Archive for మే 10th, 2012

వామ్మో కరెంట్‌ బిల్లు!

  • బెంబేలెత్తుతున్న విద్యుత్‌ వినియోగదారులు
  • చిరు వ్యాపారులకు దిమ్మదిరిగే బిల్లులు
  • గందరగోళం సృష్టిస్తున్న కనెక్టెడ్‌ లోడ్‌

వినియోగదారులందరికీ కరెంట్‌ షాక్‌ కొట్టింది. గత నెల పెరిగిన విద్యుత్‌ ఛార్జీల భారం ఈనెల బిల్లుల్లో వస్తుండటంతో వినియోగదారులు వాటిని చూసి బెంబేలెత్తుతున్నారు. చిన్న చిన్న షాపుల్లో వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భారం స్పష్టంగా తెలిసొచ్చింది. కమర్షియల్‌ కేటగిరీ రేట్లు భారీగా పెరిగాయి. హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, బుక్‌షాపులు, కిరాణా దుకాణాలు, లాండ్రీ నిర్వాహకులు ఈనెల కరెంటు బిల్లులు చూసి బిత్తరపోతున్నారు. వివిధ స్లాబులున్నప్పటికీ గరిష్టంగా యూనిట్‌కు రూ. 6.50 పైసలు చొప్పున వడ్డన పడింది. డొమెస్టిక్‌ కేటగిరీలో కనెక్టెడ్‌ లోడ్‌ 500 వాట్లకన్నా ఎక్కువ ఉన్న వినియోగదారులకూ భారం పడింది. మే నెల కరెంటు బిల్లులు గత నెల కంటే దాదాపు రెట్టింపొచ్చాయని అపార్ట్‌మెంట్‌వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి వినియోగం నేపథ్యంలో పెరిగిన బిల్లులు వినియోగదారుల్ని గందరగోళంలోకి నెట్టాయి. గత నెల బిల్లులతో బేరీజు వేసుకుంటే విద్యుత్‌ వినియోగం పెరిగి, ఎక్కువ యూనిట్లు రావడంతో తలలు పట్టుకుంటున్నారు. సాధారణం కన్నా ఎక్కువగా విద్యుత్‌ కోతలున్నప్పటికీ బిల్లులు మాత్రం భారీగా పెరిగి వచ్చాయని వాపోతున్నారు. ప్రతినెలా రూ. 1,500 నుంచి రూ. 1,800ల్లోపు వచ్చే కరెంటు బిల్లు ఈనెల ఏకంగా రూ. 2,702 వచ్చిందని సికింద్రాబాద్‌లోని ఓ వెల్డింగ్‌ షాపు యజమాని చెప్పారు. 398 యూనిట్లకు సరాసరిన యూనిట్‌కు రూ. 6.78 పైసలు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్‌ కేటగిరీ(ఎల్‌టి-2ఎ) కేటగిరీలో రెండు రకాల శ్లాబులున్నప్పటికీ ఆ శ్లాబుల ప్రకారం కాకుండా మొత్తాన్ని గరిష్ట కేటగిరీలోనే లెక్కించారని చెప్పారు. అయితే ఇక్కడ కూడా కనెక్టెడ్‌ లోడ్‌ 500 వాట్లకన్నా ఎక్కువ ఉన్న కేటగిరీలో(ఎల్‌టి-2బి)లో 0-100 యూనిట్ల వరకు రూ. 6, ఆపై వినియోగానికి యూనిట్‌కు రూ. 7 చొప్పున నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళూ సాధారణ జనానికి ఈ కనెక్టెడ్‌ లోడ్‌ విషయంపై అవగాహన లేకపోవడంతో తాము ఏ కేటగిరీలో ఉన్నామనే విషయం స్పష్టంగా తెలియదు. ఒకే గదిలో ఒక ట్యూట్‌లైటు, ఫ్యాన్‌, టీవీ ఉన్న అతిచిన్న కుటుంబానికి ప్రతినెలా రూ. 100 నుంచి రూ. 120లోపు బిల్లు వచ్చేది. ఈనెల రూ. 216 బిల్లు వచ్చిందని శ్రీనివాస నగర్‌కు చెందిన పరశురాం చెప్పారు. వినియోగించు కున్న విద్యుత్‌ కన్నా అదనపు ఛార్జీల బాదుడు ఎక్కువైంది. ఓ వినియోగదారుడు ఏప్రిల్‌లో 213 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకోగా అతనికి ఎనర్జీ ఛార్జీ రూ. 694.75 పైసలుగా పేర్కొన్నారు. అదే బిల్లులో అదనంగా అడిషనల్‌ ఛార్జీ పేర రూ. 65, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేర రూ. 12.78 పైసలు, డిఫరెన్స్‌ ఇన్‌ టారిఫ్‌ పేర మరో రూ. 25 వడ్డించారు. మొత్తం బిల్లు రూ. 792 చెల్లించాలని పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగంతోపాటు ఇతర ఛార్జీల పేర దాదాపు వంద రూపాయల వరకు అదనంగా బిల్లులో బాదారు. మరోవైపు కస్టమర్‌ ఛార్జీలు కూడా భారీగా పెరగడంతో యూనిట్‌ రేట్లకు ఈ మొత్తం అదనపు భారంగా మారింది. డొమెస్టిక్‌ కేటగిరీలోని రెండు కేటగిరిల్లో ఒక్కో సర్వీస్‌కు కనిష్టంగా రూ. 25 నుంచి గరిష్టంగా రూ. 45 వరకు కస్టమర్‌ ఛార్జీల్ని వడ్డించారు. చిన్న వ్యాపారులున్న కమర్షియల్‌ కేటగిరీలో కూడా ఈ మొత్తం కనిష్టం రూ. 30 నుంచి రూ. 40 వరకు ఉన్నాయి. ఏడాదికోసారి సిపిడిసిఎల్‌ నాన్‌డొమెస్టిక్‌, కమర్షియల్‌ కేటగిరీల నుంచి ఆ ఏడాది విద్యుత్‌ వినియోగ వ్యత్యాసాన్ని ఎసిడి ఎమౌంట్‌ పేర వసూలు చేస్తుంది. పెరిగిన ఛార్జీలతో ఎసిడి ఎమౌంట్‌ భారం మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి.

ఓవైపు విద్యుత్‌ కోతలతో చిన్నతరహా పరిశ్రమలు కుదేలవుతుంటే, మరోవైపు బిల్లులు మాత్రం భారీగాపెరిగి వస్తున్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ ఇండిస్టీస్‌ అసోసియేషన్స్‌ (ఫ్యాప్సియా) అధ్యక్షులు ఎఆర్‌కె రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపుపై తాము చేసిన ప్రతిపాదనల్ని ఎపిఇఆర్‌సి పరిగణనలోకి తీసుకోలేదని, డిస్కాంల ప్రతిపాదనల్నే యథాతథంగా ఆమోదించిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు తక్కువని చెప్తున్న ప్రభుత్వం, ఇక్కడి కరెంటు కోతలపై మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడలేదని చేసిన ప్రచారం… ఈనెల కరెంటు బిల్లులతో అబద్ధమని తేలిపోయింది. ప్రజలందరికీ ఏదోఒక రూపంలో షాక్‌ కొట్టింది మాత్రం నిష్ఠుర సత్యం.