత పదవులను సాధించింది. 1986 నుంచి సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసి)పై ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెసుకు ఈ ఎన్నికల్లో సిపిఎం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఇక్కడ పరోక్ష ఎన్నికల ద్వారానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రారంభం కాగానే సిపిఎం అభ్యర్థులు అత్యున్నత పదవులకు ఎన్నిక కావడం ప్రజాదరణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెసు విధానాలను, రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజెపి విధానాలను, అదే సమయంలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను తీవ్రంగా ఎండగట్టింది. సిపిఎం తన ప్రచారంలో కాంగ్రెసు, బిజెపి ఎస్‌ఎంసిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్న తీరును ప్రజలకు వివరించింది. బిజెపి ప్రభుత్వం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిధులను ఆపేసి ప్రజా సేవలను ప్రయివేటుపరం చేసిన వైనాన్ని విశదపరిచింది. నయా ఉదారవాద విధానాలు సామాన్య ప్రజలపై చూపుతున్న దుష్ప్రభావాన్ని తేటతెల్లం చేసింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత, అవినీతి, ప్రయివేటీకరణ, సామాజిక భద్రత లేమి…మొదలైనవాటికి దారి తీసిన కాంగ్రెసు, బిజెపి విధానాలను సిపిఎం ప్రజలకు వివరించింది. ఈ ఎన్నికల ద్వారా సిమ్లా ప్రజలు కాంగ్రెసు, బిజెపికి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అర్థమవుతోంది. దీంతో ఆ రెండు ప్రజా వ్యతిరేక పార్టీలను చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రి ధుమాల్‌, మంత్రులు, బిజెపి ఎమ్మెల్యేలు గెలుపు కోసం నానా అడ్డదారులు తొక్కారు. అయినా ప్రజలు వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. కాంగ్రెసు తరపున కేంద్ర మంత్రి వీరభద్రసింగ్‌ చేసిన ప్రచారం ఫలితమివ్వలేదు. సిపిఎం అభ్యర్థుల తరపున పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి ప్రచారం చేశారు.

ప్రజలకు పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు చరిత్మ్రాక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సిపిఎం పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు తెలిపింది. సిపిఎంపై నమ్మకముంచి గెలిపించిన ప్రజలకు, పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌ శాఖకు అభినందనలు తెలిపింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

సంపన్నుల ‘ పొదుపు’….. పి సాయినాథ్‌

ప్రణబ్‌ వల్లిస్తున్న పొదుపు చర్యలు సంపన్న వర్గాల అద్దంలోంచి కాకుండా సగటు భారతీయుని దర్పణంలోంచి చూడాలి. అప్పుడే దాని అసలు రూపం బయటపడుతుంది. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. కాయగూరల ధరలు ఏడాది వ్యవధిలో 60శాతం పెరిగాయి. పిల్లల్లో పౌష్టికాహార లోపం విషయంలో మన దేశం పరిస్థితి సబ్‌ సహారన్‌ ఆఫ్రికా దేశాల పరిస్థితి కన్నా హీనంగా ఉంది. అనేక కుటుంబాలు పాలు, ఇతర నిత్యావసరాలపై ఖర్చును బాగా కుదించుకొంటున్నాయి. వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల లక్షలాది కుటుంబాలు దివాళా తీస్తున్నాయి. రైతులకు వ్యవసాయ పెట్టుబడులు కానీ, అందుబాటులో రుణ పరపతి సౌకర్యం కానీ ఉండడం లేదు. తాగునీటి సమస్యతో పేదలు అల్లాడుతున్నారు.

ప్రణబ్‌ ముఖర్జీ ఎంతో ఉద్వేగంతో పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా గతంలో ఈ విధమైన పిలుపునే ఇచ్చారు. ఆ పిలుపును ఆకళింపు చేసుకున్న ఆయన మందీ మార్బలం దీనిని ఆచరించడంలో చాలా సృజనాత్మకతను ప్రదర్శించారు! డాక్టర్‌ సింగ్‌ ఈ పిలుపునిచ్చి(సాధారణ తరగతిలో విమానయానం, విదేశీ యాత్రల ఖర్చులు తగ్గించుకోవడం వగైరా గురించి) మూడేళ్లకు పైగా కావస్తున్నా ఆ దిశగా కొంచెం కూడా పురోగతి లేదు. పొదుపు చర్యలు చాలా రకాలు. అయితే నేనిక్కడ వాటన్నిటి జోలికి పోవడం లేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా ఆచరిస్తున్న పొదుపు చర్యల గురించే ప్రస్తావించదలిచాను. పొదుపు చర్యల గురించి అహ్లువాలియాకున్న నిబద్ధతను ఎవరూ సవాల్‌ చేయలేరు. పేదరిక కొలబద్దలను నిర్వచించే సమయంలో ఎవరు ఎంతగా ఘోషించినా తాను పట్టుకున్న కుందేటికి మూడేకాళ్లు అన్నరీతిలో ఆయన వ్యహరించాడు. పట్టణ భారతంలో రోజుకు రు.29 ఖర్చు చేయగలిగేవారు, గ్రామీణ భారతంలో రోజుకు రు23 ఖర్చు చేయగలిగేవారు ఇక ఎంతమాత్రం పేదలు కారని అహ్లువాలియా తేల్చేశాడు. కోట్లాది మంది పేదలను దారిద్య్రరేఖ బయటకు నెట్టే ఈ కొలబద్దలను బలపరచాల్సిందిగా సుప్రీం కోర్టును సైతం కోరాడు. ప్రణాళికా సంఘం దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో రోజుకు రు.32 (పట్టణ), రు.26 (గ్రామీణ) ఖర్చు చేయగలిగినవారిని పేదరిక కొలబద్దలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తరువాత ఈ పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత, ఈ యనగారి సహచరులు కొందరు కలిసి పేదరిక కొలబద్దలను మరింతగా కుదించారు.

సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ప్రశ్నలు వెల్లడించిన నిజాలు

డాక్టర్‌ అహ్లువాలియా తనకుతానుగా ఎంత పొదుపు పాటిస్తుంటాడో తెలుసుకోవడానికి సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద వేసిన రెండు ప్రశ్నలు చాలు. ఈ రెండూ ఆర్‌టిఐ ఆధారిత జర్నలిజానికి తిరుగులేని ఉదాహరణలు. అయితే, ఇవి ప్రజల దృష్టిని ఆకర్షించాల్సినంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ రెండు అంశాలు ఆయన పొదుపు చర్యల బండారాన్ని బట్టబయలు చేసేవే. ఇందులో ఒక అంశం (డాక్టర్‌ అహ్లువాలియా 2004 జూన్‌, 2011 జనవరి మధ్య జరిపిన విదేశీయాత్రలకు సంబంధించి) పై ఇండియాటుడేలో శ్యామ్‌లాల్‌ యాదవ్‌ (ప్రస్తుతం ఈయన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నారు) ఒక చక్కటి వార్తాకథనం రాశారు. ఆర్‌టిఐని ఉపయోగించుకుని అంతకుముందు కూడా ఈయన కొన్ని అద్భుతమైన వార్తా కథనాలను రాశారు.

రెండవ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ది స్టేట్స్‌మన్‌ న్యూస్‌ సర్వీస్‌ (విలేకరి పేరులేకుండా) పేరుతో వచ్చింది. ఇందులో 2011 మే- అక్టోబరు మధ్య డాక్టర్‌ అహ్లువాలియా విదేశీ యాత్రల పేరుతో ప్రజా ధనాన్ని ఎలా మెక్కినదీ వివరించారు. ఆ కాలంలో అహ్లువాలియా పద్దెనిమిది రాత్రులతో కూడిన నాలుగు యాత్రలు జరిపాడు. ఇందుకు గాను మన ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి కొట్టారో తెలుసా? అక్షరాలా ముప్పయి ఆరు లక్షల, నలబై వేల నూట నలబై రూపాయలు. ఈ లెక్కన ఆయన సగటున రోజుకు 2.02 లక్షల రూపాయలు ఖర్చు చేశాడని స్పష్టమవుతోంది.” అని ఎస్‌ఎన్‌ఎస్‌ కథనం తెలిపింది. అప్పుడు రోజుకు 2.02 లక్ష్లంటే నాలుగువేల డాలర్లతో సమానం. (ఇది మాంటెక్‌ పొదుపుగా చేసిన ఖర్చు! లేకుంటే ఆ ఖర్చు ఇంకెంత భారీగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఒక విధంగా మనం అదృష్టవంతులమేననుకోవాలి!).అహ్లువాలియా పెట్టిన రోజువారీ ఖర్చు గ్రామీణ భారత దేశంలో ఒక గ్రామీణ భారతీయుడు పెట్టే రోజువారీ ఖర్చు (45సెంట్స్‌ కటాఫ్‌) కన్నా తొమ్మిది వేల రెట్లు ఎక్కువ. అదే పట్టణ భారతీయుని సగటు ఖర్చు (55 సెంట్స్‌ కటాఫ్‌) తో పోల్చితే ఏడు వేల రెట్లు ఎక్కువ.అయినా, ఇది డాక్టర్‌ అహ్లువాలియా దృష్టిలో చాలా నామమాత్రపు ఖర్చు.

అహ్లువాలియా పద్దెనిమిది రోజుల్లో రు.36 లక్షలు(72వేల డాలర్లు) ఖర్చు చేయడం ద్వారా ఆ సంవత్సరం ప్రపంచ పర్యాటక పరిశ్రమకు ఆయన వ్యక్తిగతంగా ఉద్దీపన కల్పించారు. ఐరాసకు చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ పేర్కొన్నట్లు 2008-09లో పర్యాటకరంగంలో తలెత్తిన సంక్షోభం నుంచి ఇప్పటికీ అది పూర్తిగా కోలుకోలేదు.2010వరకూ ఇదే పరిస్థితి. 2011లో మాత్రం గ్లోబల్‌ ట్రావెల్‌ ద్వారా సమకూరిన ఆదాయం లక్ష కోట్ల డాలర్లుదాటినట్లు ఐరాస సంస్థ పేర్కొంది. ఇందులో అత్యధిక భాగం అమెరికా, యూరపు ( అహ్లువాలియా పద్దెనిమిది రాత్రుల్లో ఎక్కువ భాగం గడిపింది ఇక్కడే)ల నుంచే సమకూరింది. పొదుపు చర్యల ద్వారా ఇక్కడ తమ కడుపు కొట్టి కూడబెట్టిన సొమ్ము అక్కడ పర్యాటక రంగ ఉద్దీపనకు ఉపయోగపడినందుకు భారత ప్రజలు సంతోషించాలి మరి!

