Archive for మే 6th, 2012

అతిరాత్రం యాగమా? నిష్ఫల ప్రయోగమా?

  • యాగ ఫలితాలు కొంతకాలం తర్వాత కనిపిస్తాయని యాగశాలలో గుసగుసలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. 1975, 2011లలో కేరళలో యాగాలు జరిగాయి కదా? వాటివలన విశ్వశాంతి దిశగా, అవినీతి నిర్మూలన వైపుగా మన దేశం ఎన్ని అడుగులు ముందుకేసింది? 60 లక్షల రూపాయల కుంభకోణం నుండి రెండున్నర లక్షల కోట్ల కుంభకోణం దిశగా వేగంగా ప్రయాణించింది మన దేశం. ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో నరమేధాలు అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదేనా మనం ఆశించింది?

ఏప్రిల్‌ 21 నుండి మే 2 వరకు భద్రాచలంలో అతిరాత్ర యాగం జరిగింది. నిర్వాహకులు ప్రచురించిన కరపత్రంలో ఈ యాగం వల్ల చేకూరే ఫలితాలు విశ్వశాంతి, సువృష్టి (మంచి వానలు), సస్యసమృద్ధి (పంటలు బాగా పండుట), అవినీతి నిర్మూలన, ఉగ్రవాద నిర్మూలన మొదలగునవి. ఇప్పుడు అవి ఎంతవరకు నెరవేరాయి అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది విశ్వశాంతి. యాగం అయిపోయే సమయానికి కూడా, కనీసం భద్రాచలంలోనైనా శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడలేదు. ఖమ్మం జిల్లాలో నేరాల రేటు ఏమీ తగ్గలేదు. ‘రేమిడిచర్లలో వ్యక్తిదారుణ హత్య, క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య (27/4), గుర్తు తెలియని వ్యక్తి హత్య (30/4) లాంటి హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అస్సాంలో రెండు పడవలు మునిగి 103 మంది జల సమాధి(1/5) లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక విశ్వశాంతికి మచ్చ తెచ్చేలా ‘ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడుల్లో ఆరుగురి మృతి (1/5) వంటి తీవ్రవాద చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ యాగం విశ్వ శాంతి సాధనలో, తీవ్రవాద భయ నిర్మూలనలో విజయం సాధించినట్లా? విఫలమైనట్లా?

రెండవది సువృష్టి, సస్య సమృద్ధి. భద్రాచలంలోనే, యాగ ప్రాంగణంలోనే 25/4న గాలి దుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించిందనీ, గరుడ చితి కోసం ఏర్పాటు చేసిన యాగశాల ఒక పక్కకు ఒరిగిపోయిందని, పై కప్పులోని తాటాకులు, భక్తులు కూర్చొనే గాలరీపై ఉన్న రేకులు కొన్ని గాలికి ఎగిరిపోయాయనీ, వర్షం ధాటికి యాగశాల ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గరుడ ఆకృతి, భద్రాచలం పట్టణ స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రాజరాజేశ్వరి ఆర్చి నేలకొరిగాయనీ ఏప్రిల్‌26 నాటి పత్రికలన్నీ రాశాయి. సువృస్టి అంటే ఇదేనా? అలాగే ఆ వర్షానికి మామిడితోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, అరటి, బొప్పాయి తోటలకు, మిరప, వరి పంటలకు కూడా ఖమ్మం జిల్లాతోబాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో నష్టం జరిగిందనీ హిందూ పత్రికతో సహా అన్ని పత్రికలూ ఫొటోలతో సహా ప్రచురించాయి. మరలా 29/4న వచ్చిన గాలివానకు కూడా అపార నష్టం వాటిల్లిందని పత్రికలు రాశాయి. ఎడాపెడా గాలివానలు, తోటలు, పంటల నాశనం, అదీ యాగ సమయంలోనే జరగడం సస్య సమృద్ధికీ, సువృష్టికీ చిహ్నంగా పరిగణించాలా? లేక యాగం వలన రైతులకు తీవ్ర నష్టం జరిగిందనుకోవాలా?

మూడవది, అవినీతి నిర్మూలన. ఖమ్మం జిల్లాలో ఇంటర్‌ పరీక్షల్లో అభ్యర్థులు అనేకచోట్ల మాస్‌కాపీయింగ్‌ చేశారనీ, చూచిరాతకు అనుమతించేందుకు రు.500 చొప్పున పరీక్షా నిర్వాహకులకిచ్చారనీ, అలా ఇవ్వలేని వారిని ‘చూచిరాత’ రాయడానికి అధికారులు అంగీకరించలేదనీ ఈనాడు 27/4, 30/4 పత్రికలు ఖమ్మం జిల్లా ఎడిషన్‌లో వార్తలొచ్చాయి. యాగ సమయంలోనే ఖమ్మం జిల్లాలో ఈ విధమైన అవినీతి చోటుచేసుకోవడం యాదృచ్ఛికమనుకోవాలా? యాగ ఫలితమనుకోవాలా?

యాగ ఫలితాలు కొంతకాలం తర్వాత కనిపిస్తాయని యాగశాలలో గుసగుసలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. 1975, 2011లలో కేరళలో యాగాలు జరిగాయి కదా? వాటివలన విశ్వశాంతి దిశగా, అవినీతి నిర్మూలన వైపుగా మన దేశం ఎన్ని అడుగులు ముందుకేసింది? 60 లక్షల రూపాయల కుంభకోణం నుండి రెండున్నర లక్షల కోట్ల కుంభకోణం దిశగా వేగంగా ప్రయాణించింది మన దేశం. ఇరాక్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో నరమేధాలు అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదేనా మనం ఆశించింది?

యాగ నిర్వాహకులు గరుడ పక్షి వచ్చిందనీ, పడమటి వైపు చల్లిన పెసలు చాలా వేగంగా మొలకెత్తాయనీ ప్రచారం చేస్తూ, వాటిని మహిమలుగా పేర్కొంటున్నారు. అలా పక్షులు తిరగడం, పెసలు మొలవడమే యాగ విజయాలుగా అంగీకరించి సంతోషిద్దామా? ప్రతి చేలోనూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, పెసర వేస్తే, వేల రూపాయలు మాత్రమే చేతికివస్తే ఇదే మా మంత్రాల ప్రతిభ అని విదేశాలలో గొప్పలు చెప్పుకుందామా? యెటపాక వంటి అటవీ ప్రాంతంలో ఎప్పుడో ఒకసారి గరుడ పక్షి కన్పించడమూ, నీళ్లు బాగా అందినవైపు మొలకలు వేగంగా రావడం వంటి శాస్త్రీయ విషయాలను మహిమలుగా ప్రచారం చేస్తుంటే, విదేశాల్లోని శాస్త్రవేత్తలు మనలను చూసి నవ్వరా?

కాబట్టి మంత్రాలతో విశ్వశాంతి వస్తుందనీ, యాగశాలలు తగలబెట్టడం పర్యావరణ పరిరక్షణ కోసమేనన్న మాటలు నమ్మకూడదు. దేశభక్తులైన ప్రజలు, శాస్త్రజ్ఞులు నిరూపించిన విషయాలనే నమ్మాలి. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే మార్గం ఇదే.

-కె.ఎల్‌. కాంతారావు