సుందరయ్యలోని నిరాడంబరత, త్యాగనిరతి, అంకితభావమే ఆయనను మహోన్నతునిగా నిలిపాయి. సైకిలుపై అలుపెరగకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకునేవారు. తెలంగాణా ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో అనేక రోజులపాటు సంచరించేవారు. అనేక సంవత్సరాలు జైలులో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండేవారు. ఆయన శారీరక దారుఢ్యానికి, సహనశీలతకు సాటిరాగలవారు బహు అరుదు. ఆయన నిస్వార్థ సేవాతత్పరుడు. అనేక విషయాల్లో ఆయన ఇతరులకు మార్గదర్శిగా నిలిచారు. నిరాడంబరత, త్యాగనిరతిని చూసి ఆయనను ‘కమ్యూనిస్టు రుషి’ అని ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టేతరులు సైతం కొనియాడేవారు.
2012 మే1 – ఇది పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి సంవత్సరం. అసాధారణ కమ్యూనిస్టు నేత సుందరయ్య జీవితాన్ని, ఆయన ప్రజల కోసం, పార్టీ కోసం చేసిన కృషిని సంస్మరించుకోవాల్సిన సందర్భం. అందరూ ఆయనను పిఎస్ అని పిలిచేవారు. భారతదేశం స్వాతంత్య్రం సంపాదించడానికి ముందు రెండు దశాబ్దాల నుండి కొనసాగిన సామ్రాజ్యవాద వ్యతిరేక, ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాల బిడ్డగా ఆయనను అభివర్ణించవచ్చు. 17 ఏళ్ల వయసులో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సుందరయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కార్యకర్తగా ప్రారంభమై అంకితభావంతో పనిచేసిన కమ్యూనిస్టుగా ముగిసింది.
కమ్యూనిస్టులుగా మారిన పలువురు మిలిటెంట్ స్వాతంత్ర సమరయోధులు మాదిరిగానే సుందరయ్య కులతత్వంపై తిరుగుబాటు చేశారు. దళితులపట్ల వివక్షత పాటించడాన్ని నిరసిస్తూ బాల్యంలోనే నిరాహారదీక్ష చేశారు. ఇదే ఆయన తొలి బహిరంగ కార్యాచరణ.
సుందరయ్యను అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్టు పార్టీలోకి తీసుకున్నారు. హైదర్ ఖాన్ దక్షిణ భారత్ సందర్శించిన తొలి కమ్యూనిస్టు. ఈ యువ విద్యార్థిలో ఒక విప్లవకారుడ్ని ఆయన చూశారు. అలా మొదలైంది పిఎస్ మహత్తర విప్లవ ప్రస్థానం. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగవేస్తే పిఎస్‌ను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరిగా అందరూ గుర్తుంచుకుంటారు. 1936లో ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. అప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు. అఖిల భారత స్థాయిలో సంఘటిత రూపాన్ని సంతరించుకున్న పార్టీకి ఇదే తొలి కేంద్ర కమిటీ. దక్షిణ భారతదేశంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. తన ‘హిస్టరీ ఆఫ్ కమ్యూనిస్టు పార్టీ ఇన్ కేరళ’ పుస్తకంలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ రాసిన విధంగా కేరళలో తొలి తరం కమ్యూనిస్టుల రిక్రూట్‌మెంట్‌లో సుందరయ్య ప్రధాన పాత్ర పోషించారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పార్టీ నిర్మాణం కోసం అవిరళ కృషి చేశారు. రాడికల్ యువకులను జాతీయ ఉద్యమంవైపు ఆకర్షించడంలో ఆయన నిర్వహించిన పాత్ర మహత్తరమైనది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో కూడిన ఒకప్పటి మద్రాసు రాష్ట్రమైన తమిళనాడులోని మొదటి తరం కమ్యూనిస్టులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.
ఆ తరువాత సిపిఐ(ఎం) ఏర్పాటులో పిఎస్ ప్రధాన పాత్ర పోషించారు. 1964 సిపిఐ(ఎం) వ్యవస్థాపక మహాసభలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 12 సంవత్సరాలపాటు పిఎస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. పార్టీని మార్క్సిస్టు- లెనినిస్టు సంస్థగా తీర్చిదిద్దడం కోసం ఆయన తన సర్వశక్తులూ ధారపోశారు. కేంద్ర కమిటీ 1967లో ఆమోదించిన ‘టాస్క్ ఆన్ పార్టీ ఆర్గనైజేషన్’ విప్లవ సంస్థగా పనిచేసేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపకల్పనలో ఆయన కీలక భూమిక వహించారు.