శ్యామ్‌లాల్‌యాదవ్‌ ఆర్‌టిఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి అహ్లువాలియా గత ఏడేళ్లలో 42 అధికారిక విదేశీ పర్యటనలు జరిపాడు. ఈ కాలంలో మొత్తంగా 274 రోజులు విదేశాల్లో విహరించాడు. అంటే ”ప్రతి తొమ్మిది రోజులకు ఒక రోజు” విదేశాల్లో గడిపాడన్నమాట. ఇండియా టుడే రాసిన కథనం ప్రకారం ఆయన విదేశీ యాత్రల వల్ల మన ఖజానాపై పడిన భారం రు.2.34 కోట్లు. ఇది ఆయన విదేశీ యాత్రల ఖర్చుకు సంబంధించి వచ్చిన మూడు అంచనాల్లో అతి తక్కువది. ఆయన యాత్రలకు సంబంధించిన ఈ ఖర్చుల్లో అక్కడి భారతీయ దౌత్య కార్యాలయాలు పెట్టే ఖర్చులను కూడా కలిపారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ ఖర్చులు కూడా కలిపితే వాస్తవానికి ఈ ఖర్చు మరింత అధికంగా ఉంటుంది.

అహ్లువాలియా నిర్వహించిన పదవిని బట్టి చూసినప్పుడు ఇన్ని విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విచిత్రమేమిటంటే ఇవన్నీ ప్రధానమంత్రి అనుమతితో జరిగినవే. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే అహ్లువాలియా జరిపిన 42 విదేశీ పర్యటనల్లో 23 పర్యటనలు అమెరికాకు సంబంధించినవే. ఇవన్నీ ప్రణాళికకు సంబంధించినవేనని అనుకోవడానికి లేదు. అర్థం కాని విషయమేమిటంటే ఆయన ఇన్ని సార్లు జరిపిన విదేశీ యాత్రల పరమార్థమేమిటి? పొదుపు చర్యల గురించి గ్లోబల్‌ చైతన్యం పెంచేందుకేనా? అదే అయితే, ఆయన యాత్రలకు మనం చాలా డబ్బు తగలేశామన్నమాట. ఈ పొదుపు చర్యలే తమ బతుకులను సర్వనాశనం చేశాయని గ్రీక్‌ ప్రజలు రాజధాని ఏథెన్స్‌ వీధుల్లో పెద్దయెత్తున ప్రదర్శనలు జరుపుతున్న తీరు చూశాము. ఆయన ఎక్కువ సార్లు పర్యటించిన అమెరికా విషయాన్నే తీసుకున్నా, అక్కడ సంపన్నులకు తోడ్పడే ఈ పొదుపుచర్యలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో అంటే 2008లో అక్కడి సిఇవోలు వందల కోట్ల డాలర్ల బోనస్‌లు తీసుకుని ఎంచక్కా ఇంటికి చెక్కేశారు. గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైన వాల్‌స్ట్రీట్‌ను ముట్టడికి జనాన్ని పురిగొల్పిన అంశాల్లో ఇది కూడా ఒకటి.

2009లో డాక్టర్‌ సింగ్‌ పొదుపు చర్యల గురించి పిలుపునిచ్చారు. ఆయన మంత్రివర్గ సహచరులు దీనిని ఎంత చక్కగా పాటించారంటే ఆ తరువాత కొద్ది మాసాలకే ఒక్కో మంత్రి (అతడు లేదా ఆమె) ఆస్తులు విపరీతంగా పెరిగాయి. ప్రధాని ఆ పిలుపునిచ్చిన తరువాత 27 మాసాలకు, మంత్రులు రేయింబవళ్లు కష్టపడిన ఫలితమో ఏమో కానీ ఈ అమాత్యుల ఆస్తులు కనీవిని ఎరుగనిరీతిలో పెరిగిపోయాయి. (‘మరింత సంపన్నమైన కేంద్ర మంత్రివర్గం’ – ది హిందూలో సెప్టెంబరు21, 2011న ప్రచురితమైన వార్త). ఆ వివరాల ప్రకారం అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ ఆస్తులు ప్రతి 24 గంటలకు 5లక్షల చొప్పున పెరిగాయి. ఒకవైపు ఆయన మంత్రిత్వశాఖ అధీనంలోని ఎయిరిండియాలో ఎయిరిండియా ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే ఇంకొకవైపు మంత్రిగారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ పొదుపు కొరడా ఝుళిపించారు.

ఈ పొదుపు చర్యలు రెండు రకాల స్ఫూర్తిని కలిగివుంటాయనే విషయం గమనంలో వుంచుకోవాలి. కొద్ది కాలం క్రితం ప్రఫుల్‌ పటేల్‌, (యుపిఏ-ఎన్‌సిపి), నితిన్‌ గడ్కరీ (ఎన్డీయే- బిజెపి) ఇద్దరూ చాలా భారీ ఖర్చుతో అట్టహాసంగా పెళ్లిళ్లు జరిపించారు.

వీరి కార్పొరేట్‌ సహచరులు దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు.బడా వ్యాపార వేత్త ముఖేష్‌ అంబానీ అత్యంత భారీ ఖర్చుతో 27 అంతస్థుల (కానీ, ఇది యాభై అంతస్థుల కన్నా ఎక్కువ ఎత్తు కలిగిఉంటుంది) మనోహరమైన విశాల భవంతిని నిర్మించుకున్నాడు. మద్యం వ్యాపార సామ్రాజ్యాధిపతి, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యజమాని విజయ మాల్యాది మరో రకమైన విలాసం. కింగ్‌ఫిషర్‌ ఎయిల్‌లైన్స్‌ ఉద్యోగులు జీతాల కోసం పోరాడుతుంటే, అదేమీ పట్టనట్లు దుబాయిలోని భృజ్‌ ఖలీఫాలోని 123వ అంతస్థులో నిర్వహించిన విందు తన జీవితంలోనే మరచిపోలేనిది అంటూ మే5న ట్వీట్‌ చేశాడు. అటు అంబానీ, ఇటు మాల్యాకు ఇద్దరికీ రెండు ఐపిఎల్‌ జట్లు ఉన్నాయి. ఐపిఎల్‌ పేరుతో నెలకొల్పిన సంస్థకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లభించడమే గాక, వినోదపు పన్ను మాఫీ వగైరా రాయితీలు ఉన్నాయి.

వాల్‌స్ట్రీట్‌ తరహాలో..

కార్పొరేట్‌ ప్రపంచం వాల్‌స్ట్రీట్‌ తరహా పొదుపుచర్యలనే అనుసరిస్తున్నది. అక్కడ సిటీగ్రూప్‌, మెరిల లింక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు 2008లో 3,260 కోట్ల డాలర్లను బోనస్‌ల రూపంలో ముట్టజెప్పాయి. మరో వైపు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము 17,500 కోట్ల డాలర్లను ఉద్దీపనల కింద ప్రభుత్వం నుంచి పొందినట్లు 2009లో బ్లూమ్‌బర్గ్‌ బిజినెస్‌ పత్రిక తెలియజేసింది.

గత వారం ప్రణబ్‌ ఆలపించిన పొదుపు పాట కూడా అతి సంపన్నులకు మేలు చేకూర్చేవేనని మరచిపోరాదు. ద్రవ్యలోటును సాకుగా చూపి ప్రజా సంక్షేమ పథకాలపై వరుసగా కోత పెడతారు. ప్రజలకు పని చూపేందుకు , ఆకలి తగ్గించేందుకు, స్కూలుకు పిల్లలను పంపేలా చూసేందుకు ప్రయత్నించకుండా మంత్రి ఈ పొదుపు చర్యల గురించి మాట్లాడడం మతిమాలిన చర్య. ఇది సంపన్నుల ప్రభుత్వం. బడ్జెట్‌లో రు.5లక్షల కోట్ల మేర కార్పొరేట్‌, ఎక్సైజ్‌ పన్నుల్లో రాయితీలను కార్పొరేట్లకు, సంపన్నులకు కానుకగా ఇచ్చిన ఇదే ప్రణబ్‌ ముఖర్జీ (చూడండి: ‘ది ఫిక్స్‌ బిపిఎల్‌, నిక్స్‌ సిపిఎల్‌’ -ది హిందూ, మార్చి26,2012) మనకు మాత్రం పొదుపు పాఠాలు వల్లిస్తున్నాడు. పార్లమెంటులో సీతారాం ఏచూరి ఈ విషయాన్ని లేవనెత్తుతూ సంపన్నులకు, కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలు బడ్జెట్‌లో ద్రవ్యలోటుకన్నా 8వేల కోట్లు అధికంగా ఉందని చెప్పారు.

దేశంలో బంగారం, వజ్రాలపై కస్టమ్స్‌ సుంకాల మినహాయింపుతో సహా ప్రభుత్వ ఆదాయాన్ని కుదించే వివిధ రకాల అంశాలపై మీడియా ఎందుకు చర్చ నిర్వహించదు అని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ (ది హిందూ, జనవరి7,2012) సూటిగా ప్రశ్నించాడు. ఈ విధమైన కస్టమ్స్‌సుంకాల రాయితీలవల్ల ఏటా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని (సంవత్సరానికి సుమారు రు.50వేల కోట్లు) నష్టపోతున్నది. ఇదంతా రాబడితే మన ఆహార భద్రత బిల్లు(రు.27వేల కోట్లు)కు చెల్లించగా ఇంకా చాలా డబ్బు మిగులుతుంది.

(ది హిందూ సౌజన్యంతో)

వామ్మో కరెంట్‌ బిల్లు!