వ్యవసాయ విప్లవ వ్యూహం రూపకల్పనలోనూ సుందరయ్య విశిష్టమైన పాత్ర నిర్వహించారు. 1936లో అఖిల భారత కిసాన్ సభ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఆయన సంయుక్త కార్యదర్శి అయ్యారు. వ్యవసాయ కార్మికులను సంఘటితపరచడంలో ప్రాధాన్యతను, గ్రామీణ కార్మికవర్గంగా వారి పాత్రను గుర్తించిన మొట్టమొదటి నాయకుల్లో ఆయన ఒకరు. చిన్న రైతుల తెలంగాణా సాయుధ పోరాటానికి ఆయన అందించిన నాయకత్వం చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తెలంగాణా సాయుధ పోరాటం- గుణపాఠాలు’ పేరుతో ఆయన రాసిన పుస్తకం ఈ చారిత్రిక పోరాటం గురించి అత్యంత సమగ్రమైన సమాచారం అందిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ అంశాలను, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, పేదరైతుల స్థితిగతులను ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు. భూ సమస్య, వ్యవసాయ కార్మికులు, పేద రైతుల స్థితిగతులను శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించేందుకు పూనుకున్నారు. దీంట్లో భాగంగానే 70వ దశకం మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా ఒక సర్వే నిర్వహించారు. వ్యవసాయ విప్లవం సాధించనిదే పేద రైతులు, వ్యవసాయ కార్మికుల విముక్తి సాధ్యం కాదు. భారతదేశంలో ప్రజాతంత్ర విప్లవమూ పరిపూర్ణం కాదని ఆయన గట్టిగా విశ్వసించారు.
మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాలు, సూత్రాలను ఆయన గట్టిగా సమర్ధించేవారు. కమ్యూనిస్టు ఉద్యమంలో మితవాదానికి వ్యతిరేకంగా ఎంత గట్టిగా ఆయన పోరాడేవారో అంతేగట్టిగా వామపక్ష, అతివాద దుందుడుకు వాదంపై కూడా పోరాడేవారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి నక్సలైట్ల ఉద్యమ అతివాద పోకడలు, పెటీ బూర్జువా తరహా విప్లవతత్వాల నుండి ఉద్యమాన్ని కాపాడి సరైన పంథాలో నడిపించడంలో సుందరయ్య నిర్వహించిన పాత్ర అత్యంత విశిష్టమైంది.
పార్టీని, ఉద్యమాన్ని అభివృద్ధి చెయ్యడానికి పార్టీ కేడర్ పట్ల విశేష ఆసక్తి ప్రదర్శించడం సుందరయ్యలో మరో గొప్ప లక్షణం. కేడర్ పట్ల ఆయన ఎంతో వాత్సల్యభావంతో వ్యవహరించే వారు. వారి అభివృద్ధి కోసం పాటుపడేవారు. వివిధ సమయాల్లో వివిధ స్థాయిల్లో నిర్వహించిన నాయకత్వ పదవుల్లో అంకితభావంతో, క్రియాశీలంగా పనిచేసే క్యాడర్‌ను గుర్తించేవారు వారి సామర్ధ్యాన్ని అంచనా వేసి, రిక్రూట్‌మెంట్ చేసిన తరువాత వారి అబివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. తరతరాలుగా అనేకమందినికమ్యూనిస్టులుగా తీర్చిదిద్దడంలో పిఎస్ విశిష్ట పాత్ర పోషించారు..
పిఎస్ తరానికి చెందిన అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ఆత్మత్యాగం, అంకితభావానికి మారుపేరుగా నిలిచారు. సుందరయ్యలోని నిరాడంబరత, త్యాగనిరతి, అంకితభావమే ఆయనను మహోన్నతునిగా నిలిపాయి. సైకిలుపై అలుపెరగకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకునేవారు. తెలంగాణా ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో అనేక రోజులపాటు సంచరించేవారు. అనేక సంవత్సరాలు జైలులో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండేవారు. ఆయన శారీరక దారుఢ్యానికి, సహనశీలతకు సాటిరాగలవారు బహు అరుదు. ఆయన నిస్వార్థ సేవాతత్పరుడు. అనేక విషయాల్లో ఆయన ఇతరులకు మార్గదర్శిగా నిలిచారు. నిరాడంబరత, త్యాగనిరతిని చూసి ఆయనను ‘కమ్యూనిస్టు రుషి’ అని ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టేతరులు సైతం కొనియాడేవారు.
సుందరయ్య శత జయంతి ఉత్సవాలను సంవత్సరంపాటు నిర్వహించాలని పార్టీ 20వ మహాసభ పిలుపునిచ్చింది. పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు, బలోపేతం చేసేందుకు ఈ శత జయంతి సంవత్సరాన్ని ఉపయోగించుకోవాలి. పొలిట్‌బ్యూరో త్వరలోనే ఇందుకోసం ఒక కార్యక్రమన్ని ప్రకటిస్తుంది.
(ఇది సుందరయ్య శత జయంతి సంవత్సరం)