  • బెంబేలెత్తుతున్న విద్యుత్‌ వినియోగదారులు
  • చిరు వ్యాపారులకు దిమ్మదిరిగే బిల్లులు
  • గందరగోళం సృష్టిస్తున్న కనెక్టెడ్‌ లోడ్‌

వినియోగదారులందరికీ కరెంట్‌ షాక్‌ కొట్టింది. గత నెల పెరిగిన విద్యుత్‌ ఛార్జీల భారం ఈనెల బిల్లుల్లో వస్తుండటంతో వినియోగదారులు వాటిని చూసి బెంబేలెత్తుతున్నారు. చిన్న చిన్న షాపుల్లో వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భారం స్పష్టంగా తెలిసొచ్చింది. కమర్షియల్‌ కేటగిరీ రేట్లు భారీగా పెరిగాయి. హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, బుక్‌షాపులు, కిరాణా దుకాణాలు, లాండ్రీ నిర్వాహకులు ఈనెల కరెంటు బిల్లులు చూసి బిత్తరపోతున్నారు. వివిధ స్లాబులున్నప్పటికీ గరిష్టంగా యూనిట్‌కు రూ. 6.50 పైసలు చొప్పున వడ్డన పడింది. డొమెస్టిక్‌ కేటగిరీలో కనెక్టెడ్‌ లోడ్‌ 500 వాట్లకన్నా ఎక్కువ ఉన్న వినియోగదారులకూ భారం పడింది. మే నెల కరెంటు బిల్లులు గత నెల కంటే దాదాపు రెట్టింపొచ్చాయని అపార్ట్‌మెంట్‌వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి వినియోగం నేపథ్యంలో పెరిగిన బిల్లులు వినియోగదారుల్ని గందరగోళంలోకి నెట్టాయి. గత నెల బిల్లులతో బేరీజు వేసుకుంటే విద్యుత్‌ వినియోగం పెరిగి, ఎక్కువ యూనిట్లు రావడంతో తలలు పట్టుకుంటున్నారు. సాధారణం కన్నా ఎక్కువగా విద్యుత్‌ కోతలున్నప్పటికీ బిల్లులు మాత్రం భారీగా పెరిగి వచ్చాయని వాపోతున్నారు. ప్రతినెలా రూ. 1,500 నుంచి రూ. 1,800ల్లోపు వచ్చే కరెంటు బిల్లు ఈనెల ఏకంగా రూ. 2,702 వచ్చిందని సికింద్రాబాద్‌లోని ఓ వెల్డింగ్‌ షాపు యజమాని చెప్పారు. 398 యూనిట్లకు సరాసరిన యూనిట్‌కు రూ. 6.78 పైసలు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్‌ కేటగిరీ(ఎల్‌టి-2ఎ) కేటగిరీలో రెండు రకాల శ్లాబులున్నప్పటికీ ఆ శ్లాబుల ప్రకారం కాకుండా మొత్తాన్ని గరిష్ట కేటగిరీలోనే లెక్కించారని చెప్పారు. అయితే ఇక్కడ కూడా కనెక్టెడ్‌ లోడ్‌ 500 వాట్లకన్నా ఎక్కువ ఉన్న కేటగిరీలో(ఎల్‌టి-2బి)లో 0-100 యూనిట్ల వరకు రూ. 6, ఆపై వినియోగానికి యూనిట్‌కు రూ. 7 చొప్పున నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళూ సాధారణ జనానికి ఈ కనెక్టెడ్‌ లోడ్‌ విషయంపై అవగాహన లేకపోవడంతో తాము ఏ కేటగిరీలో ఉన్నామనే విషయం స్పష్టంగా తెలియదు. ఒకే గదిలో ఒక ట్యూట్‌లైటు, ఫ్యాన్‌, టీవీ ఉన్న అతిచిన్న కుటుంబానికి ప్రతినెలా రూ. 100 నుంచి రూ. 120లోపు బిల్లు వచ్చేది. ఈనెల రూ. 216 బిల్లు వచ్చిందని శ్రీనివాస నగర్‌కు చెందిన పరశురాం చెప్పారు. వినియోగించు కున్న విద్యుత్‌ కన్నా అదనపు ఛార్జీల బాదుడు ఎక్కువైంది. ఓ వినియోగదారుడు ఏప్రిల్‌లో 213 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకోగా అతనికి ఎనర్జీ ఛార్జీ రూ. 694.75 పైసలుగా పేర్కొన్నారు. అదే బిల్లులో అదనంగా అడిషనల్‌ ఛార్జీ పేర రూ. 65, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేర రూ. 12.78 పైసలు, డిఫరెన్స్‌ ఇన్‌ టారిఫ్‌ పేర మరో రూ. 25 వడ్డించారు. మొత్తం బిల్లు రూ. 792 చెల్లించాలని పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగంతోపాటు ఇతర ఛార్జీల పేర దాదాపు వంద రూపాయల వరకు అదనంగా బిల్లులో బాదారు. మరోవైపు కస్టమర్‌ ఛార్జీలు కూడా భారీగా పెరగడంతో యూనిట్‌ రేట్లకు ఈ మొత్తం అదనపు భారంగా మారింది. డొమెస్టిక్‌ కేటగిరీలోని రెండు కేటగిరిల్లో ఒక్కో సర్వీస్‌కు కనిష్టంగా రూ. 25 నుంచి గరిష్టంగా రూ. 45 వరకు కస్టమర్‌ ఛార్జీల్ని వడ్డించారు. చిన్న వ్యాపారులున్న కమర్షియల్‌ కేటగిరీలో కూడా ఈ మొత్తం కనిష్టం రూ. 30 నుంచి రూ. 40 వరకు ఉన్నాయి. ఏడాదికోసారి సిపిడిసిఎల్‌ నాన్‌డొమెస్టిక్‌, కమర్షియల్‌ కేటగిరీల నుంచి ఆ ఏడాది విద్యుత్‌ వినియోగ వ్యత్యాసాన్ని ఎసిడి ఎమౌంట్‌ పేర వసూలు చేస్తుంది. పెరిగిన ఛార్జీలతో ఎసిడి ఎమౌంట్‌ భారం మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి.

ఓవైపు విద్యుత్‌ కోతలతో చిన్నతరహా పరిశ్రమలు కుదేలవుతుంటే, మరోవైపు బిల్లులు మాత్రం భారీగాపెరిగి వస్తున్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ ఇండిస్టీస్‌ అసోసియేషన్స్‌ (ఫ్యాప్సియా) అధ్యక్షులు ఎఆర్‌కె రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపుపై తాము చేసిన ప్రతిపాదనల్ని ఎపిఇఆర్‌సి పరిగణనలోకి తీసుకోలేదని, డిస్కాంల ప్రతిపాదనల్నే యథాతథంగా ఆమోదించిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు తక్కువని చెప్తున్న ప్రభుత్వం, ఇక్కడి కరెంటు కోతలపై మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడలేదని చేసిన ప్రచారం… ఈనెల కరెంటు బిల్లులతో అబద్ధమని తేలిపోయింది. ప్రజలందరికీ ఏదోఒక రూపంలో షాక్‌ కొట్టింది మాత్రం నిష్ఠుర సత్యం.

ముఖ్యమంత్రీ చచ్చిపో! చావాలనుకోకపోతే పదవన్నా వదలి పారిపో!!


నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డీ చచ్చిపో!
చచ్చిపోవాలని లేకపోతే కనీసం ముఖ్యమంత్రి పదవన్నా వదలి పారిపో!! ఎందుకూ నీ జన్మ? పుట్టావు, నాలాంటి వాళ్లను చంపుకుతింటానికేగా!
నేను, నాలాంటి మధ్యతరగతి జనం బితుకుబితుకుమంటూనో, కునారిల్లుతోనో బతకాలంటే కిరణ్‌కుమార్‌ రెడ్డి కనీసం ముఖ్యమంత్రి పదవినయినా వదిలి పారిపోకతప్పదు తప్పదు మరి.
ఏంట్రా! వీడిలా నోరు పట్టకుండా తిడుతున్నాడని ఇప్పుడే నన్ను అపార్థం చేసుకోకండి మిత్రులారా! నేను రాసినదంతా చదివి, కాసేపు ఆలోచించి ఆ తర్వాత అవసరమనుకుంటే మీ నోరారా తిరిగి తిట్టి కక్ష తీర్చుకోండి.
ఈ నోటి దూలంతా విద్యుదాఘాతం తట్టుకోలేక చేసిన పని. మిత్రులారా! పూర్తి వివరాల కోసం చదవండి!!
2012 మే 09 ా ఉదయం 12 గంటలు
నేను అద్దెకుండే ఇంటి బోరు మోటారు మరమ్మతు ఖర్చులో నా భాగంగా ఐదు వందలు పడిందని చావు కబురు చల్లగా అందించాడు యజమాని.
”అదేమిటండీ? మోటరు పాడయితే బాగుచేయించే పని మీదేకదా?” ప్రశ్నించాను.
”ఏందీ బాగుచేయించేదీ? ఇప్పుడే మా ఇంటి కరెంటు బిల్లు వచ్చింది. పోయిన నెలదాకా ఏడెనిమిది వందల రూపాయలుండేది. ఇప్పుడు మూడు వేల చిల్లర వచ్చింది. బూబి కుట్టుగూలి సాయిబు అత్తరుకు సరిపోయిందంటారు అట్లా ఉంది నా పని.” అంటూ చకచక నడుచుకుంటూ వెళ్లి పోయాడు.
ఉదయం ఒంటి గంట
విద్యుత్తు బిల్లు గుమస్తా వచ్చాడు.
స్టూలు అడిగి తీసుకుని మీటరు రీడింగు తీశాడు.
ఎంత ?” అడిగాను?
”194 యూనిట్లు” చెప్పాడు.
”అమ్మో, అంత కాలిందా? పోయిన నెల 59 యూనిట్లేగదా!” ఆశ్చర్యం, ఆంతోళనగా ప్రశ్నిరచాను.
”ఇంతలోనే ఏమయింది! బిల్లు ఇస్తాను చూడండి, మీ డుపు ఎట్లా కాలుతుందో?” అంటూ బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.
”1237” చూస్తూనే, పైకి చదివేశాను.
”పోయిన నెల 135 రూపాయలు కట్టాను.” ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగిందీ! ఇలా అయితే నాలాంటి వాళ్లు బతికినట్లే??!!
కడుపు మంట ప్రారంభమయింది. కోపంతో శరీరం వణకటమూ మొదలయింది.
”ముఖ్యమంత్రి చావనన్నా చావలేదుగదా?” అంటూ మా పక్కవాటా ప్రభాకరరావుని కరెంటు బిల్లు ఎంత వచ్చిందని వాకబు చేశాను.
”ఇప్పుడే చూస్తున్నానండీ! 1455 రూపాయలు వచ్చింది.” అతని గొంతుకలోనూ కిచకిచలు విన్పిస్తున్నాయి.
అలానే నాలుగు మెట్లుదిగి కింద వాటాలో ఉండే రమణను వాకబు చేశాను.
”అమ్మో, ఈ నెల్లో ఎటూ పెరుగుతుంది గదా అని రూ. 750 తీసిపెట్టాను. 650 రూపాయల బిల్లు వచ్చింది. మూడు రెట్లు పెరిగింది. మోటారు మరమ్మతు 500 రూపాయలు కొత్తగా వచ్చిపడింది గదా! ఈ నెల్లో అప్పు చేయాల్సిందే సార్‌!” కళ్లమ్మట నీళ్లు తిరుగుతండగా ఉద్యోగ విధులకు బయలుదేరాడు. ఆయన ఇంట్లో పగలు ఎవ్వరూ ఉండరు. రాత్రికయినా కరెంటు వాడకంలో ఆయన కుటుంబ సభ్యులంతా వీలయినంత పొదుపు పాటిస్తారు. అయినా మూడు రెట్లు అధికంగా వచ్చిన బిల్లు కట్టటం కష్టమంటాడు. పొదుపెందుకు దండగ అంటూ మంచం మీద కూలబడ్డాడు.
వాళ్ల పక్కింటి వాళ్లూ పగలు అస్సలు ఉండరు. అయినా 680 రూపయల బిల్లు వచ్చి పడింది పాపం.
ఇంతంతేసి కరెంటు బిల్లుల్ని కట్టేదెలా! కడితే ఆనక బతికేదెలా!!
దేనికి కోత పెట్టుకోవాలి? మా ఇంట్లో అందరూ శాకాహారులమే. (కులం రీత్యా కాదులెండి)
మిత్రులారా ఇప్పుడు చెప్పండి. నేను తిట్టటంలో ఏమన్నా తప్పుందంటారా!
నా కడుపు మంటకు అర్ధం ఉందంటారా? లేదా??
చివరిగా కమ్యూనిస్టులకు ఒక్కమాట చెప్పాలని ఉంది.
మాకు కడుపు మండుతోంది!
రోడ్డెక్కుదాం రండి!!

అతిరాత్రం యాగమా? నిష్ఫల ప్రయోగమా?

  • యాగ ఫలితాలు కొంతకాలం తర్వాత కనిపిస్తాయని యాగశాలలో గుసగుసలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. 1975, 2011లలో కేరళలో యాగాలు జరిగాయి కదా? వాటివలన విశ్వశాంతి దిశగా, అవినీతి నిర్మూలన వైపుగా మన దేశం ఎన్ని అడుగులు ముందుకేసింది? 60 లక్షల రూపాయల కుంభకోణం నుండి రెండున్నర లక్షల కోట్ల కుంభకోణం దిశగా వేగంగా ప్రయాణించింది మన దేశం. ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో నరమేధాలు అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదేనా మనం ఆశించింది?

ఏప్రిల్‌ 21 నుండి మే 2 వరకు భద్రాచలంలో అతిరాత్ర యాగం జరిగింది. నిర్వాహకులు ప్రచురించిన కరపత్రంలో ఈ యాగం వల్ల చేకూరే ఫలితాలు విశ్వశాంతి, సువృష్టి (మంచి వానలు), సస్యసమృద్ధి (పంటలు బాగా పండుట), అవినీతి నిర్మూలన, ఉగ్రవాద నిర్మూలన మొదలగునవి. ఇప్పుడు అవి ఎంతవరకు నెరవేరాయి అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది విశ్వశాంతి. యాగం అయిపోయే సమయానికి కూడా, కనీసం భద్రాచలంలోనైనా శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడలేదు. ఖమ్మం జిల్లాలో నేరాల రేటు ఏమీ తగ్గలేదు. ‘రేమిడిచర్లలో వ్యక్తిదారుణ హత్య, క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య (27/4), గుర్తు తెలియని వ్యక్తి హత్య (30/4) లాంటి హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అస్సాంలో రెండు పడవలు మునిగి 103 మంది జల సమాధి(1/5) లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక విశ్వశాంతికి మచ్చ తెచ్చేలా ‘ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడుల్లో ఆరుగురి మృతి (1/5) వంటి తీవ్రవాద చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ యాగం విశ్వ శాంతి సాధనలో, తీవ్రవాద భయ నిర్మూలనలో విజయం సాధించినట్లా? విఫలమైనట్లా?

రెండవది సువృష్టి, సస్య సమృద్ధి. భద్రాచలంలోనే, యాగ ప్రాంగణంలోనే 25/4న గాలి దుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిందనీ, గరుడ చితి కోసం ఏర్పాటు చేసిన యాగశాల ఒక పక్కకు ఒరిగిపోయిందని, పై కప్పులోని తాటాకులు, భక్తులు కూర్చొనే గాలరీపై ఉన్న రేకులు కొన్ని గాలికి ఎగిరిపోయాయనీ, వర్షం ధాటికి యాగశాల ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గరుడ ఆకృతి, భద్రాచలం పట్టణ స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రాజరాజేశ్వరి ఆర్చి నేలకొరిగాయనీ ఏప్రిల్‌26 నాటి పత్రికలన్నీ రాశాయి. సువృస్టి అంటే ఇదేనా? అలాగే ఆ వర్షానికి మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, అరటి, బొప్పాయి తోటలకు, మిరప, వరి పంటలకు కూడా ఖమ్మం జిల్లాతోబాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో నష్టం జరిగిందనీ హిందూ పత్రికతో సహా అన్ని పత్రికలూ ఫొటోలతో సహా ప్రచురించాయి. మరలా 29/4న వచ్చిన గాలివానకు కూడా అపార నష్టం వాటిల్లిందని పత్రికలు రాశాయి. ఎడాపెడా గాలివానలు, తోటలు, పంటల నాశనం, అదీ యాగ సమయంలోనే జరగడం సస్య సమృద్ధికీ, సువృష్టికీ చిహ్నంగా పరిగణించాలా? లేక యాగం వలన రైతులకు తీవ్ర నష్టం జరిగిందనుకోవాలా?

మూడవది, అవినీతి నిర్మూలన. ఖమ్మం జిల్లాలో ఇంటర్‌ పరీక్షల్లో అభ్యర్థులు అనేకచోట్ల మాస్‌కాపీయింగ్‌ చేశారనీ, చూచిరాతకు అనుమతించేందుకు రు.500 చొప్పున పరీక్షా నిర్వాహకులకిచ్చారనీ, అలా ఇవ్వలేని వారిని ‘చూచిరాత’ రాయడానికి అధికారులు అంగీకరించలేదనీ ఈనాడు 27/4, 30/4 పత్రికలు ఖమ్మం జిల్లా ఎడిషన్‌లో వార్తలొచ్చాయి. యాగ సమయంలోనే ఖమ్మం జిల్లాలో ఈ విధమైన అవినీతి చోటుచేసుకోవడం యాదృచ్ఛికమనుకోవాలా? యాగ ఫలితమనుకోవాలా?

యాగ ఫలితాలు కొంతకాలం తర్వాత కనిపిస్తాయని యాగశాలలో గుసగుసలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. 1975, 2011లలో కేరళలో యాగాలు జరిగాయి కదా? వాటివలన విశ్వశాంతి దిశగా, అవినీతి నిర్మూలన వైపుగా మన దేశం ఎన్ని అడుగులు ముందుకేసింది? 60 లక్షల రూపాయల కుంభకోణం నుండి రెండున్నర లక్షల కోట్ల కుంభకోణం దిశగా వేగంగా ప్రయాణించింది మన దేశం. ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో నరమేధాలు అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదేనా మనం ఆశించింది?

యాగ నిర్వాహకులు గరుడ పక్షి వచ్చిందనీ, పడమటి వైపు చల్లిన పెసలు చాలా వేగంగా మొలకెత్తాయనీ ప్రచారం చేస్తూ, వాటిని మహిమలుగా పేర్కొంటున్నారు. అలా పక్షులు తిరగడం, పెసలు మొలవడమే యాగ విజయాలుగా అంగీకరించి సంతోషిద్దామా? ప్రతి చేలోనూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, పెసర వేస్తే, వేల రూపాయలు మాత్రమే చేతికివస్తే ఇదే మా మంత్రాల ప్రతిభ అని విదేశాలలో గొప్పలు చెప్పుకుందామా? యెటపాక వంటి అటవీ ప్రాంతంలో ఎప్పుడో ఒకసారి గరుడ పక్షి కన్పించడమూ, నీళ్లు బాగా అందినవైపు మొలకలు వేగంగా రావడం వంటి శాస్త్రీయ విషయాలను మహిమలుగా ప్రచారం చేస్తుంటే, విదేశాల్లోని శాస్త్రవేత్తలు మనలను చూసి నవ్వరా?

కాబట్టి మంత్రాలతో విశ్వశాంతి వస్తుందనీ, యాగశాలలు తగలబెట్టడం పర్యావరణ పరిరక్షణ కోసమేనన్న మాటలు నమ్మకూడదు. దేశభక్తులైన ప్రజలు, శాస్త్రజ్ఞులు నిరూపించిన విషయాలనే నమ్మాలి. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే మార్గం ఇదే.

-కె.ఎల్‌. కాంతారావు